January 19, 2010

వాహ్ ఉస్తాద్! వాహ్!


జాకీర్ హుస్సేన్ అనేవాడు లేకపోతే భారతీయ సంగీతంలో తబలా అనేది కేవలం పక్క వాయిద్యంగానే మిగిలిపోయేదేమో!
ఢిల్లీ దూరదర్శన్ లేకపోతే ఇటువంటి కళాకారులు సామాన్య కళారాధకులకు ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోయేవారేమో!రెండు దశాబ్దాల క్రితం దూర దర్శన్ ప్రభ వెలుగుతున్న రోజుల్లో తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో కలిసి జాకీర్ హుస్సేన్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కార్యక్రమాలనెవరు మర్చిపోగలరు? అలల్లాగ అతని జుట్టు నుదుటిమీద పడుతుంటే అది దూరదర్శన్ కెమెరా స్లో మోషన్లో చూపి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన క్షణాలు ఎవరికి మరుపుకొస్తాయి?తబలా అనేది కేవలం పక్క వాయిద్యం కాదనీ,దానితో అద్భుతాలు సృషించవచ్చనీ జాకీర్ నిర్ధారణ చేశాక,
అతని అభిమానిగా మారకుండా ఉండటం అసాధ్యమే అయింది.అందుబాటులో అతని కచేరీలు ఉంటే వెళ్ళకుండా ఉండటమూ అసాధ్యమే అయింది.

మొన్న జనవరి 16 శనివారం సాయంత్రం హైదరాబాదు ప్రేక్షకులు అతడి వేళ్ళు చేసే మాజిక్ కి కట్టుబడి బందీలై పోయేందుకు హోటల్ నొవోటెల్ ప్రాంగణంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కి పరుగు పరుగున వచ్చారు. వారిలో మేమూ!ఈ కచేరీలో జాకీర్ తో పాటు ఆయన సోదరుడు తాఫిక్ ఖురేషి(Drums),సితార్ మేస్ట్రో నీలాద్రి కుమార్,సారంగి కళాకారుడు సాబిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.తాఫిక్ మొదటగా వచ్చి కేవలం నోటితో చేసే "హ" అనే శబ్దంతోనే ఒక పెద్ద కంపోజిషన్ దాదాపు ఇరవై నిమిషాల సేపు ఉచ్ఛ మంద్ర స్థాయిల్లో వినిపించి, అందులోంచి తేరుకునేలోపుగా ఉచ్ఛస్థాయిలో ఉంది భార్య గొంతనీ, మంద్రస్థాయిలో మొహమాటపడుతోంది భర్త గొంతనీ తేల్చి నవ్వించాడు. (మగవాళ్ళను నవ్వించడానికి ఇంతకంటే మంచి జోకు ఉంటుందా? ) రెండు మూడు జోకుల తర్వాత అతి సామాన్యంగా వచ్చి సారంగి తో రాగాలాపన మొదలుపెట్టిన సాబిర్ ఖాన్ మరి కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులను తనతో పాటు మరోలోకానికి తీసుకెళ్ళిపోయాడు.

అక్కడ, ఆ రసలోకపు తీరాల్లో అతని సారంగి తరంగాలు తప్ప మరేమీ లేవు. అసలు సారంగి వాద్యమే ఒక గొప్ప విషాదంలా, మనల్ని చుట్టేస్తూ ఏవేవో గతజన్మ స్మృతుల్ని శృతిచేస్తూ ఆనందమూ, దుఃఖమూ కలగలిసిన తీరాలకు తోడ్కుపోయేలా ఉంటుంది.

