January 31, 2011

మన తర్వాత...ఆస్తులు సరే,...మరి వీటి సంగతేంటి?




ఎంతో కొంత ఆస్తులూ పాస్తులూ సంపాదించిన వాళ్ళందరికీ వాటిని పంచుకోడానికి పిల్లలో చుట్టాలో ఉంటారు. నగలూ,డబ్బూ,స్థలాలూ పొలాలూ వీటన్నింటినీ క్లెయిం చేసుకునే వాళ్ళుంటారు. ఇంకా ఇంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళుంటారు. మరి మనం పోగేసిన పుస్తకాలెవరు తీసుకుంటారు? ఎవరికి కావాలవి?

మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పటెప్పటివీ మాస పత్రికలూ(విజయ,యువ,జ్యోతి, వనిత, మహిళ మొదలైనవి)పాత నవలలూ,ఎప్పటివో డెబ్భైల్లోని వారపత్రికలూ, భారతులూ కట్టలు కట్టలు ఉండేవి.అప్పట్లో వాటి విలువ తెలీదు. తెలిసే సరికి అవి పర హస్త గతమైపోయాయి. మా అమ్మకు మరీ మొహమాటమెక్కువ!

నా సంగతే కాదు, మంచి పుస్తకాలు సేకరించి మంచి గ్రంథాలయాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవాళ్ళంతా ఈ సంగతి ఆలోచిస్తారంటారా? "నా తర్వాత నా లైబ్రరీ సంగతేంటి, ఎవరు చూస్తారు దాన్ని? ఈ పుస్తకాలన్నీ ఎవరు భద్ర పరుస్తారు?ఏం చేస్తారు వీటిని" అని మీలో ఉన్న పుస్తక ప్రియులంతా ఆలోచిస్తుంటారా?

అప్పుడప్పుడు ఈ ఆలోచన వస్తుంటుంది నాకు. మా పాప తెలుగు చదవగలిగినా ,నా పుస్తకాలన్నింటినీ తనూ అంతే శ్రద్ధతో ప్రేమతో కాపాడుతుందని నాకేం నమ్మకం లేదు. నాలాంటి సందేహం మనలో చాలామందికి ఉండొచ్చు!



ఆ మధ్య విజయవాడ వెళ్ళినపుడు వంశీ బుక్ స్టోర్స్ (వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల ) జగన్మోహన రావు(నాగేశ్వర రావు)గారితో మాట్లాడుతుంటే ఈ విషయమే ప్రస్తావించారు ఆయన. "కొంతమంది శోత్రియ బ్రాహ్మణ కుటుంబాల్లో ఎంతో అద్భుతమైన ప్రాచీన సంప్రదాయ సాహిత్యం ఉంటుందమ్మా! కానీ వాటిని అన్నాళ్ళూ కాపాడిన వ్యక్తులు పోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి వాటి విలువ తెలీక ఎవరడిగితే వాళ్ళకిస్తారు. లేదా పాత పేపర్ల వాళ్ళకి కిలోల్లెక్కన అమ్మేస్తారు. లేదా "నాన్న గుర్తు" అనో "తాతయ్య జ్ఞాపకం" అనో దాన్ని చెదలు పట్టేదాకా దాచి, పొడి పొడిగా రాలిపోయాక చింతించి బయట పారేస్తారు తప్ప వాటిని అందరికీ అందుబాటులోకి తెద్దామనే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రావడానికి వాటి విలువ వాళ్ళకు తెలీదు" అన్నారు.


అలాంటి విలువైన పుస్తకాలెన్నో "స్క్రాప్" కింద రాజమండ్రి పేపర్ ఫాక్టరీకి తరలి పోతున్నాయని బాధపడ్డారు ఆయన. అందుకే పాత పేపర్లు కొనే హోల్ సేల్ వ్యాపారుల వద్దకు ఆయన తన కుర్రాళ్ళని పంపిస్తూ ఉంటారట...వాటిలో కల్సి విలువైన పుస్తకాలేమైనా తుక్కు కింద కలిసిపోతున్నాయేమో అని! ఈయన్ని చూసినపుడల్లా ఆశ్చర్యానికి గురైపోతుంటాను నేను,.

ఒక పాత పుస్తకాల వ్యాపారి దృక్పథం కంటే ఒక కళా ఖండాల సేకరణ కర్త ధోరణి కనిపిస్తుంది. ఎంతో మంది రచయితలతో పరిచయాలు. ఎన్నెన్నో పుస్తకాల గురించి అపారమైన అవగాహన, అభిరుచి! కేవలం పుస్తకాలు అమ్మడం, వాటి వివరాలు దగ్గర పెట్టుకోవడమే కాదు,శ్రద్ధగా చదువుతారు కూడానూ! మొన్నొకసారి నేనొక పుస్తకం అడిగితే "ఉందమ్మా నా దగ్గర, నేను చదువుతున్నాను,. వచ్చేవారం రండి" అని చెప్పారు.




