December 13, 2008

ఆటవిక న్యాయం అమలైంది!

సరే, వాళ్ళు ఆ యువతుల మీద యాసిడ్ పోశారు. పోలీసులు "ఆత్మ రక్షణ" కోసం వాళ్ళను ఎన్ కౌంటర్ చేశారు. వాళ్ళకు తగిన శిక్షే పడింది."ఇంకెవ్వరూ ఇలాంటి పని చేయరు".అని జనం అభిప్రాయపడుతున్నారు. దుష్ట సంహారం జరిగిందని పండగ చేసుకుంటున్నారు.


ముగ్గురు సామాన్య యువకుల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడం కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వస్తుందా అనే డౌటు నాకు రావట్లేదు. అంతే కాదు.
"పోలీసుల కస్టడీ లో ఉన్న నిందితులకు తుప్పు పట్టిన కత్తులు, తుపాకీలు ఎలా వచ్చాయి? దొంగిలించిన వాహనాన్ని వెతకడానికి అర్థ రాత్రి ఎందుకు వెళ్లారు? "లాంటి ప్రశ్నలు కూడా నేనడగను. జవాబులు తెలిసిన ప్రశ్నలు మళ్ళీ అడగటం దేనికి?

ఆ ముగ్గురు నిందితులు చేసింది మామూలు నేరం కాదు. అమానుషమైన చర్య! యాసిడ్ పోసి ఆడపిల్లల రూప లావణ్యాలను చిదిమి చిదిమి కసి తీర్చుకోవాలనుకున్నారంటే వారిలో ప్రతీకార వాంఛ ఎంతగా ప్రజ్వరిల్లి పోయిందో అర్థం చేసుకోవచ్చు. పాపం హాస్పటల్లో నరక యాతన అనుభవిస్తున్న ఆ పిల్లలు కూడా "వాడిని యాసిడ్ పోసి ఆ బాధలోనే వరంగల్ రోడ్లనీ తిప్పి రోడ్డు మీద వదిలేయాలి" అని తమ ఆగ్రహాన్ని,ఆవేదనను వెళ్ళగక్కారు. చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ల ముందు మైకు పెట్టి ఇలాంటి భీకర ప్రతిజ్ఞలు చేయిస్తున్న మీడియా మీద ఎనలేని అభిమానం కలిగింది.


దీన్ని రాజకీయం చేయకుండా కేవలం తల్లులుగా, తండ్రులుగా వచ్చి ఆ ఇద్దరు యువతుల్ని పరామర్శిస్తున్న రాజకీయ నాయకుల్ని చూసి కూడా "పాపం, ఎంత బాధ పడుతున్నారో" అనిపించింది.

నిందితులకు కఠిన   శిక్ష పడాలని నేనూ కోరుకున్నాను. అంతకు ముందు నేను ఇంకో విషయం కూడా ఆలోచించదల్చుకున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను. ఆ పిల్లలిద్దరూ దారుణమైన బాధకు గురవుతూ బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో 'వారి పాత్ర ఏమిటి " అనే ప్రశ్న లేవనెత్తడం నాకే అమానుషంగా అనిపిస్తుంది కానీ   తప్పని సరి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను వేసుకుని జవాబు కోసం వెదుక్కుంటున్నాను.

ఈ రోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ప్రధాన నిందితుడు దాదాపు 25 వేల రూపాయల విలువైన బహుమతులు స్వప్నిక కు ఇచ్చాడు. అతడంటే ఇష్టం లేనప్పుడు ఆ బహుమతుల్ని ఆమె ఎలా తీసుకుంది? ఆ అమ్మాయి తండ్రి "మా అమ్మాయి జోలికి రావొద్దు" అని అతడిని హెచ్చరించాడట. "బహుమతులెందుకు తీసుకున్నావు?" అని కూతుర్ని ఎందుకు మందలించలేదు? పక్కా కమర్షియల్ అయిన ఆ నిందితుడు "అయితే నా డబ్బు నాకిచ్చేయమ"ని పేచీ కి దిగాడు. దానికి అమ్మాయి తండ్రి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎందుకని? "తీసుకో, నీ ముష్టి బహుమతులు" అని వాడి మొహాన్న కొట్టలేదెందుకని?


స్వప్నిక తన వద్దనుంచి బహుమతుల్ని తీసుకుని కార్తీక్ అనే మరో యువకుడితో చనువుగా ఉంటోందని శ్రీనివాస్ కి ఖోపం వచ్చింది. గట్టిగా నిలదీసి అడిగితే "డబ్బు తిరిగిచ్చే విషయమై మాట్లాడ్డానికి కాలేజీ వద్దకు రమ్మన్నది"ట. కార్తీక్ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసా తెలియదా? యండమూరి ఏదో పుస్తకంలో రాసినట్టు పిల్లల ప్రేమ వ్యవహారాలు ఆఖరున తెలిసేది తల్లిదండ్రులకేనేమో!


ఇంతకు ముందు జెమిని టీవీ యాంకర్, రేడియో జాకీ లక్ష్మి సుజాత కూడా ఇలాంటి పనే చేసి హత్యకు గురైంది.హంతకుడితో డబ్బు కోసం 'చనువు" గా ఉంటూ, అవసరం తీరగానే మరొకరితో చనువు వెలగబెట్టడం ఆమె చేసిన పని.(పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం) ఆడపిల్లలు జీవితాల్ని ఎందుకింతా ఈజీగా తీసుకుంటున్నారో అంతుపట్టడం లేదు. "సులభంగా" చేతికందే డబ్బుకోసం, విలాసాల కోసం అబ్బాయిలతో చనువుగా ఉండటం, బహుమతుల వంటివాటిని ఆశించడం, తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తుందో ఊహ తెలిసిన యువతులు గ్రహించలేరా? ఖరీదైన బహుమతుల్ని ఇవ్వడానికి సిద్ధపడిన యువకులు "ఏమీ" ఆశించకుండానే ఇస్తారా? ఈ విషయాన్ని అమ్మాయిలు గ్రహించలేరా?



ముసుగేసుకున్న మందుపాతరల లాంటి అబ్బాయిలతో స్నేహాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఎప్పటికి నేర్చుకుంటారు వీళ్ళు? నిన్న టీవీలో చూశాను, ఒక రాజకీయ నాయకురాలైన నటి, కొడుకుల్ని సరిగా పెంచలేదని శ్రీనివాస్, అతడి మిత్రుల తల్లి దండ్రుల్ని శాపనార్థాలు పెడుతోంది. మగపిల్లలకేనా కావాలి సరైన పెంపకం?


తను కోరుకుంది ఇంకొకరికి దక్కనివ్వకపొవడం, తనకు దక్కకపోతే దాన్ని నాశనం అయినా సరే చేయడానికి ఒడిగట్టడం ..ఇవాల్టి యువకుల్లో , చాలా మందిలో అభివృద్ధి చెందుతున్న వైరస్! శ్రీలక్ష్మి, లక్ష్మి సుజాత, మరొకరు, మరొకరు ...ఎంతో మంది బలైన తర్వాత కూడా అలవి కాని స్నేహాలు ఎటు దారి తీస్తాయో గ్రహించలేని అమాయకులైన ఆడపిల్లని చూసి జాలి పడాలో కోపం తెచ్చుకోవాలో తెలీడం లేదు.

కాలి బూడిదైన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు భవిషత్తులో ఏమైపోతాయో ఎవరికి పడుతుంది? ఒక వారం రోజులు ఈ మీడియా హడావుడి, రాజకీయ నేతల పరామర్శలు! ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతల సంగతి ఏమిటి?

