August 12, 2008

నాకు సైడ్ లోయర్ బెర్తు ఎందుకొద్దంటే.....!




కొన్ని కొన్ని అదృష్టాలు అందరికీ పట్టవు! అవి పట్టాలంటే పెట్టి పుట్టాలి! నేను ఆ కోవలోనే బాగా పెట్టి పుట్టేశాను మా అమ్మకి! అవి చూసేవాళ్ళకి పెద్ద 'విషయాలు ' గా అనిపించవు గానీ అందులోని మజా అనుభవిస్తేనే గానీ తెలియదు లెండి!

నేను సిటీ బస్ నించి సెమీ లగ్జరీ బస్ దాకా(వోల్వో లో ఎండ సమస్య ఉండదు కాబట్టి వాటిని వొదిలేసాను) ఎప్పుడెక్కినా, కరెక్టుగా ఎండ వచ్చి మొహాన్ని కాల్చేసే దిశలో కూచుంటాను. కాసేపటికి అనుభవమై, లేచి సీటు మారదామనుకుంటే అప్పటికే బస్సు నిండిపోయి, నేను లేస్తే నా సీటు ఆక్రమించడానికి పదిమంది రెడీగా ఉంటారు.
అలా ఒకసారి నేను హైదరాబాదు నుంచి మా వూరెళ్లడానికి(ఆరు గంటల ప్రయాణం)ఏప్రిల్ నెల్లో బస్సెక్కి ఎప్పట్లాగానే ఏ దిక్కు ఎటో అంచనా వెయ్యడం చాతకాక, డ్రైవరు వెనకాల మూడో సీట్లో కూచున్నాను. బస్సు వూరు దాటే సరికి మొహం మాడిపోవడం మొదలెట్టింది. ఎలాగో మధ్యాహ్నం అయ్యాక, సంతోషించాను,

"అమ్మయ్య, ఇహ పొద్దు పడమరకు వాలుతుంది కాబట్టి ఎండ అటువేపు వాళ్లమీద పడుతుంది" అని! నార్కెట్ పల్లి దాటాక బస్సు సడన్ గా వేరే దిశలో ప్రయాణించడం మొదలెట్టింది. సో, మళ్ళీ ఎండ మొత్తం నాకే!
అలా సాయంత్రం దాకా ఎండలో వడియం లాగా వేగిపోయాను.

ఇంకో అదృష్టం...మఫిసిల్ బస్సుల్లో డ్రైవరు వెనకాల రెండో సీటుకి అద్దం ముందుకీ వెనక్కీ జరపడానికి వీల్లేకుండా బిగించి ఉంటుంది.(అదొక్కటే అలా ఎందుకుంటుందో)
మా వూర్నించి ఎప్పుడు గుంటూరెళ్ళినా కరెక్టుగా నేను అదే సీట్లో కూచుంటాను. గంట ప్రయాణమే అయినా బయటినించి గాలి రాకుండా, మచ్చలు పడ్డ అద్దంలోంచి బయటి ప్రకృతిని పరిశీలించడం ఎంత చిరాగ్గా ఉంటుందో!

మరో యాధృచ్చికం.....నేనెప్పుడు Domestic flight ఎక్కినా నాకెప్పుడూ విమానం రెక్క మీద సీటే దక్కుతుంది!గంటా రెండు గంటల ప్రయాణంలో కూడా దూది పింజల్లాంటి మబ్బుల్ని చూస్తూ, నారదుడెక్కడైనా కనపడతాడెమో అని వెదుకుదామంటే నాకెప్పుడూ ఆ చాన్స్ రాలేదు.వెర్రి మొహమేసుకుని విమానం రెక్క మీద బోల్టులు లెక్కెడుతూ కూచుంటా!

