December 31, 2009

(నెరవేరని) నా కొత్త సంవత్సరం తీర్మానాలు!



ప్రతి ఏడాదీ డిసెంబర్ వస్తోందనగానే ఆలోచనలు మొదలవుతాయి, కొత్త కొత్త తీర్మానాలేం చేసుకోవాలా అని! అందునా ఇప్పుడు మరీ ఈ టీవీ ఛానెళ్ళు  ,వార్తా పత్రికలు   ఏం తీర్మానాలు చేసుకుంటే బావుంటుందో వాళ్లే చెప్పేస్తారు, కనీసం మన తీర్మానాలు ఆలోచించుకునే అవకాశం కూడా మనకివ్వకుండా!

వాళ్ళు చెప్పే తీర్మానాలు ఇలా ఉంటాయి...మచ్చుకు కొన్ని


1.పాజిటివ్ గా ఆలోచించడం


2.సహనం అలవర్చుకోవడం


3.ఈ ఏడాది కనీసం ఒకరికన్నా అవసరంలో సహాయం చేయడం


4. ఒక్కసారన్నా రక్తదానం చేయడం.


5. కోపం తగ్గించుకోవడం

6. డబ్బు ఖర్చుపెట్టేముందు అవసరమా?అని ఆలోచించడం!

ఇలా మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి ఒకటి టిక్కు పెట్టమంటారు.


ఫర్గెటిట్! అన్నీ తూచ్ కొట్టాల్సినవే!



నిజంగా అయితే...సామాన్య జనం చేసే తీర్మానాలు కొన్ని చూద్దాం!


అన్నింటికంటే ప్రాధాన్యం ఉన్నది "బరువు తగ్గడం"(దీనికి మీలో ఎంత మంది వోటేశారో ఊహిస్తున్నా)

మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం

ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా కష్టపడి పని చేయడం

కారు కొనడం

ఇల్లు కొనడం


వీటిలో మాత్రం నేను ప్రతి ఏడాదీ మొదటి దానికే టిక్కెడతాను.ప్రతి ఏడాదీ తీర్మానాలు మార్చేస్తే ఏం బావుంటుంది లెద్దూ అని!



ఏమిటీ..అమలు చేయడమా? ఇదిగో....ఇలాంటి ప్రశ్నలేస్తేనే మరి.......!



నా ఫ్రెండ్స్ లో శ్రీలక్ష్మి అనే పిల్ల ఉండేది. అది ప్రతి యేడాదీ " ఈ ఏడాది నేను నర్సిమ్ములు ని పెళ్ళాడేస్తాను"అనేది. నర్సిమ్ములంటే వాళ్ల బావో, బాయ్ ఫ్రెండో అనుకునేరు.మా కాలేజీ రోడ్లో ఉండే మిర్చిబజ్జీల బండివాడు.ఆ బజ్జీలంటే అంత ఇష్టం దానికి!


దాన్ని పెళ్ళికూతుర్ని చేసిన రోజు సాయంత్రం వాళ్ల తమ్ముడు తెచ్చిన బజ్జీలు ఖాళీ చేస్తూ కూడా ఇదే డైలాగ్ చెప్పింది శ్రీలక్ష్మి! తీర్మానమంటే అలా ఉండాలి.ఎప్పటికీ నెరవేరకుండా!

తీర్మానాలు చేసుకునే వారు ప్రతి యేడాదీ మర్చిపోకుండా డిసెంబర్ చివరి వారంలో మంచి లెటర్ పాడ్ ఒకటి కొనో, లేక ఒక తెల్ల కాయితం మీదో తీర్మానాలు రాసుకోవడం మామూలే! జనవరి నెల మొదటి వారం తప్పకుండా పాటించడం మామూలే! రెండో వారం ఉత్సాహం తగ్గడం, మూడోవారం నీరసం రావడం..ఎలాగో లాక్కొచ్చి ఫిబ్రవరి నెలాఖరుకు పరుపు చుట్టేసి, డిసెంబర్లో చూద్దాం లెద్దూ అనుకోవడం...అన్నీ మామూలే!



నా తీర్మానమే చూద్దాం! పోయిన డిసెంబర్లో "అమ్మో! మళ్ళీ కిలో బరువు పెరిగాను. లాభంలేదు.జనవరి నుంచి రైస్ తగ్గించాలి.నెయ్యి మానేయాలి! పళ్ళు , జూసులూ ఎక్కువగా తీసుకోవాలి"అనేసుకున్నా గాట్టిగా!జనవరి మొదటివారమంతా చాలా సీరియస్ గా పుల్కాలు,పళ్ళు..ఇలా లాగించా!

 రెండో వారానికి అన్నం లేకపోతే చచ్చిపోతాననిపించింది .

"పోన్లే, ఒకపూట పుల్కాలు తింటానూ"అని (నా అంతరాత్మకి) సర్ది చెప్పి  ఒకపూట హాయిగా అన్నం మొదలెట్టాను.

తర్వాత రెండు రోజులకి ....

సంక్రాంతికి చేసిన నేతి అరిసెలు,వెన్న కాచిన ఫ్రెష్ నెయ్యి రెండు కిలోలు ఊర్నుంచి రాగానే వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూస్తూ నరకమంటే ఎలా వుంటుందో తెలుసుకోగలిగాను! తర్వాత నా తీర్మానం మట్టిగొట్టుకుపోయిందని మీకు వేరే చెప్పాలా ఏమిటిలెండి!



మా అన్నయ్య 'పొద్దున్నే లేవగానే దుప్పటి  మడతపెట్టాలి" అనే తీర్మానం నా చిన్నప్పటినుంచీ చేస్తున్నాడు. అలాగే  వదిన "పొద్దున్నే ముఖం కడుక్కోగానే బొట్టుపెట్టుకోవాలి. నుదురు బోసిగా ఉండకుండా"అనే తీర్మానం పెళ్ళయిన ఏడాదినుంచీ(వాళ్ల పెళ్ళయి పదిహేడేళ్ళు) చేస్తోంది.ఇద్దరూ రెంటినీ అమలు చేయరు.



