February 8, 2011

బజే సర్గమ్ ....భారతీయ కళలు,సంస్కృతి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టే గీతం


మిలే సుర్ మేరా ఐక్యతా గీతం తర్వాత దూరదర్శన్ బంగారు రోజుల్ని గుర్తుకు తెచ్చే మరొక గీతం "బజే సర్ గం"! మీలో చాలామంది చూసే ఉంటారు.

వీలైనంత మంది భారతీయ సంగీత కళాకారుల,నాట్యకారుల సేవలని ఇందులో ఉపయోగించుకున్నారు.గీతం ఉద్దేశం కూడా వివిధ కళలకు ఆలవాలమైన భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో,చెప్పడమే! దానివల్ల ఐక్యత వెల్లివిరియాలనే!

మొదలే తండ్రీ కొడుకులు అల్లా రఖా,జాకీర్ హుస్సేన్ ల తో అద్భుతంగా ప్రారంభమయ్యే ఈ పాటలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,మల్లికా సారాభాయి,స్వప్న సుందరి,ప్రతిమా గౌరి బేడి, కవితా కృష్ణ మూర్తి,భీమ సేన్ జోషి,బాల మురళి,హరిప్రసాద్ చౌరసీయా,పండిట్ రవిశంకర్, పండిట్ శివకుమార్ శర్మ ఇంకా అనేకమంది కళాకారులు పాలు పంచుకున్నారు.




భరతనాట్యం,కూచిపూడి,మోహినీ అట్టం,కథాకళి,ఒడిస్సీ,మణీపురి నాట్యరీతులు,వీణ,వయొలిన్,సారంగి,కర్ణాటక హిందుస్థానీ గాత్ర సంగీతాలు, అన్నీ ఈ గీతంలో ప్రతిబింబిస్తాయి.

బాలమురళి మిలే సుర్ మేరా లో తమిళ గీతం ఆలపించినా ఇందులో మాత్రం

 "నలుదెసల రాగముదయించెను
గజ్జెలు ఘల్లన లయగ పలికెను 
గొంతులెల్ల భావముగ పాడెను
ఇది దేశ రాగ భావ సమ్మేళనం" అంటూ భావయుక్తంగా పాడి,ముక్తాయింపుగా వయొలిన్ మీద ఒక చెణుకు విసురుతారు చూడండి!  అద్భుతం నిజంగా



అయితే ఈ గీతం మిలే సుర్ పాటలాగా జనంలోకి చొచ్చుకుపోలేకపోవడానికి కారణం ఇందులో జన జీవిత రీతులు కాక,కళా రూపాలు మాత్రమే చోటు చేసుకోవడమే అనుకుంటాను.

అయితేనేం, ఈ గీతాన్ని చూస్తుంటే మన కళా వారసత్వం,భిన్నత్వం,ఔన్నత్యం ఇంకెక్కడా లేవంటే లేవని గర్వపడేలా కళ్ళు చెమరుస్తాయి.

భీమ్ సేన్ జోషి స్వరంలో పరవళ్ళు తొక్కిన గమకాలు,బాలమురళి గొంతులో పలికిన భావాలు,రవిశంకర్ సితార ఒలికించిన హొయలు,...ఎంత గొప్పగా ఉన్నాయో ఆస్వాదించండి.

హరిప్రసాద్ వేణువు నుంచి వెలువడే ఆ తరంగాలు మన హృదయాలలోకి ప్రవహిస్తుంటే "మురళీ ధరా నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా" అనిపించక మానదు

ఈ కళలన్నీ భారత దేశ సంప్రదాయమనే సాగరంలో కలిసే నదులే అన్న సందేశం ఈ పాటలో ఉంటుంది. అందుకేనేమో ఈ పాటని "దేశ్" రాగంలో రూపొందించారు.

ప్రతి కమర్షియల్ ఛానెల్ లోనూ కనీసం వారానికి రెండు సార్లైనా ఈ గీతాలు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తే ఎంత బాగుంటుంది!అలా చేసి తీరాలని ఒక జీవో నో పాడో తెస్తే ఎంత బాగుంటుంది!

ఒక్కసారి ఈ పాటను అవలోకించి చెమర్చిన కళ్ళతో భారతీయ సంగీత, నాట్య రీతులకు  సలామ్ కొట్టండి

42 comments:

Vasu said...

నాకు ఈ పాట చూసినట్టు గుర్తులేదు. బావుంది.

Vasu said...

కూచిపూడి ఏంటండీ అలా మూలన నిన్చుపెట్టి షూట్ చేశారు. కనీసం ఆవిడ జడ కూడా కనపడలేదు :(
కూచిపూడి డ్రెస్ కూడా ఇప్పుడు చూసే వాటికి భిన్నంగా ఉంది.

