July 22, 2009
చందమామల్లాంటి బ్లాగులు!
పిల్లల కథలంటే నాకు ప్రాణం ఇప్పటికీ! బాలజ్యోతి, బాలమిత్ర,బొమ్మరిల్లు ,బుజ్జాయి వంటి ఎన్ని పిల్లల పత్రికలు "కొసరు"గా చదివినా,అల్టిమేట్ కథలంటే చందమామ కథలే! బాలమిత్ర స్టాండర్డ్ చిన్నప్పుడే నచ్చేది కాదు.చందమామ లో వచ్చే జానపద సీరియల్స్ చదవడం కోసం చందమామ ఇంటికొచ్చే సమయానికి మా ఇంట్లో (నాన్నతో సహా) ఎన్ని జతల కళ్ళు కాచుకుని ఉండేవో,నేను ముందంటే నేను ముందని ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే ఉత్తేజం పొంగివస్తుంది.ఆ యుద్ధాల్లో నేను గెల్చిన సందర్భాలు గుర్తొచ్చి విజయహాసం ఇప్పటికీ మొహాన వికసిస్తుంది.
పాత చందమామల బైండ్లు బంధువుల ఇళ్ళలో కానీ, పాత పుస్తకాల షాపుల్లోగానీ, ఫుట్ పాత్ మీద పరిచిన పుస్తకాల దుకాణాల్లో గానీ ఎక్కడన్నా దొరుకుతాయేమో ఎంత డబ్బయినా పర్లేదు, కొనెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యాను ....బోల్డు సార్లు. కొందరిళ్ళలో ఉన్నాయి కానీ ఇవ్వమనేశారు. నేనైతే మాత్రం ఇస్తానా చెప్పండి? త్రివిక్రమ్ అబ్దుల్ కలామ్ గారికి ఇస్తారట గానీ మన్మోహన్ సింగ్ అడిగినా ఇవ్వరట. నేనైతే వాళ్ళిద్దరికీ ఇవ్వను..ఏం చేసుకుంటారూ? ఇద్దరికీ తెలుగు రాదుగా?
ఇలా వేట సాగిస్తుండగా....
ఆన్లైన్లో పాత చందమామలు ఉన్నాయన్న వెన్నెల లాంటి చల్లని కబురు నాగమురళి గారు తెచ్చారు.
నాగమురళి గారు పాత చందమామలు చదువుతారా ?. అంటూ పలకరించగానే ప్రాణం లేచొచ్చి అక్కడికి పరిగెత్తి ఆ యులిబ్ లో ఉన్న పాత చందమామలు వీలైనన్ని చదివాను. ఈ లోపు ఈ చందమామ దాహాన్ని మరింత పెంచుతూ
త్రివిక్రం గారు "చంపి" క్లబ్బు.స్థాపించి, పాత చందమామల గురించి మరో సారి టపా రాశారు.మరోసారి అక్కడికి పరుగు.ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేశారంటే ఇక చూసుకోండి మరి!ఆ టపా చదువుతుంటే ఎంతో ఆశ్చర్యమేసింది. త్రివిక్రమ్ గారినే తలదన్నే మహానుభావుడొకాయన హైదరాబాదులో ఉన్నారని త్రివిక్రం గారి మాటల్లోనే తెలిశాక, ఇక చంపి ల్లో మనం చివరి లైన్లో ఉంటే మంచిదని అర్థమైంది.
ఈ లోపు బ్లాగాగ్ని ఫణి గారు ఇవికాకుండా "ఇవిగో అందుకోండి"అంటూ డౌన్ లోడ్ చేసుకోడానికి చందమామ సీరియల్స్ ని అందించారు.
ఇక్కడా..
ఇంకా ఇక్కడా..!
ఇక్కడ కూడా...!
దానితో తల తిరిగిపోయింది.
అవి డౌన్ లోడ్ చేసుకుంటూ ఉండగా ఆ బ్లాగులోకి చుట్టపు చూపుగా వచ్చిన కప్పగంతు శివరామ ప్రసాద్ గారు "ఓసింతేనా! నా బ్లాగు. చూడండొకసారి"అన్నారు. దానితో అక్కడికి పరుగు.(చందమామలు దొరుకుతాయంటే చందమామ వరకైనా ప్రయాణానికి రెడీ) అక్కడికి వెళ్ళి చూస్తే శివరామ ప్రసాద్ గారికి "చంపి మిత్ర" బిరుదు ఇవ్వాలనిపించేన్ని అద్భుతాలు అక్కడ కనపడ్డాయి. పాత జానపద సీరియల్స్ అనీ సిద్ధం... నోరూరిస్తూ!
