July 17, 2011

శారదా శ్రీనివాసన్ గారి రేడియో జ్ఞాపకాల పూల మాల


రేడియో! రేడియో !రేడియో! 

అబ్బ, రేడియో అంటే పిచ్చితో గడిపిన రోజులు ఎంత బాగుంటాయో!
రేడియో వింటూ బావి గట్టు మీద బట్టలు ఉతుక్కోడం,
రేడియో వింటూ ఇల్లు తుడవడం,
 రేడియో వింటూ తోటపని చేయడం,
రేడియో వింటూ ధనుర్మాసాల సాయంత్రాలు వాకిట్లో రేపటి తాలూకు ముగ్గు పెట్టేయడం....ఇలా ఉండేది పరిస్థితి మా ఇంట్లో!

 నేనైతే ఒకడుగు ముందుకేసి చదువుకునేటపుడు కూడా రేడియో వింటూ చదివేదాన్ని!

ఉదయం మంగళ వాద్యం  మొదలుకుని ఉదయతరంగిణి అయ్యాక అక్కడినుంచి వివిధ భారతికి వెళ్ళి అర్చన, జనరంజని..! ఈ లోపు స్కూలు!

సెలవు రోజుల్లో అయితే పదకొండున్నరకు వచ్చే ఉన్నత  పాఠశాల విద్యార్థుల కార్యక్రమం(ఆ పాఠాలు మా క్లాసువి కాకపోయినా సరే)  పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం,ఒకటిన్నరకు  వనితా వాణి ,రంగవల్లి, రెండూ పదికి సీఫెల్ వాళ్ల ఇంగ్లీష్ పాఠాలూ_____ఇహ సాయంత్రాలు చెప్పక్కర్లేదు. మా రేడియోకి విశ్రాంతే ఉండేది కాదు.

ఆ రేడియో అప్పుడప్పుడూ ఆగిపోతే దాని నెత్తిన ఒకటి మొట్టగానే తిరిగి మోగేది.

వేసవి సెలవుల్లో ఆరుబయట వెన్నెల్లో రేడియో నాటక వారోత్సవాల్లో పోటా పోటీగా వేసే నాటకాలు, "బహారో ఫూల్ బర్సావో" వంటి అద్భుతమైన పాటల కోసం ఛాయాగీత్ వరకూ విని తెలీకుండానే నిద్రపోవడం________ఎంతో హాయిగా ఉండేది  ఈ వ్యవహారమంతా !

రేడియో అనౌన్సర్లూ,కళాకారులంటే పెద్ద సెలబ్రిటీ వర్షిప్! విజయవాడ అనౌన్సర్లూ కళాకారుల కున్న ప్రతిభ హైద్రాబాదు వాళ్ళకి లేదని ఒక పెద్ద అపోహలో, గొప్ప గర్వపు ఫీలింగ్ లో  ఉండేవాళ్ళం!( చాలామంది అది అపోహ కాదు నిజమే అంటున్నారు :-))  హైద్రాబాదు ట్రాన్స్ మిషన్ అంత క్లియర్ గా వినిపించకపోవడమే ఇందుకు కారణమేమో మరి! :-))

పేరి కామెశ్వర రావు,వాసుదేవ మూర్తి,కమల కుమారి,కోకా సంజీవరావు,రామం,DSR,మల్లాది సూరిబాబు , నండూరి సుబ్బారావు,  వీబీ కనకదుర్గ ,  సీతారత్నమ్మ (గణపతి నాటకంలో తల్లి ) గార్లు వీళ్ళంతా  గొప్ప హీరో హీరోయిన్స్ గా ఉండేవాళ్ళు నా పాలిట. లలిత సంగీతం వింటూ చచ్చిపోయినా పర్లేదనిపించేంత ఇష్టంగా ఉండేది.

క్రమక్రమంగా రేడియో వైభవం ప్రాభవం వివిధ కారణాల వల్ల తగ్గిపోయాక, ఆ నాటి అనౌన్సర్లంతా రిటైర్ అయిపోయాక  మేము ఉద్యోగాలనో పెళ్ళిళ్ళలో వూర్లు మారిపోయాక రేడియోని దాదాపుగా వదిలేసినట్టే అయింది.(ఇప్పుడు మాత్రం నాకు రోజూ రేడియో ఉండాల్సిందే)

హైద్రాబాదు కళాకారుల్లో మా ఇంట్లో అందరికీ ఫేవరిట్ హీరోయిన్ ఉండేది.శారదా శ్రీనివాసన్ గారు.(నాకు ఆకెళ్ళ సీతగారి గొంతు కూడా చాలా ఇష్టం)

స్ఫుటంగా, స్పష్టంగా, తీర్చి దిద్దినట్టు,నగిషీలు చెక్కినట్టు  ఒక్కో వాక్యం భావగర్భితంగా ఆమె పలుకుతుంటే మా అమ్మ అయితే "అబ్బ, ఎంత బాగా మాట్లాడుతుందే ఈమె"అని ఆశ్చర్య పడుతూనే  ఎంతో అభిమానించేది. ఒకసారి రేడియో ఆడిషన్ల గురించి శ్రీమతి శారద గారు ప్రసంగిస్తూ "ఏవండీ,మీరేనా ఇలా అంటున్నది?నన్ను ఎందుకింత అపార్థం చేసుకున్నారు"(అనో, ఇలాంటిదే ఏదో డైలాగ్ ఉంటుంది)"అనే డైలాగ్ ని ఎన్ని రకాల భావప్రకటనలతో చెప్పవచ్చో పలికి చూపిస్తే____కళ్ళు తిరిగిపోయాయి.

