August 21, 2008

మా ఇంటాయన కథ

టైటిల్ చూసి ఇదేదో మా ఆయన గారి కథ అనుకునేరు , కాదు సుమండీ, ఒకప్పటి
మా ఇంటి ఓనరు కథ!
హైదరాబాదులోని అశోక్ నగర్లో విశాలమైన ఖాళీ స్థలం, ఆవరణ నిండా బోలెడు చెట్లూ, మొక్కలూ,
దగ్గర్లోనే బస్టాపూ వంటి సుగుణాలున్న ఇల్లు తక్కువ అద్దెకే దొరికితే మీరేం చేస్తారు?
మేమూ అదే చేసాము లెండి!
వరసకు తమ్ముడయ్యే కజినొకడు ఈ ఇల్లు చూపించి పుణ్యం కట్టుకున్నాడు.
వాడికి వెంఠనే రాఖీ కట్టాలన్నంత ప్రేమ కలిగింది నాకు వాడిమీద!
అందుకే వాడి గురించి కుంచెం చెపుతాను ! వాళ్ళింటిపేరు ద్వివేదుల. వాడి పేరు శ్రీకాంత్!
అందుకని వాడు "ద్విశ్రీ" అని కలం పేరు పెట్టుకుని పుంఖాను పుంఖాలుగా కవిత్వ సృష్టి చేసి
సమాజం మీదికి విసిరేస్తుండేవాడు.
(అప్పట్లో త్రిపురనేని శ్రీనివాస్ గారు త్రిశ్రీ పేరుతో రాస్తుండేవారు. ఆయనే
వీడి కలం పేరుకు ప్రేరణట) సమాజం వాడి కవిత్వాన్ని మొహమాటం లేకుండా తిరస్కరించడం వల్ల,
వీకెండ్స్ మా ఇంటికి వచ్చి వారం రోజులూ తను రాసిన కవిత్వాన్ని మాకు వినిపిస్తుండే వాడు.
ద్విశ్రీ కవిత్వం నిండా వాడి ఊహా ప్రేయసి ని ఆహ్వానించడం, ఆవిడ కోసం నిరీక్షించడం సబ్జెక్టు!
'రావా ప్రియా.
.''నీ కోసం వేచి చూస్తూ
''ఎన్నాళ్ళీ నిరీక్షణ ''
నువ్వొచ్చే దారిలో గుండెను పరిచాను.
''నీ నీడ కోసం ' ఇవే వాడి కవితల శీర్షికలు.
నాకసలే ఈ 'నిరీక్షణ ' కవిత్వమంటే ఒళ్ళు మంట.
ఇన్ని కవితలు రాసినా ఆ ఊహా ప్రేయసి కరుణించినట్టు లేదు. ఎంతకీ రాదు.
ఆదివారం పొద్దున్నే ఇలాంటి కవితలు వినే మూడ్ ఉండాలంటే గుండె రాయి అయి
ఉండాలి, లేదా ఖాళీ బుర్రయినా కలిగి ఉండాలి.
"పొగ బారిన నా గుండె గోడలకు మల్లెపూలతో వెల్ల వేశాను(సిగరెట్లు తాగుతున్నాడా ఏమిటి)
నువ్వొస్తావని విషాద తుషార(అంటే ఏమిటబ్బా) బిందువులను పోగు చేసాను
నీ నీడలో విశ్రమిద్దామని డస్సిపోయాను(ఎవరన్నా డస్సి పోతే విశ్రమిస్తారు
గానీ వీడు విశ్రమించడానికే డస్సిపోతాడులా ఉంది)
ఎంతకీ రావేం?(దబాయింపు)
నా మీద జాలి లేదా(వేడుకోలు)
నా చివరి క్షణాలకైనా వస్తావా(బ్లాక్ మెయిల్)
ఇక అడగనులే(అలక, నిష్టూరం)

