July 8, 2009

వాల్డెన్ లో శరత్-చక్రపాణిఆ మధ్య ఒక బ్లాగులో అబ్రకదబ్ర గారు "నా ఫ్రెండ్ ఒకడు వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయన్నాడు"అని చెప్తే ఆ బ్లాగు ఓనరు "వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయని చెప్పిన బడుద్ధాయెవరబ్బా"అని అడిగేశారు. కానీ రెండు రోజుల క్రితం నాకు అక్కడ దొరికిన పుస్తకాలు చూశాక వాళ్లని బడుద్ధాయిలంటే ఒప్పుకోవాలనిపించలేదు.
నేను వెళ్ళింది మరేదో పుస్తకం కోసం! వెదుకుతూ, వెదుకుతూ డీవీడీల కోసం చివరి లైన్లోకెళ్ళేసరికి ఒక రాక్ నిండా ఉన్న తెలుగు పుస్తకాల్లో నాకు "దేవదాసు" అన్న పుస్తకం కనపడింది. ఈ దేవదాసెవరా అని తీసి చూస్తే అది అక్షరాలా ప్రముఖ దర్శకుడు, రచయిత స్వర్గీయ చక్రపాణి బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకం! పైగా అందులో దేవదాసుతో పాటు ఆయన అనువదించిన మరో ఐదు శరత్ బెంగాలీ నవలలు కూడా ఉన్నాయి. దేవదాసు పక్కనే మరో సంపుటం "పల్లీయులు"అనే పేరుతో! ఒక్కక్షణం నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. చటుక్కున రెండు లాగేసుకుని ఒక పక్కన నిల్చుని మొత్తం తిరగేశాను. ఎప్పుడో 70 లలో మాసపత్రిక యువలో చక్రపాణి గారు అనువదించి ప్రచురించిన శరత్ నవలలు అన్నీ!


ఎప్పటినుంచో...ఎన్నేళ్లనుంచో ఈ నవలలకోసం (చక్రపాణి గారి అనువాదాల కోసం) చూస్తున్నాను. వేరే అనువాదాలు చదివినా శరత్ సాహిత్యం లోని "ఎసెన్స్" ని అంతగా అనుభవించలేకపోయానని నా ఫీలింగ్! చక్రపాణి అనువదించిన దేవదాసు నవల చదివాక అసలే చంద్రముఖి అంటే ఇష్టపడే నాకు "చంద్రముఖి జీవితం ఇలా అయిపోయిందేమిటి" అనే బాధ మొదలైంది. సినిమాలో కంటే ఉదాత్తంగా ,హుందాగా చిత్రించారు చంద్రముఖిని.చంద్ర దేవదాసు కోసం పడే బాధ పాఠకులుగా మనం కూడా పడి తీరాలనిపించేంత బావుంటుంది ఆ స్వేచ్ఛానువాదం. మూలం లో ఉన్న ప్రతి ముక్కనూ తెలుగులోకి దింపాలన్న ఉత్సాహం తో కాకుండా ఉదాత్తమైన శరత పాత్రలనీ,రచనలనూ నేటివిటీ చెడకుండా తెలుగుపాఠకులకు అచ్చతెలుగు శైలితో అందించాలన్న కోరికతో , ఇష్టంగా అనువదించిన రచనలు ఇవి. అందుకే ఇన్నేళ్ళయినా ఆ పరిమళం ఇంకా చెక్కు చెదరలేదు. నెలకు రెండు సార్లన్నా (హీనపక్షం ఒకసారన్నా)  పుస్తకాల షాపింగ్ కి వెళ్ళే నాకు ఈ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు.( మీకెవరికైనా తెలుసో లేదో కానీ) ఎందుకంటే ఇంతకు ముందు చక్రపాణీయం అనే స్మృతి సంచిక వేసిన సందర్భంలో, చక్రపాణి శత జయంతి సంచిక తో పాటు ఈ నవలలు కూడా వేయాలనే ప్రయత్నం ఉందని నాలుగేళ్ల క్రితం  వెలగా వెంకటప్పయ్య గారు ఒక ఉత్తరంలో అన్నారు. నా దగ్గర పాత యువలున్నాయేమో అని వాకబు చేశారు కూడా!నా స్కూలు రోజుల్లో మా ఇంట్లో ఎప్పటివో పాత యువలుండేవి.వాటిలో చక్రపాణి అనువదించిన శరత్ బెంగాలీ నవలలు, కథలు ప్రచురించేవాళ్ళు. రాముడి బుద్ధిమంత తనం, పరిణీత,సుభద,బడదీదీ, (మనలో మనమాట, బడదీదీ అంటే బాటసారి అని అర్థం అనుకునే దాన్ని) .మొదలైన నవలలు అన్నీ ఆ పాత యువల్లోనే చదివాను. ఆ తర్వాత అవన్నీ పాత పుస్తకాలతోపాటు పోయాయి.