అక్కడే ఉన్న మరి కొన్ని షాపుల వాళ్ళు కేవలం తమ దగ్గర ఉన్న పుస్తకాలు అమ్మడం తప్ప, ఆ పుస్తకం తాలూకు గత చరిత్ర,రచయిత తాలూకు వర్తమానం ఇవేవీ తెలుసుకోవాలనుకోరు. నిజానికి ఆ అవసరం వాళ్ళకి లేదు కూడానూ!



అలాగే వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు కట్టలు కట్టలుగా పడేసి ఉంచడమే తప్ప,వాటిని బైండ్ చేసి, చక్కని ఫ్లోరసెంట్ ఆకుపచ్చ కాగితం అంటించి,దాని మీద పుస్తకం పేరు,రచయిత వివరాలు రాసి ఉంచడం, సబ్జెక్టుల వారీగా సర్ది ఉంచడం ఇవన్నీ జగన్మోహనరావుగారు చేసినట్లు ఇంకే షాపు వాళ్ళూ చేయడం గమనించలేదు. ఏ పుస్తకం ఎన్ని ఎడిషన్లు పడిందీ,ఏ ఎడిషన్లలో ఎక్కువ తప్పులున్నాయి,ఇలాంటి వివరాలు కూడా అలవోగ్గా చెప్పేస్తుంటారాయన!

చాలా మంది రచయితలు రాసేయడమే తప్ప వాటిని భద్రపరుచుకోరు. (కొ.కు,దాసరి సుబ్రహ్మణ్యం,ఆరుద్ర ఇంకా అనేక మంది రచయితలు ఈ కోవలోకి వస్తారు)రచయితల వద్ద కూడా లేని వారి వారి పుస్తకాల జాడ జగన్మోహనరావు గారి దగ్గర ఉంటుంది. రచయితలే ఫోన్ చేసి "నా ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అని అడగడం నాకు తెలుసు.



తన దగ్గరకు పుస్తకాల కోసం వచ్చేవారిని చూసి వారి అనుభవాలేమిటో గ్రంథస్థం చేయాలనీ కోరికతో "గ్రంథ సేకరణ" చేసేవారి అనుభవాలను రికార్డ్ చేయడానికి ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. అందులో ఆయన దగ్గరికొచ్చేవారు తాము ఫలానా పుస్తకం కోసం ఎంత శ్రమపడిందీ,గ్రంథ సేకరణలో వారి అనుభవాలేమిటీ ఇలాంటి ఆసక్తికర విషయాలు రాస్తుంటారు.

ఇటీవల జగన్మోహనరావుగారికి మరొక ఆలోచన వచ్చింది.పుస్తక ప్రేమికులు వందల సంఖ్యలో పోగేసిన పుస్తకాల భవిష్యత్తు ఏమిటి? వీరి తర్వాత ఆ పుస్తకాలనెలా కాపాడాలి? అందుకే తన వద్దకొచ్చే వారి నుంచి మరికొన్ని వివరాలు సేకరించడం మొదలుపెట్టారు.ఇప్పటివరకూ వారి వద్ద ఎన్ని పుస్తకాలున్నాయి?ఏ యే పుస్తకాలు ఇంకా సేకరించాల్సి ఉంది? ఇంకా మొత్తం ఎన్ని పుస్తకాలు కొనే ఆలోచన ఉంది? మీ తర్వాత ఆ పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి ఇచ్చే ఆలోచన ఉందా?

అరుదైన పుస్తక సంపద కొందరి వద్దనే కేంద్రీకృతమైపోగూడదనీ, అది పుస్తక ప్రేమికులందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆకాంక్ష! అందుకే కథా నిలయం లాగా, ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు!

ఇంతటి శ్రద్ధ ఉండబట్టే కాబోలు గ్రంథాలయ ఉద్యమ సారథి వెలగా వెంకటప్పయ్య గారి అవార్డ్ ఆయనకు ఇటీవల ఇచ్చారు.

ఇలాంటి గ్రంథాలయం స్థాపించే ఆలోచన ఎవరికైనా ఉంటే నా వీలునామాలో ఆస్థీ పాస్తీ,కొంపా గోడూ,పొలమూ పుట్రా,నగలూ గిగలూ ఎవరికి రాసినా పుస్తకాలు మాత్రం వాళ్ళకే రాస్తా! పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలి! వాటికి మరణం ఉండకూడదు. మరణించే పరిస్థితిలో ఉంటే,తిరిగి ముద్రించే అవకాశం లేకపోయినా వాటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందించాలి.