కౌటిల్య said...

భలే గుర్తు చేశారు! అప్పట్లో జాకీర్ హుస్సేన్ ఊగే జుట్టుకోసం, మల్లికా సారాభాయి కళ్ళతో చేసే అభినయంకోసం,బాలమురళి గారు "దేశరాగభావ సమ్మేళనం" అని తెలుగులో పలికి కలిగించే ఉద్వేగం కోసం, చివర్లో గిలిగింత పెట్టినట్టుగా వేసే ముక్తాయికోసం,చిట్టిబాబుగారు నాకెంతో ఇష్టమైన "వీణ"మీద పలికించే స్వరాలకోసం, చౌరాసియా వేణుగానంకోసం...అబ్బ!ఇలా ఎన్నిటికోసమో.. ఎంత ఆత్రంగా చూసేవాణ్ణో!..ః)..ఇప్పుడు మళ్ళా చూస్తుంటే మళ్ళా అలాఆఆఆ..రీలు తిప్పేసుకున్నా...ః)...నాకు "మిలేసుర్ మేరా" కన్నా ఇదే బాగా నచ్చేది...ఎందుకంటే బాలమురళిగారు చక్కగా తెలుగులో పాడతారు, పైగా బోల్డన్ని రకాల డాన్సులున్నూ....ః)....గుర్తు చేసినందుకు సుజాతగారూ..మీకు ఓ పెద్ద ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ.....ః)

కౌటిల్య said...

వాసు గారూ! మీరన్నది నిజమే, కాని అక్కడ ప్రతి నాట్యరీతికి ఉన్న ప్రధానమైన తేడాలని చూపించటానికి ప్రయత్నించారు,ఎలాగంటే కూచిపూడిలో భావాభినయానికి(నాట్యానికి) ప్రాముఖ్యత,భరతనాట్యంలో ముద్రాభినయానికి(నృత్తానికి) ప్రాముఖ్యత...ఇక జడంటారా, ఆ పాటకి భామ జడ చూపించటం కుదరదు కదండీ! డ్రెస్సు విషయానికొస్తే అది సారాభాయిగారి మాడిఫికేషన్ అనుకుంటా..ః)..

కృష్ణప్రియ said...

Totally agreed with Kautilya!

lalithag said...

ఇది "మిలే సుర్ మేరా తుమ్హారా" తర్వాత వచ్చిందనుకుంటాను, చెప్ప గలరు.
"మిలే సుర్" అప్పుడు బాల మురళి ఏదో పట్టింపుతో తమిళణాడు నుంచి తమిళంలో పాడారు.
ఇందులో ఆయన తెలుగులో పాడారు. అది కూడా నాకు గుర్తున్నంత వరకూ ఇందులో విశేషం.
"మిలే సుర్" తమిళం మాటలు తమిళ లిపిలో రాసుకుని నేర్చుకున్నాను అప్పుడు ఒక సరదాగా. తమిళ పదాలు కూడా బలే అందంగా ఉంటాయి.
మంచివి గుర్తు చేశారు. మా పిల్లలకి ఇలాంటివి చూంపించాలి అని గుర్తుకు తెచ్చారు :)

Ennela said...

//ఆ రోజుల్లో దూరదర్శన్ ని అంతగా చూసివుండకపోవటం వల్ల ఇలాంటి పాటలెన్నో మిస్సయిపోయాను. ఈ గీతాన్ని ఇప్పుడే.. మొదటిసారి చూడటం, వినటం! // sorry venu gaaru, mee comment konchem copy chesukunnaa...nenu kooda mee laage chaala chaala missing..
sujata garu...thanks a lot andee..sravanaanandam+veenulavindu=yee post

కొత్త పాళీ said...

బజరే సరగం మొదటిది - ఇది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కేంపేన్‌లో భాగంగా మొదలైంది. మిలే సుర్ తరవాతెప్పుడో తీశారు.
చొట్టతలైవరు ఎస్.బాలచందర్ - చూసి చాల్రోజులైంది. జీనియస్! అసలు హిందుస్తానీలోగాని, కర్నాటక పద్దతిలో గాని దేశ్ రాగం అంత పెద్ద విస్తారానికి అనువైనది కాదు, చాలా లిమిటెడ్ రాగం, కానీ ఈ చిన్ని ప్రకటనలో దాని విశ్వరూపాన్ని ఊహించిన సంగీతజ్ఞులెవరో .. వారికి నమస్కారం. లాస్టండ్ ఫైనలుగా - బాలమురళి రాక్స్!
జ్ఞాపకాల తుట్టెని తట్టి లేపినందుకు మీకు నెనర్లు.

కొత్త పాళీ said...

ఇందులో మల్లికా సారభాయ్ యెవరు? గుర్తు పట్టలేకపోయాను!
చిట్టిబాబు కూడా కనబళ్ళేదు.