                                                                   పరిణీత నుంచిఆ విలువైన సాహిత్యం కోసం ఆ తర్వాత ఎంతగానో ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు.చివరికి ఇన్నాళ్లకు అనుకోకుండా..అదీ వాల్డెన్ లో ..మొత్తం పన్నెండు నవలలూ దొరికాయంటే అదృష్టాన్ని నమ్మక ఏం చెయ్యాలంటారు? ఆ నవలలు ------

దేవదాసు

శ్రీవారు


నవ విధాన్


బడదీది


సుభద


కాశీనాథ్


పరిణీత


జ్ఞానద


సవిత


పల్లీయులు


బిందుగారబ్బాయి


రాముని బుద్ధిమంత తనం
శరత్ రచనలకు చక్రపాణి చేసిన అనువాదం ఎంత సహజంగా ఉంటుందంటే వాతావరణాన్ని,పేర్లను బట్టి తప్ప అవి బెంగాలీ నవలలని కనుక్కోవడం కష్టం!మరో పక్క బెంగాలీ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. అందుకే వాటికోసం అంతగా అన్వేషించాను.పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన శరచ్చంద్ర లోకం అనే సుదీర్ఘ వ్యాసం నుంచి కొన్ని భాగాలను ముందుమాటగా ప్రచురించడం ఈ సంపుటాలకు మరింత విలువను,శోభను చేకూర్చింది. శరత్ వ్యక్తిత్వాన్ని,సున్నితమైన భావాలతో ఉన్నతంగా ప్రవర్తించే స్త్రీ పాత్రల విశ్లేషణ, రచయితలకు ఆయన ఇచ్చిన సూచనలు,రచనల్లో వాతావరణం ఇవన్నీ ఆ వ్యాసంలో చదవగలం! చదివి తీరాలనిపించే వ్యాసం అది!


                                  
ఇంకో విశేషమేమిటంటే యువ లో ఈ నవలలను ప్రచురించినపుడు ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ వడ్డాది పాపయ్య గారు గీసిన చిత్రాలను యధా తథంగా ఈ సంపుటాల్లో తిరిగి ప్రచురించడం.ప్రచురించింది ఎవరంటే:-1908లో జన్మించిన చక్రపాణి గారి శత జయంతి  సందర్భంగా ఈ సంపుటాలను చక్రపాణి గారి కుటుంబసభ్యుల సౌజన్యంతో నవరత్న పబ్లికేషన్స్ విజయవాడ వారు ప్రచురించారు. పాత యువలను సేకరించింది శ్రీ వెలగా వెంకటప్పయ్య గారైతే తన వద్ద ఉన్న పాత యువలను తెచ్చిచ్చి సహకరించింది ఈపురు కు చెందిన జి.చంద్రశేఖర రావు గారు.శరత్ సాహిత్యాభిమానులు, అందమైన అనువాదాలను ఇష్టపడే వారు తప్పక కొని దాచుకుని కొంచెం కొంచెంగా ఊరించుకుంటూ చదువుకోవలసిన అపురూప నవలలు ఈ రెండు సంపుటాల్లోనూ ఉన్నాయి.  మొదటి పేజీల్లో చక్రపాణి జీవిత విశేషాలు, చివర్లో శరత్ బాబు ఇల్లు, ఆయన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలు కూడా!ఆశ్చర్యపడవలసిన ఒకే విషయం ఈ పుస్తకాలు తెలుగు పుస్తకాలమ్మే షాపుల్లో కనపడకపోవడం. (కనీసం నాకు!)ఎప్పటినుచో ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తున్న పాత యువలు ఎక్కడా దొరక్కపోయినా,నేను కలలు కంటున్న శరత్-చక్రపాణి ల నవలలు ఒకేసారి ఒకే చోట దొరకడం--- చాలా గొప్పగా అనిపించిన క్షణం !

ఈ సంపుటాలు కావసిన వారు వాల్డెన్ లో కొనవచ్చు.అక్కడ దొరకలేదంటే నవరత్న పబ్లికేషన్స్, రహమాన్ వీధి, విజయవాడ వారిని సంప్రదించవచ్చు. నాలుగు వందల పేజీల ఒక్కో సంపుటం ధర రెండు వందల రూపాయలు!

51 comments:

kiran kumar said...

చాలా బావుంది సుజాత గారూ! ఆ పుస్తకాలంటే మీకెంత ప్రేమో,అవి దొరికినప్పటి మీ excitement ఏమిటో ఊహించుకోగలిగేలా ఉంది టపా! మొత్తం అవగొట్టారా మరి?

Anwar said...

Madam is it possible to give the telephone number of the publisher?

cbrao said...

హిందీ దేవదాసు (షారుఖ్ ఖాన్, ఐష్వర్య, మాధురి దీక్షిత్) చిత్రంలో పార్వతి, చంద్రముఖి కలిసి పార్వతి అత్తగారింట నర్తించే సన్నివేశం ఉంది. తెలుగు దేవదాసులో (నాగెశ్వర రావు, సావిత్రి, రాగిణి) వారిద్దరు కలిసిన సన్నివేశం లేదు. శరత్ దేవదాసు ప్రకారం ఏది సరైనది?

వేణు said...

బెంగాలీ శరత్ చంద్రుడు తెలుగు చక్రపాణి తో కలిసి,
వాల్డెన్ పుస్తకాల షాపులో ఎన్నాళ్ళ నుంచీ దాక్కున్నాడో!
అనుకోని చోట... అప్రయత్నంగా , పైగా... పన్నెండు నవలలు ఒక్కసారిగా దొరకటం...
అద్భుతమే!

వ.పా. బొమ్మలు కూడా ప్రచురించేంత శ్రద్ధ తీసుకున్నందుకు ప్రచురణకర్తలకు అభినందనలు చెపుతూ... ఈ పుస్తకాలను తెలుగు పుస్తకాల షాపుల్లో అందుబాటులో ఉంచనందుకు మాత్రం వాళ్ళను కాస్త కోప్పడాలనిపిస్తోంది!

Sreenivas Paruchuri said...

చక్రపాణి శతజయంతి సందర్భంగా, వెలగా ఆధ్వర్యంలో (/సంపాదకత్వంలో), మొత్తం 4 సంపుటాలు వెలువడ్డాయి. మార్కెట్లోకి వచ్చి కూడా 15-16 నెలలవుతుంది. ఒక్క పుస్తకం కాబోలు (వ్యాస సంకలనం) అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో బయటకు వచ్చింది.

