April 25, 2012

ఈ దేశంలో ఒక భాగమిది


(ఈ ఫొటోలో మొదటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ కొమ్మూరి వేణు గోపాల రావు గారు. నా దగ్గరున్న పుస్తకానికి కవర్ పేజీ లేకపోవడంతో గూగుల్ సౌజన్యంతో ఈ ఫొటో పెట్టాను  )


ఈ మధ్య మన సినిమాల్లో ఉమ్మడి కుటుంబాల హడావుడి ఎక్కువైపోయింది. నాలుగైదు ఫామిలీలు కల్సి ఉండటం, వాళ్ళు ఎప్పుడూ సరదాగా కులాసా కబుర్లు చెప్పుకుంటూ ఆనంద బాష్పాల్లో స్నానాలవీ కానిచ్చేసి,ఆప్యాయతలు భోంచేస్తూ,అనురాగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎప్పుడూ హాస్యాలే! గొడవలే రావు. ఇంకో ముఖ్యమైన సంగతి ఆ ఇళ్ళలో ఎవరూ ఉజ్జోగాలూ ఇతర పన్లూ చెయ్యరు. అంతా హాల్లో జేరి సోఫాల్లో కబుర్లాడుకుంటూంటారు. లేదా పిక్నిక్స్...!

నిజానికి ఉమ్మడి కుటుంబం స్వరూపం ఎంతో భిన్నమైనది.  అనురాగాలు,ప్రేమలతో పాటు ఇతర రకాల జాడ్యాలు దీని సొంతం! పాత సినిమా తోడి కోడళ్ళు చూస్తే తెలుస్తుంది ఎన్నెన్ని అపార్థాలు, ఎన్నెన్ని గొడవలూ,కాలుష్యాలు,కుట్రలు,కుతంత్రాలు,కడుపు మంటలూ!సినిమా కాబట్టి చివరాఖరి సీన్లో అందరూ నవ్వుతూ ఒకటైపోతారనుకోండి.


ఉమ్మడి కుటుంబాలు ఒకటో అరో మిగిలున్న కాలంలో దివంగత రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాలరావు గారు రాసిన మంచి నవల "ఈ దేశంలో ఒక భాగమిది"!

ఆయన పోయాక ఆయన నవలలన్నీ రీ ప్రింట్స్ వచ్చినా, ఇదొక్కటీ మాత్రం రాలేదు. నాకు పెంకుటిల్లు,, హౌస్ సర్జన్ నవలల కంటే ఈ నవలబాగా నచ్చుతుంది. ఈ నవల కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, ఈ మధ్య విజయవాడ లో పట్టుకోగలిగాను !

ప్రతి మనిషికీ తనదిన ఇష్టం ప్రకారం స్వేచ్ఛగా జీవించాలని,చిన్న చిన్న సరదాలను తీర్చుకోవాలని  ఉండటం సహజమే!మనలో చాలామందికి అవి కూడా తీరవు ఈ నవల్లో కుమార్ కి మల్లేనే!

కుమార్ ది ఉమ్మడి కుటుంబం! అంటే మరీ మూడు నాలుగు తరాలు కల్సి ఉండకపోయినా, అతడు,పెళ్ళయిన మరో తమ్ముడి కుటుంబం,పెళ్ళి కాని తమ్ముడు,చెల్లెలు,అమ్మా నాన్నా!

కుమార్,అతని తండ్రి రంగా రావు డాక్టర్లు. సొంత హాస్పటల్ ఉంది.60ల్లో కథ కాబట్టి తల్లి దండ్రులంటే భక్తి తో కూడిన గౌరవాలు వగైరాలు పిల్లల సొంతం. తండ్రి మాటలకు ఎదురు చెప్పాలని ఉన్నా , తిరస్కరించాలని,వ్యతిరేకించాలని ఉన్నా చెప్పలేని అశక్తత,కొడుకుల సొంతం.

ఇద్దరు కోడళ్ళూ మంచి వాళ్ళే కానీ ఉమ్మడి కుటుంబానికి అలంకారమైన చిన్న చిన్న మనస్పర్థలకు వాళ్ళు అతీతులు కాదు. నిజానికి నెలకో సారో ఆర్నెల్ల కోసారో కలుసుకునే తోబుట్టువుల కుటుంబాల్లోనే పిల్లల వల్ల అరగంటలో ఆప్యాయతలు మసకేసి పోతాయి.

"పిల్లలే కదా" అని తేలిగ్గా తీసుకునే స్వభావం మనకున్నా అవతలి పిల్లల తల్లి దండ్రులకుండాలని లేదు. అది కూడా కాదనలేం! ఎవరి పిల్లలు వాళ్ళకు ఎక్కువ!

రాత్రి కంటినిండా నిద్ర పోవాలని,పొద్దున్నే లేచి వేడిగా చిక్కని ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, పూరీలూ,పెసరట్లూ టిఫిన్ గా తినాలనీ,పొద్దున్నే పెళ్ళాం గారు చిరు నవ్వుతో "ఏవండీ, లేచారా" అంటూ ఎదురు రావాలని కుమార్ కోరికలు.
కానీ యదార్థ పరిస్థితి ఇలా ఉంటుంది.....:-))

అర్థరాత్రి వేళ కరెంట్ పోతుంది. గుయ్యి మని దోమలు. చెమట!ఈ లోపు పక్కలో పిల్ల తండ్రి మెడ చుట్టూ చెయ్యి బిగించి, ఎద్దులాగా మీద కాలు వేస్తుంది.
పొద్దున్నే లేచేసరికి గీజర్ లో వేన్నీళ్ళు మరదలు తన పిల్లలకు పోసేస్తుంది.
కాఫీ పల్చగా ఉంటుంది.
పేపర్ వివిధ భాగాలుగా విడిపోయి తలా ఒక రూములోనూ ఉంటుంది.
వాళ్ళమ్మ రోజూ లాగే ఉప్మా వడ్డిస్తుంది.
అతడి టిఫిన్ చేస్తుంటే రంగారావు గారు "అయిందా,అందుకే టైమ్ సెన్స్ ఉండాలంటాను నేను"అని నిమిషానికోసారి వాచీ చూసుకుంటూ తొంగి చూస్తుంటారు.

