April 1, 2008

వెన్నెల

ఈ మధ్య అందరూ వేసవి సెలవుల గురించి, వెన్నెల గురించి రాస్తుంటే, నాకూ రాయాలనిపించింది. వెన్నెల ఎవరికి నచ్చదూ? వెన్నెల అమ్మ లాంటిది. "అమ్మ ఎవరికైనా అమ్మే" లాగా వెన్నెల ఎవరికైనా అభిమాన విషయమే!

మామూలు రోజుల్లో వెన్నెలకీ, వేసవి సెలవుల వెన్నెలకీ తేడా ఉంటుంది. ఆరుబయట వెన్నెల్లో డిన్నర్లు , వెన్నెలా-నీడా ఆటలు( దొంగ అయిన వాళ్ళు వెన్నెల్లో ఉన్నవాళ్లని పట్టుకునే లోగా వాళ్ళు ఏ చెట్ల నీడల్లోకో తప్పుకోవాలి)ఆలిండియా రేడియో వాళ్ళ నాటకోత్సవాల తాలూకూ నాటకాలు, ఆ తర్వాత వివిధ భారతిలో ఛాయా గీత్ వినడం (నా చిన్నప్పుడు ఛాయా గీత్ కి వచ్చే అనౌన్సర్లకి మంచి టేస్ట్ ఉండేది. వెన్నెల రోజుల్లో తప్పని సరిగా వారానికి రెండు సార్లన్నా ' బహారో ఫూల్ బరసావో " పాట వేసేవాళ్ళు.), వెన్నెల్లో పెద్ద పువ్వు లాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడ ను గమనించడం, కొబ్బరాకుల టప టపలు...ఇవన్నీ చాలా మందికి అనుభవైకవేద్యాలే!
ఈ మధ్య బెంగుళూరు నుండి, సకలేష్ పూర్ లోని స్నేహితుల ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ, ఒక అడవి లాంటి (లాంటి ఏమిటి..అడవే) చోట కొద్ది సేపు ఆగాము. రోడ్డుకి కొంచెం దూరంగా ఒక ఏనుగు పిల్ల చెట్టు ఆకులు అందుకుంటుండగా, రెండు కుందేళ్ళు ఎంచక్కా ఎవరి భయమూ లేక హాయిగా ఆడుకుంటుంటే అనిపించింది....అడవి గాచిన వెన్నెల వ్రుధా కాదు....సిటీ గాచిన వెన్నెలే పరమ వేస్టు అని.నిశ్శబ్దంగా గమనించి నిష్క్రమించాము. టివి సీరియల్స్ పుణ్యమా అని టౌనుల్లో , పల్లెల్లో కూడా వెన్నెల్ని ప్రేమించే మనుషులు తగ్గిపోతున్నారు.
మనసుకి మాటలు లేకుండా చేసే మనోహరమైన వెన్నెల్ని ఒకసారి అమరావతిలో క్రిష్ణా నది మీద చూశాను. ఈ మాట మా శ్రీవారితో చెప్పానే అనుకోండి.." ఏమిటీ, మా పాపి కొండల దగ్గర గోదావరి మీద వెన్నెల కంటేనా..! అసలు వెన్నెల్లో గోదావరిని తప్ప ఇక ఏ నదినీ, చెరువునీ, కాలవనీ కూడా చూడ్డానికి వీల్లేదు " అని అడ్డంగా వాదిస్తారు. (వాళ్ళది వెస్ట్ గోదావరి లెండి) పైగా, "అసలు పసలపూడి కథల్లో గోదావరిని వంశీ వర్ణించినట్టు, మీ క్రిష్ణా నదిని ఎవరైనా ఎప్పుడైనా వర్ణించారా.. " అని సవాల్ చేస్తారు. "నాయనా! ఆ పని మనిద్దరం పుట్టకముందే శంకరమంచి సత్యం అనే ఒక పెద్దాయన చెశారు! చదువుడు..అమరావతి కథలు " అని తనకి డవిలాగుల్లేకుండా చేస్తాను.
ఆ మధ్య సెలవుల్లో మా వూరికి వెళ్ళినపుడు , వెన్నెల్లో కూచుందామని బయటికి వస్తే చుట్టు పక్కల డాబాల మీద గాని, వాకిళ్ళలో గాని ఒక్క పురుగు లేదు. ఎవ్వరికీ వెన్నెల అక్కర్లేదు...! ఏక్తా కపూర్ ' కళ్యాణి ' సీరియలే కావాలి.కాసేపు నాతోపాటు (బలవంతంగా అనుకుంటా) కూచున్న మా అమ్మ కూడా ఎనిమిదిన్నర కాగానే లేచి, 'రేపు కూచుందాంలే వెన్నెల్లో! చక్రవాకం చూడవూ....'అని కళ్లజోడు వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది. పైగా, ఇదివరలో లాగా వెన్నెలకి కాంబినేషన్ గా చల్లగాలి లేదు ఇప్పుడు. పీల్చి పిప్పి చేసే రాక్షస దోమలు, ఉక్క!
ఇక సిటీ సంగతి చెప్పేదేముంది! కనీసం కరెంటు పోయినప్పుడన్నా పది నిమిషాలు ఆరు బయట వెన్నెల నీడలు చూద్దామంటే, కరెంటు పోయిన ఆరున్నరో సెకనులో జెనరేటర్ చప్పుడు మొదలవుతుంది.
సో , మంచి నిఖార్సయిన, కల్తీ లేని వెన్నెల చూడాలంటే, నిజంగానే ఏదన్నా (క్రూర జంతువులు లేని)అడవికి పోవాల్సిందే!

