జరుక్ శాస్త్రి పేరడీ "వెళిపోయిందెళిపోయింది..."కవితా ప్రియుల కోసం!  

Posted by సుజాత in

పేరడీ రారాజు జరుక్ శాస్త్రి గారు ఎన్నెన్నో అద్భుతమైన పేరడీలు కట్టినా వాటన్నింటిలోకీ బహుళ ప్రజాదరణ పొందింది ఆయన రాసిన "వెళిపోయిందెళిపోయింది..."అంటూ సాగే పేరడీ! అది ఎక్కడ వెదికినా,ఎంతగా సెర్చినా దొరకనే లేదు చాన్నాళ్ళుగా! చివరికి మొన్న ఒక ఫ్రెండ్ దాని కోసం వెదికితే మళ్ళీ ప్రయత్నించాను. తనకు ఇవ్వడం సంగతి అటుంచి అసలు అది ఎందుకు దొరకదో చూద్దామనే పంతం కొద్దీ,ఉక్రోషం కొద్దీ తీవ్రంగా ప్రయత్నించాను. ఎంతో మంది స్నేహితులని అడిగి చూశాను. చివరికి దొరికింది.  హాశ్చర్యం!  తెలుగు గడ్డ మీద కాదు. మరెక్కడో! ఒక మిత్రుడి  ప్రవాసాంధ్ర మిత్రుడి వద్ద!

ఇంతకీ ఈ పేరడీ పేరు "ఆశ్వాసాంతం"!




అది మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ స్కాన్ చేసిన పేజీల రూపంలో ఉంచుతున్నాను. కవితా ప్రియులు, ఇష్టమైన వారు కాపీ చేసుకోవచ్చు. కేవలం పేరడీయే కాక అందులోని వ్యక్తులెవరో కూడా వివరించే వివరణ కూడా ఇక్కడ ఉంచుతున్నాను.


మీలో ఎవరివద్దైనా ఉంటే సంతోషం! లేనివారు....  పనిలో పడండి మరి!



 
 






మీకు "ళ" గుణింతం వచ్చా?  

Posted by సుజాత in

ఆ మధ్య ఒకరోజు మా ఎదురింటావిడ బోల్డన్ని నగల్తో కారు దిగి లోపలికొస్తూ పలకరింపుగా నవ్వితే ఎలాగూ ఇంటికొచ్చేసింది కదాని "ఏమిటి విశేషం" అన్నాను.(వెళ్ళేటపుడైతే ఎక్కడికి అని అడక్కుడదంటారుగా)


'పెల్లికెల్లొస్తున్నాను" అంది. "ఎక్కడికీ"అని రెట్టిస్తే మళ్ళీ అదే చెప్పింది. 'ఎవరి పెళ్ళి"అనడిగితే

"మా మురలీ లేడూ,  వాడి పెల్లాం చెల్లెలిది" అని చెప్పింది. ఆవిడనని లాభం లేదు. తెలుగు దేశంలోని తెలుగు వాళ్లలో(బయట కూడా ) "ళ" పలకని వాళ్ళు కోకొళ్ళలు..ఛ..కోకొల్లలు!

వీళ్ళలో ఈ తరం పిల్లలు ఎక్కువ శాతమైతే ప్రాంతాన్ని బట్టి కూడా "ళ" ని "ల"అని పలకాలి కాబోలనుకునే వారు మరికొందరు!ఈ తరం వాళ్లలో ప్రైవేటు న్యూస్ ఛానెళ్ళలో వార్తలు చదివే సీతాకోక చిలకలు అగ్రస్థానంలో ఉంటారు.వరదలు తగ్గాక అక్కడి ప్రజల పరిస్థితుల గురించి ఒక ఛానెల్ లో న్యూస్ రీడర్ ఇలా చదివింది



"వాల్లు నిర్భాగ్యులు! ఊల్లకు ఊల్లు ముంచేసిన వరద తాకిడికి సర్వం కోల్పోయిన వాల్లు! కల్ల ముందే కుల్లిపోతున్న కలేబరాల ను చూసి కల్ల నీల్లు పెట్టుకుంటూ, ఆకలికి ఆగలేక కుల్లి కుల్లి ఏడుస్తున్న పిల్ల గాల్లను చూసి నిస్సహాయులై మల్లీ తిరిగి చూడని అధికార్ల అలసత్వం మీద ఆగ్రహాన్ని వెల్ల గక్కుతూ..." అసలేమైనా బోధపడిందా? ఇది తెలుగా?

ఆమెకు "ళ" పలకదని గ్రహించిన సబెడిటర్లు పాపం ఈ పేరాలో ఇన్ని "ళ"లు లేకుండా చూసుకోవద్దూ!



