దాసరి సుబ్రహ్మణ్యం గారి సభలో నేను మొదటి సారి శ్రీ అవసరాల రామకృష్ణా రావుగారిని చూశాను. ఈ లోపుగా నేను గణితవిశారద మీద రాసిన బుల్లి రివ్యూ రచన శాయి గారు అవసరాల గారికి చూపించడం జరిగింది.
"ఆ అమ్మయిని కలుసుకోడానికి అవుతుందా?" అని ఈ లెక్కల మేష్టారు అడిగారని తెలిసి నిజంగా తెల్లబోయాను.
అవసరాల గారు నన్ను కలుసుకోవాలన్నారా? అమ్మో, ఈ అవకాశం వదులుకోకూడదని హైద్రాబాదులో వారి అడ్రస్ తీసుకుని మర్నాడు మధ్యాహ్నం ఒకటిన్నరకు ఒక ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను. ఆయన ఆ సమయానికే రమ్మన్నారు. మేము వెళ్ళేసరికి ఆయన ఇంట్లో లేరు. వారి బంధువు (కోడలా?) "వచ్చేస్తారు "కూచోమన్నారు.
మరో పది నిమిషాలకే చక చకా నడుస్తూ హుషారుగా లెక్కల మేష్టారొచ్చారు.
మమ్మల్ని చూస్తూనే టైము చూసుకుని "ఐ లైక్ యూ! టైము పాటించారు మీరు, నేనే పది నిమిషాలు లేటు" అన్నారు.ఆ తర్వాత మాతో బోల్డు కబుర్లు చెప్పారు. ఎనభై రెండేళ్ళ వయసులో ఆ ఉత్సాహం, శక్తి,హాస్య స్ఫూర్తి, ఇవన్నీ చెప్పలేనంత ఆశ్చర్యం కల్గించాయి. చందమామలో తాను కథలు రాసినప్పటి జ్ఞాపకాల నుంచి, బాల జ్యోతిలో మేథ మే ట్రిక్స్, రచనలో కథలు, విశాఖ పట్నం కబుర్లు, భరాగో ఛలోక్తులు, ఇలా అనేక విషయాలు! "మీరింకా భోజనం చేసినట్టు లేదు మేష్టారూ! మేము కూచుంటాం లెండి, మీరు తినండి" అని మేమంటే
"ఇద్దరు మనుషులు ఇల్లా దిష్టి పెడుతూ ఎదురుగా కూచుంటే ఎలా తినను! నాలుగు కబుర్లు చెప్పి మిమ్మల్ని పంపించి సుష్టుగా తింటానులెండి" అన్నారు.
గణిత విశారద తో పాటు, బ్లాగాడిస్తా రవి గారు పుస్తకం .నెట్ లో రాసిన మేథ మే ట్రిక్స్ పరిచయం కూడా ప్రింట్స్ తీసి పట్టుకెళ్ళాను. అవి చూసి సంతోషించారు. "ఆ పుస్తకం, (మేథ మే ట్రిక్స్), ఆ పజిల్స్,జ్ఞాపకాలు ఇంకా గుర్తు పెట్టుకునే వారున్నారన్నమాట" అన్నారు.
కబుర్లవీ అయ్యాక "మీరు నాకో ఇంటర్వ్యూ ఇవ్వాలి. నేనొక స్పెషల్ స్టోరీ రాసుకుంటాను" అని అడిగాను. దానికాయన "అబ్బ, ఈ ఇంటర్వ్యూలవీ వద్దు, నేనే అంతా రాసి పంపిస్తాను. దాంట్లో మీరు ప్రశ్నలు ఇరికించుకోండి" అన్నారు.మేథమేట్రిక్స్ బాల జ్యోతిలో వచ్చే రోజుల్లో వాటిని సాల్వ్ చేయడానికి మేము పడిన కష్టాలు చెప్తే హాయిగా నవ్వారు.
ఆయననాకు ఆ పజిల్స్ తోనే పరిచయం!
