రేడియో! రేడియో !రేడియో!
అబ్బ, రేడియో అంటే పిచ్చితో గడిపిన రోజులు ఎంత బాగుంటాయో!
రేడియో వింటూ బావి గట్టు మీద బట్టలు ఉతుక్కోడం,
రేడియో వింటూ ఇల్లు తుడవడం,
రేడియో వింటూ తోటపని చేయడం,
రేడియో వింటూ ధనుర్మాసాల సాయంత్రాలు వాకిట్లో రేపటి తాలూకు ముగ్గు పెట్టేయడం....ఇలా ఉండేది పరిస్థితి మా ఇంట్లో!
నేనైతే ఒకడుగు ముందుకేసి చదువుకునేటపుడు కూడా రేడియో వింటూ చదివేదాన్ని!
ఉదయం మంగళ వాద్యం మొదలుకుని ఉదయతరంగిణి అయ్యాక అక్కడినుంచి వివిధ భారతికి వెళ్ళి అర్చన, జనరంజని..! ఈ లోపు స్కూలు!
సెలవు రోజుల్లో అయితే పదకొండున్నరకు వచ్చే ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం(ఆ పాఠాలు మా క్లాసువి కాకపోయినా సరే) పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం,ఒకటిన్నరకు వనితా వాణి ,రంగవల్లి, రెండూ పదికి సీఫెల్ వాళ్ల ఇంగ్లీష్ పాఠాలూ_____ఇహ సాయంత్రాలు చెప్పక్కర్లేదు. మా రేడియోకి విశ్రాంతే ఉండేది కాదు.
ఆ రేడియో అప్పుడప్పుడూ ఆగిపోతే దాని నెత్తిన ఒకటి మొట్టగానే తిరిగి మోగేది.
వేసవి సెలవుల్లో ఆరుబయట వెన్నెల్లో రేడియో నాటక వారోత్సవాల్లో పోటా పోటీగా వేసే నాటకాలు, "బహారో ఫూల్ బర్సావో" వంటి అద్భుతమైన పాటల కోసం ఛాయాగీత్ వరకూ విని తెలీకుండానే నిద్రపోవడం________ఎంతో హాయిగా ఉండేది ఈ వ్యవహారమంతా !
రేడియో అనౌన్సర్లూ,కళాకారులంటే పెద్ద సెలబ్రిటీ వర్షిప్! విజయవాడ అనౌన్సర్లూ కళాకారుల కున్న ప్రతిభ హైద్రాబాదు వాళ్ళకి లేదని ఒక పెద్ద అపోహలో, గొప్ప గర్వపు ఫీలింగ్ లో ఉండేవాళ్ళం!( చాలామంది అది అపోహ కాదు నిజమే అంటున్నారు :-)) హైద్రాబాదు ట్రాన్స్ మిషన్ అంత క్లియర్ గా వినిపించకపోవడమే ఇందుకు కారణమేమో మరి! :-))
పేరి కామెశ్వర రావు,వాసుదేవ మూర్తి,కమల కుమారి,కోకా సంజీవరావు,రామం,DSR,మల్లాది సూరిబాబు , నండూరి సుబ్బారావు, వీబీ కనకదుర్గ , సీతారత్నమ్మ (గణపతి నాటకంలో తల్లి ) గార్లు వీళ్ళంతా గొప్ప హీరో హీరోయిన్స్ గా ఉండేవాళ్ళు నా పాలిట. లలిత సంగీతం వింటూ చచ్చిపోయినా పర్లేదనిపించేంత ఇష్టంగా ఉండేది.
క్రమక్రమంగా రేడియో వైభవం ప్రాభవం వివిధ కారణాల వల్ల తగ్గిపోయాక, ఆ నాటి అనౌన్సర్లంతా రిటైర్ అయిపోయాక మేము ఉద్యోగాలనో పెళ్ళిళ్ళలో వూర్లు మారిపోయాక రేడియోని దాదాపుగా వదిలేసినట్టే అయింది.(ఇప్పుడు మాత్రం నాకు రోజూ రేడియో ఉండాల్సిందే)
హైద్రాబాదు కళాకారుల్లో మా ఇంట్లో అందరికీ ఫేవరిట్ హీరోయిన్ ఉండేది.శారదా శ్రీనివాసన్ గారు.(నాకు ఆకెళ్ళ సీతగారి గొంతు కూడా చాలా ఇష్టం)
స్ఫుటంగా, స్పష్టంగా, తీర్చి దిద్దినట్టు,నగిషీలు చెక్కినట్టు ఒక్కో వాక్యం భావగర్భితంగా ఆమె పలుకుతుంటే మా అమ్మ అయితే "అబ్బ, ఎంత బాగా మాట్లాడుతుందే ఈమె"అని ఆశ్చర్య పడుతూనే ఎంతో అభిమానించేది. ఒకసారి రేడియో ఆడిషన్ల గురించి శ్రీమతి శారద గారు ప్రసంగిస్తూ "ఏవండీ,మీరేనా ఇలా అంటున్నది?నన్ను ఎందుకింత అపార్థం చేసుకున్నారు"(అనో, ఇలాంటిదే ఏదో డైలాగ్ ఉంటుంది)"అనే డైలాగ్ ని ఎన్ని రకాల భావప్రకటనలతో చెప్పవచ్చో పలికి చూపిస్తే____కళ్ళు తిరిగిపోయాయి.
