August 25, 2008

బ్రేక్ ఫాస్ట్ రెడీ!

బ్లాగాడిస్తా రవి గారి దోశ పురాణం చదివాక నాకూ మన బ్రేక్ ఫాస్ట్ గురించి చిన్న టపా రాయాలనిపించింది. "మన" అంటే తెలుగు అని కాదు, మన దక్షిణ భారత ఉపాహారం అన్నమాట!

మొన్నీ మధ్య మా చుట్టాలింటికి వెళ్లాను. పొద్దున్నే కాఫీ తాగుతూ పేపరు చదువుతుంటే గలగలా చప్పుడు వినపడింది. ఏమిటా అని చూస్తే ఇంటావిడ(అంటే ఇంటి ఓనర్ భార్య కాదండీ, ఇంటి తాలూకు ఆవిడ అని)
అనగా నా కజిను స్కూలుకెళ్లబోతున్న పిల్లలిద్దర్నీ కూచోబెట్టి ఆ 'గల గల్లాడేవి ' కుక్క పాలు తాగే బౌలు లాంటి పాత్రలు వాళ్లముందు పెట్టి పోస్తోంది వాటిలో!
కార్న్ ఫ్లేక్స్! విత్ చల్లని పాలు!
పిల్లల మొహాలు చూశాను ఆత్రుతగా...ఎందుకంటే పొద్దున్నే కార్న్ ఫ్లేక్స్ అనబడే పదార్ధాన్ని నవ్వుతూ, సంతోషంగా తినే పిల్లలని నా జీవితంలో ఇంతవరకూ చూళ్ళేదు. నేనూహించినట్టే వాళ్ళ మొహాలు ఏ భావమూ లేకుండా ఉన్నాయి.

"పొద్దున్నే నీకిదేం పోయేకాలం రాధా, హాయిగా ఏ ఇడ్లీలో, దోశలో రుచిగా వేసిపెట్టకుండా ఈ గల గలలేమిటి" అనడిగితే రాధ నవ్వుతూ "చాల్లే, పొద్దున్నే అంత భారీగా తింటే క్లాసులో నిద్ర పోతారు. ఇవైతే లైట్ గా ఉంటాయి. పైగా వాళ్ళు ఇడ్లీలో మరోటో తింటే ఇహ పాలు తాగరు. ఇదనుకో, ఇందులోనో పాలు కలిపి ఇస్తాను కాబట్టి రెండూ తీసుకున్నట్టే" అంది.

మీలో ఎంతమంది పొద్దున్నే కార్న్ ఫ్లేక్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారో నాకైతే తెలీదు గానీ, ఆరోగ్య సూత్రాలు పక్కనపెట్టి, వాటిని నిజంగా సంతోషంగా ఇష్టంగా తినేవాళ్ళు చేతులెత్తండి అంటే ఒక్కళ్ళు చేతులెత్తరు.
అది మాత్రం గ్యారంటీ గా చెప్పగలను.అదోరకమైన మైల్డ్ వాసనతో కర కర లాడే కార్న్ ఫ్లేక్స్ ని పాలతో పొద్దున్నే...!ఎలా తింటారబ్బా?

ఈ మధ్య మరో బ్రేక్ ఫాస్ట్ తయారైంది. అది 'ఓట్స్ '! మా అన్నయ్య హైదరాబాదు నించి తెప్పించుకుని మరీ ఓట్స్ తో గంజి కాచి, అదే లెండి కొంచెం పాలిష్డ్ గా చెపుతాను...porridge తయారు చేసి, అది తాగుతాడు. అదీ వాడి బ్రేక్ ఫాస్ట్!

ఎప్పుడన్నా టూర్లలో ఉన్నప్పుడు మనం దిగిన హోటలు వాడు courtecy breakfast ఏర్పాటు చేసినపుడు కూడా నేనైతే ఇడ్లీలు, ఊతప్పాలు,దోశలు, వడలు(అదే..గారెలు) ఇవే వెతుక్కుంటాను. మా వారు సగం కాలిన బ్రెడ్ ముక్కలు(మీకన్నీ వివరంగా చెప్పాల్సిందేనా...అదేనండీ టోస్టులు) , బటర్,జాం, నాలుగు పుచ్చకాయ ముక్కలు పెట్టుకుని కానిస్తారు.

