December 27, 2011

పుస్తకాలు కొంటారా? చదవరా?

డాట్రారు తెచ్చిన పుస్తకాలు!(నోరూరడం లేదూ?)


మొన్నొక రోజు పాత ట్రంకు పెట్టెలూ,పైన అటకా ఇవన్నీ సర్దుతుంటే దిగులేసింది. "ఇన్ని పుస్తకాలు ఎందుకు దాచానా" అని కోపం కూడా వచ్చింది. అచ్చు తప్పుల పుస్తకాల్ని కూడా "ఏమో తర్వాత దొరుకుతాయో దొరకవో" అని ఉంచినట్టున్నా....బోల్డు తేలాయి.కంపరం వాటిని చూస్తే! వాటిని భోగి రోజు ఓ చూపు చూస్తే కొన్ని పుస్తకాలు తగ్గుతాయి.

అసలు ఇక్కడొక బేసిక్ ప్రశ్న! పుస్తకాలెందుకు కొంటాం? చదవడానికేగా?

అవేమన్నా బంగారమా, ఈక్విటీషేర్లా, లాకర్లోనో, డీమాట్లోనో పడేసి రేటొచ్చినపుడు అమ్మేయడానికి?
బుక్ ఫేర్ లో బోల్డు మంది కట్టలు కట్టలు పుస్తకాలు కొనుక్కెళుతుంటే "అబ్బ, అవన్నీ చదివేస్తారు కాబోలు" అనిపించిందే తప్ప "తీసుకెళ్ళి అటక మీద పడేస్తారేమో" అనిపించలా అదేం చోద్యమో!

విజయవాడ లో పాత పుస్తకాల కొట్లకు వచ్చి "ఫలానా పుస్తకముందా? ఫలానాది ఉందా" అని పంతులు గారి కొట్లో నేల మాళిగలోకి దిగి దుమ్ము పీలుస్తూ, అడుగెత్తు మట్టి పేరుకున్న నేలమీద కూచుని కళ్ళ జోళ్లు తుడుచుకుంటూ వెదుకుతున్న పుస్తకం దొరికేవరకూ..... పరాక్రమం విడనాడని వాళ్ళని చూస్తే "అబ్బ, ఎంత మంచి వాళ్ళో" అనిపిస్తుంది.

దూర తీరాల నుంచి స్నేహితులు "ఫలానా పుస్తకం గురించి చాలా విన్నానండీ! ఆ పుస్తకం ఎలాగైనా కావాలి. చదివి తీరాలి" అన్నపుడో,
"ఫలానా రచయిత పుస్తకం సగమే చదివానండీ, ఆ పుస్తకం దొరుకుతుందేమో చూడరా ప్లీజ్" అన్నపుడో నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి.
ప్రాణాలకు తెగించి (అలా ఫ్రెండ్ కోరిన పుస్తకం కోసం ఇరుకు సందులో వెళ్తుంటే బైక్ మీదినుంచి పడ్డాను మరి) ఆ పుస్తకాలు సంపాదించి వాళ్లకిచ్చి,అది అందుకున్నప్పటి వాళ్ళ నవ్వు మొహాన్ని ఊహిస్తూ కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది.

ఇలా నా కోసం పుస్తకాలు సంపాదించే మిత్రులు కూడా ఉన్నారు! మన డాక్టర్ కౌటిల్య మొన్న ఎన్ని పుస్తకాలు తెచ్చాడో గుంటూరు నుంచి మోసుకుని!

ఈ మధ్య ఒక పెళ్ళిలో మా బంధువులావిడ కలిసింది. దగ్గర దగ్గర డెబ్భై యేళ్ళుంటాయి. దగ్గరి చుట్టరికమే లెండి. మా ఆడపడుచు తోటికోడలి మరదలి వదిన గారికి వేలు విడిచిన మేనత్తట. ఆవిడ పెళ్ళయ్యాక కలకత్తా వెళ్ళిపోయింది.  పిల్లలు లేరు. అప్పటినుంచి ఈవిడ పరాక్రమించి (బోల్డు తీరిక కదా) బెంగాలీలో కథలూ అవీ రాసి ఉన్నపళంగా రచయిత్రి అయిపోయింది.

సరదా పడి మా ఇంటికి వచ్చింది. ఆవిడరచయిత్రి కదా కాసేపు పుస్తకాల గురించి మాట్లాడుకోవచ్చని ఆహ్వానించాను. నా లైబ్రరీ చూసి "ఏవిటి, ఇవన్నీ నిజంగా చదువుతావా?ఎన్ని చదివావు వీటిలో?" అంది.