మేము వచ్చేస్తోంటే సీతామహాలక్ష్మి అనే ఆమె సంకలనం చేసిన "మరణించినా జీవించండి" అనే పుస్తకం నాకు ఇచ్చి "తప్పక చదవాలి మీరు" అని ఇచ్చారు.అందులో ఆయన ఒక కథా సంకలనానికి రాసిన ముందు మాట నుంచి కొంత భాగాన్ని ఇక్కడ చదవండి.
నా కథకు ముగింపు నాదే!
ఎన్ని కథలు రాసి ఎంతగా చెబితేనేం, కార్యాచరణ కాకపోయాక? అనే వేదన నన్ను బాధిస్తోంది. దాన్నుంచి విముక్తి పొందడానికే ఈ మధ్య ఓ ప్రయత్నం మొదలెట్టాను. ఎంతగా ఆరోగ్యంగా ఉన్నా, దెబ్భై ఐదేళ్ళు తెగ వాడేసిన నా శరీర భాగాలు, ఎప్పుడో అప్పుడు నన్ను గుటుక్కుమనిపించక మానవు. నా శవానికి పిండ ప్రదానాల తంతు కాదని,వైద్య కళాశాలకు దానం చేసే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. బతికున్న వాళ్ళనే చంపేసే ఏ వైద్య కళాశాలకు పరిశోధన నిమిత్తం దానం చేస్తారా?" అనే సందేహం లేకపోలేదు. శవాలను తరలించే ఈ ఉద్యమానికి మృత దేహ దాన సమితి అనే పేరు గల సంస్థగా రూపు దిద్దే సదుద్దేశంతో ఉన్నాను. "బ్రాహ్మణుడిగా పుట్టావు. ఇదేం దుర్బుద్ధి? పుట్టగతులు లేకుండా పోతావ్" అనే ఆప్తుల అభిప్రాయానికి నేను తలవంచను. ఏ కులానికి తగిన అపర కర్మ ప్రక్రియలు దానికి ఉండనే ఉంటాయి. చచ్చాకయినా మనిషిగా గుర్తించబడితే అంతే చాలు. ఈ నా కథకు ముగింపు ఇలాగే ఉండాలి.
కర్మ సిద్ధాంతం మీద ఇదే నా "చావు" దెబ్బ!
ఏదైనా సరే ఒక వాదాన్ని సమర్థిస్తున్నపుడు, దాన్ని ఆచరించడం కంటే గొప్ప నిబద్ధత ఉంటుందా? "మేం నాస్తికులం" అంటూ తమని తాము నలుగురినుంచీ వేరు చేసుకుంటూ, గ్రహణం రోజు బిర్యానీలు తింటూ,అసలు ఫలానా బాబా ఒట్టి ఫకీరే తప్ప యోగి కాదు అంటూ పటాటోపాలు ప్రదర్శించే వారు గుర్తొస్తే ఈ క్షణం ఎంత చీదర వేస్తోందో!
అన్నట్టుగానే ఆయన మరణానంతరం తన దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు ఇచ్చేశారు.
గేటులోంచి బయటికి వస్తూ కూడా నేను "రాసి పంపడం కాదు, మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే" అంటే "సరే అలాగే ఇస్తాను కదలవమ్మా మహాలక్ష్మీ, నాకు ఇక్కడ కడుపు కాలుతోంది" అని గట్టిగా నవ్వేశారు.
నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండానే లెక్కల మాష్టారు వెళ్ళిపోయారు.
18 comments:
చాలా బాధనిపించింది చదూతుంటే..అవకాశం కోల్పోయిన మీకెలా ఉందో...:((
నాస్తికులందరూ ఫ్రేం కట్టించుకు దాచుకోవాల్సిన మాటలు రాసారు.
అవసరాల రామకృష్ణారావు గారి రచనల్లో ఈ మధ్యకాలంలో నేను చదివినవి- గణిత విశారద, అంగ్రేజీ మేడీజీ. చాలా ఏళ్ళ క్రితం బాలజ్యోతిలో చదివిన ‘మేథ మే ట్రిక్స్’ ఎంతగానో అబ్బురపరిచేది.
ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉండేలా రాసిన చేమకూరి వెంకటకవిలా అవసరాల గారి దాదాపు ప్రతి వాక్యంలోనూ గమ్మత్తయిన చమక్కు, మాట విరుపు మెరుపూ తొంగి చూస్తుంటాయి.
దాసరి సుబ్రహ్మణ్యం గారిలాగే ఆయన్ను కూడా వారి జీవిత చరమదశలోనే కలుసుకోగలిగాను. అంత పెద్దవయసులోనూ ఫోన్ సంభాషణలో సైతం వినికిడిలోపం ఏమాత్రం లేకుండా హాయిగా సంభాషించటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఉత్సాహం, హుషారు ఆయన రాతల్లాగే ఎంతో ఉత్తేజకరం!
ఆస్తికులనైనా, నాస్తికులనైనా, ఏ సిద్ధాంతం ప్రవచించేవారినైనా మాటల ద్వారా కాకుండా ఆచరణ ద్వారానే అంచనా వేయాలి. తన భావాల విషయంలో స్థిరంగా చివరివరకూ నిలబడిన ఆచరణ శీలి అవసరాల!
మేథ మే ట్రిక్స్ .... ఎప్పటి జ్ఞాపకాలో కదిపారు. నేను గణితంలో రెండు 'గురుపట్టలు' పొందటానికి చిన్నప్పటి బాలజ్యోతి పజిల్సే కారణమేమో. అన్నట్టు, మదరాసు లయోలా కాలేజ్లో మా డిపార్ట్మెంట్ ఫెస్టివల్ పేరు కూడా మేథ మే ట్రిక్స్! బహుశా అవసరాలవారి పూర్వ విద్యార్ధెవరో అరవ మహానగరంలో ఆ కళాశాల్లో శిష్యరికం చేస్తూ ఈ పేరు అక్కడా తగిలించిపోయారేమో.
అంతా బాగుంది కానీ చివర్లో ఆ విసుర్లు అప్రస్తుతం అనిపించాయి.
నిజానికి నేను ఆయన పేరు ఒక పదేళ్ల క్రితం వరకూ ఎప్పుడూ వినలేదు. నేనూ చిన్నప్పుడు మాథ మే ట్రిక్స్ చూశాను, సాల్వ్ చేయటానికి ప్రయత్నించాను కానీ,అసలు ఎవరు ఈ పజిల్స్ తయారు చేశారు అని ఎప్పుడూ గమనించలేదు.
apweekly.com లో ఆయన రచనలు వస్తూ ఉండేవి. ఒక్కొక్కటీ చదివి ఆయన అభిమాని అయ్యాను. ఒకసారి మా అత్తగారితో యథాలాపం గా అంటే.. 'అయ్యో ఆయనది మా ఊరే. ఆయన మాకు టీచర్.. ' అన్నారు. అప్పుడు ఏవో కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత ఆయన ఇంటర్వ్యూ (నవ్య లో అనుకుంటా) చదివి ఆయన ఫోన్ నంబర్ రాసుకున్నాను. కానీ ఎప్పుడూ మాట్లాడలేదు..
మీకున్నన్ని జ్ఞాపకాలు ఈ మేథ మే ట్రిక్స్ తో నాకు లేవు. ఆయన పేరు విన్నాను. ఆ పజిల్స్ చూసానేమోగానీ అంతగా గుర్తు లేదె. మీరంతా ఇంత ఇది గా చెబుతుంటే అయ్యో నేనెంత మిస్ అయ్యానో అనిపిస్తున్నాది. ఆ పుస్తకాలు ఇప్పుడు దొరుకుతున్నాయా? కొనుక్కుని చదివే వీలుందా?
మేషారు ఎప్పుడు వెళ్ళిపోయారు? ఈ మధ్యనేనా? తిట్టుకోకండి...ఈ మధ్య బాహ్య ప్రపంచం మొహం చూడడం గగనమైపోయింది నా పనులతో.
