చికాగో నుంచి ఆస్టిన్ కి మారినపుడు . లేక్ మిచిగన్ నీలి రంగు అలల్నీ, వసంత కాలంలో ఇల్లినాయి సౌందర్యాన్నీ, శీతాకాలంలో కురిసే మంచు పూల సౌందర్యాన్నీ భయంకరంగా మిస్ కావడానికి సిద్ధ పడి పోయి ప్రయాణం కట్టాను. పైగా ఇక్కడికి రాగానే మా గుంటూరుని తలపిస్తూ మండి పడుతూ కాసే ఎండలు స్వాగతించాయి! చల్లని చికాగో చల్ల గాలే లేదు అని దిగులు పడ్డాను.
సరే.... వూరు చూడాలని అనుకుంటూ ఏమున్నాయని వెదుకుతుంటే కాస్త పుస్తకాలు చదివే అలవాటున్న పక్కింటి అమ్మాయి "ఓ హెన్రీ మ్యూజియం చూడండి. మీకు నచ్చుతుంది" అని సలహా ఇచ్చింది. ఇంటికొచ్చి ఆన్ లైన్లో వెదికితే.. అరె.. మా ఇంటికి గట్టిగా నాలుగు మైళ్ళ దూరంలోనే ఓ హెన్రీ మ్యూజియం ఉందని తెలిసింది.
ఓ హెన్రీ నాకు The gift of Maggie కథతో స్కూలు రోజుల్లోనే పరిచయం! ఆ కథ చివర్లో చమక్కుమని మెరిసి "అయ్యో"అనిపించే కొసమెరుపు గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత కూడబలుక్కుని ఇంగ్లీష్ కథలు చదివే అచ్చమైన తెలుగు మీడియం స్టూడెంట్ గా లైబ్రరీ లో దొరక బుచ్చుకుని ఓ హెన్రీ కథలు చాలానే చదివాను. ఆ చటుక్కుమని మెరిసే కొసమెరుపు గుండెలో కదిలించే ఒక "హుఫ్" అనే ఫీల్ కోసం అవన్నీ చదివాను!పదునైన హాస్యంతో సాగుతూ చివర్లో సడన్ గా తిరిగే ఆ మేలి మలుపు వల్లే ప్రతి ఏ కథకు ఆ కథే ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది.
గిఫ్ట్ ఆఫ్ మాగి కథ .. రోలింగ్ స్టోన్ పత్రిక లో ఆ రోజుల్లో ... రంగుల్లో
రచయితగా, వ్యంగ్య రాజకీయ కార్టూనిస్ట్ గా, పత్రికా ఎడిటరు గా బహుముఖ ప్రజ్ఞా శాలి గా పేరు గాంచిన ప్రసిద్ధ రచయిత నేనుంటున్న వూళ్ళోనే పుష్కరం పాటు నివాసం ఉన్నాడని తెల్సి సంతోషం తో ఆయన ఇల్లు చిరునామా తీసుకుని ఒక వీకెండ్ వెళ్ళాము .
ఆస్టిన్ డౌన్ టౌన్ లో ఎత్తైన భవనాల మధ్య ఒక అతి సామాన్యమైన ఇల్లు ...పచ్చని చెట్ల మధ్య కనిపించింది...రోడ్డు పక్కగా "ఓ హెన్రీ మ్యూజియం" అన్న బోర్డుతో!
నడక దారి లోంచి నాలుగడుగులు వేయగానే పోస్టు బాక్సూ, అక్కడి నుంచి మూడు మెట్లు ఎక్కగానే పొడుగాటి వరండా!
ఈ మెయిల్ బాక్స్ కి ఎన్ని విలువైన ఉత్తరాలు వచ్చి ఉంటాయో
తలుపు తోసుకుని వెళ్లగానే నిర్మానుష్యంగా ఉంది ఇల్లు !!
ఎవరూ లేరా గైడ్ లాగా వివరించే వాళ్ళు అనుకుంటూ పక్క గదిలోకి తొంగి చూస్తే అక్కడ ఒక పాత చెక్క రాత బల్లా , దాని ముందు కుర్చీ కనిపించాయి.