అసలు జనం ఆగ్రహావేశం చూసి పోలీసులు వాళ్లని ఎన్ కౌంటర్ చేసారు గానీ,వాళ్ళకు పడిన శిక్ష ఎంతని? క్షణంలో ప్రాణాలు పోయాయి. విచారణ తర్వాత వాళ్ళకు జీవితాంతం (14 యేళ్ళు కాదు)కఠిన జైలు శిక్ష విధించాలి. కళ్ళముందే భవిష్యత్తు మంచులా కరిగి పోయి, జీవితం సర్వ నాశనం కావడం అంటే తెలిసేలా చేయాలి. ఒకటో అరో కాకుండా ఆడపిల్లల్ని వేధించే ప్రతి వారికీ కఠిన శిక్షలు విధించాల్సిందే! కానీ ఉన్న పళంగా ప్రాణాలు హరించడమా శిక్ష?

కానీ ఈ ఎన్ కౌంటర్ వల్ల మరొక ప్రేమోన్మాది ఇలాంటి పనులు చేయడానికి వెనకడతాడన్నది మాత్రం నిజం కాదు !ఏమైనా సరే, తనను కాదన్నందుకో, తనతో "తిరగనందుకో" ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకుని బయలు దేరిన ఉన్మాది 'గతంలో ఇలాంటి పనులెవరు చేసారు, వారికి పడ్డ శిక్షలేంటి? ఎన్నాళ్ళు విచారణ జరిగింది" వంటి విషయాలు ఆలోచిస్తూ కూచోడు. కక్ష తీరాలంతే! ఇలాంటి తక్షణ శిక్షల వల్ల ఆటవిక న్యాయం అమలవుతుందే కానీ మనుషుల ప్రవృత్తిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.

స్వప్నిక హింస అనుభవించాలని శ్రీనివాస్ కోరుకున్నాడు, అతడు చావాలని మనం కోరుకున్నాం! "అమ్మయ్య, వాళ్లను చంపేశారు, వాళ్ళ ప్రాణాలు తీశారు" అని చెప్పుకుని టపాసులు కాల్చుకునే స్థితిలో మనమున్నామంటే , ఆ ముగ్గురు నిందితులకీ, మనకీ పెద్ద తేడా లేదనిపిస్తోంది.

చర్మం కాలి,మాంసం ఉడికి రూపం చెరిగి పోయిన స్వప్నిక ను చూసినపుడు .."వాళ్ళకీ ఇలా జరిగితే గానీ ఈ బాధ తెలియదు" అని నాకూ అనిపించింది. కానీ ఇలా వెంటనే చంపేస్తారు అని ఊహించలేదు.ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అన్న ప్రశ్నకు కూడా ఎస్పీ సజ్జనార్ అవకాశం ఇవ్వడం లేదు. "చట్టం తన పని తను చేసింది. people should "understand" that" అని మీడియా వాళ్ళను గద్దించాడు. చట్టం పని అధికారం తో ఇష్టమొచ్చిన వాళ్లను హత్యలు చేయడం అన్నమాట!ఇదే పని ఏ రాజకీయ నాయకుడి చుట్టమో పక్కమో చేస్తే చట్టం ఏం చేస్తుందో ఆయేషా కేసులో చూసాం!



నేను కాలేజీలో ఉన్నపుడు మా అమ్మమ్మ ఎపుడైనా "అరిటాకు- ముల్లు" సామెత చెప్తే "ఆపు నీ గోల" అని మండిపడేదాన్ని. అప్పుడు సమాజం ఇంత దరిద్రంగా తయారవలేదు. ప్రస్తుతం గుర్రపు డెక్క ఆకులా విస్తరించిన కలుష సంస్కృతి లో, ఉన్మాద స్థాయికి చేరిన ప్రేమ చరిత్రల నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఆ సామెత గురించి చెప్తే,కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అనిపిస్తుందొక్కోసారి! కానీ వాస్తవ జీవితం నుంచి నేర్చుకునే పాఠాలకంటే పుస్తకాల్లో నేర్చుకునేది ఎక్కువేం కాదు.



మరో పక్క రాజకీయ పార్టీలకు, మహిళా సంఘాలకు చెందిన మహిళా మణులు ఒక టీవీ ఛానెల్లో ఇదే విషయం మీద భేదాభిప్రాయాలతో కాట్లకుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. ఏమిటో, అంతా గొప్ప కన్ ఫ్యూజన్ గా ఉంది.

59 comments:

KumarN said...

మీకు దణ్ణం పెడతాను సుజాత గారూ, Drop this argument please...

How could you even possible think in those lines అండీ? Am I living in the same world that you are living in? How come I am flabbergasted by this argument, and you don't?

పిల్లలకి ముందు ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేంత వరకూ మీరా మూల కారణాలని వెతికే లాజిక్ వెదికితే పరవాలేదు కాని, ఆ అబ్బాయిలది కూడా పూర్తి తప్పు కాదు అంటే కనక, మీరన్నట్లు అమానుషం మాత్రమే కాదు. క్షమార్హం కూడా కాదు అనుకుంటున్నాను.
I am sorry, if I was harsh, but I am really angry at this argument.

If there was ever a relationship, then it's basic individual liberty సుజాత గారూ. అందులోంచి బయటకు రావడం కూడా అంతే.It's their right. వాళ్ళను ఎమోషనల్ గా హర్ట్ చేసింది కాబట్టి, వాళ్ళు ఆసిడ్ పోసారు. మూల కారణం కొంత వాళ్ళది కూడా అనడం, అనాగరికం. Absolutely uncivilized thought. అది క్రిమినల్ ఆక్ట్ అండి. No amounts of emotional damage would justify any kind of criminal act. Period.

ఇప్పుడే సరిగమలు బ్లాగులో కూడా ఇలాంటివే చూసి అక్కడ కామెంట్ రాసాను. దయచేసి అది కూడా ఒకసారి చదవండి ప్లీజ్.

I have a daughter, and I guess you do too. Please I beg you to get into their hearts and look at the world from that place.

By the way, ఇవ్వాళ జరిగిన ఎన్ కౌంటర్స్, ఆటవిక న్యాయానికి పరాకాష్ట. ఆదిమ సమాజంలో మాత్రమే ఆమోదకరం. కాని, మీ ఫీలింగ్స్ ని కూడా నేను అర్ధం చేసుకోగలను. I guess I am OK with it, although I don't appreciate.

I am sorry if I went overboard, but I just can't tolerate throwing stones on those girls.

సుజాత వేల్పూరి said...

కుమార్ గారు,
సరిగమలు బ్లాగులో మీ కామెంట్ చూసి మీకు జావాబు కూడా ఇచ్చాను.
నాకూ ఒక కూతురు ఉంది కాబట్టే ఆడపిల్లలు ఎంత జాగ్రత్త ఉండాలో మగపిల్లల తల్లుల కంటే ఎక్కువగా ఆలోచిస్తాను నేను. అబ్బాయిలది తప్పు కాదని నేను అనడం లేదు. ముమ్మాటికీ తప్పే! కానీ వాళ్ళు ఇటువంటి అమానుష చర్యలకు దిగడానికి దోహదం చేసే విధంగా అమ్మాయిల ప్రవర్తన ఉండకూడదంటున్నాను. స్త్రీ పురుషుల సమానత్వం గురించి మనం మాట్లాడుకున్నంత ఫెయిర్ గా లేదండీ బయట పరిస్థితి! నియో రిచ్ ఫామిలీలను, పేజ్ 3 జనాలనూ వదిలెయ్యండి! సామాన్య ప్రజల సమాజం ఇంకా చాలా మామూలు స్థాయిలోనే ఉంది.

నేను చెప్పేది ఆడపిల్లలు ఆ ఇడియట్స్ ని ఎమోషనల్ గా రెచ్చగొట్టడం తప్పని కాదు. సరైన మనిషిని స్నేహానికి ఎంచుకోకపోవడం తప్పంటున్నాను. వాస్తవ సమాజాన్ని పొరలు లేని కళ్ళతో పరిశీలించమంటున్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకుని మెలగమంటున్నాను. మృగ ప్రవృత్తి తలెత్తిన మనిషి దగ్గర ఏ ధర్మాలు, సిద్ధాంతాలు పని చెయ్యవు. ఒక్కటి చెప్పండి? బహుమతులు, డబ్బు ఆశించి చేసేవి స్నేహాలా, బిజెనెస్సా? డబ్బు ఎర చూపించాడంటే అతడి మనస్థత్వం ఎలాంటిదో అంచనా వేసి అటువంటి వారికి దూరంగా ఉండాలనే నేను చెప్పింది. ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదనే నేను భావిస్తుంది.