మా ఎదురింటివాళ్లబ్బాయి ఈ ఏడాదైనా పదోక్లాసు పూర్తి చేయాలని తీర్మానించాడు. వాళ్ళ నాన్నేమో ఎలాగైనా ఈ వయసులో టెన్నిస్ ప్లేయర్ కావాలని...(సడే సడే!ఇలాంటి తీర్మానాలు అసలు తీరేవేనా!)

నేను ప్రతి యేటా క్రమం తప్పక చేసుకునే తీర్మానాలు...



1.ప్రతి రెండు రోజూలకీ ఇల్లంతా డస్టింగ్ చేయాలి లేదా చేయించాలి.


2. నెలకోసారి కర్టెన్లు మార్చాలి.


3.చెల్లెలుతో పోట్లాడకూడదు(ఇది చిన్నప్పటినుంచీ వస్తోన్న తీర్మానం)

4.బద్ధకించకుండా చలికాలమైనా సరే వాకింగ్ కి వెళ్ళాలి.



5.రోజూ బద్ధకించకుండా ఇంగ్లీష్ పేపర్ కూడా చదవాలి.


6.వృధా ఖర్చులు పెట్టకూడదు(అసలు వృధా ఖర్చుల్ని ఇంకా నిర్వచించలేదు నేను)


7.క్రమం తప్పక డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి.  ఈయన గారి చేత చీవాట్లు తినకుండా కారు నడపాలి.


8.వార్డ్ రోబ్ లోంచి  వాడనిబట్టలు అన్నీ తీసి పెట్టాలి.


9. పనమ్మాయి సరిగా పనిచేయకపోయినా సహనంగా ఉండాలి.


10. పాపాయి తో గొడవ పడకూడదు.వాదన అసలే పెట్టుకోకూడదు.


11. పీజా హట్, డామినోస్ వాళ్ళ నంబర్లు నా ఫోన్ లోంచి తీసేయాలి.


12 .కాఫీలు తగ్గించాలి.



చూడ్డానికి అన్నీ తేలిగ్గానే ఉన్నాయి కదూ! ఒక్కటి కూడా పూర్తిగా ఆచరించిన పాపాన పోలేదు.

ఈ ఏడాది మాత్రం ఒకే ఒక తీర్మానం...టీవీ9 చూడ్డం మానేయాలి. అంతే ఇంకేమీ లేవు.


అదండీ సంగతి! మీకు కూడా పాటించాలనుకుని పాటించలేకపోతున్న తీర్మానాలు ఉండే ఉంటాయి.ఒకసారి గుర్తు తెచ్చుకోండి.



ఒక్కక్షణం ఆగండి,డామినోస్ వాడితో మాట్లాడివస్తా! నా తీర్మానాలు పాటించాల్సింది రేపటినుంచి కదా!

50 comments:

Kathi Mahesh Kumar said...

ఈ సంవత్సరం నేనైతే బరువు తగ్గాలని ఒక గాఠినిర్ణయానికొచ్చానండోయ్! తెలిసినోళ్ళందరికీ చెబుతున్నా, అప్పుడప్పుడూ గుర్తుచేస్తారని.

సుజాత వేల్పూరి said...

మహేష్,
ఇంకో మాట చెప్పండి!

సిరిసిరిమువ్వ said...

మీవైన నూతన సంవత్సర తీర్మానాలు..బాగున్నాయి.

ఈ సారి ఒకే ఒక్క తీర్మానంతో సరిపుచ్చుకున్నారన్నమాట! Wishing you all the best for that.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

వాసు.s said...

TV9 చూడకూడదు అనే నిర్ణయం భేష్. కానీ వాళ్ళు మెరుగైన సమాజం కోసం జరిపే కృషి ఫలించి, మెరుగైన సమాజం ఏర్పడిపోతే, మీరు ఆ చారిత్రాత్మక సంఘటన చూడలేకపోయే అవకాశం వుంది.

సుజాత వేల్పూరి said...

డల్లాస్ నాగేశ్వర రావుగారూ,
అసలు ముందు జీవితం మెరుగుపడాలంటే టీవీ 9 చూడ్డం మానేయాలి. జీవితం మెరుగుపడ్డాకేగా మెరుగైన సమాజం ఏర్పడుతుంది?;-)

వేణు said...

కొసమెరుపు అద్భుతంగా ఉంది.

కొత్త సంవత్సరం తీర్మానం అని కాదు కానీ, 'రోజూ బద్ధకించకుండా ఇంగ్లీష్ పేపర్ చదవాలి'- నేనూ ఇలాగే అనుకుంటాను. కానీ... :)

అందరూ భుజాలు తడుంకునే విషయాన్ని అందంగా, సరదా శైలిలో రాసినందుకు అభినందనలు !

జయ said...

ఈ సంవత్సరపు ఒకే ఒక నిర్ణయాన్ని మీరు అమలు పరచటం కష్టం అనుకుంటా... Anyway all the best.మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Chandamama said...

మీ తీర్మానాలు బాగున్నాయ్!
అమలు చెయ్యగలరా? లేక రాజకీయనాయకుల హామీలేనా?

కొత్త పాళీ said...

నేను కూడా ఏడాదికల్లా మాట మార్చేవాణ్ణి కాదు. బరువు తగ్గాలనే నిరణయానికే కట్టుబడి ఉంటాననీ, ఆ విధంగా ముందుకు పోతామనీ మనవి చేసుకుంటున్నా ..

తృష్ణ said...

all the best for the new resolution..:)

Indian Minerva said...

అదేంటో ఈ సారి నా తీర్మానాల్లో కొన్ని ఇలా వున్నాయి
* మరికొందరు స్నేహితుల్ని వదిలించుకోవాలి AND కొత్త స్నేహాలు ఏర్పడకుండా జాగ్రత్తపడాలి.
* కొత్త పుస్తకాలు "కొన"కూడదు (చదవకూడదు కాదు గమనించగలరు).
* కొన్ని వెధవ్వేషాలు వేయడం మొదలుపెట్టాలి.

