March 28, 2008

నేను-నా పుస్తకాలూ!

మంచి పుస్తకం మంచి స్నేహితుడు/రాలు వంటిది అవునో కాదో కానీ, నాకు మాత్రం ఆకలి తీర్చే రుచికరమైన భోజనం లాగానో, దాహం తీర్చే మంచి నీళ్లలాగానో కనపడుతుంది.కాకపోతే, ఎవరికైనా భోజనం చేయగానే, ఆకలి, నీళ్ళు తాగగానే దాహం తీరతాయి. నాకలా కాదు! ఒక పుస్తకం చదవగానే, ఇంకో పుస్తకం వెంటనే కావాలి! బహుశా ఈ అలవాటు అమ్మ నుంచి వచ్చి ఉండాలి. నా చిన్నప్పుడు, కిరాణా కొట్టు వాడు సరుకులు పంపగానే, మా అమ్మ మహోత్సాహాంతో పొంగిపోతూ వాటిని డబ్బాల్లో సర్దే పని పెట్టుకునేది. ఆ సర్దడం గట్టిగా అయితే, అరగంటలో పూర్తయిపోవాలి. కానీ, ఆవిడకి రెండు గంటలకు పైనే పట్టేది. ప్రతి పొట్లాని విప్పి అందులోని పంచదారనో, ఉప్మా రవ్వనో డబ్బాలో పోశాక, ఆ పొట్లం తాలూకు పేపర్ మొత్తం చదవాలి. పది నిమిషాలు! మళ్ళీ ఇంకో పొట్లం విప్పడం! పుస్తకాలు వదలకుండా చదివే వ్యాపకం (నా విషయంలో అది వ్యసనమే అనిపిస్తుంది) అలా పట్టుకుంది. సెలవుల్లో, మా మామయ్య వాళ్ళింటి నుంచి, తాతయ్య వాళ్ళింటినుంచి 1970, 71 నాటి చందమామలు పదేసి, పదిహేనేసి ఒక్కో వాల్యూంగా కుట్టిన బైండింగ్స్ తెచ్చుకుని, అన్నం కూడా మానేసి చదివేయ్యడం! "అన్నం" అని ఇంట్లోంచి కేకలు వినపడితే, "కలిపివ్వు" అని అదే లెవెల్లో ఇంకో కేక పెట్టేసి, మళ్ళీ 'మాయా సరోవరం'లో జయశీలుడి మీద పడిపోవడం!
హైస్కూలుకి వచ్చాక, మా నరసరావు పేట గర్ల్స్ హై స్కూల్లో, ప్రతి పోటీలోనూ, బహుమతులుగా పుస్తకాలు ఇచ్చేవారు. మా తెలుగు టీచర్ మావుళ్ళమ్మ గారు (పుస్తకాలు కొనడానికి ఆవిడే వెళ్ళే వారు) ముందుగానే, 'ఈ సారి వ్యాస రచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ 'రామాయణ విష వ్రుక్షం'. అని ముందుగానే వూరించేవారు. దాంతో, టాపిక్ ఎంత 'ఠఫ్' గా ఉన్నా, పుస్తకం సంపాదించాలని కష్టపడి విషయ సేకరణ చేసేవాళ్ళం. ఇప్పుడు టీచర్లకు, పిల్లకు లేని బంధమేదో అప్పుడు ఉన్నదని నాకు అనిపిస్తుంది. అదేమిటో నేను వివరించలేను. కానీ మనసుకి తెలుస్తుంది.(ఇదేదో తమిళ డబ్బింగ్ డైలాగ్ లా లేదూ!)
స్కూల్లోనూ, కాలేజీలోనూ కాక, బయట కూడా,ప్రతి సాంస్క్రుతిక సంఘం నిర్వహించే పోటీలకూ నేనూ, నా స్నేహితురాలు నగరాజ కుమారి కట్ట కట్టుకుని వెళ్ళి పోయే వాళ్ళం.
కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్ మురళీధర శర్మ గారు కేవలం పాఠాలే కాక, 'ప్రపంచ సాహిత్యమంతా ఇంగ్లీష్లోనే ఉంది చాలా వరకు. అవి కూడా చదవాలీఅని లైబ్రరీలో ఉండే ముసలి క్లర్క్ మమ్మల్ని విసుక్కోకుండా పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు చేసారు. దాంతో ఇహ చూస్కోండి..రెచ్చిపోయామనుకోండి.
ఇరవయ్యేళ్ళనాడు, ఏడో తరగతిలో డిబేట్లో బహుమతిగా సంపాదించిన పుస్తకం చూసుకుంటుంటే కలిగే మానసికానందం, కోటి రూపాయలు ముందుంచినా కలగదు. ఈరోజుకీ, ప్రతినెలా పుస్తకాలు కొనకపోతే ఏమీ తోచదు.ఎక్కడికెళ్ళీనా నా షాపింగ్ అదే! షాపుల్లోనే కాదు,ఫుట్ పాత్ మీద కూడా! ఫుట్ పాత్ మీద దొరికే పాత తెలుగు పుస్తకాలు అరుదైనవి. ఇంగ్లీష్ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయి. కానీ, తెలుగువి అలా కాదు.
ఫ్లాట్ కొన్నప్పుడు నేను చేయించుకున్న బుక్ షెల్ఫ్ సరిపోక, ఇంకోటి కొనాల్సి వచ్చింది.
పుస్తకాల షెల్ఫ్ లేని ఇల్లు నాకు ఇల్లులాగానే కనపడదు. షెల్ఫ్ కాకపోతే, కట్టలు కట్ట్లుగా పేర్చినవైనా సరే, పుస్తకాలు లేని ఇల్లు ఇల్లే కాదు.
ఏమంటారు?