ఆ పాత మధురాలై, మనల్ని ఒక్కసారిగా బాల్యంలోకి విసిరేసే అనాటి సీరియల్స్ ని అందించడమే లక్ష్యంగా కాక బొమ్మలన్నింటినీ ఫొటో ఎడిటర్లో డిజిటలైజ్ చేసి రంగుల్ని చాలా వరకూ పునరుద్ధరించడం,సరిగా స్కాన్ కాని చందమామ పేజీలను సరి చేయడం వంటివి చేసి మంచి క్వాలిటీతో చందమామ సీరియల్స్ ని అందుబాటులో ఉంచారు శివరామ ప్రసాద్ గారు!
ఇంతలో ఈ మధ్యనే చంపి క్లబ్బులో సభ్యత్వం తీసుకున్న వేణు గారు తానేం తక్కువ తినలేదంటూ చందమామ లోని జానపద సీరియల్స్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని మొన్న ఆదివారం ఈనాడులో పరిచయం చేశారు. తన బ్లాగులోనూ .ఇచ్చారు. అంత గొప్ప సీరియల్స్ రాసిన సుబ్రహ్మణ్యం గారి ఫొటో చూడ్డం, ఆయన గురించి తెలుసుకోవడం మరో సంబరం.
శివరామ ప్రసాద్ గారు ఇంతవరకూ అందించిన పాత చందమామ సీరియల్స్ వివరాలు ఇవీ!
పేరు మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఆయన బ్లాగులో ఆ సీరియల్ ఉన్నచోటుకు తీసుకెళుతుంది.
1.సింద్ బాద్ యాత్రలు.
2.అరణ్య పురాణం.
3.మాయదారి ముసలిది.
4.ఆలీబాబా నలభై దొంగలు.
5.అలీ నూర్, ఆలీబాబా, మాయ వర్తకుడు .
6.అల్లాద్దీన్ అద్భుత దీపం.
7. వడ్డాది పాపయ్యగారి అద్భుత చిత్రాలు.(అరణ్య పురాణం సీరియల్ ముఖ చిత్రాల ఆల్బమ్)
8. ప్రహ్లాద చరిత్ర . (వడ్డాది గారి చిత్రాలతో సహా)
9.పురాణ గాథలు.
10.దుర్గేశ నందిని, నవాబు నందిని.
11.పరోపకారి పాపన్న కథలు .
ఈ సీరియల్స్ లో కొన్నింటిని నేను డౌన్ లోడ్ చేశాను. మరి కొన్ని చేస్తున్నాను.
ఇంటర్నెట్ లో చందమామ అందుబాటులో ఉందని తెలిసే ఎంతో సంబరపడ్డ చంపి లు ఈ సీరియల్స్ అన్నింటినీ చూస్తే ఇంకెంత సంబరపడతారో! కానీ శివరామ ప్రసాద్ గారి బ్లాగు ఇటీవల వరకూ కూడలిలో జత చేయకపోవడం వల్ల వారు అప్ డేట్ చేసిన సీరియల్స్ వివరాలు ఆయన బ్లాగుకెళ్ళి చూస్తే తప్ప తెలియడానికి లేకుండా పోయింది.
చందమామ సీరియల్సే కాక సాహిత్య అభిమాని బ్లాగులో అనేక ఆసక్తికర విషయాలపై టపాలున్నాయి.ఇంతకుముందు అవన్నీ మిస్ అయిపోయిన వారు వారి బ్లాగులో పాత టపాలు చదవొచ్చు!
చందమామ అభిమానులంతా ఈ బ్లాగులోని జానపద సీరియల్స్ ని డౌన్ లోడ్ చేసుకుని దాచుకుంటే భవిష్యత్తులో అవి దొరకకపోయే పరిస్థితి వచ్చినా మనకేం ఢోకా లేదన్నమాటే!ఇప్పటివరకూ డౌన్ లోడ్ చేసుకోని వారెవరైనా ఉంటే సాహిత్య అభిమాని బ్లాగు నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోండి మరి!
వీటిలో కొన్ని సీరియల్స్ నేను పుట్టకముందు ప్రచురించబడ్డవి కూడా ఉన్నాయి.అప్పటి చందమామలు పుస్తకాల రూపంలో అయితే సంపాదించడం అసంభవమే! వీళ్ళందరి పుణ్యమా అని వాటిని చదవగలుగుతున్నాను.
ఈ "చందమామ"ల్లాంటి బ్లాగు రచయితలందరికీ ఎన్నెన్నో ధన్యవాదాలు.