Sujata M said...

ఇది కూడా చాలా పాప్యులర్ కదా అని రాద్దామనుకున్నాను, వాసు గారి మొట్ట మొదటి కామెంటు చూసి ఆశ్చర్యం కలిగింది. 'బజే సర్గం' ఒక అత్భుతం. కానీ ఇన్నేళ్ళ బట్టీ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఇంకో వీడియో (రెహెమాన్ వి కాకండా) వచ్చినట్టు లేవు ఎందుకో ?!

సుజాత వేల్పూరి said...

వాసూ, థాంక్యూ! కూచిపూడి నాట్యం మల్లికా సారాభాయి చేత చేయించడమేంటో నాకర్థం కాలేదు. ఆ రోజుల్లో శోభానాయుడు మరింత అందంగా(యవ్వనంలో) చేరడేసి కళ్ళతో అద్భుతంగా ఉండేవారు.ఆమె చేత చేయించి ఉంటే బాగుండేది. అంటే మల్లిక సరిగ్గా చేయలేదని కాదు. కానీ తెలుగు కళను ప్రతిబింబించేలా తెలుగుకళాకారిణి(లేకపోతే అనుకోవాలి) ఉంటే బాగుంటుంది!

కౌటిల్యా,
ఈ పాట టీవీలో వచ్చేటపుడు మేమే చిన్నవాళ్లం అనుకుంటున్నా! మీకూ గుర్తుందా! ఇందులో వీణ వాయించంది చిట్టి బాబు కాదని(ఆయన ఫొటోలు గూగులించుడి) నా ప్రగాఢ విశ్వాసం! ఈయనెవరో తెలీడం లేదు.

కృష్ణప్రియ,
థాంక్యూ

వేణు, థాంక్యూ!

సుజాత వేల్పూరి said...

లలితగారూ, ఇది రికార్డీంగ్, షూటింగ్ ఎప్పుడుజరిగినా టీవీలో మాత్రం మిలే సుర్ తర్వాతే వచ్చింది.అవును, అప్పట్లో బాలమురళి NTR మీద కోపంతో ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ తెలుగునాట పాడనని పంతం కట్టి, నిజంగానే ఆ తర్వాతే పాడారు.

పిల్లలకు ఇలాంటివి చూపించడం అత్యవసరం! మా పాప మొదట్లో మామూలుగానే చూసినా నాలుగైదు సార్లు చూశాక చొరసీయా వేణువు,రవిశంకర్ సితార్ కి అబ్బురపడిపోయింది. చూస్తున్న ప్రతి సారీ" ఇలా రా అమ్మా, ఇది చూడు ఎంత బాగుందో" అని కేకలు వేస్తూనే ఉంటుంది సిస్టమ్ ముందు నుంచి! ఇలాంటి సంకలనం మరొకటి చూడలేదు నేను.

ఎన్నెల గారూ,

అచ్చతెలుగు పచ్చి తెలుగు మాట మీ పేరు! నా బ్లాగుకి స్వాగతం! టపా మీకు నచ్చినందుకు థాంక్యూ! ఈ పాట అరుదుగా ప్రసారమయ్యేది కాబట్టి మిలే సుర్ లాగా జనంలోకి వెళ్ళలేదండీ!

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారూ,
మిలే సుర్ నచ్చినా దానికంటే కూడా ఇది మరీ నచ్చుతుంది నాకు. అయితే ఇది కళాభిరుచి ఉన్న ప్రేక్షకులకే పరిమితం కాబట్టి కొంత వరకే వ్యాప్తి చెందింది. దేశ్ రాగ్ అరుదుగానే వినిపిస్తుంది. విశ్వమోహన్ భట్ కంపోజ్ చేసిన మేఘ దూతమ్ లో కవితా కృష్ణ మూర్తి కొన్ని శ్లోకాలు(పాట రూపంలో పాడారు) దేశ్ రాగంలో అద్భుతంగా పాడారు. విన్నారా మీరు?

తెలుగు సినిమాల్లో కూడా పాటలు ఈ రాగంలో కంపోజ్ చేసినట్లు అంతగా కనిపించదు. "వేణు గాన లోలుని గన వేయి కనులు చాలవులే" అందులో ఒకటి!

బాలమురళి నిజంగా రాక్స్ ఈ వీడియోలో! ఆ చివర్లో వేసిన వయొలినో! అదింకా రాక్స్!

అన్నట్లు ఇందులో కూచిపూడి బిట్ చేసింది మల్లికా సారాభాయి.

వీణ వాయించింది చిట్టిబాబు కాదు! ఇందులో చిట్టిబాబు లేరు.