13 comments:

Naga said...

పుస్తకాలు లేని ఇల్లు ఇల్లే కాదు! చాలా బాగా చెప్పారు. చిన్నప్పుడు నాకు కూడా చందమామ, బాలజ్యోతులు కనిపిస్తే పట్టలేని ఆనందం కలిగేది, చదవడం అయిపొయ్యేంత వరకూ ప్రపంచం గుర్తొచ్చేది కాదు.

సుజాత వేల్పూరి said...

నాగరాజా గారు,

నా బ్లాగ్ మొదటి పాఠకులు మీరే! ధన్యవాదాలు!

Anonymous said...

అవునండి. నాకు కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను కూడా చందమామ, బాలజ్యోతిల ప్రేమి(పాఠ)కురాలినే. కానీ ఒకప్పటిలా చదవలేకపోతున్నాను. కానీ మీ లాంటి వాళ్ళ ద్వారా మీరు చదివిన మంచి పుస్తకాలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. మేము తెలుగుపీపుల్ సభ్యులందరం తరచుగా కలిసి సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. వరుస సమావేశాలు, కార్యక్రమాలతో ఇప్పుడు కుదరడం లేదు. మీకు సౌమ్యని పరిచయం చేయాల్సిందే. ఆమె ఓ పుస్తకాల పురుగు.

పుస్తక ప్రేమికుల సంఘం ఒకటి స్థాపించి తరచు కలిసినా బాగానే ఉంటుందండి. మేము అప్పట్లో ప్రతి నెల చివరి ఆదివారం కలవాలని ప్రణాళిక వేసుకున్నాము. కుదరలేదు. మీరు ముందుకొస్తే ఏప్రెల్ నెల నుంచి మొదలెడదాము, చివరి ఆదివారపు సాహిత్య సమావేశాలు.

మాలతి said...

సుజాతా, మీరు పుస్తకాలగురించి నాకు చెప్పేరోజులు గుర్తొచ్చాయి మళ్లీ. మీనిద్రకథ కోసం నేను లైబ్రరీలో రెండుగంటలసేపు ఇప్పటికీ గుర్తుంది.
మంచి బ్లాగు మొదలెట్టారు. శుభం.
మాలతి

S said...

:) మీ కామెంటు చూసి... తర్వాత..మాలతి గారు చెప్పడం... ప్రశాంతి నా గురించి రాయడం... అన్నీ అయ్యాక చూసాను ఈ బ్లాగుని!! Keep posting regularly! We are sailing on the same boat! :)

రానారె said...

పొట్లాలుగా ఇంటికొచ్చిన కాగితంలో ఏమున్నాసరే మొత్తం చదివే వ్యసనం మా అమ్మకూ వుంది. కానీ పుస్తకాలు చదవడం నాకు అలవడలేదు. మీరు అదృష్టవంతులు. ఎక్కువగా చదివేవాళ్లు యేమి మాట్లాడినా వినొచ్చు, యేమి రాసినా చదవొచ్చు అని నాకనిపిస్తుంది.

సుజాత వేల్పూరి said...

ప్రశాంతి గారు,

మీ ఆలోచన చాలా బాగుంది. తప్పక అలా చేయచ్చు. మేము ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. జూన్ లో హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నాం లెండి. అక్కడికి వచ్చాక, చివరి ఆదివారం కాదు, ఏ ఆదివారమైనా రెడీ! పుస్తకాలు చదివే వాళ్ళతో ఆలోచనలు పంచుకోవడం నాకూ ఎంతో ఇష్టమైన విషయం. పుస్తకాలు మార్పిడి తరచూ చేసుకుంటే, తిరిగి ఇవ్వడానికైనా మనం కలుసుకోక తప్పదు.

సుజాత వేల్పూరి said...