అసలన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే రాత్రి రైలు ప్రయాణాల్లో సైడ్ లోయర్ బెర్తు దొరకడం! నేను ఒక వెయ్యి సార్లు రైలు ప్రయాణం చేసుంటే , కనీసం 970 సార్లు నాకు సైడ్ లోయర్ బెర్తే! ఇది చూడ్డానికి వెడల్పుగా, సుఖంగా ఉంటుంది గానీ ఇందులో సుఖం అనుభవిస్తే గానీ తెలీదు. సైడ్ లోయర్ బెర్తు మీద వాళ్ళు రైల్లో ఉన్న మిగతా బెర్తుల వాళ్లందరికీ లోకువే!

మొదటి విషయం...అది సీటుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఎదురెదురుగా కూచోడానికి ఇరుగ్గా ఉంటుంది, కాళ్ళు పెట్టుకోడానికి. అలాగని దాన్ని బెర్తుగా మార్చామనుకోండి,నడుము విరిగిన వాళ్లలాగా వెనక్కి ఆనుకుని కూచోవాలి. లేదా కాళ్ళు చాపుకుని కూచోవాలి. దారి పక్కనే ఉంటుంది కాబట్టి, అటూ ఇటూ టాయిలెట్ల కొసం తిరిగేవాళ్లకో, రైలు బయలుదేరిన అరగంట వరకూ కూడా తమ సీటెక్కడో కనుక్కోలేక లగేజీతో సహా తిరిగే వాళ్ళకో మనం బలవ్వాలి! ఎడాపెడా తగిలేస్తూ ఉంటారు. కనీసం తిరిగి కూడా చూడరు.

కాఫీలు, టీలు, సమోసాలు, సెనగల మసాలాలు అమ్మేవాళ్ళందరికీ మన సైడు లోయరు బెర్తు వేదిక!
"కొంచెం జరగండి" అని, మనం జరిగామో లేదో కూడా చూడకుండా కాలే కాలే స్టీలు కాఫీ కాన్ మనకు ఆనించి పెట్టి అవతల బెర్తు వాళ్లకు కాఫీ వొంచుతాడు అబ్బాయి! చురుక్కుమని మనం అవతలికి జరిగితే మన అదృష్టం అన్నమాట.

అక్కడికది అయిందా!పడుకుందామంటే రెండు వైపులా ఎలైన్మెంట్ కుదరదు. ఒకవైపు ఎత్తుగా, రెండోవైపు ఎత్తు తక్కువగా...తెల్లవారే సరికి నడుము నొప్పి ఖాయం!

ఇహ మన పక్క బ్లాకులో వాళ్ళు ఎంతకీ లైట్లార్పరు. ఆ లైట్లేమో మన మొహాన పడుతుంటాయి. పన్నెండైనా గుడ గుడ కబుర్లాడుతుంటారు. వాళ్ళకి మనం కనపడుతుంటాం కాబట్టి వాళ్ళు మెలకువగా ఉన్నతసేపూ మనం ఫ్రీగా పడుకోలేం! అది ఏసీ కోచయితే మన మొహానే ఉంటుంది ఏసీ వెంట్!

ఇంకో సంగతి ఏమిటంటే మన బ్లాకులోని మూడు అప్పరు బెర్తుల వాళ్ళూ(కొండొకచో మిడిల్ బెర్తుల వాళ్ళూనూ)మన బెర్తు ను ప్రథమ సోపానంగా ఉపయోగించి పాపం వాళ్ల బెర్తులెక్కుతారు. ఈ లోపు మనం పడుకున్నామనుకోండి, మన కాళ్ళూ, జుట్లూ తొక్కేస్తే, వాళ్ల పూచీ ఏమీ ఉండదు మరి. అలా ఒకసారి ఒకమ్మాయి మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుడి కాలు తొక్కినట్టు నా కాలు తొక్కేసింది. ప్రాణం పోయినంత పనైంది. బూతులొచ్చేస్తాయేమో అన్నంత కోపమొచ్చేసింది, కానీ సింపుల్గా సారీ చెప్పేసింది ఆ పాపాయి మరి, ఏం చెయ్యడం?