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ,

మనకు నచ్చింది కాబట్టి అలా గుర్తుంచేసుకున్నాం కానీ ఇది మిలే సుర్ అంత పాపులర్ కాదండీ!కళాభిమానం గల భారతీయుల గృహాల వరకే వెళ్ళి ఆగిపోయింది ఈ పాట. మిలే సుర్ లాగా దేశంలో ప్రతి గ్రామంలోకీ చొచ్చుకెళ్ళలేదు.అదీ కాక ఇది మన చిన్నప్పుడే గానీ ఆ తర్వాత ఆపేశారు దాదాపుగా! అందువల్లల్ అందరూ చూడలేకపోయారు దీన్ని


ఇదొక మాస్టర్ పీస్! ఎప్పటికీ!

యూ ట్యూబ్ కి ఇలాంటి వాటికే నేను రుణపడిపోతుంటాను

కౌటిల్య said...

సుజాత గారూ! అవునండీ! ఆయన చిట్టిబాబుగారు కాదు...ః(...చిన్నప్పుడు అంతే అనుకునేవాణ్ణి..వీణ పట్టుకున్న మగవాళ్ళు కనపడితే టీవీలో వాళ్ళు చిట్టిబాబే అనుకున్నేవాణ్ణి....చిట్టిబాబంత గొప్ప వీణ విద్వాంసుణ్ణవ్వాలి అనుకునేవాణ్ణి...నాన్న నాకు గొబ్బూరువీణ బహుమతిస్తా అంటూండేవారు...ఏంటో! నా వీణ ప్రాక్టీసు అలంకారాల దగ్గరో,గీతాల దగ్గరో ఆగిపోయింది...ః(...
ఈ వీడియోలో ఉన్నాయన పద్మభూషణ్ ఎస్.బాలచందర్ గారట!

మల్లికా సారాభాయి కూచిపూడి మీద బాగా వర్క్ చేశారండీ...నేషనల్ లెవెల్ లో అప్పట్లో కాస్త ఫేమస్ కదా! అందుకే పెట్టి ఉంటారు....

కామేశ్వరరావు said...

అబ్బా, ఎప్పటికో ఎక్కడికో తీసుకువెళిపోయారండి! బహుశా నాకు మొదటిసారి బాలమురళి పరిచయమయింది ఇక్కడేనేమో. బాలమురళి అనేం, సంగీత విద్వాంసులందరూను.
కూచిపూడి ఒక్కటీ నచ్చేది కాదు. ఎవరో తెలియదు కాని, ఛత్ ఇది తెలుగు ముఖం కాదు ఎవరినో పెట్టేసారు అని అనుకోడం బాగా గుర్తు.

సుజాత వేల్పూరి said...

కామేశ్వర రావు గారు,
నిజమే! కూచిపూడి మల్లికా సారాభాయి చేత చేయించారు కదా మరి! ఆవిడ చూపుల్లో కూచిపూడి నాట్యంలో కనపడే శాంత తత్వం,చిరునవ్వు కనపడేవి కాదని అసంతృప్తితో ఉండేవాళ్ళం మేం కూడా!ఆహార్యం మీద కూడా అంత శ్రద్ధ కనపరచలేదు చూడండి

సుజాత వేల్పూరి said...

ఎవరైనా గమనించారా? వందేమాతరం కూడా "దేశ్" రాగం లోనే కూర్చారు

Sreenivas Paruchuri said...

1. dES(i) రాగం ఆధారంగా వచ్చిన కొన్ని తెలుగు పాటలు:
అలిగిన వేళనె చూడాలి-గుండమ్మ కథ
ఓ చెలి ఓహొ సఖి-జగదేక వీరుని కథ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర-మహామంత్రి తిమ్మరుసు
వేణు గానలోలుని గన వేయి కనులు-రెండు కుటుంబాల కథ
మోము జూడ వేడుక గోము జూడ-భక్త శబరి(??)
యెంత దూరము అది యెంతదూరం -ఏకవీర
అన్నీ మంచి శకునములే-శ్రీ కృష్ణార్జునయుద్ధం
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్ల వమ్మా-మాయా బజార్
2. వీణ వాయించింది ప్రముఖ వైణికుడు S. బాలచందర్
3. ఈ వీడియోలో వందేమాతరం ఎక్కడ వస్తుంది?

భవదీయుడు, శ్రీనివాస్

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్ గారూ,

నిన్న కొన్ని సినిమా పాటలు దేశ్ రాగంలో కూర్చినవి మనసులో మెదిలాయి.(మీరు చెప్పినవి కూడా) ఇక్కడ రాయలేదనుకోండి.

"రాసలీల ఇక చాలు,నీకై రాధ వేచె వేయేళ్ళు" కూడా దేశ్ రాగమేగా!