చలం పురూరవ విన్నాక ఎవరైనా సరే తేరుకోవడం చాలా చాలా కష్టం! అదే ఊర్వశి ఎక్కడికెళ్ళినా మన వెనకాలే తెరలు తెరలుగా నవ్వుతూ వెంటాడుతూ వస్తుంది.  ఈ ఊర్వశిని వదిలించుకోడానికి నాకు చాలా టైము పట్టింది. మళ్ళీ మళ్ళీ విన్నపుడు ఊర్వశి మళ్ళీ బయలు దేరుతుంది. దీనికి అంతం లేదిహ!

అయితే అలనాటి కళాకారులూ అనౌన్సర్లూ ఈ మధ్య తమ జ్ఞాపకాలు రాస్తుండటం సంతోషించదగ్గ విషయంగా తోచింది నాకు. రచనలో డి వెంకట్రామయ్య గారు, కౌముదిలో సుధామగారూ_____ఇలా! అయితే ఇలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే శారదా శ్రీనివాసన్ గారు తన అనుభవాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం నిజంగా ఒక అద్భుతం!

ఎన్నెన్ని జ్ఞాపకాలు,ఎంతమంది మనుషులు,ఎన్ని పాటలు,ఎన్ని నాటకాలు, ఎంతమంది గొప్ప కళాకారులతో దగ్గరగా మెసిలే అదృష్టం,ఎన్ని ప్రశంసలు,ఎంత పరిశ్రమ,ఎంత గుర్తింపు,ఎంతమంది అభిమానుల మనసులో చోటు,ఎంతమంది గొప్పవారి సాంగత్యం .......!


ఈ పుస్తకం చదువుతుంటే విశేషాలు,అనుభవాలు ఒకదాని వెనుక ఒకటి పాఠకులను ఊపేస్తాయి.  నేనైతే అసలు బ్రేక్ తీసుకోకుండా ఒక్క సారిగా పూర్తి చేసి పక్కన పెట్టి దిగాలు పడి కూచున్నా!

ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు,నాటకాలు,రూపకాలు ఇవన్నీ నేను పుట్టకముందే ప్రసారాలు,పునః ప్రసారాలు కూడా అయిపోయాయి.:-((

ఒక పాతికేళ్ళు ముందు పుట్టి ఉంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రోగ్రాములు వినగలిగి ఉండేదాన్నని గొప్ప పశ్చాత్తాపం మొదలైంది. ఇవన్నీ ఆర్కైవుల్లో ఉన్నాయో లేవో శారద గారు రూఢిగా చెప్పలేదు ఈ పుస్తకంలో!

అధ్యాయాలుగా విభజించకుండా, గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్ళారు! అయినా ఎక్కడా బోరు కొట్టకుండా, హాయిగా సుతిమెత్తగా సాగిపోయింది ఈ జ్ఞాపకానుభవాల ప్రయాణం.ఎన్నో గొప్ప నాటకాలు! అన్నింట్లోనూ శారదే హీరోయిన్.

కాలాతీత వ్యక్తుల్లో ఇందిర పాత్ర శారద గారు వేశారని చదివి  మళ్ళీ చెప్పలేనంత దిగులు పుట్టింది.

ఎలా దీన్ని వినడం!
 అసలే ఇందిరంటే నాకు చాలా ఇష్టం(శారద గారిక్కూడానట) ఇందిర ఆత్మవిశ్వాసం,ఓడిపోని పంతం,ఇగో వీటన్నింటికీ డైలాగులు ఎలా రాసి ఉంటారు?వాటిని శారదగారు ఎలా పలికి ఉంటారు?ఇలా అసంఖ్యాకమైన అపురూప రేడియో నాటకాలు కోల్పోయామే? ఎక్కడ ఎలా వినాలి? (మాగంటి వంశిగారి చెవిలో ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని మరీ పోరాలి)

శారదగారి జ్ఞాపక శక్తికి జోహార్లు చెప్పేలా అనేక రూపకాలు, లలిత సంగీత కార్యక్రమాలు,యక్షగానాలు వీటన్నింటి నుంచీ ఎన్నెన్నో పాటలు పద్యాలు కోట్ చేశారు. అక్కినేని నాగేశ్వర రావు పరితాపం అనే రేడియో నాటకంలో నటించడమూ, శారదగారు కథ చెప్పే కార్యక్రమంలో చివరగా "అదర్రా కథ"అని ముగిస్తే దాన్ని రోజూ వింటున్న పెద్దాళ్లంతా "మేమూ వింటున్నాం, మీరు అదర్రా అని పిల్లలతో కలిపేస్తే ఎలా"అని సరదాగా అభ్యంతర పెట్టడమూ,  పొలం పనులు కార్యక్రమంలో స్క్రిప్ట్ శారదగారి చేత చదివించారని కోపగించిన ఒక అభిమాని రేడియో వాళ్ళని  "మీరు పన్నీటిలో పేడ కలిపి కళ్ళాపి చల్లుతారు.శారద గారి చేతా వ్యవసాయ కార్యక్రమాలు చదివించేది?" అని చీవాట్లు వేయడమూ, తనపై వి.ఎస్ రమాదేవి గారి ప్రభావమూ,యువవాణి తీర్చిదిద్దిన అద్భుతమైన  వ్యక్తులూ  __________ఇలా ఎన్నెన్నో అనుభవాలు మాలగా గుచ్చి అందించారు ఈ పుస్తకంలో!

అలాగే కొన్ని రేడియో నాటకాల్లోని పాత్రలు తన మీద ఎలా ప్రభావాన్ని చూపించాయో ఈడిపస్ నాటకాన్ని ఉదాహరణాగా తీసుకుని చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ నాటకంలో తల్లి/భార్య పాత్ర కల్గించిన  మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక శతపోరి మరీ దాన్ని చెరిపించేశారట ఆమె!

