డాట్రారు తెచ్చిన పుస్తకాలు!(నోరూరడం లేదూ?)
మొన్నొక రోజు పాత ట్రంకు పెట్టెలూ,పైన అటకా ఇవన్నీ సర్దుతుంటే దిగులేసింది. "ఇన్ని పుస్తకాలు ఎందుకు దాచానా" అని కోపం కూడా వచ్చింది. అచ్చు తప్పుల పుస్తకాల్ని కూడా "ఏమో తర్వాత దొరుకుతాయో దొరకవో" అని ఉంచినట్టున్నా....బోల్డు తేలాయి.కంపరం వాటిని చూస్తే! వాటిని భోగి రోజు ఓ చూపు చూస్తే కొన్ని పుస్తకాలు తగ్గుతాయి.
అసలు ఇక్కడొక బేసిక్ ప్రశ్న! పుస్తకాలెందుకు కొంటాం? చదవడానికేగా?
అవేమన్నా బంగారమా, ఈక్విటీషేర్లా, లాకర్లోనో, డీమాట్లోనో పడేసి రేటొచ్చినపుడు అమ్మేయడానికి?
బుక్ ఫేర్ లో బోల్డు మంది కట్టలు కట్టలు పుస్తకాలు కొనుక్కెళుతుంటే "అబ్బ, అవన్నీ చదివేస్తారు కాబోలు" అనిపించిందే తప్ప "తీసుకెళ్ళి అటక మీద పడేస్తారేమో" అనిపించలా అదేం చోద్యమో!
విజయవాడ లో పాత పుస్తకాల కొట్లకు వచ్చి "ఫలానా పుస్తకముందా? ఫలానాది ఉందా" అని పంతులు గారి కొట్లో నేల మాళిగలోకి దిగి దుమ్ము పీలుస్తూ, అడుగెత్తు మట్టి పేరుకున్న నేలమీద కూచుని కళ్ళ జోళ్లు తుడుచుకుంటూ వెదుకుతున్న పుస్తకం దొరికేవరకూ..... పరాక్రమం విడనాడని వాళ్ళని చూస్తే "అబ్బ, ఎంత మంచి వాళ్ళో" అనిపిస్తుంది.
దూర తీరాల నుంచి స్నేహితులు "ఫలానా పుస్తకం గురించి చాలా విన్నానండీ! ఆ పుస్తకం ఎలాగైనా కావాలి. చదివి తీరాలి" అన్నపుడో,
"ఫలానా రచయిత పుస్తకం సగమే చదివానండీ, ఆ పుస్తకం దొరుకుతుందేమో చూడరా ప్లీజ్" అన్నపుడో నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి.
ప్రాణాలకు తెగించి (అలా ఫ్రెండ్ కోరిన పుస్తకం కోసం ఇరుకు సందులో వెళ్తుంటే బైక్ మీదినుంచి పడ్డాను మరి) ఆ పుస్తకాలు సంపాదించి వాళ్లకిచ్చి,అది అందుకున్నప్పటి వాళ్ళ నవ్వు మొహాన్ని ఊహిస్తూ కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది.
ఇలా నా కోసం పుస్తకాలు సంపాదించే మిత్రులు కూడా ఉన్నారు! మన డాక్టర్ కౌటిల్య మొన్న ఎన్ని పుస్తకాలు తెచ్చాడో గుంటూరు నుంచి మోసుకుని!
ఈ మధ్య ఒక పెళ్ళిలో మా బంధువులావిడ కలిసింది. దగ్గర దగ్గర డెబ్భై యేళ్ళుంటాయి. దగ్గరి చుట్టరికమే లెండి. మా ఆడపడుచు తోటికోడలి మరదలి వదిన గారికి వేలు విడిచిన మేనత్తట. ఆవిడ పెళ్ళయ్యాక కలకత్తా వెళ్ళిపోయింది. ఆ పెళ్ళి పెడాకులో విడాకులో ఏదో అయింది మొత్తానికి. పిల్లలు లేరు. అప్పటినుంచి ఈవిడ పరాక్రమించి (బోల్డు తీరిక కదా) బెంగాలీలో కథలూ అవీ రాసి ఉన్నపళంగా రచయిత్రి అయిపోయింది.
సరదా పడి మా ఇంటికి వచ్చింది. ఆవిడరచయిత్రి కదా కాసేపు పుస్తకాల గురించి మాట్లాడుకోవచ్చని ఆహ్వానించాను. నా లైబ్రరీ చూసి "ఏవిటి, ఇవన్నీ నిజంగా చదువుతావా?ఎన్ని చదివావు వీటిలో?" అంది.
నేను ముందు తెల్లబోయి "ఎన్ని చదవడమేమిటి? అన్నీ చదివేశాను! కావాలంటే ఈ పుస్తకాల్లో ఏదో ఒకదాని మీద నాకు పరీక్ష పెట్టుకోండి" అన్నా సరదాగా!
"అమ్మో, నేనసలు చదవను. ఏదో కొని పడేస్తుంటా, ఎప్పుడైనా తీరిక దొరికితే చదవొచ్చని" అంది.
"అవునూ, ఉజ్జోగం, ఇల్లు, సంసారం, పిల్లలు,ఇతర పన్లూ..వీటన్నింటి మధ్యా నీకు టైమెక్కడ దొరుకుతుంది ఇన్నేసి పుస్తకాలు చదవడానికి?" అని పాపం కుతూహల పడింది.