13 comments:

నిషిగంధ said...

ఏం పాట గుర్తుచేశారండీ! చిన్నప్పుడు ఇలాంటి రాత్రుల్లోనే అందరం డాబా మీద చేరి గొడవ చేస్తుంటే మా శ్రీనన్నయ్య మాత్రం 'బహారో ఫూల్ బరసావో ' అని మూడిళ్ళ అవతల డాబా మీద చదువుకుంటున్న డాక్టర్ గారి అమ్మాయికి సందేశాలు పంపేవాడు! ఆ అమ్మాయి మెడికో అనుకుంటా, ఇంత పెద్ద పుస్తకం పట్టుకుని అలా వెన్నెల వెలుతుర్లోనే అటూ ఇటూ తిరుగుతూ తెగ చదివేసేది! మంచిపిల్ల పాపం!!

ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి కూడా 'వెన్నెల్లో గోదారి అసలు వర్ణించలేనంత అందంగా ఉంటుంది ' అనేది.. నేను ఉక్రోషంగా 'వెన్నెల్లో గోదారే కాదు ఏ దారైనా అందంగానే ఉంటుంది ' అనేదాన్ని!

S said...

:)) @Nishigandha's comment!
:)) @Your narration too!

RG said...

మా గోదావరివాళ్ళదగ్గర ఇంకే నదిని పొగిడినా ఒప్పుకోంలెండి :)

"అడవి గాచిన వెన్నెల వృధా కాదు....సిటీ గాచిన వెన్నెలే పరమ వేస్టు"

నిఝంగా నిజం :)

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు
మీ ఆయన గారికి నా అభినందనలు... ఇక్కడ ఇంకో గోదారోడు... :-) మీ కృష్ణాలో అన్ని రోజులు నీళ్ళుండవు వెన్నెల్లో అందాన్ని చూడటానికి... అదే మా కిన్నెరసాని ఎప్పుడు వెన్నెల పైటేసుకునే ఉంటుంది... :-)


@ నిషిగంధ గారు
లాభం లేదండి... మీకు ఒకసారి గోదారి చూపించాల్సిందే... :-) మీకు ఇష్టమైన శరదృతువులో గోదారి ఇసుక తెన్నెల మీద కుర్చోపెట్టాలి...

సుజాత వేల్పూరి said...