ఇత్యాది భావాలతో వాడు పెట్టిన హింస తల్చుకుంటే కవిత్వమంటేనే విరక్తి కలుగుతుంది.
నా మటుకు నాకు కవిత్వం అంటే 'కదిలేదీ కదిలించేదీ ' గా ఉండాలి(బొల్లోజు బాబాగారి కవితల్లాగా)
లేదంటే వేసవి ఉదయాన కిటికీ తలుపు తీస్తే చల్లగా పలకరించే
చిరుగాలిగా ఉండాలి(చూ:రాధిక, నిషి, దిలీప్ ల బ్లాగులు)
ద్విశ్రీ గాడి కవిత 'పెను నిద్దర వదిలించేది(అనగా పీడకల) గా ఉండేది.
చిరుగాలి లా కాక, వడగాలిని తలపిస్తూ ఉండేది.
వాడు వెళ్ళిపోయాక, ఇద్దరం సారం లేని తోలు బొమ్మల్లాగా అలా పడి ఉండేవాళ్లమంతే!
"ఒరే, అంతగా రాను మొర్రో అని ఆ ఊహా సుందరి మొత్తుకుంటుంటే ఎందుకురా '
రావా రావా వా వా ' అని చంపుకు తింటావు?ఇంకేమన్నా రాయి" అని సలహా ఇస్తే
వాడి బుర్రకెక్కలేదు.
ఇక లాభం లేదని ఒకరోజు మేమిద్దరం వాడిని కూచోబెట్టి తలంటాము.
'నువ్వు రాసేది కవిత్వం కాదు! ఇలాంటివి ప్రతి కాలేజీ మాగజైన్లోనూ
చూడొచ్చు! మూడో క్లాసు వాళ్ళు కూడా రాయగలరు!నువ్వింకా బాగా మంచి
కవిత్వం చదవాలి. తిలక్, శ్రీ శ్రీ , దేవులపల్లి వీళ్లందరి పుస్తకాలూ చదువు! తర్వాత రాయి"
అని బోలెడంత సేపు క్లాసు పీకి కొన్ని పుస్తకాలిచ్చి పంపాము.
తర్వాత నెల రోజులకు వాడు ఇల్లు చూసానని ఫోన్ చేశాడు.
"పోన్లే, మనం క్లాసు పీకినందుకు ఏ మాత్రం కోపగించుకోకుండా మనకు ఇల్లు
చూపాడు " అని నెక్స్ట్ వీక్ భోజనానికి పిలిచేసాను వాడి కవితలకు మెంటల్
గా సిద్ధమైపోయి! వాడు రాలేదు.

* * * *
గోడలకు మాచ్ అయ్యే అందాల కర్టెన్లు అవీ కొని, సామాన్లతో సహా మేమిద్దరం
ఇల్లు చేరే సరికి మా ఇంట్లో నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో యుద్ధ రంగ భీభత్సాన్ని చిత్రించిన కర్టెన్లు అన్ని కిటికీలు, వాకిళ్ళకు తగిలించి కనపడ్డాయి. అవి చూసి దిమ్మెర పోయాము!
శాస్త్రి గార్ని పిలుద్దామనుకుంటుండగానే మాకు శ్రమ లేకుండా ఆయనే వచ్చాడు.