సంభ్రమం!
ఆయన వాడిన రైటింగ్ టేబుల్
అబ్బ, ఆ రాత బల్ల మీదే హెన్రీ నేను చదివిన మొదటి కథ రాసి ఉంటాడా?
ఆ బల్లని అబ్బురంగా చూస్తుండగానే లోపలి నుంచి ఒకమ్మాయి వచ్చింది. ఆమె ఒక స్కూలు టీచరు. వేసవి సెలవుల్లో అక్కడ పార్ట్ టైముగా పని చేయడానికీ, స్వయం గా రచయిత అభిమాని కూడా కావడం వల్లనూ సైట్ కో ఆర్డినేటర్ గా సందర్శకులకు రచియిత జీవిత విశేషాలు వివరించడానికి ముందుకొచ్చింది .
ప్రతి గదీ చూపిస్తూ, ఓ హెన్రీ జీవితానికి, వృత్తికి సంబంధించిన విషయాలన్నిటినీ శ్రద్ధగా వివరిస్తూ అక్కడి ప్రతి వస్తువు వెనుక చరిత్రనూ వీలైనంత వివరంగా పంచుకుంది. ఎన్ని ఫొటోలైనా తీసుకోడానికి దయతో ఉదారంగా అనుమతి ఇచ్చింది.
ఓ హెన్రీగా పేరు గాంచిన విలియం సిడ్నీ పోర్టర్ ఆ ఇంట్లో నివసించిన కాలంలో అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కొన్ని సంతోషాలైతే మరి కొన్ని విషాదాలు ఆ ఇంట్లో ఆయన చవి చూశాడు. చివరకు అతనికి జైలు జీవితం కూడా ఈ ఇంట్లో నివసిస్తున్న కాలంలోనే సంప్రాప్తమైంది. అతను నివసించిన ఈ ఇల్లు నిజానికి ఇప్పుడున్న చిరునామాలో లేదు. కొన్ని వీధులకు అవతల ఉండేది.
ఆస్టిన్ స్థానిక ప్రభుత్వం 1934 లో ఆయన జ్ఞాపకార్థం ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి యధా తధంగా చెక్కు చెదరకుండా ఇపుడు ఉన్న ప్రాంతానికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచింది. ఆ ఇంట్లోని ప్రతి చిన్న వస్తువునూ అతి జాగ్రత్తగా సంరక్షించి ఉంచింది.
విద్యుత్తులేని రోజుల్లో వారు వాడిన పొయ్యి, కిరోసిన్ దీపాలు, చలి కాచుకునే ఫైర్ ప్లేస్, రచయిత అద్దెకు తెచ్చిన పియానో, అతని భార్య వాడిన కుట్టు మిషను, ఆమె పెయింట్ చేసిన పింగాణీ ప్లేట్లు,వారి పిల్లలు ఆడుకున్న బొమ్మలు, ఆటవస్తువులు, ఆయన పుస్తకాలు, ఆయన సర్వేయర్ గా పని చేసిన కాలం లో గీసిన ఆస్టిన్ నగరం మ్యాపులు , పోర్టర్ కూచున్న వూగే కుర్చీ, ఆయన వాడిన పెన్నులు. అతని పుస్తకాల బీరువా ఇవన్నీ సందర్శకులకు కలిగించే అనుభూతి చిత్రంగా ఉంటుంది. ఆయన సంపాదకుడు గా ఉన్న రోలింగ్ స్టోన్ పత్రిక తాలూకు జేగురు రంగు పాత కాపీలు, ఆయన డిక్షనరీ, పుస్తకాల బీరువా.. అన్నీ క్షేమంగా ఆ నాటి వాతావరణాన్ని గుర్తు చేస్తూ అక్కడ ఆ చిన్న ఇంట్లో భద్రంగా ఉన్నాయి.