గీతాచార్య said...

నేను కూడా బరువు తగ్గాలని గాఠిగా తీర్మానించుకున్నా కానీ, "నాన్నా పందులే బరువు తగ్గే ప్రయత్నం చేస్తాయి. సింహం స్లిమ్ముగా ఉంటుంది," అని రజనీ డైలాగ్ కొట్టింది నా బాడి. ఇంతకన్నా తగ్గే అవకాశం లేదు గురూ అంది కూడా. :-D

Bad luck. My resolution this year also is to reduce weight.

గీతాచార్య said...

TV9 ఇంకా వస్తోందా? ఏంలేదులెండి. టీవీ సరిగ్గా చూసి ఏడాది దాటింది. చూసినవి కొంచం తెన్నిసూ, క్రికెటూ

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
మీ బాడీకి కొంచెం రజనీ డైలాగులు కాకుండా ఇంకేమైనా కూడా నేర్పరాదూ! కూసింత వెరైటీగా ఉంటుంది.

టీవీ9 చూడ్డం మానేస్తే ఎలాగ? అది రోజూ చూస్తే B&G కి కావలసినంత సరుకు(వార్తలు కాకుండానే) దొరుకుతుంది. ఎవర్నీ అడగక్కర్లేదు.రోజూ మీరే రాయొచ్చు!

గీతాచార్య said...

కౌంటరదిరింది. ఐ కన్సీడ్.

కానీ "తగ్గింది వైటే కానీ హెడ్డు వైటు కాదు," లాంటి జూ ఎంటీయారు డైలాగులు నప్పవే...

డూ యూ వాంట్ గార్బేజ్ ఎట్ B&G? బాలారిష్టాలున్నాయి నిజమే కానీ (సమయాభావం, పర్సనల్ ట్రబుళ్ళు. ఇప్పుడు అన్నీ ఓవర్ అనుకోండీ) టివీ నైను చూసి నా బ్లాగోజినా నడిపే కన్నా పూర్తిగా బ్లాగు మూసెయ్యటమే చేస్తాను. నో కాంప్రమైజెస్. I'm too Egoistic to do such things :-D

మేధ said...

>>ప్రతి ఏడాదీ తీర్మానాలు మార్చేస్తే ఏం బావుంటుంది లెద్దూ
హ్హహ్హ.. నిజమే సుమా!!!

>>మిర్చిబజ్జీల బండివాడు.ఆ బజ్జీలంటే అంత ఇష్టం దానికి
నా చిన్నప్పుడు పెద్దయిన తరువాత ఎప్పటికైనా ఒక బజ్జీల కొట్టు పెట్టాలని, అప్పుడు మన ఇష్టం వచ్చినప్ప్డు, నచ్చినన్ని లాగించచ్చని!! అది ఇంకా అలానే ఉండిపోయింది...!!

>>ఈ ఏడాది మాత్రం ఒకే ఒక తీర్మానం...టీవీ9 చూడ్డం మానేయాలి
నేను ఆల్రెడీ అమలు చేసేస్తున్నా

తీర్మానాల విషయంలో ఎటువంటి తీర్మానాలు పెట్టుకోకూడదు అనే తీర్మానాన్ని తప్పకుండా పాటిస్తున్నా.. :)

BTW, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీరు పైన చెప్పిన తీర్మానలన్నీ వదిలిపెట్టకుండా పాటించాలని కోరుకుంటూ..

Unknown said...

వీటికి బదులుగా చక్కనమ్మ చిక్కక పోయినా అందమే అని సామెతల్ని మార్చాలని తీర్మానిస్తే పోలేదా సుజాత గారు .?
అయిన ఏడాది క్రితం కంటే మీరు చిక్కారని నేను వోట్ వేసాగా ఇంకా యి ఇయర్ అన్నా రెండుపూటలా భోజనం చెయ్యండి .

$h@nK@R ! said...

ఒక్కక్షణం ఆగండి,డామినోస్ వాడితో మాట్లాడివస్తా! నా తీర్మానాలు పాటించాల్సింది రేపటినుంచి కదా!

హ హహ్
చేసారా ?

వేణూశ్రీకాంత్ said...

హ హ భలే విషయాల మీద సరదాగా రాశారండీ..

హ్మ్ బరువుతగ్గడం..
హ హ బరువుతగ్గడం..
హి హి బరువుతగ్గడం..
మరే నాకు గత తొమ్మిది పదేళ్ళనుండీ ఇదే ఏకైక రిజల్యూషన్.. కానీ పెరగటమే కానీ తరగటమనేది మా ఇంటా వంటా లేదు అనేస్తుంది శరీరం. అదీకాక రిజల్యూషన్ పేరుతో మాటిమాటికి మాటమార్చటం కూడా మా వంశంలో లేదంటుంది.

అందుకే ఇకపై అసలు రిజల్యూషనే తీసుకోకూడదని రెండేళ్ళ క్రితం రిజల్యూషన్ తీసుకుని స్ట్రిక్ట్ గా అమలు చేసేస్తున్నా :-)

మీకూ మీ కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సుజాత వేల్పూరి said...

రాజుగారూ,
తీర్మానాలూ అవీ ఏమీ లేవండీ!కాబట్టి అమలు ప్రసక్తే లేదు. చేద్దామనుకుని బద్ధకంతో వదిలేసే పనుల గురించి సరదాగా రాశానంతే! నిజానికి ఏదైనా ఒక పని మొదలెట్టాలంటే దానికి జనవరి ఫస్టే కావాలా చెప్పండి?

సుజాత వేల్పూరి said...

Indian Minerva,

అప్పుడప్పుడూ ఇలాంటి వినూత్న తీర్మానాలు చేసుకోవడం మంచిదే! కానివ్వండి. భేషుగ్గా ఉన్నాయి!

శేఖర్ పెద్దగోపు said...