మహా రచయితలు,కవుల పిల్లలకు ఎంతో కొంత సాహితీ సువాసనలు అబ్బి ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ తండ్రుల గ్రంథాలయాలను కొంత వరకూ కాపాడతారనుకుందాం! మరి వాళ్ళ పిల్లలు?
ఆ పిల్లల పిల్లలు?
ఆ తర్వాత తరం?
చెప్పలేం? ఏం చేస్తారో ఆ పుస్తకాలని!

అందుకే ఇంటి గ్రంథాలయాల వారసత్వాన్ని కాపాడి,అరుదైన పుస్తకాలను భద్రపరిచి ముందు తరాలకు అందుబాటులో ఉంచాలంటే జగన్మోహనరావు గారి మెదడులో మొలిచిన ఆలోచనకు ప్రాణం పోయాలి.అటువంటి లైబ్రరీ ఒకటి ఉండాలి.

ఇంతకీ మీ మీ లైబ్రరీల గురించి మీరేం ఆలోచిస్తున్నారు?



31 comments:

కృష్ణప్రియ said...

Good question.. నా దగ్గర ఉన్న పుస్తకాలు,.. ఎవ్వరూ అడగరు :-( ఎవ్వరికీ.. ఇంటరెస్ట్ లేదు.. మిత్రులు ఆసక్తి గా గమనించినా.. ఆంగ్ల పుస్తకాలు మాత్రమే తీసుకెళ్తారు. మీరన్నట్టు మా పెద్ద పాప కాస్త చదివినా.. అవన్నీ చదువుతుందని, సం రక్షిస్తుందని అపోహలూ లేవు.

అప్పుడప్పుడూ ఏమవుతాయి అనిపించినా.. చాలా కాలం ఉందిగా అని ఆ ఆలోచనని పక్కన పెడుతూ ఉంటాను.

రవి said...

సరిగ్గా మీకు వచ్చిన ఆలోచనే నాకూ వచ్చి ఓ టపా రాశాను. ఒకరోజు లేటు అవడంతో చికాకు పుట్టి వదిలేశా.

మా మావయ్య ఓ పెద్ద పుస్తకాభిమాని. అనేక పుస్తకాలు సేకరించారు. ఆయన తర్వాత ఇప్పుడు ఎవరికీ ఆ పుస్తకాల విలువ తెలియట్లేదు. నా పరిస్థితి అంతేనేమో! (నా దగ్గర కొన్ని అరుదైన చందమామలు, వావిళ్ళ ప్రెస్సు వారివి దొరికాయి)

Indian Minerva said...

మంచి ప్రశ్నే... నా దగ్గర అంత అరుదైనవేమీ లేవుగానీ. అప్పుడప్పుడు నాకూ అనిపిస్తుంది వీటిని నేను చూసుకున్నంత ముద్దుగా ఇంకెవరైనాకూడా చూసుకుంటే బాగుంటుందికదా అని. మా అమ్మాయిలక్కూడా పుస్తకాల పిచ్చి పట్టించేస్తే సరిపోతుంది అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. అయినా వాళ్ళు పుస్తకాల్ని కాపాడుకోగలరేగానీ వాటితో నాకున్న అనుబంధాన్ని కాదుగా, వాటి గురించిన నా జ్ఞాపకాల్ని కాదుగా :(

వేణు said...

వ్యక్తిగత అభిరుచితో ఇష్టంగా కొనుక్కున్న పుస్తకాలు ‘నా తర్వాత ఏమవుతాయి?’ అనే ప్రశ్న పుస్తక ప్రేమికులకు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది. అన్ని వసతులూ ఉండి, శ్రద్ధగా కాపాడే గ్రంథాలయాలకు వాటిని ఇచ్చెయ్యటం అనేది మెరుగైన ఆప్షన్.

ఆరుద్ర ఇలాగే చేశారు. తాను జీవించివుండగానే తన వేల పుస్తకాలను హైదరాబాద్ లోని ‘సుందరయ్య విజ్ఞాన కేంద్రాని’కి అప్పగించేశారు!