మధ్య మధ్య స్టేషన్లలో రైలెక్కినవాళ్ళు కూడా యథాశక్తి మన భుజాలూ, కాళ్ళు విరగ తొక్కేసి(వాళ్ల వాళ్ళ బాగేజీ సహాయంతో) గమ్యం (వాళ్ల బెర్తు) కనిపెడతారు.

అందువలన చేత నాకు సెకండ్ లోయరు బెర్తంటే చచ్చేంత భయం, చిరాకు! ఇదంతా ఎందుకు చెప్పానంటే....వచ్చే నెల్లో సరదాగా ఎటైనా వెళదామనుకున్నాం! ఇందాకా మా వారు ఫోన్ చేసి "ఒక అప్పరూ (తనకి), ఒక సైడ్ లోయరూ (నాకు) ఉన్నాయి...తీసుకోనా" అనడిగారు.
" ఈ ఏడాదంతా వెకేషన్ మాటెత్తకుండా అయినా ఉంటా గానీ, సైడ్ లోయరు తీస్కున్నారంటే, మా పుట్టింటికి తీస్కుంటా వెకేషన్" అని చెప్పాను!
మీరెప్పుడైనా అనుభవించారా సైడ్ లోయర్ బెర్తు సుఖాలు?

32 comments:

నిషిగంధ said...

అమ్మో! సైడ్ లోయరా!! నాకు ఒకే ఒక్కసారి ఆ భాగ్యం దొరికింది.. ఢిల్లీ నిజాముద్దీన్ నించి విజయవాడ కి, 22 గంటలు!! ఆ బ్లాక్ లో ఉన్నవాళ్ళ సేవలకే నా సీట్ రిజర్వ్ చేయబడిందా రోజు!! అసలెప్పటికీ మర్చిపోలేని చికాకైన అనుభవం..

భలే గుర్తుచేసారుగా! :-))

చైతన్య కృష్ణ పాటూరు said...

భలే వుంది మీ బెర్తుల గొడవ. నాకు లోయర్ సైడ్ బర్తే ఇష్టం. దాంట్లో అయితే పై బెర్తుకి, మనకి బోలెడు ఖాళీ వుంటుంది. పడుకోవాలంటే పడుకోవచ్చు, నిద్ర పట్టకపోతే కూర్చుని ప్లేయర్‍లో పాటలు వినచ్చు. గాలి కావాలంటే కిటికీ తెరుచుకోవచ్చు.

అదే మామూలు బర్తుల్లో అయితే అందరికన్న పైన వున్నవారికి డిస్ట్రబెన్స్ తక్కువైనా, గాలి కూడా తక్కువే. త్రిశంకు స్వర్గం బెర్త్ వాళ్ళు ఇష్టం వచ్చినంత సేపు పడుకోలేరు. పైవారికో, క్రిందవారికో మెలుకువ వస్తే దుకాణం కట్టెయ్యాలి. క్రిందవాళ్ళు అంతే, మధ్యవాళ్ళు బెర్త్ ముయ్యందే కూర్చోలేరు. ఈ గొడవ కన్నా సైడ్ బెర్తులే శ్రేష్ఠం అని ఫిక్స్ అయ్యాను.

Ramani Rao said...

ఈ సుఖం నాకు కాస్త తక్కువనే చెప్పచ్చు, ఏదో వేళ్ళమీద లెక్కపెట్టుకోవచ్చేమో. 2,3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తూ ఉంటాము కదా సో, ఎక్కువగా మధ్యలో బెర్తే నాకు. అంత బాగుంటుందన్నమాట. సైడ్ లోయర్ బెర్త్.

సుజాత వేల్పూరి said...

చైతన్య గారు,
అబ్బాయిలకు ఏ బెర్తు వచ్చినా ఒకటేనండి! ఒక ప్లేయరు ఉండాలే గానీ!ఇక మిగతా బెర్తుల వాళ్ల గురించి మీరు చెప్పిన సంగతి తెల్లారాక కదా! రాత్రంతా ఇబ్బంది పడేవాళ్ల సంగతి ఏమిటి?