నాకు ఆడపిల్లలంటే చాలా ప్రేమ, ఈ ఇస్టుననీ ముద్ర వేసుకోలేను గానీ! అందుకే ఆడపిల్లల గురించి ఇంత కంగారు పడి వాళ్లకు చీవాట్లు పెడతాను ప్రేమతోనే!

josna said...

సుజాత గారు,
చాలా బాగా రాసారండి,మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.నా మనస్సులో భావాలన్ని మీ టపా ద్వారా చదివినట్లు ఉంది.
u r 100% correct.
ఆ నీచులకి సరైన శిక్ష పడలేదు

josna said...
This comment has been removed by the author.
నేస్తం said...

సుజాత గారూ ఇప్పుడే సిరి సిరి మువ్వగారి కామెంట్స్ లో మీ కామెంట్ చూసి వస్తున్నా .. మీరు చెప్పింది నూటి కి నూట యాబై శాతం నిజం .. అమ్మయిలూ స్వేచ్చ మంచిదే కాని అతి ఎప్పటికీ మంచిది కాదు.. సరదాగా ఫ్రెండ్ షిప్ అనే పదాలతో మొదలు పెట్టేవి చాలా వరకూ ప్రేమ తోనే ముగుస్తాయి .. ఈ రోజు ఇంత మంది తల్లితండ్రుల కన్నీటికి కారణం కేవలం ఆ అబ్బాయిలే కాదు ఎంతో కొంత తప్పు అమ్మయిదీ ఉంది అనిపిస్తుంది.ఏది ఎమైనా మీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న తల్లితండ్రులను అన్యాయం చేయకండి పిల్లలూ .. మీ తల్లి తండ్రులు మీ నుండి ఆశించేది మీరు ఆనందం గా నవ్వుతూ బ్రతకాలని కాని ఇలా మీ బ్రతుకులకు అర్దం పర్దం లేకుండా చేసుకుంటారని కాదు ..సుజాత గారు ఈ యువత చెడిపోవడానికి సగం కారణం పెంపకం, అతి స్వేచ్చా ,సినిమాలు,యువతను రెచ్చగొట్టే సైట్లు..అనిపిస్తుంది మిగిలిన సంగతి ఎలా ఉన్నా చిన్నపుడె తల్లి తండ్రులు పిల్లలను దగ్గర తీసుకుని వారికి మంచి కతలు, వారి చిన్ననాటి తీయనైన సంఘటనలు చెప్పుతూ ఆహ్లదమైన వాతవరణాన్ని కల్పిస్తే బాగుంటుందని నా అబి ప్రాయం. వారి మొహాన ఇంత డబ్బు పడేసి అడిగిన ప్రతి వస్తువూ కొని ఇచ్చేసి అదే ప్రేమ అనుకుంటె మనమే వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామేమొ..

Chivukula Krishnamohan said...

నిజంగానే చాలా అయోమయంగా ఉందండి. అనుకోకుండా ఇవాళ టీవీ చూసా. (నేను సాధారణంగా చూడను.) ఎన్‌కౌంటర్ దానిలో న్యాయాన్యాయాలు పక్కన పెట్టండి. నేను ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి తల్లిని మన మసాలా వార్తా చానల్ నస పెట్టడం చూసాను. ఆ భాగం సుమారుగా ఇలా సాగింది.
టివీ - అమ్మా, మీకు సంతోషంగా ఉందా?
అమ్మ - నాకు సంతోషమూ లేదు, బాధా లేదు.
టీవీ - మీ అమ్మాయిని ఇంత హింస పెట్టినవాడిని చంపేసారుగా - మీకు సంతోషంగా లేదా?
అమ్మ - మా అమ్మాయిని ఎలా బాగు చేసుకోవాలో అన్న ఉద్దేశ్యం తప్ప ప్రస్తుతానికి నా మనసులో ఇంకేమీ రావట్లేదండి.
టీవీ - మీ అమ్మాయిని ఇంత దారుణంగా హింసించి మిమ్మల్ని గత 48 గంటలుగా ఇంత చిత్తక్షోభకు గురిచేసినవాడికి ఇలా జరిగినందుకు మీరు ఆనందం ఫీల్ అవుతున్నారా?

అసలు ఏమిటిది? ఇదేనా వార్తా చానళ్ళకి ఉన్న సామాజిక బాధ్యత?
ఇంక ఎన్‌కౌంటర్ కి సంబంధించి ఏమిటి చెబుతాము?
నిజంగా అతడు నేరప్రవృత్తి పోలీసులకి భయం కల్గించి ఉండచ్చు.( ఏసిడ్ ఎలా పోస్తే మంచిదో ప్రేక్టీసు చేసి మరీ పోసాడట) కోర్టులో ఒక ఏడాదో ఎంతో శిక్ష పడితే (ఆ అమ్మాయి చచ్చిపోకపోతే మన న్యాయవ్యవస్థ కి అంతకంటా శిక్ష వేసే అధికారం ఉండదనుకుంటా) ఆ తరువాత అతడు స్వేఛ్చగా సమాజంలో తిరిగితే పరిస్థితి ఏమిటని ఎస్.పి. గారు ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండచ్చు. మన ప్రభుత్వం వారు ప్రతిపక్షాలవాళ్ళు దీనిమీద అనవసరం మైలేజీ తీసుకుంటున్నారని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వుండచ్చు. ఇవేవీ కాకుండా మరిన్ని కూడా ఉండచ్చు. వాటన్నిటికంటా నాకు దిగ్భ్రమ కలిగిస్తున్న విషయం ఏమిటంటే -
హింసని మన జీవనవిధానంగా ఎంత సులభంగా మార్చేసుకున్నామా అని భయం వేస్తోంది. ప్రేమని ఒప్పుకోలేదు కాబట్టి ఏసిడ్ ప్రాక్టీసు చేసిమరీ పోస్తాడు ఒకడు. వాడిని కాల్చి మరీ చంపుతుంది మన చట్టం. అది న్యాయమే అని సాధారణ జనంతో పాటు మన విజ్ఞులైన బ్లాగర్లతో పాటు అందరూ ఆమోదించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది.

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
పాతరాతి గుహలు పాల రాతిగృహాలైనా
అడివి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
రామబాణమార్పిందా రావణకాష్టం
కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

మారదు లోకం - మారదు లోకం...

మీ టపాని పక్కదోవ పట్టించినట్టున్నాను. క్షంతవ్యుడిని.

సుజాత వేల్పూరి said...

కృష్ణ మోహన్ గారు, మీ వ్యాఖ్య మీ ఆవేదనను ప్రతిఫలిస్తోంది. మీడియా గురించి రాయడం మొదలెడితే ఒక వంద టపాల సీరియల్ రాయాలి నేను. అంత అధ్వాన్నంగా ఉంది పరిస్థితి!

ఒక ఛానెల్లో అడుగుతున్నారు.."వాళ్లను కాల్చి చంపడం కంటే ప్రణీత కోరినట్లు యాసిడ్ పోసి చంపితే బాగుండేదంటారా" అని! నోట మాట రాకపోవడమంటే ఏమిటో తెలిసింది నాకు అది చూసి! మీడియాకు సామాజిక బాధ్యత ఉండాలని ఆశించడం ఒట్టి అవివేకం ఇవాళ!

హింసను ఇలా జీవన విధానంలో ఒక భాగంగా చట్టబద్ధంగా మార్చినందుకు, దాన్ని మనం accept చేసినందుకు నాకు భయంగానే ఉంది. మరికొన్ని ఆలోచనలు రేపారు మీరు!

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు
మంచి టపా!