భార్య, కూతురు లతో
అక్కడ ఉన్న రాత బల్ల ఆయన గిఫ్ట్ ఆఫ్ మాగి కథకు స్ఫూర్తిని ఇచ్చిందని తెలిశాక మరింత సంతోషం! ఆ కథతోనే నాకు హెన్రీ పరిచయం
ఆయన డిక్షనరీ
విలియం సిడ్నీ పోర్టర్ కొంత కాలం పాటు ఆస్టిన్ కి సుమారు 80 మైళ్ళ దూరంలోని శాన్ ఆంటోనియో నగరంలో కూడా నివసించాడని, ఆయన స్వయంగా నడిపిన "రోలింగ్ స్టోన్" హాస్య పత్రికను అక్కడి నుంచే నిర్వహించాడని, ఆ ఆఫీసు/ఇల్లుని అక్కడి లోకల్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు ఉంచిందని చెప్పడంతో నాకు అక్కడి మ్యూజియాన్ని కూడా చూడాలని ఉత్సాహం పట్టుకుంది.
శాన్ ఆంటోనియో లో ఆయన ఆఫీసు/ఇల్లు
ఆ మరుసటి వారాంతమే అక్కడికి వెళ్ళాను. ఆ అడ్రస్ లో ఒక పెద్ద వ్యాపార భవనం కనిపించింది."అద్దెకు"అన్న బోర్డుతో! చుట్టూ ఎత్తైన భవనాలు. GPS లో మాత్రం అదే చిరునామా అని చూపిస్తోంది. ఎవరిని అడగాలని ఆలోచిస్తూ ఉండగా వీధి మొగదల ఒక విశాల మైన చెట్టు కింద ఒక చిన్న రైల్వే కాబిన్ వంటి చిన్న పాత గది ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే అదే__________ ఓ హెన్రీ ఇల్లు, రోలింగ్ స్టోన్ పత్రికాఫీసు.
రోలింగ్ స్టోన్ పత్రిక కాపి
ఆ ఇల్లు ని 1855 లో కట్టారట. అది కూడా ఇప్పుడు ఉన్న చిరునామాలో కాక వేరే చోట ఉండేది. దాన్ని కూడా ప్రదర్శన నిమిత్తం యధా తధంగా ఇప్పుడున్న ప్రదేశానికి అతి జాగ్రత్తగా తరలించారు. నేను వెళ్ళిన రోజు సెలవు రోజు కావడంతో అది మూసేసి ఉంది. అందులో రోలింగ్ స్టోన్ పాత ప్రతులూ ఎడిటింగ్ పనులకు సంబంధించిన ఇతర వస్తువులూ పుస్తకాలు దీపాలు మొదలైనవి ఉన్నాయట.
ఆయన భార్య స్వయంగా పెయింట్ చేసిన పింగాణి వస్తువులు
కదిపితే ఊడేలా ఉన్న తలుపు, పాత దనం కొట్టొచ్చినట్లు కనపడే కిటికీలకు కట్టిన మాసిన తెల్లని తెరలు ఇవన్నీ బయటి నుంచి చూస్తున్నా... ఆనాటి కాలానికి సందర్శకుల్ని ప్రయాణం కట్టించేలా కనిపించాయి. ఆ ఇంటిని అప్పట్లో పోర్టర్ నెలకు ఆరు డాలర్ల చొప్పున అద్దెకు తీసుకున్నాడట.
బొగ్గు కాలే ఫైర్ ప్లేస్
ఆ చిన్న ఇల్లు/ఆఫీసు నుంచే ఆయన రోలింగ్ స్టోన్ పత్రిక నడిపాడట.సరదా కవితలు, వ్యంగ్య, హాస్య రచనలకు అందులో ప్రాధాన్యం . అయితే అవి కొందరు వ్యక్తులకు కోపం తెప్పించడం వల్ల , సిడ్ని పోర్టర్ కి హెచ్చరికలు కూడా ఎదురయ్యాయి. ఫలితంగా పత్రిక ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఇక్కడి నుంచి ఆయన ఆస్టిన్ కి మకాం మార్చాల్సి వచ్చింది .
ఆస్టిన్ లో పోర్టర్ బాంక్ లో టెల్లర్ గా ఉద్యోగం చేశాడు.