-- శ్రీనివాస్

మురళి said...

చాలా మంచి కబురు చెప్పారు.. నేనూ చిన్నప్పుడు యువల్లో చదివాను.. మీకే కాదు నాకూ ఎక్కడా కనబడలేదు ఈ పుస్తకాలు.. 'విశాలాంధ్ర' వాళ్ళ శరత్ సాహిత్యం కొందామా అనుకుంటున్నా తరుణంలో నా నిర్ణయం మార్చుకునేలా చేసింది మీ టపా.. నా వోటు చక్రపాణికే.. నాకు బాగా నచ్చిన మరో విషయం వపా బొమ్మలు.. అసలు వాటికోసమైనా తీసేసుకోవచ్చండి.. చదివాక ఆ విశేషాలతో టపా రాయడం మర్చిపోకండి..

సుజాత said...

అన్వర్ గారు,
పుస్తకంలో పబ్లిషర్స్ ఫోన్ నంబర్లు ఇవ్వలేదండీ! ఇస్తే తప్పకుండా ఇక్కడ ఇచ్చి ఉండేదాన్నే!

రావు గారు,
పార్వతి, చంద్రముఖి కలిసి నర్తించడం సంజయ్ లీలా భన్సాలీ పైత్యం లెండి. చక్రపాణి ప్రకారమూ, శరత్ ప్రకారమూ కూడా తెలుగు దేవదాసే కరక్టు!


శ్రీనివాస్ పరుచూరి గారు
పుస్తకాలు బయటికి వచ్చి 15 నెలలయినా చాలా మందికి తెలియలేదంటే కారణం ఏమిటో మరి! మరో రెండు సంపుటాల గురించి వాల్డెన్ వారి వేరే శాఖను సంప్రదించాలేమో! సమాచారానికి ధన్యవాదాలు.

సుజాత said...

వేణు గారూ,
నాకూ మీలాగే అనిపించింది. తెలుగుపుస్తకాల షాపుల్లో ఈ పుస్తకాలు పెట్టనివాళ్ళని....కోప్పడాలని ..కాదు! గట్టిగా తిట్టాలని!

మురళీ,
రెండు మూడు వాల్డెన్ శాఖల్లో వెదికి అయినా సరే చక్రపాణి గారి అనువాదాలే కొనండి. విశాలాంధ్ర వాళ్లవి నా దగ్గరున్నాయి. అవి అంత గొప్పగా ఉండవనే నా బాధ! నేను బంజారా హిల్స్ వాల్డెన్ లో కొన్నాను. రెండు సంపుటాలే ఉన్నాయట వాళ్ల దగ్గర. మరో రెండున్నాయని చెప్పి శ్రీనివాస్ గారు గుండెల్లో అలజడి రేపారు. ఆ రెంటికోసం ఎక్కడికెళ్ళాలో!

neelaanchala said...

కళ్ళు తిరిగే వార్త చెప్పారు. మరి ఈ రెండు కాపీలేనా ఇలాంటివి మరి కొన్ని కాపీలు వాల్డెన్ వాళ్ల దగ్గరున్నాయా? చదువుతుంటే నోరూరిపోతోంది.

Anwar said...

గురువు గారు శ్రీ వడ్దాది వారి బొమ్మల్లొ ని ఆ క్రొక్విల్ దూసిన విధం మహనుభావులు చీనా చిత్రకారుల తీరు, చిన్న దేవదాసు ఎదమీద చిన్నారి సావిత్రి చక్కని నీడ ఆయన దేవదాసుని ఎంతలా చదివి బొమ్మ్మల్లొ ఒదిగించిన పద్దతి చూస్తూంటే ........

తృష్ణ said...

సుజాతగారు,శరత్ సాహిత్య అనువాదాలు చాలా ఉన్నాయేమోనండీ.మా నాన్నగారు "B.sivarama krishna"గారి అనువాద సంపుటిలు (మొత్తం 12) ఒక బుక్ ఫెస్టివల్ లో ఓ 6 కొన్నారు.వాటిల్లో చరిత్రహీనులు,శ్రీకాంత్(ఈ రెండూ నా చిన్నప్పుడు దూరదర్శన్లో సీరియల్స్ గా వచ్చాయి)పరిణీత,దేవదాసు,భారతి,శేష ప్రశ్న,శరత్ ఉత్తరాలు వ్యాసాలు,ఇంకా కొన్ని విడి కధలు ఉన్నాయి.పోలు శేషగిరిరావుగారు అనువదించిన "బడదీదీ" కూడా ఉంది. నాకెందుకో "చరిత్రహీనులు","పరిణీత" నవలలు చాలా ఇష్టం.మా ఇంట్లో ఉన్న ఈ శరత్ సాహిత్యాలన్నీ ఎన్నిసార్లు చదివానో.... మళ్ళి ఆ పుస్తకాలన్నీ గుర్తుచేసారు.ధన్యవాదాలు.

సుజాత said...

తృష్ణ గారు,
నా దగ్గరున్న విశాలాంధ్ర వారి అనువాదాలు శివరామ కృష్ణగారివే! చక్రపాణి గారి అనువాదాలు చదివాక అవి నిజంగా నచ్చలేదండీ నాకు.