 సాబిర్ ఖాన్ కుటుంబంలో సారంగి వాద్యం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాగా ఇతడు ఏడో తరం కళాకారుడట. పట్టుమని పాతికేళ్ళు లేని ఆ యువకుడి అసమాన ప్రతిభ చూసి నిజంగా కొద్దిగా ఈర్ష్య వేసింది.అతడి వాద్యంలో ప్రేక్షకులు ఎంతగా లీనమైపోయారంటే మధ్యలో నిశ్శబ్దంగా వచ్చి కూచుని తబలాతో శృతి కలిపేదాకా ఎవరూ జాకీర్ ని గమనించనే లేదు.


ఆ తర్వాత జాకీర్ చేసిన అద్భుతాలు ఎన్నని? సారంగికి పక్క వాయిద్యంలా ఉన్న తబలాకి కాసేపటికే సారంగి పక్క వాయిద్యంగా మరిపోయింది!అద్భుతమైన అతడి వేళ్ల కదలికలు సృష్టించిన మాయాజాలానికి అంతే లేకుండా పోయింది.

 రాధాకృష్ణుల చిలిపి తగాదా,అడవిలో లేడిపిల్ల గంతులు,రుద్ర తాండవం,ట్రాఫిక్ జామ్ వంటి అనేకాంశాలను, సంఘటనలను, సంభాషణలను తబలా కంపోజిషన్ లో మలిచి వినిపించారు(ఇది ఆయన దాదాపు ప్రతి కచేరిలోనూ చేస్తారు)

రుద్రతాండవం లో తబలా మీద శంఖ ధ్వనిని సృష్టించి అబ్బురపరిచాడు.ప్రేక్షకులెవరూ ఇది ఊహించనిది కావడంతో ఆ శంఖ ధ్వనికి ఆడిటోరియమంతా "హా" అన్న శబ్దంతో ఒక్కసారిగా అబ్బురపడిపోయింది.తరవాత వచ్చి కలిసిన నీలాద్రి కుమార్ సితారతో ప్రతి ఒక్కరి గుండెనూ మీటి మంత్ర ముగ్ధుల్ని చేశాడు.కొన్ని కొన్ని తారాస్థాయిల్లో... రసానుభూతి అంటే ఇదీ అని నిర్వచించిన అనుభూతి! రస సిద్ధి అంటే ఇదే అని నిశ్చయించిన అపురూప క్షణాలు. అతని ప్రతిభకు జాకీర్ సైతం తలవంచి అభివాదం చేశాడు.నీలాద్రి కుమార్ కూడా వారి కుటుంబంలో అయిదో తరం సితార ప్రవీణుడట.

చివర్లో నలుగురూ కలిసి సృష్టించిన ఫ్యూజన్ ఒక మధురానుభూతి. దాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం సాహసమే! విన్నవారికి అనుభవైకవేద్యం కావలసిందే తప్ప ఇంత బావుందని చెప్పడం పేలవంగా ఉంటుంది.అద్భుతమై, రస ప్రవాహంలో తేలియాడించి ఉర్రూతలూగించిన ఆ సాయంత్రాన్ని పదిలంగా మదిలో దాచుకుని భారంగా తిరిగి రాక తప్పింది కాదు.... కళ్ళముందే మూడుగంటల కాలం మంచులా కరిగిపోగా!కొసమెరుపు: "ఆ తబలా అంకుల్ జుట్టు "అపరిచితుడి" జుట్టులా ఉంది" అంటూ మా పాప కితాబిచ్చింది వస్తూ వస్తూ!

Note: ఫ్లాష్ ఉపయోగించకుండా ఫొటో తీయవలసి రావడంతో ఫొటోలు ఇలా చీకట్లో కాంతులీనుతున్నాయి.

29 comments:

శేఖర్ పెద్దగోపు said...

వాహ్ ఉస్తాద్ టపా..
ఫ్లాష్ లేకుండా తీసినా ఫోటోలు చూడ చక్కగా ఉన్నాయి. జాకీర్ హుస్సేన్ హెయిర్ స్టైల్ మీద సంకీర్తన కితాబు అదుర్సండి. :-) :-)

కొత్త పాళీ said...

Nice. Lucky you.