ఈ వీడియోలో వందేమాతరం లేదు. సినిమా పాటల కోసం ఆలోచిస్తుంటే అది వందేమాతరం దగ్గర లాండ్ అయింది. శ్రద్ధగా పట్టించుకోలేదు గానీ అసలు వందేమాతరమే దేశ్ రాగంలో కూర్చారు కదా అనిపించింది. అదే రాశాను

వేణు said...

వాణీజయరాం పాడిన ‘పూజలు సేయ పూలు తెచ్చాను’... పాట కూడా‘దేశ్’ రాగంలోదే కదా?

Sharada said...

శ్రీనివాస్ గారూ,
అలిగిన వేళనే పాట దేశ్ కాదనీ, తిలక్ కామోద్ అనీ రోహిణీ ప్రసాద్ గారు ఒక వ్యాసం/చర్చ లో చెప్పారు. తిలక్ కామోద్ కీ దేశ్ కీ వున్న తేడా చాలా చాలా చిన్నదవటం వల్ల అది దేశ్ లాగే వినపడుతుంది. (నేనూ అంతే అనుకున్నాను!)
సుజాతా,
వందే మాతరం దేశ్ లో వొచ్చిన గొప్ప పాట.
"పూజలు సేయ" దేశ్ కాదండీ.
దేశ్ లో వున్న ఇంకొన్ని మంచి పాటలు-
అజీ రూఠ్ కర్ అబ్ కహా జాయియేగ
ఆప్ యూ హీ అగర్ హంసె మిల్తె రహె-
క్యూ నయే లగ్ రహే హై యెహ్ ధర్తి గగన్
ఇంకా చాలా వున్నాయి.
కొత్త పాళీ గారన్నట్టు సంచారానికీ, ఆలాపనకీ ఎక్కువ అవకాశం ఇవ్వకపోయినా, స్వరాల్లో వుండే ఒక రకమైన అందం వల్ల వినగానే మంచి ఈస్థటిక్ అనుభూతినిస్తుంది.

రెండు నిషాదాలూ వాడటం వల్ల కొన్నిసార్లు తిలంగ్ లాగానూ, ని-స-రి-మ-ప-ని-స ప్రయోగం వల్ల సారంగి వెరైటీ లాగానూ అనిపిస్తుంది సరిగ్గా పాడకపోతే!

ఇక్కడ చూడండి.
http://www.itcsra.org/sra_raga/sra_raga_that/sra_raga_that_links/raga.asp?raga_id=59

శారద

Unknown said...

దేశ్ రాగాన్ని కర్నాటక సంగీతం లో మలయ మారుతం అంటారనుకుంటా.
ఇందులొ ఒక పిళ్ళారి గీతం ఉంది గుర్తు రావడం లేదు. వీణ నేర్చుకొనే టప్పుడు ఇదే ఎక్కువగా వాయించే వాళ్ళం.
వీణ గంభీరత్వానికి సరిగ్గ సరి పోయే రాగం ఇది. నాలుగో స్త్రింగ్ మీద వాయిస్తుంటే మరీ అద్భుతం.రెహ్మాన్ కీ ఇష్టమయిన రాగం ఇది. రోజా లో "నా చెలి రోజావే... నాలో ఉన్నావే ... నిన్నె తలిచెనె నేడె..." ఈ పాట లో ఉన్న ఆలాపన పక్కా మలయ మారుత రాగం. నిజానికి,ఈ ఆలాపన ని రెహ్మాన్ గార్డెన్ వరేలి చీరల అడ్వర్టైస్ మెంట్ కి జింగల్ గా కంపోజ్ చేశాడు.
దాన్నే యధాతధం గా రోజా లో మళ్ళీ వాడుకున్నాడు.

అన్నట్టు గుడ్డీ లోని, "బొల్ రే పపీ హరా.", "హమ్ కో మన్ కి శక్తి దేనా.. మన్ విజయ్ కరె..." ఇవి రెండు దెశ్ రాగం లోనివే.
థాంక్స్ మంచి రాగాన్ని గుర్తు చేసినందుకు.

-సుధ

Sreenivas Paruchuri said...

వందేమాతరం చాలా రాగాల్లో పాడబడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన రికార్డింగుల వివరాలిక్కడ:
http://www.mustrad.org.uk/articles/mataram.htm

వాటిలో ఏవైనా వినాలనుకుంటే నాకు రాయండి. పైన పేర్కొనబడని రికార్డింగు: భానుమతి, రజనీకాంతరావు గార్లు పాడినది.
http://trishnaventa.blogspot.com/2010/09/blog-post_07.html

6 వారాల క్రితమే నరసరావుపేటలో దొరికిన ఒక *పెద్ద* మట్టిరికార్డుల ఖజానాలో మంచి conditionలో దొరికింది.

re: dES/tilak kaamOd, agree that they are very close in structure. Basically, in all such discussions the keyword is "రాగం XXX based/ఆధారంగా".
Regards, -- Sreenivas

Krishna said...