ఆయన సిద్ధాంతాలకు, వాటికి కట్టుబడి నిలబడగలిగే ఆత్మస్థైర్యానికి జోహార్లు.
thanks for sharing this. I am also Metha me tricks fan :)
సాంకేతికంగా ఏది సరైన పదమో నాకు అనవసరం కానీ నాస్తికుడు అనడం కన్నా మనిషి , మానవతా వాది అనడం బాగుంటుందేమో . ఆస్తికుల్లో సైతం ఇలాంటి మానవతా వాదులు ఉన్నారు
రవి గారూ, అయ్యో, చివరి లైను చదివారుగా! మరణానంతరం ఆయన దేహాన్ని ఉస్మానియా వైద్య కళా శాలకు ఇచ్చేశారని కూడా రాశానే! అవసరాల గారు గత శుక్ర వారం కన్ను మూశారండీ! హైద్రాబాదులోనే! ఆయన్ని గుర్తు చేసుకుంటూ రాశానీ పోస్టు.
బుద్ధా మురళి గారూ,
నాస్తికులంతా మానవతా వాదులు కాదులెండి! అలాగే మానవతా వాదులంతా నాస్తికులు అవక్కర్లేదు. అవసరాల గారు కేవలం మానవతా వాది మాత్రమే కాదు, ఆయనకు దైవంలోనూ, తత్సంబంధిత కార్యకలాపాల్లో విశ్వాసం లేదు
సౌమ్యా,
అవసరాల గారు గత శుక్రవారం తెల్లవారు జామున కన్ను మూశారు. మేథ మేట్రిక్స్ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుంది.
మానసా,
ఇంటర్వ్యూ తీసుకోకపోయినా, ఆయన్ని కలుసుకుని చాలా సేపు మాట్లాడ్డం (అందులోనూ నన్ను చూడాలని ఆయనే పిలిపించడం) ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కదూ!
వేణు గారూ,
ఆయన ఆ వయసులో అంత ఎనర్జీతో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది.
అబ్రకదబ్ర, మీరూ మేథమేట్రిక్స్ బాచేనా అయితే?:-))
విసుర్లంటారా? అవసరలా గారి నిశ్శబ్దంగా అమలుపరిచిన నిబద్ధత చూశాక ..ఆ మాటలు రాయకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే ఈ పటాటోపాల నాస్తికులు కనీసం ఇంట్లో వారిని ఒక్క ఇంచీ కూడా ప్రభావితం చేయలేరు. బయటికొచ్చి జనాల్ని వేలెత్తి చూపిస్తుంటారు.
మైత్రేయి గారూ, మేథ మే ట్రిక్స్ పజిల్స్ ని మీరూ సాల్వ్ చేశారన్నమాట! ప్రతి నెలా బాల జ్యోతి రాగానే ఈ నెల పజిల్ ఏమిచ్చారా అని అందులోనే పడి కొట్టుకుంటూ, మిగతా కథలన్నీ చదవడమే అయ్యేది కాదు!
సుజాత గారికి,
అక్షరతపస్వి తపస్వితను మనస్వితతో జ్ఞాపకం చేసుకొన్నారు. అభిమానులకు ఆయన జ్ఞాపకాలతోపాటు మీ జ్ఞాపిక కూడా జ్ఞప్తికి రాగలదు.
శుభాకాంక్షలతో,
ఏల్చూరి
sujatha garu!!
good one..
alaa..alaa..chinnappati days loki..vellipoya..chaduvuthu..
keep blogging..:)
i know him...really great....an inspiration to present day teachers.....
అవసరాల వారి వంటి లెక్కల మాస్టారు మనకి చాలా అవసరం." కేటూ - డూప్లికేటూ" నవల కూడ చాలా కాలం క్రితం చదివినా ఇంకా జ్ఞాపకం ఉంది.
మంచి post రాశారు. ధన్యవాదాలు !!
Post a Comment