మేమూ బాపూ బొమ్మల కొలువు పేరంటానికెళ్ళి వాయినం పుచ్చుకుని వచ్చాం! పైగా నిన్న ఎస్పీ బాలూ, ఏవీయెస్ ,శేఖర్ కమ్ముల,జనార్దన మహర్షి వంటి వాళ్ళతో కల్సి కూచుని కాసేపు బాపూ నామస్మరణ చేసుకున్నాం! కీర్తి కండూతి అస్సలు లేనందుకు బాపూని, ఆయనకు కీర్తి కావాల్సిందేనని దెబ్బలాడని తెలుగు వాళ్ళనీ(అంటే మనల్నే) కాసేపు తిట్టుకుని నిష్టూర పడ్డాం!
"అసలేమిటీ మనిషి"అని అని విస్తుపోయాం!
శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ లో ఏవీయెస్ గారు బాపూని "దీని తర్వాత మీ ప్రాజెక్ట్ ఏమిటి సార్" అనడిగితే "ఇహ నేను చేయలేమోనయ్యా, నా వల్ల కాదేమో" అన్నారట!
"ఎందుకు సార్, ఓపిక లేదా?"
"రమణ లేడుగా!"అన్నారట డస్సిపోయి!
ఏవీయెస్ చెప్తుంటూనే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయాయి ఈ మాటకి.
జనార్దన మహర్షి ఒక మంచి మాట చెప్పారు. "మీడియా ఛానెళ్ళ వాళ్ళు,అయిన దానికీ కానిదానికీ ఎస్సెమ్మెస్ లు పంపించమంటుంటారు. అలాగే ఇన్ని కోట్ల ఆంధ్రులం ఉన్నాం, "మా బాపూకి గౌరవం,గుర్తింపు కావాల్సిందే" అని తెలుగు వాళ్ళంతా కల్సి ఒక ఉద్యయం లేవదీయాలి. లేవ తీద్దాం కూడా! ఎందుకు సాధ్యం కాదో నేనూ చూస్తాను"అన్నారు ఉద్వేగంగా!
ఏవీయెస్ ఒక చిన్న ఊహాత్మక సంఘటన చెప్పారు.ఒకరోజు ఆయన అర్థ రాత్రి టాంక్ బండ్ మీదుగా వస్తుంటే ఒక స్త్రీ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కూచుని భోరున ఏడుస్తోందిట. ఈయన జాలిపడి ఎవరమ్మా నువ్వు?ఎందుకేడుస్తున్నావు?నీ పేరేమిటి? అనడిగితే ఆవిడ "నా పేరు పద్మండీ! ఢిల్లీలో వాళ్ళు నన్ను పెంచుకుంటున్నారు! అర్హత ఉన్నా లేకపోయినా ఎంతోమందిని ఆవహించాను గానీ ఈ బాపు అనే వ్యక్తిని మాత్రం చేరాలని ఎంత ఉత్సాహ పడుతున్నా ఆయన దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆయన నన్ను కోరడు. నేనే ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఏడుస్తున్నా"అందిట! ఆ స్త్రీయే పద్మ అవార్డు!
అద్భుత చిత్ర ప్రపంచంలో ప్రతి దాన్నీ ఆస్వాదిస్తూ చూడాలంటే ఒక ఏడాది కావాలి. అది కుదర్దు కాబట్టి గంటల్లోనే ముగించుకుని, నచ్చిన వాటిని భద్రపరుచుకున్న్నాం! మా ఇంటికి దగ్గరే కావడంతో ఎక్కువ సేపూ ఉండగలిగాం, ఇల్లు ఎప్పుడు చేరాలో అనే బెంగ లేకుండా !
బొమ్మల కొలువుకి వచ్చిన అపూర్వ స్పందన వల్ల దీన్ని వచ్చే శనాదివారాలు కూడా (జూన్ 11,12 తారీకుల్లో) సందర్శకులకు అందుబాటులో ఉంచుతారట. మిస్ అయ్యామని బాధ పడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు!


