Tu jo mere sur mein..sur milaa le ...idi kuda Desa raagame kada?

Can any body please confirm/correct?

Krishna

సుజాత వేల్పూరి said...

చర్చ దేశ్ రాగం వైపు మళ్ళడం కూడా బాగానే ఉంది.

కృష్ణ గారూ,

తు జో మెరె సుర్ మీ పాట దేశ్ కాదండీ! కానీ అదే సినిమాలో గొరి తేరా గావ్ బడా ప్యారా ...దేశ్ రాగమే!నాకు హిందూస్తానీ రాగాల గురించి పెద్ద పరిజ్ఞానం లేదు గానీ అడిగి తెలుసుకుని రాస్తున్నాను.అది రాగ్ "పీలూ" లో కూర్చారు.

ప్రతి రాగానికీ ఒక మూడ్ ఉంటుంది! దేశ్ రాగానికి మూడ్స్..భక్తి, దేశ భక్తి,ఆరాధన,లాలన....ఇవీ! ఆ రాగంలో కూర్చిన పాటలు విన్నా మీకు ఈ సంగతి అర్థమవుతుంది. దేశ్ ని ఎక్కువగా భజన్స్,భక్తి, ప్రేమస్థాయిని దాటిన ఆరాధన తో కూడిన పాటలకు వాడతారు.

సుజాత వేల్పూరి said...

సుధ గారూ,

మీ కోసం శారద గారు ఒక వ్యాఖ్య రాశారు కానీ అది నిన్న బ్లాగర్ సమస్య వల్ల పోస్టు కాలేదు. అది నాకు మెయిల్ చేశారు! ఇదిగో చూడండి...



sudha gArU,
దేశ్ రాగాన్ని కర్ణాటక సంగీతంలోనూ దేశ్ అనే అంటారండీ. మలయ మారుతానికీ దేశ్ రాగానికీ చాలా తేడాలున్నాయి. "కొండగాలి తిరిగిందీ గుండే ఊసులాడిందీ", "ఇన్ని రాశుల యునికీ" అనే పాటలు వినండి, మీకా తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మలయ మారుతానికి దగ్గరగా వుండే హిందుస్తానీ రాగం కళావతి.

పిళ్ళారి గీతాలు వున్నది మలహరి రాగం లో. మళ్ళీ దీనికీ మలయ మారుతానికీ చాలా తేడాలే వున్నాయి. మొదటిది మాయా మాళవ లోంచి పుడితే రెండోది చక్రవాకం లోంచి పుట్టింది.

బోల్ రే పపీ హరా- మియా కా మల్ హార్ వెరైటీ (ఇది కొంచెం దేశ్ కి దగ్గర గానే వుంటుంది) or బసంత్ బహార్?
హం కొ మన్ కి శక్తి - కేదార్.

శారద

సుజాత వేల్పూరి said...

శారద గారూ,
రెహమాన్ గార్డెన్ వరేలీ ట్యూన్ దేశ్ రాగమేనంటారా? నిన్న "పిలచిన బిగువటరా" పాట పాడుకుంటుంటే సందేహం వచ్చింది.

Ennela said...

ఇక్కడెవరండీ 'పిలిచినా బిగువటరా' అని పాడుతున్నారు?...ఆగండక్కడ! నేనున్నానిక్కడ..ఎందుకు చెపుతున్నానో అర్థం చేసుకోండి...దాని మీద కాపీ రయిట్లు కొనుక్కున్నాననుకున్నా...కాదా?

Sharada said...

garden vareli tune (and nA celi rOjAvE) --> karnATic kAfi (same as pilacina biguvaTarA, nI valla guNadOshamEmi). kAfi sounds very close to Hindustani peelU. All of them have the same prayOgam ri-ma-pa-ni-sA (the opening lines of nA celi) hence they all sound like dES!

tujo meri sur me --> peelU.

gOri terA gaav --> dhani (this sounds very close to Bhimpalas-Abheri). This is what I think. If I am wrong, please correct me.


dEs lO oka goppa Bhajan--> cadariyA jheeni re jheeni.

Unknown said...

శారద గారు!

మంచి విషయాన్ని తెలిపారు.

ఈ పాటలు పాడుతున్నప్పుడు, వందేమాతరం లో లాండ్ అవడం తో అనుకున్నా.
మీరన్నట్టు ఆ దేశ్ రాగ ఛాయలుండటం వల్లనేమో.