July 8, 2009
వాల్డెన్ లో శరత్-చక్రపాణి
ఆ మధ్య ఒక బ్లాగులో అబ్రకదబ్ర గారు "నా ఫ్రెండ్ ఒకడు వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయన్నాడు"అని చెప్తే ఆ బ్లాగు ఓనరు "వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయని చెప్పిన బడుద్ధాయెవరబ్బా"అని అడిగేశారు. కానీ రెండు రోజుల క్రితం నాకు అక్కడ దొరికిన పుస్తకాలు చూశాక వాళ్లని బడుద్ధాయిలంటే ఒప్పుకోవాలనిపించలేదు.
నేను వెళ్ళింది మరేదో పుస్తకం కోసం! వెదుకుతూ, వెదుకుతూ డీవీడీల కోసం చివరి లైన్లోకెళ్ళేసరికి ఒక రాక్ నిండా ఉన్న తెలుగు పుస్తకాల్లో నాకు "దేవదాసు" అన్న పుస్తకం కనపడింది. ఈ దేవదాసెవరా అని తీసి చూస్తే అది అక్షరాలా ప్రముఖ దర్శకుడు, రచయిత స్వర్గీయ చక్రపాణి బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకం! పైగా అందులో దేవదాసుతో పాటు ఆయన అనువదించిన మరో ఐదు శరత్ బెంగాలీ నవలలు కూడా ఉన్నాయి. దేవదాసు పక్కనే మరో సంపుటం "పల్లీయులు"అనే పేరుతో! ఒక్కక్షణం నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. చటుక్కున రెండు లాగేసుకుని ఒక పక్కన నిల్చుని మొత్తం తిరగేశాను. ఎప్పుడో 70 లలో మాసపత్రిక యువలో చక్రపాణి గారు అనువదించి ప్రచురించిన శరత్ నవలలు అన్నీ!
ఎప్పటినుంచో...ఎన్నేళ్లనుంచో ఈ నవలలకోసం (చక్రపాణి గారి అనువాదాల కోసం) చూస్తున్నాను. వేరే అనువాదాలు చదివినా శరత్ సాహిత్యం లోని "ఎసెన్స్" ని అంతగా అనుభవించలేకపోయానని నా ఫీలింగ్! చక్రపాణి అనువదించిన దేవదాసు నవల చదివాక అసలే చంద్రముఖి అంటే ఇష్టపడే నాకు "చంద్రముఖి జీవితం ఇలా అయిపోయిందేమిటి" అనే బాధ మొదలైంది. సినిమాలో కంటే ఉదాత్తంగా ,హుందాగా చిత్రించారు చంద్రముఖిని.చంద్ర దేవదాసు కోసం పడే బాధ పాఠకులుగా మనం కూడా పడి తీరాలనిపించేంత బావుంటుంది ఆ స్వేచ్ఛానువాదం. మూలం లో ఉన్న ప్రతి ముక్కనూ తెలుగులోకి దింపాలన్న ఉత్సాహం తో కాకుండా ఉదాత్తమైన శరత పాత్రలనీ,రచనలనూ నేటివిటీ చెడకుండా తెలుగుపాఠకులకు అచ్చతెలుగు శైలితో అందించాలన్న కోరికతో , ఇష్టంగా అనువదించిన రచనలు ఇవి. అందుకే ఇన్నేళ్ళయినా ఆ పరిమళం ఇంకా చెక్కు చెదరలేదు.
నెలకు రెండు సార్లన్నా (హీనపక్షం ఒకసారన్నా) పుస్తకాల షాపింగ్ కి వెళ్ళే నాకు ఈ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు.( మీకెవరికైనా తెలుసో లేదో కానీ) ఎందుకంటే ఇంతకు ముందు చక్రపాణీయం అనే స్మృతి సంచిక వేసిన సందర్భంలో, చక్రపాణి శత జయంతి సంచిక తో పాటు ఈ నవలలు కూడా వేయాలనే ప్రయత్నం ఉందని నాలుగేళ్ల క్రితం వెలగా వెంకటప్పయ్య గారు ఒక ఉత్తరంలో అన్నారు. నా దగ్గర పాత యువలున్నాయేమో అని వాకబు చేశారు కూడా!