నాకు అన్ని దేశాల వెజిటేరియన్ ఫుడ్ ఇష్టమే! మెక్సికన్ మరీ! అసలు మా గుంటూరు వాళ్ళే ఎప్పుడో వేల ఏళ్ళ క్రితం వెళ్ళి మెక్సికోలో స్థిరపడి అలా ఖారం ఖారంగా వండడం వాళ్లకు నేర్పి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం! లంచ్ కి ఏదైనా ఓకే! కానీ బ్రేక్ ఫాస్ట్ సాలిడ్ గా సౌత్ ఇండియన్ స్టైల్ లో లేకపోటే అసలు నేనేంటో తెలుస్తుంది చుట్టుపక్కలున్న వాళ్లకి.
ప్రపంచంలో ఎవరైనా సరే పొద్దున్నే ఇడ్లీలు, దోశలు తినకండా రోజుని ఎలా ప్రారంభిస్తారా అని ఒకప్పుడు భలే ఆశ్చర్యపొయేదాన్ని!

మేము ఒక్లహోమాలో ఉన్నపుడు మా వారి బ్రహ్మచారి ఫ్రెండ్స్ రోజూ "మా ఇంటిమీదుగా" ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టపడేవాళ్ళు. వేడి వేడిగా ఇడ్లీలు, ఫిల్టర్ కాఫీ దొరుకుతాయని! హోటల్లో లాగా బోలెడంత ఇడ్లీ పిండి స్టాక్ లో ఉంచాల్సి వచ్చేది!

మల్లెపువ్వుల్లాంటి మెత్తని ఇడ్లీ, పల్చని రేకుల్లాంటి దోశలు, వడలు, జీడిపప్పు ఉప్మా, పూరీ,(బంగాళాదుంప కూరతో) కారప్పొడి,కొబ్బరి చట్నీ, ఎర్రగా కాలిన పెసరట్లు(అల్లం పచ్చడితో) ఇవీ బ్రేక్ ఫాస్ట్ కి నేను ఇష్టపడేవి! మా ఇంట్లో రోజూ నేను చేసేవి కూడా ఇవే! వీకెండ్స్ పెసరట్లు వేయకపోతే నాకు నిష్కృతి లేదు.

అమ్మో, ఇన్ని ఆయిల్ ఫుడ్సా, మరి కాలరీలో? అనుకుంటున్నారా! పరిగెత్తండి బాబూ, రన్నింగ్ , జాగింగ్, వర్కౌట్లు, ఇవన్నీ ఎందుకున్నాయి మరి? ఏదో ఒకటి చేసి వదిలించుకోండి!నోరు మాత్రం కట్టుకోకండి, నలభై దాటితే ఎలాగూ తప్పదు!
నా పాలసీ అదే! సాలిడ్ గా బ్రేక్ ఫాస్ట్ పడితే లంచ్ గురించి నాకు పట్టింపు లేదు. పూరీల్లాంటివి చేసామా, extra physical exercise సృష్టించుకుంటాను గానీ, నో చెప్పే ప్రసక్తే లేదు!

మంచి బ్రేక్ ఫాస్ట్ లాగించాలని ఉంటే వీకెండ్స్ మా ఇంటికొచ్చేయండి మరి!

33 comments:

Kathi Mahesh Kumar said...

నోరూరించేసారండీ బాబూ!

టైం దాదాపు రాత్రి 11 కావస్తోంది. మీ టిఫిన్ లిస్ట్ చూసి, మళ్ళీ ఏమైనా తిందామనే కోరికపుట్టింది. ఇల్లంతావెతికితే మా ఆవిడ చేసిన కొబ్బరిలడ్డూ కనిపించింది. రెండుతీసి ఇకేసారి నోట్లో వేసుకుని ఈ కామెంట్ రాస్తున్నా.

నా బరువు పెరగటానికి మీరూ ఒక కారణమని గ్రహించగలరు. గుర్రుతో-మహేష్

Purnima said...

ఛా.. నిద్ర పోవడానికి వెళ్ళేదాన్ని వెళ్ళక కూడలి తెరవటం ఒక తప్పు, మీ టపా శీర్షిక చూసి కూడా చదవడం ఇంకో తప్పు. ఇప్పటికిప్పుడు మీరు ఆఖరున రాసిన ఒక్కో ఐటమ్ వచ్చేస్తే బాగుణ్ణు అనిపిస్తుంది. ఇంకో ఎనిమిది గంటలు ఎలాగండీ ఆ టెంప్టేషన్ ని రెసిస్ట్ చేసుకోవడం? :-(

ఓట్స్ గంజి అంటే నాకు భలే ఇష్టం. :-) వీకెండ్ వరకూ ఆగలేను కానీ, రేపే వచ్చేద్దునా మీ వంట రుచి చూడడానికి?

cbrao said...