అసలు ఇంకోటి రాయడం మర్చిపోయాను. మన పై బెర్తు వాళ్ళు కిందకు దిగాలంటే మన మొహాన్న కాళ్ళు పెట్టి అప్పుడు కానీ దిగరు.

సుజాత వేల్పూరి said...

ishigandనిషిగంధ,

నేను ఒకసారి మరీ లాంగ్ టైం బుక్కయ్యాను. హైదరాబాదు నుంచి న్యూఢిల్లీ వరకు, ఏపీ ఎక్స్ ప్రెస్ లో, సైడ్ లోయర్ బెర్తు మీద! 28 గంటలు.(ట్రైను 4 గంటలు లేటు) సెకండేసీలో..పైగా ఎక్కడో తెలుసా...డోర్ దగ్గర!టాయ్ లెట్ కి వెళ్లాలంటే నన్ను దాటే వెళ్లాలి. 28 గంటల్లో ఎంతమంది వెళ్ళుంటారో సగటున లెక్కెయ్యండి.

రమణి గారు,
మీరు అదృష్టవంతులే సుమా!

Sujata M said...
This comment has been removed by a blog administrator.
Sujata M said...

అయితే, ఇప్పుడో చిక్కు కూడా వచ్చింది. లాల్లూ గారు సైడ్ బెర్తులు అంటే ప్రస్తుతం ఉన్న రెండు బెర్త్ ల స్థానంలో మూడు బెర్తులు ఉండేలా కొత్త కోచ్ లు ఆర్డర్ ఇచ్చారంట. ఇంక ప్రయాణాల్లో సైడ్ లోయర్ లో కూర్చోటానికి ఉన్న సౌకర్యం కోల్పోబోతున్నాం !

Srividya said...

బావుందండి మీ సైడ్ లోయర్ బెర్త్ భారతం. నాకు సైడ్ లోయర్ బెర్తే ఇష్టం. కానీ నాకేమో అప్పర్ బెర్త్ వస్తుందెప్పుడు. అందుకే మీరు చెప్పినట్టు దిగేటపుడు సైడ్ లోయర్ బెర్త్ వాళ్ళ కాళ్ళు, చేతులు తొక్కేసి పగ తీర్చుకుంటూ వుంటా..

cbrao said...

బస్, విమానం ఇంకా రైలు ప్రయాణం గురించి రాసారు. సైడ్ లోయర్ బెర్త్ మీద ఇలా ఒకటి బ్లాగొచ్చని మీ కొచ్చిన అవుడియా కు జోహార్లు. పడవ, గుర్రం బండి ప్రయాణాలను వదిలేసారే. అవేమి పాపం చేసుకున్నాయి? నరసరావుపేట లో లేక తిరుపతి లో గుర్రపు బండీ ఎక్కిన అనుభవం మరిచారా? అమరావతి లో పడవ ఎక్కలేదా? గుర్రబ్బండీ ముందు కూచుంటే వెనక్కు, వెనక కూచుటే ముందుకు వెళ్లమని, మనము కూర్చున్న చొటే బరువెక్కువయిందనీ, గుర్రబ్బండీ వాడు తమాషాగా సతాయిస్తాడు. కెమరా లేని వాళ్లు పడవ ముందు డెక్ పై కూచుని, ఛాయగ్రాహకులకు అడ్డంగా కూర్చుంటారు. మనం కూర్చున్న బెంచీ పై పెట్టుకున్న పుస్తకం, ఇంజన్ ప్రకంపనలకు కదిలి, కాళ్ల కింద నీటిలో తేలియాడటం మరువలేని భయంకర అనుభవం.

Sujata M said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

హహ...
మీకింకా తెలీదేమో? ఈ మధ్య సైడు బెర్తుల్లో కూడా మూడేసి ఉండటం మొదలయింది.
సైడు అప్పరు, లోయరు కి మధ్య వేళ్ళాడే మిడిల్ బెర్తు పడుకోవడానికి.

Kamaraju Kusumanchi said...