ఎంతోమంది కళాకారులు విశేషాలు ఫొటోలతో తీర్చి దిద్దిన ఈ పుస్తకం లో  అచ్చు తప్పులు లేకపోవడం మరో విశేషం! సొంతగా వేసుకుని జాగ్రత్తగా ప్రూఫులు పర్యవేక్షించడం వల్ల కాబోలు!

శారదగారు ఒక ప్రశ్న కూడా వేశారు చివర్లో!"పూర్వంలా కార్యక్రమాలు బావుండటం లేదండీ" అంటున్నాం కానీ ఆలోచిస్తే అన్ని కార్యక్రమాలూ వినే చేస్తున్నామా ఈ కమెంట్?పోనీ ఏదైనా కార్యక్రమం బాగున్నపుడు "ఇది బాగుంది" అని ఒక్క ఉత్తరం ముక్కయినా రాశామ?ఫోన్ చేసి అయినా చెప్పామా? ______________నిజమే! ఇప్పటికీ రోజూ రేడియో వినే నాకు "ఈ ప్రోగ్రాము బాగుంది"అనుకోడం తప్ప ఉత్తరం రాయొచ్చనే ఆలోచన రాదు ఎంచేతో మరి!

"రేడియో ప్రజలకు సేవలు అందించడమే కాక చైతన్య వంతులను చేసింది.చెవినిల్లు కట్టుకుని పోరినట్టు మరీ చైతన్యవంతులను చేసింది"అంటారామె! అక్షర సత్యం కాదూ!

"చైతన్యమే కాదు, సామాన్య ప్రజల జీవితాలకు కళా సౌరభాన్ని అద్ది, కళల పట్ల ఆసక్తిని పెంచింది కూడా" అంటాను నేనైతే!

లెక్కలేనన్ని విశేషాలతో వచ్చిన ఈ పుస్తకం రేడియో అభిమానులకు శారదగారు "అదర్రా కథ" అని చెప్తూ పెట్టిన తీపి తాయిలం లాంటిది.


కానీ ఈ పుస్తకంలో అసంఖ్యాకమైన ఆంగ్లపదాలు అలవోగ్గా దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. మాట్లాడుతున్నట్లుగానే భావించి రాస్తూ వెళ్ళడం వల్ల కాబోలు, చక్కని తెలుగు పదాలు రాయదగ్గ చోట కూడా ఇంగ్లీష్ పదాలు అనేకం చోటు చేసుకున్నాయి.

రెక్టాంగులర్ టేబుల్, ఎక్స్పెరిమెంటల్ ప్లేస్ (ప్రయోగాత్మక నాటకాలు) , స్టాండర్డైజ్, సెంట్రల్ అండ్ స్టేట్ ఫంక్షన్స్, గ్రీవెన్సెస్,హయ్యర్ అఫీషియల్స్ నుంచి అబ్జెక్షన్స్,________ ఇలా ఎన్నెన్నో! ఇవి కాస్త తగ్గి వాటి స్థానంలో తెలుగు పదాలుంటే బాగుండేదనిపించింది !


ఇది చదువుతూ ఉంటే నాకు ఇదంతా శారదగారి గొంతులోంచి విన్నట్టుగానే అనిపించింది.అందువల్ల ఇందుమూలంగా నేను శారదా శ్రీనివాసన్ గారికి చేసే విజ్ఞప్తి,డిమాండ్,విన్నపం ఏమిటంటే దీన్ని తన స్వరంతోనే ఆడియో బుక్ గా తీసుకురావాలని. అలా అయితే కార్లో పోతూనో,మరేదైనా పని చేసుకుంటూనో రేడియో విన్నట్లు వినొచ్చు హాయిగా! 


అయితే ఈ పుస్తకం కాపీలన్నీ అమ్ముడు పోయాక ఆ పని చేయాలి. ఎందుకంటే శారదగారి ఆడియో బుక్ వస్తే దీన్ని ఎవరు కొంటారు మరి?   :-))))


ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో సిద్ధంగా ఉన్న 200 పేజీల  ఈ పుస్తకం వెల నూట పాతిక రూపాయలు!

34 comments:

Saahitya Abhimaani said...

"....శారదా శ్రీనివాసన్ గారికి చేసే విజ్ఞప్తి,డిమాండ్,విన్నపం ఏమిటంటే దీన్ని తన స్వరంతోనే ఆడియో బుక్ గా తీసుకురావాలని..."

I second your proposal.

Saahitya Abhimaani said...

"...రేడియో అనౌన్సర్లూ,కళాకారులంటే పెద్ద సెలబ్రిటీ వర్షిప్! విజయవాడ అనౌన్సర్లూ కళాకారుల కున్న ప్రతిభ హైద్రాబాదు వాళ్ళకి లేదని ఒక పెద్ద అపోహలో ఉండేవాళ్ళం! ..."

అపోహ కాదు ఇప్పటికీ నా అభిప్రాయం అదే. కాని ప్రస్తుత రాజకీయ వాతావరణం వాళ్ళ ఈ మాట అనకూడదేమో మరి. కాని నా అభిప్రాయం చెప్పుకోవటంలో తప్పులేదనిపిస్తున్నది.

అప్పట్లో నండూరి విఠల్ గారి నాటికలు ఆయన గొంతు, సంభాషణలు పలికే తీరు చాలా బాగుండేది. హైదరాబాదు కేద్రంలో నాకు నచ్చిన కార్యక్రమాలు పంట సీమలు, అలనాటి పిల్లల కార్యక్రమాలు (న్యాపతి వారివి), కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం, తరువాత్తరువాత నవలా స్రవంతి. హైదరాబాదు నాటికలు సామాన్యంగా కృతకంగా అనిపించేవి, ఒక మైకు చుట్టూ కూచుని పాత్రకొకరు చొప్పున చదువుతున్నట్టు ఉండేవి. దర్శకత్వ లోపం అయి ఉండాలి.