అన్నట్లు ఈ సందర్భంగా మీకోమాట చెప్పాలి. మీ బ్లాగులో కామెంట్ పెట్టాలంటే కుదరడం లేదు. మీరు కొంచెం కామెంట్ ఫార్మ్ మారిస్తే వీలవుతుంది. full page ఆప్షన్ లోకి మారితే ఉపయోగం! ఈ సమస్య చాలా మందికి ఉన్నట్లు గమనించాను నేను. మీకు చెప్పడానికి మీ బ్లాగులో కామెంటేగా దారి? అదేమో కుదరడం లేదు.అందుకే ఇక్కడ.కొంచెం చూడండి..ప్లీజ్!

దైవానిక said...

నేను కూడా పోయిన నెల విశాలాంధ్రా వాళ్ళవి రెండు సంపుటాలు కొన్నాను. మొత్తం పది ఉన్నాయి. చదువుతుంటే, అంత బాగా అనిపించలేదు. నేను చక్రపాణి గారివి కొనాలేమో!!

మేధ said...

ఇలా బెంగళూరులో లేని పుస్తకాల షాపుల గురించీ, అందులోనూ అక్కడ దొరికే తెలుగు పుస్తకాల గురించి చెప్పడం ఏం బాలేదు సుజాత గారు! నాకు ఇప్పటికిప్పుడు వాటిని చదవాలాని ఉంది, కానీ ఎలా.. Howw..?!?!?!

కొత్త పాళీ said...

cool

తృష్ణ said...

థాంక్స్ అండీ.మార్పు చేసాను.మరి వ్యాఖ్య రాసేవారికి తెలియాలి.అసలు ఈ బ్లాగింగ్ అంతా కొత్త నాకు.అంతా గ్రీక్ న్ లాటిన్ లాగ ఉంది.ఎవరైనా తెలిసినవాళ్ళుంటే సలహా అడగాలని.ఇక్కడ ఎవరు మైల్ ఇడిలు ఇవ్వరు కద.అసలు పోస్టింగ్ పెట్టడానికే చాలా తిప్పలు పాడుతున్నాను.ఏదొ రాయాలనే తపన కొద్దీ..!

కత్తి మహేష్ కుమార్ said...

ప్రసాద్స్ లో ఉండే ఒడిస్సీలో కూడా ఈ పుస్తకాలున్నాయి.

కొత్త పాళీ said...

@Anwar .. that shadow of her silhouette on Devadas' shirt .. that IS amazing.

అబ్రకదబ్ర said...

ఏడాదిలోనే వాల్డెన్‌లో ఇంత మార్పా! అప్పుడు నాకు దొరికినవాటిలో గొప్పది మహాప్రస్థానం ఒక్కటే .. అది దొరకనిదెక్కడ?

Sreenivas Paruchuri said...

చక్రపాణి సంపుటాలు హైదరాబాదులో గత 12-15 నెలల కాలంలో కనపడలేదు అంటే నమ్మశక్యంగా లేదు. నాకు హైదరాబాదుతో పరిచయం తక్కువ, అలాగే ఆ వూళ్ళో నేను కొనే పుస్తకాలు చాలా తక్కువ. కానీ నగరంలో పుస్తకాల షాపుల గురించి మాత్రం బానే తెలుసని అనుకుంటున్నాను. If I were to buy Telugu books in the city, I'd go to నవోదయ near ఆర్య సమాజ్ మందిర్, the shop opposite to Navodaya (I am just missing the name. He used to work at Navodaya before.), and the writers cooperative book shop near RTC cross roads. I specifically *avoid* విశాలాంధ్ర & ప్రజాశక్తి. Walden, Odyssey, Akshara, ... may be good shops in their own right, but I avoid them too. Nothing against them, but I need not carry such "general" English books all the way from India. For in-India-published-academic-books I go to Oxford univ. press shop in Banjara Hills and Book Point - near MLA quarters (?). Also, there are a few small shops in Kachiguda area that I love visiting.

Sorry for digressing! సరే శరత్ సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక చిన్న (quiz) ప్రశ్న. శరత్‌ని వ్యక్తిగతంగా కలిసి, అతని అనుమతితో, తెలుగులోకి అనువదించిన (మహా) వ్యక్తి పేరు ఎవరైన చెప్పగలరా!

-- శ్రీనివాస్

సుజాత said...

శ్రీనివాస్ గారు,
నేను సాధారణంగా ప్రతి నెలా వెళ్ళి పుస్తకాలు కొనే షాపు నవోదయ(ఆర్య సమాజ్ ఎదురుసందులో ఉండేదే) లోనే! విశాలాధ్రలో కనపడని మంచి వాతావరణం, మంచి పుస్తకాలకు వాళ్ళ గైడెన్సూ నాకు నచ్చుతాయి కాబట్టి! దాని ఎదురుగా ఉండేది (ఇప్పుడైతే)గోపాల్ బుక్ డిపో! ఇంకా ఒక్కోసారి నవోదయ కూడా వెళ్తాను. (నీల్ కమల్ పక్కన)

ఇంగ్లీషు నవలలు, ఇతర పుస్తకాలకైతే వాల్డన్, ఒడిస్సీ తప్పదు.అక్కడ చాలా అప్ డేటెడ్ గా ఉంటుంది కలెక్షన్!

మీ క్విజ్ కి సమాధానం ఎవరుచెప్తారా అని ఎదురు చూస్తున్నాను.

సుజాత said...

రావు గారు,
దేవదాసులో చంద్రముఖి గా వేసింది రాగిణి కాదు, లలిత.

satyamevajayate said...

సుజాత గారూ,మీరు అదృష్టవంతులు .
మీ అభిరుచులు మీ ఔన్నత్యాన్ని వ్యక్త పరుస్తాయి .
నాకు మీ ఫాలో యర్స్ లో స్థలం ఉందా ?
నా అభిరుచులు లోక సత్తా తో సహా మ్యాచ్ అవుతున్నాయి ..
నేను బుచ్చి బాబు ,చండీదాస్ అభిమానిని కూడా .

