August 10, 2011

కృష్ణ వేణీ..తెలుగింటి విరిబోణీ
నిన్న సౌమ్య బజ్ లో  కృష్ణ వేణి సినిమా ప్రసక్తి వచ్చింది. ఈ సినిమా నాకు తెల్సి ఆన్ లైన్ లో ఎక్కడా లేదు. కోఠీలోని నవభారత్ వీడియోస్ లో అడిగాను(వాళ్ల దగ్గర మూకీ సినిమాలు కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే).వాళ్ళూ అది డీవీడీగా రాలేదన్నారు. కానీ ఆ సినిమాని నేను దాదాపు పదేళ్ళ కిదట దూరదర్శన్ లోనో ఈ టీవీ లోనో చూసిన గుర్తు! సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు మూడు రోజులు నిద్ర రాలేదు. ఎక్కడికి వెళ్ళినా వాణిశ్రీ వెంటాడుతూ ఉండేది.ఈ సినిమా కోసం నా అన్వేషణ ఇంకా కొన సాగుతూనే ఉందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను!

కృష్ణం రాజు సొంత బానర్ గోపీ కృష్ణా మోవీస్ తీసిన అత్యుత్తమ సినిమా అది! మూలం కన్నడ సినిమా శర పంజర!(వికీ లో వెదకండి) అందులో కావేరి నది మీదుగా కథ నడిస్తే తెలుగులో కృష్ణా నది బేస్ గా కథ నడుస్తుంది.

ప్రసవానంతరం కొందరు స్త్రీలకు బలహీనత వల్ల, ప్రసవంలో పడిన కష్టం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయనే విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ అలాంటి కేసులు నేను స్వయంగా చూశాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి అలా జరిగి పిల్లాడిని పట్టించుకోకుండా "నన్ను చంపేశారు, నన్ను చంపేశారు" అని ఏడుస్తూ జుట్టు పీక్కునేది. అప్పుడు మేము మరీ చిన్న పిల్లలం కావడం వల్ల వింతగా భయంగా చూసి పరిగెత్తుకొచ్చేసేవాళ్ళం!  అయితే ఆమె తల్లి దండ్రులు ఆమెకు సరైన చికిత్స చేయించకుండా "పురిట్లో దెయ్యం పట్టింది! పైగా హత్యకు గురైన ఆడమనిషి దెయ్యం(నన్ను చంపేశారు అంటోందిగా మరి) అని ఏవేవో పిచ్చి వైద్యాలు చేయించి తిండి పెట్టకండా ఆమె మరణించే దాకా అసామాన్య కృషి చేశారు.

"నన్ను చంపేశారు"అన్న మాట బహుశా ఆమె పురిటి నొప్పులను ఉద్దేశించి వేరేగా బయట పెడుతుందేమో అని ఒక్కరూ ఆలోచించలేదని పెద్దయ్యాక అర్థమై చాలా బాధ వేసేది.

కృష్ణ వేణి సినిమా కూడా ఇదే దార్లో నడుస్తుంది.

రెండో కానుపులో వాణిశ్రీకి బలహీనత కలుగుంది. కృష్ణం రాజుతో కల్సి అమరావతి ట్రిప్ కి వెళ్ళినపుడు కౌమార దశలో గుర్తు తెలియని వ్యక్తీ  ఆ నదీ తీరంలో ఆమె మీద జరిపిన అత్యాచారం(ఇదే అనుకుంటాను context...(లేక ఎవరినా ప్రేమిస్తుందా?  సరిగా గుర్తు రావడం లేదు) సంగతి జ్ఞప్తికొచ్చి విహ్వల పరిస్థితిలో ఆ ఇసుక మీద పడి "ఇక్కడే పోయింది, ఇక్కడే పోయింది" అని ఏడుస్తుంది. ఏం పోయిందో కృష్ణం రాజుకి అర్థం కాక ఇంటికొచ్చ్చాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక భార్య  పెళ్ళీ నాటికి అనాఘ్రాత పుష్పం కాదనే కఠోర వాస్తవం అతడిని దిగ్భ్రాంతి పరుస్తుంది. జీర్ణం చేసుకోలేకపోగా భార్య తనను మోసం చేసిందనే ఫీలింగ్ లో పడతాడు.