విలువైన పుస్తకాలు రాజమండ్రి పేపర్ ఫ్యాక్టరీకి స్క్రాప్ కింద తరలిపోతున్నయంటే బాధ వేస్తోంది. ఈ ప్రమాదం ఆపటానికి కథా నిలయం లాగా ‘పుస్తక సేకరణల నిలయం’ ఉండాలనే జగన్మోహనరావు గారి ఆలోచన ఎంతో బాగుంది. అయితే ఇలాంటి నిలయాలకు కాలం గడిచేకొద్దీ ‘చోటు సమస్య’ తప్పనిసరిగా ఎదురవుతుంది. డిజిటలైజ్ చేయటమో, మైక్రో ఫిల్ముల్లాగా భద్రపరచటమో చేయాలంటే దానికి విస్తృతంగా వనరులు అవసరమవుతాయి!

రమణ said...

మంచి టపా. ఇటువంటి ఆవేదన గురించి మధురాంతకం రాజారాం 'హాలికులు కుశలమా' కధలో బాగా చిత్రించారు.
అందులో వలెనే ఒక మంచి పాఠకుడిని పట్టుకోవటం లేక గ్రంధాలయానికి ఇచ్చివేయటం చేయగలగాలి.

కొత్త పాళీ said...

ఫొటో చూస్తూనే ఇతను నాగేశ్వర్రావు కదా అనుకున్నా. కాకపోతే నేను కలిసిన్ రెండు మూడు సార్లూ బాగా బారెడు గడ్డంతో ఉన్నారు. భలే విచిత్రమైన వ్యక్తి. పుస్తకం కొనడానికి వచ్చిన వ్యక్తిని ఒక్క చూపుతో బేరీజు వేస్తాడు. వాళ్ళు అడిగిన పుస్తకానికి అడిగిన వాళ్ళు తగరు అనిపిస్తే మొహమాటంలేకుండ పుస్తకం లేదు అనేశ్తాడు.
మీ అసలు ప్రశ్నకి సమాధానం - నా తరవాత ఏమి జరిగితే నాకేమి? ఊపిరుండగా సంపాయించిన పుస్తకాలన్నీ ఒహమాటన్నా చదవగలనా అని ఇప్పుడిప్పుడే డవుటొస్తున్నది.

kanthisena said...

నాకయితే ఇలాంటి సమస్య ఎదురయితే వెంటనే మీ హైదరాబాదులోనే ఉన్న మన శ్యామ్ నారాయణ్‌ని అడిగితే పోలా అనిపిస్తుంది. ఆకాశానికి గుంజలు లాగా, పుస్తకాలు, పాటలు, సంగీతం.. ఇలా తన దృష్టిలో పడిన ప్రతి అంశాన్ని వాటి చరిత్రమూలాల్లోకి వెళ్లి పట్టుకుని ప్రపంచానికి డిజిటల్ రూపంలో అందిస్తున్న సజీవ మహర్షి ఈయన. వంద ఎంబీ సమాచారం కావాలని అడిగితే ఇవ్వను.. వంద జీబీ సమాచారం అడిగితే మాత్రమే ఇస్తాను అని 30 ఏళ్లుగా తాను సేకరిస్తూ వస్తున్న అమూల్య సమాచారాన్ని వందల జీబీల కొద్దీ అడిగిన వారికల్లా పంచిపెడుతున్నారు. వ్యక్తిగా తను చేస్తున్న పరిశోధనా స్థాయి కృషి యూనివర్శిటీలలో కూడా జరగలేదనిపిస్తుంది. పుస్తకాలే కాదు మన నిజమైన ఆస్తులను ఇలాంటి వారి చేతుల్లో కూడా పెట్టి నిశ్చితంగా ఉండవచ్చు.

yahoo said...

eppati yuvathaku kagithapu pustakalakanna online e buks ne estapaduthunnaru so e books ne online lo pedithe manchidani na abiprayam

Anonymous said...

మంచి టాపిక్, చక్కటి పోస్ట్. కీప్ ఇట్ అప్. :)

సుజాత వేల్పూరి said...

కృష్ణ ప్రియ,
నిజమేనండీ! మన అభిరుచులు పిల్లలు కొనసాగించాలనేం లేదు. వారి అభిరుచులు వారికుండాలి కానీ మనవి కొనసాగించమని బలవంతమూ చేయలేం కాబట్టి మన ఏర్పాట్లు మనం చేసుకోవాల్సిందే పుస్తకాల విషయంలో!

రవి గారూ,
చూడబోతే ఆ లైబ్రరీ ఏదో మనమంతా కల్సి ప్రారంభిస్తే బాగుండేలా ఉంది.:-))

సుజాత వేల్పూరి said...

Indiann minerva,

అయినా వాళ్ళు పుస్తకాల్ని కాపాడుకోగలరేగానీ వాటితో నాకున్న అనుబంధాన్ని కాదుగా, వాటి గురించిన నా జ్ఞాపకాల్ని కాదుగా :(

ఖరెక్టుగా, వంద శాతం నా పాయింట్ కూడా ఇదే!