:-)భలే రాసారండీ కొత్త సంవత్సరం తీర్మానాల గురించి...మీరన్నట్టు ఒక పని మొదలు పెట్టడానికి జనవరి ఫస్టే కానక్కరలేదు.
అన్నట్టు టీవీ9 చూడకూడదని మీ తీర్మానమా...భలే..భలే..కానీ ఎందుకైనా మంచిది ఆ తీర్మానం మీద పువ్వు గుర్తు(షరతులు వర్తిస్తాయి అని)పెట్టుంటే బాగుండేదండీ...:)

@గీతాచార్య గారు..మీ కామెంట్ కెవ్వు కేక..:-)

నాగప్రసాద్ said...

హ హ హ :) ( ఈ సంవత్సరాల గోలేంటో, వాటికి తీర్మానాలు ఏమిటో...ప్చ్)

గోల సంగతి ఎలా ఉన్నా అర్జంటుగా తీర్మానాలు అవీ ఇవీ చేసేసుకోవాలి కాబట్టి, నావి కూడా కొన్ని తీర్మానాలు.

బరువు తగ్గడం పేరు వింటేనే నీరసం వచ్చేస్తోంది నాకు. గతంలో ఒకసారి బరువు తగ్గాలని నిర్ణయించుకొని ప్రొద్దున్నే తినే పది ఇడ్లీల్లోంచి రెండు ఇడ్లీలు తగ్గించి, మధ్యాహ్నం భోజనంలో తినే అన్నంలో నుంచి నాలుగు ముద్దలు, ఒక చపాతి తగ్గించి, రాత్రిళ్ళు టిఫినీలు మాత్రమే చేసి ఒక వారం రోజులు ప్రయత్నించాను. అలా చేయడం వల్ల వచ్చిన నీరసానికి మరో పది రోజులు కోలుకోలేకపోయాను. అందుకే అప్పట్నుంచి ఇటువంటి డేంజరు తీర్మానాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను.

ఇకపోతే, టీవీలు చూడ్డం లాంటి చెడ్డ అలవాట్లు నాకు ఎలాగూ లేవు కాబట్టి. ఈసారి నుంచి కూడలి, హారం, జల్లెడల వైపు కన్నెత్తి కూడా చూడకూడదని, బ్లాగ్లోకంలో ఒక్క టపా కూడా చదవకూడదు, ఏ బ్లాగులో కూడా కామెంట్లు పెట్టకూడదని తీర్మానించేసుకున్నాను.

ఇంక అన్నిటికన్నా ముఖ్యంగా ప్ర.పీ.స.సం వైపు చూడకూడదని, చూసినా మార్తాండకు వ్యతిరేకంగా ఒక్క కామెంటు కూడా రాయకూడదని పెన్నా సిమెంట్ అంత ధృడంగా నిశ్చయించుకున్నాను.

Siri said...

సుజాత గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
బాగుందండి మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? నేనేమో బరువు పెరగాలనుకుంటున్నాను. కానీ ఎలా పెరగాలో తెలీడం లేదు మరి :-(

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

మంచి తీర్మానం తీసుకున్నారండీ. నేను నా చిన్నప్పటి నుంచీ కనీసం ఈ సంవత్సరమైనా పొద్దున్నే లెగాలని తీర్మానించుకుంటున్నాను. అది ఎప్పటికీ తీర్మానంలా ఉండిపోతుందేమో?

SRRao said...

సుజాత గారూ 1
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

kanthisena said...

సుజాత గారూ,

"మీ తీర్మానాలు బాగున్నాయ్! అమలు చెయ్యగలరా? లేక రాజకీయనాయకుల హామీలేనా?" అని చందమామ పేరిట మీ కొత్త టపాకు వచ్చిన వ్యాఖ్య నాది కాదు. ఎవరో విశాఖ నుంచి చందమామ పేరుతో పంపిన వ్యాఖ్య అది. నాకు తెలియకుండా ఎవరు ఇచ్చారా అని తన ప్రొఫైల్ చూస్తే విషయం తెలిసింది. కాబట్టి చందమామ పేరుతో వచ్చే వ్యాఖ్యలపై నాకు పేటెంట్ లేదన్నమాట. పైగా మీరు ఆ వ్యాఖ్యకు నా పేరు సూచించి మీ స్పందన కూడా పోస్ట్ చేసినట్లుంది. ఈ విషయాన్ని మీరూ గుర్తించగలరనే ఈ వ్యాఖ్య పంపుతున్నాను.

ఇక పోతే మీరు చెప్పిన బరువు తగ్గడం గురించి చిన్న మాట....

మీరిలా అన్నారు.

"జనవరి నుంచి రైస్ తగ్గించాలి.నెయ్యి మానేయాలి! పళ్ళు , జూసులూ ఎక్కువగా తీసుకోవాలి"అనేసుకున్నా

సంక్రాంతికి చేసిన నేతి అరిసెలు,వెన్న కాచిన ఫ్రెష్ నెయ్యి రెండు కిలోలు ఊర్నుంచి రాగానే వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూస్తూ నరకమంటే ఎలా వుంటుందో తెలుసుకోగలిగాను!"

మీ జాబితాను ఓ సారి చూస్తే..

నెయ్యి, జూసులు, నేతి అరిసెలు, వెన్న కాచిన తాజా నెయ్యి రెండు కిలోలు -బాబోయ్.. వామ్మో-

సందేహం లేదు. మీరు ఖచ్చితంగా "ఆంధ్రులే". సీరియస్‌గా తీసుకోవద్దు. ఏ పదం వాడాలన్నా భయమేస్తోందిప్పుడు..

నిస్సందేహంగా మీ బరువు ఖచ్చితంగా 75-80 కేజీల పైనే ఉంటుంది.... - అంత బరువు లేకపోతే మంచిదే..- అలా కాక.. 65 కిలోల లోపు బరువుతో ఉంటే మీరు అనవసరంగా భయపడుతున్నారనే భావించవలసి వస్తుంది.