ఆ మానసిక వ్యాధి ముదిరి కృష్ణ వేణిని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. పిల్లలిద్దరినీ మేనత్త పెంచుతుంది. ఇదే అదనుగా కృష్ణం రాజు తన ఆఫీసులో పని చేసే వాంప్ మంజు భార్గవి తో సంబంధం పెట్టుకుంటాడు.(అది అతనికి తప్పనిపించదు)

పరిస్థితి అదుపులోకి వచ్చి కృష్ణవేణి ఇంటికి వస్తుంది.దర్శకుడి(వి.మధుసూదన రావు) ప్రతిభ అంతా ఇక్కడినుంచీ మొదలవుతుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ! తిరిగి వచ్చిన కృష్ణ వేణిని ఎవరూ మామూలు మనిషిగా ఆహ్వానించరు. "పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన మనిషి"గానే చూస్తారు.

పిల్లలు దగ్గరికి రారు. వాళ్ళ మేనత్త కృష్ణవేణిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. భర్త దగ్గరికి వస్తే ఆయన అటుతిరిగి పడుకుంటాడు. "ఆమెకు ప్రేమ, ఆదరణ అవసరం"అని డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తున్నా, ఆవిడ "చెడిపోయిందనే" విషయమే అతడిని గాయపరుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, తన పనులన్నింటిలోనూ ఆమె కల్పించుకోబోతే ప్రయత్న పూర్వకంగా దూరంగా ఉంచుతాడు.

మనసులో కుములుతూనే మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది కృష్ణవేణి. చెల్లెలు పెళ్ళికి వెళ్తే "పిచ్చి తగ్గింది ఈ పిల్లకేగా"అనే చుట్టాల మాటలు వినపడతాయి. ఈమెకు పిచ్చి కి ట్రీట్ మెంట్ జరిగిందని తెల్సి పెళ్ళివాళ్ళు కాన్సిల్ చేసుకున్నంత పని చేస్తారు. "నాకు పిచ్చి లేదండీ, తగ్గిపోయింది"అని పెళ్ళి కొడుకు కుటుంబం కాళ్ళ మీద పడి ప్రార్థిస్తుంది కృష్ణవేణి. (ఆ పెళ్ళి జరగదనుకుంటాను).

భర్త తనను దూరంగా ఉంచుతున్నాడని అనుకుంటుందే కానీ అతనికి మరో స్త్రీతో సంబంధం ఉంటుందని అనుకోని కృష్ణవేణికి కొన్ని సూచనలు కనపడతాయి. ఒక పేరంటానికి వెళ్తే అక్కడ కూడా అక్కడి స్త్రీలు "ఈవిడే ఫలానా ఆయన భార్య! పిచ్చి తగ్గింది ఈవిడకే! అందుకే ఆయన ఫలానా ఆవిడతో ఉంటున్నాడు"అని మనకీ కృష్ణవేణికీ కూడా వినపడేలా గుస గుసలాడుకుంటారు.

ఆ పేరంటంలోనే "పదునాలుగేళ్ళు వనవాసమేగెను పరమ పావని సీతా"పాట పాడుతుంది.

ఆ పేరంటంలో విన్న మాటల వల్ల గాయపడిన మనసుతో ఇల్లు చేరిన కృష్ణవేణి బాల్కనీలో నిలబడి ఉండగా కాసేపట్లో మంజుభార్గవి తో సహా మొగుడు ఇంటి ముందు కారు ఆపుతాడు.

