January 5, 2011

ఒక అద్భుత నవల ఎమిల్ జోలా "భూమి"



 ఈ పుస్తకం కోసం దాదాపు పన్నెండేళ్ళు వెదికాను నేను.కొన్ని పుస్తకాల కోసం అలా వెదకాల్సి వస్తుంది మరి! అప్పుడెప్పుడో చదువుకునే రోజుల్లో ఈ పుస్తకాన్ని మా వూరి లైబ్రరీలో ఒక రోజు సగం చదివి మిగతాది రేపు చదువుదామని ఇంటికెళ్ళిపోయాను . మర్నాడు వచ్చి చూస్తే ఆ పుస్తకం కనపడలేదు. వేల పుస్తకాలుండే  మా లైబ్రరీని ఆసాంతం వెదికాను. ఎవరో నొక్కేసినట్లున్నారు. దొరకనే లేదు. ఆ తర్వాత ఎంత వెదికినా, ఎక్కడ వెదికినా దొరకలేదు.

 అప్పట్లో నేను చదివిన కాపీకి లైబ్రరీ సంప్రదాయం ప్రకారం ముందు పేజీ లేకపోవడంతో  పబ్లిషర్స్ ఎవరో కూడా తెలీలా! రచయిత, అనువాదకుడి పేరు ఆధారంగా వెదికాను.ఎన్నో పాత పుస్తకాల షాపులు తిరిగాను.లెనిన్ సెంటరంతా జల్లెడ పట్టాను. ఊహూ! ఆ పుస్తకాన్ని పబ్లిషర్స్ మళ్ళీ ముద్రిస్తారనే నమ్మకం లేదు. అది చదవకుండానే జీవితం ముగిసిపోతుందేమో అని దిగులు వేసింది. ఆ పుస్తకం సగమే చదివానన్న ఒక  ఖాళీతనం, శూన్యత్వం  అలా మనసులో ఒక మూల ఉండిపోయింది. చివరికి ఒక శుభ ముహూర్తాన,విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి "దొ..రి..కిం..ది , భూ.....మీ" అని చెప్పడంతో కథల్లో రాసినట్లు నా చెవులను నేనే నమ్మలేకపోయాను! చెక్కు చెదరని స్థితిలో చక్కగా నా చేతికొచ్చిన ఆ పుస్తకమే...  

"భూమి"..! 

ఎమిల్ జోలా రాసిన ఫ్రెంచ్ నవల. 

ఎమిల్ జోలా గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు! తెలీకపోతే గూగులించండి, టైమున్నపుడు. ఈ నవలకు సంబంధించి మాత్రం జోలా గురించి చెప్తాను. గ్రామీణ నేపథ్యంలో భూమి కోసం మనుషుల మధ్య, సొంత కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణ ని జోలా ఇందులో చిత్రించినట్లు  రైతు జీవన చిత్రణ ఇంకే ఇతర నవల్లోనూ కనపడదు. ఈ నవల రాయడానికి ఆయన గ్రామీణ నేపథ్యం ఉండాలని, అక్కడి మనుషుల్ని,పరిస్థితుల్నీ చదవాలని ఒక గ్రామంలో ఇల్లు కొనుక్కుని కాపరం పెట్టాడు. కొన్నాళ్ళయ్యాక అక్కడ మునిసిపల్ కౌన్సిలర్ గా కూడా పని చేశాడు. ఫ్రెంచ్ వ్యవసాయం మీద, రైతాంగ తిరుగుబాట్ల మీద పరిశోధన చేశాడు.కొడుకులు, మనవలు ఇలా వంశపారంపర్యంగా భూమిని పంచుకుంటూ పోతే అది ఎలా చీలికలైపోతుందీ,,దానివల్ల మానవ సంబంధాలెలా ప్రభావితమవుతాయీ ఇవన్నీ ఈ నవల్లో ఎంతో అద్భుతంగా ఆవిష్కృతమవడానికి ఆయన అధ్యయనమే కారణం! .పూసలలో దారంలా కథను అనుసరిస్తూనే అనేక సమస్యలు సాగుతాయి నవలపొడుగూతానూ! !


భూమి నవల్లో ఒక పరిపూర్ణమైన కథ కనిపిస్తుంది. ఒక పెద్ద కథ!