చలం పురూరవ విన్నాక ఎవరైనా సరే తేరుకోవడం చాలా చాలా కష్టం! అదే ఊర్వశి ఎక్కడికెళ్ళినా మన వెనకాలే తెరలు తెరలుగా నవ్వుతూ వెంటాడుతూ వస్తుంది. ఈ ఊర్వశిని వదిలించుకోడానికి నాకు చాలా టైము పట్టింది. మళ్ళీ మళ్ళీ విన్నపుడు ఊర్వశి మళ్ళీ బయలు దేరుతుంది. దీనికి అంతం లేదిహ!
అయితే అలనాటి కళాకారులూ అనౌన్సర్లూ ఈ మధ్య తమ జ్ఞాపకాలు రాస్తుండటం సంతోషించదగ్గ విషయంగా తోచింది నాకు. రచనలో డి వెంకట్రామయ్య గారు, కౌముదిలో సుధామగారూ_____ఇలా! అయితే ఇలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే శారదా శ్రీనివాసన్ గారు తన అనుభవాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం నిజంగా ఒక అద్భుతం!
ఎన్నెన్ని జ్ఞాపకాలు,ఎంతమంది మనుషులు,ఎన్ని పాటలు,ఎన్ని నాటకాలు, ఎంతమంది గొప్ప కళాకారులతో దగ్గరగా మెసిలే అదృష్టం,ఎన్ని ప్రశంసలు,ఎంత పరిశ్రమ,ఎంత గుర్తింపు,ఎంతమంది అభిమానుల మనసులో చోటు,ఎంతమంది గొప్పవారి సాంగత్యం .......!
ఈ పుస్తకం చదువుతుంటే విశేషాలు,అనుభవాలు ఒకదాని వెనుక ఒకటి పాఠకులను ఊపేస్తాయి. నేనైతే అసలు బ్రేక్ తీసుకోకుండా ఒక్క సారిగా పూర్తి చేసి పక్కన పెట్టి దిగాలు పడి కూచున్నా!
ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు,నాటకాలు,రూపకాలు ఇవన్నీ నేను పుట్టకముందే ప్రసారాలు,పునః ప్రసారాలు కూడా అయిపోయాయి.:-((
ఒక పాతికేళ్ళు ముందు పుట్టి ఉంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రోగ్రాములు వినగలిగి ఉండేదాన్నని గొప్ప పశ్చాత్తాపం మొదలైంది. ఇవన్నీ ఆర్కైవుల్లో ఉన్నాయో లేవో శారద గారు రూఢిగా చెప్పలేదు ఈ పుస్తకంలో!
అధ్యాయాలుగా విభజించకుండా, గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్ళారు! అయినా ఎక్కడా బోరు కొట్టకుండా, హాయిగా సుతిమెత్తగా సాగిపోయింది ఈ జ్ఞాపకానుభవాల ప్రయాణం.ఎన్నో గొప్ప నాటకాలు! అన్నింట్లోనూ శారదే హీరోయిన్.
కాలాతీత వ్యక్తుల్లో ఇందిర పాత్ర శారద గారు వేశారని చదివి మళ్ళీ చెప్పలేనంత దిగులు పుట్టింది.
ఎలా దీన్ని వినడం!
అసలే ఇందిరంటే నాకు చాలా ఇష్టం(శారద గారిక్కూడానట) ఇందిర ఆత్మవిశ్వాసం,ఓడిపోని పంతం,ఇగో వీటన్నింటికీ డైలాగులు ఎలా రాసి ఉంటారు?వాటిని శారదగారు ఎలా పలికి ఉంటారు?ఇలా అసంఖ్యాకమైన అపురూప రేడియో నాటకాలు కోల్పోయామే? ఎక్కడ ఎలా వినాలి? (మాగంటి వంశిగారి చెవిలో ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని మరీ పోరాలి)
శారదగారి జ్ఞాపక శక్తికి జోహార్లు చెప్పేలా అనేక రూపకాలు, లలిత సంగీత కార్యక్రమాలు,యక్షగానాలు వీటన్నింటి నుంచీ ఎన్నెన్నో పాటలు పద్యాలు కోట్ చేశారు. అక్కినేని నాగేశ్వర రావు పరితాపం అనే రేడియో నాటకంలో నటించడమూ, శారదగారు కథ చెప్పే కార్యక్రమంలో చివరగా "అదర్రా కథ"అని ముగిస్తే దాన్ని రోజూ వింటున్న పెద్దాళ్లంతా "మేమూ వింటున్నాం, మీరు అదర్రా అని పిల్లలతో కలిపేస్తే ఎలా"అని సరదాగా అభ్యంతర పెట్టడమూ, పొలం పనులు కార్యక్రమంలో స్క్రిప్ట్ శారదగారి చేత చదివించారని కోపగించిన ఒక అభిమాని రేడియో వాళ్ళని "మీరు పన్నీటిలో పేడ కలిపి కళ్ళాపి చల్లుతారు.శారద గారి చేతా వ్యవసాయ కార్యక్రమాలు చదివించేది?" అని చీవాట్లు వేయడమూ, తనపై వి.ఎస్ రమాదేవి గారి ప్రభావమూ,యువవాణి తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తులూ __________ఇలా ఎన్నెన్నో అనుభవాలు మాలగా గుచ్చి అందించారు ఈ పుస్తకంలో!