నేను ముందు తెల్లబోయి "ఎన్ని చదవడమేమిటి? అన్నీ చదివేశాను! కావాలంటే ఈ పుస్తకాల్లో ఏదో ఒకదాని మీద నాకు పరీక్ష పెట్టుకోండి" అన్నా సరదాగా!

"అమ్మో, నేనసలు చదవను. ఏదో కొని పడేస్తుంటా, ఎప్పుడైనా తీరిక దొరికితే చదవొచ్చని" అంది.

"అవునూ, ఉజ్జోగం, ఇల్లు, సంసారం, పిల్లలు,ఇతర పన్లూ..వీటన్నింటి మధ్యా నీకు టైమెక్కడ దొరుకుతుంది ఇన్నేసి పుస్తకాలు చదవడానికి?" అని పాపం కుతూహల పడింది.


అది అమ్మమ్మ అన్నందుకు కాసేపు సీరియస్ అయి "నాకు రాయడానికే సమయం సరిపోదు. ఇంకెక్కడ చదువుతాను! రాయగలిగిన సత్తా ఉన్నపుడు చదవాల్సిన పని లేదని నా అభిప్రాయం" అని వాక్రుచ్చింది.
"నువ్వేం రాయవా? ఎప్పుడూ చదవడమేనా? బోరు కొట్టదూ?" అంది
"రాస్తానండీ, ఏదో పత్రికలకు కాసిన్ని వ్యాసాలు, కాలములూ"
"అదేంటి, సాహిత్య సృష్టి చేయవూ" నిర్ఘాంత పోయి.
"అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ! ఏవో తొమ్మిది పది కథలు ఎప్పుడో రాసి పడేశాను కానీ అవి ఎక్కడున్నాయో కూడా వెదకను నేను"
"సో, you are more journalist than a writer"
"మీకెలా తోస్తే అలా అనుకోండి"

"నీ ఫ్రెండ్స్ అంతా ఇలాగే పుస్తకాలు కొంటారా?"
"ఓ, కొంటారు. నాకంటే ఎక్కువ కొనేవాళ్ళు వందల్లో ఉన్నారు"

"వాళ్ళూ ఇంతేనా? చదవడమేనా?రాయరా?"
"కొందరు రాస్తారు. అయినా అసలు పుస్తకాలు చదివే వాళ్లంతా రాస్తూ ఉండాలని రూలెక్కడుందండీ?అలా మేవంతా రాస్తే పాపం మీలాంటి వాళ్ళు ఏమై పోతారు?"
"అసలు ఇన్ని పన్ల మధ్య నీకు టైమెక్కడ దొరుకుతుందో చెప్పు" (వాళ్లాయన మీద చుట్టాలెందుకు జాలిపడ్డారో కొద్దిగా అర్థమైంది )

"నాకు టైము "దొరకదు"! నేనే కేటాయించుకుంటాను. MMTSలోనూ, సిటీ బస్సుల్లోనూ పక్క ప్రయాణీకులతో సొల్లు కబుర్లు చెప్పకుండా పుస్తకాలు చదువుకుంటాను. అన్నం తినడం,నీళ్ళు తాగడం,ఆఫీసు పని ఎలా నిత్య కృత్యాలో, పుస్తకాలు చదవడం కూడా అంతే నాకు!గోవా బీచ్ లో కూచుని మానవ సమాజం చదివాను నేను. అందువల్ల నేను పుస్తకాలు చదువుతానా లేదా అనే సందేహం వదిలి పెట్టి తమరేం గిలికారో కాస్త చెప్పండి" అన్నాను సీరియస్ గా!

ఎంత సేపని ఈ మనిషితో మామూలుగా మాట్లాడ్డం?

"ఏవైనా పుస్తకాల క్లబ్బుకో వెబ్ సైట్లకో రాస్తుంటావా పోనీ? మెంబర్ గా ఉన్నావా?"
"అబ్బే లేదండీ! అతిథుల లిస్టు లో కూడా నా పేరుండదు. చెక్ చేసుకోండి కావాలంటే"
ఆ రోజుకు ఇహ అలసి పోయి ఊరుకుంది.

మరో రెండు రోజులు హైద్రాబాదులోనే ఉంది. కానీ ఇన్నేసి పుస్తకాలు ఎందుకు కొంటారు? కొని నిజంగా చదువుతారా అనే సందేహం మాత్రం వదిలి పెట్టినట్టు లేదు.