దీపు,

ఎంత గర్వమండీ మీ గోదావరి వాళ్ళకి!(మా ఆయనతో కలిపే అంటున్నా)అవునూ, కిన్నెరసాని అంటే పెన్నా నది కదా! మీరు గోదావరికి ముద్దుగా పెట్టేసుకున్నారా ! మా ఆయన ఇంకోటి కూడా అంటారు...'మీ గొదావరి నీళ్ళు ఎర్రగా, మురిగ్గా ఉంటాయి! మా క్రిష్ణలో నల్లపూస పడేసినా తీయొచ్చు ' అని నేనంటే, కూల్ గా, 'అవును, సారవంతం కదా! అందుకే, ఎర్రగా ఉంటాయి! క్రిష్ణా నీళ్ళలో ఏముంది రాళ్ళు తప్ప ' అని.

నిజం ఒప్పుకోవాలండి, గోదావరి అందం నేను మాటల్లో వర్నించలేను. పాపికొండల దగ్గర, గుండె గొంతుకలో కొట్లాడటమంటే ఏమిటో తెల్సింది.

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు
కిన్నెరసాని ఖమ్మం జిల్లాలో గోదావరిలో కలిసే పాయ.. చిన్నప్పుడు కిన్నెరసాని అంటే ఎంటంటే పాపికొండలకి ముందు గోదావరిని కిన్నెరసాని అంటారు అని ఎవరో చెప్పారు... అందుకే నా "గౌతమీ తీరాన" రచనలో అలా రాసాను... పెద్దయ్యాక గోదావరికే కిన్నెరసాని అని వాడడం గమనించాను...

అవునాండి.. సారవంతమనే కాదు.. మీరు వర్షాకాలంలో చూసుంటారు... అనేక ఉపనదులు నిత్యం గోదావరిలో కలుస్తుండడం వల్ల అది అల ఉంటుంది...

మీ వారైతే "కృష్ణా నీళ్ళల్లో ఏముంది రాళ్ళు తప్ప?" అన్నారు... నేనైతే కూల్గా కృష్ణ నదిలో నీళ్ళెప్పుడున్నాయి రాళ్ళు తప్ప అనేవాణ్ణి!! :) సరదాగా తీసుకోండి... కృష్ణ నాకు తెనాలి దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర నచ్చుతుంది... ఎప్పుడూ చూసే విజయవాడ కృష్ణ ని మా రాజమండ్రి గోదావరి తో పోల్చితే చిన్నబోయినట్టుంటుంది..

సుజాత వేల్పూరి said...

అందుకేగా అక్కడ గోదావరిని అఖండగోదావరి అంటారు. నాకు ఏ నదివైనా రిజర్వాయర్లు అందంగా కనిపించవు అది నాగార్జున సాగరైనా సరే! ప్రవహించే నీళ్లను బంధించి... చూడమంటే ఏముంటుంది చూడ్డానికి? పోలవరం వచ్చినా అంతే కదా అని నా బాధ!

ఈ మధ్య vacation తీసుకుని కావేరి నదీ తీర ప్రాంతాలన్నీ తిరిగేశాము. కావేరి చా.....లా అందమైన నది.ఒకటే పరుగులు! ముఖ్యంగా తలకాడు, శివసముద్రం వద్ద వర్ణించలేం కావేరి అందాలు.

వర్షాకాలం లో ఒక్కసారి వీలు చేసుకుని అమరావతి వెళ్లి రండి.అదిరి పోతారు మరి!

Rajendra Devarapalli said...