"వచ్చార్టే అమ్మడూ(రిటైర్ అయ్యి పదేళ్ళు అయింది లెండి ఆయన), ఈ ఇంటి వాస్తు కి అనుగుణంగా కర్టెన్లు కొనేసి ఉంచాను. ఈ రంగుల్లో కర్టెన్లు కడితే శుభ శక్తులన్నీ ఇంట్లో చేరి తలా ఒక కుర్చీ వేసుక్కూచుంటాయి" అన్నాడు.
ఖండించాలో, వద్దో అర్థం కాలేదు.
"లేదండీ, మేము ఇప్పుడే కొత్తవి కొని తెచ్చాము. మీకుందుకూ శ్రమ! అవి మీరు
తీసేసుకొండి, " అని మేము చెప్పబోతుంటే ఆయన అసలు వినిపించుకోలేదు.
"పిల్ల కుంకలు! మీకేం తెలుస్తుంది! అయినా మీ వాటా కోసం ఎప్పుడో
కొనేసానవి! సర్లే, ఎప్పుడు తిన్నారో ఏవిటో, పదండి భోజనానికి" అన్నాడు.
మేమిద్దరం మొహాలు చూసుకున్నాం! ఈ లోపు కామేశ్వరమ్మ(ఆయన భార్య) గారు
భోజనాలు వడ్డించేసి మమ్మల్ని పిలిచారు.
ఒక నాల్గు రోజులు గడిచే సరికి మా జీవితాలు మా చేతుల్లో లేకుండా
పోయాయి. శాస్త్రి గారి ప్రమేయం లేకుండా ఏదీ జరగడం లేదు."ఏవిటయ్యా, సంధ్య వార్చలా ఇంకా?" అనడిగేవాడు
మా వారిని.
"పని మనిషిని వంటింట్లోని రానివ్వకూడదు. రోజూ వంటిల్లు కడగాలి" అని
చెప్పారు నాకు. మేము ఇద్దరం ఆఫీసులకి వెళ్లినపుడు మాక్కూడా కూరలు కొనేసి ఏ రోజు ఏం
తినాలో కూడా వాళ్ళే నిర్ణయించేవాళ్ళు.ఆదివారాలు ఇంట్లో ఉండాలంటే భయం!
స్నేహితులొస్తే వాళ్లతో మాట్లాడాలంటే
భయం! (అసలు ఆ కర్టెన్లు చూసి భయపడి స్నేహితులు రావడం మానేశారు
లెండి!) మా లివింగ్ రూముకీ, వాళ్ళింట్లో ఒక గదికీ కామన్ గోడ! దానితో మేము
ఏమి మాట్లాడుకుంటున్నా సరే శాస్త్రి గారు ఆ రూంలోంచే మా మాటల్లో పాలు
పంచుకుంటుండేవాడు. అది మరీ దారుణంగా ఉండేది.టివీ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడ్డానికి లేదు.
పక్క గదిలోంచి శాస్త్రి గారు "ఆ, ఇప్పుడెక్కడున్నాయి, మంచి ప్రోగ్రాములు! రామానంద సాగర్
తీసిన రామాయణం లో అసలు సీత .." అని ఆపకుండా అరగంట
మాట్లాడేవాడు.
అందువల్ల మేం విసిగిపోయి, ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్లో వచ్చే బధిరుల వార్తల్లో లాగా గుప్పెళ్ళు మూసి తెరుస్తూ, గాల్లో గుండ్రాలు చుడుతూ, నెత్తి మీద రౌండ్లు చుట్టుకుంటూ, వేళ్ళతో అంకెలు లెక్కెడుతూ కమ్యూనికేట్ చేసే విధానం ప్రాక్టీస్ చేసాం!
కామేశ్వరమ్మ గారు "అబ్బాయి స్నేహితులు వచ్చినప్పుడు నువ్వెందుకూ అక్కడ, మా
ఇంటికి రావే తల్లీ! " అనేది.
అప్పుడప్పుడూ "ఇవాళ ఆఫీసుకు సెలవెట్టు! ఫలానా రాజేశ్వరి గారు పదహారు
ఫలాల నోము నోచుకుంటున్నారు. నీకు వాయనం ఇమ్మన్నాను. మధాహ్నం వస్తారు"
అని చెప్పేసేది.
"నాకు ఆఫీసులో పనుందండీ, కుదరదు" అని చెపితే " ఏం పనీ! అసలు హాయిగా ఇంటిపట్టున కూచోక అసలు నీకుద్యోగాలెందుకే పిచ్చితల్లి!" అనేది.
ఆ చుట్టుపక్కల వీధిలో ఎవరు ఏ నోము నోచుకున్నా వాయనాలివ్వాల్సిన
ముత్తైదువుల జాబితాలో నాకు తెలీకుండా, చెప్పకుండా నా పేరు ఇచ్చేసింది.
మేమిద్దరం ఎక్కడికన్నా బయలు దేరుతుంటే చాలు, "ఆగమ్మా, లక్ష్మి గారు
వస్తారు ఇవాళ!గ్రామ కుంకుమ నోము నోచిందావిడ" అనేది.
తప్పించుకు పోవడానికి వీల్లేదు.వాకిట్లోనే అరుగు మీద చేరో వైపూ కూచుని
ఉండేవాళ్ళు మిస్టర్ అండ్ మిసెస్ శాస్త్రి! ఇంకా విడ్డూరమైన సంగతి మేము ఏ షాపింగ్ కో బయలు దేరుతుంటె మాతోపాటు వచ్చేవాళ్ళు. నా చీరెలు ఆవిడే సెలెక్ట్ చేసిందో సారి!
క్షీరాబ్ది ద్వాదశి నోము రోజు బలవంతంగా ఉపవాసం ఉంచారు నన్ను.
తప్పించుకోడానికి ఆదివారం అయింది ఆరోజు. సాయంత్రానికి కళ్ళు తిరిగి పడిపోయాను.
అప్పుడు కూడా పూజయ్యేదాకా ఏమీ తినడానికి వీల్లేదన్నారు శాస్త్రి గారు.