ఆ క్షణంలోనే ఆమె మనసు శత సహస్రాలుగా రక్తం చిందే ముక్కలుగా ఛిద్రమైపోతుంది. ఆ తీవ్ర మానసిక సంఘర్షణను అదిమి పెట్టే ప్రయత్నంలో,అవమానం,దుఃఖం ,నిస్సహాయత,మోసగించబడ్డ భావన,నైరాశ్యం,ఒంటరితనం ఈ భావాలన్నీ ఒక్కసారి చుట్టు ముట్టగా వాటిని బయట పడకుండా ఆపే ప్రయత్నంలో వింతగా పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ,(ఒక్క మాట కూడా బయటపడదు)చివరికి ఆమె వల్ల కాక ఒక్కసారిగా గుండె పగిలి ప్రాణాలు కోల్పోతుంది. నిట్టనిలువుగా మొదలు నరికిన చెట్టులా కుప్పకూలుతుంది__________భర్త పాదాల మీద!

ప్రాణం కోల్పోయి అతని పాదాల మీద పడటంలో కొంత నాటకీయత ఉన్నా, "నా ప్రేమ ఎప్పుడూ నీకే!నీ పట్ల ఎప్పుడూ విధేయతతోనే ఉన్నాను! కానీ..నువ్వే.....చూడు నా ప్రేమకు ఎలాంటి బహుమతి ఇచ్చావో?" అని  బహుశా అతడిని నిలదీసి అడుగుతున్నట్టు అతడికి , ప్రేక్షకులకు  చేరవేయడానికే దర్శకుడు అలా తీసి ఉంటాడనిపించింది!

ఈ సినిమా మొత్తం వాణిశ్రీదే! ద్వితీయార్థంలో  కృష్ణవేణి  అనుభవించే వేదనను ఇంకెవరైనా అంత బాగా చేయగలిగేవారా అంటే చేయలేరు అని తడుముకోనక్కర్లేకుండా జవాబు చెప్పేంత అద్భుతంగా చేసింది. పిల్లలని లాలించాలనుకున్నపుడు వాళ్ళు భయం  భయంగా తొలగిపోయినపుడు,చెల్లెలు పెళ్ళిలో పెళ్ళికొడుకు తరఫు వాళ్ళని బతిమాలేడపుడు,పేరంటంలో స్త్రీలు "ఆవిడే ఆవిడే" అని చెప్పుకుంటున్నపుడు________వాణిశ్రీ నటన పతాక స్థాయిలో ఉంటుంది.

ఇహ ముగింపు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ వెంటాడి వేధించి తీరుతుంది. కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయే దృశ్యంలో వాణిశ్రీ నాకు వారం పాటు పదే పదే గుర్తొస్తుండేది. ఆ దృశ్యం అంత హృదయ విదారకంగా,కృష్ణ వేణి కోసం ప్రతి హృదయం ఆర్తితో కలవరించేలా ఉంటుంది.

చేయని తప్పుకు  బలైపోయిన కృష్ణవేణి కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చేలా ఉంటుంది.

 సింహాలో బాలకృష్ణకీ,అలా మొదలైందిలో నిత్యా కీ నంది అవార్డు ఇస్తే...ఈ సినిమాలో వాణిశ్రీ నటన జాతీయ అవార్డుకు ఒక మెట్టు పైనే ఉంటుంది.

 దసరా బుల్లోడు సినిమా టివీలో చూసిన రెండు రోజులకే ఈ సినిమా చూశానేమో, ఇద్దరు వాణిశ్రీలూ ఒకరే అంటే నమ్మబుద్ధేయలేదు!:-))


ఈ సినిమాలో మంచిపాటలున్నాయి కూడా!

"సంగీతం...మధుర సంగీతం"

"ఎందుకో నువ్వు నాతో ఉన్న వేళ ఇంత హాయి"

కృష్ణ వేణీ తెలుగింటి విరిబోణీ

"పదునాలుగేళ్ళు వనవాసమేగిన పరమ పావని సీతా"  
వంటివి.

విచిత్రం ఏమిటంటే ఈ సినిమా ఆడియోలు కూడా నాకు లింకులు ఎక్కడా దొరకలేదు.

ఈ సినిమా బయట డీవీడీ గా అలభ్యం! ఎప్పుడైనా టీవీలో వేస్తే మాత్రం మిస్ కాకుండా చూడండి...కేవలం వాణిశ్రీ నటన కోసం!