మీకు ఆశ్చర్యం కలగొచ్చేమో కాని, మా ఇంట్లో, ఇంటిల్లిపాదీ, మా పనమ్మాయి కవితతో సహా కార్న్ ఫ్లేక్స్, పాలు, ఓట్స్ తో చేసే పోరిడ్జ్, బ్రెడ్ ఆంలెట్, బ్రెడ్ జాం, పండ్లు ఉదయం ఉపాహారం గా తీసుకుంటాము. ఇవన్నీ low calorie foods; బ్రెడ్ ఆంలెట్ తప్ప. ఇవన్నీ ఇష్టంగా తీసుకుంటాము. కార్న్ ఫ్లేక్స్, పాలు ఈ combination ను I simply love it.
ఇహ పెసరట్టు, అల్లం పచ్చడితో simply superb. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇంకా రవ్వ దోశ, రవ్వ ఇడ్లీ కూడా. కాచుకోండి వచ్చే ఆదివారం ఉదయం, మీ ఇంటిపై దాడికి.

Rajendra Devarapalli said...

సుజాత గారు కాదు కాదు అమ్మలూ ఎంతయినా మనం మనం గుంటూరు జిల్లావాళ్ళం,మంచైనా చెడ్డైనా మన మధ్యే ఉండాలి కానీ ఇలా ఆ దోశెలు,పూరీలు ఆ మెత్తని ఇడ్డేనలూ అన్నీ తినటానికి ఇలా అందరినీ పిలిస్తే ఎలా?ఎవరికీ చెప్పను గానీ మన యింటికి(నేను హైదరాబాద్ ఒకవేళవస్తే సంగతి)ఎలా రావాలి??

Unknown said...

ఓ ఇడ్లీ, ఓ దోశా పార్సెల్ :-)

మరే భలే చెప్పారు... అసలే ఫాస్టు ని బ్రేకు చేస్తూ తినేది. మంచి తిండి తినకపోతే ఎలా ?
ఆదివారం పెసరట్లు మా ఇంట్లోనూ షరా మామూలే...

Anonymous said...

భలే..

నాకీ బ్రేక్ ఫాస్ట్ జీవన్మరణ సమస్య అయిపోయిందండీ అమ్మ దగ్గర్నుంచి బయటకొచ్చినప్పట్నుండీ.

నాకు REC Warangal లో ఉన్నప్పుడు లంచ్, డిన్నర్ బానే పెట్టేవాళ్ళు కాని, బ్రేక్ ఫాస్ట్ చంపేసే వాళ్ళు వెధవలు. వారంలో నాలుగు రోజులు, బ్రెడ్ జాం బట్టర్ పెట్టేవాళ్ళు.నాకు పరమ ఎలర్జీ అవంటే. దాంతో నా కడుపు ఎండిపోయేది, almost శోష వచ్చి పడిపొయేవాణ్ణి లంచ్ వరకూ ఆగలేక.

ఇక్కడికొచ్చిన తరవాత మరీ నరకం అయిపోయింది ప్రొద్దున్న, కాఫీ(అదో కషాయం) నీళ్ళతో కడుపు నింపుకుంటుంటే ఎవరో పరిచయం చేసారు Oat Meal ని.

It's my saviour now.

రాధిక said...

పిల్లలు ఏ టిఫిన్ పెట్టినా అలాగే తింటారు సుజాత గారూ.మా అబ్బాయి అయితే అభావం గా కాదు విచారంగా తింటాడు.చపాతి కాస్త తింటున్నాడు కదా అని అల్పాహారం లోకి కూడా వాడికోసం చెయ్యడం మొదలు పెట్టాను.అంతే అదీ మానేసాడు.
పెళ్ళవక ముందు నాకు కూడా మీ లిస్టే వుండేది అల్పాహారం లోకి.హైదరాబాదు పెళ్ళయిన మా వదిన ఎపుడూ చెపుతూ వుండేది అక్కడ చాలా మంది బ్రెడ్ తింటారని.అప్పుడు నవ్వుకునేవాళ్ళం....జ్వరం వచ్చినోళ్ళలా బ్రెడ్ ఏమిటని.ఇప్పుడూ అమ్మా వాళ్ళు అలాగే అడుగుతారు.
పెళ్ళయ్యాకా మావారు హెవీ అయిపోతుందని బ్రేడ్,సిరియలే తినేవారు.నేను మాత్రం నాకోసం చేసుకుని తినేదానిని.తరువాత తరువాత ఇంక నేనూ మారిపోయా.ఇప్పుడు నా బ్రేక్ ఫాస్ట్ ఆపిల్.