వేణుగారూ,

చోటు సమస్య గురించి మీరు చెప్పిన పాయింట్స్ పట్టించుకోదగ్గవి. బోల్డు పుస్తకాలున్నవాళ్ళు
ఆరుద్ర లాగే చెయ్యగలగాలి.

రమణ గారూ,
నిజమే, ఇచ్చి వేయగలగాలి. అందుకు సిద్ధమయ్యే పుస్తకాలు కొనగలగాలి.

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ,
నాగేశ్వర్రావు గారు మీకూ పరిచయమేనన్నమాట!:-)

మీ దగ్గర మీరు మొత్తం చదవలేనేమో అని భయపడేన్ని పుస్తకాలున్నాయన్న మాట. "నా తర్వాత ఏమి జరిగితే నాకేమి" అని నేను ఆస్తీ పాస్తీ విషయంలో అనుకోగలుగుతున్నాను గానీ పుస్తకాల విషయంలో అనుకోలేకపోతున్నా!

రవి,
మీరన్నట్లు కొన్నాళ్లకి ఆన్ లైన్లోనే బయటికంటే పుస్తకాలకు ఆదరణ లభించే రోజొస్తుందేమో చూద్దాం!

సుజాత వేల్పూరి said...

రాజు(నెలవంక) గారూ,

శ్యాం నారాయణ గారి కృషి ఎంచదగిందీ,అబ్బురపడవలసిందీనూ!అయితే తమ దగ్గరున్న ప్రతి పుస్తకాన్నీ సమాచారాన్నీ డిజిటలైజ్ చేసే సౌకర్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండదు. అదీ కాక భౌతికంగా అందుబాటులో ఉన్న పుస్తకాల విలువ అమూల్యమే కదా!

అలా అరుదైన పుస్తకాలను డిజిటలైజ్ చేసే సౌకర్యం మరిత అందుబాటులోకి వచ్చినపుడు ఇక అల్భ్యం అంటూ ఏదీ ఉండదు.

శ్యాం నారాయణ గార్ని తల్చుకున్నందుకు ధన్యవాదాలు

Snkr, థాంక్యూ

Vasu said...

దాచుకోడానికైనా నాకు ఇంకొన్ని పుస్తకాలు ఉంటె బావుందనిపిస్తోంది :)
నేను తెలుగు పుస్తకాలూ కొనడం చదవడం ఇక్కడి కోచ్చాకానే మొదలెట్టాను అదీ బ్లాగులు, బ్లాగరుల పుణ్యమా అని. లేకపోతె తెలుగు సాహితీ పిపాస - కొంచం బరువైంది - తెలుగు పుస్తకాలు చదవాలనే ఆశ రగిలేది కాదేమో.ఛా మీరందరూ కొంచం ముందు పరిచయం అయ్యుంటే నాకూ ఈ పాటికి ఒక చిన్న లైబ్రరీ ఉండేది కదా.

ఆ విధంగా నేను బ్లాగరులకి చాలా రుణ పడి ఉన్నాను. పుస్తకాల డిజిటైజ్ మంచి ఆలోచన. కానీ వాటి కంటే ముందు తేవికీ లోనూ ఇతరత్రా తెలుగు సైట్ లలోనూ కవుల, రచయితల సమాచారం ఇంకా చాలా ఉండాలి అనిపించింది.
పంచకావ్యాల (అంటే ఏంటో నాకూ ఈ మధ్యే తెలిసింది :( ) గురించి కూడా సరైన సమాచారం లేదు. నండూరి రామ మొహరావు గారి మీద వెతికితే అదృష్టవశాత్తు పుస్తకం లో దొరికింది వికీ లో లేదు.

బోలెడు మంది పెద్ద రచయితలవి కనీసం పేజీలు కూడా లేవు తేవికీ లో . తెలిసిన వాళ్ళు కొంచం రాస్తూ ఉంటే నా లాటి వాళ్ళకి (ఇప్పుడిప్పుడే సాహిత్యం గురించి తెలుసుకుంటున్న ) బోలెడు ఉపయోగం గా ఉంటుంది.

వాసు

ఆ.సౌమ్య said...

అబ్బ ఎంత అపురూపమైన మనిషి ఆ జగన్మోహనరావు గారు! నిజంగా ఆయనకి హేట్స్ ఆఫ్. ఒక పుస్తకాల కొట్టతనికి అన్నీ చదవాలనే పట్టు, భద్రపరచాలనే ఆపేక్ష...నిజంగా అమోఘం. ఆయనకి జోహార్లు. గ్రంధాలయ ఆలోచన ఇంకా బావుంది.