ఇదొక అద్భుతమైన కథ నిజంగా !

33 comments:

కౌటిల్య said...

నాక్కూడా చాలా ఇష్టం ఈ సినిమా...వాణిశ్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..నిజంగానే "ఆంధ్రా క్వీన్"

సాంబశివుడు said...

చాలా బాగా రాశారు. ఇది రంగనాయకమ్మ నవల అని అనుకొంట్టు వుండేవాడిని.
http://www.chimatamusic.com/telugu_songs/searchnew.php?st=Krushnaveni

గీతాచార్య said...

దొరకవు అన్న సమస్యే లేదు. టపా చూశాక ఐదు నిమిషాల్లో దొరికాయి. నా దగ్గరే అట్టి పెట్టుకుని ఉంటే ఎక్కువ మందికి చేరవు కనుకా, పాటల్ని ఓపిగ్గా ఆ లింకుల్లోనో అదేదో మతలబ్ చేసి బ్లాగులో పెట్టేంత సమయం లేదు కనుకా లింకు షేరింగ్. వెతుక్కున్నది నేను కనుక ఇక్కడో లుక్కేసుకోండి...

http://thinkquisistor.blogspot.com/2011/08/blog-post_11.html

బ్లాగుల్లో సంగీత ప్రియులధికంగా ఉన్నారని నాకు తెలుసు కనుక వ్యాఖ్య పెట్టక తప్పటం లేదు :-)

ఇంతకన్నా ముందే దొరికాయా? హా౨పీసూ

వనజ వనమాలి said...

సుజాత గారు.. మీరు ఈ చిత్రం గురించి పరిచయం ఇవ్వడం ఆనందకరం.నిజంగా వాణీశ్రీ నటన తో పాటు.. ఆ చిత్ర కథ లోని అంశాలు.. ఎంత లోతైనవో.. అందరు చాల సామాన్యంగా చూసే..నిర్లక్ష్యంగా చూసే విషయాలు అను భవించే వారికీ.... కంటకప్రాయాలు. స్త్రీల మానసిక సమస్యలు, లైంగిక వేదింపులుని.. అర్ధం చేసుకోకపోడం ఇంటి నుండే.. ప్రారంభం. మీరు..ఉదహరించిన కోణాలు..ఆలోచించ తగినవి.

సుజాత said...

కౌటిల్య, అవును! కృష్ణ వేణీ____పాట చాలా బాగుంటుంది.

సాంబశివుడు గారు, మొదట్లో నేనూ అలాగే అనుకున్నా! కృష్ణ వేణి నవల చదివాక తెలిసింది, రెండూ ఒకటి కాదని!

గీతాచార్య,

కృష్ణ వేణి పాటలు కావాలని వెదికిన వెంటనే ఈ లింకు నాకూ దొరికింది. వాటిని డౌన్ లోడ్ చేయాలి కదా! అందుకే ఈ లింక్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా పాటల లింకుల కోసం చిమటా తో సహా అన్ని సైట్లూ వెదికి కుదరదనిపించాకే దొరకలేదని రాశాను.

సుజాత said...

వనజ వనమాలి గారూ,
సరిగ్గా చెప్పారు! చిన్నవే, సహజమైనవే అని పట్టించుకోక నిర్లక్ష్యం చేసే సమస్యలు స్త్రీల జీవితాల్నే బలి తీసుకుంటాయి.

అందరు చాల సామాన్యంగా చూసే..నిర్లక్ష్యంగా చూసే విషయాలు అను భవించే వారికీ.... కంటకప్రాయాలు.__________ఎంత బాగా చెప్పారో!

ఈ సినిమాలో చాలా లోతైన అంశాలు ఉన్నాయి, అందరూ ఆలోచించదగ్గవి

బుద్దా మురళి said...