అయితే విధి నిర్వహణ లో కొంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం వాళ్ళ బాంకు నిధుల గోల్ మాల్ నేరం లో భాగాన్ని పోర్టర్ కూడా తలకెత్తుకుని మూడేళ్ళ పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది . సిడ్ని పోర్టర్ జైల్లో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓ హెన్రీ కలం పేరుతో కథలు రాశాడు . జైలు నుంచి విడుదల అయ్యే నాటికే ఓ హెన్రి గా మంచి పేరు సంపాదించాడు
హెన్రీ ఇంటి ముందు మా అమ్మాయి
జైలు నుంచి విడుడులయ్యాక న్యూయార్క్ లో స్థిర పడిన పోర్టర్ న్యూయార్క్ వరల్డ్ సండే మాగజిన్ అనే పత్రికకు వారానికో కథ చొప్పున ఎన్నో కథలు రాసాడు . మంచి కథకుడు గా ఎంతో పేరు సంపాదించిన పోర్టర్ తాగుడు వల్ల ఆరోగ్యం చెడి 48 ఏళ్ల వయసులోనే 1910 లో కన్ను మూశాడు .
The gift of Maggie,
Ransom of red chief,
The duplicity of Hargreaves
వంటి కథల్ని పాఠకులు ఎప్పటికి మర్చిపోరు. అలాగే ఓ హెన్రీని కూడా !
అద్దెకు తెచ్చిన పియానో
ఓ హెన్రీ కథలు చదవడమే తప్ప అతని జీవితం గురించి ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోని నేను అనుకోని విధంగా ఆయన ఇల్లుని, వాడిన వస్తువుల్ని, ఆయన రచనల్ని, ఇతర వ్యక్తిగత సామగ్రిని కూడా చూసి ముట్టుకుని మరీ అనుభూతి చెందటం నాకే వింతగా అనిపించింది.
నా అభిమాన రచయిత టెక్సాస్ లోని రెండు నగరాల్లోనూ నివసించిన రెండు ఇళ్లనూ దర్శించడం నాకు మాత్రం ఒక జ్ఞాపకంగా మిగిలి పోతుందేమో!
ఆ ఇళ్ళను, ఇంట్లోని అతి చిన్న వస్తువునీ ప్రభుత్వం భద్ర పరిచి, ఆ గొప్ప రచయిత జ్ఞాపకాలను, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాల పాఠకుల అందించిన తీరుని చూస్తుంటే మన ప్రభుత్వాలు గుర్తొచ్చి మనసులో చేదుగా ఒక భావం కదలాడింది. నిరుత్సాహంతో ఒక నిట్టూర్పు కూడా!!
(ఫిబ్రవరి 16, సూర్య దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురితం )
అయితే స్థలాభావం వల్ల సూర్య దినపత్రిక లో ఫోటోలు అన్ని పబ్లిష్ కాలేదు . నిజానికి ఫోటోలన్నీ ఒకెత్తు ! ఎందుకంటే ఇదివరలో అక్కడ ఫోటోలకు అనుమతి లేదు . నేను వెళ్ళిన సమయంలో అక్కడ ఏదో పుస్తకావిష్కరణ జరుగుతూ ఉండటం తో అభిమానులను ఫోటోలకు అనుమతించారు .
అంతే కాదు , రచయితకు సంబంధించిన రచనలు ఏవైనా అలభ్యంగా ఉన్నవాటిని సంపాదించడం , కథల మీద చర్చలు, వర్క్ షాపు లు ఇవన్ని తరచూ ఈ మ్యూజియం నిర్వహిస్తుంది .
అదీ సంగతి !!