ఎంతో కొంత భూమి చేతిలో ఉన్న సంప్రదాయ వృద్ధ వ్యవసాయదారుడు పువాన్. భార్య రోజ్! వాళ్ళకి ముగ్గురు పిల్లలు ....జీసస్,బ్యుతో కొడుకులు కాగా, ఫానీ కూతురు! వృద్ధాప్యం మీద పడ్డ కారణంగా ఆయన తన భూమిని ముగ్గురు పిల్లలకూ పంచడంతో కథ ప్రారంభమవుతుంది. ముగ్గురిలో కొంత రౌడీ వేషాలున్న బ్యుతోకి ఈ పంపకాల వాటాలు నచ్చక అసలు భూమే తీసుకోనంటాడు. పెళ్ళీ పెటాకులూ లేకుండా ,తాగి జులాయిగా తిరుగుతుండే జీసస్ మాత్రం "దీన్ని అమ్మితే ఎన్నాళ్ళు తాగొచ్చా"అని ఆలోచిస్తూ ఇచ్చింది తీసుకుంటాడు. పువాన్ తమ్ముడు మోషేకి ఇద్దరు ఆడపిల్లలు. లిజా,ఫ్రాంస్వాజ్ లు! మోషే మరణించడంతో ఇద్దరూ కష్టపడి వాళ్ళకున్న కొద్ది భూమినీ సాగుచేసుకుంటుంటారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ.బ్యుతో లిజా ని గర్భవతిని చేసి వదిలేస్తాడు(యురోపియన్ సమాజంలో చెల్లెలు వరసైన స్త్రీతో సంబంధం పెట్టుకోవడం తప్పుకాదు)  

మరొక భూస్వామి కమతంలో పని చేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్ మీద ప్రేమ పెంచుకుంటాడు. కానీ గర్భవతి అయినా లిజాను పెళ్ళాడితే తను కూడా స్థిరపడవచ్చన్న  చిన్నపాటి స్వార్థంతో లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు ! అంతలో బ్యుతో వచ్చి లిజాను వివాహమడతానని  ఒప్పుకోవడంతో  తన పనుల్లో తాను పడతాడు జాన్! లిజాను పెళ్ళాడి వాళ్ళింట్లోనే కాపరం పెట్టిన బ్యుతోకి పదహారేళ్ళ ఫ్రాంస్వాజ్ ని సైతం సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. అతడిని  అసహ్యించుకుంటూ నిరంతరం తన్ను తాను రక్షించుకుంటుంది ఫ్రాంస్వాజ్! అతడు కనపడితే చాలు ఒళ్ళు మండిపోతుంది ఆమెకి!

రోజ్ మరణంతో (  రోజ్ మరణానికి కారణం బ్యుతోనే! తల్లితో దెబ్బలాడి ఒక్క తోపు తోయడంతో కిందపడి గాయాలపాలై మరణిస్తుంది ) ఒంటరి వాడైన పువాన్ కి ఒప్పందం ప్రకారం నెల నెలా ఇవ్వాల్సిన డబ్బు,ధాన్యం ఇవ్వడం మానేస్తారు జీసస్,బ్యుతోలు! ఫానీ తన వద్ద వచ్చి ఉండమంటుంది కానీ ఆవిడ పరిశుభ్రతా నియమాలు తట్టుకోలేక పారిపోతాడు పువాన్.అతడి దగ్గర మిగిలున్న కాస్త డబ్బూ కాజేయడానికి తన వద్దకు రమ్మంటాడు జీసస్.అతడి ఇల్లొక మురికి కూపం! అక్కడ ఉండలేకపోతాడు పువాన్.గతిలేక వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని భరించలేక బ్యుతో ఇంటికి చేరతాడు. అక్కడ అనుక్షణం బ్యుతో ఫ్రాంస్వాజ్ ని  లొంగదీసుకుని అత్యాచార ప్రయత్నాలు చేయబోవడం చూసి సహించలేకపోతాడు.

 ఆ పిల్ల పడే యాతన ఊరంతటికీ తెల్సు. ఇల్లంతా ఈ విషయమై గొడవలు, లిజాకి బ్యుతో చేతిలో తన్నులు! తన మొగుడితో గడపడానికి ఒప్పుకోమని చెల్లెలికి లిజా వేడుకోళ్లు. 

ఇహ బ్యుతో బాధలు పడలేక అతడిని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్ ని పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! మరదలు,ఆమె భూమీ తనకి దక్కకుండా పోయినందుకు పీక్కుంటాడు బ్యుతో!లిజా,ఫ్రాంస్వాజ్ ల మధ్య శతృత్వం ప్రారంభమవుతుంది.ఒకరికొకరుగా బతికిన ఆ ఇద్దరూ ఆస్థి వల్ల బద్ధ శత్రువులైపోతారు. ఫ్రాంస్వాజ్ గర్భవతి అవుతుంది. ఆమెకు పిల్లలు లేకుండా చేస్తే ఆమె భూమికి తామే వారసులమవుతామని లిజా, బ్యుతో ఆలోచించి ఒక మూఢ నమ్మకం ప్రకారం ఆమె పొట్టమీద శిలువ ఆకారంలో చేత్తో గీయాలని నిర్ణయించుకుంటారు.

