బుర్రకి పదును పెట్టే, తెలుగు వాళ్ళు మాత్రమే విప్ప గలిగిన పజిల్ ఇది. నేను చెప్ప బోయే కథలోనే, పజిల్ దాగి ఉంది. చాలా ఈజీ! ముందే చెప్పేస్తున్నా, ఇది నా సొంతం కాదు. చిన్నప్పుడు బాలజ్యోతి పిల్లల మాస పత్రికలో, శ్రీ అవసరాల రామ క్రిష్ణారావు గారు 'మేథ మే ట్రిక్స్ ' అనే శీర్షిక నిర్వహించే వారు. ఈ మధ్య స్నేహితుల ఇంట్లో, పాత బాల జ్యోతిలో ఈ పజిల్ చూసాను. అప్పట్లో ఈ పజిల్ ఎంతో కష్టపడి, కనుక్కుని నేనూ పంపాను. కాని, మన బుర్రకి కొంచెం పదును తక్కువ కదా, నేను పంపేసరికి, గడువు టైం కాస్తా అయిపోయింది. సరదాగా అందరితో పంచుకుంటే బాగుంటుందనిపించి ఇక్కడ ఇస్తున్నాను. ముందే చెప్పాను...ఇది తెలుగు వాళ్ళు మాత్రమే కనుక్కో గలిగే పజిల్. ఇక కథలోకి పదండి.
రామా రావు, సుబ్బారావు చిన్ననాటి నుంచి స్నేహితులు. కాలేజీ చదువయ్యాక రామారావు ముంబాయి వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టి సెటిల్ అయ్యాడు. సుబ్బా రావు ఉన్న వూళ్ళోనే మంచి ఉగ్యోగంలో స్థిరపడ్డాడు. దూరంగా ఉన్నా ఇద్దరూ ఉత్తరాల ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సుబ్బారావు కొడుకు అవినాష్ చదువయ్యాక, వ్యాపారం చేస్తానంటే, సుబ్బారావు వద్దన్నాడు. ఇంకా పై చదువులు చదివి ఉద్యోగంలో చేరమన్నా డు. దానితో ఇద్దరికీ మాటా మాట పెరిగి అవినాష్ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.సుబ్బారావు ఎక్కడా వెతికినా ప్రయోజనం లేక పోయింది. స్నేహితుడు రామా రావుకి ఉత్తరం రాస్తూ(అప్పట్లో ఇన్ని ఫోన్లు లేవు), కొడుకు గురించి చెప్పుకుని బాధ పడ్డాడు.
ఇలా ఉండగా, రామా రావు దగ్గరికి ఒక కుర్రాడు కష్టాల్లో ఉన్నాననీ, ఉద్యోగం కావాలని వచ్చాడు. ఏం చదివావంటే, పెద్ద చదువే గానీ, సర్టిఫికెట్లు ఇప్పుడు లేవన్నాడు ఆ కుర్రాడు. పేరేమో అవినాష్ అన్నాడు. ఏ వూరంటే, బీహార్ నుంచి వచ్చాను, మాత్రుభాష హింది అన్నాడు . సరే,ఏవో పరీక్షలు పెట్టి, ప్రస్తుతానికి తన పర్సనల్ స్టెనోగా ఉండమన్నా డు.
మరో వారం గడిచాక, సుబ్బారావు రామారావుకి మరో ఉత్తరం రాస్తూ, " మా అవినాష్ నీ దగ్గరకు గానీ వస్తాడేమో, ఒక వేళ వస్తే వాడిని ఏమీ ప్రశ్నించకురా! వాడికి ఆత్మాభిమానం ఎక్కువ. వాడు అక్కడ ఉన్నట్టు నాకు రాయి. నేనొచ్చి నచ్చ జెప్పుకుంటాను" అని రాసాడు.
సుబ్బారావు కొడుకు పేరు అవినాష్ అని గురుతు రానందుకు తిట్టుకున్నాడు రామారావు. కాకపోతే, ఇప్పుడు తన ఆఫీస్ లో ఉన్న అవినాష్ సుబ్బారావు కొడుకా కాదా ఎలా కనుక్కోవాలి? నువ్వు సుబ్బారావు కొడుకువా అని అడగడానికి లేదు. బీహార్ నుంచి వచ్చానన్నాడు. చక్కగా హిందీ మాట్లాడుతున్నాడు.తన ఆఫీస్ లో ఉన్న తెలుగు వాళ్ళతో కూడా తెలుగు మాట్లాడుతున్నట్టు వినలేదు. ఒక రోజంతా ఆలోచించాడు. చివరకో ఆలోచన తట్టింది. అవినాష్ ని పిలిచి ఒక లెటర్ టైప్ చెయ్యమన్నాడు. తమ ఆఫీస్ బ్రాంచ్ లు ఆంధ్రాలోని కడప, రాజమండ్రి లలో ఉన్నాయనీ, ఏవో స్టేట్మెంట్లు పంపమని ఆ బ్రాంచ్ ల చిరునామాలు చెప్పి లెటర్లు డిక్టేట్ చేసాడు.