మాలతి గారు,

అవును, నాకూ గుర్తుంది. ' ఆ కథ ఉన్న నాలుగు పేజీలూ ఎవరో చింపుకు పోయారు. కథ అంత బాగుండ బట్టే ఆ పని చేసారు. సో, ఇంక ఆ కథ నేను చదివి, అభిప్రాయం చెప్పక్కర్లేదు ' అని మీరు రాసిన వాక్యాలు కూడా గుర్తున్నాయి. అది నాకు పొగడ్త కాబట్టి, నాకు గుర్తుండటం సహజం. మీక్కూడా గుర్తుందంటే, .....కథ పేరుతో సహా ..నిజంగా గొప్పే! వీలు చూసుకుని, ఈ బ్లాగులో పెడదామనుకుంటున్నా ఆ కథని!

సుజాత వేల్పూరి said...

సౌమ్య గారు,

నా దగ్గరున్న మంచి పుస్తకాలని పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. బ్లాగుని ప్రారంభించిన ఉద్దేశం కూడా అదే! మీ లాంటి మంచి మిత్రులుంటే, మరిన్ని మంచి పుస్తకాలు చదవడానికి కూడా వీలవుతుంది. మీ పడవలో చోటిచ్చినందుకు ధన్యవాదాలు.

రానారె గారు,

మీ టపాలు చూస్తూ ఉంటాను నేను రెగ్యులర్ గా! సో, పుస్తకాలు చదివే అలవాటు లేకపోయినా, బాగా రాయొచ్చన్నమాట. పుస్తకాలు చదవాలంటే, కేవలం అభిరుచి మాత్రమే కాదు, గంటల తరబడి టైం కూడా కావాలి కదండీ! బహుశా మీరు బిజీ అయ్యుండాలి.

Sujata M said...

సుజాత గారూ..

ఈ పోస్ట్ ఇప్పుడే చదివా.. మార్వెలస్. పుస్తకాలు లేని ఇల్లు .. నాకూ నచ్చదు. 'పాపం' అనిపిస్తుంది వాళ్ళను చూస్తే. పెళ్లి అయాకా.. నా టేస్ట్ కు ఆదరణ తగ్గిపోయింది. హైదరాబాదు లో కోఠీ అదీ మాకు చాలా దూరం. పుస్తకాలు కొనడం తగ్గింది. ఆఫీసు లైబ్రరీ పర్లేదు. కానీ తెలుగు పుస్తకాలు చాలా తక్కువ. మా ఆయన వైపు చుట్టాల్లో ఒకావిడ మాత్రం పుస్తకాలు చదువుతారు. పాపం వేరే రాష్ట్రం లో ఉన్నా.. ఎవరన్నా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు పాత విపుల, చతురలు ఇచ్చినా చాలా ఆనందిస్తారు. ఆవిడ అంటే నాకు ఇష్టం. మా అత్తగారు ఆవిడ కోసం స్వాతి, గృహశోభ లాంటి మాగజీన్ల పాత కాపీలు, ఏవైనా మంచివి, చదవ గలిగినవీ ఉంటే అవీ.. పంపిస్తూ ఉంటారు. మా అత్త గారు లైట్ గా స్వాతి లాంటి మాగజీన్లు మాత్రం చదువుతారు.

ఈ బ్లాగుల పుణ్యమా అని, మంచి మంచి పుస్తకాల గురించి తెలుస్తూంది. నేనూ చదువుతాను కాని ఏది కొనుక్కుని చదవోచ్చో.. తెలీదు. నాకు తెలిసిన రచయితల పుస్తకాలే కొంటాను. కాబట్టి పరిధి చిన్నది అయిపొయింది. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు.. ఫలానా పుస్తకాలు బావున్నాయి అని తెలుస్తుంది. కానీ ఆ కలవటం.. తగ్గిపోయింది. హైదరాబాదు వచ్చాకా.. మీ సలహాలు తీసుకుంటాను.

రానారె అంతగా చదవరు అంటే ఆశ్చర్యం కలిగింది. ఆయన కధలలో బోల్డంత జీవితం చదవొచ్చు. ఈయనకి తెలుగు మీద ఎంత పట్టు ఉందొ కదా.. పద్యాలూ అవీ... చదవడం కూడా నాకు రాదు. 'నాకు అంత తెలుగు రాదు' అని సిగ్గు కలుగుతుంది. మీరు పొద్దు లో తెలుగు క్రాస్ వర్డ్ పూర్తి చేస్తారు కదా.. మీకు బోల్డు అభినందనలు. ఇలాంటివి చెయ్యాలంటే.. లోక జ్ఞానం, పుస్తక పరిజ్ఞానం అవసరం. ఎంతైనా మీరు సూపర్ డూపర్!

Articles said...

avunandi chaala baaga chepparu books leni illu ille kadu

rajesh

sivaprasad said...

@sujatha garu
meedi narasaraopet.maadi kuda narasaraopet darrara oka village
nice to see here.

mi post ippude chusanu. chala baga rasaru andi. nenu kuda pusthakala purugu ni. anni books clg books and , weekly books inka kanisam roju 3,4 papers chadavakunda nidraponu . naku kuda chinnappudu zphs school quiz lo vachhina gandiji autobiography inka naa daggara undi.

ధాత్రి said...

నిజమంటాను..:)

Post a Comment