జాలేస్తోంది కదూ కుమార్ మీద!
తోటి కోడళ్ళిద్దరూ  స్వతహాగా మంచి వాళ్ళే! బాగానే ఉంటూనే, ఎందుకొస్తుందో తెలీకుండా కోపాలు తెచ్చేసుకుని క్షణంలో మొహాలు మాడ్చుకుని కూచుంటారు. అంతటితో ఊరుకోకుండా ఆ కోపం పిల్లల మీద చూపించి వాళ్ళను చావగొడుతుంటారు.

అత్తగారు అడ్డు పడితే "మా పిల్లల్ని మేము కొట్టుకోడానికి కూడా స్వేచ్ఛ లేదా"అంటుంటారు.

ఇహ ఇంట్లో ఎప్పుడూ జనాలు! మామ్మగారికి మడి! ఇల్లంతా ఎంత సర్దినా చిందరవందర! క్రమ శిక్షణ లేని పిల్ల రాక్షసులు!ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక construction  పని నడుస్తూ ఉంటుంది. సింకులు బాగు చేయించడమో,ప్రహరీ గోడకు పెచ్చులు ఊడితే పెట్టించడం,లేదా గేటు బాగు చేయించడం, ఇలాటి పనుల్తో ఇంటి ముందూ ఎప్పుడూ ఇసక కుప్ప,ఇటుకలు!

ఇవే కాక,రంగారావు గారు ప్రతి అరగంటకీ "నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని నేను మీకు అంతా రెడీగా ఉంచాను.మీరు ఈ కాస్త కూడా కష్టపడలేరేం"అని కుమార్ ని చిన్నబుచ్చేట్టు నలుగురిలోనూ మాట్లాడ్డం,కుమార్ దానికి ఎదురు చెప్పలేక పోవడం మామూలుగా రోజూ జరిగే విషయం. ఎప్పుడో  కొన్న  ఆయన పాత కారు మీద అడుగడునా ఓనర్ షిప్ ప్రకటిస్తూ "అది నా కారు" అంటూ ఉండటం కుమార్ కి మింగుడు పడదు. ఆయన అలా మాట్లాడడం ససేమిరా అతనికి  ఇష్టం ఉండదు . చనువు తీసుకుని చెప్పే ధైర్యం చేయలేడు!

కొంత మందికి మనం మాట్లాడే మాటల్లో తప్పులుంటే ఎంత మంది మధ్యలో అయినా, ఎంత సీరియస్ విషయమైనా సరే అప్పటికప్పుడు సరిదిద్దెయ్యడం అలవాటుగా ఉంటుంది. రంగారావుగారిలాగా!

కుమార్ ఒక సీరియస్ చర్చలో "అతడు ఒట్టి మేనర్స్ లెస్ ఫెలో" అనగానే వాళ్ళ నాన్న "మేనర్స్ లెస్ కాదు,మేనర్ లెస్ అనాలి" అని దిద్దడంతో గాలి తీసిన బెలూన్ లాగా పాపం కుమార్ కి ఇహ మాట్లాడే ఆసక్తి పోతుంది.

ఇలా నిమిష నిమిషానికీ చిరాకు పుట్టిస్తూ,వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరించే పెద్దలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు మనకి కూడా! మా మావయ్య కూతురికి పెళ్ళయి ఏడేళ్ళు. ఇద్దరు పిల్లలు. అయినా ఇప్పటికీ దాని అత్తా మామలు ఏదైనా సందర్భం వచ్చినపుడు "మీ ఇంట్లో అయితే ఏం చేస్తారు?" " మీ ఇంట్లో అయితే ఇంతేనా? " మీ వాళ్ళంతా.." ఎంత సేపూ " ఈ ఇంట్లో మీ వాళ్ళు, మీ ఇంట్లో"! మీ ఇంట్లో అంటే మీ పుట్టింట్లో అని అర్థం!

పెళ్ళయి ఇన్నేళ్ళయినా దాన్ని "తమలో" కలుపుకుని మాట్లాడరు.   పైగా వాళ్ళకి ఇంకో ఫీలింగ్. కొడుకుని తాము కష్టపడి పెంచి పెద్ద బాంకు ఉజ్జోగిని చేస్తే కోడలు ఎక్కడినుంచో ఊడిపడి చక్కగా అనుభవిస్తోందని! నలుగురూ కల్సినపుడు "ఎంత కష్టపడ్డాం వాడి కోసం? అనుభవించే రాత ఉన్నవాళ్ళకే దక్కుతాయి అన్నీ" అంటూ ఎవరికో తగలాలన్నట్టు మాట్లాడుతుంటారు. కోడలు ఉద్యోగం చేస్తున్నా అది లెక్కలోకి రాదు. ఉమ్మడి కుటుంబాల్లో సమస్యలు బయటికి చెప్పుకోనన్నాళ్ళు అవి పచ్చని సంసారాలుగానే కనిపిస్తుంటాయి. చెప్పుకోడం మొదలు పెడితే అక్కడ ఆడా మగా తేడా లేకుండా ఎవరికీ మనశ్శాంతే ఉండదు.