అదీ,ఇదీ అని చెప్పలేను కాని, నాకైతే SL బెర్త్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు travel చేసినా అదే నా first preference!

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

శ్రీవిద్యా,
దారుణం!, అయితే నా కాలు ఎప్పుడో ఒక సారి తొక్కే వుంటారు మీరు!

సుజాత వేల్పూరి said...

రావుగారు,thaankyU!
పడవ ఎక్కాను గానీ, గుర్రబ్బండి ఎక్కువ సార్లు ఎక్కలేదు. పైగా నరసరావు పేటలో నేను గుర్రబ్బండి చూళ్ళేదు. నా జమానా కంటే ముందు ఉండేవేమో! ఈ మధ్య మైసూరులో ఎక్కాను ఒకసారి. that was not troubling! we enjoyed it! గోదావరి లో పున్నమి వాళ్ల లాంచి3 సార్లు ఎక్కాను. అది వేరే అనుభవం అనుకోండి. (ఫొటోగ్రాఫర్స్ కి అడ్డంగా కూచునే వాళ్లని నీళ్లలోకి తొయ్యాలన్నంత మంట నాకు).ఇంతకీ ఏ పుస్తకం పోగొట్టుకున్నారు మీరు?

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్ గారు, అది కూడా చూసాను. ఒక సారి హైదరాబాదు నుంచి బెంగళూరు లాలూ స్పెషల్ 'గరీబ్ రథ్ ' లో వచ్చాము.(పేరుకే గరీబ్ రథ్ కానీ రైలు బానే ఉంది)అప్పుడు చూశాను ఈ సైడ్ మిడిల్ బెర్తు.

cbrao said...