Enaganti Ravi Chandra said...

కొన్ని ఆనందాలు కావాలంటే కొన్ని ఆనందాలు కోల్పోవలసివస్తుంది నాకు. సంక్రాంతికి ఊరెళ్ళడం వల్ల ఇలా మాకు కూతవేటు దూరంలో జరిగిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మిస్ అవ్వాల్సివచ్చింది. ప్చ్... ఏంచేద్దాం..మీ టపా చదివాక కొంచెం ఉపశమనం లభించింది. :-)

నిషిగంధ said...

ఎంతటి అదృష్టవంతులు మీరు!! కానీ ఇంత చక్కని టపా మరియు ఫోటోలతో మాక్కూడా ఆ అదృష్టాన్ని పంచినందుకు ధన్యవాదాలు.. నిజంగా దూరదర్శన్ లేకపోతే ఎంతమంది అద్భుతమైన కళాకారుల ప్రతిభ మనకి తెలిసి ఉండేది కాదు!! ఆ రోజుల్లో 'వాహ్! తాజ్ వాహ్!!' అని తాజ్ మహల్ టీ యాడ్ లో కనిపించే జాకీర్ నవ్వన్నా, ఆయన జుట్టన్నా ఎంత ఫాసినేషనో!! :-)

చైతన్య said...

video / audio రికార్డింగ్ ఉంటే... అది కూడా పోస్ట్ చేయగలరా మాలాంటి వాళ్ళ కోసం...

Kalpana Rentala said...

సుజాత,
అవును. దూరదర్శన్ లేకపోతే వీళ్ళందరి కచేరీలు వినే అదృష్టం అప్పట్లో మనకు వుండేది కాదు. మీ టపా మమ్మల్ని కూడా ఆ రస లోకాల్లోకి లాక్కుపోయింది. మీ పాప కామెంట్ మరీ సూపర్. జాకీర్ ప్రేమలో పడి తాజ్మహల్ టీ వాడిన యవ్వనపు జ్నాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి.

ప్రేరణ... said...

చక్కని టపాతో పాటు చక్కని ఫోటోలు కూడా..వాహ్ వా!

Sujata said...

I m speechless, after reading this. You are very lucky.

Photos are brilliant.

సుజాత said...

చైతన్య,
ఆడియో, వీడియో రైట్స్ ఎవరికో ఇచ్చేశారండీ స్పాన్సర్స్.

వేణూ శ్రీకాంత్ said...

ఎంతటి అదృష్టవంతులు. నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేను, కాని రానిలోటు తెలియకుండా కళ్ళకు కట్టినట్లు వివరించినందుకు ధన్యవాదాలు.

ఫోటోలు హై రిజల్యూషన్ లో కాస్త మసకబారి ఉన్నాయ్ కాని టపాలో కనిపిస్తున్న రిజల్యూషన్ లో చాలా బాగున్నాయ్. లైటింగ్ మంచి ఎఫెక్ట్ తో వచ్చింది. ఫ్లాష్ కన్నా లేకుంటేనే బాగ వస్తాయేమో ఇటువంటి ఫోటోలు.

కౌటిల్య said...

సుజాత గారూ..ఇలాంటి అద్భుతమైన కచ్చేరీలకి వెళ్ళే అదృష్టం నాకు లేదేమో అండీ...

Surabhi said...

I really envy you.
You are so lucky.
Thanks for sharing the experience.

అబ్రకదబ్ర said...

ఫ్లాష్ లేకపోబట్టే ఫోటోలు బాగున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ అపర్చర్ తెరిచి ఉంటే ఆ ఘోస్ట్‌లీ ఎఫెక్ట్ వచ్చేది కాదు (మీది ఎస్ఎల్ఆర్ అని ఎప్పుడో ఎక్కడో చదివిన గుర్తు. P&S ఐతే ముందు వాక్యాన్ని మర్చిపోండి)

కార్యక్రమాన్ని - తాజ్ చాయ్ తాగుతూ చూసారా లేదా ఇంతకీ?