కథలోకొస్తే..కుమార్,హరి ఇద్దరూ వీలైనంతగా ఇంట్లో చిన్న చిన్న గొడవల్ని పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నిస్తారు. కానీ అవి రోజు రోజుకీ తీవ్ర తరమై పోతాయి. మధ్యలో పిల్లలు బలి పశువులై దెబ్బలు తింటూ ఉంటారు. వీటికి తోడు,ఇంట్లో తిష్ట వేసే చుట్టాలు.మర్యాదలు సరిగా లేవని అలకలు! చాకిరీతో ఆడాళ్ళు సతమతమై పోతుంటారు. అనారోగ్యాలు! చేసేవాళ్ళు కరువై అసహనాలు,కోపాలు పెచ్చు మీరతాయి.

ఈ పరిస్థితి చూసి మూడో వాడు అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకుని,ఒక అమ్మాయి మీద మనసు పడి కూడా,దాన్ని చంపేసుకుని వెళ్ళి ఆర్మీలో చేరతాడు.

ప్రతి గొడవనూ తోటి కోడళ్ళిద్దరూ భర్తలతో చెప్పుకోవడం పరిపాటే!అన్న దమ్ములిద్దరూ ఏమీ పట్టనట్టు వదిలేయడం వాళ్ళకు నచ్చదు. తమ వైపు మాట్లాడాలని ఆశిస్తుంటారు. పిల్లల విషయంలో మొదలైన ఒక గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కుమార్ తన భార్య మీద చేయి చేసుకోవడంతో ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తుంది. దానికి నువ్వే కారణమని తమ్ముడు మరదలి మీద చేయి చేసుకుంటాడు.

ఈ గొడవల నేపథ్యంలో రంగారావు గారు కుటుంబాలు విడిపోయి ఎవరి దారిన వాళ్ళు విడిగా ఉంటూ అప్పుడపుడూ కలుసుకోవడం ఉచితంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చి రెండో కొడుకూ కోడాలికి ఒక చోట ఇల్లు చూసి,తామూ వేరే ఇల్లు చూసుకుంటారు.

ఈ నిర్ణయం నిజానికి ఎవరికీ ఇష్టం ఉండదు. ఏళ్ళ తరబడి కలిసి ఉంటున్నారాయె! ఈ విషయం వినగానే తోటి కోడళ్ళిద్దరూ కావిలించుకుని గొల్లున ఏడుస్తారు. కానీ విడిపోవాలనే నిర్ణయం మాత్రం మారదు.
అంతా కుటుంబాల వారీగా విడిపోవడంతో కథ ముగుస్తుంది.

ఈ నవల్లో కుమార్,హరీ ఇద్దరూ కూడా గొడవ అయినపుడల్లా "మీకేం తక్కువ? తిండి తక్కువా?గుడ్డ తక్కువా?కావలసినవన్నీ తెచ్చి పడేస్తున్నాంగా?ఇంకా ఎందుకు వస్తాయి మీకు గొడవలు"అని భార్యల్ని అడుగుతూ ఉంటారు!
"తిండీ,బట్టా తప్ప మాకు ఇంకేమీ వద్దా?
 మాకు ఇహ విశ్రాంతి వద్దా? ఉల్లాసం అక్కర్లేదా" అన్న తమ భార్యల ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పరు.
పిల్లలకు చదువు చెప్పడమో,వాళ్ళతో ఆడుకోవడమో,సమయం గడపడమో ....ఏమీ చేయరు. చాకిరీ చేస్తున్నారు కాబట్టి, భార్యల ఆరోగ్యాలు బాగానే ఉండుంటాయి లెద్దూ అనేసుకుని  "ఒంట్లో ఎలా ఉంది"అనైనా అడగరు.  స్టోర్ రూము నిండా సరుకులూ,బీరువా నిండా బట్టలూ తెచ్చి పడేస్తే చాలనుకుంటారు.
రచయిత కూడా తిని కూచుని పని లేక గొడవలు పడుతుంటారు ఉమ్మడి కుటుంబాల్లోని ఆడాళ్ళు అనే ఉద్దేశం చూపిస్తారు.
కథంటూ ప్రత్యేకంగా ఏమి లేకపోయినా,ఉమ్మడి కుటుంబంలోని వాస్తవ పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ సాగే ఈ నవల చాలా ప్రజాదరణ పొందింది.
కొమ్మూరి వేణుగోపాల రావు గారి రచనల్లో బెస్ట్ అనిపించుకోదగ్గ నవల. కథా గమనం చాలా ఆసక్తి కరంగా, వాస్తవికంగా నడుస్తుంది.ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు గానీ 60 ల్లో ఇంకా మాసి పోలేదు కాబట్టి ఆనాటి వాతావరణం ఈ నవల్లో బాగా ఆవిష్కృతమవుతుంది.
ఆయన నవలలు అన్నీ రీ ప్రింట్ కి వచ్చినా ఇది మాత్రం రాలేదు. ఎక్కడైనా లైబ్రరీలో దొరికితే చదవొచ్చు

32 comments:

జ్యోతిర్మయి said...

మీ సమీక్ష చదివి, ఈ పుస్తకాన్ని చదవవలసిన పుస్తకాల జాబితాలో చేర్చాను సుజాత గారూ..

Surabhi said...