సుజాత గారు సినిమా గురించి , వాణిశ్రీ గురించి బాగా రాశారు . దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటాను ఇండియా టుడే ( తెలుగు) లోవాణిశ్రీ గురించి అద్భుతంగా రాశాడు. సాధారణంగా సినిమా వార్తలు, పరిచయాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందులో వాణిశ్రీ తను నటించే పాత్రల్లో లీనం అవుతూ నన్ను నేను మరిచిపోయి పాత్రలనే వ్యవహరించడం మొదలు పెట్టాను.నేను వేరు, పాత్ర వేరు అని చాలారోజుల తరువాత గ్రహించానని చెప్పుకున్నారు. రామ్ మోహన్ రాశాడనుకుంట.. అవకాశం ఉంటే అది సంపాదించాలి.

లత said...

అవును సుజాతగారు
ఎన్ని భావాలు ఒకేసారి పలికించిందో వాణిశ్రీ. మర్చిపోలేము.
అత్యాచారమే జరుగుతుంది క్రిష్ణవేణి మీద షాక్ లో అది మర్చిపోతుంది అనుకుంటా, అది గుర్తొచ్చి ఇక్కడే పోయింది అని యేడుస్తుంది .

వేణు said...

పతాక సన్నివేశంలో వాణిశ్రీ పాత్ర మనోభావాల గురించి మీ వర్ణన కళ్ళకు కట్టినట్టు ఉంది!

ఇలాంటి విజయవంతమైన సినిమాలు చాలావాటికి సీడీ/డీవీడీలు దొరక్కపోవటం విచారకరం. గోపీకృష్ణా మూవీస్ వాళ్ళయినా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది.

Sharada said...

బెంగుళూర్లో ఉండగా ఈ సినిమా కన్నడంలో చూసి నేను దడుసుకున్నా చూడండీ...చెప్పలేను ఆ భయమూ, ఆ బాధా గురించి. మళ్ళీ వెంటనే ఏదైనా చెత్త సినిమా చూస్తే కానీ మామూలు మనుషులం కాలేము! యూట్యూబులో కన్నడ వర్షన్ వుంది, ఆసక్తీ, ధైర్యమూ వుంటే! నాకైతే మళ్ళీ చూసే ధైర్యంలేదని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాను. కన్నడలో కల్పన అనే నటి కూడా చాలా బాగా నటించారు. రచయిత్రి త్రివేణి ముప్పై యేళ్ళకే మరణించారట!
శారద

జాన్‌హైడ్ కనుమూరి said...

నేను సినిమాలు విపరీతంగా చూస్తున్న రొజులు

వాణిశ్రీ, కృష్ణం రాజుల అభిమానిని
ఇక వీరిద్దరి కంబినేషన్‌లో వచ్చిన సినిమా!!!

చాలా సార్లు చూసినప్పటికి ఇంతవివరంగా నేను రాయలేను
మరొక్కసారి ఆ రోజులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

శిశిర said...

అవునండీ. చాలా మంచి సినిమా. మనిషి మనుగడకి తోటివారు ఆ మనిషి భావోద్వేగాలని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో కళ్ళకి కట్టినట్టు చూపించిన సినిమా. మీరన్నట్టు వాణిశ్రీ నటనా, సినిమాలోని విషయమూ చూసిన తరువాత కొంతకాలం వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు గుర్తొచ్చినా ఏదో తెలియని ఫీలింగ్ - బాధో, ఆర్తో, జాలో. ఏమో! ఏదో తెలియదు.
చాలా బాగుంది మీ పరిచయం.

మాలా కుమార్ said...

ఈ రోజు అందరి కీ కృష్ణవేణి గుర్తొస్తునట్లుంది . మీరోక వర్షన్ లో రాజీ గారొక వర్షన్ లో రాసారు . బాగుంది .
పాటలు రాజీ గారు పెట్టారు చూడండి .
http://raji-rajiworld.blogspot.com/2011/08/blog-post_11.html

లలిత said...