నా పుస్తకాలన్నిటినీ మా ఊళ్ళో ఉన్న గురజాడ గ్రంధాలయానికిగానీ లేదా ఏదైనా యూనివర్సిటీ లైబ్రరీకి గానీ ఇచ్చేయాలని నేనెప్పుడో నిర్ణయించేసూకున్నాను. దానికి ముందు నా పిల్లలకి, మనుమలకి వాటి విలువ తెలియజెప్పాలని, వాటిని భద్రపరిచే ఉత్సాహం కలిగించాలని అనుకుంటున్నాను. అది జరగకపోతే గ్రంధాలయాలకి ఇచ్చేస్తాను.

దాసరి వెంకటరమణ said...

సుజాత గారూ!
ప్రతి పుస్తకాభిమానీ తప్పక ఆలోచించ వలసిన అరుదైన ఆలోచనని ప్రస్తావించారు..... అభినందనలు.నిజమైన పుస్తకభిమానికి ఆ ఆలోచన మృత్యువు కంటే భయానక మైనది. కొంతమంది భరించ గలరు మరికొంత మంది భరించలేరు.
నేనూ ఈ మధ్యే విజయవాడ వెళ్ళినప్పుడు మొదటిసారిగా ప్రాచీనాంధ్ర గ్రంధమాల నాగేశ్వరరావు గారిని కలిసాను.చందమామ లు సేకరించడం పూర్తయింది. ఇక ఇప్పుడు బొమ్మరిల్లు లన్నీ సేకరిస్తున్నాను. మొన్న నాగేశ్వరరావు గారు రెండు బొమ్మరిల్లు బౌండ్స్ ఇచ్చారు.
ఆయన పుస్తకాల సేకరణ అభిమానుల వివరాలు/జాబితా లో నా గురించి రాసాను. అరుదైన బాలసాహిత్యం మొత్తం సేకరించాలనే నా ఆలోచనను కూడా అందులో రాశాను.
పైన అందరి అభిప్రాయాలూ చదివాను. నేనైతే వీలయితే మా పిల్లల్ని గానీ లేదూ భవిష్యత్తులో నా పిల్లల పిల్లలను గానీ ఎంచుకొని వారికీ పుస్తకాభిమానాన్ని నూరి పోయాలని వుంది. చూద్దాం..... ఇంకా చాలా సమయముంది.

గిరీష్ said...

nice post..,
na daggara na 10th class books ippatiki unnay..munduvi kooda konni unnay..ma intlo vallu paatha pustakaalu endukura evarikina iccheyacchu kada ataaru..na bayam entante..vaallu antha baaga chusukuntaara ani..

malli said...

పాపినేని శివశంకర్ కధ...'సముద్రాన్ని ఎక్కడ పారబోయ్యాలి?'
గుర్తొచ్చింది...బాగా రాసారు..పాపినేనీ,మీరూ....

duppalaravi said...

సుజాత గారూ, కాస్త ఆలస్యంగా ఈ పోస్ట్ చూస్తున్నాను. నిజమే. పుస్తకాలు కొని చదివే వాళ్లకు గుండె లోయలోకి జారిపోయే అనుభూతి నిచ్చే ఈ ప్రశ్న ఏదొ ఒకరోజు ఎదురయ్యి తీరుతుంది. నాగేస్వర రావు గారు ఎన్ని పనులున్నా ప్రతి ఫిబ్రవరి రెండవ ఆదివారం మాత్రం శ్రీకాకుళం లో వుంటారు. ఎందుకంటే ఆ రోజు కథానిలయం వార్షికోత్సవం. ప్రతి ఏడూ అతనిని చూస్తాం. మీరేమో స్వయంగా అక్కడికి వెళ్లారు. మరి విజయవాడలో ఆయన అడ్రసు, ఫోన్ నెంబరు ఇచ్చి పుణ్యం కట్టుకోండి.
-దుప్పల రవికుమార్

సుజాత వేల్పూరి said...

రవి గారూ, ఎన్నాళ్ళయిందో మీరుకనపడి! రెగ్యులర్ గా రాయడమే మానేశారు

ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చినా మీరు చెప్పినట్లు గుండె లోయల్లోకి జారిపడనే పడుతుంది నాకు!

లెనిన్ సెంటర్లో కాలవ పక్కనే వరసగా పాత పుస్తకాల షాపులుంటాయి! అక్కడే వీరి షాపు ఉంది. జగన్మోహనరావు గారు కథా నిలయం కబుర్లు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడూ! వారి ఫోన్ నంబరు 9849632379

leo said...

తెలుగు పుస్తకాలు యూనికోడ్ లోకి స్కాన్ చెయ్యటం ఎలాగో ఎవరికన్నా తెలిస్తే వివరాలు తెలుపగలరు.

manavaani said...