భాస్కర రామి రెడ్డి said...

కబుర్లు బాగున్నాయండి కానీ నవలా సాహిత్యం పై కామెంటడానికి నాకు పరిజ్ఞానం అస్సలు లేదు.మొన్ననే నేనుకూడా చాలానే పుస్తకాలు కొన్నాను కానీ ఒక్కటికూడా యాదృచ్చికంగా నైనా కనిపించలేదు.

రమణ / Ramana said...

శ్రీనివాస్ గారు, ఆయన కథకులు, (శతావధాని ?)వేలూరి శివరామ శాస్ర్తి?

సుజాత said...

అన్వర్, కొత్తపాళీ గార్లు,
చిన్నప్పటి అమాయకత్వం ఆ మొహాల్లో ఎంత బాగా ప్రతిఫలింపజేశారా వడ్డాది గారని చాలా సేపు ఆ బొమ్మని చూసి మురిసిపోయాను గానీ మీరు చెప్పేదాకా దేవదాసు చొక్కా మీద ఉన్నది పార్వతి నీడ అని పసిగట్టలేకపోయాను. దానికి "ఆర్టిస్టు కన్ను" ఉండాలనుకుంటా! గమనించాక అద్భుతం అనిపిస్తోంది. ధన్యవాదాలు.

సుజాత said...

కిరణ్ కుమార్ గారు,
ఇంకా ఎక్కడా? వాటితో పాటు మొన్నీమధ్య ఒక ఫ్రెండ్ బహూకరించిన "రాంబాబు డైరీ-3" , నేను కొన్న మరి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కోటీ అవగొడతాను.

నీలాంచల,
ఒకసారి వెళ్ళి చూడండి వాల్డెన్ కి!

దైవానికి,
అయితే మీ దగ్గర కూడా( నా దగ్గర లాగానే) రెండు రకాల అనువాదాలకూ బుక్ షెల్ఫ్ లో చోటు వెదకాలన్నమాట.

మేథ,
దిసీజ్ ప్రతీకారం! అప్పుడెప్పుడో నువ్వు బెంగుళూరు మీద నేను అర్జెంటుగా బెంగ పెట్టుకునేలా "లాండ్ మార్క్" లో పుస్తకాల షాపింగ్ మీద రాయలేదూ? పుస్తక ప్రియులంటే నాకు చాలా ఇష్టం. ఈ సారి నేను బెంగుళూరొచ్చినపుడు ఇవి నీ కోసం పట్టుకొస్తాను మరి!

మహేష్,
వెళ్తున్నా ఈ వీకెండ్ ప్రసాద్స్ కి!
మిగిలిన రెండు సంపుటాలకై (హైకూలాగా ఉందేంటి ఇది)

అబ్రకదబ్ర,
వాల్డెన్ లో ముళ్లపూడి గారి పుస్తకాలు కూడా ఉన్నాయి.మహా ప్రస్థానం కొద్ది రోజుల్లో వీధిచివరి కిళ్ళీ షాపులో కూడా దొరుకుతుంది.ఇదివరలో "వచ్చిందా" అని అడిగి కొనే పరిస్థితి ఉండేది ఆ పుస్తకానికి.

సుజాత said...

సత్యమేవజయతే గారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు! బుచ్చి బాబు 'చివరికి మిగిలేది" నా ఫేవరెట్ నవల. అంత దూరంలోనే కనిపిస్తూ వెంటబడే కొద్దీ అందకుండా పోయే అద్భుత జీవిత సత్యాలెన్నో ఆ నవల ద్వారా తెలుసుకోగలిగాను. చండీదాస్ గారివి కూడా చదివాను గానీ అంత తాత్వికత నాకు అర్థం కావడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. "చీకట్లోంచి చీకట్లోకి" లో కథలు బావుంటాయి. అనుక్షణికం ఒక జీవితకాలం రోజూ చదవాలిస్న నవల. ఫాలోయర్స్ లో చేరినట్లున్నారుగా! థాంక్యూ !

భాస్కర్ రామిరెడ్డి గారు,
టపా నచ్చితే చాలు! కామెంటాల్సిన అవసరం లేదు. ఇండియా వచ్చి వెళ్ళానని మీరు చెప్పాక బోల్డు పుస్తకాలు కొనకుండా వెనక్కి వెళ్తారని ఎలా అనుకుంటాం చెప్పండి? ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

కాచిగూడా చౌరస్తా దగ్గర ఆర్యసమాజ్ ఎదురుగుండ సందులోనే, నవోదయ దాకా వెళ్లక్కర్లేకుండా, సందులో ఎడమ వేపుకి ఒక చిన్న పుస్తకాల షాపు ఉంటుంది. దాన్ని షాపు అనడంకంటే గోడలో ఒక్ చిన్న గూడు అనడం సబబుగా ఉంటుంది. షాపు పేరు గుర్తు లేదు, ఓనరు పేరు శోభన్ బాబు. బయటకి ఎక్కువగా మత సంబంధమైన పుస్తకాలు ప్రదర్శించబడి ఉంటాయి. లోపలికి వెళ్తే మాత్రం మీకు ఒక సాహిత్య నిధి దొరుకుతుంది. భార్యా భర్తా షాపుని చూసుకుంటూ ఉంటారు, ఇద్దారూ సమకాలీన సాహిత్యమ్మీద మంచి పట్టు ఉన్నవారు, మీ అభిరుచిని బట్టి మంచి పుస్తకాలు సూచించగలవాళ్ళూనూ.

