నిన్న సౌమ్య బజ్ లో కృష్ణ వేణి సినిమా ప్రసక్తి వచ్చింది. ఈ సినిమా నాకు తెల్సి ఆన్ లైన్ లో ఎక్కడా లేదు. కోఠీలోని నవభారత్ వీడియోస్ లో అడిగాను(వాళ్ల దగ్గర మూకీ సినిమాలు కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే).వాళ్ళూ అది డీవీడీగా రాలేదన్నారు. కానీ ఆ సినిమాని నేను దాదాపు పదేళ్ళ కిదట దూరదర్శన్ లోనో ఈ టీవీ లోనో చూసిన గుర్తు! సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు మూడు రోజులు నిద్ర రాలేదు. ఎక్కడికి వెళ్ళినా వాణిశ్రీ వెంటాడుతూ ఉండేది.ఈ సినిమా కోసం నా అన్వేషణ ఇంకా కొన సాగుతూనే ఉందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను!
కృష్ణం రాజు సొంత బానర్ గోపీ కృష్ణా మోవీస్ తీసిన అత్యుత్తమ సినిమా అది! మూలం కన్నడ సినిమా శర పంజర!(వికీ లో వెదకండి) అందులో కావేరి నది మీదుగా కథ నడిస్తే తెలుగులో కృష్ణా నది బేస్ గా కథ నడుస్తుంది.
ప్రసవానంతరం కొందరు స్త్రీలకు బలహీనత వల్ల, ప్రసవంలో పడిన కష్టం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయనే విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ అలాంటి కేసులు నేను స్వయంగా చూశాను.
మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి అలా జరిగి పిల్లాడిని పట్టించుకోకుండా "నన్ను చంపేశారు, నన్ను చంపేశారు" అని ఏడుస్తూ జుట్టు పీక్కునేది. అప్పుడు మేము మరీ చిన్న పిల్లలం కావడం వల్ల వింతగా భయంగా చూసి పరిగెత్తుకొచ్చేసేవాళ్ళం! అయితే ఆమె తల్లి దండ్రులు ఆమెకు సరైన చికిత్స చేయించకుండా "పురిట్లో దెయ్యం పట్టింది! పైగా హత్యకు గురైన ఆడమనిషి దెయ్యం(నన్ను చంపేశారు అంటోందిగా మరి) అని ఏవేవో పిచ్చి వైద్యాలు చేయించి తిండి పెట్టకండా ఆమె మరణించే దాకా అసామాన్య కృషి చేశారు.
"నన్ను చంపేశారు"అన్న మాట బహుశా ఆమె పురిటి నొప్పులను ఉద్దేశించి వేరేగా బయట పెడుతుందేమో అని ఒక్కరూ ఆలోచించలేదని పెద్దయ్యాక అర్థమై చాలా బాధ వేసేది.
కృష్ణ వేణి సినిమా కూడా ఇదే దార్లో నడుస్తుంది.
రెండో కానుపులో వాణిశ్రీకి బలహీనత కలుగుంది. కృష్ణం రాజుతో కల్సి అమరావతి ట్రిప్ కి వెళ్ళినపుడు కౌమార దశలో గుర్తు తెలియని వ్యక్తీ ఆ నదీ తీరంలో ఆమె మీద జరిపిన అత్యాచారం(ఇదే అనుకుంటాను context...(లేక ఎవరినా ప్రేమిస్తుందా? సరిగా గుర్తు రావడం లేదు) సంగతి జ్ఞప్తికొచ్చి విహ్వల పరిస్థితిలో ఆ ఇసుక మీద పడి "ఇక్కడే పోయింది, ఇక్కడే పోయింది" అని ఏడుస్తుంది. ఏం పోయిందో కృష్ణం రాజుకి అర్థం కాక ఇంటికొచ్చ్చాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక భార్య పెళ్ళీ నాటికి అనాఘ్రాత పుష్పం కాదనే కఠోర వాస్తవం అతడిని దిగ్భ్రాంతి పరుస్తుంది. జీర్ణం చేసుకోలేకపోగా భార్య తనను మోసం చేసిందనే ఫీలింగ్ లో పడతాడు.