కనిపించినపుడల్లా ఇదే టాపిక్ మాట్లాడి నా సహనానికి పరీక్ష పెట్టింది.

"ఇంకా నయం, నాకీ జంజాటాలేవీ లేవు. లేకపోతే నా రాతలు కుంటుబడేవే"అని గొణుక్కుని నాకు రెండు బెంగాలీ పుస్తకాలిచ్చింది. తెల్లబోయాను. నేనేం చేసుకోను వాటిని? అదే అడిగాను. "త్వరలో వాటిని ఒకాయన తెలుగులోకి అనువదిస్తాడు. అప్పటిదాకా అవే ఉండనీ" అని చెప్పి పోయింది. అవి కూడా నా భోగి లిస్టులో చేరాయి.

నాకైతే పుస్తకాలు ఆబగా చదివే తెలుగు బ్లాగర్లందరితో ఒక మీటింగ్ పెడితే బాగుండు ఆవిడ కోసం అనిపించింది.

ఇంతకీ, ఏవిటి? పుస్తకాలు గొప్ప కోసం కొని పక్కన పడేజే జాబితాలో ఉన్నారా? చదివే జాబితాలోనా?
ఏవిటో చల్లనివేళ ఆవిడ వల్ల ఈ డౌట్లూ!

పుస్తకాలు ఇష్టంగా చదివే వాళ్ళంతా ఇలా వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పండి మా కోల్ కతా అత్తయ్య పిన్నికి

December 22, 2011

కొత్త పుస్తకం పచ్చి వాసన ....!





ఎంత బావుందో! ఎటు చూసినా ఊరిస్తూ కొత్త పుస్తకాలు! మనం చదివినవీ, చదవనివీ, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నవీ, ఒకసారి పోగొట్టుకుని మళ్ళీ కొనాలని చూస్తున్నవీ,సరి కొత్త కలెక్షన్లూ, చడీ చప్పుడూ కాకుండా మార్కెట్లోకి సింగారించుకుని వచ్చేసినవీ, యదార్థ గాథల ఆధారంగా రూపొందిన కల్పితాలూ, ఒకటా రెండా...బోల్డన్ని!

నాల్రోజుల క్రితం నేనూ కాసిన్ని పుస్తకాలు కొందామని బుక్ ఫేర్ కి వెళ్ళాను. స్టాళ్ళూ సందర్శకులతో కళ కళ్లాడి పోతున్నాయి. చూడటమే కాక, చాలా మంది బోల్డన్ని పుస్తకాలు కొని పట్టుకెళుతుండటం సంతోషించదగ్గ విషయం!

అన్ని స్టాళ్ళూ తిరిగి చూస్తూ, పుస్తకాల గురించి, రచయితల గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ మంచి స్నేహితులతో కలిసి పుస్తకాలు కొనుక్కోడం చాలా బాగుంటుంది.

కొన్ని పుస్తకాలు కొన్నాక, నవోదయా స్టాల్ కెళ్తే నేను వేరే స్టాల్స్ లో కొన్ని తెలుగు పుస్తకాలు కొనేశానని తెల్సుకుని నన్ను బాగా చీవాట్లేశారు. "మన స్టాలు ఇక్కడుందని తెలీదా మీకు?" అని నిలదీశారు. నిజంగా నవోదయ "మన"దే అనిపిస్తుంది నాకు! షాపు కెళ్ళినా సరే, మన అభిరుచి ప్రకారం "ఇది కొత్తగా వచ్చింది చూశారా?" "ఇది తీసుకున్నట్టు లేదే మీరు?" "పోయిన సారి వచ్చినపుడు ఇది చూడలేదనుకుంటాను" అని చక్కగా సజెస్ట్ చేసి మరీ మంచి పుస్తకాలు చూపిస్తారు. కొనిపిస్తారు కూడా!


సరే, "అలా తిట్టకండి సార్" అని ప్రాధేయపడి వాళ్ళ దగ్గర కూడా పుస్తకాలు కొన్నాను. పిల్లలతో షాపింగ్ కి వెళ్ళ కూడదని మా అమ్మాయి మరో సారి రుజువు చేసింది. దానికిష్టమైన పుస్తకాలన్నీ సెలెక్ట్ చేసేసుకుని "డబ్బులు అమ్మ ఇస్తుంది" అని ముందుకెళ్ళిపోయింది. ఒక scholastic స్టాల్లోనే, 30 పేజీలదొకటీ, యాభై పేజీల దొకటీ, వంద పేజీల దొకటీ...ఈ మూడు పుస్తకాలకీ కలిపి పదమూడు వందలు...అదొక కడుపు మండించే సన్నివేశం! వదిలేయండి!