సుజ్జి said...

mari mohamatam pettakandi.. mee intiki vachyagalanu...:)

సుజాత వేల్పూరి said...

రాధిక,
భలే చెప్పారండి! మా అమ్మాయీ అంతే,"రెండు ఇడ్లీలా" అని రోజూ గొడవే! సగం చాలుట. పైగా అది కూడా "నువ్వు తినిపిస్తేనే, పాలు తాగుతా" అని ఇంకో బెదిరింపు లాంటి ఆఫర్ ఇస్తుంది. దానికి పెట్టాక నాకు ఆకలి, ఆసక్తి చస్తాయి. అందుకని ముందు నేను కానిచ్చి తర్వాతే దానికి తినిపిస్తాను.

యాపిల్ తింటారా? అదీ బ్రేక్ ఫాస్ట్ గా! నాకసలు మామిడి పండు కోసం తప్ప ఇంకే పండు కోసం ఆకలి వేయదు.

ప్రపుల్ల చంద్ర said...

మరీ నోరూరించారు.. సంవత్సరం నుండి వాటి కోసం మొహంవాచి ఉన్నాను... ఎప్పటికి తింటానో !!!! నా mail ID ఇస్తాను రెండు పెసరట్లు, మూడు పూరీలు, నాలుగు ఇడ్లీలు 'attachment' లో పంపండి :)

సుజాత వేల్పూరి said...

మహేష్, అర్థ రాత్రి కూడా చిరుతిళ్ళా? పైగా నెపం నా మీదా? హన్నా!

పూర్ణిమా, ఎప్పుడైనా సరే, వచ్చెయ్యి!

రావు గారు,
చెప్పానుగా నలభైల్లోకి వచ్చి పడ్డాక అప్పుడు చూస్తాములెండి కార్న్ ఫ్లేక్స్ సంగతి! ఓ దానికింకా చాల టైముంది!

అల్లం పెసరట్టుకైతే ఎప్పుడొచ్చినా ఓకే వీకెండ్స్!

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర కుమార్ గారూ,
మీరు మా ఇంటికి రావాలే గానీ గుంటూరు గీతా కేఫ్ కి ధీటుగా మైసూరు బజ్జీ కూడా వేసి రుచి చూపిస్తాను మరి!

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్ గారు,
పార్సెల్ సర్వీస్ లేదు. లైవ్ సర్వింగే!

సుజాత వేల్పూరి said...

independent,
నాకసలు బ్రెడ్ చూస్తేనే అర్జెంట్ గా జ్వరమొస్తుంది. అమ్మ దగ్గర్నించి వెళ్లాక కొన్ని రోజులు ఇవన్నీ తప్పవు మరి!

ప్రఫుల్ల చంద్ర,
అటాచ్ మెంట్ లో పంపడానికి వీలైతే ఎంత బాగుణ్ణు!

sujji,
మొహమాటం అక్కర్లేదు! నిజంగానే రండి!

మేధ said...

కొరియాలో ఉన్నన్నాళ్ళు ఆ కార్న్-ఫ్లేక్స్ తినలేక చచ్చేదాన్ని... నేను తీసుకువెళ్ళిన మిక్స్(ఉప్మా/దోశ) అన్నీ అయిపోయేసరికి ఇక వాటితోనే గడపాల్సి వచ్చేది...
నేను అంతకుముందు మీలాగే బ్రేక్-ఫాస్ట్ లో బ్రెడ్/అదీ-ఇదీ ఎలా తింటారా అనుకునేదాన్ని.. ఒకసారి మా స్నేహితురాలితో ఇదే మాట అంటే, నాకు "Urban Sophostication" తెలియదు అంది!!!
పైన ఎన్ని చెప్పినా ఈ టపా మోరల్ ఏంటి అంటే... మీరు వంట బాగా చేస్తారు అని చెబుతున్నారనమాట!!!!

సుజాత వేల్పూరి said...

మేథా,
జీడిపప్పు లేని ఉప్మాలో కాలేశారు అని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ టపా కి మోరల్ లేదు. ఒక వేళ ఉన్నట్టు ఎవరైనా ఫీలయితే అది 'నేను araban sophisticated కాదు అని గ్రహించవచ్చు! లేదా 'నాకు సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ తప్ప పడదు ' అని కూడా అనుకోవచ్చు!