Sujatha Gaaru,
As usual, nice write up on the novel.
My opinion is, it is better to live as seperate families and have good relationships with every one.
In joint families for things to go smoother everyone should have good maturity levels and awareness that people do differ in their opinions,every opinion has to be respected and those opininons are for that context/instance and not to generalise.
Out of topic, I have seen your picture recently in one of recent blogpost, I was very very surprised because you resemble so much with my cousin who is in hyd and studying engneering. I wish I had her picture to share with you.
- Surabhi

Chowdary said...

1971 ప్రాంతాల్లో ఆంధ్రపత్రికలోననుకుంటా సీరియల్‌గా వచ్చింది. పుస్తకంగా చదివిన గుర్తు లేదు. నా యడొలసెన్స్‌లో జనరేషన్ గాప్ గురించి ఒక ప్రాథమిక అవగాహన నాకు ఈ నవలద్వారానే కలిగింది. నాకు బాగా నచ్చిన కొమ్మూరిగారి పుస్తకాలలో ఒకటి. కొమ్మూరిగారి ఇంకో నవల వ్యక్తిత్వం లేని మనిషి కొత్త ఎడిషన్ వచ్చిందా?
-- జంపాల చౌదరి

కొత్తావకాయ said...

బాగుందండీ. సమీక్ష అనను.. పరిచయమే! నేను ఇదివరలో ఈ నవల చదవలేదు కనుక. దొరకబుచ్చుకుని చదవాల్సిన నవలలా అనిపిస్తోంది. ఈ ఫోటో కూడా ఇదే చూడడం.

జీవన పయనం - అనికేత్ said...

వివరించిన విధానం బాగుంది.

Sharada said...

ఉమ్మడి కుటుంబాలు నచ్చని వ్యక్తిని ఈ భూమ్మీద నేనొక్కదాన్నే అనుకున్నాను.
ఇంకా వున్నారన్నమాట.
మంచి విశ్లేషణ.
శారద

రాజ్ కుమార్ said...

బాగుందండీ.. విజయ వాడ లో ఇంకో కాపీ దొరికే అవకాశం ఉందా?? ;)

neelaanchala said...

సుజాత గారూ, చాలా రోజుల తర్వాత మీ బ్లాగ్ చూస్తున్నాను. మీరు కూడా అరుదుగానే రాస్తున్నట్లున్నారు. మీ కజిన్ గురించి రాసింది చదివి, నా గురించే రాశారనుకున్నా! నా పరిస్థితీ కూడా అదే! ఎంత సంపాదించినా గుర్తింపు లేదు. వాళ్ళబ్బాయిని దోచుకోడానికే దిగబడ్డానని అనుకుంటారు మా మామగారు.

ఇవాళ్రేపు ఇంజనీరింగ్ చదివిన ప్రతోళ్లకీ ఉజ్జోగాలే,ఉజ్జోగం రాగానే సరా...బుర్రలో తెలివుండొద్దూ అంటారు నా విషయంలో! వాళ్ల అబ్బాయిని మాత్రం వీళ్ళే కష్టపడి ఉజ్జోగంలో పెడితే నేనొచ్చి అదంతా తినేస్తున్నానంటారు.

ఏమీ మాట్లాడ్డానికి ఉండదు. మౌనంగా ఉంటే.."ఎందుకే మనకి ఈ పీడా? మన పెన్షన్ మనిద్దరికీ చాల్దూ? వెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో ఉన్నా, ఇంతకంటే బాగానే జరుగుతుంది. పోదాం పద" అని మా వారు కల్పించుకునే దాకా మాట్లాడుతూనే ఉంటారు. నా మౌనానికి శిక్ష అది. చివరికి నాకు చీవాట్లో, మరోటో పడే దాకా శాంతించరు.ఈ విషయాన్నంతా ఫోన్లు చేసి నేను ఆఫీసు నుంచి వచ్చే లోపు మా పుట్టింటి వాళ్ళతో సహా చుట్టాలందరితో చెప్పేస్తారు. అందరూ నాకు ఫోన్లు చేసి "సర్దుకోవాలమ్మా,వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు కాదూ, ఎన్నాళ్ళుంటారు చెప్పు" అని పాఠాలు! ఒక్కోసారి context తెలీకుండా ఇలాంటి పాఠాలు ఎన్నో విన్నాను.

ఇలాంటి సంఘటనలు జరిగాక కూడా స్విచ్ వేసినట్టు వెంటనే నవ్వుతూ ఉండాలంటే సాధ్యమేనా?

కథల్లోనూ సాహిత్యాల్లోనూ ఎప్పుడూ కోడళ్ళే అత్తామామల్ని సాధిస్తున్నట్టు,వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నాట్టు రాస్తారెందుకండీ? ఇలాంటి కోడళ్లు ఏ రచయిత కంటా పడరా?

నలుగురైదుగురు కల్సి ఉండే కుటుంబాల్లో ఆడవాళ్ళ పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో! ఆ స్త్రీలకు నమో వాకాలు

Praveen Mandangi said...

There are some technical problems with joint families. Can a small rented house with four rooms hold 2 families? We live in house of 9 rooms but our family is nuclear family. For better housing, nuclear family is better than joint family.

Unknown said...

నీలాంచల గారి రిప్లై చదివాక నాకు రాద్దామనిపించింది.