మీకు మంచి మత, ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు, (స్తోత్రాలు పురాణాలు ఇత్యాది) కావాలంటే కాచిగూడా చౌరస్తా లోనే టాగూరు పబ్లిషింగ్ హౌసు వారి షాపు మంచి చోటు.

సుజాత said...

కొత్తపాళీ గారు,
చంపేశారు! ఆ షాపు సందు మొదట్లోనే ఉంటుంది. కానీ బయట డిస్ ప్లే లో అన్నీవిద్యార్థులకు కావలసిన సబ్జెక్టులు ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ సారి అక్కడ మజిలీ చేసి అది దాటాకే నవోదయ!

బొల్లోజు బాబా said...

:-)

satyamevajayate said...

prompt reply ki thanks.
హిమజ్వాల లో తాత్వికత..అసలు ఆ పదానికి అర్ధం తెలియని వయసులో'' గీతాదేవి' ని ఆరాధించాను
అప్పుడప్పుడు వెదుకుతుంటాను..గీతా దేవిని .... ,ఎప్పుడో 'రజనీగంధ'సినిమా లో ,దీప్తి నావల్,డింపుల్ కపాడియా, షబానా ఆజ్మి మొదలగు నటుల లో ...
అలాగే కృష్ణచైతన్య ,శశాంక ..
ఇక 'నన్ను గురించి కధ వ్రాయవూ'..' పొగలేని నిప్పు '' ఎల్లోరాలో ఏకాంతసేవ '' "నిరంతర త్రయం " బుచ్చి బాబు ...కధలు నిజమైన తాత్వికతకు తార్కాణాలు ..పిచ్చేక్కిస్తాయి ..
అయినా నాకింకా అర్ధం కావు ఆ పుస్తకాలు ...

జ్యోతి said...

కొత్తపాళీగారు చెప్పిన దుకాణం వాడికి మేము పాతగిరాకినే. బయట అన్నీ స్తోత్రాలు, పూజల పుస్తకాలు ఉంటాయి. లోపలికి వెళితే మాత్రం ఒక భాండాగారం. పైగా మంచి డిస్కౌంట్ కూడ ఇస్తారు. తెలుగుబుక్ స్టాల్ అనుకుంటా..

manu said...

Madam mee vadda RADUGA Publications vari CHUCK-GEK Annathammula story,Vimanam katha vunda ? daya chesi telupagalaru

manohar

వేణూ శ్రీకాంత్ said...

పైన ఎవరో చెప్పినట్లు మీ ఎక్సైట్మెంట్ అంతా కనిపించిందండి టపాలో :-) నా హైదరాబాద్ ట్రిప్ లో సందర్శించాల్సిన ప్లేసుల్లో వాల్డన్ కూడా చేర్చేసా.. ఇంకా ఇక్కడ కామెంట్ల ద్వారా మంచి పుస్తకాల షాపులు గురించి తెలుసుకో కలగడం కూడా బాగుంది.

సుజాత said...

satyameva jayate గారు
ఒక జీవితకాలం చాలదేమో బుచ్చిబాబుని, చండీదాస్ ని అర్థం చేసుకోవడానికి అనిపిస్తుందండీ! అసలు ఈ జీవితాల్లో అంత టైమెక్కడుంది చెప్పనడి? కొన్ని పుస్తకాలు అర్థం అయ్యీ కానట్లుంటేనే వాటి మీద ప్రేమతో మళ్ళీ మళ్ళీ చదువుతాం! చిరవకు మిగిలేది కూడా అంతే చూడండి, దయానిధికి వజ్రం దొరికాక కథ అంతా వేగంగా సాగిపోతుంది. అతని భార్యకు సడన్ గా అనారోగ్యమేమిటో, అసలు వాళ్ళిద్దరి మధ్యా అంతరాలెందుకు వచ్చాయో అన్నీ పల్చని తెరలోంచి చూస్తున్నట్లు అస్పష్టంగా అస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నా, ఇంకా అర్థం కానిదేదో ఉన్నట్లనిపిస్తుంది.

సుజాత said...

బాబాగారు,
థాంక్యూ!

@ మను,

మీరు చెప్పిన పుస్తకాలు నా వద్ద లేవండీ! ఒక్కోసారి విశాలాంధ్ర వాళ్ళు భారీ డిస్కౌంట్స్ పెట్టినపుడు తప్పక వెళ్ళి చూడండి. వారి వద్ద ఉన్న పాత రష్యన్ పుస్తకాలన్నీ బయటికి వస్తాయి అప్పుడు. "అలీస్క"నాకు అలా దొరికిందే దాదాపు పన్నెండేళ్ళ క్రితం! విమానం కథ, మరో ఆపిల్ తోటల కథ మా సిస్టర్ దగ్గరుండాలి మరి!

జ్యోతి గారు,
భలే చెప్పారే! "కొత్తపాళీ గారు చెప్పిన దుకాణానికి మేము పాత గిరాకీయే"! మీరు కూడా చెప్పాక ఇంకా ఆసక్తిగా ఉంది. ఈ సారి తప్పక ఆ షాపు సంగతేంటో చూడాల్సిందే!


వేణూ శ్రీకాంత్,
నిజమే! పుస్తకాల షాపుల్లాంటివి మనకు తెలియనివి ఎవరన్నా చెప్తే ఎంతో సంతోషం! కొత్తపాళీ గారు చెప్పిన షాపు ఎప్పుడూ చూస్తూనే ఉన్నా, తెలుసుకుని ఇప్పుడే! అలాగే నేను చెప్పిన పుస్తకాలు ఒడిస్సీలో కూడా ఉన్నాయనే సంగతి నాకు కొత్తదే!