వంటదేముందండి, ఎవరైనా చేసి పడెయ్యొచ్చు! అదసలు పెద్ద సమస్యే కాదు!

మేధ said...

@సుజాత గారూ: నేను మోరల్ అన్నది ఊరికే...
కాలేజీలో ఉన్నప్పుడు ఒక జోక్ ఉండేది.. ఎవరైనా ఏ విషయం గురించి ఐనా చెబుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని ఓహో, ఇప్పుడు నువ్వు ఆ పని బాగా చేస్తావని మేము పొగడాలా అని టీజ్ చేసేవాళ్ళం.. సో నేను ఆ ఉద్దేశ్యంలో అన్నాను.. అంతే.. nothing more than that...

MURALI said...

పెళ్ళయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఎందుకండీ ఏదో నా లాంటి బ్రహ్మచారులకి కావాలి గాని. నేను వచ్చేస్తున్నానండి ఈ ఆదివారం. అసలు టిఫిన్ కే కాదు మా రూం దగ్గరలో మంచి ఆంధ్రా భోజనం కూడా దొరికి చావటం లేదు. అందులోనూ వారంతాలయితే మరీ దారుణం. బిరియాని తప్ప మరొకటి దొరకదు. ఆంధ్రదేశం లో అందునా రాజధానిలో ఉండీ మా పాట్లు ఇవి. మంచి పులిహోరా లాంటిది ప్లాన్ చెయ్యండి. ఎలాగూ వస్తాం కాబట్టి భోజనం కూడా మీ ఇంట్లోనే.

సుజాత వేల్పూరి said...

Medha,
mee uddESam nEnu correct gaanE artham chesukunnaanu. nijamgaanE moral ledu kadaani alaa raasaanantE!

prasanna said...

chaduvutuntene noru oorutundi sujata garu.

సుజాత వేల్పూరి said...

మురళి,
మీకు హైదరాబాదులో ఇవాల్టి రోజుల్లో ఆంధ్రా ఫుడ్ దొరకడం లేదంటే ఆశ్చర్యమే! ఆల్రైటుగా వచ్చెయ్యండి మరి! పక్కా ఆంధ్రా పులిహోర రెడీగా ఉంటుంది.

రవి said...

మీరు చెప్పిన మొక్క జొన్న రేకులు, పాలల్లో నాంచి తింటూ ఓ నెల గడిపాను నేను విదేశాల్లో. వాపస్ మన దేసానికి వచ్చాక తిరిగి జన జీవన స్రవంతి లోకి రావడానికి 3 నెలలు పట్టింది. ఆ 3 నెలలూ ...ఎందుకులెండి :-)..

సుజాత వేల్పూరి said...

రవి గారు,
మనది కాని తిండి విడవకుండా తింటే అలాగే ఉంటుంది. మా ఆయన గుర్గావ్లో ఉద్యోగం వచ్చాక నేను వెంటనే వెళ్లకుండా రెండు నెలల తర్వాత వెళ్లాను. వెంటనే తను నా దగ్గర తీసుకున్న ప్రామిస్ "ఏడాది వరకు పనీర్, పచ్చి బఠానీలు వాడనని ఒట్టెయ్యి" అని!అంత విరక్తి పుట్టింది. నెల రోజుల వరకు అసలు కూరలే వండలేదు. రోజూ ఆవకాయే!

Sujata M said...

అదిరింది !!!! నాకు రోటీ, రాజ్మా + ఒక బాయిల్డ్ ఎగ్ + బోల్డంత టీ ఇష్టం!!! అసలా కాంబినేషన్ (పిచ్చి కాంబినేషన్) తిని చాలా రోజులయింది. ఆయిల్ ఆయిల్ అని కానీ చోలే బటూరే ఇష్టం.

ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ మీకూ నచ్చవని తెలిసి, నాను నేనే ఒకటిచ్చుకున్నాను '' సేం పించ్.''

జీవితం లో నేను చెయ్యలేక పోయిన వంటకం ఇటలీ (ఇడ్లీ ని ఒరిస్సా వాళ్ళు ఇలా పిలుస్తారు). ఎప్పుడు చేసినా ఏదో ఒకటి చెడి నా పరువు తీసేస్తాయి కాబట్టి, ఇడ్లీ అంటేనే నాకు కొంచెం అదీ, ఇదీ !!

మిగతా సౌత్ ఇండియన్ రుచులలో దద్ధ్యోజనం ఇష్టం. పొద్దున్నే తినడానికి మాత్రం కాదు.