ఒంటరిగా పొలానికొస్తున్న ఆమెను బ్యుతో అటకాయిస్తాడు.ఆమెపై అత్యాచారం చేసాడు.అందుకు లిజా సహకారం! 

అక్కాచెల్లెళ్ళ మధ్య భీకర పోరాటం! ఆవేశంలో లిజా  తోసిన తోపుకు  ఫ్రాంస్వాజ్ కొడవలిమీద పడుతుంది . ఈ ఘాతుకాన్నంతా గడ్డివాము వెనుకనుంచి పువాన్ చూస్తాడు. ఫ్రాంస్వాజ్ మాత్రం పట్టుతప్పి కొడవలిమీద పడ్డానని అందరికీ చెప్పి మూడురోజుల తర్వాత మరణిస్తుంది. ఆస్థి మొత్తం లిజా బ్యుతోలపరమవుతుంది. 

ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న బ్యుతో దంపతులు అతడినీ హతమారుస్తారు. 
జాన్ ఒంటరివాడైపోతాడు. ఫ్రాంస్వాజ్ ఆస్థి తనపేరుపై రాయనందుకు  నొచ్చుకున్నా, ఇక అక్కడ  ఉండబుద్ధి కాక యుద్దంలో  చేరేందుకు వెళ్ళిపోతాడు!

ఇంకా ఈ నవల్లో అనేక పాత్రలు కనిపిస్తాయి. పువాన్ సోదరి లగ్రాంద్,ఊళ్ళోని మరో భూస్వామి అలెగ్జీ, అతనిమీదా అతని కమతం మీదా పెత్తనం చెస్తూ పరాయి మగాళ్ల కోసం పాకులాడే దాసీ జాక్ లిన్, పట్నంలో వ్యభిచార గృహం యజమనిగా జీవితాన్ని గడిపే కూతురు ప్రభావం మనవరాలు మీద పడకుండా ఆ పిల్లను ఒకమేదకురలిగా పెంచే చార్లెస్, ఎలొదీ...ఇంకా ఊళ్ళోని పెద్దమనుషులూ..ఎన్నో పాత్రలు! అన్నీ పొలం చుట్టూనే తిరుగుతూ భూమికి సేవ చేయడానికి పరితపించే పాత్రలే! అంతే కాదు ..వీళ్ళు భూమి కోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. పగలూ కక్షలూ పెంచుకుంటారు. అత్యాచారాలకు, హత్యలకు పాలపడతారు. ఒక ఇంటిమనుషులే బద్ధ శత్రువులైపోతారు. అందరు కలిసినపుడు సంప్రదాయం ప్రకారం తాగి తందనాలాడతారు.  

ప్రతి పాత్రనూ ఎమిల్ జోలా తీర్చిదిద్దిన పనితనం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.ఇక్కో పాత్ర మనోగతం ఆ పాత్ర చుట్టూనే నవలంతా తిరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది చదువుతుంటే. ఆస్థి పిల్లలకిచ్చి దిక్కులేని చావు చచ్చిన భూస్వామి పువాన్ లాంటి వృద్ధులు మన చుట్టూ ఉన్నారేమో అని వెదకబద్ధేస్తుంది.(పెద్దగా వెదక్కుండానే కనపడతారు)  తన పేరుమీద కొంతైనా ఆస్తి దాచుకోకుండా పిల్లలకు సర్వం సమర్పించే తల్లి దండ్రులకు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే గతి పడుతుందన్న సత్యం ఈ నవలలో పువాన్ కథ రుజువు చేస్తుంది.

ఫ్రాన్స్ లోని పొలాల వర్ణనా,ఆ వ్యవసాయ క్షేత్రాల వాతావరణం,వాళ్ళ తిండీ తిప్పలూ ఇవన్నీ కథ తాలూకు చిక్కని పరిమళాన్ని అద్దుకుని మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి.అదే సమయంలో యూరోపియన్ సమాజపు వావీ వరసలేని విచ్చలవిడి శృంగార సంబంధాలు వెగటు పుట్టిస్తాయి కొన్ని చోట్ల! 