"సరైన మనిషిని స్నేహానికి ఎంచుకోకపోవడం తప్పంటున్నాను. వాస్తవ సమాజాన్ని పొరలు లేని కళ్ళతో పరిశీలించమంటున్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకుని మెలగమంటున్నాను."

అవును... అది అత్యవసరం. అమ్మాయికి మరీ అత్యవసరం. ఏందుకంటే, అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే అమ్మాయి అబ్బాయికి విశ్వాసం ప్రకటించిన తరవాత ఆ అబ్బాయి గురించి ఎన్ని చెప్పినా లెక్క చెయ్యదు. పైగా తనకి తెలిసిన లోకం చిన్నది అని తెలుసుకోకుండా, ఎవరైనా మంచి కోరే వాళ్ళు ఆ అబ్బాయి గురించి చెడుగా చెప్పినా, వాళ్ళని దూరం చేసుకుంటుంది అది ఇంట్లో వాళ్ళైనా,బంధువులైనా,స్నేహితులైనా... ఇలా జరగడం అమ్మాయిల్లో చాలా ఎక్కువ... పరిస్థితులు చేజారిపోయిన తరవాత,అప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. కొంతమంది అంతా అయిపోయాక, బయటపడలేక జీవితాన్ని కొనసాగిస్తారు...

@కుమార్ గారు
సుజాత గారన్నట్టు, పరిస్థితులు ఇంకా సమాజం అంతా సమానంగా లేదండి. చదువుకున్న, వివేకం కలిగిన, ఆలోచన చెయ్యగలిగిన మగాడు కూడా సహనం కోల్పోతున్న ఉదంతాలు చాలా చూస్తున్నాము... తమ సమయాన్ని, శక్తిని, వనరులుని ఒక అమ్మాయికోసం 4, 5 సంవత్సరాలు వెచ్చించి తనని ప్రేమిస్తుంది అనుకుని(నిజంగానే ప్రేమిస్తున్నట్టు ఉంటుంది ఆ అమ్మాయి, తన కలలకి తగ్గట్టు జీవిత భాగస్వామి అవుతుందనే అంచనాలతో అతను ఉంటాడు), తీరా సమయం వచ్చేసరికి అమ్మాయి సరైన కారణాలు లేకుండా దూరమైపోతే.. (ఇది అబ్బాయిలకీ వర్తిస్తుంది, నేను ఏ ఒక్కరినో సమర్ధించడం లేదు, నా అభిప్రాయం రెండు వైపులా ఆలోచించాలనే!)... ఎంత ఘోరంగా ఉంటుంది?? తను ఇంకో బంధం లోకి అడుగు పెట్టడానికి ఒక మధ్య తరగతి మనిషికి ఎంత సమయం పడుతుంది? జీవితం వ్యర్ధం అయిపోతున్నట్టు అనిపించదూ? ఒక్కసారిగా, అగమ్యగోచరంగా అనిపించదూ? అలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరగొచ్చు కదా? చుట్టూ ఉన్న జనం ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనేదాని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది... కొంత మంది మనుషులు ఈ ట్రౌమ ని తట్టుకోగలరు, కొంత మంది ఆత్మ హత్య చేసుకుంటారు, కొంతమంది భవిష్యత్తు పాడు చేసుకుంటారు, కొంతమంది హత్య చేస్తారు... అలా అని, అలానే చెయ్యాలి అని నేను సమర్ధిస్తున్నాను అనుకోకండి... అందుకనే కొన్ని బంధాలలోకి వెంటనే అడుగుపెట్టకూడదు, ఆలోచించుకుని అడుగుపెట్టాలి...


సమాజాన్ని పది మంది బతకడానికి అనుకూలంగా మలచుకోవాల్సిన భాధ్యత మన మీద ఉంది. మనం చేసే పనులు, ఎదుటి వారి జీవితం(అందరి జీవితాలు విలువైనవే) మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అది నా హక్కు అనుకోవడం కొన్ని సార్లు అర్ధవంతంగా ఉండదు...

గీతాచార్య said...

అసలు ఎవరికీ rational thoughts రావా?

ఇప్పటిదాకా ఈ విషయం గురించి నేను చదివిన వాటిలో మీదే కొంతవరకూ సంయమనంతో, rational view తో ఉన్నది.

నేనూ స్పందిన్చాలనుకుంటున్నాను. కానీ ఈ వేడి తగ్గినతరువాత వ్రాస్తాను. మన వాళ్లు ఎలాంటి సమాధానాలు చెపుతారో నాకు. ఆవేశం స్వప్నిక మీదో, లేకపోతే ఆ శ్రీనివాస్ మీదో కాదు నాకు కలిగింది. ఆ ఆటవిక న్యాయాన్ని సంతోషం గా ఆహ్వానించిన వారి మీద. God save the people. That's all.

Balancing nature తో వ్రాసినందుకు మీకు thanks.

Saraswathi Kumar said...

సుజాత గారూ!

బాగా రాశారు.పొద్దున పేపర్ చదవగానే జరిగినదానిలో అమ్మాయి పాత్ర నాకు అర్థమైనది. ఆ విషయాన్నే మీరు చక్కగా వివరించారు.

నాకు ఈ ఎంకౌంటర్ విషయం మీ బ్లాగు ద్వారానే తెలిసినది. ఈ రోజెందుకో నేనింతవరకూ TV లో న్యూస్ చూడలేదు. పోలీసులు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ఆ ముగ్గురు నిందితులను పావులుగా వాడుకున్నారు. సాధారణ ప్రజలకు జరిగే ఏ అన్యాయాన్నీ పోలీసులు సీరియస్ గా తీసుకోరు. ఆ చెడ్డపేరును రూపుమాపుకోవడానికి అప్పుడప్పుడూ ఇలాంటి 'అతి ' కి పాల్పడుతుంటారు. యాసిడ్ దాడి పెద్ద నేరమే కావచ్చు.కానీ ఉగ్రవాదులను, నరహంతకులను చంపినట్లుగా టీనేజ్ కుర్రాళ్ళను చంపడం పోలీసుల మతిమాలిన చర్య.వాళ్ళు చేసిన యాసిడ్ దాడి చూసి వాళ్ళను చంపాలని ప్రజలు అంటే అనవచ్చు.కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు చావాలని కోరుకుని ఉండరు.ఎందుకంటే మన ప్రజలకు ఇంతకంటే పెద్ద పెద్ద నేరగాళ్ళనే భరించగలిగే ఓపిక ఉన్నది.

satya said...

Kumar gaaru, I completely agree with what you said.

@Sujaatha gaaru, I think your post is not funding for a good argument. how can we simply believe the statement of the convict..? based on which indirectly blaming the girl for her fate..

Anonymous said...

సుజాతగారూ మీరు చెప్పిన ఒక విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నను
అది అమ్మయిలు తమ ప్రవర్తన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తగురించి. స్వేచ్చ, సమానత్వం అంటూ మనం ముందుకెళ్ళిపోతే సరిపోయిందా మనం వున్న సమాజం , మన చుట్టుపక్కలమనతో పాటు వుంటున్న జనం వాళ్ళ ఆలోచనలూ ఎప్పటికప్పుడు నిసితంగా గమనిస్తూ వుండాలి . ఈ సంఘటనలో అమ్మయిల గురించి నాకు తెలీదుకాని నాకు తెల్సిన చాలామంది కలేజి అమ్మయిలు అబ్బయిలతో ఫ్రెండ్ షిప్ చేయటం , గంటలతరబడి వాల్లతో ఫొన్లో మాట్లాడటం వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ లని పార్టిలని ఎంజయ్ చేయటం వాడు కొంచెం హద్దుమీరేసరికి వాణ్ణిదూరం పెట్టడం చూసాను. అవతలివాడు మంచోడైతే అక్కడితో అది ఆగిపోతుంది .కాని అలాకాకపోతే పరిస్తితి భయానకంగా మారుతుంది . ఇలాంటి సంఘటనలో బలెయ్యే అమ్మాయిలందరూ ఒకేలాటి ప్రవర్తన కలిగి వుండక పోవచ్చు . తలొంచుకొని తనమానాన తనుండే పిల్లలకి కూడా వేధింపులు తప్పటంలేదు . అమ్మాయిలయినా అబ్బాయిలయినా అందరూ మన ఇళ్ళల్లోంచి వచ్చే అమాయకపు పిల్లలే . మన గుమ్మం బయట కాచుకు కూర్చున్న విష సంస్కృతి , తప్పుడు భావాల్ని వెదజల్లే సినిమాలు పిసాచాల్ల మన పిల్లలని కబళిస్తున్నయి

Kathi Mahesh Kumar said...