రైస్ తింటే ఒళ్లు పెరుగుతుందనే అభిప్రాయం ఈ దేశంలో వైద్యులందరూ కట్టగట్టుకుని చెప్పినప్పటికీ నేను నమ్మను. దానికి మించిన హంబగ్ మరొకటి లేదు. మన ఆహార ఆలవాట్లు పూర్తిగా మార్చి పారేయాలనే బహుళ జాతి సంస్థల -వైద్యసేవలు కూడా దీనిలో భాగమే- మహా కుట్రలో ఇదో భాగమనే నా ప్రగాఢాభిప్రాయం.

ఆంథ్రోపాలజీ ప్రకారం పదివేల సంవత్సరాలనుంచి ఈ దేశంలో వరి అన్నం తింటూనే ఉన్నారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఎవరూ అన్నం తిని లావయిన చరిత్ర ఇంతవరకూ నమోదు కాలేదు.

నిద్రలేచింది మొదలుకుని సిస్టం మీద కూర్చునో, సీటుకు అతుక్కునో బతికే మహా గొప్ప బతుకు మనందరికీ అలవాటయ్యాక, చరిత్రలో మొదటి సారిగా శారీరక శ్రమలు తగ్గి మానసిక శ్రమలు, సేవల ఖాతా పెరగటం మొదలయ్యాక.. అప్పుడే.. ఆ క్షణం నుంచే ప్రపంచంలో ఊబకాయం మహమ్మారిగా పట్టి పీడించడం మొదలయింది.

పట్నాలు పక్కన పెట్టండి. పల్లెల్లో కూడా శరీరకష్టం మరవని వారు అప్పుడూ, ఇప్పుడూ కూడా లావు సమస్యను ఎరగరు. ఏ ప్రాంతంలో అయినా దీన్ని చూడవచ్చు. పల్లెల్లో సహితం శరీర శ్రమ చేయనవసరం లేకుండా అజమాయిషీ చేసేవారు, సేద్యం చేసేవారు కాకుండా చేయించేవారు ఇలాంటి వారు మాత్రమే లావు సమస్యను ఎదుర్కొంటున్నారు.

చివరగా.. మనం నడక మర్చిపోయాం.. వేళకు తినడం మర్చిపోయాం.. వేళకు నిద్రపోవడం మర్చిపోయాం.. సారపు తిండి అంటే ఏమిటో మర్చిపోయాం. ఒకటి లేదా రెండు కూరలు, రసం, మజ్జిగతో అన్నం తినడం మర్చిపోయాం.. అన్నిటికంటే ముఖ్యంగా రాగిచెంబులో నీళ్లు పోసుకుని తెల్లవారాక తాగడం మర్చిపోయాం. ఇవి మనదైన సంస్కృతికి సంబంధించినవి కదా.. ఇన్ని నేరాలు మనలో పెట్టుకుని పాపం... ఏమీ తెలియని ఆ అన్నపు మెతుకుల మీద పడతాం.. అన్యాయమనిపించడం లేదూ..

ఈ విషయంలో మాత్రం మీరు ఎంత పెద్ద డాక్టర్లు చెప్పినా నమ్మకండి. ముఖ్యంగా కార్పొరేట్ డాక్టర్లు.. ప్రయివేట్ వైద్యం చేసే ప్రభుత్వ డాక్టర్లు కూడా. వీళ్లంతా టోకున అంతర్జాతీయ మందుల కంపెనీలకు, వాళ్ల దళారీలకు, వాళ్లిచ్చే నజరానాలు, గిఫ్ట్‌లకు అమ్ముడు పోయినవాళ్లే...

మీకు సాక్ష్యం కావాలంటే.. తమ వృత్తి రహస్యాలను దాచిపెట్టుకోవడం తెలియని ఏ మందుల కంపెనీ ఏజెంట్‌ను లేదా రెప్రజెంటేటివ్‌ని అయినా సరే అడిగి చూడండి. వాస్తవం మీకే తెలుస్తుంది...

"మన కంపెనీ మందుల శాంపిల్స్ తీసుకోనంటున్నాడా, మనకు నెలవారీ ఆర్డర్లివ్వడానికి ఒప్పుకోవడం లేదా.. వివరాలు చెప్పు.. వాడిని -అంటే డాక్టర్‌ని- కొనిపారేస్తాం..."

ఇదీ మందుల కంపెనీల ప్రతినిధుల ఔద్ధత్యం.. నా స్వంత అనుభవంలోంచి ఈ విషయం చెబుతున్నా..

చివరగా.. మీ ఇంటి ముంగిలి, పెరడు ఖాళీగా ఉంటే, అక్కడ మట్టి తప్ప సిమెంట్ పూతలు లేకుండా ఉంటే, ఓ పార సంపాయించుకుని రోజూ ఓ అరగంట నేలను గుల్ల చేయడం అలవాటు చేసుకోండి.

ఈ పనిలో ఉండగా మీకు చెమట కారవచ్చు.. భయపడకండి...

అంతే.. మీరు అన్నం తగ్గించొద్దు. పుల్కాలు తినొద్దు. బస్కీలు తీయొద్దు. పళ్లు, జూస్‌ల ప్రత్యేక ఆహారం కోసం వెంపర్లాడవద్దు. -చివరి రెండూ తినకున్నా, తాగకున్నా లోకంలో చాలామంది ఇంకా బతుకుతూనే ఉన్నారు లెండి-

మీకు గ్యారంటీ ఇవ్వలేను కానీ.. మీ లావు తగ్గే అవకాశమయితే ఉండవచ్చు.

ఒకే ఒక షరతు. మన నేలను మనం గుల్ల చేసుకోవడానికి ఎలాంటి తీర్మానాలు చేసుకోవనవసరం లేదని మీకు తెలుసుగా..

హైదరాబాదులో ఉన్నారు కదూ.. స్వంత ఇంట్లో ఉన్నా ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు లేండి.

చివరాఖరుగా... నూతన సంవత్సర శుభాకాంక్షలు...

