May 20, 2008

జరుక్ శాస్త్రి ఫొటో, పేరడీ!


పేరడీ సూరీడు, సాహితీ చంద్రుడు జలసూత్రం రుక్మిణీ శాస్త్రి గారి అరుదైన ఫోటో ఇది. నిన్న పుస్తకాలు సర్దుతుంటే తొంగిచూసిన పుస్తకాన్ని బయటికి లాగితే..అది కాస్తా జరుక్ శాస్త్రి గారు రాసిన ' తనలో తాను ' స్వగతాల సంపుటి అయి కూచుంది. ఈ ఫోటో అందులోదే!అప్పుడు కూడా ఒరిజినల్ ఫోటో దొరకలేదన్న మాట!ఇహ టైము వేస్టెందుకని, ఇరవయ్యేళ్ల నాడు ఒక సాహితీ క్విజ్ లో (ఎనిమిదో క్లాసులో అనుకుంటా) నాకు బహుమతిగా లభించిన ఈ పుస్తకాన్ని మొత్తం పూర్తి చేసాను.
నవోదయ వాళ్ళు ఈ పుస్తకం వేసారు. ఇప్పుడెళ్ళి అడిగి చూడండి(బడిచౌడి ఆర్య సమాజ్ ఎదురు సందులో ఉంటుంది నవోదయ వారి షాపు), ' ఏమో తెలియదండీ ' అనే సమాధానం వస్తుంది.
జరుక్ శాస్త్రి కేవలం పేరడీ కారుడు మాత్రమే కాదు. గొప్ప సాహితీ కర్త కూడా! " అసాధారణమైన ఉపజ్ఞతో , అచ్చమైఅన ప్రతిభతో కవితలు రాశాడు,ఎవరికీ 'ఇమిటేషన్ ' అనిపైంచని కథలు రాశాడు! " అని 'తనలో తాను ' పీఠికలో శ్రీ కె. వి. రమణా రెడ్డి గారు రాశారు.
ఎవరైనా ఒక అయిడియా అందిస్తే, వెంటనే ఒడుపు గ్రహించి చక్కని రచన చేసే వారట ఆయన. ఒక సారి చక్రపాణి గారు బెంగాలీ పత్రికల్లోంచి ఒక చక్కటి ఐడియా చెప్పారు.
"గొప్ప వాళ్ళు ప్రతి చచ్చు వ్యాపారనికీ సిఫార్సులివ్వడం"
వెంటనే రుక్మిణీ నాధుల వారు, ఆ ఐడియాను దించి, ఒక కూరల అంగడి వాడికి విశ్వనాధ సత్యనారాయణ, తల్లావఝల శివశంకర శాస్త్రి, మరొకరు యోగ్యతా పత్రాలిచ్చినట్టు బ్రహ్మాండ మైన వ్యాసం రాశారట.
ఇంత ప్రతిభ కలిగిన వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రేడియో ఆర్టిస్టుగా మిగిలి పోయాడని కొడవటిగంటి కుటుంబ రావు బాధపడ్డారు. "రేడియో ఆర్టిస్టుగా అతను రచన వెనక ఉండే సహజమైన ప్రేరణలను ఎండగట్టుకున్నాడు." అని రాశారు కొ.కు.
పేరడీ సామాన్యమైన విద్య కాదు. అదీ గాక, అయనా ఎదో ఒక రచన పట్టుకుని దానికి పేరడీ రాయడం కాక, అసంఖ్యాక రచయితల సారాన్ని గ్రహించి, వారి శైలిలోనే ఏదైనా పేరడీ చేయగలిగారు.
ఆయన పేరడీలు ఇప్పుడు ఎక్కడా అందుబాటులో లేవు. చాలా వాటి విలువ పోగొట్టుకున్నాకే తెలుస్తుంది. నా లక్కు, ఎక్కడా లేని, దొరకని ఈ పుస్తకం నా దగ్గరుండటం! ఆయన చమత్కారాల్లో ఒకటి...!
మల్ల వరపు విశ్వేశ్వర రావు గారి మధుకీల కావ్యానికి ముందు మాటలో దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఇలా రాశారు.
"విశ్వేశ్వర రావూ!
నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా,
నువ్వు కవివయ్యా--
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
విశ్వేశ్వర్రావు నిజంగా కవి"
ఈ పంక్తులు చదివాక, మన రుక్కాయి చేసిన పేరడీ చూడండీ..
"సుబ్బారావూ,
నువ్వింక క్షవరం చేయించుకోవాలయ్యా!
నీ తల మాసిందయ్యా!
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
సుబ్బారావు నిజంగా తలకు మాసిన వాడు"
నవ్వని వాడెవరు చెప్పండి?
జలసూత్రం అనే ఇంటి పేరు తమాషాగా ఉందండీ అని ఎవరినా అంటే,'H2O ఫార్ములా మా పూర్వీకులే కనిపెట్టా రండీ, అని నమ్మకంగా చెప్పి నవ్వించే వార్ట!
అసమాన ప్రతిభతో ప్రముఖ కవులను వ్యంగ్యంగా అనుకరిస్తూ పేరడీలు చెపుతుంటే, ' మీరీ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నారు ' అనడిగితే..
"మా నాన్న దగ్గర నేర్చుకున్నాను! మా నాన్న చూడండి, కృష్ణ శాస్త్రి పేరుని పేరడీ చేసి నాకు పేరు పెట్టాడు (కృష్ణ శాస్త్రి అన్నా, రుక్మిణీ నాధ శాస్త్రి అన్నా అర్థం ఒకటే కదా)" అనేవారట ఆయన.