ఇహ ఇల్లు మారక తప్పలేదు. నాలుగు నెలలు మా జీవిత రిమోట్లు వాళ్ల చేతిలో
పెట్టి బతికేసాం!
మరో నెలకు ద్విశ్రీ గాడు వచ్చాడు చాటంత మొహంతో!"ఒరేయ్,నీకు శాస్త్రి గారిల్లు గురించి ఎవరు చెప్పార్రా! అమ్మో నరకం రా బాబూ" అన్నాను.
వాడు విలాసంగా కాళ్ళుపుతూ "ఆ సంగతి నాకెప్పుడో తెలుసు! అసలు మీరే నాలుగు నెల్లుంది అక్కడ.ఇంతకు ముందు అందరూ నెలకో రెణ్ణెల్లకో ఖాళీ చేసారు! సారీ, పారిపోయారు . ఆయన పేరు T.S.Sastry కదా! అందరూ ఆయన్ని ముద్దుగా TroubleSome Sastry అని పిలుస్తారు" అని చెప్పాడు.
నాకు మాట రాలేదు.
"మరి నీకేం మాయరోగమొచ్చి మమ్మల్ని చేర్చావు అక్కడ!నీ మొహం తగలెయ్య,
మీ నాన్నతో చెప్తానుండు" అన్నాను.
"సారీ అక్కా, అ రోజు మీరు నా కవిత్వం బాగా లేదని తిట్టారుగా! నాకు
కోపం వచ్చి, చిన్న రివెంజ్ తీసుకోవాలనుకున్నా! అందుకే....." అని నవ్వి
నవ్వి చచ్చాడు.
ఆరోజు వాడికి కోపం ప్లేట్లో తిట్ల టిఫిను, శాపనార్ధాల భోజనం దండిగా
వడ్డించాను. ద్విశ్రీ గాడు సాయంత్రం రూముకి బయలుదేరుతూ "చెప్పడం మర్చిపోయానే
అక్కా!మీరిద్దరూ ఇచ్చిన పుస్తకాలు బాగానే పనికొచ్చాయి. ఫలానా ఊర్లోని
కళాపీఠం వాళ్ళు పెట్టిన కవితల పోటీల్లో నాకు మూడో బహుమతి
వచ్చింది." అంటూ ఒక నోట్ బుక్ తీశాడు."ఇదే ఆ కవిత" అంటూ!నాకు ఆశ్చర్యం వేసింది.
"పోనీలే బాగుపడ్డాడు" అనుకుంటూ పుస్తకం లాక్కుని
చూశాను.
"ప్రియా ఎన్నాళ్ళీ నిరీక్షణ " అంటూ మొదలైంది కవిత.

27 comments:

కల said...

మీ ఇంటాయన పెట్టిన కస్టాలు అబ్బో వద్దు బాబోయ్. నాకు మా అమ్మానాన్నలు చెబితేనే సరిగ్గా వినను, పాపం మీరెలా వేగారో వాళ్లతో. మీ ద్విశ్రీ గారు ఇప్పటికి అలానే ఉన్నారా అదే కవితలు రాసుకొంటూ?

నాకు ఏడుపు వస్తోంది, నేను ఏడుస్తున్నా, నా కవితలు బాలేవంటారా? వా వా వా.

Kathi Mahesh Kumar said...

హన్నా! ఊహాప్రేయసి నిరీక్షణ బాగాలేదంటారా! అందుకోసం ఆ మాత్రం రివెంజ్ తీర్చుకోవాలి లెండి. మొత్తానికి రిమోట్ నొక్కుడు జీవితం ఎలా ఉంటుందో చూసారన్నమాట.