ఇప్పుడు అన్ని కేంద్రాల్లోనూ కార్యక్రమాలు చాలా సాదా సీదాగా ఉంటున్నాయి. బాగున్నవి ఉంటే తప్పకుండా ఫోన్ చేసి, లేదా కేంద్రానికి వెళ్ళి మరీ చెప్పేంత అభిమానం రేడియో కార్యక్రమాల మీద ఉన్నది కానీ ....

ఈ పుస్తకంలో అలనాటి కళాకారుల ఫొటోలు, ఇతర కళాకారుల గురించిన విశేషాలు ఏమైనా ఉన్నాయా?

సుజాత వేల్పూరి said...

శివరామ ప్రసాద్ గారూ, ఈ పుస్తకంలో ఎంతోమంది కళాకారుల గురించిన విశేషాలూ, ఫొటోలూ కూడా ఉన్నాయి. అనేక పాత నాటకాల వివరాలున్నాయి.

ఆదివారం వచ్చే చిన్నక్క ఏకాంబరం ప్రోగ్రాము విజయవాడ స్టేషన్ రిలే చేయడం వల్ల క్లారిటీతో ఉండి బాగుండేది. క్వాలిటీ కూడా బాగుండేదనుకోండి! డైరెక్ట్ గా హైద్రాబాదు ప్రోగ్రాములు వింటే పేలవంగానే అనిపించేవి అప్పట్లో!

మీ ఊహ కరెక్టే! రేడియో నాటకాలు అలాగే మైకు చుట్టూ కూచునే చదివే వారట! ఫొటోలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు నేను హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటాను. FM కూడా ఆలిండియా రేడియో వాళ్ళ Rain bow FM మిగతా వాటికంటే నాణ్యత పరంగా మెరుగ్గా ఉంది. పాత పాటలు వేస్తున్నారు ఇంకా! యాడ్స్ తక్కువ!

హైద్రాబాదు A కేంద్రం కార్యక్రమాలు వినేంత సమయం ఉండదు. పైగా ఈ షార్ట్ వేవ్, మీడియమ్ వేవ్ లు మార్చుకుంటూ వినడం నాకో పెద్ద తికమక!

ఆత్రేయ said...

భలే ఊరించారు, పుస్తక వివరణ తో ...
ఎప్పటినుంచో బాకీ ఉన్నా ఈ పుస్తకం కొనడం,
రేపు పొద్దున్నే కొంటాను.
ధన్యవాదములు

Anonymous said...

నేనైతే ఒకడుగు ముందుకేసి చదువుకునేటపుడు కూడా రేడియో వింటూ చదివేదాన్ని!

ఎలా చదవగలుగుతారండీ అలాగ. మా చెల్లి కూడా నెట్లో పాటలు వింటూ చదువుతోంది.
విషయానికి వస్తే మీ పోస్టు బావుందండీ. ఆవిడ గొంతులో వచ్చినా నేనైతే పుస్తకం కొని తీరుతాను. పుస్తకంగా చదివిన అనుభూతి వేరుకదండీ.

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా చక్కని పరిచయం ఇచ్చారు సుజాత గారు రేడియో కబుర్లు వినడం లొ..ఉన్న ఆనందం అంతా-ఇంతా కాదు.శారద గారి జ్ఞాపకాలలో అంటే ..అది అమౄతసేవనం లాటిదని నా అభిప్రాయం. మీ పరిచయం అపురూపం.ధన్యవాదములు.

Sreenivas Paruchuri said...

Just saw this blog cross-posted on Pappu Nagaraju-gaaru's Buzz and left the following comment.

చాలా సంతోషాన్ని కలిగించిన వార్త!! "కాలాతీత వ్యక్తులు" చాలా పెద్ద నాటకం. నా దగ్గర ఆడియో వుంది. రాబోయే "ఈమాట" సంచికల్లో వినిపించగలను. నేనా పుస్తకం ఆగస్టులో ఇండియా వచ్చేవరకు చదివే అవకాశం లేదు కాబట్టి, ఆవిడ ప్రస్తావించిన పాత కార్యక్రమాల లిస్టు ఇవ్వండి. ఏవి అందుబాటులో వున్నాయో చెప్పగలను.

హైదరాబాదు కేంద్రంకంటే విజయవాడ వారి ప్రోగ్రాములే బాగుండేవని నేను నమ్ముతాను. దేవులపల్లి, రజని, స్థానం నరసింహరావు, శ్రీరంగం గోపాలరత్నం గార్లు అక్కడ పనిచేసిన రోజుల్లో కూడా (పాలగుమ్మి గారు ఎప్పుడూ అక్కడే పనిచేశారనుకొండి!) ఎందుకనో గొప్ప (comparatively speaking!) కార్యక్రమాలు రాలేదు.