పది నిమిషాల్లో, అవినాష్ లెటర్లు టైప్ చేసి తెచ్చాడు. వాటిని చూసిన రామారావు, అవినాష్ వెళ్ళగానే, నవ్వుకుంటూ ' నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరు" అని సుబ్బారావు కి ఉత్తరం రాసాడు.
అవినాషే సుబ్బారావు కొడుకని, రామారావు ఎలా కనుక్కున్నాడో ఊహించండి. గడువేమీ లేదు. రెండు మూడు రోజుల్లో కనుక్కోగలరనుకుంటాను.
శ్రీ అవసరాల రామ క్రిష్ణారావు గారికి క్రు క్ష త మా జ్ఞ ప త ణ ల తో!
8 comments:
బాగుందండి పజిల్. సాధించడానికి కృషి చేస్తా..
కడప అనగానే Cuddapah అని, రాజమండ్రి అనగానే Rajahmundry అని టైపు చెయ్యగలిగేది ఆ స్పెల్లింగులు మన నెత్తిన రుద్దిన బ్రిటీషు వాడైనా అయుండాలి, లేదా మనలాంటి ఒక తెలుగువాడైనా అయుండాలి. అంతేనా సుజాత గారూ? :)
sugatri garu cheppinde nenu chepdamanukunnanu..
నేను ఏమీ చెప్దామనుకోలేదు, కానీ ఈ ప్రయోగం మాత్రం అదిరింది: "క్రు క్ష త మా జ్ఞ ప త ణ ల తో!" హ హ్హ హ్హ!!
ఆంద్రాలోని కడప, రాజమండ్రి అనగానే అవినాష్ కడప ఆంధ్రా కాదు రాయలసీమ అని అనుంటాడు. ఈ జవాబుతో అతను బీహార్ అని అబధ్దం చెప్పాడు అని తెలుస్తుంది.
అప్పట్లో నేనూ చదివేను. అ.రా.కృ.రావుగారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందుంటుందో కూడా మా ఇంట్లో చర్చించుకున్నాం. దూరదర్శన్ లో ఆంగ్ల వార్తలు చదివేవారు, ఒకరిద్దరు మినహాయించి, ఇంచుమించు అందరూ, ఈ రెండు పేర్లనీ (కడప, రాజమండ్రీ ను) తమ నోటితో చంపేస్తుండేవారు. ఈ మధ్య కడపకి ఇంగ్లీషు స్పెల్లింగు సవరించేరని చదివేను. తెలుగు వారు కాక ఈ సొగసులు మరెవరు ఎరుగగలరు?
సుగాత్రి గారు,
టపా ప్రచురితం అయిన గంట లోపే మీరు కనుక్కున్నారు. అభినందనలు. చేతన గారు, మీక్కూడా! కొత్తపాళీ గారు, ధన్యవాదాలు!
విజ్జు గారు, మీ లాజిక్ కూడా బాగానే ఉంది గానీ, సరైన సమాధానం మాత్రం సుగాత్రి గారిదే!
చిన్నమయ్య గారు, అప్పట్లో ఆంగ్లమే కాదు, సరళా మహేశ్వరి, మంజరీ జోషి(అబ్బ, నాకు ఇంకా వాళ్ళ పేర్లు గుర్తున్నాయే!)మొదలైన హిందీ న్యూస్ రీడర్లు కూదా 'రాజహ్ ముండ్రి ' అని చదువుతుంటే(కడప ఇంకా అన్యాయంగా చదివే వాళ్ళు) చెవులు మూసుకోవలసి వచ్చేది. బాగా గుర్తు చేసారు.
నేను చిన్నప్పుడు ఇలాంటివి చదవనేలేదు :(
నేను కూడా సరైన సమాధానమే గెస్ చేసాను కథ చదవగానే ;)
Post a Comment