పుస్తకావిష్కరణ సభలంటే నాకు భయం! ఏం చేస్తాం పూర్వానుభవాలు ఆ విధంగా ఉన్నాయి మరి! కానీ, జానపద నవలా సమ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు మూడు ఒకేసారి ఆవిష్కరిస్తున్నామని ఆహ్వానం రాగానే ఎలాగైనా వీలు చేసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నిన్న సాయంత్రం అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది ఈ ఆవిష్కరణ సభ! చందమామ పత్రిక మీద ప్రేమాభిమానాలతోనూ,జానపద సాహిత్యం మీద ఇష్టంతోనూ వచ్చినవారే సభికులంతా!పైగా ఈ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలుండవని నిర్వాహకులు ముందే హామీ ఇవ్వడం తో వెళ్లడానికి సంకోచం లేకపోయింది.:-))
చందమామ, బొమ్మరిల్లు పత్రికల్లో ఎన్నో జానపద కథల్ని సీరియల్స్ ని అజ్ఞాతంగా రాసి మరణానంతరం అభిమానుల చొరవ వల్ల లోకానికి వెల్లడైన మహానుభావుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం!
ఒక కథో కవితో వ్యాసమో పత్రికల్లో పడితే మామూలు మనుషుల మైన మనం ఎంతోమందికి ఆ విషయాన్ని చెప్పుకుంటాం! లింకులు పంపుకుంటాం! ఆ విజయోత్సాహంతో కనీసం పది రోజుల పాటు తొమ్మిదో నంబర్ మేఘమెక్కి కూచుంటాం.(cloud 9 అని చెప్పాలనీ..) కానీ అసంఖ్యాక కథలూ, అద్భుతమైన సీరియల్సు, పుంఖానుపుంఖాలుగా సాంఘిక కథలూ రాసి కూడా జీవితమంతా తనెవరో ప్రపంచానికి తెలియాలన్న కోరిక లేకుండా జీవించిన మనిషి ఒకరుంటారని దాసరి గారి గురించి తెలుసుకునే దాకా నేను ఊహించలేదు. ఆయనకు అలా ఉండగలగడం ఎలా సాధ్యమైందో కూడా అంతు పట్టదు!
అయితే...చందమామ అంటే పడి చచ్చే అభిమానులు (అభిమానులూ..ఏమీ అనుకోకండి..)ఊరుకుంటారా?ఆయన చరమాంకంలో ఆయన ఎక్కడుంటారో తెలుసుకున్నారు. కలుసుకున్నారు కూడా! ఆయన్ని నలుగురి మధ్యకూ తేవడానికి ఒప్పించేవారేమో కానీ ఈ లోపే ఆలస్యమై ఆయన దివికేగారు.
ఆ తర్వాత ఆయన జానపద నవలల్ని,ఇతర రచనల్ని సేకరించడం,వాటిని తిరిగి అచ్చు వేయడం అభిమానులు చేసిన పని. ఇందులో పాలు పంచుకున్న వారి గురించి రాయాలంటే ఒక్కొక్కరికీ ఒక్కో టపా అవసరమవుతుంది. శ్రీ దాసరి వెంకట రమణ,శ్రీ వేణు,శ్రీ v3 రమణ, శ్రీ దాసరి రామచంద్ర రావు, శ్రీ వివిన మూర్తి, వసుంధర దంపతులు! ఇంకా మరెందరో!
అలా ...ఈ పుస్తకాలు సిద్ధం అయ్యాయి! వాటిని బాల సాహిత్య పరిషత్ నిన్న ఆవిష్కరించింది. వందల కొద్దీ కథలు చందమామకు రాసిన వసుంధర దంపతులు, బొమ్మరిల్లు సంపాదకుడు విజయబాపినీడు,వాసిరెడ్డి నారాయణ రావు ఆవిష్కర్తలు!
చెన్నై నుంచి వచ్చిన ఆత్మీయ అతిథి(చందమామ అసోసియేట్ ఎడిటర్) శ్రీ రాజశేఖర రాజు గారు!
1947 చందమామ తొలి సంచికలో కథ రాసిన శ్రీ అవసరాల రామకృష్ణా రావు గారు ఈ సభకు రావడం నాకు చాలా సంతోషన్నిచ్చింది. మేథ మే ట్రిక్స్ నిర్వాహకులుగా,గొప్ప లెక్కల మాష్టారుగా నాకు ఆయనంటే ఎంతో గౌరవం. నిన్న పరిచయం చేస్తే నమస్కారం పెట్టి ఊరుకున్నాను.
