June 10, 2008
స్ఫూర్తి దాయకం 'ఇడ్లి-వడ-ఆకాశం'
దాదాపు పదిహేను రోజులుగా ఇంటర్నెట్ కి దూరంగా ఉన్నాను. అందువల్ల ఈ పుస్తకం మీద ఎవరైనా తమ బ్లాగుల్లో ఇప్పటికే సమీక్ష రాసారా లేదా అన్న విషయం తెలియదు. ఇప్పటికే రాసి ఉంటే ఈ సమీక్ష కూడా చదివి ఎలా ఉందో చెప్పండి! అసలు పుస్తకమే చదివేసి ఉంటే సమస్యే లేదు.
ఇడ్లి-వడ-ఆకాశం పుస్తకం పేరే వింతగా అనిపిస్తుంది చూడగానే! అందునా ఇది యండమూరి రాసాడంటే అంచనాలు ఇంకా పెరుగుతాయి! నిజానికి ఇది యండమూరి సొంత రచన కాదు. కామత్ హోటల్స్ (ఒకప్పటి)అధినేత, ముంబాయి లోని ఆర్కిడ్ హొటల్ యజమాని విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ కు యండమూరి స్వేచ్చానువాదం!
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని విఠల్ కామత్ ముంబాయిలో నిర్మించిన ఆర్కిడ్ హోటల్ భారతదేశంలో మొదటి ECOTEL. ప్రపంచంలోని దాదాపు 200 హోటళ్ళు దీనితో పోటీకి దిగగా, ప్రపంచపు నంబర్ వన్ హోటల్ గా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 37 అవార్డులు గెల్చుకుంది.ఈ ఐదు నక్షత్రాల ఎకోటెల్ కట్టడమే విఠల్ వెంకటేష్ కామత్ జీవితాశయం! ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ఎన్ని మెట్లు ఎక్కవలసి వచ్చిందో, ఎక్కుతుండగానే ఎన్ని మెట్లు కూలిపోయాయో, కూలిన మెట్లను, విఠల్ ఎంత శ్రమకోర్చి పునర్నిర్మించుకున్నారో అత్యద్భుతంగా కామత్ ఇందులో వివరిస్తాడు.
ఆయన ఇంత ఉన్నత స్థితికి తొలిమెట్టు కామత్ హోటల్ లో దొరికే రుచికరమైన ఇడ్లీ!
అందుకే తన విజయం దేనితో ప్రారంభమైందో...ఆ ఇడ్లీ పట్ల కృతజ్ఞతతో కామత్ తన ఆత్మకథకు Idli, orchid and will power అని పేరు పెట్టారు. స్ఫూర్తి దాయకంగా సాగే ఈ పుస్తకాన్ని ఇప్పటికే 14 భాషల్లోకి అనువదించడమే కాక, రెండు యూనివర్సిటీల్లో నాన్-డీటైల్డ్ గా పెట్టారు. అసలు రచన ఎలా ఉన్నా , అనువాదం యండమూరి చేతిలో సాగింది కాబట్టి ఆయన శైలికి అనుగుణంగా సాగిపోతూ ఇది యండమూరి రాసిన పుస్తకమే అనిపిస్తుంది. ఎక్కడా అనువాదమనిపించదు.
"ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ ఆలోచన ఉంటుంది! ఎక్కడ సంకల్పం ఉంటుందో, అక్కడ ఆ ఆలోచన విజయంగా మారుతుంది" ఇదీ విఠల్ నమ్మిన సూత్రం! అన్నింటికంటే విఠల్ కి పెద్ద ప్రేరణ అతని తండ్రి వెంకటేష్ కామత్! చేతిలో పైసా లేక, చదువు లేక ఎనిమిదేళ్ళ వయసులో పొట్ట చేతబట్టుకుని బొంబాయి చేరిన వెంకటేష్ ఒక హోటల్లో క్లీనర్ గా చేరి, నమ్మకంగా పని చేస్తూ, యజమాని ఇబ్బందుల్లో ఉండి హోటల్ ను వదిలి వేరే చోట ఉండగా దాదాపు ఏడాదిన్నర పాటు సమర్థంగా ఆ హోటల్ ని నిర్వహిస్తాడు. హోటల్ యజమాని శ్రీనివాస్ కామత్ అబ్బురపడి 'నా అల్లుడివౌతావా?' అని అడిగితే వెంకటేష్ ఏమన్నా డో చూడండి.."క్షమించండి, ముందు నా సొంత హోటల్ కి యజమానిని కావాలి! ఆ తర్వాతే ఆలోచిస్తాను"
సొంత హోటల్ కి యజమాని అయ్యాక, శ్రీనివాస్ కామత్ కూతుర్ని వెంకటేష్ పెళ్ళి చేసుకుని ఆరుగురు పిల్లల తండ్రవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయమలో అయిన వాళ్ల ద్రోహానికి గురైనా, కొడుకుల చేయూతతో తేరుకుంటాడు. అయితే పిల్లల్ని క్రమ శిక్షణలో పెట్టే విషయంలో వెంకటేష్ కామత్ వారిని కొట్టడానికి కూడా వెనుకాడడు. తండ్రి కొట్టడం, తిట్టడం వెనక తండ్రి తాపత్రయాన్ని అర్థం చేసుకుని విఠల్ కామత్ బాగుపడగా, చివరి కొడుకు శివానంద్ మరింత మొండివాడిగా మారి, చివరికి కుటుంబం ముక్కలు కావడానికి కారణమవుతాడు.(చివర్లో)
ఇంజనీరింగ్ చదివిన విఠల్ కామత్ తండ్రికి ఆసరాగా ఉండాలని హోటల్ రంగంలో ప్రవేశించాడు.నెమ్మది నెమ్మదిగా ఆ రంగంలో మెళకువలు తెల్సుకుంటూ, ఆరితేరాడు. తండ్రి తన కామత్ హోటళ్ళని బొంబాయంతా విస్తరిస్తే, విఠల్ తన ఆతిధ్య పరిశ్రమని ప్రపంచమంతటా విస్తరింపచేసాడు. స్టాఫ్ తో కలుపుగోలుగా ఉండటం,కస్టమర్లతో అభిమానంగా మాట్లాడటం(రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ల అభిరుచులను గుర్తుంచుకోవడంతో సహా) వంటతో సహా ప్రతి పనినీ స్వయంగా పర్యవేక్షించడం, ఇవన్నీ తండ్రి నుంచి విఠల్ కి సంక్రమించాయి.
ఇతర దేశాల్లోని హోటళ్ళు ఎలా ఉంటాయో తెల్సుకొవాలని విఠల్ విదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు....ఎక్కడికక్కడ ఉద్యోగాలు సంపాదిస్తూ! విఠల్ వెనిస్ నగరానికి చేరుకునే సరికి ఆయన 3 రోజులకు గాను ముందుగానే డబ్బు చెల్లించి రిజర్వ్ చేసుకున్న హోటల్ రూం తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు.అప్పుడు డబ్బు సంపాదించడానికి విఠల్ చేసిన పని విఠల్ మాటల్లోనే చదవండి.
"నేనున్న హోటల్ పక్కనే ఒక టూరిస్టు ప్రదేశం ఉంది. ఊరంతా తిరిగి మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడికి చేరిన టూరిస్టులు ఎండకు వాడి పోయి దాహంతో ఉండేవారు. డబ్బు చేసుకోవడానికి ఇదొక అవకాశంగా కనపడింది నాకు.నేనున్న హోటల్లోనే ముగ్గురు పనివాళ్ళతో మాట్లాడాను. నా గదినే కార్యాలయంగా మార్చాను.చల్లని నీళ్ళు,పుచ్చకాయ రసం, నిమ్మకాయ, దోసకాయ ముక్కలు, దాని మీద కొద్దిగా ఉప్పుచల్లి ప్లేట్లలో అందంగా సర్ది పనివాళ్ళ చేత టూరిస్టులకి అందించసాగాను.నాలుగే రోజుల్లో నాకు మంచి లాభం వచ్చింది. అక్కడే ఒక బస్సు అద్దెకు తీసుకుని తిప్పసాగాను. ఈ అనుభవం నాకో పాఠం నేర్పింది.ధైర్యం ఉంటే ఎడారిలో కూడా ఇసుక బిజినెస్ చేయవచ్చని!"