NOTE: ఇందులో వాడిన పేరడీలు శ్రీరమణ గారి సంకలనం 'హాస్య జ్యోతి ' నుండి(సం)గ్రహించాను. వారికి కృక్షతమాజ్ఞపతణలు.

10 comments:

Sreenivas Paruchuri said...

హైదరాబాదులోని నవోదయా సంస్థ, మీరు ప్రస్తావించిన పుస్తక ప్రచురణకర్తైన విజయవాడ నవోదయ వారూ వేర్వేరు. హైదరాబాదు నవోదయ వారు మొన్నీమధ్యనే (ఇల్లాలి ముచాట్లు ద్వారా) ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టారు. విజయవాడ వాళ్ళు గత 50 ఏళ్ళుగా ఆ రంగంలో వున్నారు.

కాసింత కష్టపడితే "తనలో తాను" దొరుకుతుంది :). అలాగే ఆయన పేరడీలు పునర్ముద్రణ పొందాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యం!

అలాగే ఆయన ఫోటో కూడా - ఇంకా చిన్న వయసులో వున్నప్పుడు. ఈ మధ్యనే ఒక గ్రూపు ఫోటో - ఇంకా చాలామంది సాహితీ ప్రముఖులతో - చాలా చోట్ల ప్రచురించబడింది.

జరుక్‌శాస్త్రి గురించి చాలా కథలున్నాయి - మన ఆశు/చాటు సాంప్రదాయంలో. ఇక్కడ రాయ వీలుకాదు (నాకైతే).

భవదీయుడు,
శ్రీనివాస్

సుజాత వేల్పూరి said...

@శ్రీనివాస్ పరుచూరి,

1. రెండు నవోదయలూ వేర్వేరని నాకు తెలీదు. ఇప్పటికీ డౌటే!

2.నేను విశాలాంధ్రకి రెగ్యులర్ కస్టమర్ ని! ప్రతి నెలా అక్కడ పుస్తకాలు కొంటాను. కనీసం 2 నెల్లకోసారైనా! ఎన్ని సార్లడిగినా వారి వద్ద గానీ, ఆ చుట్టు పక్కలున్న పుస్తకాల షాపుల్లో గాని జరుక్ శాస్త్రి పుస్తకాలు దొరకలేదు. లేవనో, ప్రింట్లు లేవనో చెపుతారు. అవన్నీ అయ్యాకనే ఈ టపా రాశాను.

3.శాస్త్రి గారి ఫొటో ఈ మధ్యనే ప్రచురించబడిందన్నారు, ఎక్కడో చెపితే సంపాదించి దాచుకుంటాను. అలాగే తనలో తాను కూడా ఎక్కడ దొరుకుతుందో చెపితే ఇంకొన్ని కాపీలు కొనుక్కుంటాను.

4.జరుక్ శాస్త్రి గారి గురించిన కథలు బ్లాగర్ లతో పంచుకుంటే మేము తెలుసుకుంటాము కదా!

cbrao said...