ఫ్రాంస్వాజ్ తనకంటే పదిహేనేళ్ళు చిన్నదన్న ఎరుకతో ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఆమ పట్ల తన ప్రేమను తెలియపర్చాలన్న జాన్ తహతహ చాలా సున్నితంగా కనిపిస్తుంది. మరో వైపు  జీవితంలో అనుక్షణం అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యాచారం జరిపిన క్షణాల్లో ఫ్రాంస్వాజ్ పరవశించి ఆనందించడం పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది. బ్యుతోని తాను తీవ్రంగా అసహ్యించుకున్నప్పటికీ తాను ప్రేమించింది అతడినే అని  గ్రహించి సిగ్గుతో కుంచించుకుపోతుంది.   తన ఆస్థిని సైతం జాన్ పేరుమీద రాయక తన చావుకి చారకురాలైన అక్కకే వదిలి పోయి అందరిలోకీ ప్రేమాస్పదురాలిగా మిగిలిపోతుంది.

అడుగడుగునా స్వార్థపరులైన మనుషులు .రైతుల మొండితనం, మూర్ఖత్వం,స్వలాభం,కృతఘ్నత, కుట్ర   ,మోసం,దగా ఇలాంటి వాటినన్నిటినీ వాళ్ళ కఠోర శ్రమ,కటిక దారిద్ర్యాల వెలుగులో సరిగ్గా అర్థం చేసుకోవాలని ముందుమాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాటన్నిటికీ ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ గుణాల ఆధారంగా వాళ్ళని అసహ్యించుకోకూడదంటాడు.
వాళ్ళని "చెడ్డవాళ్ళు" గా కాక మామూలు మనుషులుగా అర్థం చేసుకోవాలంటాడు

ఈ నవలకోసం జోలా అనేక విషయాలపై సేకరించిన నోట్సు  కట్టలు కట్టలుగా  పారిస్ నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉందట!

ఎమిల్ జోలా రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నవల ఒక్కటీ ఒక ఎత్తు! ఆయన అభిమాన రచన కూడా!

భూమే ఈనవల్లో నాయకుడు,నాయిక,ప్రతినాయిక,అన్నీ!దాని చుట్టూ పాత్రల్లనీ తిరుగుతాయి తప్ప వాటి కంటూ ఇతరత్రా సాధించాల్సిన జీవన సాఫల్యమంటూ ఏమీ కనపడదు.రుతువులు,పంటలు,ఊడ్పులు,కోతలు,నూర్పిళ్ళు, అతివృష్టి,అనావృష్టి..ఆధునిక పరికరాలవల్ల జీవనోపాధి కోల్పోయే కూలీలు ...సర్వం ఈ నవల్లో అత్యద్భుతంగా వర్ణితమవుతాయి.  

ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని పుస్తకాల్లో ఈ నవలకు తప్పక చోటు దొరుకుతుంది. సహవాసి గారి అనువాదం సంగతి మళ్లీ మళ్ళీ చెప్పడం అబ్బురపడటం అనవసరం! కానీ చెప్పకుండా ఉండలేనంత సహజత్వం, అందం! ! 

అచ్చతెలుగు గ్రామీణ పదాలు, మాండలికాలు ఫ్రెంచ్ నవల అనువాదంలో వాడుతూనే కథ నేటివిటి ఏ మాత్రం చెడకుండా తీర్చి దిద్దడం చూస్తే  సాక్షాత్తు అనువాదకుడే ఫ్రాన్స్ వెళ్ళొచ్చి ఈ నవల రాసాడా అనిపించక మానదు. బాటిల్స్ అనేమాట వాడాల్సిన చోటల్లా అనువాదకుడు "బుడ్లు" అనేమాట వాడతాడు. అలాగే "ఇటు వచ్చేతలికి(వచ్చేసరికి)" "పడ్డ"(గేదె) ,"మూడడుగులకోతూరి ( మూడడుగులకోసారి)..ఇలా అనేక పచ్చి తెలుగు పదాలు తగులుతుంటాయి. స్వేచ్చానువాదం లో రారాజు సహవాసేనని ఒప్పేసుకుంటూ  ఇంకోసారి టోపీలు తీసేస్తున్నా!

అయితే ఈ నవల వెలువడిన 50 ఏళ్ళ తర్వాత ఎమిల్ జోలా  అల్లుడు నవల్లో వర్ణితమైన గ్రామానికి వెళ్ళాడట. ఆ నవల్లో ఉన్నవన్నీ స్వార్థం మూర్తీభవించిన పాత్రలు కాబట్టి,వాటికి మోడళ్ళు ఆ గ్రామస్థులే కాబట్టి వాళ్ళేమైనా నొచ్చుకున్నారేమో అని విచారించాడు. ఆ నవల గ్రామస్థులందరికీ పరిచితమే! కొట్టిన పిండే !