టపా లో వర్ణించిన విధంగానే ఉంటుంది మా ఇల్లు ఏమాత్రం తీసిపోకుండా... పంచపాండవుల్లా ఐదుగురు అన్నదమ్ములు, దక్షిణ భరతం లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన తోటికోడళ్ళూ(మా దొడ్డమ్మలు) పని వాళ్ళూ, పాలేర్లు వెరసి ఒక ముప్ఫయి మంది దాకా. రాయలసీమ లో కనిపించే సహజ మయిన సన్నివేశం ఇది. చుక్క పాల కోసం ప్రపంచయుద్ధాలు జరిగిన సందర్భాలెన్నో... బిక్కు బిక్కు మంటూ పన్నెండు మంది చిన్నపిల్లలం మేము.పాలు పెరుగు మాకు అపురూపమే. ఏ ఒక్క నాడు పాలు తాగలేదు మేము, కొలతల గ్లాసు ప్రకారం కాఫీలు తప్ప. అయినా సరే మాకు సంతోషం గానే ఉండేది.ఎన్ని యుద్ధాలు ఆడవాళ్ళు సృష్టించినా, ఇప్పటికీ అలాగే ఉంది మా ఇల్లు.

అణుకువ, మానసిక పరిణతి, ఒదిగి ఉండటం,పెద్దవాళ్ళని గౌరవించడం,జీవితం లో ఉమ్మడి కుటుంబం మాకు నేర్పిన పాఠాలు.ఇలాంటి గుణాలతో మెట్టినింట్లో కలతలు సృష్టించరాదన్న దృఢనిర్ణయం తో పదిహేడేళ్ళ కే అత్తవారింట అడుగు పెట్టిన నాకు, జీవితం కొత్త కోణంలో సవాళ్ళు విసరడం మొదలెట్టింది. కొత్త కోణాల్లొ వస్తున్న అత్తగారి ఆరళ్ళు, తోటివారి నుంచి సమస్యలు. ఏ సమస్య ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమయిన సందర్భాలెన్నో. పేరుకి మేనత్తే అయినా, అత్తగారి హోదాని ఏ మాత్రం జారవిడుచుకోనివ్వలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకుంది ఆవిడ. పుట్టింట్లో చెప్పుకుంటే అక్క తమ్ముళ్ళ మధ్య దూరం పెరుగుతుందేమో అన్న భయం వల్ల... ఆ దారి శాశ్వతంగా మూసేశాను. మిగిలింది మా ఆయన...తనంతట తాను తెలుసుకోవాలన్న నా అభిమతాన్ని ఏనాడు గుర్తించలేదు. లేదా ఎరిగి ఎరగనట్టున్నారేమో తెలీదు. ఈ పరిస్థితుల వల్ల మా ఇద్దరి మధ్య దూరం భయంకరంగా పెరిగి పోయింది...
ప్రేమ అనురాగాలు అవన్నీ సినిమాల్లో, నవలల్లో మాత్రమే ఉంటాయి. ఏవీ నిజాలు కావు.నేను పుట్టింట్లో నేర్చుకున్న పాఠాలతో సాధించిన విజయం అంటే, మా తోడికోడళ్ళు ముగ్గురం కలిసున్నా, ఏనాడు పోట్లాడుకోము.

ఈ మొత్తం మీద నేను కోల్పోయిందేమిటీ అని అలోచిస్తే.. చాలా చిన్నదే లెండి. నాజీవితం....
-అజ్ఞ్నాత

ఏల్చూరి మురళీధరరావు said...

శ్రీమతి సుజాత గారికి,

చాలా బాగా వ్రాశారు. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు!

వేణుగోపాలరావు గారిని నేను కలిసే నాటికి ఎందుకో సాహిత్యాభిరుచి సన్నగిల్లి కొంత నిరాసక్తంగా అగుపించేవారు. వెనుకటి రచనల గుఱించి ఎక్కువ మాట్లాడేవారు కారు. ఏకాంతంగా ఉండాలనుకొనేవారు. ఆ తర్వాత ఉత్సాహం తెచ్చుకొని చెయ్యాలనుకొన్నవేవో వెంటనే చేసి ముగించివేయాలని ప్రయత్నించారు. అప్పటి విజయవాడ మిత్రవర్గంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు, నవోదయ రామమోహనరావు గారు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గార్లతో కొంత మనసు విప్పి మాట్లాడేవారు.

ఎంతనుకొన్నా కాలము, కర్మము మన చేతిలోనివి కావు కదా!

ఏ మాత్రం పరిచయం లేని రచయిత యొక్క ఒక విలువైన రచనను ఎంతో ఆత్మీయతతో పరిచయం చేసి మీరు మళ్ళీ దానికి పాఠకహృదయాలలో ప్రాణంపోయటం బాగున్నది. ఎంత కాలం మనము ఏ మహనీయులను తలచుకొంటామో - అంత కాలమూ వారు పితృలోకాలలో సంతృప్తిగా ఉంటారని పెద్దలంటారు. మీ రచన వల్ల వేణుగోపాలరావు గారు తప్పక సంతోషించాలి గాక.

మీరు కొంత కృషిచేసి - మీ వైయక్తికాభిరుచికి నచ్చినవే, కొన్నైనా ప్రాచీన తెలుగు కావ్యాలను కూడా ఇలాగే పరిచయం చేయగలిగితే అవి మళ్ళీ ఒక తరంవారికి ఆసక్తిదాయకాలు కాగలవనిపించి - ఈ లేఖను వ్రాశాను.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

A Homemaker's Utopia said...