రాజు
చందమామ
blaagu.com/chandamamalu

సుజాత వేల్పూరి said...

రాజుగారూ, బ్లాగ్లోకంలో మీకు తప్ప చందమామ అనే పేరు మీద పేటెంట్ ఇంకెవరికీ ఉండడానికి నేనొప్పుకోను. అసలు "రాజు"అంటేనే చందమామ కందండీ!

ఇకపోతే నేను ఒబీసూ కాదు, అధిక బరువూ లేనండీ! సరదాగా రాసిందే ఈ పోస్టు. 65 కిలోలకు పది కిలోలు తక్కువే నేను. కడుపు మాడ్చుకోను, శారీరకంగా చురుగ్గా ఉండే పనులూ చేస్తాను. రెంటికీ చెల్లు కు చెల్లు!

బరువు తగ్గాలి అనే తీర్మానం గత కొద్ది ఏళ్ళుగా చాలా మంది కొత్త సంవత్సరం తీర్మానాల్లో ప్రధమ స్థానం ఆక్రమిస్తోందట. అందుకే సరదాగా నా పైనే సెటైర్లు వేసుకున్నాను.

మనం మర్చిపోయామని మీరు చెప్పినాన్నీ నేను పాటిస్తాను..రాగి చెంబులో నీళ్ళు తాగడంతో సహా!తోటపనితో సహా! మా తోట ఫొటోలు పంపాలి మీకు.

అయినా మీరు చెప్పిన విషయాలు నలుగురూ నాతోపాటు పంచుకున్నారు.చాలా విలువైన విషయాలు!

థాంక్యూ వెరీమచ్!

మీకు కూడా నూతన సంవత్సర శుభాఖాంక్షలు!

Sky said...

సుజాత గారు,
నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంవత్సరాలుగా శ్వేత కాష్టం మానేద్దామని గాఠిగా అనేక తీర్మానాలు చేసుకున్నాను కానీ ఓ బ్రాండ్ నుండీ మరో బ్రాండ్ కి మారటం, పెట్టెల సంఖ్య ఎక్కువవటం తప్ప మానటం మాత్రం కుదర్లేదు. ఇప్పుడు మాత్రం ఓ రెండు కిలోలు బరువు తగ్గాలని డిసైడ్ అయ్యాను--- లేకపోతే పెళ్ళి చేసుకోనని లలిత చెప్పింది :)

@కత్తిగారు

కాస్త సన్నబడ్డారు కాబట్టి చెప్తున్నా--- మా ఏరియాలో కొత్త బిర్యానీ సెంటర్ పడింది, మీ ఇష్టం ఆలోచించుకోండి.

kanthisena said...

సుజాత గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞుడిని..

అమ్మయ్య... మీ నూతన సంవత్సర టపా సరదా కోసం మాత్రమే రాసిందే అయితే ఫరవాలేదు. పైగా మనిషికి ఏవి అవసరమో అన్నీ పాటిస్తున్నట్లున్నారు. బీపీ, మధుమేహం మీ దరిదాపులకు కూడా రాకుండా ఉండుగాక. మీ తోట ఫోటోలు తప్పక పంపండి..

మొత్తానికి మీరందరూ మీ నూతన సంవత్సర తీర్మానాలను ఇలా చెప్పుకుంటూంటే నేను కూడా జీవితంలో తొలిసారిగా ఈ సంవత్సరం చేసుకున్న తీర్మానం గురించి ఇక్కడ చెప్పాలని ఉంది. నిన్న -డిసెంబర్ 31- చందమామ ఆఫీసులో సాయంత్రం చిన్నపాటి సంబరాల కార్యక్రమం జరిగినప్పుడు అందరినీ కొత్త సంవత్సర తీర్మానాలను చెప్పమని అడిగారు. నన్నూ అడిగేసరికి ఏం చెప్పాలో అర్థంకాక ఉద్వేగాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను. కానీ తీర్మానాల విషయంలో మీ అందరి వైఫల్యాలను చూశాక బెంగగా ఉంది. ఏదో మాట వరుసకు ఉద్వేగాలను అణచుకుంటానని అన్నాను కాని.... నాకు అది సాధ్యమా.. ఇప్పుడు బెంగగా ఉంది. నా మాట ఎక్కడ నిజమవుతుందో అని.

ఎందుకంటే ఒక మంచి పుస్తకం చదువుతుంటే,ఓ చక్కటి పాట వింటూ ఉంటే, ఓ మంచి సినిమాలో ఆర్ద్రత ఉన్న సన్నివేశాలను చూస్తూ ఉంటే ఇంత వయస్సులోనూ కళ్లెంబడి నీళ్లు అలా కారిపోతాయి నాకు. వివక్షతకు, అన్యాయానికి సంబంధించిన ఘటనలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు తీవ్రంగా చలించిపోతుంటాను. నావల్ల తప్పు జరగలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, లేదా అపరాధభావనతో మనస్సు నలుగుతున్నప్పుడు కూడా కళ్లు చమరుస్తుంటాయి.

ఉద్వేగాలను అణచుకోవాలి అంటే పైన చెప్పిన విషయాలను పాటించకుండా మానుకోవాలి. ఎలా సాధ్యం. చందమామ ఆఫీసులో శంకర్ గారిని కలుసుకున్న ప్రతిసారీ, ఆయన పనిచేస్తుండగా చూసిన ప్రతిసారీ మనసు కదిలిపోయేది నాకు. అంతకుమించి వెబ్‌దునియాలో చక్కగా చేసుకుంటున్న ఉద్యోగం వదులుకుని 'చందమామ' పిలవగానే వచ్చి చేరిపోవడానికి ఈ పత్రిక విషయంలో నాకు ఉన్న ఉద్వేగమే కారణం. అలాంటిది...

మాటవరుసకు చెప్పాను కాబట్టి ఉద్వేగాన్ని తగ్గించుకోవాలంటే కుదిరే పనేనా...?

ఉద్వేగాన్ని తగ్గించుకోవడం... అంటే....

kiranmayi said...