సుజాత గారు మంచి టపా వేశారు .అబినందనలు
నిన్న బజ్ లో అనుకున్నాకా ఈ క్షణం వరకు కూడా కృష్ణవేణి నన్ను వెంటాడుతూనే వుంది.
ఒక సారి చూస్తే మర్చిపోలేని సినిమా అది. దాన్నొక కమర్షియల్ సినిమా గా అనుకోటానికే నాకు మనసురాదు. స్త్రీలకు సంబంధించిన ఎంతో పెద్ద సమస్యని ( నిజ జీవిత బాధితుల్ని నేనూ చూశాను) సున్నితంగా ఎక్కడా కధ పక్కదారిపట్టకుండా చిత్రించడ గొప్ప విషయం . వాణిశ్రీ ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది ( జీవించేసింది అనాలేమో) . ప్లేష్ బేక్ నాకూ సరిగా అర్ధం కాలేదు ఎందుకలా అని..... శారీరక బలహీనతే మానసికంగా ఆమె కుంగిపోటానికి కారణం అయినా ఆ సమయంలో జరిగే సంఘటనలు, సంభాషణలు ఆమెని మరింత కుంగదీస్తాయి .
ఇదొక్కటే కాదండీ చాలా సమస్యలకు మనం శాస్త్రీయ కోణంలో ఆలోచించం . ముఖ్యంగా ఆడవాళు ఎదుర్కొనే మానసిక సమస్యలపట్ల .......

Rajesh Devabhaktuni said...

సుజాత గారు,

కృష్ణవేణి పాటలు ఈ క్రింది లింక్ నుండి దిగుమతి చేసుకోవచ్చు. మీ బ్లాగ్ గురించి నాకు విజయవాడ - లెనిన్ సెంటర్లో షాపు ఓనర్ నాగేశ్వర రావు గారి ద్వారా తెలిసింది. 1999 లో పదవ తరగతి ముగించిన నాటి నుండి ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన ఆ విలువైన పుస్తకాల షాపును మొదలుపెట్టింది కుడా ఆ సంవత్సరంలోనే...! ఆర్టికాల్ బాగా వ్రాసారు. ఆ సినిమా డి.వి.డి కాని, సి.డి కాని లబిస్తే తెలియచేయండి.

https://rs351l3.rapidshare.com/#!download|351l3|170386722|Krishnaveni_1974_.rar|19656|R~65B8C18BF2A7A6B9BE9DEC58257A0C7F

లలిత said...

సుజాత గారు అమరావతి ట్రిప్ కాదేమోనండీ ....శ్రీశైలం అని గుర్తునాకు .

ఆ.సౌమ్య said...

బాగా రాసారండీ...ఈ సినిమా నేను అక్కడా అక్కడా చూసానుగానీ పూర్తిగా చూడలేదు. మీరు చెబుతుంటే సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది.

స్త్రీలు ప్రసవించేటప్పుడు అంతకుముందు శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు కలిగే మానసిక సంఘర్షణ ఎవరికీ అర్థం కాదు. ఇంట్లో వాళ్లకి కూడా.

నా ఫ్రెండు వాళ్ళ కజిన్ పురిటినొప్పులు పడుతున్నప్పుడు పెద్దపెద్దగా కేకలేసింది. "నన్ను ఈ దుస్థితికి తీసుకొచ్చిన నిన్ను చంపేస్తాను, నిన్ను బతకనివ్వను...నా బాధ ఏమిటో తెలుస్తొనదా, నేను భరించలేకపోతున్నాను. ఇంతకన్నా చావే నయం. ఇలా చంపేకన్నా చస్తే బావుండును, అసలు నేను మనిషినేన అన్న సందేహం కలుగుతోంది నాకు" అని భర్తని చూసి నానాతిట్లు తిట్టింది. ofcourse పిల్లాడు పుట్టాక ఆనందించింది. కానీ ప్రసవంలో తను పడ్డ నొప్పులు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చాలా బాధపడేది. ఏమిటేమిటో మాట్లాడేది. పడుకుని నొప్పి నొప్పి అంటు సుడులు తిరిగిపోయేది. డాక్టర్ కి చూపిస్తే తన ఆరోగ్యం బావుంది అని చెప్పారు. చివరికి సైకాలజిస్ట్ దగ్గరకి తెసుకెళ్ళి వైద్యం చేయించాక మామూలయింది. ఇప్పుడు బావున్నాది. ఆ సమయం లో వచ్చిన నొప్పి శరీరానికి పోయినా మెదడు నుండి ఇంకా పోలేదన్నమాట తనకి. అది నాకు ఒక భయంకర అనుభవం....నాకు చాలా భయమేసేది తనని చూస్తే!