సుజాత గారు,
మీ పోస్టు చదివిన తరువాత నాకు అక్కినేని గారు నటించిన "ఆదర్శ కుటుంబం" (ఓల్డ్) మరియు "బంగారు కుటుంబం" (న్యూ) గుర్తుకోచ్చాయండీ...రెండు సినిమాలు దాదాపు ఒకే కథా వస్తువు ను కలిగి ఉంటాయి...నాకెంతో ఇష్టమైన సినిమాలు అవి...వాటిల్లో ఉమ్మడి కుటుంబాలలో ఉండే సమస్యలతో పాటుగా వాటికి పరిష్కారాలు కూడా చాలా బాగా చూపించారు..నాకు మొదటి సినిమా అంటే ప్రాణం...చాలా సార్లు చూశాను .:-)

సుజాత said...

వేణు గారు,
నిజమే, సంసారం ఒక చదరంగం సినిమా క్లైమాక్స్ లో సుహాసిని చెప్పే డైలాగ్స్ ఎంతో విలువైనవి.

కల్సి ఉంటే కలదు సుఖము అనే ఒక నీతిని నమ్మినట్టుగా నటించుకుంటూ ఆత్మ వంచన చేసుకునే ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు పోయాయి లెండి.

వ్యక్తుల స్వేచ్ఛకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడమే ఈ ఉమ్మడి కుటుంబాలు విఛ్ఛ్న్నమైపోవడానికి కారణమని నా అభిప్రాయం!

జ్యోతిర్మయి గారూ,
ధన్యవాదాలండీ! రీ ప్రింట్ కి వస్తే ఇది తప్పక దొరుకుతుంది. మంచి నవల! తప్పక చదవండి

Dear Surabhi garu, I completely agree with you! Its much better to live with separate families and maintain good relations with other families and relatives. This is the only choice I believe in.

you resemble so much with my cousin who is in hyd and studying engneering____________I would love to see your cousin's picture...just to compare my self :-))

సుజాత said...

చౌదరి గారూ,
నిజంగానే జనరేషన్ గాప్ గురించి అడుగడుగునా ఈ నవల్లో రచయిత ఎంతో కీన్ గా పరిశీలించి సంభాషణలు, ఆలోచనలు సృష్టించారు.

ముఖ్యంగా కుమార్, అతని తండ్రి మధ్య జరిగే సన్నివేశాల్లో!

వ్యక్తిత్వం లేని మనిషి నవల చదివిన గుర్తు లేదు. అది రీప్రింట్ పుస్తకాల్లో చూసిన గుర్తు కూడా లేదు.

సుజాత said...

కొత్తావకాయ గారూ,
థాంక్యూ! నేను ఎప్పుడూ పరిచయాలే రాస్తాను. సమీక్ష చేయను. సమీక్షకుడికి ఉండే బాధ్యతలు నేను తలకెత్తుకోను. సమీక్ష రాయాలంటే నవల్లోని మంచీ చెడూ,ఇతర సాంకేతిక విషయాలు,చర్చించాలి. అలా చేస్తే నేను న్యూట్రల్ గా ఉండాలి. ఒక రచన నాకు ఎలా నచ్చిందో వివరించాలంటే నేను న్యూట్రల్ గా ఉంటే కుదరదు. నచ్చిన విషయాన్ని మెచ్చుకునే తీరాలి. అభినందించాలి. నచ్చక పోతే అది కూడా నిష్కర్షగా చెప్పాలి.

అందుకే సమీక్షల కంటే పరిచయాలే రాయడానికి ఇష్టపడతాను నా కోణంలో!

ఇది రీ ప్రింట్ కి వస్తే తప్ప దొరికే అవకాశాలు తక్కువ. దొరికితే మాత్రం చదివే అవకాశం వదలకండి!

జీవన పయనం-అనికేత్ గారు,

ధన్యవాదాలండీ!

సుజాత said...

శారద గారూ,
థాంక్స్!

రాజ్ కుమార్,
ఇది నేను పదేళ్ళ నుంచీ అన్వేషిస్తే మొన్న దొరికింది. రీ ప్రింట్ వేయలేదు. ఒకవేళ వేస్తే మాత్రం తప్పక చదవండి. లేదా పాత పుస్తకాల షాపుల్లో ప్రయత్నించండి, మన డాట్రారు ఉన్నాడుగా! ఒక మాట చెప్పి ఉంచండి

సుజాత said...

నీలాంచల గారూ, మీ కామెంట్ చదివి ఏమనాలో తోచడం లేదు.చాలా కుటుంబాల్లో ఉండే సమస్యే ఇది. ఎన్నారై పిల్లలు తల్లి దండ్రుల్ని పట్టించుకోరని,ఉద్యోగం చేసే కోడలికి గీర ఎక్కువని ఇలాంటి స్థిరాభిప్రాయాలు ఇంకా మనుషుల్ని వదిలి పోలేదు.

అందునా అత్తగారు కాక మామగార్లు ఇలా మాటలు విసురుతుంటే భరించడం కష్టం! ఈ మధ్య ఇలాంటివి చాలానే చూస్తున్నాం. కోడళ్ళ మీద విసుర్లు,"మా కాలంలో ఇలా ఉండేదా? మా నాన్నగారి ముందు తలెత్తి మాట్లాడే పరిస్థితి ఉండేదా?" అని మాట్లాడ్డం, చివరికి మనవలూ మనవరళ్ళని తమ పిల్లలు ముద్దుగా చూడ్డం కూడా భరించలేని వాళ్ళు ఉంటారంటే నమ్మగలరా?" మా పిల్లల్ని ఇలాగే పెంచామా? ఇంత గారాబమా? అడిగిందల్లా కొనివ్వడమే? ఒక్క దెబ్బ కూడా పడద్దూ?" అని వెటకారాలు,వ్యంగ్యాలు చాలా మందికి ఎదురయ్యేవే!