16 comments:
ఓ హెన్రీ కథలు నేను చదివింది చాలా తక్కువే. బట్ మీరన్నట్టు ఆ కథల్లో ఏదో మేజిక్ ఉంది... ఆ కొద్ది కధల్లో నే ఆ మాయ చుట్టుముట్టింది. బట్. ఆ తర్వాత. నేను ఆయన కథలేవి చదవలేదు. ఈ రోజు మీ పోస్ట్ చూశాక మరోసారి ఆ మాయలోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. అంత బాగా రాశారు. మరో విషయమేంటంటే ఆ ఇంటికి, మా గురజాడ వారి ఇంటికి చాలా పోలికలు కనిపించడం. గురజాడ వారు వాడిన వస్తువులకి హెన్రీ వాడిన వస్తువులకు కూడా చాల పోలికలున్నాయి. బహుశా మేధావుల ఆలోచనలు, అభిరుచుల సారూప్యతలు చాలా దగ్గరగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణేమో. బట్ సుజాత గారు. మీకు నిజంగా కృతజ్ఞతలు. హెన్రీ సాహిత్యాన్ని ఇప్పటికీ సజీవంగా దాచుకున్న ఆనవాళ్లను చూపినందుకు. హెన్రీ మాటల్లోనే చెప్పాలంటే... It'll be a great place if they ever finish it.
ఓ హెన్రీ ఇల్లు చూపించి నా చిరకాల కోరిక తీర్చారు సుజాత గారు. మీతో పాటే నేను కూడా ఆ పరిసరాలాన్నీ కలతిరిగిన అనుభూతి కలిగింది నాకు. థాంక్యూ.
చాలా బాగా రాశారండీ. ఓ హెన్రీ ఇంటిని మేమూ సందర్శించిన అనుభూతిని కలిగించారు. థాంక్యూ! విశాలాంధ్ర వాళ్లు వేశారనుకుంటా... ఓ హెన్రీవే ఓ 70 కథలతో ఓ పుస్తకం. ఆ మధ్య ఫ్రెండు దగ్గర తీసుకుని చదివాను. నిజంగా స్టోరీలైనును తీసుకోవడంలో, దానిని అల్లడంలో ఓ హెన్రీ ఓ ట్రెండ్ సెట్టర్ అనిపించింది. ప్రపంచ మానవుడు, జిమ్మీ వాలంటిన్ ,కుక్కల మనిషి, ది లాస్ట్ లీఫ్ ఇలా కొన్ని కథలు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకెందుకో, ఓ హెన్రీ... దొంగల జీవితాన్ని కాచివడపోశాడని అనిపిస్తుంది. కొంపదీసి పూర్వాశ్రమంలో ఓ హెన్రీ కూడా చోరకళలో (అమంగళం ప్రతిహతమగుగాక!) పట్టాలేమైనా తీసుకున్నాడేమోననే డౌటు కూడా వచ్చేస్తుంది. ది లాస్ట్ లీఫ్ (చివరి ఆకు) కథ మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరేట్. మనసును మెలిపెడుతుంది చివర్లో ఆ కథ. మా చిన్నప్పుడు ఇంగ్లీషులో పాఠ్యాంశంగా ఆ కథ ఉండేది. మీరు ఇలాగే దేశదేశాల్లో గొప్ప రచయితల ఇళ్లన్నింటినీ విహంగవీక్షణం చేసి, మాంచి మాంచి కబుర్లు బోల్డన్ని మాకు అందజేయాలని, ఇందుమూలంగా మనవి చేసుకుంటున్నాం, ఆయ్ :-))
Thanks for your blog and pictures.'Gift of Magi and 'Last leaf ' are my favorite stories of O'Henry.
nice experience
సతీష్ గారూ,
నాకు ఓ హెన్రీ కథల్లోని కొసమెరుపు తో పాటు కథను నడిపించే విధానం కూడా చాలా ఇష్టమండీ!గురజాడ గారిల్లు నేను చూడలేదు.మీరు చెబుతుంటే ఈ సారూప్యం తెల్సుకోడానికైనా చూడాలని ఉంది. చూస్తాను తప్పక.
థాంక్యూ
వేణు గారూ, అపురూపమైన వాటి విలువ అమెరికా వాళ్లకు బాగా తెలుసు. అదీ కాక ఇక్కడ పుస్తక పఠనానికి విపరీతమైన ప్రాముఖ్యం ఇస్తారు. ఈ మ్యూజియానికి వీకెండ్స్ లో వేరే వూళ్ళ నుంచి కూడా సందర్శకులు వస్తుంటారట.