"మీరంటే నాకు అభిమానమండీ"అనో "మీరు భలే రాస్తారండీ" అనో అంటే ఫూలిష్ గా ఉంటుందనిపించి...! ఆయన లెక్కల నవల గణిత విశారద.గురించి నేను నా బ్లాగులో రాశాను కూడా!
ఇంకా ఈ సభకు ధనికొండ హనుమంతరావు గారి కుమారుడు శ్రీ ధనికొండ శ్రీధర్,చిత్రకారుడు శ్రీ చంద్ర, శ్రీ రామవరపు గణేశ్వర రావు,మంచిపుస్తకం సురేష్,గురు తుల్యులు శ్రీ వేదాంత సూరి ఇంకా అనేకమంది వచ్చారు.(వారిలో చాలామంది నాకు తెలీదు)
బ్లాగుల నుంచి భండారు శ్రీనివాసరావు,సీ బీ రావు,వేణు,జ్వాలా నరసింహారావు గార్లు వచ్చారు.
ఈ మంచి పుస్తకాలని బయటికి తీసుకొచ్చే బాధ్యత భుజాల మీద వేసుకుని, అనుక్షణం శ్రమించి,అందంగా ముద్రించి, కార్యక్రమంలో మాత్రం కనీసం వేదిక సమీపానికి కూడా రాకుండా పుస్తకాలు సర్దుకుంటూ కూచున్న రచన శాయి గారిని చూస్తే ఏమనాలో తెలీలేదు. ఈయన కూడా దాసరి గారు లాంటి మనిషే అనిపించింది!
చిత్ర కారుడు చంద్ర
ఎప్పటికీ దొరకవని అనుకున్న పుస్తకాలివి. వీటిని సాధించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది వాహినీ బుక్ ట్రస్టు. మూడు పుస్తకాలూ కలిపి (అగ్నిమాల,మృత్యులోయ,దాసరి సుబ్రహ్మణ్యం కథలు)360 రూపాయలకే అందిస్తోంది.
మీ కోసమూ, పిల్లల కోసమూ కొని దాచుకోవలసిన పుస్తకాలు!
దాసరి సుబ్రహ్మణ్యంగారి ఈ మూడు పుస్తకాలూ వాహిని బుక్ ట్రస్ట్ వద్ద లభ్యం! ప్రముఖ పుస్తకాల షాపుల్లో కూడా!
మీలో ఎవరివద్దనైనా అలనాటి జానపద సాహిత్యం పాకెట్ పుస్తకాల రూపంలో ఉంటే వాటిని తిరిగి ముద్రించేందుకు బాల సాహిత్య పరిషత్ కృషి చేస్తుంది.!
పంచుకునే వారుంటే ముందుకు రండి
15 comments:
ఈ పుస్తకావిష్కరణ సభలో- ‘ప్రఖ్యాత రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు’ అంటూ ‘వసుంధర’ పరిచయ వాక్యాలు మొదలుపెట్టారు. నాకైతే ప్రఖ్యాత బదులు ‘అజ్ఞాత’ అని వినపడింది! పొరపాటున విన్న మాట కూడా అర్థవంతమే కదా!
ఈ మూడు పుస్తకాల ప్రత్యేకత ఏమిటంటే... ఎన్నో అన్వేషణల తర్వాతే ఆచూకీ లభించిన రచనలివి. ముఖ్యంగా ‘అగ్నిమాల’ దొరకుతుందేమోనని రచయిత దాసరి గారు చాలా ఎదురుచూశారు. ఆయన కన్ను మూశాక గానీ ఇది లభించలేదు!
ఈ సభకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. దాదాపు ప్రకటించిన సమయానికే కార్యక్రమం మొదలవటం, పాఠకుల సంఖ్యకంటే మించి రచయితలుండటం! :)
యావండోయ్, ఇలాంటి కార్యక్రమాలు అయిపోయాక కాకుండా ముందే చెప్తే మేమూ వద్దుము కదా!
మొత్తానికి పుస్తకాలు కొనుక్కోవాలంటారు! సరే, కొనేస్తే పోలా!
"మీరంటే నాకు అభిమానమండీ"అనో "మీరు భలే రాస్తారండీ" అనో అంటే ఫూలిష్ గా ఉంటుందనిపించి.....