Regards,
Sreenivas

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్ గారూ,
కాలాతీయ వ్యక్తులు నాటకం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అయితే! శారదగారు ప్రస్తావించిన కార్యక్రమాల్లో ఎక్కువ భాగం నాటకాలే ఉన్నాయి. అందులోంచి కొన్ని ఇస్తున్నాను చూడండి_____

పురానా ఖిల్లా నాటకం
బలిపీఠం నాటకం(ఇందులో యద్దనపూడి సులోచనా రాణి తార వేషం వేశార్ట)
మాంచాల నాటకం
పైరు పాట రూపకం
"బావొస్తే.."రూపకం సంక్రాంతి సదర్భంగా (కృష్ణ శాస్త్రి గారిది)
వేణు కుంజం సంగీత రూపకం
అడపా రామకృష్ణారావు గారి "నిర్మల" నాటకం
అనితర సాధ్యుడు నాటకం
రాగరాగిణి నాటకం
సిద్ధాంతి నాటకం
సీతాపతి నాటకం
పరితాపం నాటకం
ఇందుమతి 15 నిమిషాల నాటిక
పాకుడు రాళ్ళు(మంజరి పాత్ర శారద గారిదే)
ఊరిచివర ఇల్లు నాటకం
నల్లజర్ల రోడ్డు నాటకం
సెక్రెటరీ(యద్దనపూడి)నాటకం
విజేత (యద్దనపూడి)నాటకం________ఇలా చాలా ఉన్నాయండి!

హైద్రాబాదు రేడియో కార్యక్రమాల నాణ్యత గురించి నాది అపోహ కాదన్నమాట అయితే! మీరూ, శివప్రసాద్ గారు కూడా చెప్పాక అది నమ్మకమే అని నిశ్చయమైంది

Manasa Chamarthi said...

రేడియో అంటూ మొదలెట్టిన మొదటి పేరా చదవగానే నా మనసు సగం సంతోషంలోనూ సగం బాధలోనూ కూరుకుపోయింది. ఆ పాత కాలం పాటలని వింటూ చదువుకోవడం చాలా తేలిక నిజానికి. ఇప్పటి పాటలంత హోరు ఉండదు కాబట్టి.

ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఆత్మీయంగా గుర్తు చేసిన మీ శైలి బాగా నచ్చింది. ఈ పుస్తకాన్ని ముందు చదువుతానో మీ కోరిక ఫలిస్తే ఆ ఆడియో ముందు వింటానో చూడాలిక :))

maa godavari said...

sujata
mee riview bhumikalo vestunnaanu. ok na

Sreenivas Paruchuri said...

మీరు ఇచ్చిన జాబితాలో నాకు తెలిసినవి, నా దగ్గరున్నవి: పురానా ఖిల్లా, బలిపీఠం
"బావొస్తే..", "వేణు కుంజం" సంగీత రూపకాలు (పాలగుమ్మిగారు చేసినవి), పాకుడు రాళ్ళు. నాకు యద్దనపూడిగారి నవలల్లో ఎలాంటి ఆసక్తి లేనందున వాటిని గురించి ప్రయత్నం చేయలేదు :). పురూరవ, సుప్తశిల, యమినీ పూర్ణతిలక, కాలాతీత వ్యక్తులు, మొదలైన నాటకాల సేకరణలో చూపిన శ్రద్ధ మిగిలిన వాటి విషయంలో చూపలేదు. పుస్తకం చదివిన తరువాత వివరంగా రాస్తాను.

-- శ్రీనివాస్

జాన్‌హైడ్ కనుమూరి said...

ఈ బ్లాగు చదివాక పుస్తకం కొనదలుచుకొలేదు
ఎన్నాళ్ళయినా ఆడియోకోసం ఎదురుచూస్తాను

తృష్ణ said...

బంధుత్వం లేకపోయినా అంతకు మించిన ఆత్మీయ అనుబంధం శరదత్తతో మాకు. శ్రీనివాసన్ మామ మంచి వేణుగాన విద్వాంసులు.నిన్న రాత్రి మీ టపా చూసి శరదత్తకు చెప్పాను. చాలా సంతోషించారు.ఆకాశవాణి ఆర్కైవ్స్ లో ఆనాటి పాత నాటకాలేవీ లేవన్నారు ఆవిడ.
నిన్న వ్యాఖ్య రాయలేకపోయాను.

ఇటివల ఆవిడను కలిసినప్పటి ఫోటో ,ఈ పుస్తకం వివరాలతో టపా రాద్దామనుకుంటూన్నాను..పుస్తకం నాకు ఇంకా అందలేదు. మంచి పని చేసారు సుజాతా. శారదత్త వంటి గొప్ప కళాకారుల విలువ ఈనాటి తరాలకు తెలవాలి. వీలైయ్యాక నేనూ ఓ టపా రాస్తాను..:)
జ్వరం వల్ల ప్రస్తుతానికి ఇంతకన్నా రాయలేకపొతున్నా.

సుజాత వేల్పూరి said...

తృష్ణ,

ఈ పుస్తకంలో రామంగారి ఫొటో, ప్రస్తావన కూడా ఉన్నాయి. వీలైనంత త్వరగా చదవండి పుస్తకం!

జాన్ గారూ, భలే వారేనండీ మీరు! శారద గారి వాయిస్ అంటే మీకు ఎంత ఇష్టమో, అభిమానమో నాకు బాగా తెలుసు. ముందు పుస్తకం చదవండి. కావాలంటే నేను అప్పిస్తా!

ఒకవేళ ఆడియో బుక్ వేసే ఆలోచన ఆమెకు లేకుంటే పుస్తకం చదవరా ఏమిటి? ఆడియో బుక్ వస్తే మరింత బాగుంటుందని అభిమానులుగా మనం కోరదాం!

పోనీ వాళ్లింటి ముందు ఒక టెంట్ వేసేద్దామేమిటి?

సుజాత వేల్పూరి said...

ఆత్రేయ,:-)

తప్పక కొని చదవడి!

పవన్,
సంగీతానికున్న మహాత్యం అది! ఏకాగ్రత పెంచుతుందే కానీ తగ్గనివ్వదు. పైగా నేను వినేది అప్పట్లో ఓల్డ్ క్లాసిక్స్ ! మీరన్నది కరెక్టే! పుస్తకం చదివిన అనుభూతి వేరంటే వేరు. తప్పక చదవండి!