కొందరు ఇంటివాళ్ళు అలా, ఇంట్లోవాళ్ళైపోయి ప్రాణంతీసేస్తారు. పైగా లేనిపోని బంధుత్వాలు వద్దన్నా కలిపేసుకుని దగ్గరవ్వడమేకాక నెత్తిమీద స్వారీలు కూడా చేసేస్తారు.

GIREESH K. said...

వాహ్...అదిరందండీ.

మాకు కూడా చెన్నైలో దాదాపు ఇటువంటి అనుభవమే కలిగింది. రెండు నెలల్లో ఇల్లు మారిపోయాము. బ్యాంకర్ని కాబట్టి బదిలీలూ, ఇల్లు మారడాలు మాకు మామూలే. కానీ, అద్దెకు దిగాలంటే మాత్రం, ముఖ్యమైన కండీషను - ఇంటి ఓనరు దగ్గర్లో ఉండ కూడదు!

nice post!

సుజాత వేల్పూరి said...

కల,
నీ కవితలు నాకు బాగా నచ్చుతాయి. ఊహా ప్రేయసి కోసం నిరీక్షణలుండవుగా మరి! కానీ సమయానికి గుర్తు రాలేదు. నిజం తల్లీ, శాస్త్రి గారి మీదొట్టు.

గిరీష్ గారు,
అద్దెకుండాలంటే ఇంటి వోనరు పక్కనే ఉండకూడదు. జీవిత సత్యం చెప్పారు. ఆ అనుభవం తర్వాత అదే జాగ్రత్త తీసుకున్నాం !

మహేష్ గారు,
మీరూ ఊహా ప్రేయసి గురించి కవిత్వం రాశారా ఏమిటి? 'కమకు ' పేరుతో!

Kathi Mahesh Kumar said...

@సుజాత: హ్మ్ "కమకు" పేరు బాగుందండి.ఎప్పుడూ ఇలా కలం పేరు గురించి ఆలోచించలేదు.ఇక ఊహాప్రేయసంటారా.. నా ఊహల్లో కేవలం సినిమా హీరోయిన్లుండేవారు లెండి. వాళ్ళ గురించి సినిమా పాటలే ఉన్నాయి కదా అని, నేను కవితలు రాసే కష్టం పెట్టుకోలేదు.

Purnima said...

bagunnai mee anubhavaalu :-)

రాధిక said...

హన్నా ఎంత మాటన్నారు మా కులపోళ్ళని[ఊహా కవి కులం]
మీరు సరిగా చదివినట్టులేరు నా కవితల్ని.కాస్త వెనక పేజీలకెళితే అన్నీ ఈ రకమయిన కవితలే :)
అందుకే నేనూ భుజాలు తడుముకున్నాను

ప్రపుల్ల చంద్ర said...

బాగా నవ్వించారు !!! అన్ని రోజులు భరించారంటే గ్రేట్ !!!

cbrao said...

నాకు ఒక పేర్గాంచిన, పెయింటర్ స్నేహితుడున్నారు. ఆయనకు స్నేహితులపై ఎవరిపైనన్నా (వాళ్ల పనులు నచ్చకపోతే) కోపం వస్తే అంటారు 'నువ్వు మనిషివా, కవివా?" కవి అంటే ఇంకో అర్థం కూడా ఉంది. కనిపించకుండా విసిగించేవాడు అని. మనకు ఎన్నో ఈతిబాధలుంటాయి. వాటిలో కవిబాధ కూడా ఒకటి.

కాని దేవులపల్లి కవితలు మనసును గిలిగింత పెడ్తాయి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రంలోని, ఎస్ రాజేశ్వరరావు స్వరపరచిన "ఎవరు చెప్పారమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకూ" పాట వినండి. స్నేహ హృదయులు అడగకుండానే సహాయం చేస్తారనే అర్థం కూడా ఈ పాటలో ఉంది.

Rajendra Devarapalli said...

నేను హైదరాబాద్ లో ఉద్యోగం వెలగబెట్టినరోజుల్లో ఒక శర్మ గారింట్లో ఒకగదిలో అద్దెకుండేవాడిని,ఇంకొక మితృడితో,అతగాడు ఆతర్వాత్తర్వాత ఒక లోక్ సభ సభ్యుడయ్యాడనుకోండి అది వేరే విషయం.వీడు ఈగది ఖాళీ చెయ్యకూడదూ అని వాళ్ళూ,అసలు ఈ రూమ్ వదలకూడదూ అని నేను అనుకుంటూ అలా కొన్ని నెలలు గడిపాము.ఆ అనుభవాలు రాయాలి తీరికదొరికనప్పుడు అవన్నీ గుర్తు చేసారు ఒక్కసారిగా :)

Unknown said...