ఈ జనరేషన్ గాప్ ని పాత తరం అర్థం చేసుకోలేదు కాబట్టి, మన తరం అర్థం చేసుకుని మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. వీలు కుదరనపుడు సర్దుకుని పడి ఉండమని మాత్రం నా సలహా కాదు!

రమణ said...

కొమ్మూరి వేణుగోపాలరావు గారి 'వ్యక్తిత్వంలేని మనిషి' మాత్రం చదివాను. మంచి నవల. ఈ నవల కొత్త ప్రింట్ వచ్చింది.

సుజాత said...

UNKNOWN గారూ,
మీ వ్యాఖ్య చాలా బాధ కల్గించేలా ఉంది. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ నలిగి నాశనమయ్యేది ఆడవాళ్ళే! ఎంత చాకిరీ చేసినా కనీస గుర్తింపు కన్సర్న్ ఉండకపోవడం అలా ఉంచితే మన మనిషి అనుకున్న వారు నిరాసక్తంగా ఉంటే అది మరింత హింస!

ప్రేమ అనురాగాలు అవన్నీ సినిమాల్లో, నవలల్లో మాత్రమే ఉంటాయి. ఏవీ నిజాలు కావు.________మీ అనుభవాన్ని కాదనే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు.
ఉన్న ఒక్క జీవితాన్నీ పోగొట్టుకోవడం అనేది ఎంత బాధాకరం! ఎంత ఘోరం!

ఎప్పటికైనా మీ జీవితం మీ చేతుల్లోకి రావాలని కోరుకోవడం తప్ప ఏం చేయగలం?

ప్రవీణ్,మీతో ఏకీభవిస్తున్నాను. సుఖ సంతోషాలతో, వీలైనన్ని తక్కువ గొడవలతో బతకాలంటే చిన్న కుటుంబాలే మంచివి.

సుజాత said...

మురళీధర్ రావు గారు,
నమస్తే! కొమ్మూరి గారి నవలలు రాయడం ఆపేశాక "రేకి" చికిత్సా విధానం మీద దృష్టి కేంద్రీకరించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. తర్వాత విషయాలు నాకు తెలియవు. ఈ నవలా పరిచయం ఆయన ఆత్మని సంతోష పరుస్తుందంటారా? అయితే నాకూ సంతోషమే! అయితే ఎంతోమంది నిత్యం తల్చుకునే మహా మహులైన దివంగత కవులూ, రచయితలూ నిత్య సంతృప్తులే అయి ఉంటారు.

మీ సూచనను ఆచరించడానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు

నాగిని గారూ,
ఆదర్శ కుటుంబం చూశాను నేను. నిజమే,. అనేకమంది రచయితలూ దర్శకులూ ఉమ్మడి కుటుంబాల్లోని లొసుగుల్ని పుస్తకాల్లోకీ,తెరమీదకీ ఎప్పుడో ఎక్కించేశారు. మనం చేయగల్గింది అవసరం పడ్డపుడు వాటిని తిరగేస్తూ ఉండటమే!

థాంక్యూ అండీ

Srinivas said...

* మా పిల్లల్ని ఇలాగే పెంచామా? ఇంత గారాబమా? అడిగిందల్లా కొనివ్వడమే? ఒక్క దెబ్బ కూడా పడద్దూ?*

సుజాత గారు,

ఈ రోజుల్లో ప్రతి వారి దగ్గర డబ్బులు ఎక్కువ, పిల్లల సంఖ్యతక్కువ. అమ్మానాన్నలు వాళ్ల పిల్లలను అతిగారభాం చెసి నెత్తిన పెట్టుకొంటె వారికి ఆనందమే. కాని పిల్లలు చేసే గలభాని భరించటం పక్కన వారికి పిచ్చెతిస్తూంటారు. నాకెన్నో స్వానుభవాలు ఉన్నాయి. నా కారుకి ఉన్న గీతలకి, సొట్టలకి ప్రధాన కారణం, పార్కింగ్ చేసినపుడు మా గేటేడ్ కమ్యునిటిలో పిల్లలు. ఒకడు నా కంటి ముందే చేస్తూ దొరికాడు, వాళ్లు అలా చేస్తున్నా, పక్కన ఉన్న తల్లి చూస్తూ ఉరుకొంట్టుందేగాని ఒకచిన్న దెబ్బ కూడా వేయదు. నా పక్కింటి మూడో తరగతి చదివే పిల్ల వాడు సిగరేట్ తాగుతూంటే చుసి చెప్పినందుకు, చెప్పిన వారి పైనే తగవుకు వచ్చారు. వాళ్ల పిల్లవాడు చాలా మంచి వాడని తల్లిగారి నమ్మకం. వారిని, వారి పిల్లలను ఎమీ చేసినా పల్లెత్తు మాట అనకుడదనే విధంగా తయారయ్యారు.

*అందునా అత్తగారు కాక మామగార్లు ఇలా మాటలు విసురుతుంటే భరించడం కష్టం*

మీరు ఇక్కడ ప్రత్యేకించి మామగారు విసురుతుంటే భరించటం కష్ట్టమని ఎందుకు రాశారో తెలుసుకోవాలని ఉంది. పెద్ద వారైన మామగారు ఒకమాట అంటే భరించటం అంత కష్ట్టమా?

సుజాత said...

