June 6, 2011

శబ్బాష్ రా భరణీ....!


కొంతమంది మనుషుల్ని చూస్తుంటే పరిచయం ఉన్నా లేకపోయినా ఎప్పుడో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మాట్లాడితే మరింత అనుబంధమేదో ఉందనిపిస్తుంది.తనికెళ్ళ భరణి ఈ కోవకే చెందుతారు .సరళమైన భాష, అందులో తళ తళ మెరిసే చమక్కులు, మాటల్లో ఆప్యాయత,ఆహార్యంలో నిరాడంబరత...ఇవన్నీ భరణిని మనకి దగ్గర చేస్తాయి. అంతెందుకు...."పరికిణీ" చదివితే చాలు అసలు మన ప్రమేయంలేకుండానే భరణి మనసులో (మెదడులో కాదు) అలా ఒక పేము కుర్చీ వేసుక్కూచుంటాడు దర్జాగా!ఒక్కో కవితా ఒక్కో ఆణిముత్యం!  

అలాంటి భరణి మహాదేవుడికి మహాభక్తుడు. పరమ శివుడికి పరమ ప్రీతిపాత్రుడు. ఆటగదరా శివా   అంటూ చనువుగా ఒరే అని పిలిచి మరీ తత్వాలు రాశాడు.
శివాలయాలన్నీ తిరిగి ప్రతి మూల విరాట్టుకీ కమ్మగా పాడి వినిపించాడు. దానితో శివుడికీ అత్యాశ కల్గినట్టుంది. ఇంకా రాయాల్సిందేనని ముద్దుగా మారాం చేసినట్టున్నాడు.

శివుడే రాయమన్నాక భరణి ఆగుతాడా! అయితే ఈ సారి తెలంగాణా యాసలో రాసి చూపిస్తా కాస్కోమన్నాడు!

అయితే ఓకే, రాస్కోమన్నాడు పెద్దాయన!అంతే శివాజ్ఞ  అయిందన్నమాట.భరణి దాన్ని ఇలా చెప్తాడు

శంకర అంటేనే నాకు 
శక్కర లెక్కన ఉంటదయ్య
శివునాగ్నైతది.....సీమనైత
శబ్బాష్ రా శంకరా

అలా పుట్టినవే ఈ "శబ్బాష్ రా శంకరా" తత్వాలు!

ఆడియో సీడీ సైజులో ఎక్కడికెళ్ళినా బాగులోనో జేబులోనో పడేసుకుని తీసుకెళ్ళేలా ప్రింటు కొట్టిన భరణి తెలివికి నేను ఫిదా!

తెలంగాణా యాసలో రాస్తూనే "వాడు ప్రాసకీ యాసకీ లొంగుతాడా" అంటాడు మళ్ళీ!

ఇవి మనసులో ఉద్భవించిన భక్తి,ప్రేమ,చనువు,ల్లోంచి పుట్టినవే తప్ప భరణి కలంలోంచి అప్పటికప్పుడు "రాసినవి కాదు"! అందుకే నాకు వీటిలో మహాదేవుడితో మరింత సాన్నిహిత్యం,ఇంకా ఇంకా భక్తితో దగ్గర కావాలన్న తపన కనిపించాయి. ప్రతి తత్వంలోనూ కొంత ఆర్దృత కనిపిస్తుంది.అందుకే ఇవి రాస్తున్నపుడు కన్నీళ్ళు వచ్చేసేవిట భరణికి!

అందుకే అంటాడు

కన్నీళ్లల్లనె బుట్టిన పెరిగినా
కన్నీళ్లల్లనే కాలినా!
ఒక్క  బొట్టయిన  స్ఫటిక లింగమైతే
శబ్బాష్ రా శంకరా! 

నాకు నచ్చిన కొన్ని తత్వాలు కొన్ని

ఖానాకైతే అన్నపూర్ణమ్మ
పీనేకో గంగమ్మ
సోనా యాడైతేంది సోనానె
శబ్భాష్ రా శంకరా

ఏనుగునెల్క మోస్తది
నెమలేమో పాముతో దోస్తీ జేస్తది
శైవ కుటుంబమంటే అది
శబ్బాష్ రా శంకరా!

ఎన్నో గుళ్లలో దేవులాడి
యాష్టొచ్చి  గూసుంటే
నా గుండేలొ ఘల్లుమన్నవులె
శబ్బాష్ రా శంకరా!

ఇంకా చాలా ఉన్నాయి గానీ అన్నీ చెప్పేస్తే భరణి గుస్స జేస్తడేమో!

కేవలం భక్తి భావనే కాక లోకంలో కళ్ళముందు కనపడే బాధల్ని,లోకం పోకడలని కూడా శివుడితో చెప్పుకుని "ఇదేంటయ్యా?"అని ఆవేదన చెందే ధోరణి, బాధపడే ధోరణి కొన్ని తత్వాల్లో కనిపిస్తుంది.