అక్కడే ఉన్న మా ఆడపడుచు కూతురు "మీకు అవేవీ లేవుగా? బోల్డు తీరిక! మరి మీరెందుకు చదవరు అమ్మమ్మ గారూ?" అంది.
అది అమ్మమ్మ అన్నందుకు కాసేపు సీరియస్ అయి "నాకు రాయడానికే సమయం సరిపోదు. ఇంకెక్కడ చదువుతాను! రాయగలిగిన సత్తా ఉన్నపుడు చదవాల్సిన పని లేదని నా అభిప్రాయం" అని వాక్రుచ్చింది.
"నువ్వేం రాయవా? ఎప్పుడూ చదవడమేనా? బోరు కొట్టదూ?" అంది
"రాస్తానండీ, ఏదో పత్రికలకు కాసిన్ని వ్యాసాలు, కాలములూ"
"అదేంటి, సాహిత్య సృష్టి చేయవూ" నిర్ఘాంత పోయి.
"అబ్బే, నాకు అంత విధ్వంస కాండ చేపట్టే ఉద్దేశం లేదండీ! ఏవో తొమ్మిది పది కథలు ఎప్పుడో రాసి పడేశాను కానీ అవి ఎక్కడున్నాయో కూడా వెదకను నేను"
"సో, you are more journalist than a writer"
"మీకెలా తోస్తే అలా అనుకోండి"
"నీ ఫ్రెండ్స్ అంతా ఇలాగే పుస్తకాలు కొంటారా?"
"ఓ, కొంటారు. నాకంటే ఎక్కువ కొనేవాళ్ళు వందల్లో ఉన్నారు"
"వాళ్ళూ ఇంతేనా? చదవడమేనా?రాయరా?"
"కొందరు రాస్తారు. అయినా అసలు పుస్తకాలు చదివే వాళ్లంతా రాస్తూ ఉండాలని రూలెక్కడుందండీ?అలా మేవంతా రాస్తే పాపం మీలాంటి వాళ్ళు ఏమై పోతారు?"
"అసలు ఇన్ని పన్ల మధ్య నీకు టైమెక్కడ దొరుకుతుందో చెప్పు" (వాళ్లాయన మీద చుట్టాలెందుకు జాలిపడ్డారో కొద్దిగా అర్థమైంది )
"నాకు టైము "దొరకదు"! నేనే కేటాయించుకుంటాను. MMTSలోనూ, సిటీ బస్సుల్లోనూ పక్క ప్రయాణీకులతో సొల్లు కబుర్లు చెప్పకుండా పుస్తకాలు చదువుకుంటాను. అన్నం తినడం,నీళ్ళు తాగడం,ఆఫీసు పని ఎలా నిత్య కృత్యాలో, పుస్తకాలు చదవడం కూడా అంతే నాకు!గోవా బీచ్ లో కూచుని మానవ సమాజం చదివాను నేను. అందువల్ల నేను పుస్తకాలు చదువుతానా లేదా అనే సందేహం వదిలి పెట్టి తమరేం గిలికారో కాస్త చెప్పండి" అన్నాను సీరియస్ గా!
ఎంత సేపని ఈ మనిషితో మామూలుగా మాట్లాడ్డం?
"ఏవైనా పుస్తకాల క్లబ్బుకో వెబ్ సైట్లకో రాస్తుంటావా పోనీ? మెంబర్ గా ఉన్నావా?"
"అబ్బే లేదండీ! అతిథుల లిస్టు లో కూడా నా పేరుండదు. చెక్ చేసుకోండి కావాలంటే"
ఆ రోజుకు ఇహ అలసి పోయి ఊరుకుంది.
మరో రెండు రోజులు హైద్రాబాదులోనే ఉంది. కానీ ఇన్నేసి పుస్తకాలు ఎందుకు కొంటారు? కొని నిజంగా చదువుతారా అనే సందేహం మాత్రం వదిలి పెట్టినట్టు లేదు.
కనిపించినపుడల్లా ఇదే టాపిక్ మాట్లాడి నా సహనానికి పరీక్ష పెట్టింది.
"ఇంకా నయం, నాకీ సంసార జంజాటాలేవీ లేవు. లేకపోతే నా రాతలు కుంటుబడేవే"అని గొణుక్కుని నాకు రెండు బెంగాలీ పుస్తకాలిచ్చింది. తెల్లబోయాను. నేనేం చేసుకోను వాటిని? అదే అడిగాను. "త్వరలో వాటిని ఒకాయన తెలుగులోకి అనువదిస్తాడు. అప్పటిదాకా అవే ఉండనీ" అని చెప్పి పోయింది. అవి కూడా నా భోగి లిస్టులో చేరాయి.
నాకైతే పుస్తకాలు ఆబగా చదివే తెలుగు బ్లాగర్లందరితో ఒక మీటింగ్ పెడితే బాగుండు ఆవిడ కోసం అనిపించింది.
ఇంతకీ, ఏవిటి? పుస్తకాలు గొప్ప కోసం కొని పక్కన పడేజే జాబితాలో ఉన్నారా? చదివే జాబితాలోనా?
ఏవిటో చల్లనివేళ ఆవిడ వల్ల ఈ డౌట్లూ!
పుస్తకాలు ఇష్టంగా చదివే వాళ్ళంతా ఇలా వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పండి మా కోల్ కతా అత్తయ్య పిన్నికి