అంటే ఈ లెక్కన
చక్రపాణి శరత్ సాహిత్యం కాఫీ టేబుల్ బుక్ (వాల్డెన్,ఒడిస్సీ లలో దొరికే కొన్ని ఖరీదైన పుస్తకాలు ఈ కోవలోకే వస్తాయి) అనుకుంటారేమో జనం! కానీ అది నిజం కాదు!

Sreenivas Paruchuri said...

రమణ గారు,

అవును, శరత్‌ని కలిసి, అనుమతితోనే అనువదించిన (ఏకైక) తెలుగు వ్యక్తి; మహాపండితుడు, శతావధాని, రచయిత అయిన వేలూరి శివరామశాస్త్రి.

ప్రశ్నకు కరెక్టుగా జవాబు చెప్పారు కాబట్టి :-)

మీకాసక్తుంటే మీకిష్టమైన and/or అందుబాటులోలేని పుస్తకం అడగండి (sreeni at gmx.de). పంపగలను.

అభినందనలతో,
శ్రీనివాస్

సుజాత said...

శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు చక్రపాణి చక్రపాణి అనువదించిన బడదీదీ ని చదివి "మీ అనువాదమూ, నా అనువాదమూ, మూల గ్రంథమూ దగ్గర పెట్టుకుని చూశాను. మీ అనువాదం లెస్సగా ఉన్నది" అని చక్రపాణి గారికి జాబు రాశారట. (5-12-1935)

ఈ సంగతి ఈ కొత్త సంపుటం దేవదాసు లో ఉంది.

cbrao said...

@రమణ / Ramana : పరుచూరి శ్రీనివాస్ గారి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి, బహుమతి గెలిచినందులకు అభినందనలు. అటు ఛాయాగ్రహణం, ఇటు సాహిత్యం రెంటిలో చక్కటి పరిచయమున్న మీకు మరో మారు అభినందనలు. రమణ ఛాయాగ్రహణంలో చేసిన ప్రయోగం ఇక్కడ చూడండి.
http://swagathaalu.blogspot.com/2009/04/lr-treatment.html

x said...

నవరత్న బుక్ సెంటర్ - +91-866-2432813

kiranmayi said...

సుజాత గారు
నేను మీ పోస్ట్స్ ని వెయిట్ చేసి చేసి చదువుతాను. మీ పోస్ట్స్ లో నాకు చాల నచ్చింది "చత్తాంటి" అన్న పదం. ఈ మధ్యనే (actually ఈ రోజునే) నా బ్లాగ్ మొదలుపెట్టాను. I would like your input on my posts.
Thanks

kiranmayi said...

సుజాత గారు,
నాక్కూడా పుస్తకాల పిచ్చి చాలానే ఉంది. చిన్నప్పుడు టింకిల్, అమర్ చిత్ర కథ, చందమామ, బాలమిత్ర పుస్తకాల్ని దొరికినవి దొరికినట్లు చదివేదాన్ని. ఇంటర్ లోకి వచ్చిన తరవాత "మరీ చిన్నపిల్లల పుస్తకాలేంటి, cheap గా" అని ఫీల్ అయిపోయి, నాన్నగారి కలెక్షన్ లోంచి కుటుంబరావు గారి పుస్తకం తీసి చదవటం మొదలెట్టా. ఉహు. అర్థం కాలే. ఎందుకులే అనవసరంగా గొప్ప బుక్స్ చదవటం అనుకుని Nancy Drew, Hardy Boys లాంటి వాటికి అలవాటు పడిపోయా. నాన్నగారు అప్పుడప్పుడు "కొంచెం మంచి బుక్స్ చదవచ్చు కాదమ్మా ?" అని మెల్లగా విసుక్కున్నా ఆయన కలెక్షన్ దరిదాపుల్లోకి వెళ్లడానికి టెన్షన్ వచ్చేది. తెలుగు, ఇంగ్లీషు అనే బేధం లేకుండా, కొన్ని పుస్తకాల టైటిల్స్ కూడా అర్థమైయ్యేవి కాదు. BSc లోకి వచినతరవాత మెల్లమెల్లగా సైంటిఫిక్ ఫిక్షన్ చదవటం అలవాటు చేసుకున్నా. Ph. D కి వచ్చాక కూడా అలాంటి బుక్స్ చదువుతుంటే అప్పటి నా best friend మరియు ఇప్పటి మా ఆయన "ఇంకా చిన్నపిల్ల లాగ ఈ scientific fiction చడువుతావేంటి?కొంచెం మంచి బుక్స్ చదవచ్చు కదా?" అనడంతో ఫుల్ సర్కిల్ అయ్యింది. ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే...కాచిగూడ, కోటి దరిదాపుల్లో ఇంత మంచి తెలుగు బుక్ కలెక్షన్ ఉందన్న సంగతి తెలుసుకోకుండా, ఆ ఏరియా ని కేవలం బట్టలు, క్లిప్పులు మరియు bags లాంటి నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి పరిమితం చేసేసినందుకు తెగ బాధగా ఉంది. ఈ మధ్యన online లో తెలుగు ఆర్టికల్స్, పుస్తకాలు చదువుతుంటే "అబ్బ వీటిల్లో కొన్ని నా బుక్ కలెక్షన్ లో ఉంటె బాగుండు కదా" అని చాల అనిపిస్తోంది. లాభం లేదు. ఈ సారి ఇండియా వచ్చేముందర బుక్ లిస్టు రెడీ చేసుకుని మరీ రావాల్సిందే. ఏమంటారు?