"మల్లీ ఊల్ల మీద పడ్డ నీల్లు"(వరదల సందర్భంగా)


"కల్ల నీల్లు పెట్టుకున్న తెలుగు తమ్ముల్లు"


" టిటీడీ ఆధ్వర్యంలో పెల్లిల్లు."

"రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు" (రాష్ట్రంలోని పేదలందరికీ ఒకటే ఇల్లు కాదులెండి, పక్కా "ఇళ్ళు" అని వారి ఉద్దేశం)

"బాలగోపాల్ లాంటి జనహితం కోరే వాల్లు"


ఒకటేమిటి.."ళ"పలకాల్సిన ప్రతిచోటా శక్తి వంచన లేకుండా "ల"పలుకుతారు! అసలు ఇంకో ఆణిముత్యం చదవాలి మీరు! "డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన యాంకరమ్మ". గురించి చదివారా? కల్లు, సారాయి కాదులెండి, పాపం ఐ బాంక్ వాళ్ళు "కళ్ళు"తీసుకున్న వైనం గురించి చెప్పబోయింది పాపాయి!

మీలో "ళ" గుణింతం ఎంతమందికి వచ్చు? రాయడం కాదు, చదవడం!


ఈ మధ్య ఒక సినిమా చూశాను టీవీలో! సినిమా పేరు అబద్ధం  ! దర్శకుడు బాలచందర్. ఇద్దరు హీరోల్లో ఒకడు ఉదయ్ కిరణ్! అసలు ఉదయ్ కిరణ్ పేరు తల్చుకోగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏమిటి? "ఈ పెద్దోల్లున్నారే"అన్న పేడి డైలాగేగా! ఇందులోనూ అదే పాత్ర అయ్యవారిది. హీరోయిన్ వెంటపడి వేధిస్తూ ఫొటో తీస్తుంటే తెలివి గల ఆ పిల్ల "కొంచెం వెనక్కి వెళ్ళి తియ్యి" అని ఉదయ్ వెనక ఉన్న పదడుగుల గోతిలో పడేలా చేస్తుంది. అప్పుడు హీరో  "గీతా(నిజంగా ఆ అమ్మాయి పేరు ఇది కాదనుకుంటా ! అది రాధ అయ్యుంటే రాదా..అంటాడుగా హీరో! అది రాయడం ఇష్టం లేక...) ప్రేమని నీ చుట్టూ తిరుగుతుంటే నన్ను "పాతాలం" లో పడేశావేంటి"అనడుగుతాడు.



హీరోవిను వాడిని  "అది పాతాలం కాదురా ఫూల్! పాతా"ళం"! "ళ"  పలకటం రాదు, మళ్ళీ తెలుగు వాడినని సొల్లు కబుర్లు చెప్తావు. ముందు "ళ"నేర్చుకోరా గాడిదా"  అని  పిచ్చి తిట్లు తిట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి దృశ్యం ఒకటి తెలుగు సినిమాలో  ఉంటుందని నేనెప్పుడూ కల కూడా కనలేదు. (అది తమిళ సినిమా, తెలుగులోకి డబ్ చేశారు. ఈ లెక్కన "ళ" పలకడం రానివారు తమిళనాడులో కూడా ఉన్నారన్నమాట )

 ఒకరోజంతా హీరో ఆ గోతిలోనే ఉండి "ళ" ప్రాక్టీస్ చేసి మొత్తం "ళ" లు ఉండే పాట పాడతాడు. ఆ పాట
 ఇక్కడ వినండి..(ఆ మాటకొస్తే ఈ పాటలో కూడా తప్పులున్నాయి. అనవసరమైన చోట  కూడా  "ళ" ఉపయోగించారు ఈ పాటలో)



"ళ" పలకవలసిన చోట "ల" పలుకుతుంటే చాలా చిరాకేస్తుంది.


ఇలా "ళ" పలకడానికి బద్ధకించే వాళ్ళు నిత్యం తారసపడుతూనే ఉంటారు. (అవును బద్ధకమే, ఆ అక్షరం మన అక్షరమాలలో ఉన్నపుడు, దానికి "ల" కీ తేడాని స్పష్టంగా చిన్నపుడు నేర్చుకున్నపుడు పలకడం 'రాదు"అంటే ఎందుకొప్పుకోవాలి?)



"కుల్లు మోతు వాల్లు"


"కల్లెం లేని గుర్రం"


"యాపిల్ పల్లు"


"పల్లు రాలగొట్టిన యువతి"(ఈ పళ్ళు వేరు)


"మల్లీ మల్లీ చెప్పినా లాభం లేదు"


"గులాబి ముల్లు"(సింగిల్ ముల్లు కాదు, ముళ్ళు)


"మురలీ రవలి"


"జీవన సరలి"


"చోల రాజుల నాటి శాసనం"


"వీధికెక్కిన ఇల్లాల్లు(ఇల్లాళ్ళు)

 "లలిత కలలు" (లలిత కన్న కలలు అని అర్థం చేసుకోవాలా?)




