డాట్రారు తెచ్చిన పుస్తకాలు!(నోరూరడం లేదూ?)
మొన్నొక రోజు పాత ట్రంకు పెట్టెలూ,పైన అటకా ఇవన్నీ సర్దుతుంటే దిగులేసింది. "ఇన్ని పుస్తకాలు ఎందుకు దాచానా" అని కోపం కూడా వచ్చింది. అచ్చు తప్పుల పుస్తకాల్ని కూడా "ఏమో తర్వాత దొరుకుతాయో దొరకవో" అని ఉంచినట్టున్నా....బోల్డు తేలాయి.కంపరం వాటిని చూస్తే! వాటిని భోగి రోజు ఓ చూపు చూస్తే కొన్ని పుస్తకాలు తగ్గుతాయి.
అసలు ఇక్కడొక బేసిక్ ప్రశ్న! పుస్తకాలెందుకు కొంటాం? చదవడానికేగా?
అవేమన్నా బంగారమా, ఈక్విటీషేర్లా, లాకర్లోనో, డీమాట్లోనో పడేసి రేటొచ్చినపుడు అమ్మేయడానికి?
బుక్ ఫేర్ లో బోల్డు మంది కట్టలు కట్టలు పుస్తకాలు కొనుక్కెళుతుంటే "అబ్బ, అవన్నీ చదివేస్తారు కాబోలు" అనిపించిందే తప్ప "తీసుకెళ్ళి అటక మీద పడేస్తారేమో" అనిపించలా అదేం చోద్యమో!
విజయవాడ లో పాత పుస్తకాల కొట్లకు వచ్చి "ఫలానా పుస్తకముందా? ఫలానాది ఉందా" అని పంతులు గారి కొట్లో నేల మాళిగలోకి దిగి దుమ్ము పీలుస్తూ, అడుగెత్తు మట్టి పేరుకున్న నేలమీద కూచుని కళ్ళ జోళ్లు తుడుచుకుంటూ వెదుకుతున్న పుస్తకం దొరికేవరకూ..... పరాక్రమం విడనాడని వాళ్ళని చూస్తే "అబ్బ, ఎంత మంచి వాళ్ళో" అనిపిస్తుంది.
దూర తీరాల నుంచి స్నేహితులు "ఫలానా పుస్తకం గురించి చాలా విన్నానండీ! ఆ పుస్తకం ఎలాగైనా కావాలి. చదివి తీరాలి" అన్నపుడో,
"ఫలానా రచయిత పుస్తకం సగమే చదివానండీ, ఆ పుస్తకం దొరుకుతుందేమో చూడరా ప్లీజ్" అన్నపుడో నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి.
ప్రాణాలకు తెగించి (అలా ఫ్రెండ్ కోరిన పుస్తకం కోసం ఇరుకు సందులో వెళ్తుంటే బైక్ మీదినుంచి పడ్డాను మరి) ఆ పుస్తకాలు సంపాదించి వాళ్లకిచ్చి,అది అందుకున్నప్పటి వాళ్ళ నవ్వు మొహాన్ని ఊహిస్తూ కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది.
ఇలా నా కోసం పుస్తకాలు సంపాదించే మిత్రులు కూడా ఉన్నారు! మన డాక్టర్ కౌటిల్య మొన్న ఎన్ని పుస్తకాలు తెచ్చాడో గుంటూరు నుంచి మోసుకుని!
ఈ మధ్య ఒక పెళ్ళిలో మా బంధువులావిడ కలిసింది. దగ్గర దగ్గర డెబ్భై యేళ్ళుంటాయి. దగ్గరి చుట్టరికమే లెండి. మా ఆడపడుచు తోటికోడలి మరదలి వదిన గారికి వేలు విడిచిన మేనత్తట. ఆవిడ పెళ్ళయ్యాక కలకత్తా వెళ్ళిపోయింది. పిల్లలు లేరు. అప్పటినుంచి ఈవిడ పరాక్రమించి (బోల్డు తీరిక కదా) బెంగాలీలో కథలూ అవీ రాసి ఉన్నపళంగా రచయిత్రి అయిపోయింది.
సరదా పడి మా ఇంటికి వచ్చింది. ఆవిడరచయిత్రి కదా కాసేపు పుస్తకాల గురించి మాట్లాడుకోవచ్చని ఆహ్వానించాను. నా లైబ్రరీ చూసి "ఏవిటి, ఇవన్నీ నిజంగా చదువుతావా?ఎన్ని చదివావు వీటిలో?" అంది.
నేను ముందు తెల్లబోయి "ఎన్ని చదవడమేమిటి? అన్నీ చదివేశాను! కావాలంటే ఈ పుస్తకాల్లో ఏదో ఒకదాని మీద నాకు పరీక్ష పెట్టుకోండి" అన్నా సరదాగా!
"అమ్మో, నేనసలు చదవను. ఏదో కొని పడేస్తుంటా, ఎప్పుడైనా తీరిక దొరికితే చదవొచ్చని" అంది.
"అవునూ, ఉజ్జోగం, ఇల్లు, సంసారం, పిల్లలు,ఇతర పన్లూ..వీటన్నింటి మధ్యా నీకు టైమెక్కడ దొరుకుతుంది ఇన్నేసి పుస్తకాలు చదవడానికి?" అని పాపం కుతూహల పడింది.
అది అమ్మమ్మ అన్నందుకు కాసేపు సీరియస్ అయి "నాకు రాయడానికే సమయం సరిపోదు. ఇంకెక్కడ చదువుతాను! రాయగలిగిన సత్తా ఉన్నపుడు చదవాల్సిన పని లేదని నా అభిప్రాయం" అని వాక్రుచ్చింది.
"నువ్వేం రాయవా? ఎప్పుడూ చదవడమేనా? బోరు కొట్టదూ?" అంది
"రాస్తానండీ, ఏదో పత్రికలకు కాసిన్ని వ్యాసాలు, కాలములూ"
"అదేంటి, సాహిత్య సృష్టి చేయవూ" నిర్ఘాంత పోయి.
"అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ! ఏవో తొమ్మిది పది కథలు ఎప్పుడో రాసి పడేశాను కానీ అవి ఎక్కడున్నాయో కూడా వెదకను నేను"
"సో, you are more journalist than a writer"
"మీకెలా తోస్తే అలా అనుకోండి"
"నీ ఫ్రెండ్స్ అంతా ఇలాగే పుస్తకాలు కొంటారా?"
"ఓ, కొంటారు. నాకంటే ఎక్కువ కొనేవాళ్ళు వందల్లో ఉన్నారు"
"వాళ్ళూ ఇంతేనా? చదవడమేనా?రాయరా?"
"కొందరు రాస్తారు. అయినా అసలు పుస్తకాలు చదివే వాళ్లంతా రాస్తూ ఉండాలని రూలెక్కడుందండీ?అలా మేవంతా రాస్తే పాపం మీలాంటి వాళ్ళు ఏమై పోతారు?"