ఈ సంవత్సరం నా తీర్మానాలు:
పొద్దున్నే వర్క్ కి వెళ్ళే ముందర కంప్యూటర్ ఆన్ చెయ్యకూడదు
ఒక వేళ చేసినా, కూడలి ఓపెన్ చెయ్యకూడదు
ఒక వేళ చేసినా, నాకు ఇష్టమైన బ్లాగరుల పోస్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చెయ్యకూడదు
ఒక వేళ చేసినా, వాళ్ళ బ్లాగ్ ఓపెన్ చెయ్యకూదు
ఒక వేళ చేసినా, పోస్ట్ చదవకూడదు
ఒక వేళ చదివినా, కామెంట్ పోస్ట్ చెయ్య కూడదు
ఒక వేళ చేసినా, వర్క్ కి వెళ్ళిన తరవాత నా కామెంట్ కి రిప్లై వచ్చిందా లేదా అని మాటి మాటికి చెక్ చెయ్యకూడదు
చూద్దాం ఎంత వరకు పాటిస్తానో.......
Happy New Year

Vasu said...

జనాల పల్స్ భలే పట్టుకున్నారు. నేను, నాకు తెలిసినవాల్లందరూ ఈ బరువు తగ్గే తీర్మానం మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాము ప్రతీ ఏడాది.
TV9 చురక అదిరింది. ఎప్పటిలాగే బావుంది మీ టపా.
హ్యాపీ న్యూ ఇయర్.

రవి said...

నాకు బరువు సమస్య లేదు. బొజ్జ సమస్య ఈ మధ్య మొదలయింది. ఏదో, చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలీదు.

సుజాత వేల్పూరి said...

రాజు గారూ,
మీ తీర్మానం ఏమీ బాగాలేదండీ! ఉద్వేగాన్ని తగ్గించుకోవడం ఎందుకసలు? కోపాన్ని తగ్గించుకుంటే ఓకే!

ఒకమంచి పాటను వింటే, మంచి పుస్తకం చదువుతుంటే, కన్నీళ్ళు (ఆనందంతో) వస్తాయంటే మీ కంటే అదృష్టవంతులెవరండీ? ఇంతగా స్పందించే హృదయం ఉండటం ఎంత మంచి విషయం? మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా,ధైర్యంగా ఉంది.."హమ్మయ్య, నాకు తోడు కొంతమంది ఉన్నారు"అని!

శంకర్ గార్ని చూసిన ప్రతిసారీ మనసు కదిలిపోవడం...అసలు మీరు ఈ కాలం మనుషుల్లా లేరే!

భావోద్వేగాలను అణుచుకుని యంత్రాల్లా ఉంటే రావు గోపాల రావు గోపాల్రావు మాటల్లో చెప్పాలంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది చెప్పండి?

ఎప్పటిలాగే సాటిమనిషి కష్టానికీ,మీలో కలిగిన సంతోషానికీ స్పందిస్తూ హాయిగా "రాజుగారిలాగే" ఉండండి సార్!

సుజాత వేల్పూరి said...

సతీష్,
"శ్వేత కాష్టం" అంటే సిగిరెట్టా ? ఈ పదం "నేటి తెలుగు పదాలు" లో చేరుద్దామా?

లలిత మంచిమాటే చెప్పింది. అసలైనా నేనోసారి ఆమెతో "ప్రైవేటు" గా మాట్లాడి మీకు "ప్రైవేటు" చెప్పమని చెప్తానుండండి!

సుజాత వేల్పూరి said...

కామెంటిన అందరికీ,చదివిన వారికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

అయితే ఇక్కడ సీరియస్ గా తీర్మానాలు పాటించేవరెవరూ లేరన్నమాటే! నాకు బోల్డు ధైర్యం వచ్చేసింది.

ఎందుకంటే...TIvI చూడకుండా ఎలా ఉంటాను? శాపనార్థాలు పెట్టకుండా ఎలా ఉంటాను. ఈ సారి కూడా తీర్మానం కుదిరేది కాదు.

$h@nK@R,

థాంక్యూ! లేదండీ, డామినోస్ వాడికి కాదు, పీజా కార్నర్ వాడికిచ్చాను అవకాశం!

వేణూ శ్రీకాంత్,
వావ్! అయితే మీరు మాట తప్పని "పేట్రియాటే" అన్నామాట. తొమ్మిదేళ్ళుగా ఒకటే తీర్మానమా? హ హ హ !

శేఖర్,
"పువ్వు" గుర్తేనా..conditions apply అని రాసుంటే బాగుండేదా? పాటించని తీర్మానలకు ఇవన్నీ ఎందుకని....!

సుజాత వేల్పూరి said...

నాగప్రసాద్,
మీ కామెంట్ కెవ్వు...కేక! చివరి రెండు పేరాల్ని పాటించడం మీ వల్ల కాదు గానీ ఇంకో మాట అనుకుందామా?

స్నేహా,
ఎంత అదృష్ట వంతులండీ మీరు? బరువు పెరగాలనుకుంటున్నారా? ఎంతోమందికి ఈర్ష్యతో కన్నీళ్ళొచ్చేస్తున్నాయి ఇక్కడ!

వైద్యభూషణ్ గారు,
మీ తీర్మానం కూడా చాలా మంది మొదలెట్టి ఆపేసేదే! ఆల్ ది బెస్ట్.అందుకే ఇంత కష్టమైన తీర్మానాలు చేసుకోకూడదు. పొద్దున్నే లేవగానే కాఫీ తాగాలనీ, ప్రతి వీకెండూ సినిమాకెళ్ళాలనీ..ఇలాంటి తీర్మానాలైతే వీజీగా ఉంటాయి.

సుజాత వేల్పూరి said...

రవిగారూ,

సామెతల్ని మారిస్తే పని జరగదుగా! అయినా నేను చిక్కానని "అబద్ధంతో" అయినా సంతోషపెట్టినందుకు థాంక్యూలు!