మరే, గొప్ప వారు ఎదురైనపుడు మన ఎక్సైట్మెంట్ అంతా ప్రదర్శితే అందర్లో మనమూ ఒకరమైపోతాము!
మంచి పుస్తకాల గురించి మంచి టపా! తప్పకుండా చదువుతానండీ
మీరు ఒక్కరోజు ముందు చెప్పి ఉంటే ఈ సభకు వచ్చి ఉండేవాణ్ణండి. నా వద్ద బొమ్మరిల్లు చిన్నపుస్తకాలలో రచయితలు లేనివాటి లిస్టు శాయి గారికి పంపుతాను.
Thanks a lot for this info! I am gonna buy these for my wife!
హైద్ లో ఈ వాహిని ఎక్కడుందండీ?
can u kindly mail vahini book trust adress nd phone no to this mail id mam-joyd1961@gmail.com[please]
సుజాత గారూ,
వీటి గురించి నాకు ఏమీ తెలీకపోయినా జానపదాలు నాకు చాలా నచ్చుతాయి. ఈ పుస్తకాలు ఇప్పుడు కొనుక్కుంటేనే దొరుకుతాయంటారా.. లేకపోతే తీరిగ్గా ఇండియా వచ్చినప్పుడే కొనుక్కోవాలనుకున్నా దొరుకుతాయంటారా?
@ RK, and Astrojoyd,
Here it is.....
వాహినీ బుక్ ట్రస్ట్,
1-9-286/పి/2విద్యా నగర్
హైదరాబాదు
ఫోన్ :040-27071500
నీలాంచల,
ఈ కార్యక్రమం గురించి పుస్తకం. నెట్ లోనూ, ఇతర బ్లాగుల్లోనూ వచ్చిందండీ!మీరు చూడలేదనుకుంటాను.
రవి గారూ,
ఈ కార్యక్రమం గురించి వేణువు బ్లాగులో వచ్చిందండీ!అక్కడ మీరు వ్యాఖ్య కూడా రాశారు గానీ టపా చివర్లో ఉన్న కార్యక్రమం వివరాలు సరిగా చూసి ఉండరనుకుంటాను.
మిమ్మల్ని అడగాలని మేము అనుకున్నాం లెండి! థాంక్యూ
మధురవాణీ,
ఎప్పుడైనా కొనుక్కోవచ్చు! మీరు ఇండియా మరీ ఏ రెండేళ్ళ తర్వాతో వస్తే దొరక్క పోవచ్చు. తీసి ఉంచమంటే ఉంచుతాను
అపురూపమైన కధలివి . తొందరగా కొనుక్కుని చదవాలి.
సుజాతా, 'తీసి ఉంచడమనే' ఆప్షన్ ఒక్క మధురకేనా? (ఇక్కడ మొహమాటంగా చేతులు నలుపుకుంటున్న నన్ను ఊహించుకోండి) :))
నిషి,
నా దగ్గర మీకు "డిమాండ్" చేసే చనువుందని నేననుకుంటున్నానే! అయినా ఇంకా చేతులు నలుపుకోడం నాకు ఆశ్చర్యం! నిఝ్ఝంగా తీసి ఉంచమంటే ఇవాళే తీసి ఉంచుతాను.
"ఆయనకు అలా ఉండగలగడం ఎలా సాధ్యమైందో కూడా అంతు పట్టదు!"
అదే నాకూ అర్థం కాదు. ఒక టపా రాస్తేనే గంటకొక సారి ఎవరేమన్నారు, ఎవరేం రాశారు అని చూసుకుంటా. దాసరి లాటి వాళ్ళు కోటి కొకళ్ళు.
మంచి పరిచయం. చందమామ లోని కథలు అంటే ఇక తప్పక చదవాల్సిందే. ఎప్పుడో ఆ మహాభాగ్యం . చూడాలి.
సుజాత గారూ, చాలా గొప్పగా వర్ణించారండీ! నిజంగా ఆ నాటి ఆ సభకు మా లాంటివారిని కూడా పిలవడం మా అదృష్టం. అదొక అపురూప మహానుభావుల సంగమం. అక్కడ మా లాంటి వాళ్లం కూడ కొందరుండడం కేవలం సాయి గారి లాంటి వారి వల్లే కలిగింది. జ్వాలా నరసింహారావు
Post a Comment