గోదావరిలో పడవ ప్రయాణం. కొద్దిదూరం వెళ్ళేసరికే కొండలు కనిపించ సాగాయి. గోదావరి వయ్యారాలు పోతూ, మెలికలు తిరుగుతూ కొండల మధ్యగా ప్రవహించ సాగింది. పాపికొండలు చూడాలనే నా చిరకాల వాంఛ - కళ్ళెదురుగా పాపికొండలు సాక్షాత్కారమవటంతో మది ఆనంద పులకితమైంది. గోదావరే కాదు పడవ కూడా మెలికలు తిరుగుతూ పో సాగింది. నది లోతు తక్కువున్న చోటులో నావ యొక్క profellor ఇసకలో ఇరుక్కుపోకుండా ఉండటానికై సరంగు నావను లోతైన నీళ్ళలో నడిపే ప్రయత్నంలో నావ మెలికలు తిరగక తప్పింది కాదు. పడవ ప్రయాణంలో నది రెండు పక్కలా ఉన్న కొండలు, వాటిపై గల రంగు రంగుల చెట్లు, ఇసక తిన్నెలు గమనిస్తూ ఉన్నాము. ఒక చోట నది ఒడ్డున బాపన చిలువలు (Brahminy Ducks), నీటి కాకులు (Little cormorants) కనిపించాయి. రాజమండ్రి నుంచి పేరంటపల్లి వస్తున్న పడవలు మాకు చాలా ఎదురయ్యాయి. వాటిలో కొన్ని double decker కూడా ఉన్నాయి. చుట్టూ ఉన్న కొండలూ, గుట్టలూ, పక్షులూ, పడవలు చూస్తూ నన్ను నేను మైమరచిన సమయంలో అనూహ్యమైన ప్రమాదం జరిగింది. పడవలో నే కూర్చున్న బల్ల (bench)పై నా పక్కనే నా కెమారా సంచి పెట్టి ఉన్నాను. కాని అది boat engine vibration వలన మా కాళ్ళ వద్ద గల నీటిలో (ఫడవ లోపలే) పడి పోయింది. Bag తెరుచుకుని అందులోని సలీం ఆలి 'The Book of Indian Birds', నా field note book కింద పడి అవి నీటిలో తేల సాగాయి. జావెద్ అది గమనించి నాకు చెప్పేదాకా ఆ విషయం నేను గుర్తించలేక పోయాను. నాకు ఎంతో ప్రీతి పాత్రమైన పక్షుల పుస్తకము, నా నోట్ బుక్ నీటిలో తెలియాడే ఆ దృశ్యం నా కళ్ళకు ఎదో భయానక చిత్రాన్ని చుస్తున్నట్లుగా అనిపించింది. తేరుకొని తటాలున వంగి ఆ రెండిటినీ నీటి నుంచి బయటకు తీశాను. అవి నీళ్ళు కారుతున్నై. నా మనసు గిజ గిజ లాడింది. సీతారామ రాజు సమయానికి వచ్చి నీరు కారుతున్న ఆ రెండింటినీ పడవ పై భాగాన ఎండలో ఆరవేశారు. కొంతసేపయ్యాక కొండగాలులలో అవి గాలిలో ఎగిరి ఎక్కడ ఎగురుతాయో అన్న భయం కలిగింది. అలా రెండు గంటల పైగా సాగిన మా పడవ కొల్లూరు వద్ద ఆగింది. నది ఒడ్డున పెద్ద ఇసుక తిన్నె, అందులో వెదురు తో చేసిన cottages, tent cottages కనిపించాయి. Cottages వెనక దూరంగా ఎత్తైన గుట్టపై ఎర్ర పెంకులతో ఒక పెంకుటిల్లు కనిపించింది. సీతారామ రాజు పడవ పైకి ఎక్కి అక్కడ ఎండుతున్న పుస్తకాలను నాకు అందచేసారు. అదృష్టం. నా పుస్తకాలు ఎప్పటివలే మరలా తాజాగా తయారయ్యాయి. నా మనసు సంతోష భరితమయ్యింది. పడవదిగి దూరంగా కనిపిస్తున్న పెంకుటింటికి, ఇసకలో, ఎండలో, పెట్టె,బేడతో, ఆకలితో నడిచాము. అలిసామని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. మాములుగా ఐతే మాకు ఆ వెదురు కుటీరాలు ఇచ్చేవారు. కాని వరుసగా 3 రోజులు సెలవులు రావటంతో ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. విపరీతంగా పర్యాటకులు రావటంతో మా అందరికి పైన ఉన్న పెంకుటింట్లో నే accommodation allot చేశారు. మేము వస్తున్నామని ముందుగా కబురు పెట్టి ఉండటం వలన భోజనము తయారుగా ఉంది. భోజనమయ్యాకా, రాత్రి సరిగా వానులో నిద్ర లేక, పగలు ఎండలో నడవటం వలన, సౌకర్యవంతమైన పడకల ఏర్పాటు తో అలసిన శరీరాలు సొమ్మసిల్లి , నిద్రపోయాయి. భొజనము చెస్తుండగా పడవలో జరిగిన ఇంకో ప్రమాదం నా దృష్టికి వచ్చింది. మా తోటి camper నరేష్ పడవదిగే సమయంలో హడావుడిలో పడవ యంత్రంలోని 'silencer' పై చేయి పెట్టడంతో, తీవ్రంగా కాలి అతనిని బాధ పెట్టింది. సమయానికి శ్రీమతి రమణ వద్ద ఉన్న Boroline Antiseptic Cream నరేష్ కు కొంత ఉపశమనాన్ని ఇవ్వగలిగింది. నిద్రలేచే సరికి 5.30 గంటలు కావస్తుంది. సాయంకాల trek programme ఉంది కాని అందరూ అలసి ఉండటం వలన, ఎవరూ ఉత్సాహం చూపక పోవటంతో అది రద్దయింది.

(From My travelogue on Papikondalu- unpublished)

సుజాత వేల్పూరి said...

రావు గారు, భలే ఉంది మీ ట్రావెలాగ్!మొత్తం ఎప్పుడు చదవొచ్చు మేము? పోనీ లెండి మొత్తానికి పుస్తకం దక్కిందన్నమాట! ఈ ప్రొపెల్లర్ ఇసుకలో ఇరుక్కుపోవడం మేము వెళ్ళినపుడు కూడా ఒకసారి జరిగింది. ఎంత తక్కువ లోతులో అంటే లాంచి సిబ్బంది నీళ్లలోకి దిగితే మోకాళ్లవరకూ వచ్చాయంతే!