అయితే వాళ్ళు తమ పల్లెను, పల్లీయుల్ని దారుణంగా పోల్చాడని కించిత్తైనా ఎమిల్ జోలా మీద కోపం తెచ్చుకోలేదట. కానీ ఎవరికి వారు ఆయా పాత్రలతో తమను మాత్రం పోల్చుకోకుండా "ఫలానా చెత్త పాత్ర మాత్రం..అదిగో ఆయనదే"అంటూ ఇరుగు పొరుగుల్ని మాత్రం చెత్త పాత్రలతో ఇట్టే పోల్చేశారట.

ఈ నవలను  1983 లో వేసింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. మళ్లీ ఇంతవరకు వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలీదు. కాని ఇలాంటి అత్యద్భుతమైన  పుస్తకాలను మళ్లీ మళ్లీ  జన బాహుళ్యంలోకి   తీసుకొచ్చి పాఠకులకు  ఉత్తమప్రపంచ సాహిత్యాన్ని అందుబాటు లో ఉంచాల్సిన బాధ్యత మంచి పబ్లిషర్లు తీసుకోవాలి  . వాటికి  పాఠకాదరణ  తప్పకుండా ఉంటుంది కూడా. వనవాసి నవల కు లభించిన ఆదరణే  ఇందుకు తార్కాణం!

ప్రస్తుతం  ఈ పుస్తకం బయట ఎక్కడా లభ్యం కావడం లేదు.  అప్పట్లో కొని దాచుకున్న వారి వద్ద తప్ప! 

నా కలెక్షన్లో ఉన్న ఒక అద్భుతమైన నవల ఎమిల్ జోలా భూమి! దొరికితే మాత్రం చదివే అవకాశం వదులుకోవద్దు!









25 comments:

SHANKAR.S said...

కంగ్రాట్స్. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న పుస్తకం దొరికితే ఉండే ఆనందం భలే ఉంటుందండీ.
భూమి కధ చూస్తే చదవబుద్ధేస్తోంది. కానీ
"ప్రస్తుతం ఈ పుస్తకం బయట ఎక్కడా లభ్యం కావడం లేదు. అప్పట్లో కొని దాచుకున్న వారి వద్ద తప్ప! " ఇలా చెప్తే ఎలాగండీ?
ఎనీవే నేను ట్రై చేస్తా.సాధారణం గా ఎక్కడో తప్ప దొరకదంటున్నారు కాబట్టి వీలయితే దాన్ని ఈ బుక్ గా మార్చి మా అందరికోసం మీ బ్లాగ్ లో ఉంచచ్చేమో ఆలోచించండి.(కుదిరితేనే సుమండీ).
ఒక మంచి పుస్తకాన్ని అందించిన పుణ్యం దక్కుతుంది.

చందు said...

చాలా బాగా రాశారు. ఈ పుస్తకం కోసం మీరు పన్నెండేళ్లు వెతికిన కష్టమే చెపుతోంది దీని విలువ. మాకు పరిచయం చేసినందుకు మీకు థాంక్స్

సుజాత వేల్పూరి said...

Shanky గారూ, ఈ బుక్ గా మార్చడమా? హమ్మో!ఎన్ని పేజీలో తెల్సా! దానికంటే రెండు కాపీలు ఫొటోస్టాట్ తీసి ఉంచుతా! కావలసిన వాళ్ళు తీసుకుని చదువుకోండి హాయిగా! ఏవంటారు?

Kathi Mahesh Kumar said...

:) :) :)

ఆ.సౌమ్య said...

just for fun:

SHANKY గారు మీ మటాని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన కామెంట్లు ఇవాళ పలు బ్లాగుల్లో చూసాను. keep it up SHNAKY gaaru :)

మీ పోస్ట్ చదివాక మళ్ళీ కామెంటుతా.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

సుజాత గారూ,

మీ పుస్తక పరిచయం బాగుందండీ. ఎలాగైనా ఈ నవలని చదవాలి.

SHANKY గారూ, మనం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లకి ఫోన్ చేసి అడిగితే పునర్ముద్రణ గురించి వాళ్ళు ఆలోచిస్తారేమో?

అది ఎక్కువ మందిమి అడిగితేనే సుమండీ?

malli said...

ఆ మధ్య నేను చెప్పాగా మీకు భూమి నా దగ్గర ఉందని...అయ్యో...ఇంకొన్ని రోజులు ఉడికించలేకపోయానే అనుకున్నా కానీ...పన్నెండేళ్ళంటే చాలా రోజులు తపస్సు చేసినట్టే...బావుంది పుస్తకానికి తగిన సమీక్ష...