ఆ.సౌమ్య said...

ఇంక వాణిశ్రీ నటనకొస్తే నేనీమధ్యే ఎక్కువగా గుర్తించడం మొదలెట్టాను ఆమెలో ఉన్న కళాభినేత్రిని. మరపురాని మనిషి సినిమాలో అద్భుతంగా నటిస్తుంది. మొన్ననే గంగ-మంగ సినిమా చూస్తుంటే అబ్బురంగా తోచింది. ఆ పొగరు పాత్రలో ఎంత ఒదిగిపోయిందో శాంతం పాత్రలో అంత నిలబడింది. అద్భుతం అనిపించింది.

S said...

చాలా బాగా రాసారండీ! నిజమే, మానసిక సమస్యలను అసలు సమస్యలుగా గుర్తిస్తూ (దయ్యం పట్టింది అని కాక) ఆ కాలంలో తీయడం గొప్ప విషయమే అనిపిస్తుంది. ఇంతకాలమైనా మారని మనస్తత్వాలు చూస్తూ ఉంటే!

siri said...

నిజమె సుజాత గారు ,చంద్ర ముఖి దీనిముందు పనికి రాదు .ఆద్భుతం గా చెసారు.

మధురవాణి said...

మీరు చెప్పింది వింటేనే ఇలా ఉంది.. ఇంక సినిమా చూస్తే ఎలా ఉంటుందో.. ఎన్ని రోజులు కృష్ణవేణి మనసులో తిష్ట వేసుకు కూర్చుంటుందో.. హుమ్మ్!

భలే బావుంది మీరు పెట్టిన ఫోటో కూడా!
చిన్నప్పుడెప్పుడో ఒకసారి టీవీలో 'గోరంత దీపం' సినిమా చూసినట్టు గుర్తు.. కొంచెం కొంచెమే గుర్తుంది గానీ అందులో వాణిశ్రీ మేకప్ లేకుండా ఉంటుంది అనుకుంటా కదా.. చాలా చాలా అందంగా ఉంటుంది. నటన చాలా బాగా చేస్తుందనుకుంటా కదా!

వేణూరాం said...

నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ అండీ.. చిన్నప్పుడేప్పుడొ టీవీ లో సగం నుండీ చూశాను ఈ సినిమాని. నది దగ్గర కి వెళ్ళగానే ఏవో గుర్తొచ్చి పడిపోతుందీ.. వాణిశ్రీ గారి నటన కి నాకయితే భయం వేసిందీ. విశ్వరూపం చూపించారు నిజంగా.
పోలిక కరెక్టో కాదో తెలీదు గానీ చంద్రముఖి సినిమా లో భయంకరమయిన మేకప్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లతో జ్యోతిక చేసిన దానికి ఎన్నోరెట్ల ఎఫ్ఫెక్ట్ ని తన నటన తో మాత్రమే తీసుకు రాగలిగారు అనిపిస్తుంది నాకు..
గొప్ప సినిమా గురించి అంతే గొప్పగా రాశారండీ..

spring said...

Sujaatha gaaru,

aa movie last lo vanisree chanipoye mundu avida pillalu avida daggaraku modati sarigaa vastarandi..
amma anukuntu...
oka pandu edo istundo/leda valla chetilo ne untundo gurthu ledu..
aa thalli pade anadam/bada maatallo cheppalemu.

naaku aa movie gurthu vaste scene ide...
ila ekkado chadavatam tappinchi...sadyam ayinantha varaku taluchukokunda undataniki prayatnistaanu...
enduku ante gurthu vachinapudalla naa pillalanu chustunnapudu....mind ku ee kasta kaali time dorikina...aa scene vachesi mind antha adola ayipotundi oka vaaram varaku..

chala manchi cinema...chala bada pette cinema...

manchi movie gurthu chesaru..alage miru chala chakkaga bavaani vyakthaparustaaru..