@ leo
కింది గూగులు గుంపులలో చేరి అక్కడ ఉన్న చర్చలని శోధించగలరు

http://groups.google.com/group/telugu-computing

http://groups.google.com/group/tesseract-ocr

Unknown said...

www.telugupustakalu.com


andariki chepandi idi telugu abhimanalaku idi oka vindu....

Rajesh Devabhaktuni said...

మాది విజయవాడే కావడం వలన నేను పదో తరగతి (1999 నుండి) చదివే రోజుల నుండే నాగేశ్వర రావు గారి పుస్తకాల దుకాణము గురించి తెలుసు. అయితే ఈ రోజే " భారతి " మాస పత్రిక పాత సంచికలేమైన దొరుకుతాయేమోనని ఆయన దగ్గరకు వెళ్ళాను. మొదట ఇదివరలో అవి బాగా దొరికేయని , ఇప్పుడు దొరకటం కష్టం అని చెప్పారు. నిజానికి పుస్తక ప్రియులకు ఆయన చేస్తున్న సేవ ఎనలేనిది. వెంకటప్పయ్య గారి అవార్డు అందుకోవడానికి అయన సర్వదా యోగ్యులు. అదే అవార్డు ఫ్రేం ఈ రోజు ఆయన దుకాణంలో చూసాను. అయన నాతొ కూడా " గ్రంధ సేకరణ చేసే వారి అనుభవాలు " అనే ఒక ఫారంను పూర్తి చేయించారు. ( ఇదే ఉద్దేశ్యం కోసం ఇంతకముందు ఉన్న పుస్తకాన్ని కొన్ని కారణాల వలన ఇప్పుడు వాడడం లేదని చెప్పారు ). ఎందరో గొప్ప రచియుతలతో ఆయనకు పరిచయం ఉంది, ఆయన దుకాణంలో ఇప్పటికే పూర్తి చేసిన ఫారంలు చుసిన తరువాత నాకీ విషయం తెలిసింది.

అయితే ఒక మూడు గంటల సమయాన్ని ఆయనతో, ఆ దుకాణంలో గడిపిన తరువాత, నేను బయలుదేరేముందు " భారతి స్వర్ణోత్సవ సంచిక (1974) " పై ఆయన పేరు, తేది వ్రాసి "బహుమతి" అని చెప్పి నాకందించారు. నేను డబ్బు ఇవ్వచుస్తే వద్దని వారించారు. ( ఆయన నాకు పుస్తకాలపై ఉన్న ఆసక్తిని గమనించారో ఏమో తెలియదు కాని ఆ అపురూపమైన పుస్తకాన్ని నాకిచ్చారు ). నేను చాల సంతోషించాను.

Sujata M said...

మా మావయ్య గారివి బోల్డన్ని పాత పుస్తకాలు - ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్ లవీ - రక రకాలు (బహుశా ఇప్పుడు అరుదైనవి) ఒక అట్టపెట్టె నిండా ఉన్నాయి. వీట్ని ఏమి చెయ్యాలి ? ళైబ్రరీ కి ఇవ్వడం అనేది ఖరారే గానీ ఈ విషయం లో క్రియ శూన్యం అయిపోయి - అసలాటిసంగతే మర్సిపోయి - ఈ టపా చదివితే అవే గొర్తొచ్చాయి.

netizen నెటిజన్ said...

http://goo.gl/oQCKr

"ప్రతి జీవికి ఒక ఒంటరి సాయంకాలం ఉంటుంది. ఆ సాయంకాలం ఈ పుస్తకాలే ఆమెకి సహచరులు.

అలగే ప్రతి జీవి బూడిదలో కలిసిపోవాల్సిందే.
అలా కలిసిపోయేటప్పుడు కొందరు వీలునామలు వ్రాస్తారు. ఉన్న మేడలు, బంగారం ఏ పిల్లకి ఎంత, ఏ కోడలికి ఎంత, ఈ మనవడికి ఇంత, ఈ మనవరాలికింత అన్నట్టుగానే అంత మంచి పుస్తకాలని ఒక చోటికి చేర్చి, వాటిని అనాధలుగా వదిలేయవద్దు.

అవి ఎక్కడికేళ్తే పదికాలలపాటు, ఇంకో పదిమందికి తమ సహచర్యాన్ని అందివ్వగలవొకూడా చూసుకోవాలి. మన తరువాత గూడా మన నేస్తాలని వారు జాగ్రత్తగా చూసుకుంటారు అన్న నమ్మకం కుదిరినప్పుడే, వారిని అక్కడికి పంపే ఏర్పాట్లు చెయ్యాలి."