పొద్దున్నే ఎన్కౌంటర్ విషయం తెలియగానే ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. దాదాపు ఇలాంటి చర్చ లండన్ ప్రేమోన్మాదం నేపధ్యంలో బ్లాగుల్లో జరిగింది కాబట్టి రాద్ధామనుకోలేదు. కానీ, మీటపా చూసింతరువాత సాత్వనకలిగింది.

ప్రేమోన్మాదం మన సమాజం సృష్టించుకున్న రుగ్మత. దానికి అన్నిస్థాయిల్లో చికిత్స జరగాలి.

జరిగింది ఘోరమైతే, పోలీసుల అతివుత్సాహం దారుణం.ప్రజల అసహనం అర్థం చేసుకోదగ్గదే అయినా,ఆటవికన్యాయాన్ని సమర్ధించిన తీరు ఉన్మాదాన్ని తలపిస్తోంది.ఇదే మన ఇన్స్టంట్ జస్టిస్ తీరైతే...మనల్ని ఎవ్వరూ కాపాడలేరు.

పరిమళం said...

ఒక మానవత్వం మరచిన మృగం మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారో నాకర్ధం కాలేదు .వాడిని వాడు సమర్ధించు కోడానికి ఏమైనా చెప్తాడు .ఇక్కడ మీరొక విషయం విస్మరించారు ప్రేమించక పోతే బహుమతులు ఎందుకు తీసుకోవాలని
అన్నారు కాని నిన్న వాడి నోటితో వాడే నేను ప్రేమించలేదు ,ఆ అమ్మాయే నన్ను ప్రేమించింది అని చెప్పాడు .మరి ప్రేమించని అమ్మాయి కోసం వీడెందుకు వేలకు వేలు ఖర్చుపెట్టినట్టు ?దీన్ని బట్టే అర్ధమౌతోంది వాడు చెప్పేవి ఏమాత్రం నిజమో .ఎందఱో అమాయకులైన అమ్మాయిలు బలి పోతున్నారండి .మగవాడు మోసం చేస్తే ఆడపిల్లలు నిరాహార
దీక్షలు చేస్తారు ,మౌన పోరాటాలు చేస్తారు తప్ప యాసిడ్ పోసేయటం ,నరికేయడం ,చంపేయడం చేస్తుంటే ఇప్పటికి ఎంతమంది మగవాళ్ళపై యాసిడ్ దాడులు జరిగేవో .మోసం చేయటం ,మోసపోవటం ఏ ఒక్క జాతికో జన్మ హక్కు కాదుకదా ?కాదన్న వాళ్ళనల్లా కాల్చుకుంటూ పోవచ్చుననే ధీమా వాళ్ళలో వుండకుండా ఈ ఎన్కౌంటర్ ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నా .

Anonymous said...

కుమార్ గారు,
మీరొక్క విషయాన్ని గమనించండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అన్నా, ఆ ముగ్గురు చేసిన నేరాన్ని సమర్ధించే పిచ్చి పని ఎవరూ చేయరు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క మూల కారణాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచన తప్ప, నేరాన్ని సమర్ధించాలన్న ఆలోచన రాదు. మీరన్నట్లు, ఆ అమ్మాయికి తన జీవిటాన్ని నిర్ణయించుకునే హక్కు వుంది. కాకపోతే నేరం జరిగేటప్పుడు హక్కుల గురించి మాట్లాడడం కన్నా, జరగకుండా వుండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడం ఉత్తమం. ఎందుకంటే, నేరం చేసేవాడు హక్కుల గురించి అలోచించే ఇంగిత ఙ్ఞానాన్ని కొల్పోయే ఆపని చేస్తాడు. ఒకవేల అలా ఆలోచించగలిగితే ఆపని అతను చేయడు.

అలాంటప్పుడు, నేరం జరగకుండా ఆపే మార్గం ఏది? ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడమా, లేక నేరం జరిగేందుకు అవకాశం కలగకుండా చూసుకోవడమా? ఖచ్చితంగా రెండవదే ఉత్తమమని నాకనిపిస్తోంది. తప్పుచేసేది మగవాడైతే ఆంక్షలు ఆడవాల్లకెందుకని కొంతమంది అడుగుతున్నారు, మీ వ్యాఖ్యలో కూడా ఆ కోణం వుందనిపిస్తోంది. కానీ ఆంక్షలు ఆడా మగా ఇద్దరికీ విధించమనే చెప్పారు. ప్రస్తుతం ఆ ముగ్గురు, ఆ అమ్మాయిల మీద ఆసిడ్ పోసి ఘోరమైన తప్పు చేసారు కాబట్టి మీ వ్యాక్య ప్రస్తుతానికి సబబుగానే వుంది. కానీ, వారు ఆపని చేయక పూర్వం పరిస్థితి ఏమిటి? నిజంగానే అతను ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చివుంటే (ఇచ్చింది నిజమని నేను చెప్పడం లేదు, ఒకవేల ఐతే అని మాత్రమే అంటున్నాను) అన్నిరోజులు ఆ అమ్మాయితో తిరిగి, ఆ అమ్మాయి కోసం అన్ని పాట్లు పడిన అబ్బాయిని బాదపెట్టడం తప్పు కదా (ఒకవేల అమ్మాయిలు ముందునుండి ఒప్పుకోకపోతే అది వేరే విషయం). అలా చేయడం మంచిదేనా? (ఈ అమ్మాయిలు అలా చేసారని నేను చెప్పడం లేదు. It is a generalization of whole topic. ఇలా ప్రవర్తించే అమ్మాయిలు లేకపోలేదు.)

ఐనా సరే, అలా అమ్మాయిలు ప్రవర్తించినా సరే, ఆసిడ్ పోయడం తప్పే. కానీ నేను ఇదివరకే చెప్పాను, నేరాలు చేసేటప్పుడు నేరస్తులు తప్పొప్పుల గురించి ఆలోచించరు. ఆసిడ్ పోసిన తరువాత అది అన్యాయమని తేలితే ఆ అమ్మాయికి తిరిగి యదారూపు వచ్చేట్టుంటే, ఏది తప్పు ఏది ఒప్పు అన్నది ఆలోచించడం వలన లాభం వుంటుంది. లేకపోతే, అది జరగకుండా ఆపడమెలా అన్నది ఆలొచిస్తేనే మంచిది, కాదంటారా? ఇక నేరం జరిగిన తరువాతంటారా, ఇప్పుడు వారిని నక్షలైట్లను, తీవ్రవాదులను కాల్చినట్లు కాల్చినా వారింట్లొ వాల్లు తప్ప మరెవ్వరూ బాదపడట్లేదు. at the same time, ఆ అమ్మాయిల పరిస్థితి బాగుపడలేదు.

Anonymous said...

ఆసిడ్ దాడిలో శిక్షలు ఎంత కఠినంగా వుంటాయో తెలియాలంటే ఈ వార్త చదవండి. నిందితుడికి కర్ణాటక హై-కోర్ట్ యావజ్జీవిత శిక్ష విధించింది. యావజ్జీవము అంటే ఇప్పుడు 14 యేల్లు కాదు, జీవించి వున్నంతకాలం. మరణ శిక్ష కన్నా ఇదే కఠినమైనదని నేను భావిస్తాను. ఆ వార్త చదవాలనుకుంటే ఈకింద ఇచ్చిన లంకె నొక్కండి.

http://www.telegraphindia.com/1060920/asp/atleisure/story_6767293.asp

ఇస్లాం - కొన్ని నిజాలు said...