"అసలు ఇన్ని పన్ల మధ్య నీకు టైమెక్కడ దొరుకుతుందో చెప్పు" (వాళ్లాయన మీద చుట్టాలెందుకు జాలిపడ్డారో కొద్దిగా అర్థమైంది )
"నాకు టైము "దొరకదు"! నేనే కేటాయించుకుంటాను. MMTSలోనూ, సిటీ బస్సుల్లోనూ పక్క ప్రయాణీకులతో సొల్లు కబుర్లు చెప్పకుండా పుస్తకాలు చదువుకుంటాను. అన్నం తినడం,నీళ్ళు తాగడం,ఆఫీసు పని ఎలా నిత్య కృత్యాలో, పుస్తకాలు చదవడం కూడా అంతే నాకు!గోవా బీచ్ లో కూచుని మానవ సమాజం చదివాను నేను. అందువల్ల నేను పుస్తకాలు చదువుతానా లేదా అనే సందేహం వదిలి పెట్టి తమరేం గిలికారో కాస్త చెప్పండి" అన్నాను సీరియస్ గా!
ఎంత సేపని ఈ మనిషితో మామూలుగా మాట్లాడ్డం?
"ఏవైనా పుస్తకాల క్లబ్బుకో వెబ్ సైట్లకో రాస్తుంటావా పోనీ? మెంబర్ గా ఉన్నావా?"
"అబ్బే లేదండీ! అతిథుల లిస్టు లో కూడా నా పేరుండదు. చెక్ చేసుకోండి కావాలంటే"
ఆ రోజుకు ఇహ అలసి పోయి ఊరుకుంది.
మరో రెండు రోజులు హైద్రాబాదులోనే ఉంది. కానీ ఇన్నేసి పుస్తకాలు ఎందుకు కొంటారు? కొని నిజంగా చదువుతారా అనే సందేహం మాత్రం వదిలి పెట్టినట్టు లేదు.
కనిపించినపుడల్లా ఇదే టాపిక్ మాట్లాడి నా సహనానికి పరీక్ష పెట్టింది.
"ఇంకా నయం, నాకీ జంజాటాలేవీ లేవు. లేకపోతే నా రాతలు కుంటుబడేవే"అని గొణుక్కుని నాకు రెండు బెంగాలీ పుస్తకాలిచ్చింది. తెల్లబోయాను. నేనేం చేసుకోను వాటిని? అదే అడిగాను. "త్వరలో వాటిని ఒకాయన తెలుగులోకి అనువదిస్తాడు. అప్పటిదాకా అవే ఉండనీ" అని చెప్పి పోయింది. అవి కూడా నా భోగి లిస్టులో చేరాయి.
నాకైతే పుస్తకాలు ఆబగా చదివే తెలుగు బ్లాగర్లందరితో ఒక మీటింగ్ పెడితే బాగుండు ఆవిడ కోసం అనిపించింది.
ఇంతకీ, ఏవిటి? పుస్తకాలు గొప్ప కోసం కొని పక్కన పడేజే జాబితాలో ఉన్నారా? చదివే జాబితాలోనా?
ఏవిటో చల్లనివేళ ఆవిడ వల్ల ఈ డౌట్లూ!
పుస్తకాలు ఇష్టంగా చదివే వాళ్ళంతా ఇలా వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పండి మా కోల్ కతా అత్తయ్య పిన్నికి
46 comments:
మొదట్లో కనిపించిన పుస్తకమల్లా కొనేసీ,దొరికిన టైం లో చక చకా చదివేసేవాడిని. సరిగ్గా ఆరు నెలల నుండి అనుకుంటా, కొన్న పుస్తకం ఒక్కటి కూడా పూర్తి చెయ్యలేదు.. ;(;( కొన్ని బుక్స్ కనీసం తెరవలేదు.
మీ పోస్ట్ నన్ను పిన్ తో గుచ్చినట్టూ ఉంది.
"అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ! >>> కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...
రాజ్ కుమార్, ఇంకా నయం!
గుచ్చడమా పాడా? అయినా మనం చదువుతామా లేదా అనేది మన స్వవిషయం! "నిజంగా చదువుతారా?" అనే ఆశ్చర్యం ఎందుకటా జనాలకి? వాళ్ళు చదువుతున్నారో లేదో ప్రశ్నించుకోకుండానే పుస్తకాలు కొనే వాళ్లని చులకనగా చూసే మా కోల్ కతా అత్తయ్య పిన్ని(ఆవిడ కరెక్ట్ గా నాకేమవుతుందో తెలీదు మరి)గారికో బుల్లి చురక ఇది!
మీరు ఎంచక్కా మంచి పుస్తకాలు చదవండి
సుజాత గారు,
నేను పెళ్లి అయిన తరువాత చాలా కాలం వరకు పుస్తకాలు కొనడంవరకే పరిమితం అయ్యాను...మా మామగారు,ఏమిటమ్మ కోడలా,""All these books are for Self improvement ? or Shelf improvement ?? అని అడిగారు..:-)
చదవాలనే ఆసక్తి ఉన్నా బద్ధకించాను..ఇప్పుడు మా బాబు స్కూల్ కి వెళ్తుండటం తో కావలసినంత సమయం చిక్కుతోంది...అందుకే అటక మీద ఉన్న పుస్తకాలన్నీ బయటకు తీసి,దుమ్ము దులిపి కొంచెం వాటిని సంస్కరిస్తూ నన్ను నేను సంస్కరించుకుందాం అనుకుంటున్నాను....
మీ పోస్టు లో చలోక్తులు చదివి నవ్వు ఆపుకోలేకపోయానంటే నమ్మండి...:-)
నాగిని.
అబ్బా ...బుచ్చిబాబు పుస్తకాలు కళ్ళూరిపోతున్నాయ్ .
సుజాత గారూ, రాయాలంటే ఎక్కువ చదవాలని విన్నానే !
మీ అత్తయ్య పిన్ని గారి గురించి తెలుసుకున్నాకా , నేను అనవసరంగా చదువుతూ కాలం వృధా చేస్తున్నానేమో అనిపిస్తుంది . అటులైన వెంటనే విద్వంసకాండకు ఉపక్రమించవలె .
మీ దయవల్ల అంటే మీరే స్పూర్తిగా అని అర్ధం, పుస్తకాల కోసం ఒక రెండు రేక్స్ చేయించి మరీ ఉంచాను.పుస్తకాలు కొనడం వరకూ మా శంకర్ చేస్తున్నడులెండి(లిస్ట్ అంతా ఆయనదే).నేను వాటిని మెల్లి మెల్లిగా పూర్తిచేస్తున్నా వీలు చేసుకుని మరీ.