మీ ఓపికకి జోహార్లు. ఉపవాసాలు కూడా ఎలా చేసారండి బాబు. మీకు సహన రత్న బిరుదు ఇవ్వచ్చు అస్సలు :)

Unknown said...

హహ.. ఒకే టపాతో కవులని ఏకి పారేశారు.

పాపం సినిమా కష్టాలొచ్చాయి మీకు...

RV said...

Sujatha garu chaala baaga rasarandi...kallaku kattinattuga.
vaaramantha busy ga undi kastha relax avudamani koodali chusa....anudlo mee topic title nachindi....ento chuddamani continue chesa....idi chadivaka meee old blogs kuda chadavalnipisthundi

Unknown said...

ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్కు ఫ్లాష్ బ్యాక్...సూపర్!!. :-)

-భరత్

Bolloju Baba said...

very nice

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

చాలా బాగుంది మీ "ఓనరుని" కధ

నిషిగంధ said...

"విషాద తుషార బిందువు " లా :)))
నా కవితల్లో కూడా ఒక 'నిరీక్షణ ' ఉంది.. అందుకే రాధిక అన్నట్టు నేను కూడా గబగబా భుజాలు తడిమేసుకున్నాను :-)

మీ ఇంటాయన కష్టాలు మాత్రం సూపర్! చదవడానికి ఇంత కామెడీ గా ఉంది గానీ పాపం మీరెంత అవస్థ పడిఉంటారో కదా!!

సుజాత వేల్పూరి said...

రాధిక, నిషి
మీ ఇద్దరి కవితలూ నాకు బాగా నచ్చుతాయన్న సంగతి మీకు తెలియనిది కాదు. కాకపోతే వచనాలను లైన్లలో పేర్చి కవిత్వంగా భావించమని (వాడు భావిస్తున్నది కాక) అవతలి వాళ్లని పీక్కు తినే మా ద్విశ్రీ గాడి గురించి తప్పక రాయాలనిపించి రాశాను. మీ నిరీక్షణకి నేను కామెంట్ కూడా పెట్టినట్టు గుర్తు!మీ లాంటి కాకలు తీరిన భావకవుల గురించి రాసేంత ధైర్యమే! అమ్మో!

అయినా ద్విశ్రీగాడి కవిత్వం ఆగిపోయిందిలే! తిక్క బాగా కుదిరింది. పెళ్ళయింది.

RG said...

మా ఓనరు మీ ఓనరంతకాకపోయినా... ఇంతే.
మిలట్రీ నుంచి వచ్చాడు, పొరపాటున దొరికితే చాలు ఆటోబయోగ్రఫీ విప్పేస్తాడు. పొద్దున్నే జాగింగ్ అనీ, యోగాఅనీ ఫ్లాట్స్ లో పిల్లలందరి ఉసురూ పోస్కుంటూ ఉంటాడు.

మంచివాడేగానీ, మంచితనంకూడా అప్పుడప్పుడూ అవతలివాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని ఆయన్నిచూసినతర్వాతే అర్థమైంది.

PBJ said...

సుజాత గారు,
మీ బ్లాగ్ ఇటీవలే కనుక్కున్నాను. చదువుతూంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను. నేను తెలుగు లో రాయటం ఇదే మొదటి సారి, ఇది కూడా బాగానే ఉంది.జలంధర గారు ఒక వ్యాసం లో రాసారు,"నేను తెలుగు అమ్మాయి ని, ఇది నాకు నచ్చిన తెలుగు పుస్తకం అని గర్వంగా చెప్పుకోగలిగిన పుస్తకం" అని ఏదో పుస్తకం గురించి .అలాగే ఇది నాకు నచ్చిన అచ్చ తెలుగు బ్లాగు అని చెప్పుకొవలాని ఉంది.:)

Sujata M said...

i missed this. Very hilarious. I tell umasankar that I am waiting for him like sridevi in khudagawa saying 'woh ayega!' 'woh ayega!'. :D In this way I am like DS.