ఇలాంటి అద్భుతమైన సంఘటనలు ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి. విఠల్ మరో కిటుకు చూడండి."మొదట్లో ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ విడిగా గిన్నెలో సర్వ్ చేసే వాళ్ళం! తర్వాత మూడూ ఒకేదాంట్లో వచ్చేలా దొప్పలున్న స్టీలు ప్లేట్లు చేయించాను. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకు పాతిక వేలు తగ్గింది."
గుజరాత్ హైవే మీద హోటల్ పెట్టి,వేగంగా వెళ్ళే వాహనాలకు అక్కడ హోటలున్నదని తెలియడం కోసం వేలు ఖర్చు పెట్టి బోర్డులు రాయించకుండా బంధు మిత్రుల కార్లు కొద్ది రోజుల పాటు రోజూ అక్కడ పార్క్ చేయించి ఉంచాడు.
వందల హోటళ్ళు పెట్టడం ఒకెత్తు! బొంబాయిలో ఎయిర్ పోర్ట్ ప్లాజా (3 స్టార్ల హోటల్)కొని దాన్ని కామత్ ప్లాజాగా మార్చడం ఒకెత్తు! దాని పక్క స్థలం కూడా కొని 5 నక్షత్రాల హోటల్ నిర్మించాలని విఠల్ గమ్యం! తన గమ్యానికి చేరువవుతున్నానని విఠల్ అనుకుంటుండగానే కష్టాలు మొదలయ్యాయి. ఎయిర్ పోర్ట్ ప్లాజా పైపు లైన్ల మీద నిర్మించారని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని తెలిసినపుడు, 24 గంటల్లో దాన్ని మూసివేసాడు విఠల్. అదొక సాహసోపేత నిర్ణయం! వ్యాపారం కన్నా ప్రాణాలే ముఖ్యమని విఠల్ భావించడం ఆయనలోని మానవతకు నిలువుటద్దం!
తర్వాత విఠల్ చెప్పినట్టుగానే కష్టాలు ఒంటరిగా కాక, సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చాయి.తమ్ముడు శివానంద్ మొండికేయడంతో, సగంలో ఆగిపోయిన ఆర్కిడ్ హోటల్, కోట్ల కొద్దీ అప్పులు విఠల్ కి, మిగిలిన ఆస్తులన్నీ ఇతర కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి నిర్ణయమైంది.విఠల్, అతని భార్య విద్య, పిల్లలు మౌనంగా సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలంటే ఏమిటో తెలిసింది! స్నేహితులనుకున్న వాళ్ళు మొహం చాటేసారు.బాంకులు కూడా అప్పివ్వలేదు.
విసిగిపోయిన విఠల్ ఒక దశలో పదహారో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.అప్పుడతనికి తన పని ద్వారానే కర్తవ్య బోధ చేసిందెవరో తెలుసా!ఎదురు బిల్డింగ్ కు కదులుతున్న ఒక చెక్క పరంజా మీద నిలబడి ఇరవై ఆరో అంతస్థుకి రంగులేస్తున్న ఒక పెయింటర్! జీవితం విలువ, కుటుంబం పట్ల బాధ్యతా గుర్తొచ్చాయి.పడి లేచిన కడలి తరంగమయ్యాడు. ఆ తర్వాత ఆత్మ విశ్వాసమే ఆయుధంగా కష్టాలను జయించి 21 గదులతో ఆర్కిడ్ హోటల్ని నిర్మించి చివరి క్షణాల్లో ఉన్న తండ్రి చేత ప్రారంభోత్సవం చేయించాడు. దానితో మళ్ళీ అప్పులు దొరికాయి. ఆర్కిడ్ కల సాకారమైంది.
నిస్సందేహంగా ఈ పుస్తకం స్ఫూర్తిని కలిగించేదే!కాకపోతే ఇది యండమూరి చేత అనువదించబడటం వల్ల ఆయన ఇతర వ్యక్తిత్వ వికాస పుస్తకాల ప్రభావం రచనలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల మూలంలోని మాటలను యధాతథంగా వాడారు! పేజీ 90లో 'సింగపూర్ లో కుస్ కుస్ వాడటం నిషేధం' అని ఒక వాక్యం ఉంది. కుస్ కుస్ (నిజానికది ఖస్ ఖస్ అయి ఉండాలి)అంటే గసగసాలు!