నేనూ ఓ రెండు సంవత్సరాలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు హాజరయ్యి దాదాపు ఓ పదిహేను పుస్తకాలు దాకా కొనేశాను. వాటిని పూర్తి చేసే దాకా మళ్ళీ పుస్తకాలు కొనకూడదని ఒట్టు పెట్టుకున్నా. ఇప్పటికి వాటిల్లో సగానికిపైగా పూర్తి చేశా.
చదవడం విషయంలో, మిమ్మల్ని, విబి సౌమ్యగారినీ, పూర్ణిమ గారినీ, పప్పు నాగరాజు గారినీ, నెమలికన్ను మురళి గారినీ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంటుంది నాకు. అంటే మీరంతా నాకు ఆదర్శమన్నమాట :-)
వామ్మో ఏం వింత మనిషండీ ఈవిడ! పుస్తకాలు చదవడానికి కాకపోతే కొనడం ఎందుకుట...ఎవరిని ఉద్ధరించడానికి? మ ఐంట్లో బోల్డు పుస్తకాలున్నాయి అని ఫోజు కొట్టడానికా? ఎవరైన ఆ ఏదైనా పుస్తకం గురించి అడిగి మనం చెప్పలేకపోతే మన ఆబోరు దక్కేనా?
ఎవరైనా ఈ పుస్తకం చదివేవా అని అడిగితే లేదు అని చెప్పడానికి నాకు ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా! ఎప్పుడెప్పుడు ఆ పుస్తకం చదువుతానా అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాను.
మీలాంటి స్నేహితుల పుణ్యమా అని ఇక్కడున్నా విరివిగా పుస్తకాలు చదువుతున్నా :)
"అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ!" ...:))))))
చదువుకునే రోజుల్లో అలా చదివేదాన్ని...తర్వాత చాలా ఏళ్ళూ అసలు పుస్తకాలే కొనలే !క్రితమ్ ఏడాది కొన్నవి మాత్రం సగమే చదివాను...ఇప్పుడు మాత్రం అలా మానేయకూడదని కొన్నవి కొన్నట్లు చదివేస్తున్నాను...!
అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ!
చప్పట్లు, ఈలలు, చిటికెలు
బాబ్బాబు మీ భోగం నుండి కొన్ని నాకిద్దురూ! అలానే మీ కథలు వెతికిపెట్టండి చదివిపెడతాము...
ఇంతకీ తదుపరి కలుపుగోలుకైనా మీరు ఆవిడతో ఉన్న సరయిన బాంధవ్యాన్ని తెలుసుకుని, గురి చూసి కొట్టండి; ఆ పై ఆమె నోట మాట రాదని నా గారంటీ
ఇదిగో సుజాత గారి కోల్ కతా అత్తయ్య పిన్నిగారూ లేదండీ.మేమస్సలు చదవం. ఊరికే కొని దాస్తామంతే. అసలు ఈ పుస్తకాలు ఒక్కోదానికీ ఫ్రేము కట్టించి హాల్లో వేలాడదీయాలనుకుంటున్నాం.మీకో రహస్యం చెప్పనా మా ఇంట్లో ఫ్రిజ్ స్టాండ్ ఉండదు. ముళ్ళపూడి సాహితీ సర్వస్వం రెండేసి పుస్తకాల చొప్పున నాలుగు కోళ్ళ కిందా పెట్టి మేనేజ్ చేసేస్తాం. వంశీకి నచ్చిన కథల పుస్తకం మా ఆవిడ నాకు నచ్చిన చపాతీలూ, పూరీలు గట్రా వత్తడానికి వాడుతూ ఉంటుందన్న మాట. ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు విశ్వనాధ సాహిత్యం లోంచి పేపర్లు చింపుకుని పడవలూ అవీ చేసి నీళ్ళల్లో వదులుతూ సంబరపడతాం. ఇంకా ఒకే ఒక్క మిథునం లాంటి బక్క పుస్తకాలైతే వేసవి కాలం మధ్యాహ్నం పూట కరెంట్ పోయినప్పుడు విసురుకోడానికి ఎంచక్కా ఉంటాయి.
చదువుతారా??? అదో ప్రశ్నా????
(అప్పట్లో ఆనందో బ్రహ్మ ప్రోగ్రాం లో "బావున్నారా? " అని పొరపాటున కుశలం అడిగిన వాడికి ఇలాంటి సమాధానమే ఇచ్చిన బ్రహ్మానందం ఐటం స్ఫూర్తితో.:))) )
కోల్కాతా ఆంటీ అనేయండీ..గొడవే ఉండదూ..
అఫ్కోర్స్.ఆవిడ చులకన గా చూడ్డం అటుంచితే, నేనూ కొని రాక్ లో సర్దేస్తున్నాను గానీ చదవటం లేదు అన్న విష్యం గుర్తొచ్చిందండీ..
దీన్ని చురక అంటారా? వాత లాగా అనిపిస్తుంటేనూ.. ;)
మీ టెంప్లేట్ భలే ఉన్నాదండీ. ముఖ్యంగా కమెంట్ బాక్సు. పెట్టిన ప్రతీ కమెంట్ నీ ఫ్రేం కట్టించినట్టు ;)
>>> వాళ్ళ నవ్వు మొహాన్ని ఊహిస్తూ కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది...
నేనూ నవ్వుదామనుకొన్నాను కానీ మీరు కళ్ళు తుడుచుకుంటానన్నారని మానేశాను.... దహా.
అమ్మో!!పుస్తకాలు భోగిలోకా. అందునా తెలుగు పుస్తకాలు.. ఆ పని చేయకండి.. కొన్ని నేను తీసుకుంటా. వెంటనే కాకున్నా మెల్లిమెల్లిగి చదువుతాను.. నేనైతే మొదటినుండి నాకు నచ్చిన పుస్తకమే కొనేదాన్ని కాబట్టి. చదవకుంఢా ఉంచలేదు. లేటుగా ఐనా చదివేదాన్ని.
చాలా చక్కగా రాసారు సుజాత గారు, నేను కూడా కనిపించిన పుస్తకం కనిపించినట్టు కొనేవాడిని,(ఎక్కడ అందులో వున్న విషయాలు నాకు తెలియకపోతాయో అని కొన్ని, ఎవరైనా ఈ పుస్తకం బాగుంది,అని చెప్తే కొన్ని, ఇలా చాలా కొన్నాను)... ఈ మధ్య కాలంలోబద్దకించి చదవడం మానేసాను.
"నిజంగా చదువుతారా?" అనే ఆశ్చర్యం ఎందుకటా జనాలకి?">>>>>> నేను కూడా కనిపించిన వాళ్ళని ఈ ప్రశ్న అడిగే వాడిని, కాకపొతే వేరే కారణంతో లెండి. వాళ్ళు చదువుతాము అని సమాధానం చెప్తే అప్పుడు జెలసీతో అయినా చదవడం మొదలెడతాను అని. (ఎంతైనా కార్పరేటు విద్యాసంస్థలలో చదివి వచ్చాము కదా :ప)
ఇన్ని బుచ్చిబాబు పుస్తకాలే!!హమ్మో!