సుజాత గారు, మీ post కు నెనర్లు. ఒక ఆడపిల్ల అయ్యుండి మీరు ఇలా వ్రాయడం చాలా గొప్ప విషయం.(నేను మాత్రం ఇది ఒక అబ్బయి వ్రాశాడనుకున్నాను) ఈ మొత్తం కధలో బయటకు కనబడని ఒక కోణాన్ని మీరు చూపారు.
ఇప్పుడు వీడిని చంపారు సరే, రేపు ఇది చూచి పది మంది ఆగుతారు. కాని పదకొండో వాడు ఆగడు. నేరం ఎలా దొరక్కుండా చేయాలో ప్రయత్నిస్తాడు. తరువాత మనకు కనీసం ఇప్పటిలా ఎవరు నేరం చేశారో కూడా కనీసం తెలియదు. అప్పుడు హాయిగా పోలీసులను తిట్టుకోవచ్చు.

prasanna said...

sujata garu,u are 100% correct,nenu edito anukuntunnano ade correct ga meeru chepparu.

Unknown said...

ఈ సంఘటన వెనుకనున్న సామాజిక నేపధ్యాన్ని గురించి అల్లం నారాయణ గారు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం ఈ సందర్భంగా అందరమూ చర్చించుకోవలసి ఉంటుంది. ఈ సంఘటన వెనుకనున్న సినిమాలు, వ్యక్తివాదాల సంస్కృతిని అర్ధంచేసుకోక పోతే ఈ సమస్యల మూలాలు కనుగొనలేము.

ఒక బాధితురాలు తన లక్ష్యం మిలియనీర్ కావడం అని ఈ సంఘటనలో పేర్కొనడం ఈ సమస్యలోని భాగమే. ఇదివరకెవరినైనా చదువుకొనే వారి నడిగితే తాము డాక్టరయ్యి ప్రజలకు వైద్యాన్నందిస్తామనో, కలెక్టరయ్యి మంచిగా పాలిస్తామనో, సైంటిస్టయ్యి కొత్త ఆవిష్కరణలు చేస్తామనో చెప్పేవారు. ఇప్పుడు మిలియనీరు కావాలని ఒకళ్ళు చెబుతారు. హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగాలనుందని ఇంకొకరు చెబుతారు. తేడా ఏముంది. ప్రక్క వాడితో పనేముంది?

యువతని ఈ భావజాలం నుండి మళ్ళించి సరైన జీవితవిలువలేమిటో తెలుసుకొనే దిశలో ఆలోచించే మార్గం వెతకాలి.

వికటకవి said...

>>ఇలాంటి తక్షణ శిక్షల వల్ల ఆటవిక న్యాయం అమలవుతుందే కానీ మనుషుల ప్రవృత్తిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.

ఎగతాళిగా కాదు గానీ, ఎలాంటి శిక్షల వల్ల మనుష్యుల ప్రవృత్తిలో మార్పు వస్తుందో కూడా మీరు సూచించాలండీ.

ఏ శిక్ష పడని మనోహర్ లాంటి వాళ్ళని చూసా?
ఏ శిక్ష పడని అయేషా హంతకులని చూసా?
అఫ్జల్ గురు లాంటి వారిని చూసా?
ప్రత్యూష కేసు ఏమైందో?

కోర్టులు శిక్షలు వేసే సరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కంటారు.

ఆయేషా హంతకులకి ఎందుకు పడలేదంటే ఎలా? ఒకడికి పడిందని సంతోషించటమే, ఆటవికన్యాయం అంటారా? వాళ్ళు చేసిన నేరం మాత్రం ఆటవికం కాదా? మనది గాంధీ పుట్టిన దేశమే గానీ మనుష్యులు మాత్రం బ్రిటీష్ వాళ్ళ కంటే నీచమైన పనులు చేస్తున్నారన్నది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి గాంధీలు పనికిరారు. భగత్ సింగులే కావాలి.

durgeswara said...

ఇప్పుడే అన్ని కన్నీళ్ళు పారబోయకండి .ఇంకా దీనికన్నా ఘోరాలు చూడవలసిన రోజులొస్తాయి. ఎప్పుడు మాన్వత్వాన్ని పెంచే విద్యను తుంచుకున్నామో,సుఖపడటమే మానవజాతికి పరమోన్నత లక్ష్యమని భావించే భౌతిక విద్యే పరమానందమని భ్రమించి పరుగులు మొదలు పెట్తామో ,అప్పుడే ఈ నీఛసంస్కృతులకు బీజాలు వేసుకున్నాము.ఇప్పుడే అవి మొలకెత్తుతున్నాయి,ఇంకా మహా వృక్షాలయి ఇంకెంతగా మానవజీవితాన్ని కప్పివేస్తాయో ?.విచ్చలవిడితనము ,స్వేఛ్చకు చిహ్నమ్గా భావించి చూస్తూ సంతోషించేమనకు దాని ప్రభావం యువతపై ఎలావుంటుందో తెలియదా? ఇప్పుడు ఆ నిప్పు మన కొంపలమీదకు కూడా రాబోతున్నదని తెలిసి గాబరా పడుతున్నామేకాని దాని మూలంలో ఒక చెంబునీళ్ళన్నా మనవంతుగా పోసి దాన్ని ప్రజ్వరిల్లకుండా చేయలనే ఆలోచనరావటము లేదు ఎందుకని.?

సుజాత వేల్పూరి said...

వికటకవి గారు,
అంతే రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణమేనా సమాధానం? ఇలాంటి సంఘటనల వల్ల హింస మానవజీవితాల్లో రోజువారీ కార్యక్రమంగా మారిపోవడం లేదా?

నాకు తోచిన శిక్ష నేను సూచించాను! వాళ్ళు బతికున్నంత వరకూ జైల్లోనే ఉండాలి. కళ్లముందు వాళ్ల జీవితమంతా నిస్సారంగా గడిచి వృధా అయిపోవాలి. ఎవరికీ పనికి రాని నిరుపయోగ వస్తువుగా మిగలాలి. జీవితం సర్వ నాశనం కావడం అంటే ఏమిటో వాళ్లకు తెలిసి రావాలి.

ఇవాళ ఎన్ కౌంటర్ పోలీసులు చేసారు. రేపు ఆవేశాన్ని ఆపుకోలేక ప్రజలే చేస్తే? రోజుకెన్ని సామాజిక హత్యలు జరుగుతాయి?మాజీ పోలీస్ అధికారి పేర్వారం రాములు చెప్తున్నారు, యాసిడ్ దాడి వంటి ఘోరాలు జరిగినపుడు ఆడపిల్లలు తిరగబడి నిందితులని చంపగలిగితే కేసే ఉండదట. రోడ్డున పోయే జనమే ఆ పని చెస్తే? ఆంధ్ర ప్రదేశ్ మరో బీహార్ గా మారడాన్ని ఊహించండి.

మనోహర్ని చంపితే ఇవాళ ఈ ఘోరం జరిగుండేది కాదంటారా? ఇక్కడ నేరస్థులని ఎవరూ సమర్థించరు. కానీ విచారణ అనేది లేకుండా పొద్దున అరెస్టైన వాళ్ళని రాత్రికల్లా ఎన్ కౌంటర్ చేయడం అనేది ఎంత అమానుషంగా ఉంది? హింసకు హింసే జవాబయితే నిందితులకీ మనకీ తేడా లేదు. కాకపోతే ఇలాంటి కేసులు ఆవేశం చల్లారకముందే కఠిన శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చెసి అక్కడ విచారణ జరపాలి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

సగం మతిపోయి ఉన్నాను. కొంచెం స్థిమితపడ్డాక ఏమైనా రాయగలుగుతాను. ఇక్కడ కాదు, నా బ్లాగులో !

సుజాత వేల్పూరి said...