వేణు గారూ,
మునిపల్లె రాజు గారి ముందుమాట గురించి నేను ప్రత్యేకంగా ఒక పేరా అయినా రాసి ఉండాల్సింది. అంత కవితాత్మకంగా, ఏదో అలౌకిక లోకాల్లో విహరిస్తూ (శారదగారి వరం విన్న మాదక పరవశంలో) రాసినట్లుంది.

సుజాత వేల్పూరి said...

వనజ వనమాలి గారూ,
అయితే మీరూ రేడియో ప్రియులేనన్నమాట! చాలా సంతోషమండి! రేడియో ప్రియులెవరైనా తారసపడితే చిన్నపుడు తప్పి పోయిన మిత్రులని చూసినట్టు ఉంటుంది నాకు!

మానస, రేడియోని తల్చుకుంటే నాకూ అలాంటి తెలీని బాధే కల్గుతుంది నిజానికి!

చలం పురూరవ విన్నావా నువ్వు? వినలేదంటే పంపిస్తాను.

పుస్తకం మాత్రం మిస్ కావొద్దు! తప్పక చదవాలి నువ్వు! ఎందుకంటే నువ్వు చదివాక నా కంటే అందంగా రాయగలవు కాబట్టి!

సత్యవతి గారు,
అలాగే వేయండి!

జాన్‌హైడ్ కనుమూరి said...

సుజాత గారు మీ బ్లాగుముందు టెంటు వెయ్యాల్సి వస్తుందేమో
మునిపల్లె రాజు గారి గురించి వ్యాక్యలలో ప్రస్తావిస్తున్నందుకు

ఇప్పటికి ఎదురుచూపు ఆపి పుస్తకం చదవాడానికి ప్రయత్నిస్తాను.
ఈ మధ్య నేను బయటికి వెళ్ళలేకపోతున్నా పుస్తకం దొరకబుచ్చుకోవడమే అసలైన పని ఇప్పుడు

రాజ్ కుమార్ said...

నాకు ఊహతెలిశాకా రేడియో విన్నవీ..గుర్తున్నవీ..
"ఏంటి రామయ్యా దీర్ఘం గా ఆలోచిస్తున్నావ్?.."
"వార్తలూ.. చదువుతున్నదీ.. ప్రయోగ రామకృష్ణ"..

ఇవి మాత్రమే నండీ.. మిగిలిన వాళ్ళ గురించీ ఈ రోజు ఈ పోస్ట్ లోనే చూసాను. నైస్ పోస్ట్ అండీ.. ;)

పద్మవల్లి said...

సుజాత గారూ, నాది మీ బాటే, రేడియో వింటూ చదువుకునేదాన్ని. ప్రక్కన రెడియోనో, రికార్డర్ గానీ మొగకపోతే అసలు చదువు సాగేదే కాదు. అబ్బా ఆ రోజులు తలుచుకుంటేనే దిగులేస్తుంది.
ఈ పుస్తకం నా లిస్ట్లోకి ఎక్కి పోయింది. ఎప్పుడు చదువుతానో తెలీదు గానీ. చాలా వివరంగా రాసారు. పురూరవ ఎప్పుడో విన్నాను. నంకు కూడా పంపగలర.. ప్లీఈఈఈఈఈఈఈజ్.

వేణు said...

శ్రీనివాస్ పరుచూరి గారూ! శారదా శ్రీనివాసన్ గారు తన పుస్తకంలో ప్రస్తావించిన మరికొన్ని నాటకాల జాబితా ఇది. వీటిలో మీరు ఎన్ని సంపాదించి పాఠక శ్రోతలకు సంతోషం కలిగిస్తారో మరి!

కృష్ణశాస్త్రి: అతిథి శాల, శర్మిష్ఠ (సంగీత రూపకం)
‘ఎంకి’ నండూరి సుబ్బారావు: ఉత్తమా ఇల్లాలు
దాశరథి : తుంగభద్ర
బుచ్చిబాబు: సోక్రటీస్, దాగుడుమూతలు, ఆత్మవంచన
గోపీచంద్ : మేఘసందేశం
రంగనాయకమ్మ : సరికొత్త మనుషులు
వాసిరెడ్డి సీతాదేవి: మట్టిమనుషులు
మాలతీ చందూర్ : రాగం అనురాగం
ద్వివేదుల విశాలాక్షి : మారిన మనుషులు
ధనికొండ హనుమంతరావు : గుడ్డివాడు
దాశరథి రంగాచార్య : చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు
పోరంకి దక్షిణామూర్తి : ముత్యాల పందిరి
బలివాడ కాంతారావు : దగాపడిన తమ్ముడు, సంపంగి

గ్రీకు నాటకం - మెదియా (నాటకీకరణ: గోవిందరాజు రామకృష్ణారావు)
శివరామ కారంత్ : మరణానంతరం (నవలా పఠనం)
త్రివేణి (కన్నడ) : పాప పరిహారం
దోస్తయేవ్ స్కీ: నేరము-శిక్ష
పి.వి. నరసింహారావు : ఎవరు లక్ష్యపెడతారు? (నాటకీకరణ : నండూరి విఠల్)