కౌటిల్య గారు నిజంగా ఆణిముత్యమే! నాకు గత నెలలో రామాయణ కల్పవృక్ష రహస్యాలు పంపించి ఋణగ్రస్తురాలిని చేసేశారు.
ఇంతకూ ఈ బుచ్చిబాబు "చివరకు మిగిలేది" బుచ్చిబాబేనా? నేను మొన్నీ మధ్యే చివరకు మిగిలేది పూర్తి చేశాను. దాని గురించి ఎంత రాసినా సరిపోయేట్టు లేదు (కొన్ని పొగడ్తలూ..కొన్ని అనుమానాలూ, కొన్ని నిష్టూరాలూ..) - కానీ, ఆయన కథలు, ఇతర రచనలూ మరికాస్త బాగుంటాయేమొన్న ఆశ మాత్రం ఇంకా సజీవంగా ఉంది. మీరు ఈ పుస్తకాలు చదివిన తరువాత వీలు కుదిరితే కొన్ని మాటలు మా అందరితోనూ పంచుకోండి.
మీ బ్లాగ్ రచనలు చిన్ననాటి నేస్తంతో ఉయ్యాలలూగుతూ పంచుకున్న కబుర్లల్లే హాయిగా సాగిపోతాయని పదే పదే చెప్పాలనుంటుంది కానీ, టపాల్లో మీరు పెట్టే ఈ పుస్తకాల బొమ్మలు చూసి కుళ్ళుకోకుండా ఉండడం అసాధ్యమైపోతోంది.
సుజాత గారు,
ఈ టపా చూశాక నాకు ఒకరిద్దరు గుర్తుకొచ్చారు. మంచి అభిరుచి ఉందని అందరూ అనుకోవాలని, పెద్ద లైబ్రరీ పెట్టుకుంటారు.
నా వరకూ నాకు.. ఒక్కో పుస్తకం కొనుక్కున్నప్పుడు చదివి కానీ వదిలిపెట్టను. కానీ. నేను కొన్ని పుస్తకాలు 'ఎప్పుడైనా' చదువుదామని కొని చదవనివి ఉన్నాయి. అవి చూసినప్పుడు గిల్ట్ గా ఫీలయినా, ఒక పట్టాన ముట్టుకోను. (అవి కొద్దిగా కష్టమైన భాష లో ఉండటం వల్ల.. )
సుబ్బరంగా కొంటాను సుబ్భరంగా చదువుతాను. కానీ ఈ మధ్య కొన్నవి ఎక్కువ చదివినవి తక్కువగా ఉంటోంటే(సరిగ్గా నేనూ ఆర్నెల్ల నుంచే).. నన్ను నేను చెక్ చేస్కున్నా. ఇంతా జేస్తే ఇదివరకు ఓ పద్ధతిలో కొని ఓ పద్ధతిలో చదివెవాణ్ణనీ ఈ మధ్య పద్ధతిగానే చదువుతున్నా పద్ధతీ పాడూ లేకుండా తెగ కొనేస్తున్నాననీ అర్ధమైంది.
నన్నూ ఈ ప్రశ్న అడిగిన వాళ్లున్నారు. ఇరగదీసి రాసెయ్యమనే వారూ ఉన్నారు కానీ నేను నేనే నేనింతే అని అర్ధం చేస్కున్నారు
:) :) :)
మరీ మొహం మీదే అడిగేస్తే మీరు మాత్రం ఎలా చెప్తారులెండి. శంకర్ గారు ఇచ్చిన సమాధానం బాగా ప్రాక్టిస్ చేసి చెప్పండి. అత్తపిన్ని గారికి బాఘా అర్ధమవుతుంది :)
బ్లాగులకు రాకమునుపు ఏవో చిన్న చిన్న ఇంగ్లీష్ నవలలు చదివేవాడిని. ఇక్కడకొచ్చాక రివ్యూలు చదివేసి కొన్నింటీని కొని వాటిల్లో రిఫర్ చేసినవి కొన్నింటిని కొని- మిగతా కొన్ని డౌన్‌లోడ్ చేసి- అలా కొన్ని పోగేశాను. రోజుకు ఓ పుస్తకంలోంచి ఓ పేజీ లెక్కన ఏరోజు ఏం చదువుతానో తెలీకుండా తయారైంది పరిస్థితి :D
హమ్మ, పోనీలెండి నాకు చాలా మంది తోడున్నారు. బొత్తిగా " కొంటాం కానీ చదివే తీరిక ఎక్కడిదీ" అంటారని హడలి పోయాను.
నాగిని గారూ,మీ మావగారు చతురులే!మొత్తానికి ఇప్పుడైనా మొదలు పెట్టారు. ఇంతకీ ఏమేమి ఉన్నాయేంటి మాంఛి పుస్తకాలు మీ దగ్గర?
లలిత గారూ, మీరైతే నిజంగా పెద్దగా చదవనక్కర్లేకుండానే రాయగలరు. అత్తయ్య పిన్నిని ఫాలో అవక్కర్లేదు. ఆవిడో సెలబ్రిటీ (గా భావించుకుంటుంది) కాబట్టి అంత పెద్దవాళ్ళని అప్పుడే ఫాలో అయిపోతే మాకు దూరం అయిపోతారు మరి! :-)
పప్పుగారూ, మీదసలే పెద్ద మనసు. పన్లో పనిగా నాక్కూడా మంచి పుస్తకాల బీరువా బహూకరిస్తే మీ సొమ్మేం పోయింది?
రవి, ఇంతకీ ఎన్ని పుస్తకాలు చదివారు వాటిలో? ఇంకేం చదువుతారు? ఇపుడు జోల పాటల సిరీస్ స్టార్ట్ అయి ఉంటుందిగా?
సౌమ్యా,
ఆ ఫోజుల కోసమే తల్లీ ఆవిడ తంటా!
నీ పుస్తకాల పిచ్చి నాకు తెలుసులే! ఇంతకీ కళ్ళు తెరిచిన సీత మొదలెట్టావా లేదా?
తృష్ణ, కొన్నవి కొన్నట్లు చదివేస్తున్నాను...!_______నా పద్ధతి కూడా ఇదేనండీ!
రహమాన్,
నేను ఏడాదికో కథ రాస్తుండేదాన్ని! రాయడానికి అంత బద్ధకం! నా బ్లాగు కూడా రెగ్యులర్ గా అప్డేట్ కాదు చూడండి!అలా భూమి,ఆంధ్ర జ్యోతి,ప్రభ,వెబ్ దునియా, ఇలా పది కథల వరకూ పబ్లిష్ అయ్యాయి. ఎప్పుడో వాటిని వెదికి పట్టుకుని మీ అంతు చూస్తాను ఆగండి!