లలిత గారు,
అమాయకులైన ఆడపిల్లలు కూడా వేధింపులకు గురి కావడం వేదన చెందాల్సిన విషయమే! సంస్కృతి కలుషితమై పోయినపుడు గడప దాటి కాలేజీ కి వెళ్ళొచ్చే ఆడపిల్లకు ఎల్లవేళలా కాపలా కాయడం సాధ్యమయ్యే పని కాదు. తగు జాగ్రత్తలో ఉండమని చెప్పడం తప్పించి.

దుర్గేశ్వర గారు,

సినిమాలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఇతరత్రా సంస్కృతుల ప్రభావం యువత మీద ఇవాళ అంతా ఇంతా కాదు. FM రేడియోలో , టివీల్లో జరిగే లైవ్ షోల్లో ఎక్కువ శాతం "మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా(లేకపొతే విచారించాలన్నమాట)గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా, ఆమె/అతడి కోసం మీరు ఎంత ఖర్చు పెడతారు? లేక ఆమె/అతడి చెవిలో పువ్వెలా పెడతారు?" ఇవే ప్రశ్నలు.

ఇలాంటి నిప్పు మన ఇళ్ళ దాకా రాకుండా ఉండాలనే ఈ ప్రయత్నమంతా! పిల్లలకు చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టడమే కాక వారి ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచాలనేది అందుకే! విష సంస్కృతుల నుంచి పిల్లల్ని తల్లి దండ్రులు కాకపోతే ఎవరు కాపాడతారు? అర్థం లేని ఆర్భాటాలు, విలాసాలు పిల్లలకు రుచి చూపిస్తే ఫలితాలు ఎలా వుంటాయో, మొత్తం చేయి జారిపోయాక తెలుస్తుంది.

చాణక్య said...

Sujatha garu,

you are absolutely correct, girls should think seriously your suggestions, I knew many incidents, when I was in my Masters in the University, girls used up boys money.

To Mr. Kumar,

Do you think?

Because the girls were attacked by the boys, does it means that Girls doesn't make any wrong ? I have sympathy on two girls, but I don't think that without girl(s) wrong doing it could happen.

But this kind of attacks, should condemn by the society. parents should teach morale values to their children, especially about relationships.

సుజాత వేల్పూరి said...

పరిమళం గారూ,
నేరస్థుడి మాటలు వినకపోతే విచారణ ఎలా జరుగుతుంది? అతడి వెర్షన్ కూడా వినాలి. అందులో నమ్మదగినదేదైనా ఉంటే నమ్మాలి. పేపర్లో వచ్చిన కథనం ఆధారంగానే నేను ఈ టపా రాశాను. ఇందులో లవ లేశమైనా నిజం ఉండి ఉంటుందని నమ్ముతున్నాను కూడా! ఎందుకంటే చాలామంది అమ్మాయిల ప్రవర్తన, భావజాలం,ఆలోచనల్లో ఇదివరలో లేని ఒక తెగింపు, లెక్కలేని తనం, (దానికి ఆత్మవిశ్వాసమని దొంగపేరొకటి)ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకోవడం, బాగా పెరిగిపోయాయి.పొద్దున ఇలాంటి వాళ్ళు బోల్డు మంది మన చుట్టూనే ఉంటారు.

"కత్తులు, యాసిడ్, తుపాకులతో మా మీద దాడి చేయబోతే కేవలం ఆత్మ రక్షణ కోసం కాలుపులు జరిపాము" అని పోలీసులు నిస్సిగ్గుగా చెప్తున్న మాటలు నమ్మడం లేదూ?

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు మీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తాను.

వాళ్ళు చేసిన నేరం తీవ్రమైనదే కానీ ఆ అమ్మాయి యాసిడ్ వల్ల తీవ్రం గా గాయపడి విషమ పరిస్తితులలో ఉండటం వలన అందరూ కేవలం ఒక వైపు నుండే ఆలోచిస్తున్నారు. అయినా ఇటువంటి కేసులలో చావు సరైన శిక్ష కాదు. నేరస్తులు వారు చేసిన తప్పు తెలుసుకునేలా ఉండాలి. అయినా ఇటువంటి నేరం చేయాలన్న ఆలోచన వచ్చిన వాడు శిక్షల గురించో తరువాత వచ్చే పర్యవసానాల గురించో ఆలోచించి భయపడి నేరం చేయడం మానేస్తారనుకోడం అవివేకం.

వికటకవి గారు అలా అయితే పోలిసులు చట్టం న్యాయం ఈ వ్యవస్థ దీనికి బోలెడన్ని ఖర్చులు ఇదంతా ఎందుకండీ ప్రతి వాడి చేతికి ఓ గన్ ఇచ్చి నీకు తప్పు చేసాడనిపించిన వాడినీ కాల్చి చంపేయమని చెప్దామా !!! కోర్టులో కేసులు పూర్తయ్యేసరికి జీవితకాలం పడుతుంది నిజమే, కానీ అలాంటప్పుడు ఆ వ్యవస్థని సంస్కరించుకోవాలి కానీ ఇలా ఎన్‌కౌంటర్ పేరుతో చంపేస్తామంటే పోలీసులకీ తీవ్రవాదులకీ తేడా ఏమిటి ???

ఇంకా కొందరు నేరస్తుడి మాటలు ఎందుకు నమ్మాలి అని అంటున్నారు, ఈ కధనం నేరస్తుడు చెప్పినదే కాదు యస్పీ మీడియా కు చెప్పినది, ఓ పోలిస్ అధికారి కేవలం నేరస్తుడు చెప్పిన మాటలు మీడియా ముందు వల్లె వేస్తారని నేననుకోడం లేదు.

krishna rao jallipalli said...

కొంత మంది శ్రీనివాస్ గాడి మాటలని నమ్ముతున్నారు. తప్పు లేదు. అలాగే నేను కూడా సజ్జనార్ గారి మాటలని నమ్ముతున్నాను .. qte: ఆ ముగ్గురు తప్పించు కోవడానికి పోలిసుల మీద దాడి చేసారు. దానికి పోలిసులు ఆత్మా రక్షణ కోసం కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వాళ్లు చనిపోయారు... unqte. ఎందుకని సజ్జనార్ గారి మాటలని నమ్మకూడదు??

reddy said...

చట్టాలు చేయలేని పని పోలీసులు చేశారు. అంతే. కాల్చిపారేయడం ఇస్టం లేకపోతే యాసిడ్ పోస్తే మరణ శిక్ష అని చట్టం చేయండి.
అమ్మాయి డబ్బులు ఎందుకు తీసుకొందో అన్న చర్చ అనవసరం. బుద్ది హీనత.

Anil Dasari said...

కిండర్‌గార్టెన్ లవ్ స్టోరీ సినిమాలు తీసి పిల్లకాయల మీద వదిలితే జరిగేదింతే. సినిమాలొక్కటే కాదు, అలాంటివెన్నో. ఏం చేస్తాం?

కామేశ్వరరావు said...