Praveen Mandangi said...

Émile Zola గురించి గూగుల్‌లో వెతికాను. మా బంధువుల కుటుంబాలలో కూడా భూమి కోసం ఘర్షణలు జరిగాయి. మా వాళ్లు ఆడ పిల్లలకి ఆస్తిలో వాటాలు ఇవ్వకపోయినా మగవాళ్ల మధ్యే భూపంపకాలలో తేడాలు వచ్చాయి. ఒకరికి ముగ్గురు కొడుకులు, ఇంకొకరికి నలుగురు కొడుకులు. కొందరు బ్యాంకులు, రైల్వేలలో ఉద్యోగాలు చూసుకుని పట్టణాలకి వచ్చెయ్యడంతో వ్యవసాయ భూముల మీద కోరిక తగ్గింది.

భాను said...

నా దగ్గర ఉంది .చదువుదామని పక్కన పెట్ట టైం దొరకట్లే. దీని మొదటి ముద్రణ 1983 లో అప్పుడు దాని వేల 13 .50 పుస్తకం చదివాక మీ సమీక్ష చదువుతా

వేణూశ్రీకాంత్ said...

చాలా వివరంగా బాగారాశారు సుజాత గారు. వేణు గారన్నట్లు నవల లో రాయాల్సిన గ్రామీణ పరిస్థితుల అధ్యయనం కోసం గ్రామంలో ఇల్లు కొనుక్కుని కాపరం పెట్టిన రచయిత నిబద్ధత అబ్బురపరుస్తోంది! అది నిజమేనా అని కూడా అనిపిస్తుంది.

భాను said...

ఈ పుస్తకం నా దగ్గర ఉందండీ. చదవాలని అనుకుంటూనే ఉన్న కాని టైం దొరకట్లే . ఇక చదవాలి పైన నా కామెంట్ ఏమయ్యిందో సగం మిస్ అయ్యింది అందుకే మళ్ళీ కామెంటా:)

బాలు said...

అంతమంచి నవల గురించి చెప్పి సగం పుణ్యమే కట్టుకున్నారు. ఫొటోస్టాట్ కాపీలు అందుకునే మార్గం కూడా చెప్పి మిగతా పుణ్యం కూడా కట్టేసుకోండి ప్లీస్...

Rajendra Devarapalli said...

దగ్గర ఉంచుకుని కొన్ని నెలల నుంచి చదవలేకపొతున్నాను,ఇంకా క్షమార్హం కాని విషయమేమంటే ఎమిలీ జోలాది ‘ది సిన్ ఫుల్ ప్రీస్ట్’ గత పద్దెనిమిది అవును18 సంవత్శరాలుగా అలా మూలనబడి ఉంది.

Sharada said...

ఒక గొప్ప పుస్తకం గురించి గొప్ప పరిచయం!
శారద

హరి said...

దాదాపు 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఇదే నవల చదివాను. సరిగ్గా గుర్తులేదు. మీ పోస్టుతో మళ్ళీ గుర్తుకు వచ్చింది.

గ్రామీణ జీవితాన్ని, దారిద్ర్యాన్ని కళ్ళకు కట్టేలా వివరిస్తాడు ఎమిలీజోలా. అతని కాలంలొ ఉన్న ఫ్రాన్సు గ్రామీణ జీవితం, ఇప్పటి మన గ్రామాలలో పరిస్థితులను పోలి ఉంటుంది. దుర్భర దారిద్ర్యంతో అన్నదమ్ములు కాట్లాడు కోవడం, అవిటి తల్లిదంద్రులను నిరాదరణకు గురిచేయడం మనదగ్గర కూడా కనపడుతుంది.

సుజాత వేల్పూరి said...

చందు, వేణు, వేణూ శ్రీ,శారద,హరి...థాంక్యూ!

@ మల్లి,
గుర్తుందండీ. పుస్తకం చదువుతుంటే నా టపా గుర్తొచ్చిందని కూడా రాశారుగా! నిజంగానే పన్నెండేళ్ళ తర్వాత పుస్తకం దొరకడం నాకు తపస్సు చేసినట్టే ఉంది.

వైద్యభూషణ్ గారూ,

మీరన్నమాట కరెక్టే! ఎక్కువ డిమాండ్ ఉంటే మళ్ళీ పుస్తకం వేసే ఛాన్స్ ఉంది. కానీ భారతీయ రచనల కంటే విదేశీ నవలల పట్ల పాఠకులకు ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఉండదో అనుకున్నారేమో పబ్లిషర్స్!