భోగి లిస్టులో ఉన్నవి అన్నీ అచ్చుతప్పులున్నవి, మరియు అర్థం లేనివీనూ! అందువల్ల మీకుపయోగం లేదు.ఆమె నోట మాట రాదని నా గారంటీ ________పోనీలెద్దూ, పెద్దావిడ అని ఊరుకున్నాను. అప్పటికే ఆవిడకు అంత పని జరిగింది.
శంకర్ గారూ, కేక పెట్టించడంలో మీకు మీరే సాటి!మీ జవాబు కోల్కతా అత్తయ్య పిన్ని చూస్తే, అర్థమైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నా!
బ్రహ్మానందం నటించిన ఆ సన్నివేశాల్ని చిన్ని కృష్ణుడు సినిమాలో కూడా అలాగే వాడారు గుర్తుందా?
రాజ్,
ఆవిడ అలాగే ఆంటీ అనే పిలవమంది లెండి, మమ్మల్నే కాదు, మా పాపని కూడా!:-)
ఈ టెంప్లేట్ డార్క్ గా ఉందనిపించినా, ఆ కామెంట్స్ అలా ఫ్రేమ్ కట్టినట్టు ఉండటం నచ్చి ఈ తెంప్లేట్ కి ఒడిగట్టాను. థాంక్యూ!
బులుసు గారూ, నేను పుస్తకాలు పంపినప్పుడు అవి అందుకున్న వారి మొహంలో నవ్వు నేను ఊహించుకుంటుంది. మీకింకా పంపలేదు. మీరు నవ్వితే నేనొప్పుకోను ! కావాలంటే పుస్తకాలు పంపాక..అప్పుడు నవ్వండి!~
జ్యోతి గారు,
అబ్బే నేను పడేద్దామనుకున్న పుస్తకాలు అంత గొప్పవి కాదండీ! లేకపోతే ఎవరికో ఒకరికి ఇద్దును కదా!
Amarnath గారూ, బావుంది. ఇప్పుడైనా చదువుతున్నారా లేదా మరి? థాంక్యూ!
మానసా, బుచ్చి బాబు రచనలు బాగుంటాయి. మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. రాను రాను అలవాటైపోతుంది______కష్టం! :-))
నిజమే, చివరికి మిగిలేది గురించి ఎంత రాసినా, ఎంత మాట్లాడుకున్నా తరగదు. ఎప్పటికీ అయిపోని సబ్జెక్టు చివరికి మిగిలేది నవల. ఆ నవల మీద నిడదవోలు మాలతి గారు రాసిన వ్యాసం PDF ఎక్కడో ఉండాలి. సంపాదించి పంపిస్తాను. చదువు!
బతికినన్నాళ్ళూ మనతో ఉండే స్నేహితులు మంచి పుస్తకాలే కదా!
కృష్ణ ప్రియ గారూ,సత్యం చెప్పరు! వాళ్ళు "వాళ్ల లాగా" ఉండకుండా జనం కోసం "ఇంకెవరి" లాగానో ప్రొజెక్ట్ చేసుకోడం ఒక డిజార్డర్! ఐడెంటిటీ క్రైసిస్! అంత కష్టపడి మరెవరిలాగానో ఉండటం పెద్ద స్ట్రెస్ కదా, పాపం ఎలా భరిస్తారో దాన్ని!
ఇలా రాస్తూ ఉంటే నాకూ ఇద్దరు ముగ్గురు గుర్తొచ్చేలా ఉన్నారు.
ఒక్కోసారి రివ్యూలు చదివి కొన్న పుస్తకాలు మోసం చేస్తాయి. చదవలేం! అలాగని చూస్తూ కూచోలేం! ఇదో పెద్ద తంటా!
పక్కింటబ్బాయ్,
పద్ధతీ పాడూ లేకుండా కొనే అలవాటు చిన్నపుడు నాకూ ఉండేది. ఆ తర్వాత సెలక్టివ్ గా కొనాలని బోల్డు డబ్బులు వదిలాక అర్థమైంది. :-)
నాగార్జున,
మరీ మొహం మీదే అడిగేస్తే మీరు మాత్రం ఎలా చెప్తారులెండి. .. అబ్బే నాకు పెద్దగా మొహమాటం లేదు. కానీ నస మేళాల్ని తట్టుకోడం కష్టం కదా! అందుకే శంకర్ గారి జవాబు ప్రాక్టీస్ చేయాల్సిందే!
రోజుకు ఓ పుస్తకంలోంచి ఓ పేజీ లెక్కన ఏరోజు ఏం చదువుతానో తెలీకుండా తయారైంది పరిస్థితి _________ఏదో ఒకటి..మొత్తానికి చదూతున్నారు..అదీ సంతోషం!
కత్తి మహేష్ గారు ఈ మధ్య అక్కడక్కడా బ్లాగుల్లో కామెంట్స్ గా పెట్టే స్మైలీలు చూస్తుంటే నాకు ఆర్.సంధ్యా దేవి అనే రచయిత్రి గుర్తొస్తుంది. ఆవిడ నవలల్లో హీరోయిన్లకు రెండు పేజీల డైలాగ్ రాసి చివర్లో....."అన్నట్టు చూసింది" అని రాసేదావిడ. రెండు పేజీల డైలాగ్ కి సరిపడా భావాన్ని ఒక్క చూపుతో ఎలా పలికించిందో అర్థం కాక మనమిక్కడ జుట్టు పీక్కుంటాం!
అలాగే ఒక స్మైలీ, లేదా రెండు, లేదా మూడు...! వీటికి భాష్యాలు చెప్పండి సార్! :-)) బాగుందనా, బాలేదనా లేక ఇంకేదైనా నా?