ఆ మానసిక వ్యాధి ముదిరి కృష్ణ వేణిని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. పిల్లలిద్దరినీ మేనత్త పెంచుతుంది. ఇదే అదనుగా కృష్ణం రాజు తన ఆఫీసులో పని చేసే వాంప్ మంజు భార్గవి తో సంబంధం పెట్టుకుంటాడు.(అది అతనికి తప్పనిపించదు)
పరిస్థితి అదుపులోకి వచ్చి కృష్ణవేణి ఇంటికి వస్తుంది.దర్శకుడి(వి.మధుసూదన రావు) ప్రతిభ అంతా ఇక్కడినుంచీ మొదలవుతుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ! తిరిగి వచ్చిన కృష్ణ వేణిని ఎవరూ మామూలు మనిషిగా ఆహ్వానించరు. "పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన మనిషి"గానే చూస్తారు.
పిల్లలు దగ్గరికి రారు. వాళ్ళ మేనత్త కృష్ణవేణిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. భర్త దగ్గరికి వస్తే ఆయన అటుతిరిగి పడుకుంటాడు. "ఆమెకు ప్రేమ, ఆదరణ అవసరం"అని డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తున్నా, ఆవిడ "చెడిపోయిందనే" విషయమే అతడిని గాయపరుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, తన పనులన్నింటిలోనూ ఆమె కల్పించుకోబోతే ప్రయత్న పూర్వకంగా దూరంగా ఉంచుతాడు.
మనసులో కుములుతూనే మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది కృష్ణవేణి. చెల్లెలు పెళ్ళికి వెళ్తే "పిచ్చి తగ్గింది ఈ పిల్లకేగా"అనే చుట్టాల మాటలు వినపడతాయి. ఈమెకు పిచ్చి కి ట్రీట్ మెంట్ జరిగిందని తెల్సి పెళ్ళివాళ్ళు కాన్సిల్ చేసుకున్నంత పని చేస్తారు. "నాకు పిచ్చి లేదండీ, తగ్గిపోయింది"అని పెళ్ళి కొడుకు కుటుంబం కాళ్ళ మీద పడి ప్రార్థిస్తుంది కృష్ణవేణి. (ఆ పెళ్ళి జరగదనుకుంటాను).
భర్త తనను దూరంగా ఉంచుతున్నాడని అనుకుంటుందే కానీ అతనికి మరో స్త్రీతో సంబంధం ఉంటుందని అనుకోని కృష్ణవేణికి కొన్ని సూచనలు కనపడతాయి. ఒక పేరంటానికి వెళ్తే అక్కడ కూడా అక్కడి స్త్రీలు "ఈవిడే ఫలానా ఆయన భార్య! పిచ్చి తగ్గింది ఈవిడకే! అందుకే ఆయన ఫలానా ఆవిడతో ఉంటున్నాడు"అని మనకీ కృష్ణవేణికీ కూడా వినపడేలా గుస గుసలాడుకుంటారు.
ఆ పేరంటంలోనే "పదునాలుగేళ్ళు వనవాసమేగెను పరమ పావని సీతా"పాట పాడుతుంది.
ఆ పేరంటంలో విన్న మాటల వల్ల గాయపడిన మనసుతో ఇల్లు చేరిన కృష్ణవేణి బాల్కనీలో నిలబడి ఉండగా కాసేపట్లో మంజుభార్గవి తో సహా మొగుడు ఇంటి ముందు కారు ఆపుతాడు.