బసంత్ బహార్, " ఓ బసంతీ పవన్ పాగల్.. న జారె నాజా... రొకో కొయీ" (సినిమా పేరు తెలీదు)
లేటెస్ట్ దేవ్ దాస్ లో " ఎ కిస్కీ హై ఆహట్... ఎ కిస్కా హై సాయా.. మార్ డాలా!!!"
ఇంకా తేజ్ఆబ్ లో కూడా ఒక పాట "బే ఖబర్ , బే కదర్ , బె వఫా... బాల్ మా...".అనుకుంటా.

సుజాత గారూ.
మీరు నన్ను క్షమించాలి. చర్చ మళ్ళించినందుకు. బ్లాగుల్లో ఇలాంటి చర్చలు చాల అపురూపం... అందుకే.
-సుధ

Krishna said...

Sujatha gaaru, Thanks andi....

Krishna

సుజాత వేల్పూరి said...

శారద, థాంక్యూ...ఇంత శ్రమ తీసుకుని వివరించినందుకు!

సుధగారూ,

ఇలాంటి చర్చలు అపురూపం కాబట్టే పాట మీదుగా రాగం వైపు చర్చ మళ్ళడం బాగానే ఉందన్నాను. ఒకే అభిరుచి గలవాళ్ళు ఇలా తారసపడ్డం అరుదేగా మరి !

పిలచిన బిగువటరా కాఫీ రాగం! నా చెలి లో ఆలాపన కూడా అదే అనిపించి శారదగారిని అడిగాను.

గొరితెరా విషయంలో నేను పొరపడ్డానని ఆమె వ్యాఖ్య వల్ల తెలిసింది.

ఎన్నెల,

పిలచిన బిగువటరా పాట మీద కాపీ రైట్లు కొనేసుకున్నారా? ఎప్పుడూ? ఏమా కథ? సింపుల్గా చెప్పుము?

Ennela said...

//ఎప్పుడూ? ఏమా కథ? సింపుల్గా చెప్పుము?//..
జింబుళ్గా అడిగారు కాబట్టి

http://ennela-ennela.blogspot.com/2011/01/blog-post_24.html

GKK said...

సుజాతగారు: బజే సర్ గమ్ ఒక అపురూపమైన గీతమాలిక. దేశి రాగంలో స్వరపరచటం చాలా సముచితంగా ఉంది. చాలా బాగా వ్రాశారు మీరు. హిందుస్థానీ రాగాల గురించి నాకు పరిజ్ఞానం లేదు. కానీ తు జో మేరే సుర్ మే - పీలూ రాగం కాదు అనిపిస్తుంది. అలాగే గొరి తెరా గావ్ పాట మాల్కౌన్స్ చాయలు ఉన్నాయి.

సుజాత వేల్పూరి said...

కిరణ్ కుమార్ గారూ,

గొరి తెరా ...గురించి నాక్కూడా కొంత సందేహం ఉంది. కానీ తు జో మేరీ సుర్ మీ పాట మాత్రం పీలూ లోనే అని తెలుసుకున్నాను మరి!(హిందుస్తానీ సంగీతం తెలిసిన మిత్రుడిని అడిగాను) శారదగారు కూడా అదే మాట అంటున్నారు

anveshi said...

off topic-
ఎవరన్నా Carnatic Music Idols (2011)- JAYA TV లో చూస్తున్నారా?

ఆసక్తి వుంటే uploaded videos ఇక్కడ చూడచ్చు
http://www.youtube.com/user/vkailasam
click on "all uploads"



 

Ennela said...

హమ్మో! మీకందరికీ ఇన్ని రాగాలు గుర్తించడం వచ్చా!హ్యాట్స్ ఆఫ్.....
ILU all and at the same time IJU all

Sharada said...

గోరి తేరా గావ్ పాట గురించి I think I am positive. నిజానికి పల్లవి లోనే ప-ని-స-గ తో మొదలవుతుంది. మాల్కౌన్స్/హిందోళం అయ్యే అవకాశమే లేదు! (ఎందుకంటే అవి స-గ-మ-ద-ని-స కాబట్టి).
హిందుస్తానీ లో ధని అని పిలిచే ఈ రాగం శుధ్ధ ధన్యాసిని పోలి వుంటుంది. (స-గ-మ-ప-ని-స).

అయితే ఒక్కటుంది. హిందోళం/మాల్కౌన్స్ లో వుండే ఫ్లాట్ (కోమల) ధైవతం కొన్నిసార్లు పంచమం లా అనిపిస్తుంది.(రెండూ పక్కపక్కనే కదా!) అప్పుడూ ధని/శుధ్ధధన్యాసి మాల్కౌన్స్/హిందోళం లాగనిపిస్తాయి.

సినిమా పాటల్లో చాలా వాటికి మనం రాగాలు చెప్పలేకపోవటానికి ఇదే కారణమనిపిస్తుంది నాకు.