Ravi said...

Ee Pustakam K.P.H.B. Bus stop pakkana vunna pustakala shop lo vundi.

వెంకటరమణ said...

శరత్ సాహిత్యాన్ని మళ్ళీ గుర్తు చేసినదుకు ధన్యవాదాలండీ.
శరత్ రచనల్లో మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాల గాఢత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వాళ్ళలోని చంచలత్వాన్ని కూడా బాగా చూపిస్తారు. మనసుకు దగ్గరగా వచ్చినట్లే వచ్చి మళ్ళీ దూరంగా జరుగుతారు.సంఘంలోని కట్టుబాట్లను గురించి, సాధారణ బెంగాల్ పల్లెల్లో పేదవారి ఆర్ధికపరమైన ఇక్కట్లు బాగా చూపిస్తారు.

Sreenivas Paruchuri said...

రాత్రి పేపర్లు, పుస్తకాలు వగైరా సర్దుతుంటే మరల బయటపడిన కాగితం ముక్కలోని వివరాలివి:

చక్రపాణి శతజయంతి సందర్భంలో నూతన ప్రచురణలు

1. శరత్‌బాబు సంగ్రహ నవలలు - చక్రపాణి అనువాదం
2. చక్రపాణి కథలు + సినిమా కథలు --> ధర్మపత్ని, షావుకారు, స్వర్గసీమ, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, గుండమ్మ కథ, సి.ఐ.డి, ఇంకా సినిమాల్లో ఫోటోలు ... పాత మంగలి కథలు ఇత్యాది ...
3. చక్రపాణి విజయపతాక - శతజయంతి సంచిక --> ఆయన సినిమా, సాహిత్య జీవితంపై నాగిరెడ్డి, NTR, గుమ్మడి, నరసరాజు, కొ.కు మొదలైనవారు రాసిన వ్యాసాలు, విజయా వారి సినిమాల వివరాలు ....

-- శ్రీనివాస్

గీతాచార్య said...

@సుజాత గారు,

చతుష్ష్ష్టి కళలూ అస్వాదించేశాం, మీ పోస్టు చూసి. మైండంతా మళ్ళీ మామూలైపోయింది.థాన్క్సున్నర...

Meghana said...

Hi Sujathagaru,

I am new to these blogs, I just came to know about Sujatha's blog.
To tell frankly I became your fan.
Thanks for Chandamama links. Do you know about old editions of Yuva. If it is available online can you please give us links.
All of you know about each others blog, but please give link to others blogs also.Thank you

సుజాత said...

కిరణ్మయి గారు, క్షమించాలి, లేటుగా స్పందిస్తున్నందుకు! పుస్తకాల మీద మీ పాషన్ చూశాక సంతోషంగా ఉంది. నాలాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు! ఈ సారి ఇండియా వచ్చేముందు లిస్టు రెడీ చేసుకుని నాకొక్క మెయిల్ కొట్టండి. కోఠీ అంతా తిరిగేద్దాం పుస్తకాల షాపింగ్ తో!

Ravi,
thanks for the info! I really dont know this

వెంకట రమణ గారు,
చాలా చక్కగా చెప్పారు. రాముడి బుద్ధి మంత తనంలో వదిన పాత్ర ఎంత బావుంటుందో! ఈ రెండు సంకలనాల్లోనూ ఎన్నో పాత్రలు మీరు చెప్పినట్లే దగ్గరగా వచ్చి, దూరంగా జరిగాయి.


శ్రీనివాస్ గారు,
మళ్ళీ ఇంకోసారి పుస్తకాలు సర్ది, అలాంటి పాత కాగితమ్ముక్కలు ఏవైనా ఉంటే మా కోసం సమర్పించప్రార్థన! 2, 3 నెంబర్ల పుస్తకాల కోసం ఎక్కడ వెదకాలో? ఒడిస్సీలో దొరకలేదు.

గీతాచార్య,
థాంక్స్!

మేఘన,
పాత యువల కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను గానీ దొరకలేదు. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను, కొన్నయినా దొరికే దాకా!ఆన్ లైన్లో ఎక్కడా లేవండి!లింక్స్ ఎక్కడైనా దొరికితే తప్పక నా బ్లాగులొ ఇస్తాను.

మీ అభిమానానికి ధన్యవాదాలు.

Sreenivas Paruchuri said...

మరి మిగిలిన చక్రపాణి శతజయంతి ప్రచురణలు హైదరాబాదులో యెందుకు దొరకడంలేదో నాకర్థం కాని విషయం. గత సంవత్సర కాలంగా నా దగ్గరున్నాయి. రెండు వారాల క్రితం నవోదయ రామమోహనరావుగారితో (విజయవాడ) మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావిస్తే సెట్ మొత్తం దొరుకుతున్నట్లే చెప్పారు.

re: యువ సంచికలు, ఏడో ఎనిమిదో DLI లో వున్నాయి (1973-75) చూడండి.

-- శ్రీనివాస్

leo said...

@కొత్త పాళీ , శ్రీనివాస్ గారు
మంచి పుస్తకాల షాపుల వివరాలు తెలిపారు. ధన్యవాదాలు.
@సుజాత గారు
మంచి పుస్తకాలు పరిచయం చేశారు. ధన్యవాదాలు. చక్రపాణి గారి మిగతా పుస్తకాలు ఎక్కడన్నా దొరికితే తెలియజేయండి.
ఓపెన్ ఇడి తో వ్యాఖ్యానించే సదుపాయం తీసివేసారు ఎందుకని?

http://iddaru.wordpress.com

Post a Comment