అలాగే కొన్ని రేడియో నాటకాల్లోని పాత్రలు తన మీద ఎలా ప్రభావాన్ని చూపించాయో ఈడిపస్ నాటకాన్ని ఉదాహరణాగా తీసుకుని చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ నాటకంలో తల్లి/భార్య పాత్ర కల్గించిన మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక శతపోరి మరీ దాన్ని చెరిపించేశారట ఆమె!
ఎంతోమంది కళాకారులు విశేషాలు ఫొటోలతో తీర్చి దిద్దిన ఈ పుస్తకం లో అచ్చు తప్పులు లేకపోవడం మరో విశేషం! సొంతగా వేసుకుని జాగ్రత్తగా ప్రూఫులు పర్యవేక్షించడం వల్ల కాబోలు!
శారదగారు ఒక ప్రశ్న కూడా వేశారు చివర్లో!"పూర్వంలా కార్యక్రమాలు బావుండటం లేదండీ" అంటున్నాం కానీ ఆలోచిస్తే అన్ని కార్యక్రమాలూ వినే చేస్తున్నామా ఈ కమెంట్?పోనీ ఏదైనా కార్యక్రమం బాగున్నపుడు "ఇది బాగుంది" అని ఒక్క ఉత్తరం ముక్కయినా రాశామ?ఫోన్ చేసి అయినా చెప్పామా? ______________నిజమే! ఇప్పటికీ రోజూ రేడియో వినే నాకు "ఈ ప్రోగ్రాము బాగుంది"అనుకోడం తప్ప ఉత్తరం రాయొచ్చనే ఆలోచన రాదు ఎంచేతో మరి!
"రేడియో ప్రజలకు సేవలు అందించడమే కాక చైతన్య వంతులను చేసింది.చెవినిల్లు కట్టుకుని పోరినట్టు మరీ చైతన్యవంతులను చేసింది"అంటారామె! అక్షర సత్యం కాదూ!
"చైతన్యమే కాదు, సామాన్య ప్రజల జీవితాలకు కళా సౌరభాన్ని అద్ది, కళల పట్ల ఆసక్తిని పెంచింది కూడా" అంటాను నేనైతే!
లెక్కలేనన్ని విశేషాలతో వచ్చిన ఈ పుస్తకం రేడియో అభిమానులకు శారదగారు "అదర్రా కథ" అని చెప్తూ పెట్టిన తీపి తాయిలం లాంటిది.
కానీ ఈ పుస్తకంలో అసంఖ్యాకమైన ఆంగ్లపదాలు అలవోగ్గా దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. మాట్లాడుతున్నట్లుగానే భావించి రాస్తూ వెళ్ళడం వల్ల కాబోలు, చక్కని తెలుగు పదాలు రాయదగ్గ చోట కూడా ఇంగ్లీష్ పదాలు అనేకం చోటు చేసుకున్నాయి.
రెక్టాంగులర్ టేబుల్, ఎక్స్పెరిమెంటల్ ప్లేస్ (ప్రయోగాత్మక నాటకాలు) , స్టాండర్డైజ్, సెంట్రల్ అండ్ స్టేట్ ఫంక్షన్స్, గ్రీవెన్సెస్,హయ్యర్ అఫీషియల్స్ నుంచి అబ్జెక్షన్స్,________ ఇలా ఎన్నెన్నో! ఇవి కాస్త తగ్గి వాటి స్థానంలో తెలుగు పదాలుంటే బాగుండేదనిపించింది !
ఇది చదువుతూ ఉంటే నాకు ఇదంతా శారదగారి గొంతులోంచి విన్నట్టుగానే అనిపించింది.అందువల్ల ఇందుమూలంగా నేను శారదా శ్రీనివాసన్ గారికి చేసే విజ్ఞప్తి,డిమాండ్,విన్నపం ఏమిటంటే దీన్ని తన స్వరంతోనే ఆడియో బుక్ గా తీసుకురావాలని. అలా అయితే కార్లో పోతూనో,మరేదైనా పని చేసుకుంటూనో రేడియో విన్నట్లు వినొచ్చు హాయిగా!
అయితే ఈ పుస్తకం కాపీలన్నీ అమ్ముడు పోయాక ఆ పని చేయాలి. ఎందుకంటే శారదగారి ఆడియో బుక్ వస్తే దీన్ని ఎవరు కొంటారు మరి? :-))))
ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో సిద్ధంగా ఉన్న 200 పేజీల ఈ పుస్తకం వెల నూట పాతిక రూపాయలు!