భావన said...

నైస్ సుజాతా. అదృష్టవంతులు. ఇంక మాట ఏమి వుంది. మీ అమ్మయి కామెంట్ ఆఖరున ఇంకా బాగుంది. :-)

భాస్కర్ రామరాజు said...

Tabla Beat Science is a musical group founded in 1999 by Zakir Hussain and Bill Laswell. Its style consists of a mixture of Hindustani music, Asian Underground, Ambient, Drum and Bass, and Electronica. Laswell met with Karsh Kale (who had worked together with Bill for years), and they later teamed up with Talvin Singh and Trilok Gurtu. All six have written for Tabla Beat Science's music.


Personnel
•Zakir Hussain, a premier classical musician and accompanist.
•Trilok Gurtu is another renowned Indian percussionist.
•Talvin Singh is an acclaimed Asian Underground artist.
•Bill Laswell. Laswell is a bassist, ground-breaking producer, and composer.
•Ustad Sultan Khan. Khan is renowned for his technique and melodic control over the sarangi.
•Karsh Kale plays for Tabla Beat Science on tabla and drum kit.
•DJ Disk plays for Tabla Beat Science on turntable.
ఈ క్రింది లింకుని అనుసరించగలరు.
http://nalabhima.posterous.com/tabla-beat-science
ధన్యవాదాలు
భాస్కర్ రామరాజు

వేణు said...

రసలోకపు తీరాలకు తీసుకువెళ్ళిన సారంగి గురించి చక్కగా వర్ణించారు. ‘సారంగికి పక్క వాద్యంలా ఉన్న తబలాకి కాసేపటికే సారంగి పక్క వాద్యంగా మారిపోయింది’ అనే ఒక్క వాక్యంతోనే జాకీర్ అద్భుత మాయాజాలం కళ్ళకు కట్టినట్టయింది. కచేరీ అనుభూతిని అందంగా మా అందరికీ పంచినందుకు ధన్యవాదాలూ, అభినందనలూ!

సుజాత said...

అబ్రకదబ్ర,
నా కెమెరా ఎస్సెల్లారే! (Nikon) !డిజిటల్ కాదు. ప్రేక్షకుల మధ్యలో నిలబడి లెన్సులూ,ఎక్ స్ట్రా ఫ్లాషులూ బిగిస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అవుతుందని cannon డిజిటల్ కెమెరా తీసుకెళ్లాను. దానితో తీసినవే ఇవి! (దాని మాన్యువల్ ఇంతవరకూ చదవలేదు. చాలా నేర్చుకోవాలి దాంట్లో)

neelaanchala said...

జాకీర్ హుస్సేన్ తబ్లాకి గ్లామర్ అద్దాడని మాత్రం ఒప్పుకోవాల్సిందే! ఎంతైనా మీరదృష్టవంతులు!

HICCలో జాకీర్ హుస్సేన్ ప్రోగ్రామ్! టికెట్ కి ఏ మాత్రం వదుల్చుకున్నారేమిటి?

kiran kumar said...

"ఏ తబలా కళాకారుణ్ణయినా కంగు తినిపించగల సామర్థ్యం మన మృదంగ కళాకారులకు ఉంది"...ఇదేమిటి? ఏ తబలా కళాకారుడినైనా మృదంగ కళాకారుడెందుకు కంగు తినిపించాలి? ఎవరి సామర్థ్యం వారిది! ఎవరి కళ వారిది. ఎవరి అభిమానులు వారికుంటారు. రెంటికీ పోటీ ఎందుకు? కంగు తినిపించడాలెందుకు?

Raj said...

baaga varninchaaru.... :)

BTW, canon gurinchi emaina information kaavaali ante, nannu adagandi.... ;)
naadhi CANON SX 110IS Model

$h@nK@R ! said...