కొన్నాళ్ల క్రితం,నేనూ నాకజిన్ చిన్న పని మీద బీచ్ రోడ్ లో భీమిలి వెళుతున్నాం,ఆటోలో,వాడి కారు రిపేరు మూలంగా.సాయంత్రమౌతుంది,మెల్లగా జోడుగుళ్ళపాలెం,ఋషికొండ దాటాం,ఐయన్ యస్ కళింగ దాటుతుండగా మా వాడికి సిగరెట్ కాల్చాలనిపించి ఆటొ దిగాం.పలచగా వెన్నెల పరుచుకుంటూ,అప్పటి దాకా ఎండకు మరిగి,నీరసించిపోయిన కెరటాలకు స్వాంతన చేకూరుస్తూ,సగం చిక్కి పోయిన సరివి చెట్లకు కూడా ఒక మిస్టిక్ బ్యూటీనిస్తూ,చల్లని గాలి తెరలను కమిలిన లోకపుపొరలమీద కప్పుతూ,ఎన్నాళ్ళయ్యిందిరా ఇలా నేలమీద నిలబడి,నింపాదిగా నన్ను చూసి అని నిలదీస్తున్నట్లనిపించి ...అలా అప్రయత్నంగా రెండు చేతులెత్తి దండం పెట్టా .ఎన్ని జన్మలెత్తితే చంద్రుడిదీ,వెన్నెలదీ ఋణం తీర్చుకోగలమంటారు?

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు

నేను పొరబాటున తెనాలి అని రాసాను... అమరావతే నా ఆలోచనల్లో ఉంది రాసేప్పుడు... చూసింది కూడా వర్షాకాలంలోనే...

ఇక పోలవరంలో అయితే వాళ్ళ వల్ల కాదులేండి...

మధురవాణి said...

మా గోదావరివాళ్ళదగ్గర ఇంకే నదిని పొగిడినా ఒప్పుకోంలెండి :)
నాదీ ఇదే డైలాగ్ ;)

అన్నట్టు సుజాత గారూ..
మీకో వివరణ కిన్నెరసాని గురించి. కిన్నెరసాని ఒక చిన్న ఉపనది లాంటిది. గోదావరిలో కలుస్తుంది.
మా నాన్న వాళ్ళ ఊరు కిన్నెరసాని ఒడ్డునే ఉంటుంది. ఇప్పటికీ కిన్నేరసానిలో నడిచే వెళ్ళాలి. ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు.
ఆ కిన్నెరసాని ఒడ్డునే మా పొలం ఉంటుంది. అందులో ఒక ఇరవై మామిడి చెట్లున్నాయి. మా చిన్నప్పుడు మా అమ్మ, నాన్న చిన్న మామిడి మొక్కలు నాటి కింద ఉన్న కిన్నెరసాని నుంచీ నీళ్ళు పైకి (ఎత్తుగా ఉంటుంది) తీస్కెళ్ళి పోసి పెంచారట. మా చిన్నప్పుడు కిన్నెరసానిలో నీళ్ళు ఎంత తేటగా ఉండేవంటే.. మినెరల్ వాటర్ కూడా పనికిరాదు. ఆ ఊర్లో వాళ్లందరూ ఆ నీళ్ళే ఫిల్టరు లేకుండా తాగుతారు. నీళ్ళల్లోని బుల్లి చేపలు, అడుగున ఉన్న రాళ్ళు గవ్వలు భలేగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం పక్కనున్న థర్మల్ పవర్ స్టేషన్ వదిలిన బూడిద కలిసి నల్లగా అయిపోయాయి.
కిన్నెరసాని డ్యాం చాలా పేరొందిన పర్యాటక ప్రదేశం ఆ ఏరియా లో.. చిన్నప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళాను.
మొత్తానికి మా ఊరు కదా అని మిమ్మల్ని ఊదరగొట్టేసినట్టున్నా కదా హ్హి హ్హి హీ :)

Unknown said...

అబ్బ ఎన్ని జ్ఞాపకాలు!
నాకూ అందరిని గుర్తుకు తెచ్చారు.
ప్రాథమిక పాఠశాలలో నాతో చదివినవారందరూ నాకు ఇప్పటికీ గుర్తే. నాకు ఇప్పుడు 51 ఏళ్లు.

-నాగార్జున

no said...

mee * ma intayana katha*nu 17.3.13 adivaram andhrajyothi sanchikalo sankhsipthanga prachuristhunnam.
-editor, andhrajyothi

సుజాత వేల్పూరి said...

Editor garu, Andhra jyothy

Ok. Thank you

Post a Comment