లింగం మింగెడి దొంగనాకొడుకులు
గుడినే మింగెడు నీ కొడుకులు 
మూడో కన్నును తెర్వవేమిటికి రా
శబ్బాష్ రా శంకరా!

కుత్కెలు గోసుకుంటరు 
కులాల మతాల పేరుజెప్పి
పెద్ద కులపోనికి పెద్ద సావొస్తదా
శబ్బాష్ రా శంకరా!


జాతకమంటడు..చెక్రమంటడు
గాచారమంత గలతండడూ 
పైసలతోనే ఫైసలంటడూ
శబ్బాష్ రా శంకరా 


మరి కాసేపు వైరాగ్య ధోరణి

మాంకాళమ్మకు పులిని బలినెయ్యి
నీకంత దమ్ముంటె
అని మేకలన్నయయ్యా 
శబ్బాష్ రా శంకరా

ఇల్లాలంటడు పిల్లలంటడు
ఎన్నో ఇండ్లూ బండ్లంటడు
నువ్వు బిల్వంగనే కాట్ల పంటడు
శబ్బాష్ రా శంకరా!

నాకు అన్నింటికంటే నచ్చిన ఆణిముత్యం

శివుడిని చూడండి భరణి ఎలా వర్ణిస్తాడో..

బైటికి "బండ" బూతువి
అర్థంకాని లోలోతువి
కరిగే రాతివి పరంజ్యోతివి
శబ్బాష్ రా శంకరా!

పేజీకి రెండు చొప్పున తత్వాలు తాపడం చేసి 64 పేజీల్లో అచ్చు తప్పుల్లేకుండా అందించిన ఈ పుస్తకం వెల యాభై రూపాయలు.అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యం!

 ఈ తత్వాలన్నీ స్వయంగా భరణి గానం చేసిన సీడీ వెల అరవై రూపాయలు.

జూన్ 5న శిల్పకళావేదికలో బాల గాంధర్వం పేరిట బాలూకి జరిగిన సన్మాన సభలో ఈ పుస్తకాన్ని సీడీనీ ఆవిష్కరించారు! పుస్తకమేమో ప్రకాష్ రాజ్ కీ ఆడియో సీడీ ని బాల సుబ్రహ్మణ్యంగారికీ అంకితమిచ్చారు భరణి!

ఈ తత్వాలను చూసి సుద్దాల అశోక్ తేజ ఇలా అన్నారు

"జబర్దస్త్ గుంది ఉస్తాద్
నువు కయిగట్న పజ్యాలు, శంకరుని మెడలున్న పాముకి సమజైతే
కుత్తుకలున్న విసం అమృతమైతది


గంతెందుకు  శంకరుని  మూడోకన్ను నిప్పులకు బదులు కన్నీళ్లు పెట్టుకుంటదిగదే......


బస్..ఖుషీతో ఫిదా అయిపోతున్నా! 

నల్లని కవర్ పేజీమీద ఎర్రని "శబ్బాష్ రా శంకరా! "అన్న అక్షరాలు కొట్టొచ్చినట్టు కనపడకపోవడం ఒక్కటే చిన్న అసంతృప్తి!

13 comments:

లత said...

భరణిగారి వెండి పండుగ ఫంక్షన్ టీవీలో చూసినప్పుడు, ఈ తత్వాలను ఆయన నోటివెంటే విన్నప్పుడు చాలా నచ్చాయి సుజాత గారు

ప్రసీద said...

నిజం సుజాత గారూ.. భరణి గారు రచనలు చేసినా, సినీఅలకి మాటలు రాసినా, వేషాలు వేసినా ఎంతో భావుంటాయి. మీరు రాసినది కూడా చాలా బావుంది. నిన్న బాలూ గారి సన్మాన కార్యక్రమంలో కూడా ఒక చిన్న పద్యం చదివారు. చాలా నచ్చింది నాకు. గొప్ప వ్యక్తి..
subhadra vedula

వేణు said...

‘యమలీల’ తోటరాముడిగా కవితలు అల్లటంలో విఫలమైన భరణి ఇప్పుడు అదే యాసలో శివ తత్వాల్లో చెలరేగి విజయవంతమవటం చాలా బాగుంది. తన ప్రతిభనంతా సినిమారంగానికే అంకితం చేయకుండా ఇలా విభిన్నంగా ‘డిసైడ్ చేయటం’ మరీ బాగుంది! భరణి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసినందుకు మీకు అభినందనలు!

పాఠకుల, శ్రోతల కోసం ఉద్దేశించినవాటిని ఇలా ప్రత్యేకించి కొందరికే ‘అంకితం’ ఇవ్వటంలో హేతుబద్ధత ఉండదు. అయితే ఈ సంప్రదాయాన్ని గౌరవించేవారి దృష్టితో చూస్తే... పుస్తకాలంటే ఇష్టపడే ప్రకాశ్ రాజ్ కి పుస్తకాన్నీ, పాటల బాలూకి ఆడియోనీ అంకితం ఇవ్వటం సముచితంగా ఉంది!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఆయనకీ నాకు కొన్ని గంటల బాతాఖానీ బాకీ ఉంది.అవును కొన్ని గంటలు.కాకపోతే ఆయన వైజాగు రావాలి ఖాళీ దొరకాలి అదీ కథ!