Great Show ;)

kiranmayi said...

ఇక్కడ ఒక సారి జరిగిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కచేరికి నేను వెళ్ళా. అదే మొదటి సారి లైవ్ చూడడం. కచేరి మొత్తం మైమరచి వినాల్సిందే.
ఒక సారి ఇంటర్వ్యూ లో విన్నాను. ఒక గొప్ప సంగీత కారులేవరో ఆయనని అడిగారట "నీ చేతికి వంద వేళ్ళు ఉన్నాయా?" అని.
Wah Taj రోజులు నాక్కూడా గుర్తొచ్చాయి.

Vasu said...

"పట్టుమని పాతికేళ్ళు లేని ఆ యువకుడి అసమాన ప్రతిభ చూసి నిజంగా కొద్దిగా ఈర్ష్య వేసింది"

మిమ్మల్ని చూస్తే మాకూ ఈర్ష్య వేస్తోంది. టపా చదివితే ఒక్కసారైనా ఆయన కచేరి చూడాలని అనిపిస్తోంది.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Today, I have attended the Musical concert of Pandit Shiv Kumar Sharma & Ustad Zakir Hussain at Madras Music Academy.

I can not express, my experience in words.

BTW, the duo going to perform At Hyderabad on 26th Jan.

jeevani said...

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
kathasv@gmail.com
jeevani.sv@gmail.com

మీ,

జీవని.

విజయభారతి said...

సుజాత గారు
మీరు చెప్పిందంతా చూసాక (చదవడమే చూసినట్లు అనిపించి)
అయ్యో మిస్ అయిపోయాను అనిపించింది, ప్లీస్ ఈ సారి ఇలాంటివి ఏమైన వెళ్ళేప్పుడు మీ బ్లాగ్ లో మాకు కూడ చెప్పండి.తెలియకుండానె బొల్డంత పుణ్యం మీకు.

hanu said...

mee explanation superb

శివ చెరువు said...

very nice...

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) said...

@kiran kumar,
"ఏ తబలా కళాకారుణ్ణయినా కంగు తినిపించగల సామర్థ్యం మన మృదంగ కళాకారులకు ఉంది"...ఇదేమిటి? ఏ తబలా కళాకారుడినైనా మృదంగ కళాకారుడెందుకు కంగు తినిపించాలి? ఎవరి సామర్థ్యం వారిది! ఎవరి కళ వారిది. ఎవరి అభిమానులు వారికుంటారు. రెంటికీ పోటీ ఎందుకు? కంగు తినిపించడాలెందుకు?

అన్నారు మీరు. కానీ అలాంటి పోటీలు ఉండేవని, కంగుతినిపించడాలూ జరిగేవనీ చరిత్ర చెప్తోంది. ముఖ్యంగా "ఎందరో మహానుభావులు-అజ్ఞాత కళాకారూల అపూర్వ చిత్రణ" అనే పుస్తకంలో అటువంటివి ఎన్నో చదివాను. విజయనగరం(హంపీ విజయనగరం కాదు-ఉత్తరాంధ్ర విజయనగరం) రాజావారు, యువరాజా తబలా నేర్చుకుంటాను. మృదంగం వద్దు అని తబలాపై మోజు పడ్తోంటే. రాజా వారు నీకు బాగా నచ్చిన తబలా వాద్యకారుణ్ణి తీసుకురా, నేను మెచ్చిన మృదంగం విద్వాంసుడితో పోటీ పెడదాం అని సవాలు చేశార్ట. ఆ పోటీలో మృదంగం మీద పలికేవి తబలాపై పలికించలేక..తబలా పైన పలికినవన్నీ మృదంగం పై పలికించడం వల్లా.. మృదంగం గెలిచి యువరాజు మృదంగం నేర్చుకునేందుకు ఒప్పుకున్నార్ట.
-సూరంపూడి పవన్ సంతోష్.

Post a Comment