సుజాత గారూ,
మీ కలకత్తా బంధువు మాటలు నేను ప్రత్యక్షంగా వినలేదు కనుక మీ ఆలోచన సరైనదే కావచ్చు. కానీ మీ టపా మాత్రమే చదివి ప్రత్యక్షంగా ఆమె మాటలు వినకపోవడం మూలాన కలిగిన ఆలోచన పంచుకుందామనిపించింది. ఆమె మిమ్మల్ని ఇన్ని బాధ్యతల మధ్య సమయం ఎలా దొరుకుతుంది అనే genuine curiosity తో అడిగి ఉండవచ్చు కదా? నాకూ కొంత మందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతెందుకు ఇల్లూ ఉద్యోగమూ చూసుకోవడమే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంటి పనులు, parenting చేస్తూ ఉద్యోగానికి న్యాయం చెయ్యలేనని ఉద్యోగం వదిలేసుకున్నాను కనుక. ఐనా వాళ్ళు చేస్తున్నారంటే నేను వాళ్ళ నుంచి నేర్చుకోగలిగేది ఏమైనా ఉందేమో, ప్రయత్నిస్తే ఉద్యోగమే అవ్వచ్చు లేడా ఇంకేదైనా ప్రయోజనకరమైన పనే అవ్వచ్చు అదనంగా చెయ్యగలుగుతాను కదా అని అనిపిస్తుంటుంది. ఇలా అడిగే వాటిని అపార్థం చేసుకుంటుంటారు కొందరు అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. బహుశా నేను అడిగే తీరు మార్చుకోవాలేమో అని కూడా ఆలోచిస్తుంటాను, ప్రయత్నిస్తుంటాను అనుకోండి. అది వేరే విషయం. అందుకని ఇంకో కోణం కూడా ఉండవచ్చని చెప్పాలనిపించింది. మీరు ఆమెకి ఏ ఝంఝాటాలూ లేవు అన్నదాన్ని పదే పదే ఎత్తి చూపడం బాధ కలిగించింది. ఆమె మిమ్మల్ని బాధ పెడితే మీరూ అదే సంస్కారం చూపించక్కర్లేదు కదా అనిపించింది.
ఆమె ఎంతో చదువుతున్న దానిలా పోజు కొట్టడానికి పుస్తకాలు కొనేటట్లైతే మీతో చదవట్లేదని ఎందుకు చెప్తారు అని అనిపించింది. అఫ్కోర్స్ వ్రాయడానికి చదవక్కర్లేదు అన్న మాట నచ్చలేదనుకోండి. నేనేమైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి.
పోస్టు టైటిల్ చూసి నన్నే అడుగుతున్నారేమో అనుకున్నా.. అంటే మరి సంవత్సరం క్రితం ఇండియా నుంచి మోసుకొచ్చిన పుస్తకాలు చదవడం ఇంకా పూర్తి చెయ్యలేదన్న సంగతి గుర్తొచ్చేసింది. అయినా, ఇప్పుడో , నెలకో, సంవత్సరానికో చదువుతానన్న నమ్మకం మాత్రం ఉంది లెండి. :))))
అలాగే మీరింతవరకూ రాసిన కథలన్నీటి లింకులిస్తే బుద్ధిగా చదివి పెడతానని మనవి చేసుకుంటున్నాను.
మీరు పెట్టిన ఫోటోలో బుచ్చిబాబు గారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి. కొంచెం వివరాలు చెప్పండి మాక్కూడా.. 'బుచ్చిబాబు కథలు' అన్న పేరుతో ఒకటే పుస్తకం ఉంది నా దగ్గర. ఆయన కథలు అప్పుడోటీ అప్పుడోటీ చదివితే బాగుంటుందనిపిస్తుంది. ఆ మాటకొస్తే అసలాయన కథలు పొలోమని వరస బెట్టి చదివెయ్యడం దాదాపు అసాధ్యం అని కూడా అనిపిస్తుంది. మెదడుకి బోల్డంత మేత పెడతాయి కదా మరి! ;)
అన్నట్టు, ఎవరండీ ఆ సంధ్యాదేవి గారు.. పైన మీర్రాసిన కామెంట్ చూసి నవ్వలేక చచ్చాను. Sounds interesting!:)))
చదవాలన్న కోరికతో కొనాలనిపించినప్పుడు కొనటమే మంచిది. వెంటనే చదవలేక మనకు అవి అనవసరమనిపించినా, ఆ పుస్తకాల అమ్మకాలతో ఆ రచయిత(త్రు)లకీ, ఆ షాపు వాళ్ళకి కాస్త ప్రోత్సాహం ఇచ్చినట్లేగా. మనకి చదివే బుద్ధొచ్చేనాటికి అసలు అవి దొరక్కపోతేనో... దొరక్క చదవలేదన్న కుంటిసాకుల పాపం మనకెందుకు చెప్పండి. కొని చదవకపోయిన పాపం కన్నా ఈ పాపం పాళ్ళు మరీ ఎక్కువ. చిత్రగుప్తుడు మంచి బౌండు బుక్కుతో మరీ కొడతాడు :-)
lalitag gaaru,
మీ కలకత్తా బంధువు మాటలు నేను ప్రత్యక్షంగా వినలేదు కనుక... ఆవిడను నేను కల్సిందే ఒక్కసారండీ! అందువల్ల మీరు ప్రత్యక్షంగా ఆమె మాటలు వినే అవకాశం లేదు.
ఆవిడ పుస్తకాలు చదివే వాళ్ళని ఆశ్చర్యంగానూ, వేళాకోళంగానూ తీసుకుంటుందని నాకు మాటల "టోన్" ద్వారా అర్థమై నేను జవాబు చెప్పాల్సి వచ్చింది లేకపోతే లైట్ తీసుకుని వదిలేద్దును. ఆ "టోన్" దురదృష్ట వశాత్తూ నాకొక్కదానికే అర్థమవుతుంది కదా మరి. ఆవిడ క్యూరియాసిటీతో అడిగిందా లేక ఎగతాళి చేసిందా అనేది నాకే అర్థమయింది. మీరన్నట్టు ఆవిడ ఆ వేళా కోళాలు, ఎత్తి పొడుపులూ లేకుండా అడిగి ఉంటే, బహుశా నా మాటల్లో కూడా మీకు ఎత్తి పొడుపు కనిపించేది కాదేమో!ఇందులో సంస్కారాల వరకూ వెళ్ళాలసిన అవసరం లేదనుకుంటాను! (కొంతమంది కి సంస్కారం చిన్న వయసులోనే అబ్బవచ్చు, మరి కొంత మందికి శతకం దగ్గర పడుతున్నా ఈర్ష్య, సూటి పోటి మాటలు ,ప్రవర్తనలు మానలేరు. అది వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకోవలసిందే) యద్భావం తద్భవతి అంటారు చూడండి...అదీ ఆమెకు తెలియాల్సింది. అందువల్ల నా మీద కూడా కాస్త ఎంపతీ చూపించాలి మీరు:-))
అందువల్ల ఆవిడను వదిలేసి పుస్తకాలు చదివే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం! అనవసరంగా స్పేసు వేస్టు ఇక్కడ దీని మీద చర్చ వల్ల.
మధురా, నేను రాసిన కథలు చాలా వరకూ బయటి పత్రికలకు రాసినవే! ఆన్ లైన్లో రెండో మూడో రాశా! అదీ ఎప్పుడు..ఏళ్ళ క్రితం! లింకులు కాదు గానీ, PDF లు ఉన్నాయేమో వెదకాలి!