I am sorry if I am sounding like some know-it-all. Actually what I know might be compared to a little drop in the mighty ocean that Indian classical music is! It is a very sophisticated science by itself.

నా బాధంతా మనం మనకున్న గొప్ప సంపదని ఏ మాత్రం ఎప్రీషియేట్ చేయటం లేదు. దాని గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం.

పద్మవల్లి said...

Dear Sujatha garu

I just saw your post about the recent happenings on the blog world. First of all congratulations for nailing it down very dignified way. Of course I always had high opinion about your nature ever since I started reading your blog and the your comments elsewhere. You maintained a balance and dignity always no matter who you were dealing with and what the situation was. Hats off to you. I can guess from your blog life that you have a strong personality, but there will be a barrier for everything. It surprised me after she published personal mails and other rotten stuff, you haven't lost your temper, which would have been very hard for me.

I am writing to you this not to praise you or not for anything like that. I started reading the blogs about 2 years and yours was one of the first blogs that I came across. When I started reading you were writing the posts about your experiences in journalism. But I see very few blogs and then from the comments I used to follow the blogs looked interesting. I was also the fan for Kalpana garu and Malathi garu since long time from their writings, which were available in the e-media. I too followed Tanhayi and commented. As you said we all liked the way Kalpana garu presented the emotional dependencies and conflicts, than the illegal relationship in the story. I saw some of the Ms. N's nasty comments in that serial and also the post on her blog abusing Kalpana garu, Malak garu and Afsar garu. It was down right hatred towards them. I felt very bad about it and thought how hurt Kalpana garu might be. I thought of objecting about it, but kept in silent as not sure how she attacks everyone. I don't have a thick skin to handle those type. Then I saw some comments on Malak's daughter and some other bloggers. By the time I see the others comments as response to hers, her comments or posts were already deleted. So I didn't get to read what she wrote about others but could guess that must be something hurting to others. You have also mentioned her not to write comments if she deleting later on. making others fools. Recently from others comments and her old comments floating I came to know that how cheep she is behaving and dragging the family members into it. But as I said I tried hard not to comment anywhere since she is lunatic phase now. When I saw the posts on Sita devi with nasty writings and later came to know that they were targeted to Malak's mother I was stunned. I finally commented on Nanna's blog.

The way you ignored the ill statements spread about you and also the way responded today shows the what kind of character you are. Kudos and keep it up. I should learn few things from people like you.

Best Regards
Padmavalli

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

చక్కని విషయమూ మంచి పాటలూనూ.
వీరంతా సరస్వతీ స్వరూపాలు. వీరిగురించి నా మనసులోమాట.

maనం చిన్నప్పుడు కాశీ మజిలీ కధలలో చదివో లేక వినో ఉంటాం. యక్ష, గంధర్వ లోకాలనుంచి కొందరు విహారర్ధం భూలోకానికొచ్చి భూలోక సౌందర్యానికి పరవశులై తిరిగి తమలోకానికి వెళ్ళడంలో జాప్యం చేస్తారు. అందుకు గానూ వారిని వారి నాయకుడు శిక్షిస్తాడు, ఆ శిక్ష ఏమిటంటే మీరు కొన్నాళ్ళు భూలోకంలో మానవుల మధ్య మానవులుగా బ్రతికి రండి అని. అటువంటి వారే ఈ కళామూర్తులంతానూ. ఉన్నన్నాళ్ళు మనలనూ మన మనసులనూ అలరిస్తారు. తమకంటూ ఒక గుర్తింపును చిరకాలం ఉండేలా చేసుకుని తిరిగి తమలోకానికి వెళ్ళిపోతారు.
అందుకే నేనంటాను

పాడ గలుగువారి పాదదాసుడనేను
పదములల్లువారి బంటునేను అని.

మంచి విషయం ప్రస్తావించేరు సుజాతగారూ, అభినందనలు. ఇందులో ఉన్న వీడియోలు ఎన్నిసార్లు చూసేనో చెప్పలేను

రాధేశ్యామ్ రుద్రావఝల said...

సుజాత గారూ,
చాలా బాగుందండీ..
శ్రీ కేశవ్ గారు గీసిన కేరికేచర్స్ లో ఇక్కడ వీణ వాయించిన కళాకారుడి బొమ్మ కూడా ఉంది. వారు శ్రీ బాలచందర్ గారు. ఇక్కడ వారి పేరు చూసేవరకూ నేను ఈయన్ని ఈమని శంకర శాస్త్రిగారు అనుకునే వాడిని. కర్ణాటక, హిందూస్తానీ కళాకారుల కేరికేచర్స్ లింక్:
http://keshavcaricatures.blogspot.in/
ఇదికూడా చూడండి..: http://radhemadhavi.blogspot.in/2012/02/blog-post_15.html
ధన్యవాదాలు.

Post a Comment