శివం గారి నాటకీకరణ: పొగమేడ
నార్ల చిరంజీవి: భాగ్యనగరం
కె. చిరంజీవి: ఆకలి మందు, కాలయంత్రం, వంశాంకురం, శ్రీకృష్ణ శిరోభారం, ఊరోల్లు మేల్కొంటున్నరు, మహాభినిష్క్రమణం
డి. వెంకట్రామయ్య : వెన్నెల వాన, రంగు వెలిసిన మనుషులు.
తురగా కృష్ణమోహనరావు : నవ్వులు పండితే ఉగాది, పరీక్ష
సోమంచి యజ్ఞన్నశాస్త్రి : పెద్దమనుషులు
నండూరి విఠల్ : కాలకన్య , అశ్వఘోషుడు, ప్రతిమ
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: శిలామురళి, తలుపు (రూపకం)
శ్రీనివాసన్ : ఆర్ట్సిస్ట్స్ కాలనీ
పుట్టపర్తి నాగపద్మిని : ఆదిత్య ప్రభ
బి.వి. రమణారావు : పతిత వ్రత (ఆత్మహత్య), సంధ్యావందన మహాత్మ్యం, సంధ్యా సమయం, శశిలేఖాపహరణం, తమసోమా జ్యోతిర్గమయ
చెరుకుమిల్లి భాస్కరరావు: షిరీన్ ఫర్హాద్, శుభలేఖ
శ్రీమతి ఉమానాయుడు: యత్ర నార్యస్తు పూజ్యంతే.
భాస్కరభట్ల కృష్ణారావు: నిరీక్షణ

ఆ.సౌమ్య said...

ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండీ...పొద్దున్నే వచ్చే భక్తిరంజని, 8.30 కి సంగీతం, తరువాత మనోరంజని. ఆదివారం పొద్దున్న వచ్చే బాలభారతి (వచ్చే ఆదివారం నాడు మళ్ళీ వద్దాం ఇకపోదాం) మధ్యానం వచ్చే కథానిక, నాటకం...చెవి కోసుకునేవాళ్ళం దీనికోసం. ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని వచ్చి రేడియోముందు సెటిల్ అయిపోయేవాళ్ళం. కార్మికుల కార్యక్రమమ, యువవాణి, వార్తలు...అబ్బా ఒకటా, రెండి అహ్హా ఎన్ని మధుర జనాపకాలు...కాల గిర్రున వెనక్కి తిరిగి అక్కడకి వెళ్ళి ఆగిపోతే ఎంత బావుంటుంది!

వాటి విశేషాలన్నీ పుస్తక రూపంలో శారదగారు చెప్పారంటే...చదివితే ఒళ్ళు పులకిస్తుందేమో కదా! హ్మ్ నేను చదవాల్సిన పుస్తకాలలో మరోటి చేరింది. మీ పోస్ట్ చదివి భలే ఉత్సాహం వచ్చిందండీ!

ఆ.సౌమ్య said...

అన్నట్టు బాలానందం పాటలు, నాటకాలు కొన్ని నాదగ్గరున్నాయి...ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను!

సుజాత వేల్పూరి said...

హైద్రాబాదు కార్యక్రమాల్లో నాకు బాగా నచ్చేవి(అప్పట్లో) ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వేసే సంక్షిప్త శబ్ద చిత్రం! మూడు గంటల సినిమాని, కథంతా అర్థమయ్యేలా గంటకి కుదించడం భలేగా ఉండేది.

అలాగే ఆదివారం మధ్యాహ్నం వచ్చే బాల వినోదం! తురగా జానకీ రాణిగారు వచ్చేవారు.అందులో కంగారు మావయ్య, వెంగళప్ప ల కోసం ప్రతి ఆదివారమూ ఎదురు చూసేవాళ్ళం!

కంగారు మావయ్యగా ఎవరు వేసేవారో ఎవరికైనా తెలుసా? సుధామ గారని మా అమ్మ అనేది కానీ కంగారు మావయ్య గొంతు అంత గంభీరంగా ఉండేది కాదు మరి!

బాల వినోదంలో అప్పుడప్పుడూ వేసే పాటల్లో 'అల్లదిగో శ్రీశైలం" "నారాయణ నారాయణ అల్లా అల్లా" పాటలు, చాలా నచ్చేవి. అలాగే అలకనంద అనే పిల్ల గాయని "పప్పా పాట పాడనా" అనే పాటతో చాలా చాలా ఫేమస్ అయిపోయింది!

ఇంకోటి, చిత్తరంజన్ గారు నిర్వహించిన కలసి పాడుదాం ! ఆదివారం ఉదయం ఎనిమిదన్నరకు వచ్చేదని గుర్తు!ఎన్ని భాషల పాటలు రాసుకుని నేర్చుకున్నామో!

సుజాత వేల్పూరి said...

రాజ్ కుమార్,

చార్మినార్ రేకుల యాడ్ ఆ యాడ్లో చెప్పినట్టే మా తాతగారి తరం నుంచీ వస్తోంది రేడియోలో!:-))
ప్రయాగ రామకృష్ణ గారు ఇప్పటికీ వార్తలు చదువుతూనే ఉన్నారు.

సుజాత వేల్పూరి said...

సౌమ్యా, నీ దగ్గరున్న కార్యక్రమాలు నీ బ్లాగులో అప్ లోడ్ చేయి త్వరగా!

ఈ పుస్తకం చాలా బాగుంది. తప్పక చదవాలి. అమ్మో, అలా చూస్తున్నావేమిటి? ఏదో ప్రపోజల్ పెట్టేలా ఉన్నావే! నేను వెళ్తున్నా....!

నైమిష్ said...

సుజాత గారు చాలా బాగుందండీ..తప్పకుండా చదవాల్సిన పుస్తకం...ఈ మధ్యే ప్రయాగ రామక్రిష్ణ గారిని కలవటం జరిగింది..మా ఆఫీస్ లో "Leadership Lessons from Epics" కార్యక్రమం నిర్వహించారు వారు..తెలుగు మాధ్యమం లో వారు రెండు గంటలకు పైగా ఉపన్యసించారు..his presentation leaves Audience spell bound..వారు రాసిన రెండు పుస్తకాలు కూడా నా సొంతమయ్యాయి..