నువ్వు బాగానే చదువుతావని నాకు తెల్సులే, గొప్ప కోసమైతే కొనవు కదా! అది చాలు
బుచ్చిబాబు కథలు ఎప్పటివో ఇవి. పాత పుస్తకా కొట్లో దొరికాయి. నువ్వన్నట్టు ఇవన్నీ ఒకేసారి వరస బెట్టి చదివితే మనం మిగలం! బుర్ర ఠాప్ అని పేల్తుంది. చాలా తీరిగ్గా చదవాలి ఒక్కోటీ! ఎక్కడైనా పాత పుస్తకాల షాపుల్లో దొరికితే తీసి ఉంచుతా నీ కోసం!
ఆర్ సంధ్యా దేవి అనే ఆవిడ నా చిన్నప్పుడే నవల్లు రాయడం ఆపేసింది(అదృష్ట వశాత్తూ). మా పక్కింటి అత్తయ్య గారు అద్దె షాపులో తెస్తే మా అక్కయ్యలు ఆ నవల్సు చదివి నవ్వీ నవ్వీ చచ్చిపోతుండేవాళ్ళు.
బ్లాగు వీరుడు గారు,
అలా అనుకునే పుస్తకాలు పోగెయ్యడం మొదలౌతుంది. పోగెయ్యడం అలవాటయ్యాక చదివే అలవాటు పోతుంది. అదే మా పిన్ని గారి విషయంలో జరిగింది.
sujatha madam..
adi varaku emo gaani..ippudu maatram...janam..mundu...net lo e-copy..adi koodaa..free downloadable..vundo ledo choosi..appudu kontaaru..
atleast naa varaku..nenu chese pani ade..
సుజాత గారూ, మీ బ్లాగు చూసి ఏళ్ళయిపోయింది. థాంక్స్ ఫర్ ది నైస్ పోస్ట్.
లలిత గారూ, ఆమె మిమ్మల్ని బాధ పెడితే మీరూ అదే సంస్కారం చూపించక్కర్లేదు కదా అనిపించింది. _____ఎందుకలా అనిపించింది మీకు? అంటే ఆ మనిషి సంస్కారంతో ప్రవర్తించలేదని ఒప్పుకున్నారు మీరు! కదా? మరి వయసులో అంత పెద్దావిడ అయి ఉండీ అవతలి వారిని బాధ పెట్టేలా మాట్లాడాక వారికి సున్నితంగా జవాబివ్వాలని ఎందుకు ఆశిస్తున్నారు మీరు?
మీరనే కాదు, ఈ మధ్య చాలా చోట్ల ముఖ్యంగా ఆన్ లైన్లో ఇలా "అవతలి వాళ్ళు పాజిటివ్" గా ఉండాలని పాఠాలు ఎక్కువయ్యాయి. కసబ్ చిన్నవాడు కాబట్టి వాడు ఎందుకు అలా చేశాడో వాడినర్థం చేసుకోవాలి, హిందువుల్ని ఎవరైనా ఏమైనా అంటే...వాడి మనోభావాలకు విలువ ఇచ్చి హిందూ మతం సహనం బోధించింది కాబట్టి నోర్మూసుకోవాలి. మనల్ని ఎవరైనా తిడితేనో, బాధ పెడితేనో "వాళ్ళల్ సంస్కారం అంతే" అని ఊరుకోవాలి. అలా ఊరుకుంటే అవతలి వాళ్లకేదో కనువిప్పు కల్గుతుందనుకోవడం పెద్ద భ్రమ. దాన్ని మన చేతికానితనంగా భావించి మరో సారి అడ్వాంటేజ్ తీసుకోవడం ఖాయంకాబట్టి జవాబు చెప్పి నోరు మూయించడమే మంచి పద్ధతి!
కానీ ఇలా చెప్పే వాళ్ళంతా తమ దాకా వచ్చేసరికి "మామూలు మనుషుల్లా" ప్రవర్తించడం పెద్ద ఐరనీ! లోకం తీరే అంత! నీతులెప్పుడూ ఇతర్లకే మరి!
సుజాతగారూ, క్షమించాలి, స్పేస్ వేస్ట్ అవుతుందని మీరు చెప్పాక కూడా వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోయాను. ఈ మధ్య ఈ false positive attitude (ఇతరుల కోసం మాత్రమే) ధోరణుల్ని చూసి చిరాకేసి రాశానంతే!
కిరణ్ కుమార్ గారూ,
పోస్టు నచ్చినందుకు థాంక్స్! మీ వ్యాఖ్య ప్రచురించాలా వద్దా అని ఆలోచించాను. నిజానికి జనం ఏమనుకుంటున్నారో కూడా తెలియాలి కాబట్టి ప్రచురించాను.
ఇకపైన ఈ అంశం మీద చర్చకు తావు లేదని గ్రహించగలరు.
థాంక్యూ
నేను పారల్లెల్ గా పది పుస్తకాలు చదువు తా నండీ. ఒక పుస్తకం బోరు కొట్టిన్దనుకుంటే మరో దానికి స్కిప్ అయి పోయి మళ్ళీ వేరొక పుస్తకానికి వెళ్లి అక్కడ్నించి మొదటి పుస్తకానికి కొచ్చి, అక్కడ్నించి.... అలా సాగి పోతూందన్న మాట. మొత్తం మీద ఒక సంవత్సరం లో ఓ పది పన్నెండు పై బడ్డ పుస్తకాలు ఓ మోస్తరు ఫినిష్ అవుతాయి.
ఈ సంవత్సరం ఫినిష్ అయిన పుస్తకాలు చెప్ప మంటారా ?
చీర్స్
జిలేబి.
అమ్మో సుజాత గారు,నన్ను వదిలెయ్యండి....చెప్పడానికి చాలా సిగ్గు గా ఉందండీ...ముఖ్యం గా తెలుగు సాహిత్యం చదివే విషయం లో నేను ఇంకా అ ఆ ల దగ్గరే ఉన్నాను....నాకు తెలిసిన సాహిత్యం అంతా ఇప్పటివరకూ యండమూరి,యద్దనపూడి రచనలు మాత్రమే....నా దగ్గర ఉన్నవి కొన్ని టాగూరు కథా సంకలనాలు,కన్యాశుల్కం,అమ్మ-గోర్కి,లజ్జ-తస్లీమా నస్రిన్,7 habbits of highly effective people,rich dad poor dad,A tale of 2 cities,alchemist,roots,men are from mars women are from venus, etc etc.ఇంకా కొంచెం లిస్టు ఉంది లెండి .ప్రస్తుతం అన్న కరేనిన పూర్తి చేసే పని లో ఉన్నాను...మీ లాంటి వాళ్ళ ఆదర్శం తో మరి కొన్ని మంచి పుస్తకాలు చదవాలని నా తాపత్రయం...Thanks for adding me...