ఈ మధ్య ఒకచోట "ముల్లు" అని ఉండాల్సిన చోట "ముళ్ళు"అని ఉండటం చదివి తెల్లబోయాను. చాలా మంది జర్నలిస్టులు కూడా ఆర్నెల్లు అని రాయడానికి  "ఆర్నెళ్ళు" అని రాస్తారు."మౌలిక" అని రాయాల్సిన చోట "మౌళిక" అనీ  "మెలకువలు"అని రాయాల్సిన చోట "మెళకువలు" అనీ రాయడం చాల చోట్ల గమనించవచ్చు!



ఒరియా వాళ్ళను ఎప్పుడైనా గమనించారా?వీళ్ళలో దాదాపు చాలా మందికి "ష" పలకడం రాదు. స్టేసన్, ఎమోసన్,ఎగ్జామినేసన్,కరప్సన్...ఇదీ వరస!

దీపక్ మహాపాత్రో అనే ఒక ఫ్రెండ్ ని అడిగితే  "మాకసలు "ష" లేదు"అన్నాడు.  ఉదయ్ సాహు అనే మరో పొరుగాయన అతడిని సమర్థించాడు. (ఎంతవరకు నిజమో నాకు తెలీదు!ఒరియా అక్షర మాల లో ఉందో లేదో తెలిసిన వారు చెప్పాలి)



ఇలా అక్షర మాలలో లేని అక్షరాలు పలకలేని వారిని క్షమించవచ్చు. హిందీ మాతృభాష గా గల వారు "ళ"సరిగా పలకలేదంటే ఒప్పుకోవచ్చు గానీ "ళ"పలకడం రాని దక్షిణభారతీయుల్ని చూస్తే ఏమనాలో అర్థం కాదు.



ఇక "శ"ను "ష"లాగా పలికేవాళ్ళను లెక్కపెట్టలేం కాబట్టి వాళ్లగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..!



"షిల్పం'

"షషి"


"షరం" (హిందీ సిగ్గనుకునేరు...శరం అని చదూకోండి)

"దేషం"


"దోష"(దోశ)


"దషదిషలు"


"విషాల హృదయం"(భలే కామెడీ కదూ..విషాల..)

వీటికి మీరు కూడా మీకు తట్టిన కొన్ని పదాలు కలుపుకోండి!



భాషను ఎవరైనా సరే ఖూనీ చేయడం సహించకూడని విషయం!  అందునా, ప్రజా జీవితంలో, ముఖ్యంగా మీడియా లో ఉండే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నా అభిప్రాయం! . ఎందుకంటే జబర్దస్తీగా మన జీవితాల్లోకి చొచ్చుకొచిన మీడియా ఛానెళ్ల ప్రభావం రేపటి పౌరులమీద తప్పకుండా ఉంటుంది కాబట్టి! ఎంతసేపూ 'ఎవరు ముందుగా వార్తను అందించారన్న పోటీయే తప్ప ఎంత ప్రామాణికమైన భాషను ఉపయోగిస్తున్నామన్న స్పృహే లేకుండా పోయింది ఎలక్ట్రానిక్ మీడియాలో!



"ఇలాంటి సంకర మైన భాషను వినలేకపోతున్నాం! ఇటువంటి అపభ్రంశపు తెలుగు మాకొద్దు!   దీనివల్ల మా పిల్లలకు మాతృభాష మీద విరక్తి కలుగుతోంది. నష్టం కలుగుతోంది ...చర్యలు తీసుకోండి"అంటూ హైకోర్టులో ఒక PIL వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?


నాకైతే నమ్మకం లేదు! మీకో?

అటెన్షన్ లేడీస్..ఈ రోజు ఈనాడు వసుంధరలో మనం.....!  

Posted by సుజాత in










"బ్లాగులందు మహిళా బ్లాగులు వేరయా"అన్నట్లు(ఎవరైనా అన్నారా లేదా? అనే ఉంటార్లెండి)బ్లాగులు రాసే మహిళల సంఖ్యతో పాటు వాటిలో వైవిధ్యం కూడా పెరుగుతూనే ఉంది. అందుకే పత్రికల్లో తరచుగా బ్లాగుల ప్రసక్తి వచ్చినపుడు ప్రత్యేకించి మహిళల బ్లాగుల్ని గురించి పేర్కొనడం కూడా చూస్తున్నాం!


ఈ రోజు ఈనాడు "వసుంధర"లో ఆన్ లైన్ లో అక్షర  శరాలు సంధిస్తున్న తెలుగు మహిళా బ్లాగర్ల గురించి ఒక వ్యాసం వచ్చింది. అందులో కాస్త నా చెయ్యి కూడా పడింది.


ఎలా ఉంది?

బొమ్మల కొలువు దసరా అయిపోయాక పెట్టినట్లుంది కదూ!