ప్రతాప్ said...

నేను కొద్దిగా భుజాలు తడుముకొంటున్నా. నన్ను అనలేదుగా మీరు?

కానీ మీ ఓనరు గారి కథ బాగా నవ్వించింది.

Anonymous said...

అసలు వాత ఎవరికి పెట్టారొ తెలియక రాధికగారు నిశిగంధ గారు భుజాలు తడుముకున్నట్టున్నారు..
ఐనా ఈ నిరీక్షణవాదం ఇలా విత్తు స్థాయి లో ఉండబట్టి మీరిలా అంటున్నారు గాని, అది త్వరలో మాహా వృక్షమై అన్నివాదాలకి వక్షమొడ్డి*, అందరు విమర్శకులకి నిలిచి గెలిచే రోజు, "రక్ష రక్ష, నాకీ నిరీక్షణవాదం లో శిక్షణిచ్చి పుణ్యం కట్టుకోండి మీకు అక్షరలక్షలిస్తా" అంటు మా దయా దాక్షిణ్యాలకోసం ఆటో రిక్షాలో నీ.ర.సం చుట్టు దీక్షాబద్ధులై ప్రదక్షిణలు చేసే రోజు ఎంతో దూరం లేదు

అప్పటిదాకా మేం నిరీక్షిస్తూ ఉంటాం
-ఊదం
( నీరసం అధ్యక్షుడు)
-ద్విశ్రీ
( నీరసం మహాధ్యక్షుడు)
-టి.యస్. శాస్త్రి

( నీరసం గౌరవాధ్యక్షుడు)
==
వక్షమొడ్డి* -> ఏంచేయమంటారు, రొమ్మొడ్డి అందంతంటే రొమ్ము లొ క్ష లేదాయె.
నీ.ర.సం -> నిరీక్షణా విలంబనానికి సూచికగా దీర్ఘమిచ్చుకున్నాము.

వేణూశ్రీకాంత్ said...

హ హ సుజాత గారు మీ ఇంటి ఓనరు గారి వరస బాగుందండీ కానీ మీ ఇద్దరి సహనాన్ని కూడా మెచ్చుకోవాలి. టపా అంతా ఒకెత్తు ద్విశ్రీ పై కామెంట్ ఒకెత్తు "అయినా ద్విశ్రీగాడి కవిత్వం ఆగిపోయిందిలే! తిక్క బాగా కుదిరింది. పెళ్ళయింది."
Hilarious :-)

Unknown said...

మీ ద్విశ్రి కవితాప్రేరణ తో నాలో కవితావేశం పొంగింది నాన్నపకన్డి సుజాత కాసుకోండి.ప్రేమ ఒక పేడ.ప్రేయసి ఒక దూడ .ప్రియుడే దాని నీడ. తల్లిదండ్రులే అడ్డుగోడ కాబట్టి ప్రేమించకు ఓ మగడా.ఇంక మీ ఇష్టం యెంత సేపన్న వా వా వా అనుకోండి.

రామ్ said...

"పొగ బారిన నా గుండె గోడలకు మల్లెపూలతో వెల్ల వేశాను(సిగరెట్లు తాగుతున్నాడా ఏమిటి)
నువ్వొస్తావని విషాద తుషార(అంటే ఏమిటబ్బా) బిందువులను పోగు చేసాను

ఎంతకీ రావేం?(దబాయింపు)
నా మీద జాలి లేదా(వేడుకోలు)
నా చివరి క్షణాలకైనా వస్తావా(బ్లాక్ మెయిల్)
ఇక అడగనులే(అలక, నిష్టూరం)"

వాహవ్వా !! వాహవ్వా !!

Vasu said...

బావుంది .

నేను ఏదో అప్లికేషన్ పెట్టేడప్పుడు కవిత్వం హాబీగా పెడతాను అంటే .. మా మాష్టారు ఒకాయన ఏ అది తప్ప ఇంకేం లేదా

అది తప్ప ఇంకేం లేకపోవడానికి నువ్వేమన్నా భగ్న ప్రేమికుడివా అనేవాడు ..

నేను కూడా ద్విశ్రీ నా ఒకప్పుడు అని అనుమానం వస్తోంది :)

Post a Comment