నా స్కూలు రోజుల్లో మా ఇంట్లో ఎప్పటివో పాత యువలుండేవి.వాటిలో చక్రపాణి అనువదించిన శరత్ బెంగాలీ నవలలు, కథలు ప్రచురించేవాళ్ళు. రాముడి బుద్ధిమంత తనం, పరిణీత,సుభద,బడదీదీ, (మనలో మనమాట, బడదీదీ అంటే బాటసారి అని అర్థం అనుకునే దాన్ని) .మొదలైన నవలలు అన్నీ ఆ పాత యువల్లోనే చదివాను. ఆ తర్వాత అవన్నీ పాత పుస్తకాలతోపాటు పోయాయి.
పరిణీత నుంచి
ఆ విలువైన సాహిత్యం కోసం ఆ తర్వాత ఎంతగానో ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు.చివరికి ఇన్నాళ్లకు అనుకోకుండా..అదీ వాల్డెన్ లో ..మొత్తం పన్నెండు నవలలూ దొరికాయంటే అదృష్టాన్ని నమ్మక ఏం చెయ్యాలంటారు? ఆ నవలలు ------
దేవదాసు
శ్రీవారు
నవ విధాన్
బడదీది
సుభద
కాశీనాథ్
పరిణీత
జ్ఞానద
సవిత
పల్లీయులు
బిందుగారబ్బాయి
రాముని బుద్ధిమంత తనం
శరత్ రచనలకు చక్రపాణి చేసిన అనువాదం ఎంత సహజంగా ఉంటుందంటే వాతావరణాన్ని,పేర్లను బట్టి తప్ప అవి బెంగాలీ నవలలని కనుక్కోవడం కష్టం!మరో పక్క బెంగాలీ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. అందుకే వాటికోసం అంతగా అన్వేషించాను.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన శరచ్చంద్ర లోకం అనే సుదీర్ఘ వ్యాసం నుంచి కొన్ని భాగాలను ముందుమాటగా ప్రచురించడం ఈ సంపుటాలకు మరింత విలువను,శోభను చేకూర్చింది. శరత్ వ్యక్తిత్వాన్ని,సున్నితమైన భావాలతో ఉన్నతంగా ప్రవర్తించే స్త్రీ పాత్రల విశ్లేషణ, రచయితలకు ఆయన ఇచ్చిన సూచనలు,రచనల్లో వాతావరణం ఇవన్నీ ఆ వ్యాసంలో చదవగలం! చదివి తీరాలనిపించే వ్యాసం అది!
ఇంకో విశేషమేమిటంటే యువ లో ఈ నవలలను ప్రచురించినపుడు ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ వడ్డాది పాపయ్య గారు గీసిన చిత్రాలను యధా తథంగా ఈ సంపుటాల్లో తిరిగి ప్రచురించడం.
ప్రచురించింది ఎవరంటే:-
1908లో జన్మించిన చక్రపాణి గారి శత జయంతి సందర్భంగా ఈ సంపుటాలను చక్రపాణి గారి కుటుంబసభ్యుల సౌజన్యంతో నవరత్న పబ్లికేషన్స్ విజయవాడ వారు ప్రచురించారు. పాత యువలను సేకరించింది శ్రీ వెలగా వెంకటప్పయ్య గారైతే తన వద్ద ఉన్న పాత యువలను తెచ్చిచ్చి సహకరించింది ఈపురు కు చెందిన జి.చంద్రశేఖర రావు గారు.
శరత్ సాహిత్యాభిమానులు, అందమైన అనువాదాలను ఇష్టపడే వారు తప్పక కొని దాచుకుని కొంచెం కొంచెంగా ఊరించుకుంటూ చదువుకోవలసిన అపురూప నవలలు ఈ రెండు సంపుటాల్లోనూ ఉన్నాయి. మొదటి పేజీల్లో చక్రపాణి జీవిత విశేషాలు, చివర్లో శరత్ బాబు ఇల్లు, ఆయన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలు కూడా!
ఆశ్చర్యపడవలసిన ఒకే విషయం ఈ పుస్తకాలు తెలుగు పుస్తకాలమ్మే షాపుల్లో కనపడకపోవడం. (కనీసం నాకు!)
ఎప్పటినుచో ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తున్న పాత యువలు ఎక్కడా దొరక్కపోయినా,నేను కలలు కంటున్న శరత్-చక్రపాణి ల నవలలు ఒకేసారి ఒకే చోట దొరకడం--- చాలా గొప్పగా అనిపించిన క్షణం !
ఈ సంపుటాలు కావసిన వారు వాల్డెన్ లో కొనవచ్చు.అక్కడ దొరకలేదంటే నవరత్న పబ్లికేషన్స్, రహమాన్ వీధి, విజయవాడ వారిని సంప్రదించవచ్చు. నాలుగు వందల పేజీల ఒక్కో సంపుటం ధర రెండు వందల రూపాయలు!