SHANKAR.S said...

సుజాత గారూ నాకు అన్నిటిలోకీ నచ్చింది ఇది.

నాకా రావయ ఓనమాలు
బిల్ కుల్ రాదు ఛందస్సు!
నువ్వే యతివి గణాలు సుట్టుముట్టు
శబ్బాష్ రా శంకరా

ఇది చదివిన వెంటనే నేను కూడా పదాలతో ఆడుకున్న భరణి గారి నేర్పు చూసి శబ్బాషురా భరణీ అనుకోకుండా ఉండలేకపోయాను.

వేణూ శ్రీకాంత్ said...

నాకు భరణి గారి వెండిపండగ నాడే ఈ తత్వాలతో మొదటి పరిచయం ఐందండీ.. ఎంతో అబ్బుర పరచాయి.. పుస్తకం సిడి విడుదలైనట్లుగా నాకు తెలీదు.. వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. గుంటూరు విశాలాంధ్ర లో భరణిగారి రచనలేవి దొరకడంలేదు. ఈ సారి విజయవాడ వెళ్ళినపుడు ప్రయత్నించాలి. మీ పరిచయం చాలా బాగుంది..

రాజ్ కుమార్ said...

భరణి గారి రచనల గురించి విన్నాను కానీ..అతని పుస్తకాలేవీ చదవలేదండీ ఇప్పటివరకూ... మీ పోస్ట్ చదివాక తప్పని సరిగా చదవాలనిపిస్తుందండీ... నాకయితే ఈ పోస్ట్లో మీరు రాసినవన్నీ నచ్చాయ్..

సరళ said...

ఇవి చదువుతుంటేనె ఇంత అద్భుతంగా వున్నై ఇంక భరణి గారి నోటి వెంట వింటే ఇంకెంత అద్భుతంగా ఉంటయ్యో.
ఇంత మంచి పుస్తకం గురించి తెలియచేసినందుకు చేసినందుకు సుజాత గారు మీకు ధన్యవాదాలు..

తెలుగు అభిమాని said...

శంకర అంటేనే నాకు
శక్కర లెక్కన ఉంటదయ్య
శివునాగ్నైతది.....సీమనైత
శబ్బాష్ రా శంకరా
my god it is mind blowing.
great సుజాత గారు. hats off to bharani.

కనకాంబరం said...

మీ యీ పోస్టు చదివి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. చాలా బాగుంది మీ "శభాష్ రా భరణీ" . శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)

oremuna said...

This book in eBook format is now available on Kinige for purchase/rent @ http://kinige.com/kbrowse.php?via=author&id=36 Enjoy Folks.

viji said...

భరణి గారికి సుద్దాల అశోక్ తేజ ఇచ్చిన సర్టిఫికేట్ నచ్చింది నాకు. అసలు కంటే కొసరు మక్కువ అన్నట్టు!

భరణిగారు సినిమాల్లోకి రాకముందు ఫేమస్ అయ్యింది ఓ వీధి ప్లస్ స్టేజ్ నాటకం "కొక్కొరొకో" ద్వారా. నిరుద్యోగం పైన రాసిన ఆ నాటిక ఆంధ్ర యూనివర్సిటీలో పోటీల్లొ వేయగా మొదటి సారి చూశాను. హృదయం ఉంటే దాన్ని బాగా కదిలిస్తుంది. "సారే జహాసే అచ్ఛా" టైటిల్ వరకు తెరవెనక వినిపిస్తూ ఉంటుంది.

అందులో యోగి, జోగి అని రెండే పాత్రలు వారే వివిధ పాత్రల్లోకి మారిపోతుంటారు. ఇది ఎప్పటికీ సజీవంగా ఉండగల అర్హత ఉన్న నాటిక. ఈ మధ్య కాలంలో దీని పేరు వినిపించడం లేదు. భరణిగారి నోటినుండి కూడా వినపడ్డం లేదు లాగుంది. బహుశా ఆయనే మర్చిపోయారేమో?! సినిమాల్లో పైకొచ్చాక!

కానీ సుజాత గారూ, మీ పరిచయం ఉంది చూశారూ! అదిరందంటే నమ్మాలి మరి. మీ శైలిలో అక్కడక్కడా రంగనాయకమ్మ గారు తొంగి చూస్తుంటారు. ముఖ్యంగా మాట విరుపులో.

gksraja said...

భరణి గారి 'పరికిణీ' ఎంత నచ్చిందో దాని పై ఓలేటి గారు వ్రాసిన వ్యాఖ్య మరింత నచ్చింది. అది ఇక్కడ చదవండి.
http://gksraja.blogspot.com/2011/03/blog-post_29.html

Post a Comment