జయ గారూ, నిజంగా అది మా ఇంటికి ఇంత దగ్గర్లో ఉందని తెలిసాక నాకూ చాలా సంతోషం వేసిందండీ! ఆ వస్తువులన్నీ ముట్టుకు చూస్తుంటే, రచయిత సాన్నిధ్యంలో ఉన్నట్టే అనిపించింది నాకు.
థాంక్ యూ అండీ
నాగరాజ్ గారూ, ఓ హెన్రీ కథా సంకలనం ఒకటి (అనువాదం) మా చిన్నపుడు మా ఇంట్లో చూశాను. కానీ అనువాదం నాకు నచ్చలేదు.(అనువాదకులెవరో గుర్తు లేదు).గిఫ్ట్ ఆఫ్ మాగీ చదివాక, కొన్ని కథలు ఇంగ్లీష్ లోనే చదవాలని అర్థమైంది.
దొంగల జీవితాన్ని ఏమి కాచి వడపోశాడో తెలీదు కానీ దాదాపుగా అదే నేరం మీద (బాంక్ నిధుల దుర్వినియోగం) ఆయన జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉన్నపుడు కూడా అక్కడి దొంగల పరిచయాలు కొన్ని కథలకు ఊతమై ఉండే అవకాశం కూడా ఉంది కదూ!
లాస్ట్ లీఫ్ కథ నాకూ చాలా ఇష్టం!
దేశ దేశాల్లో ఉన్న రచయితల ఇళ్ళన్నీ చూడాలా? ఇంకా నయం.. ఏదో ఇది ఇంటికి దగ్గర్లోనే ఉంది కదాని వెళ్ళాను.
నిజానికి నాకు ఏడు తరాలు చదివాక ఎలెక్స్ హేలీ ని స్వయంగా కలవాలని చూడాలని పిచ్చి కోరిక గా ఉండేది. "అమెరికా వెళ్ళి చూడ్డం కుదిరే పనేనా?" అని సరిపుచ్చుకున్నాను! కానీ నేను అమెరికా వచ్చే నాటికి ఆయన మరణించి చాలా రోజులై పోయింది. అలా తప్పించుకున్నాడు
థాంక్యూ
కమనీయం గారూ,
థాంక్యూ !!
ఫణి గారూ, మీక్కూడా ధన్యవాదాలు!
మీ unique style of narration తో మమ్మల్ని ticket లేకుండా Austin తీసుకెళ్ళారు..:)
ఓ హెన్రీ పరిచయం చక్కగా ఉంది
ఎంత బాగా చూపించారండీ.. ధన్యవాదాలు...
Vah .. kallaku kattesinattu chala baga document chesaru.
చాలాబావుంది.
కనెక్టికట్ లొ రెండేళ్ళున్నా, మార్క్ ట్వైన్ ఒకప్పుడు నివసించిన ఇంటికి జస్ట్ పదహారు మైళ్ళ దూరంలో. ఒకసారి వెళ్దామనుకొని చివరి నిమిషంలో విరమించుకోవాల్సి వచ్చింది పని కారణంగా..ఆ తరువాత వెళ్దామన్న ఆసక్తి లేకపోయింది. ఇలాంటివి అనుకున్నప్పుడే చేసేయాలి, తాత్సారం చేయకుండా.
చదువుతున్నంతసేపూ రచయిత గురించే కాక మీ కుతూహలం, ఆనందం, సంభ్రమ దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది.
కళ్ళలో నీటి వూట! అంత మంచి కథలింకా చదవలేదే అన్న బాధో, చదవదం ఆ తర్వాత అంతగా అబీమానించిన రచయిత వస్తువులని స్పర్శించే అవకాశం మీకు కలిగినందులకు అసూయో.. లేక అన్నీనో...
9వ తరగతిలో ఇంగ్లీషు టెక్ట్స్ బుక్ లో చదివిన రాన్ సమ్ ఆఫ్ రెడ్ చీఫ్ కథను గుర్తుకు తెస్తోంది.
Post a Comment