సుజాత గారూ,
మా ఆవిడ ఆ దరినీ, నేనీ దరినీ కాబట్టి (పుట్టింట్లో ఉందిప్పుడు) చదవడానికిప్పుడు కొంచెం సమయం దొరుకుతోంది. అంతకు ముందు అంతగా సమయం దొరికేది కాదు. :-)
జిలేబీ గారూ,
మీ పద్ధతి మీ పేరులాగే స్వీట్ గా ఉంది. చదవడానికి బోరు కొట్టించే పుస్తకాలని మధ్యలో వదిలేయకుండా (అది బోరు కొట్టడం కాదని, మనల్ని ఆలోచనలొ పడేయడానికి రచయిత పన్నిన కుట్ర అని గ్రహించాలి మనం)పూర్తి చేయడానికి ఈ పది పుస్తకాలు ఒకేసారి చదివే మార్గం ఏదో బాగానే ఉంది
lalitag గారూ, మీకు మెయిల్ చేయడానికి వీలవుతుందాండీ?మీ ఐడీ ఇవ్వడానికి అభ్యంతరం లేకపోతే, కామెంట్ గా పెట్టండి. తీసుకుని వ్యాఖ్య ప్రచురించను.
బోరు కొట్టించను. రెండు మూడు మాటలు!
నేను ప్రయాణాల్లోనో ప్రత్యేకంగా వెతికో ఒకటో రెండో పుస్తకాలు కొన్నపుడు అవి వెంటనే చదివేస్తానండీ.. కానీ ఎపుడైనా ఒక ఐదుకు మించి పుస్తకాలు కొంటే అవి అటక ఎక్కేస్తాయి ఎందుకో.. పొయిన పుస్తకాల పండగకి కొన్నవాటిలో సగంకూడా చదవలేదు ఇంకా :( ఈ ఏడాది నా పుస్తక పఠనం మరీ ఘోరంగా తయారయిందేంటో.
సుజాత గారు..
తెలుగు బ్లాగ్స్ గురించి ఈనాడు లో మీ ఆర్టికల్ చదివాకా చాల సంతోషించి చదవడం మొదలు పెట్టాను. ఇప్పటి దాక చాల విలువైన పుస్తకాల గురించి, మరియు నాకు నచ్చే విషయాలు తెల్సుకుంటూ వచ్చాను. నా మటుకు నేను చిన్న చిన్న కధలు, చందమామ కధలు , ఈనాడు లో వచ్చే ఆదివారం కధ లు చాల ఇష్టం గా చదివే దాన్ని. ఇంటర్ లో మా అమ్మ వాళ్ళు చదువు అని పొద్దున్న లేపినప్పుడు వాళ్ళ మీద అలిగి చదివిన యద్దనపూడి, యండమూరి, బలభద్రపాత్రుని గారి పుస్తకాలే తెలుగు లో గొప్ప నొవెల్స్ అని అనుకున్న :)) ఇప్పుడు నా అప్పటి ఆలోచనలు తలచుకొంటే భలే నవ్వొస్తుంది మీ అందరి పుస్తక పరిచయాలు చదివితే. I should say thank you all for introducing me to the beautiful telugu book world. మీ పుస్తకాల సంత విశేషాలు చదివి ఇండియా లో నా స్నేహితులకి నాకు నచ్చుతాయి అని అనుకున్న పుస్తకాల పేర్లు పంపి మరీ నా కోసం కొనిపించుకున్నాను. అవి నా చేతికి ఎప్పుడు చేరతాయో గాని నా కోసం కొన్నారు అని తల్చుకొంటేనే ఎంతో ఆనందం గ వుంది..ఇక పోతే నా దగ్గర కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలూ వున్నాయి. అవి చాల పెద్దగ వుంటాయి. చదివి మధ్యలో ఆపితే అర్ధం కావు. అలాంటివి మల్లి మొదలు పెట్టి చదవడం అంటే విసుగు . ఇలాంటి పుస్తకాలూ నాకు కేవలం అలంకార ప్రాయం ల అనిపిస్తున్నాయి. సో అలా అపేసినవి ఎప్పటికైనా చదివితే బాగుండు అనిపిస్తుంది. ఇంకా నా మరో కల ఏంటంటే నేను రిటైర్ అయ్యి పల్లెటూరి లో ఒక ఇల్లు కట్టుకొని ఒక రూం లో తెలుగు పుస్తకాలూ పెట్టుకొని రోజు పొద్దున్న నుండి సాయంత్రం దాక చదువుకొంటూ గడిపెయ్యలని :) మా నాన్న గారు టీచర్ అవడం మూలాన ఎప్పుడు పుస్తకాలూ కొనిచే వాళ్ళు కాదు. లైబ్రరీ లో వెళ్లి చదివించేవారు. నాకు అప్పుడు కోపం వచ్చేది ఒక్క పుస్తకం కూడా కొనివ్వరు అని. ఇప్పుడు అది ఒక అందమైన జ్ఞాపకం ల గుర్తుండి పోతోంది అందరం కలిసి అలా సెలవు లలో లైబ్రరీ కి వెళ్లి శబ్దం చెయ్యకుండా కావాల్సిన పుస్తకం తెచుకొని చదువుకోవడం. ఏdi ఏమైనా మీ పోస్ట్ నా లో మంచి ఉత్సాహం నింపింది కొత్త పుస్తకాలూ చదవాలి అని.
సుజాత గారూ... బ్లాగు ప్రపంచంలోకి తొంగిచూసి చాలా రోజులయింది. ఓ మంచి పోస్ట్ చదవడం చాలా ఆలస్యం అయ్యాననుకుంటున్నాను. అయితే చిన్న రిక్వెస్ట్ ఏమంటే - ఇదే వ్యాసాన్ని నా బ్లాగులో (మీ పేరుతోనే) పెట్టాలని భావిస్తున్నా. ఓ కొత్త శీర్షిక ప్రారంభిస్తూ బ్లాగు రాతల్ని పునఃప్రారంభిద్దామని. మీ అనుమతి కావాలి.
-రవికుమార్
ఏవో తొమ్మిది పది కథలు ఎప్పుడో రాసి పడేశాను. ఆ పడేసినవేవో వెదికి మా కథాజగత్తుకు పంపండి మేడమ్!
సుజాత గారూ బుచ్చిబాబు గురించి గూగులమ్మ లొ విహరిస్తుంటె మీ టపా కనిపించింది. ఇంట్రెన్స్తింగ్ గా ఉంది.అన్నీ ఒకసారి ఎక్కద చదువుతామాండీ, కనపడ్డదల్లా మొదలు కొనీయ్యడం..ఆ తర్వాత తీరిగ్గ ఒక్కొక్కటె చదవడం.ఒక్కసారి కొనలెంగా ..అదెవిదంగా ఒక్కసారె చదవలెంగా...వీలు మరియు మూడ్ ఉన్నప్పుడల్ల చదవడం..మీతొ మీమూ ఉన్నం లెండి. ఒ
Post a Comment