కిరణ్మయి..

లాభం లేదమ్మాయి..! మీ తీర్మానం ఒక్కటీ నెరవేరేలా లేదు.ప్చ్!

Vasu,

థాంక్యూ! నూటికి 50 మంది కి బరువు తగ్గడమే తీర్మానం అట! ఎంతోమందికి అడిగి చూశాకే టపా మొదలెట్టాను.


రవి,
మా ఇంట్లో కూడా ఇదే డైలాగు.(నాది కాదు)! బొజ్జ ఎలా తగ్గుతుందో ఎవరైనా ఒక టపా రాస్తే బావుండు. ప్రింట్ తీసి ఫ్రిజ్ మీద అంటించి కనీసం రోజూ "చూడ"మని చెప్తా!

కౌటిల్య said...

sujatha garooo...mea thearmanalu innovative ga unnay..raju gari abhiprayala to nenu ekibhavistanu...mana andhra bhojanam anniti kante balanced diet....nenu evarikina ide advice chesta...nenite asalu compromise avvanu...andaroo potta pergutundani egathali chesina...kammati neyyi...errati avakaya annam....jiddu derina meagada gadda perugu lekunda bathaka lenandi...anduke guntur vadilellalante bhayam

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

Unknown said...

sujatha gaaroo
chaala baavunnnai andi mee noothana savathsara theermaanaalu. so...nenu ee prapancham lo ontari kadannamaata (teermaanaalu paatinchaka povadamlo)
@chandamama raju gaaru,
mee comment chaala baavundi,
prathee daaniki udvega padatam...
nenoo anthe andi
so naalanti vaallu prapancham lo inka unnaarani thelisindi ee post choosina tharvaatha
aparna

snehit said...

sujatha gaaroo..
your post is lively. I appreciate your final resolution. If you don't watch any TV channel, you are going to find lot of refreshing time.
Wish you good luck
Ramu
apmediakaburlu.blogspot.com

సుజాత వేల్పూరి said...

హాయ్ డాక్టర్ కౌటిల్య,
అమ్మయ్య, మీరు అందరు డాక్టర్ల లాగా లేనందుకు సంతోషం! జీవితం మీద ఆసక్తి చచ్చేలా బతకమని చెప్పే ప్రకృతి వైద్యుల్లాగా లేనందుకు మరీ సంతోషం!

అయితే మాత్రం, ఆంధ్రా భోజనం కోసం గుంటూరు వదలనంటే ఎలాగండీ?

సుజాత వేల్పూరి said...

అపర్ణ గారూ,
భావోద్వేగాలను అది కోపమైతే తప్ప అణిచివేసుకోవాల్సిన పనిలేదని నా ఉద్దేశం! సంతోషం వచ్చినా, దు@ఖం వచ్చినా, ఇంకే రకమైన ఎమోషనల్ ఫీలింగ్ కలిగినా దాన్ని పూర్తిగా అనుభవిస్తేనే మంచిది. స్థిత ప్రజ్ఞత వేరు, భావోద్వేగాలను అణుచుకోవడం వేరు.

అన్ని భావాలను సంపూర్ణంగా ఒక మామూలు మనిషిలాగా అనుభవించాలి. నా అభిప్రాయమైతే ఇదే!

తీర్మానాలు చేసుకోవడం ఒక దండగ పనిలెండి. నూటికి ఒక్కరు కూడా సంవత్సరమంతా ఇవి పాటిస్తారని నేననుకోను.

సుజాత వేల్పూరి said...

రాము గారూ,
థాంక్యూ! నిజంగానే నేను టీవీ తక్కువ చూస్తాను. అందులో న్యూస్ ఛానెల్స్ కాస్త ఎక్కువ చూస్తాను.ఇప్పటి పరిస్థితుల్లో నా బీపీ తక్కువ స్థాయిలో ఉండాలంటే అవి పూర్తిగా మానేయక తప్పదని అర్థమైంది.

Unknown said...

sujatha gaaru,
naa comment ki reply icchinanduku dhanyavaadalu. mee abhiprayala tho nenu nootiki nooru shatham ekeebhavisthunnanu-bhavodvegala vishayamlo. kaaka pothe inni rojulu naa alochanalu vishlesinchukunnappudu, nene andarikanna bhinnanga unnananukunnanu.koddi rojulugaa mee blog chaduvuthunnanu appatininchi naa alochana vidhaanampai unna apohalanneee poyaayi, monna "chandamama raju" gaaru raasina comment chadivinappudu nijanga chaala anadam vesindi.inka prapanchamlo materialistic gaa kakunda manasunna vaallu unnaranipinchindi. mee posts kooda chaala baavuntai.naalaga alochinchevaaru inka unnarani thelisi chaala anandamesthundi
aparna

Ravi said...

>>కడుపు మాడ్చుకోను, శారీరకంగా చురుగ్గా ఉండే పనులూ చేస్తాను. రెంటికీ చెల్లు కు చెల్లు!

ఈ కామెంటు చూసిన తర్వాత నా కడుపు నిండిపోయిందండీ. ముఖ్యంగా వాళ్ళ స్వంత పనులు వాళ్ళు చేసుకోకుండా జిమ్ ల వెంబడి తిరుగుతూ ఉండే వాళ్ళను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది.

కౌటిల్య said...

సుజాత గారూ...నేనూ బ్లాగు మొదలెట్టానండీ...
viswanathakoutilyam.blogspot.com

ప్రభాకర్ said...

నేను ఈనాడు (TV, News Channel & News Paper) చూడడం 2 ఏళ్ళ క్రితమే మానేసాను.. ఈనాడు తో పోలిస్తే TV9 కాస్త better కదా!

Dr. Jyothi Yellapragada said...


 నేను మీ తీర్మానాలు చదివాను.నా తీర్మానలు అవే కాని ఒక్కటి ఆచరిన్చలేదు పైగా టి.వి.9 ఇన్కా ఎక్కువ అయినది.
so good luck sujata
by jyothi ram

Post a Comment