భాను గారూ, నిజమే! పుస్తకం ధర 13-50!
ఇక ఎక్కువ రోజులు దాచిపెట్టక చదివేసి మళ్ళీ ఇలా రండి!

సుజాత వేల్పూరి said...

బాలూ,
వేరే మార్గమేముంటుంది ! నేను ఫొటోస్టాట్ తీయిస్తాను. నా దగ్గర తీసుకోండి.

రాజేంద్ర కుమార్ గారు, ఇది అన్యాయం కదూ, దగ్గరుంచుకుని చదవకపోవడం? ఆ రెండో పుస్తకం నాకిస్తే నేను చదివి పెడతాగా!

ప్రవీణ్,
వావ్, మీ ఇంట్లో భూమి కోసం తగాదాలు కూడా జరిగాయా?

సౌమ్య, టపా చదివేసి మళ్ళీ రావలెను!

Praveen Mandangi said...

సుజాత గారు. మా నాన్న గారికి, పెదనాన్న గారికి మధ్య ఓసారి జరిగాయి. అది Orissa 1960 actకి విరుద్ధంగా బేనామీ పేరుతో కొన్న భూమి గురించి. దొంగ భూమి గురించి కూడా కొట్టుకుంటారు.

పద్మవల్లి said...

సుజాత గారూ
ఈ పుస్తకం గురించి చాలా బాగా రాశారు. మంచి పుస్తకానికి మంచి పరిచయం. ఇప్పటికిప్పుడు వెతికి చదవాలనిపించేలా ఉంది. కనీసం ఇంగ్లీష్ వెర్షన్ అయినా దొరుకుతుందేమో చూడాలి.

ofcourse, మీరు రాసిన టపాలు అన్నీకూడా చాలా బాగుంటాయి అనుకోండి. అన్నట్టు, "అనైతికం" టపాలో నా కామెంట్ పెట్టాను చూసారా.. అదే నా మొదటి కామెంట్ మీ బ్లాగ్ లో.
పద్మవల్లి

వేణు said...

ఈ ‘భూమి’నవలను HBT వాళ్ళు రీ ప్రింట్ చేసే అవకాశం ఉందా? అది తెలుసుకోడానికి HBT గీతా రామస్వామి గారినే నేరుగా అడిగాను. ఆమె చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే... ఈ నవల రీ ప్రింట్ అవకాశాలు దాదాపు లేనట్టే. రీ ప్రింట్ ను ఇప్పటి పాఠకులు ఆదరిస్తారో లేదోననే సందేహం!

ఇంత మంచి నవల గొప్ప అనువాదకుడి కృషితో ఎప్పుడో తెలుగులోకి వచ్చినా... అది రీ ప్రింట్ అవడానికి పబ్లిషర్లు తటపటాయిస్తున్నారంటే ఎంత శోచనీయమో కదా!

గీతా రామస్వామి గారు ‘ఈ పుస్తకం గురించి ఇప్పటివరకూ అడిగింది మీరొక్కరే!’ అని కూడా అన్నారు. అయితే... పాఠకులు ఎక్కువమంది అడిగితే ప్రచురించే అవకాశం ఉందంటూ కాస్త ఆశలు కల్పించారు!

అదండీ సంగతి...! ఈ బ్లాగ్ టపాను వేదికగా చేసుకుని అయినా ఎక్కువమంది పుస్తకాభిమానులు భూమి నవల కావాలని అడిగితే... దాన్ని HBT వాళ్ళకు చూపించి, ‘ఇప్పుడు రీ ప్రింట్ చేస్తారా? లేదా?’ అని నిలదీయొచ్చు! ఏమంటారు?

సుజాత వేల్పూరి said...

డియర్ పద్మవల్లిగారూ,
థాంక్యూ! మీరన్నట్లు ఇంగ్లీష్ వెర్షన్ దొరికితే అయినా చదవండి. కానీ సహవాసి అనువాదాలైతే నాకు ఇంగ్లీష్ వెర్షన్ కంటే తెలుగు వెర్షనే నచ్చుతుంది. అనితికం టపాలో కామెంట్ కూడా చూశాను. బిజీగా ఉండి అన్నింటికీ స్పందించలేకపోతున్నాను. క్షమించాలి.

వేణు గారూ,
శ్రమ తీసుకుని పబ్లిషర్స్ ని సంప్రదించినందుకు థాంక్యూ!

పద్మవల్లి said...