San .D said...

భలేవారండీ మీరు... నేనైతే ఎప్పుడూ సైడ్ లోయరే తీసుకుంటా. చైతన్య గారన్నట్టు పాటలు వింటూ బయట
వెన్నెల వెలుగులో నిద్రపోతున్న ప్రపంచాన్ని చూస్తుంటే..
వాహ్!
కాకపోతే చిన్న చిక్కు. ఎప్పుడూ ఆ బెర్తు బుక్ చేసుకుంటానా? తగుదునమ్మా అంటూ ప్రతీ సారీ అంకుల్సూ ఆంటీసూ వచ్చి పైకెక్కలేనండీ.. అడ్జస్టవుతారా? అని అడుగుతారు. మనమా కాదనలేము.sl ఎంత స్వర్గమో, su అంత నరకం.
ఆ రాత్రంతా జాగారం చేస్తూ కింద గుర్రు పెట్టి పడుకున్న ఆ ఆసామీ ని చూసి ఉడుక్కుంటూ గడుపుతుంటాను.

ప్రతాప్ said...

నాక్కూడా ఈ సైడు బెర్తులు అంటే చిరాకు, ట్రైన్ లో అన్ని బెర్తులు 6 అడుగుల కన్నా ఎక్కువ పొడవుంటాయి. కానీ అదేంటో ఈ సైడు బెర్తులు మాత్రం కర్రెక్టుగా 6 అడుగులే ఉంటాయి. వాటి మీద ప్రయాణం అంటే పొడవు సరిపోక, వాటి మీద పడుకోలేక ఒక 12 గంటలు (హైదరాబాదు నుంచి మా ఉరికి ప్రయాణం 12 గంటలు మరి) నరక యాతనే. ఎవరినన్నా అడుక్కొని, సీటు మారే దాకా ఆ కష్టాలు తప్పేవి కాదు.

తెలుగు'వాడి'ని said...

@ sujata & సుజాత :

To delete any comment, please click on the 'Post comment' or '20 Comments' link for the post and then you can see a small image like a trash icon when placed your mouse pointer it shows the tools tip as 'Delete Comment' at the end of comment. Please click that image and then it will ask you for the confirmation to delete the comment and say 'yes'. That's it and the comment is deleted.

FYI :

@sujata : You will see this image only for (all) the comments you posted.

@సుజాత : Being the administrator and owner of this blog, this image will show up for ALL the comments posted by you and your blog/post readers.

ramya said...

సుజాత గారు భలేగా రాశారు బెర్త్ కష్టాలు. నాకు ప్రయాణాలు ఇష్టం గనక కిటికీ పక్కనున్న సీటు ఏదైనా ఓకే:)
సెకండ్ ఏసీ లో ఒంటరి లేద ఇద్దరమే వెళ్ళాలంటే సైడ్ లోయర్ బావుంటుంది నాకు కర్టెన్‌ వేసామంటే హాయిగా ట్రైన్‌ తో సంబంధం లేకుండా గడపొచ్చు. కొన్ని సందర్భాలలో తప్పించి నా ప్రయాణాలు ఎక్కువగా హాయిగానే గడిచాయి :)

సుజాత వేల్పూరి said...

తెలుగు వాడి ని గారు,
చాలా చాలా ధన్యవాదాలు మీకు!

చైతన్య.ఎస్ said...

హ, హా బాగుంది మీ స్ల్ ప్రయాణం.

రవి said...

మబ్బుల్లో నారదుడు కనిపించడమా...సూపరు. నాకు రైల్లో పగటి పూట అయితే, తలుపు దగ్గర నిలబడి, లేదా కూర్చుని బయటకు చూస్తా ఉండడం ఇష్టం.