కల said...

2 రవ్వదోస,
1 పెసరట్టు,
1 ప్లేట్ పులిహోర (చింతపండుతో చేసేది),
1 ప్లేట్ పూరి (నంజుకోవడానికి టమాటో కర్రీ బాగా కారంగా),
తర్వాత చిక్కని కాఫీ ఇదండీ నా టిఫిన్ లిస్టు,
మరి చేసి పెడుతారా? రోజూ మా హాస్టల్ భోజనం తినలేక చచ్చిపోతున్నాం.

సుజాత వేల్పూరి said...

సుజాత గారు,
మీకు ఇటలీ ఎప్పుడు తినాలనిపించినా మా ఇంటికి రండి!
కలా,
నీ లిస్టు వీకెండ్ రెడీ! వచ్చెయ్యి వితఔట్ నోటీసు! నో ప్రాబ్లెం!

ప్రసన్నా,
మీకు కూడా ఆహ్వానం!

సుజాత వేల్పూరి said...

అసలు హైదరాబాదు బ్లాగర్లంతా వనభోజనాలు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఆలొచించండి! త్వరలోనే కార్తీక మాసం కూడా వచ్చుచున్నది.

MURALI said...

సుజాత గారు,
మీరు వంటల విషయం లో ఈ మాత్రం హామీ ఇస్తే ఒక్క వన భోజనమేమిటి కొండ భోజనం, కోన భోజనం, లోయ భోజనం దేనికైనా సిద్దమే.

గీతాచార్య said...

గుంటూరోళ్ళ పవర్ ఏంటో చెప్పారు. మీ టిఫిన్లు బంగారం గానూ! అసలే నాకు వడా-సాంబారు ఇష్టం. బక్కోడిని అయినా చెన్నై వెళితే నాకు లంచ్ కూడా వడే. అసలు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లలో ఉండే రుచి నాకు మిగతావాటిలో కనబడదు. ఇంక పూరీ కూరా తినాలంటే నా పొట్ట ఎక్స్పాన్డ్స్ బియోండ్ హారిజాన్స్. ఇంక దోషలలో నేను తిన్న వాటిలో బెస్ట్ మైసూరు లోనివి.

"మంచి బ్రేక్ ఫాస్ట్ లాగించాలని ఉంటే వీకెండ్స్ మా ఇంటికొచ్చేయండి మరి!"

అన్నారు మరి నేను రావొచ్చా?

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
"అసలు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో ఉన్నంత రుచి మిగతా వాటిలో నాకు కనపడదు" అందుకే ఈ టపా రాశాను.
ఆహ్వానం అందరికీనూ! మీరూ రావొచ్చు.
కాకపోతే మీకు నరసరావు పేట తాలూకు స్పెషల్స్ ఏవైనా చెయ్యాలేమో ఆలోచిస్తాను! స్టేషన్ రోడ్ లోని దుర్గా భవన్, మరియు కోమలా విలాస్ లోని టిఫిన్స్ అదిరి పోతాయని మా నాన్న గారు ప్రతి ఆదివారం అక్కడినుంచి టిఫిన్లు తెప్పించే వారు నా చిన్నప్పుడు. ఇప్పుడా హోటళ్ళు ఉన్నాయో లేవో మరి అక్కడ!

వేణూశ్రీకాంత్ said...

అయ్యో నేను ఇండియా నుండి బ్లాగు లు చదవకుండా ఎంత పొరపాటు చేసానండీ...మీ ఇన్విటేషన్ మిస్ అయిపోయా మళ్ళీ ఓ సంవత్సరం ఆగాలేమో ఇపుడు. నా ఓటు కూడా సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ కేనండీ గత నెల రోజులూ ఆ విషయం లో ఏ మాత్రం రాజీ పడకుండా లాగించేసా కాని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓట్ మీల్ పై ఆధార పడాల్సి వస్తుంది.

నాగప్రసాద్ said...

మీ టపా చదవగానే నాకు "ఉగ్గాని ( ఇది రాయలసీమ లో చేస్తారు ), మిరపకాయ బజ్జీ కాంబినేషన్" గుర్తుకు వచ్చాయి. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏమో వాటిని.

Nandu.. said...

మీరు ఈ అర్ధ రాత్రి జెర్సీ నగరం (జెర్సీ సిటీ) లో నా లాంటి తెలుగు బ్రహ్మ చరులకి నూరురించే బ్రేక్ ఫాస్ట్ మెను చెప్తే ఎలాగండి బాబూ!!!!

Post a Comment