తెలుగు అభిమాని said...

నిజం సుజాతగారు. సావిత్రిగారి తరువాత సహజనటి వాణిశ్రీ గారు. ఈ సినిమా నేను చూడలేదు. పాటలు చాలా బాగుంటాయి. సినారే గారు గొప్పగా వ్రాశారు. అప్పుడే శ్రీశైలం ఆనకట్ట కట్టిన రోజులేమో ’శ్రీగిరి లోయల సాగేదారుల విద్యుల్లతలు కోటి వికసింప జేసేను’ అని వ్రాయటం బాగుంది.

స్ఫురిత said...

ఈ సినిమా మా అమ్మ favorite...ఇది వాణిశ్రీ నటజీవితం లోనే వుత్తమ చిత్రం మా అమ్మ దృష్టిలో...మా నాన్నగారికి మాత్రం అస్సలు నచ్చదు...ఆయనకి heavy weight subjects అంతగా నచ్చవు...వాణిశ్రీ విషయంలో కూడా ఇద్దరికీ ఎప్పుడూ గొడవే...నేను మొన్ననే గోరంత దీపం చూసి వాణిశ్రీ నటనకి ముగ్ఢురాలినైపోయాను. ఈ సినిమా గురించి మా అమ్మగారు చాలా సార్లు చెప్పినా ఎందుకో చూసే ధైర్యం చెయ్యలేకపోయాను.

ఆడవాళ్ళ సమస్యల విషయం లో ఎంత మూర్ఖం గా ఆలోచించేవారో (ఇప్పటికీ అలాంటి అలోచనా విధానం పూర్తిగా పోలేదు) తల్చుకుంటేనే మనసు వికలం ఐపోతుంది...

అన్నట్టు నా టపా మీద మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు

Muralidhara Rao Elchuri said...

This is one of the most captivating tributes to an inspired actress and a great movie of hers. Her flourish, chaste dialogue delivery and illuminating screen presence made her contribution to Telugu cinema unforgettable. She could not equal Savitri in mythological genre but followed her footsteps in every other aspect and remained an alluring legend of all time.

The timeless photograph has embellished your blog beautifully - balancing out all that you had said in words. Congratulations !!

విరిబోణి said...

It's a very good movie :) i saw this movie when i was 10 or 11 years old. malla manchi movie ni gurthuku chesaaru :) thanks

విరిబోణి said...

even naa blog ki peru petteppudu kooda naaku ee paata chala gurthuku vachhedi ... "కృష్ణ వేణీ..తెలుగింటి విరిబోణీ " ani becoz naa peru geethavani ayyeppatiki,,aa prasa lo raavalani..

Ravi said...

sujata garu.
meeru krishnaveni cinema lo vanisri natana ki anthaga spandincharu ante..deeni original kannada version lo kalpana acting ki inka entha feel avutharo..aavida acting nijam ga amazing..
ee movie kannada movie sharapanjara ki remake.
alaage vanisri pooja movie kooda kannada movie eradu kanasu ki remake.. andulo kooda kalpana ye heroine..its worth watching these two movies in kannada..
krishnaveni kannada original ki puttanna kanagal director..
chivarigaa...chala baa rasaranadi..

సుజాత said...

రవి కిరణ్ గారు,

నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్! మీ అభిమానానికి కూడా!(ఇంతకు ముందు కామెంట్ రాసిన రవి కూడా మీరేనా?) మీ వ్యాఖ్య ప్రచురించడం లేదు. భద్రంగా దాచిపెట్టాను.:-))

Thanks once again!

శ్రీ said...

మంచి సినిమా.
నేను ఈమధ్యనే టీవీలో చూసినట్టు గుర్తు.

Padmavalli said...
This comment has been removed by a blog administrator.
Lakshman said...

ఈ సినిమా చూడడానికి తప్పకుండ ప్రయత్నం చేస్తానండి.

Post a Comment