-- said...

chala correct ga chepparu, "maja anubhavisthe gaani teliyadu" ani.

Adento gaani, varsha kalamlo, nenu godugu lekunda adugu bayata pedithe varsham paduthundi :) malli Auto lo kurchunte aagi pothundi. Godugu chetilo vunnappudu okka chukka kuravadu..

rail reservation online lo eppudu chesina SL vasthundi. May be next time, we need to book it at the reservation counter!

--Cine Valley

spandana said...

సైడు లోయర్ బెర్తు మీద ఇంత సమగ్రంగా వ్రాయడమా!

--ప్రసాద్
http://blog.charasala.com

సుజ్జి said...

గంటా రెండు గంటల ప్రయాణంలో కూడా దూది పింజల్లాంటి మబ్బుల్ని చూస్తూ, నారదుడెక్కడైనా కనపడతాడెమో అని వెదుకుదామంటే నాకెప్పుడూ ఆ చాన్స్ రాలేదు.వెర్రి మొహమేసుకుని విమానం రెక్క మీద బోల్టులు లెక్కెడుతూ కూచుంటా!

meeku aenni kastalo sujatha garu.... hahaha....

వేణూశ్రీకాంత్ said...

పాపం ఎన్ని కష్టాలండీ మీకు సుజాత గారు. ఇవేం పెద్ద విషయాలా అనిపిస్తాయ్ కాని చాలా చిరాకు కలిగించే విషయాలు. బాగా వ్రాసారు. BTW మీ కొత్త టెంప్లేట్ ఇపుడే చూస్తున్నా బావుంది.

Unknown said...

సైడ్ లోయర్ బెర్త్ విషయం లో నాణేనికి ఒక వఇపే రాసారు రెండో పాజిటివ్ కోణం కూడా వున్ది.ఆ పేట కి మీరే మేస్తిరి ఎలాగంటే పయ్ బెర్త్ వారు వెళ్లి పడు కాగానే curtain వేసేసుకుంటే ఇంక మీరే మహారాణి ప్రక్రుతి ని ఆస్వాదిస్తూ అద్దమ్ లో మీ హవా భావ విన్యాసాలు చూసుకుంటూ మీ ఒంటరి తనాన్ని నిశబ్దం గ ఆస్వాదిస్తూ మీ మధుర స్మృతులు నెమరేసుకుంటూ హాయ్ గ ప్రయాణం చేయొచ్చు అదే inside లోయర్ అయితే మీ మదుర స్మృతులు నేమరేసుకుంటుంటే ఏ అమ్మాయి మనదేవురు అంటు ఏ బామ్మ గారో లేక పొతే would యు మైండ్ గివింగ్ that బుక్ అంటు ఎదురు బెర్త్ కుర్రాడో సెల్ లో మాట్లాడుతునట్టు నటిస్తూ వెకిలి నవ్వులు నవ్వే ఏ వెంకట్రావు విళ్ళందరి బారిన పడకుండా మీ డైన లోకం సైడ్ లోయర్ లోనే సాద్యం. ఇంకో విషయం ఏంటంటే రైల్వే కంప్యూటర్ మైండ్ లో కూడా సైడ్ లోయర్ ని కూడా లోయర్ గానే consider చేస్తుంది సో 90 డేస్ అడ్వాన్సు గ చేసుకున్న ఒకోసారి సైడ్ లోయర్ తప్పదు.

గీతాచార్య said...

నా జీవితంలో మిడిల్ బెర్త్ తప్ప వేరేవి ఎక్కను. ఒకవేళ వేరేవి ఏవైనా వస్తే నేను చాలా వరకూ మార్చుకునే ప్రయత్నం చేస్తాను. మీరు మంచి కాషన్ ఇచ్చారు.

రామ్ said...

"గంటా రెండు గంటల ప్రయాణంలో కూడా దూది పింజల్లాంటి మబ్బుల్ని చూస్తూ, నారదుడెక్కడైనా కనపడతాడెమో అని వెదుకుదామంటే ....."

:)

Post a Comment