రామ్ said...

మనసుకు బాధ కలిగించే post ఇది.అయినా చాలా అవసరమయిన post.

teenage లో ఉన్న పిల్లలు ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారో ఓ survey చేయాలి.

Anonymous said...

ఆయన్ని కలిసిన రెండు నిమిషాల్లో నన్ను ఆయనా ఆయన్ని నేనూ పుస్తకప్రియులమని పోల్చుకున్నాం. బాపుగారి అరవైలనాటి కార్టూన్లలోలా నిలువుచారల ప్యాంటూ, కట్ బనీనుతో ఆహార్యం వింతగా అనిపించింది. మొదట్లో ఓసారి ఈయన్ని ఫలనా పుస్తకం లేదన్నాకా మళ్లీ అడిగితే గొప్ప అవమానమైనట్టుగా,"నా షాపులోకి ఏ పుస్తకం వచ్చిందీ, ఏ పుస్తకం ఎవరితో వెళ్లిందీ తెలియని వాణ్ణి కాదు, ఇంకెప్పుడూ లేదని చెప్పింది మళ్ళీ అడక్కండి. నేను వెతికి పెడ్తానుకదండీ ఆ పుస్తకం" అన్నారు. ప్రింట్లో లేని ఎన్నో అపురూపమైన పుస్తకాలు ఆయన దగ్గర దొరుకుతాయి. చిలకమర్తి వారు అహల్యాబాయి హోల్కర్ గురించి రాసిన నవల, తిరుమల రామచంద్ర గారు అనువదించిన ఎన్.బీ.టీ వారి "మరల సేద్యానికి", కె.యెన్.వై.పతంజలి ఒకటా రెండా ఎన్నో వెతికి వేసారిన పుస్తకాలు ఆయన దగ్గర దొరికేశాయ్.
సుజాత గారూ మీ టపా చాలా బావుంది. మా మావయ్య గారి తండ్రి ఒకాయన ఎంతో శ్రద్ధగా అట్టలు వేసుకుని నెంబర్లు ఇచ్చుకుని(వేలసంఖ్యలో ఉన్నాయి) ఒక లైబ్రెరీలా మెయింటైన్ చేసిన పుస్తకాలు తీస్కోవడానికి ఆ మధ్య ఆహ్వానం వచ్చింది ఆయన పోయాకా చక్కా వెళ్లి ఏడాది ఏడాదీ బైండింగ్ చేసిపెట్టుకున్న "ఆంధ్రజ్యోతి", కటింగ్స్ ని అతికించి బైండింగ్ చేసిన "వడగళ్లు", బైండు చేసిన సాక్షి సంపుటాలు, బైండు రూపంలో కొన్ని భారతులు మొదలు పెట్టి ఎన్నో విలువైన పుస్తకాలు దండుకున్నాను. నాకు ఆసక్తి లేనివి ఆ ఊరి లైబ్రెరీకి ఇచ్చేశారారు.

Chowdary said...

గుంటూర్లో లంకా సూర్యనారాయణ గారు అనే పుస్తకప్రియులు సేకరించిన పుస్తకాలు - 29 బీరువాలతో సహా - అక్కఢ ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న సాంస్కృతిక మందిరానికి ఇచ్చేసి, అక్కడ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారని ఈమధ్య విన్నప్పుడు చాలా ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి.

Chowdary said...

ఈ మద్య - ముఖ్యంగా మొన్నటి ట్రిప్పులో పుస్తకాలు కొంటున్నప్పుడూ, ప్యాక్ చేస్తున్నప్పుడూ, ఇల్లు చేరాకా, ఇదే ప్రశ్న మనసులో మెదుల్తూ ఉంది. ఇంఢియాలో ఐతే ఆరుద్ర లానో, భరాగో లానో చేయవచ్చు. మరి ఇక్కఢ అమెరికాలో?

మరువం ఉష said...

(మనసు)లోలకం ప్రశ్న ఇటు, సమాధానం అటుగా ఊగి, మళ్ళీ ప్రశ్న వైపుకే ఎక్కువగా వస్తుంది - ఊపుకొక సమాధానాన్ని తోసి/కొట్టిపడేస్తూ. :( అయినా కూడా "మరవకండా మీ ఆస్తుల పంపకంలో మర్యాదగా నా భాగం నాకివ్వండి." అని ఎవరెవరిని నిలదీయోచ్చో పేర్లు రాసుకోవటం మొదలెట్టాను. ఆ తర్వాత నా ఆస్తి లెక్కలు/పంపకాల్లోకి వస్తాను. గుడ్ వన్.

Post a Comment