ఆ క్షణంలోనే ఆమె మనసు శత సహస్రాలుగా రక్తం చిందే ముక్కలుగా ఛిద్రమైపోతుంది. ఆ తీవ్ర మానసిక సంఘర్షణను అదిమి పెట్టే ప్రయత్నంలో,అవమానం,దుఃఖం ,నిస్సహాయత,మోసగించబడ్డ భావన,నైరాశ్యం,ఒంటరితనం ఈ భావాలన్నీ ఒక్కసారి చుట్టు ముట్టగా వాటిని బయట పడకుండా ఆపే ప్రయత్నంలో వింతగా పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ,(ఒక్క మాట కూడా బయటపడదు)చివరికి ఆమె వల్ల కాక ఒక్కసారిగా గుండె పగిలి ప్రాణాలు కోల్పోతుంది. నిట్టనిలువుగా మొదలు నరికిన చెట్టులా కుప్పకూలుతుంది__________భర్త పాదాల మీద!
ప్రాణం కోల్పోయి అతని పాదాల మీద పడటంలో కొంత నాటకీయత ఉన్నా, "నా ప్రేమ ఎప్పుడూ నీకే!నీ పట్ల ఎప్పుడూ విధేయతతోనే ఉన్నాను! కానీ..నువ్వే.....చూడు నా ప్రేమకు ఎలాంటి బహుమతి ఇచ్చావో?" అని బహుశా అతడిని నిలదీసి అడుగుతున్నట్టు అతడికి , ప్రేక్షకులకు చేరవేయడానికే దర్శకుడు అలా తీసి ఉంటాడనిపించింది!
ఈ సినిమా మొత్తం వాణిశ్రీదే! ద్వితీయార్థంలో కృష్ణవేణి అనుభవించే వేదనను ఇంకెవరైనా అంత బాగా చేయగలిగేవారా అంటే చేయలేరు అని తడుముకోనక్కర్లేకుండా జవాబు చెప్పేంత అద్భుతంగా చేసింది. పిల్లలని లాలించాలనుకున్నపుడు వాళ్ళు భయం భయంగా తొలగిపోయినపుడు,చెల్లెలు పెళ్ళిలో పెళ్ళికొడుకు తరఫు వాళ్ళని బతిమాలేడపుడు,పేరంటంలో స్త్రీలు "ఆవిడే ఆవిడే" అని చెప్పుకుంటున్నపుడు________వాణిశ్రీ నటన పతాక స్థాయిలో ఉంటుంది.
ఇహ ముగింపు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ వెంటాడి వేధించి తీరుతుంది. కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయే దృశ్యంలో వాణిశ్రీ నాకు వారం పాటు పదే పదే గుర్తొస్తుండేది. ఆ దృశ్యం అంత హృదయ విదారకంగా,కృష్ణ వేణి కోసం ప్రతి హృదయం ఆర్తితో కలవరించేలా ఉంటుంది.
చేయని తప్పుకు బలైపోయిన కృష్ణవేణి కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చేలా ఉంటుంది.
సింహాలో బాలకృష్ణకీ,అలా మొదలైందిలో నిత్యా కీ నంది అవార్డు ఇస్తే...ఈ సినిమాలో వాణిశ్రీ నటన జాతీయ అవార్డుకు ఒక మెట్టు పైనే ఉంటుంది.
దసరా బుల్లోడు సినిమా టివీలో చూసిన రెండు రోజులకే ఈ సినిమా చూశానేమో, ఇద్దరు వాణిశ్రీలూ ఒకరే అంటే నమ్మబుద్ధేయలేదు!:-))
ఈ సినిమాలో మంచిపాటలున్నాయి కూడా!
"సంగీతం...మధుర సంగీతం"
"ఎందుకో నువ్వు నాతో ఉన్న వేళ ఇంత హాయి"
కృష్ణ వేణీ తెలుగింటి విరిబోణీ
"పదునాలుగేళ్ళు వనవాసమేగిన పరమ పావని సీతా"
వంటివి.
విచిత్రం ఏమిటంటే ఈ సినిమా ఆడియోలు కూడా నాకు లింకులు ఎక్కడా దొరకలేదు.
ఈ సినిమా బయట డీవీడీ గా అలభ్యం! ఎప్పుడైనా టీవీలో వేస్తే మాత్రం మిస్ కాకుండా చూడండి...కేవలం వాణిశ్రీ నటన కోసం!
ఇదొక అద్భుతమైన కథ నిజంగా !