సందట్లో సడేమియా లాగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే స్టాళ్ళు కూడా పుస్తకాల స్టాళ్ళ మధ్య కనపడి ఆశ్చర్యం కల్గించాయి. ఇంకా ఆశ్చర్యం..ఆ స్టాళ్ళ వద్ద కూడా బోల్డు మంది జనం గుమికూడి ఉండటం!

ప్రజాశక్తి,విశాలాంధ్ర,నవోదయ,కొత్తపల్లి.ఎమెస్కో.. ఇవే కాకుండా ఇంకా పబ్లిషర్లూ, స్టాళ్ల పేర్లూ చూసుకోకుండా కాళ్ళు నొప్పేట్టేదాక తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను.

చలం రచనలు ఆకట్టుకునే అందమైన డిజైన్లో కనపడి ఊరించేయడంతో నా దగ్గర అన్నీ ఉన్నా, కథలన్నీ ఒకచోట పడి ఉంటాయి లెద్దూ అని సర్ది చెప్పుకుని మళ్ళీ కొనేశాను కథా సంకలనాలు!ఏడుతరాలు నా దగ్గరున్న దాన్ని ఎవరో పుణ్యాత్ములు పట్టుకెళ్ళి చివరి పేజీలు చింపేసి ఇచ్చారు. అలా చివరి పేజీలు లేని దాన్నే మరొకరికి ఇచ్చా చదవమని! ఎలాగైనా కొత్తది ఉండటం అవసరమని అది తీసుకున్నాను!

చలం కొత్త కలెక్షన్లో కథా సంకలనాలు,
బీనా దేవి సమగ్ర రచనలు,
వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టి మనిషి" (ఇది నా దగ్గరుంది ఎవరికో ఇచ్చాను)
పిలకా గణపతి శాస్త్రి గారి ప్రాచీన గాథా లహరి,(ఈ సారి ఇది నా ఫేవరిట్ పుస్తకమై కూచుంది)
చెళ్ళ పిళ్ళవెంకట శాస్త్రి గారి "కథలూ గాధలూ"

అంటరాని వసంతం,
కాశీభట్ల వేణు గోపాల్ పుస్తకాలు,
రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం "కళ్ళు తెరిచిన సీత"
మరి కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు....కొన్నా!



కొమ్మూరి వేణు గోపాల రావు గారి పుస్తకాలు మళ్ళీ వేశారంటే ఆయన రాసిన "ఈ దేశంలో ఒక భాగమిది" పుస్తకం కోసం వెదికాను ఆత్రంగా( పోయిన సారీ ఇలాగే వెదికా దీని కోసం)! పోయిన సారి లాగే అది నాకు దొరకలేదు. ఆయన పుస్తకాలన్నింటిలోనూ అదే నాకు నచ్చుతుంది బాగా!

వనవాసి కొత్త కాపీ (నా దగ్గరుంది ఎప్పుడో యాభైల్లో వేసింది. పట్టుకుంటే పొడి ఐపోతోంది)తీసుకున్నా !

ప్రదర్శన అయిపోయే లోపు మరి కొన్ని పుస్తకాలు కొనాలి.

పుస్తకాలు చదివే వాళ్లనీ, కొనే వాళ్ళనీ ఒక చోట చేర్చి, తమ పఠనానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునేలా చేయడంలో ఆన్ లైన్ తెలుగు ప్రపంచం, ముఖ్యంగా తెలుగు బ్లాగులు చాలా ఉపయోగపడ్డాయనడంలో నాకెలాంటి సందేహమూ లేదు.

నీ దగ్గర ఈ పుస్తకముందా?... ఈ పుస్తకం మీకు దొరికిందా? అంటూ పలకరించుకుంటూ, దూరాన ఉన్న స్నేహితులకు పుస్తకాలు కొని పంపడం వరకూ చేరింది ఇది. (దూరాన ఉన్న స్నేహితుల కోసం నేనూ కొన్నాను పుస్తకాలు! నాతో పాటే మరి కొందరు బ్లాగ్ మిత్రులు కూడా విదేశాల్లోని మిత్రుల కోసం పుస్తకాలు కొన్నారు)

కాబట్టి, తెలుగు బ్లాగులున్నంత వరకూ, పుస్తక పఠనానికి, పఠనానుభవాల పంపకాలకు మాత్రం లోటు జరగదు.