సుజాత గారూ

నా కామెంట్ కి జవాబు లేట్ గా ఇచ్చినా/ ఇవ్వకపోయినా పరవాలేదండీ. మిగతా పనులుండవా మనకి. అర్ధంచేసుకోగలను. కాకపోతే మొదటి కామెంట్ కదా అని అడిగాను, టపా పడ్డ ఆర్నెల్లకు .. అన్నట్టుగా పెట్టాను కదా.
ఈ కామెంట్ మీరు పబ్లిష్ చెయ్యొద్దు. ఇది మీకు పర్సనల్గా రాస్తున్నది, ఎందుకంటే చాలా రోజులనించీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి.

మీ బ్లాగ్లో మీరు మీ జర్నలిజం అనుభవాలు రాస్తున్న కాలం నుండీ చదువుతున్నాను. మీ టపాలు, ముఖ్యంగా మీరు రాసే పుస్తక సమీక్షలు/అభిప్రాయాలు, చాలా నచ్చుతాయి. నా భావాలకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి, కాకపోతే మీ అంత అందంగా చెప్పగలిగే కళ నాకు లేదు. అందుకే అంత అందమయిన భావాలకి తగినట్టు, అంత అందంగా కామెంట్ పెట్టలేక, పెట్టి వాటి అందాన్ని తగ్గించే పని చెయ్యలేక, ఎపుడూ కామెంట్ పెట్టలేదు. ఇలా మీ బ్లాగ్కి మూగ అభిమానినన్న మాట. ఇన్నాళ్ళకి ఇలా ధైర్యం చేశాను.
మీరు రాసిన "కృష్ణా నీ బేగనే బారో .. " colonial cousins టపా నా ఫ్రెండ్స్ అందరికి పంపించాను. నా కొడుకు కూడా అదే వయసు, అదే చిలిపితనం , అల్లరి. ఆ వీడియొ చూస్తే కన్నీళ్ళు ఆగేవి కాదు. మీ బరువు- బాధ్యతలు, నా బరువు బాధ్యతలతో పోల్చుకొని నన్ను నేను వోదార్చుకున్నాను. మీరు కాన్సాస్ లో వండిన టన్నుల కొద్దీ పులిహార గురించి చదివినప్పుడు, మీలాగే నేను క్రిందటి పదేళ్ళలో చేసిన ట్రక్కుల లోడ్ల పులిహారలు, ఫ్రైడ్ రైస్లూ, బిలియన్ల కొద్దీ గారెలూ, ఇంకా కొంచెం ముందుకి వెళ్లి మిగతా వాళ్ళతో చెయ్యించినవీ గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నా. (మా గుళ్ళో కుంచుం వాలంటిరింగ్ వెలగబెట్టాను లెండి) ,
సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా గురించి, MS రామారావు గారి చాలిసా గురించి , మీ అమ్మాయి కీర్తన చేసిన కామెంట్ మా పిల్లలకి చెప్తే , ఫ్రెండ్స్ కి చెప్తే చాలా నవ్వుకున్నారు.
అన్నట్టు, మీ నరసరావుపేట పేట్రియాట్స్ గురించి మొన్ననే నా ఫ్రెండ్ కి చెప్పాను. తను కూడా నర్సారావుపేట, నాకు ఆంద్ర యునివర్సిటీలో క్లాస్ మేట్స్ (ఇద్దరున్నారు). చాలా excite అయ్యాడు తెలిసి.

మీ టపాలు, కామెంట్స్ చదివి, చదివి నాకు మీరు అసలు తెలియదు అనిపించదు. చాలా దగ్గరి ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
అభిమానంతో, అభినందనలతో
పద్మవల్లి

సుజాత వేల్పూరి said...

డియర్ పద్మవల్లి గారూ,
మీ కామెంట్ ని భద్రంగా దాచుకున్నాను.థాంక్యూ!

Kalpana Rentala said...

సుజాత,
మంచి పుస్తకాల్ని, అందరూ మరిచిపోయిన పుస్తకాల్ని పరిచయం చేయటం లో మీకు మీరే సాటి. ఎప్పుడో చదివిన పుస్తకాన్ని ఈ విధంగా మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

Unknown said...

madam meerevaro naaku theliyadu kaanee mee pusthaka parichayaalu chusthonte aa pushakaalannee chadivesthunnatle anipisthondi... jeevitham intha madhuramgaa koodaa vuntundaa anettu!... chaalaa panchukovaalanundi meetho...,kaanee MAAA..AATHALU RAAVATHLE...! SHYAMSUNDER.MADIRAJU,HYDERABAD.

Post a Comment