అలాగే కవర్ పేజీ మీద ఇది విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ అని ఎక్కడా ప్రచురించలేదు. ఆ విషయం వెనకపేజీ మీద ఉంటుంది.కొందరు ఇది యండమురి డైరెక్టు పుస్తకమనుకుని కొన్నారట.(రైల్వే స్టేషన్లో పుస్తకాల షాపు వ్యక్తి చెప్పాడు).
చదివి తీరాల్సిన విజయ గాధ ఇది!
ప్రచురణ: నవసాహితి పబ్లిషర్స్ , విజయవాడవెల: 100 రూపాయలు లభ్యం: అన్ని పుస్తకాల షాపుల్లోనూ!
12 comments:
monnaa ee pustaakaani kotlO choosi, yandamuri anesariki vadilesi vacchaa!! aatma katha ante chattukuna teesukune daani.
mee sameeksha upayogakaramgaa undi.
‘కేవలం యండమూరి పేరు’ ఈ పుస్తకం ముఖచిత్రం పై ఉండటం వల్ల ఈ మంచి పుస్తకాన్ని చాలామంది కొనే అవకాశం పెరుగుతుందని నా నమ్మకం.
ప్రస్తుతానికి ఈ పుస్తకం దొరకని భోపాల్ లో ఉన్నాకానీ, లేకుంటే రేపే పుస్తకం కొనేసేవాడ్ని.చాలాబాగా రాశారు సమీక్ష.పుస్తకం వెంఠనే కొని చదివేలా!
బాగా చెప్పారు, నేను పుస్తకం చదివినట్లుగా. బాలసుబ్రహ్మణ్యం ఎలా అయితే స్టేజీ షోలలో పాట అసలు రాగం వదిలేసి సొంతంగా రాగాలు సాగదీసి పాడేస్తుంటాడో, యండమూరికీ కాస్త ఆ గుణం ఉన్నట్లుంది.
ఎలా కొంటే ఏమిటి లెండి.. మంచి పుస్తకం చదివించడం ముఖ్యం. మీ సమీక్ష చాలా బాగుంది. ఈ పుస్తకం చదవటానికి - ఎదురు చూస్తున్నాను. (''Im looking fwd to read this book'' కి నా అనువాదం.. :D..) థాంక్స్ - మంచి పాపులర్ పుస్తకాన్ని బ్లాగర్ల చేత చదివించ బోతున్నందుకు!
సమీక్ష బాగుందండి.
@వికటకవి గారు,
మీ కామెంటు భలే నవ్వు తెప్పించిందఓడి.బాలు అంతే లెండి.కొందరిని మనం మార్చలేము.
హమ్మయ్య! వచ్చేశారన్నమాట. చక్కటి రివ్యూ.
అన్నట్లు ఈనెల గడి చూశారా?
చక్కటి రివ్యూ. ఇది నవ్య (ఆంద్రజ్యోతి) లో వచ్చింది.
నిజమే యండమూరి పేరు చూసి పుస్తకాన్ని కొనే జనాలు ఎక్కువ.
హై. వచ్చేసారా??
నేను ఈ ఆర్టికల్ చదివే వరకు ఎండమూరి గారు రచించిన పుస్తకమే అనుకున్నాను.
ఎండమూరి గారు స్వంతంగా రచించిన పుస్తకమని అనుకున్నాను.
మీ సమీక్ష ఆధారంగా ఈ పుస్తకన్ని మొన్నే కొని చదివాను. నాకు నచ్చింది. ధన్యవాదాలు.
ఇంకెవరైనా అయితే పక్కాగా అనువదించి వదిలేసేవారు. యండమూరి కాబట్టి నవల స్థాయిలో చదివించేలా, సొంత పైత్యం కొంత జోడించి మరీ రాశాడు. అందుకే నాకూ నచ్చింది.
ప్రింటు పుస్తకం మరియు ఈ-పుస్తకం ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి. http://kinige.com/kbook.php?id=1427&name=Idli+Orchid+Aakasam
Post a Comment