శ్రీనివాస్ గారూ,
పిల్లలని అతి గారాబం చేయడాన్ని నేనూ వ్యతిరేకిస్తాను. మా ఇంట్లో అయితే మా పాపను నేను దెబ్బ వేయడానికి సిద్ధమైతే , బామ్మ తాత గార్లు అడ్డం పడి నన్నే కేకలేస్తారు.(క్లారిటీ కోసం చెప్తున్నాను, వాళ్ళు మాతో కల్సి ఉండరు. విడిగానే ఉంటారు)

రాక్షసుల మల్లే అల్లరి చేయడాన్ని మొదటి నుంచీ చూస్తూ ఊరుకుంటే పిల్లలు అలాగే తయారవుతారు, మీ కమ్యూనిటీ పిల్లల్లాగా! కనీసం అది తప్పని చెప్పని తల్లులతో నేను ఏకీభవించను. పక్కింటి వాళ్లకు పిచ్చి ఎత్తించే పిల్లల విషయంలో మీతో ఏకీభవించడమే!

ఇకపోతే ఇక్కడి కామెంట్స్ లో నీలాంచల గారు తన మామ గారు మాట్లాడే మాటల గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి నేను రాయడానికి అదొక కారణం. ఇంకోటి, అత్తగారితో ఉండే చనువు వేరు, మామాగారితో ఉండే చనువు వేరు. అదెప్పుడూ పరిమితుల్లోనే ఉంటుంది. అది అవకాశంగా తీసుకుని పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లను (ఆమె కూడా తమ కూతురిలాగే ఒక తల్లికి పుట్టిన ఆడపిల్ల అని మరిచి) చులకన చేసి మాట్లాడ్డం సహించరాని విషయం! అత్తగారి తో అయితే తన వాదన వినిపించుకోడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రికి మాటా మాటా అనుకున్న అత్తా కోడళ్ళిద్దరూ వంటింట్లో పొద్దున్నే నవ్వుతూ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మామగారు ఇంటికి పెద్ద కాబట్టి ఆయన అన్న మాటల్ను విని పడి ఉండటమే తప్ప "ఇదీ నా మాట" అని చెప్పుకునే అవకాశం కూడా ఉండదు..మధ్య తరగతి కుటుంబాల్లో! నేను ప్రస్తావించిన నా కజిన్ పరిస్థితి ఇదే! దానికి వేధింపులన్నీ ఆయన వల్లే!

అందరూ ఇలా ఉంటారని జనరలైజ్ చేయడం లేదు, గ్రహిచండి.

పెద్ద వారైన మామగారు ఒకమాట అంటే భరించటం అంత కష్ట్టమా?____________ఒకటీ రెండూ మాటలు అంటే ఏ కోడలూ అంత సీరియస్ గా తీసుకోదండీ! అవే మాటలు,అవే విసురులు పదే పదే రిపీట్ అవుతుంటేనే గొడవలు ముదురుతాయి.

తండ్రి లాంటి మావగార్లు,కూతురు లాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండరు కదా!

Srinivas said...

మీరు టెంప్లెట్ మార్చినట్లు ఉన్నారు చదవటానికి అనుకూలంగా లేదు. పాతదే బాగుంది. ఈ విషయం మీకెవరు చెప్పలేదా?

సుజాత said...

పాతదే నాకూ నచ్చుతుందండీ! కానీ పాత దాంట్లో టెక్నికల్ సమస్యలు వచ్చి, ఫీచర్స్ అన్నీ పోయాయి. అందువల్ల దీనికి మారాను. అప్పటికి దొరికిన వాటిలో ఇదే బెటర్ గా ఉందనిపించింది. చాలా మంది బాగుందన్నారే!

మంచిది దొరికితే మార్చేద్దామని చూస్తున్నాను

Sujata said...

హా హా హాట్ టాపిక్. :)

Ravi said...

suraj barjatya movies lo kooda..joint families lo assala godavalu vundavu ..annattu choopistaadu sujatha garu..
chaala kruthakam gaa vuntaayi choodadaaniki..

eeyana novel..prema nakshatram ..chadiva..
reiki meeda oka novel rasinattunnaaru eeyana

Lakshman said...

Good one Sujatha gaaru!

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి said...

బాగు౦ది

http://bhamidipatibalatripurasundari.blogspot.in/

Sayaram G said...

సుజాత గారికి మి బ్లాగు చాల బాగుంటుంది మీ హ్యస రచనలనలంటె నాకు చాల ఇష్టం. మీ లాంటి వాళ్ళను అదర్శంగ తిసుకుని నెను ఒక్క బ్లాగు రాస్తున్నను http://sayaram.blogspot.com. కాస్త మీ ఆబిప్రాయం చెప్పారు దయచెసి.

sarath said...

Wonderful, manchi novel ni parichayam chesaru.

Chandu S said...

సుజాత గారూ, చాలా బాగా వ్రాశారు అనేది చిన్న మాట. మళ్ళీ చదవాలి. మీ ఆలోచనలకు నేను అభిమానిని .

పూర్వ ఫల్గుణి(poorva phalguni) said...

సుజాత గారు, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన నవల yuva లో సీరియల్ గా వచ్చేది. అప్పుడ్ ఆపేరు ,నాయకుడిపేరు కూడా కొట్టగాఅనిపించేది. ఇదిగో ఇవాళ మొత్తం ఆ నవల కూచొని చదివాను. పాపం అనిపిస్తుంది. అంతలోనే కోపం కూడా వస్తుంది.అర్ధం లేని మంచితనం అతని పాలిట శాపం మయ్యి ఎంతో మనోవేదనను అనుభవించి ఆఖరికి మృత్యువు వాత పడతాడు. అలాగే వీరిది ఒకే రక్తం ఒకే మనుషులు కూడ బావుంటుంది.

మణి వడ్లమాని

Post a Comment