జరుక్ శాస్త్రి పేరడీలు 2008 లో ప్రచురితమయ్యాయి. ఈ కింద లింక్ చూడవచ్చు.

http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=2633

మాలతి said...

పోయినతరవాతే విలువ తెలుస్తుంది. మీలాటివారు వెలికి తీసి మళ్లీ మరోసారి గుర్తు చెయ్యడం అవశ్యం. ఈమధ్య ఆయన అనుభవాలూ జ్ఞాపకాలూ తెచ్చాను కానీ పూర్తి చెయ్యలేదు. ఈపేరడీలు లైబ్రలోవుంది. ఈసారి తప్పకుండా తెచ్చుకుంటాను.

సుజాత వేల్పూరి said...

cbrao గారు,
thank you ! రెండేళ్ల బట్టి బెంగుళూరులో ఉండటం వల్ల కొత్త పుస్తకాల updates హైదరాబాదు వెళ్ళినపుడు మాత్రమే తెలుస్తోంది. ఈ లింకు చూస్తానిపుడే!

మాలతి గారు,
థాంక్స్

Kottapali said...

తెలుగు పుస్తకాలకి విశాలాంధ్ర మంచి సోర్సే అయినా, వేరే ప్రచురణకర్తల పుస్తకాలు స్టకులో ఉంచడంలో వీళ్ళు అంత శ్రద్ధ చూపించరు. కానీ ఆబిడ్స్ షాపు చూసుకునే పెద్దాయన బాగానే విషయాలు తెలిసినాయన. అవుటాఫ్ ప్రింటయితే ఆయన్మాత్రం ఏంఇ చేస్తాడు.
ఇహ పరుచూరి గారు చెప్పినట్టు ఆర్యసమాజ్ దగ్గర నవోదయ, ఈ పుస్తకం వేసిన నవోదయ లకి పేరులో తప్ప వేరేమీ సంబంధం లేదు.
విజయవాడ నవోదయ రామమోహన రావు గారు చెప్పిన ముచ్చట్లు కొన్ని ఇక్కడ చదవచ్చు

http://kottapali.blogspot.com/2007/07/1.html

KK said...

అంతటి సాహితీవేత్తని గుర్తుచేసి నందుకు అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రజ్యోతి (పాతది) ఉన్నప్పుడు ఈ కవుల గురించి ఏదో ఒక ప్రస్థావన వస్తూండేది. సుజాత గారందించిన విషయాలలో కొన్ని ఓసారి దీపావళి సంచికలో అందించారు.

duppalaravi said...

బావుందండీ సుజాత గారూ, ఎన్ని జ్ఞాపకాలు రేపుతున్నారో. బ్లాగు రచనకు ఎన్ని విషయాలో కదా! నిజంగా ఒక ఏడాది తిరిగేసరికి బ్లాగుల్లో ఎంత సంపద పేర్చగలమో కదండీ. సంతోషంగా వుంది.

Bolloju Baba said...

జరుక్ శాస్త్రిగారి వెళ్లిపోయాయ్ వెళ్లిపోయాయ్ అనే కవిత (పేరడీ కాదు) ఎక్కడదొరకగలదో చెప్పగలరా?
చాలా నాస్టాల్జిక్ గా ఉంటుంది ఆ కవిత. బహుసా ఆయన చివరి దశలో వ్రాసినదై ఉండవచ్చు. దాన్ని సుమారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చదివి ఉంటాను. ఇప్పటికీ ఆ కవిత నాకు హాంటింగ్ గానే ఉంది.

వీలైతే టపాలో పెట్టండి. కాకపోతే దొరికే విధానం దయచేసి చెప్పగలరా?

ఆకవితను ఇక నేను తిరిగి చదవలేనేమో నని ఒక నిర్ణ్యయానికి వచ్చేసిన తరుణంలో మీ బ్లాగుద్వారా నాకు ఆశలు కలుగుతున్నాయి.

బొల్లోజు బాబా

Bolloju Baba said...

తెలుగు సాహిత్యంలో ఈ కవితకన్నా నాస్టాల్జిక్ గాఉండే కవిత నాకింతవరకూ తారసపడలేదు. ప్లీజ్
బొల్లోజు బాబా

Post a Comment