Sreenivas Paruchuri said...

All seem to be in nostalgic mood. నా దృష్టిలో తెలుగు బ్లాగుల్లో ఎక్కువ శాతం "nostalgic writings". :-)

వేణు గారు: మీరిచ్చిన లిస్టులో క్రిందివి:
కృష్ణశాస్త్రి: అతిథి శాల, శర్మిష్ఠ (సంగీత రూపకం)
‘ఎంకి’ నండూరి సుబ్బారావు: ఉత్తమా ఇల్లాలు
వాసిరెడ్డి సీతాదేవి: మట్టిమనుషులు
దాశరథి రంగాచార్య : చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు
దోస్తయేవ్ స్కీ: నేరము-శిక్ష
నార్ల చిరంజీవి: భాగ్యనగరం
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: శిలామురళి, తలుపు (రూపకం)
దొరుకుతాయి. రజనిగారి "అతిధిశాల" (one of my all time favourites) 1959లో హైదరాబాదులో మరల రికార్డు చేయబడింది. మొదటి version, from 1940s, మద్రాసులో చేసినది ఎప్పటికైనా బయటపడితే బాగుండును. (అలాగే రజని, బాలమురళిగార్లు 1950ల్లో విజయవాడలో చేసిన మేఘసందేశం - తెలుగు version కూడా. 1978 లో చేసిన సంస్కృత రూపకమే ఇప్పుడు దొరుకుతుంది.) నార్ల చిరంజీవి: భాగ్యనగరం నేను, వంశీగారు upload చేయడం జరిగింది.

> "Leadership Lessons from Epics"

Amen!! మహాభారతం నుండి MBA లు చదవకుండా management ఎలా నేర్చుకోవచ్చో చాలాకాలంగా powerpoint ద్వారా కొందరు బోధిస్తున్నారు.
http://www.lifepositive.com/Mind/Corporate_Management/Leadership_secrets_from_the_Mahabharata92004.asp

http://www.managementparadise.com/forums/discussion-archieve-management-paradise-newsletter/22915-mahabharata-management-bible.html

http://www.slideshare.net/chiragdarji/management-lesson-from-mahabharat

Epics నుండేమిటి, భవద్గీతనుండి:
http://www.themystica.com/mystica/articles/b/bhagavad_gita_and_management.html
పిల్లల డాక్టర్లనుండి, సంగీత నిర్దేశకులనుండి (music conductors), యోగ విద్య ద్వారాను, గృహిణులనుండి, ఇంకా ఎందరినుంచో కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి amazonలో leadership అన్న మాటిచ్చిచూడండి :-)

Regards,
Sreenivas

సుజాత వేల్పూరి said...

మన నోస్టాల్జియాలు ఎవరికి చెప్తే ఎవరు వింటారు? ఇందుకే ఇలా బ్లాగుల్లో రాసుకోడం!పాత జ్ఞాపకాలు తిరగేసుకోడానికి బ్లాగుల కంటే మంచి స్థలమెక్కడుందంటారు?

పైగా రేడియో కంటే నోస్టాలిజియా ఏముందంటారు?

తార said...

అసలు ఈ రెడియో గొడవేందో మాకు తెలియదు, కాస్త పరిచయం చేస్తే, ఆ ఆడియోలు గట్రా పరిచయంచేస్తే మాకు కొద్దిగా తెలుస్తుంది, మీకు సమయం ఉంటే కొద్దిగా మంచి రికార్డులు పరిచయం చెయ్యమని మనవి.

క్రితం ఏడు, ఇలానే ఎవర్నో అడిగితే తిట్టి పెట్టారు తప్ప, గొప్పగా చేసింది ఎమైనా ఉన్నదో లేదో తెలియదు.

oremuna said...

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు, ఇప్పుడు కినిగెలో లభిస్తుంది ఈపుస్తకంగా. ఇక్కడ చూడండి

S said...

కినిగె పుణ్యమా అని, పుస్తకం సగం లో ఉన్నాను. చాలా బాగుంది. సగం చదివాకే, మరీ రాత్రైపోతోంది అని ఆగాను నిన్న :) ఒకసారి అనుకోకుండా శారద గారిని కలిసి కాసేపు మాట్లాడాను (అప్పటికి ఆవిడెవరో తెలీదు. తెలిసుంటే బాగుండేది! ప్చ్!). మీరన్నట్లు, ఆవిడ గొంతులో వింటే, అద్భుతంగా ఉంటుంది!

రామ said...

నిన్న ఇదే కామెంటు పుస్తకం.నెట్ లో కూడా రాసాను. విశాఖపట్నం కేంద్రం లో అనుకుంటాను - పాత రేడియో కార్యక్రమాల రికార్దింగులన్నీ సీడీ ల రూపం లో అమ్ముతారని ఎప్పుడో ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్యాసం చదివినట్టు గుర్తు.

సుజాత వేల్పూరి said...

rama గారూ, పాత కార్యక్రమాల రికార్డింగులు విశాఖ పట్నంలోనే కాదండీ, విజయవాడ, హైద్రాబాదు రేడియో కేంద్రాల్లో కూడా అమ్ముతున్నారు. భక్తి రంజని కార్యక్రమాలు,గణపతి,వరవిక్రయం వంటి నాటకాలూ నేను కొన్నాను

Aruna said...

అమ్మయ్య ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు లిస్టు లో ఈ బుక్స్, ఆకాశవాణి ప్రోగ్రామ్స్ CD లు అన్ని రాసుకుంటున్న. చాల చాల చాల సంతోషం గా ఉంది ఈ రోజు. radio ప్రోగ్రామ్స్ అన్ని దొరుకుతున్నాయి అంటే ఇంకేమి కావలి.

Post a Comment