ఈ వ్యాఖ్య రాసాక ఇది నేను కేవలం ఆవేశంతో రాసానా అన్న అనుమానం వచ్చి, చాలా సేపు పోస్టుచెయ్యకుండా అట్టే పెట్టి, తిరిగి చదివి ఇంకా నా ఆలోచనల్లో మార్పులేకపోవడంతో ఇక్కడ పెడుతున్నాను.
ఈ వార్తకి సంబంధించి, కేవలం పత్రికల కథనం ఆధారంగా ఆ అమ్మాయిల తప్పొప్పుల గురించి చర్చించడం, చాలా తప్పని నాకనిపించింది. దాని ఆధారంగా generalization చెయ్యడం ఈ సందర్భంలో అనవసరం.
టీవీలో వార్తలనీ, చర్చా కార్యక్రమాలనీ తిట్టుకుంటూ చూడ్డంవల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రేక్షకులు ఆసక్తిగా చూడటం వల్లనే వాళ్ళలాగ చూపిస్తున్నారు. అంతకన్నా వాటిని చూడ్డం మానెయ్యడం, ఇంకా మనసూరుకోకపోతే, చూసేవాళ్ళని చూడవద్దని చెప్పడం మంచిదని నా ఉద్దేశం. ఈ కారణంగానే టీవీ 9 కార్యక్రమాలు నేను చూడ్డం మానుకున్నాను.
ఇంక ఎంకౌంటర్ విషయం. మొన్న (ఈ)టీవీలో పోలీసుల కథనం విని, నేరస్థుల మాటలు విన్నప్పుడు వాళ్ళని కాల్చి చంపెయ్యాలన్న కోపం నాకు వచ్చింది. ఇప్పుడు పోలీసులాపని చేస్తే నేను వాళ్ళని తప్పుపట్టాలా, ఆమోదించాలా? ఆమోదిస్తే ఆటవిక న్యాయాన్ని సమర్థించిన వాణ్ణవుతాను. సమర్థించకపోతే hypocriteని అవుతాను. అసలు వాళ్ళని చంపాలన్న ఆలోచన రావడమే నాలో ఆటవికత ఉన్నట్టు కదా. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు hyprocrite అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. నామటుకి నాకు అది తప్పనిపించలేదు.
ఇక ఇలా చేస్తే ఇలాంటి నేరాలింక జరగకుండా ఉంటాయా అన్న ప్రశ్నకి, జరగవని చెప్పలేం. పోనీ వాళ్ళకి కోర్టుద్వారా ఏదో శిక్షవేస్తే అప్పుడైనా ఇలాటి నేరాలు జరగవని చెప్పగలమా? మరి కోర్టుద్వారా శిక్షపడాలని ఎందుకు కోరుకుంటాం? నేరస్థులలో మార్పు వస్తుందనా? దాని మీద కూడా నాకు నమ్మకం లేదు. కోర్టు ఉరిశిక్ష వేసి ఉరితీస్తే (చాలా మంది కోరుకున్నట్టు) అది ఆటవిక న్యాయం అవుతుందా అవ్వదా? ఇది బూటకపు ఎంకౌంటరని చట్టబద్ధంగా నిరూపణ అయితే, ఇక్కడ మనం నిర్మించుకున్న చట్ట వ్యవస్థకి వ్యతిరేకమైన చర్యే అవుతుంది. ఏ చట్టాన్నైతే ఇప్పుడు పోలీసులు అతిక్రమించారని మనం అనుకుంటున్నామో, ఒక వేళ అదే చట్టం ప్రకారం పోలీసుల నేరం నిరూపణ కాకపోతే? చట్టప్రకారం శిక్ష వెయ్యకపోవడాన్ని మనం ఆటవిక న్యాయం అంటున్నామా, చట్టప్రకారమైనా సరే నేరస్థులని చంపడం ఆటవిక న్యాయం అంటున్నామా? జీవితఖైదు వేస్తే మాత్రం వాళ్ళకి కానీ, అలాటి ప్రవృత్తి ఉన్న ఇతరులకి కానీ కనువిప్పు లేదా భయం కలుగుతుందా? నేను విన్నంతవరకూ జీవితఖైదు చావు కన్నా "భయంకరమైన" అనుభవం కాదు.
శ్రీకాంత్ గారిచ్చిన లింకులోని వార్త చదివాను. దానిగురించి ఇంతకుముందు నాకు తెలీదు. ఇక్కడున్నవాళ్ళలో ఎంతమందికి తెలుసో నాకనుమానమే. ఆ వార్త ఎందుకు ప్రచారం పొందలేదు? ఇదెందుకు పొందింది? ఒక నాలుగు సార్లిలా ఏసిడ్ పోసిన సంఘటన జరిగినప్పుడల్లా ఆ చేసినవాళ్ళని (కోర్టు ఉత్తర్వు ద్వారా) ఇప్పుడీ ఎంకౌంటరు జరిగినంత త్వరగానూ ఉరితీసి దాన్ని ప్రచారం చేస్తే, అప్పుడు ఏసిడ్ పోద్దామనుకొనే వారిలో భయం పుట్టదా? కానీ అది సాధ్యమా? అలాటిది సాధ్యమవ్వాలని కోరుకునేవాళ్ళలో నేను మొదటు ఉంటాను. కానంత సేపూ, ఏ ప్రత్యామ్నాయమైనా ఏమైనా ఫలితాన్నిస్తుందా?
ఇలాటి ఎంకౌంటర్లని సమర్థిస్తే ఇక పోలీసులకి అడ్డూ అదుపూ ఏముంటుంది అన్న ప్రశ్నకి. ఇప్పుడు మహా ఉండి ఏడిస్తే కదా! ఎందరుమంది నక్సలైట్లు ఇతరులూ బూటకపు ఎంకౌంటర్లలో చనిపోలేదు? ఇప్పుడు దీన్ని ఖండించినంత మాత్రాన ఇకముందు అలాటి బూటకపు ఎంకౌంటర్లు తగ్గుతాయా? దీన్ని సమర్థించడం వల్ల పెరుగుతాయా?
ఇలాటివాటికి అసలు మూలాలు వెతికి వాటిని నిర్మూలించే ప్రయత్నం చెయ్యాలన్న దానితోకూడా నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ అది సాధ్యమా? ఎంతవరకూ సాధ్యం? ఎన్నాళ్ళకి సాధ్యం? అదొక్కటే సరిపోతుందా?
దీనంతకీ వెనక పరోక్షంగా మరికొందరు నేరస్థులున్నారని అనిపిస్తోంది. వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా శిక్షపడితే బాగుండును. "ఆడవారి మాటలకి అర్థాలే వేరులే" అనే సినిమాలో హీరో ఏదో సందర్భంలో హీరోయిన్ని ఏసిడ్ పోస్తానని బెదిరిస్తాడట. ఆ సినిమా తీసిన నిర్మాతనీ, డైరక్టరునీ, మాటల రచయితనీ, అన్న హీరోనీ, దాన్ని అనుమతించిన సెన్సారువాళ్ళనీ కూడా శిక్షించాలి. ఇది నా దృష్టికి వచ్చిన సినిమా విషయం. ఇలా మరెన్ని సినిమాలున్నాయో?

satya said...

నాకనిపిస్తుంది ఒక్కటే. మనం ఇంకా Transition mode లో ఉన్నాం. సాంప్రదాయాలనించి వ్యకి స్వేఛ్చ వైపు. అందుకే ఇలాంటివి జరగకూడదు అంటూనే, అమ్మాయిలు కూడా అలా ఉండకూడదు, మూల కారణాలు లాంటి పదాలు వాడుతున్నారు. WEST మాత్రం పూర్తిగా వ్యక్తి స్వేఛ్చ కే ప్రాధాన్యత. అందుకే, అక్కడ సైడ్ ఆర్గ్యుమెంట్లు ఉండవు. ఆడపిల్లలు సాంప్రదాయం గా ఉండాల/మీరనే 'అతి ' ఉండాలో వాళ్ళ సొంతంగా తీసుకునే నిర్ణయం గా భావిస్తారు. హుమ్మ్! దాని వల్ల కూడా కొన్ని అనర్ధాలు వాళ్ళూ అనుభవిస్తున్నారనుకుంటా. ఇంతకీ నా కామెంట్ ఏం చెప్పదల్చుకుందో నాకే అర్ధం అవ్వలా! :(
అయితే ఒకటి మాత్రం నిజం. ఇది పోలీసులు తమ తప్పుని కప్పిపుచ్చుకోటానికి, ప్రజల్లో హీరోలు అయిపోవాలని చేశారు. వాళ్ళు చేసే మిగతా ఎధవ పనులు ఎవ్వరికీ తెలీదనుకుంటారో ఏంటో!!

satya said...

సుజాత గారు, పోలీసులు నిస్సిగ్గుగా చెప్పే మాటలు నమ్మితే ఇక్కడ encounter కి వ్యతిరేకం గా ఎందుకు కామెంట్లు వస్తాయి? ఇక్కడున్న వాళ్ళు అందరికి/రాష్ట్రం అంతా కూడా తెలుసు ఇది fake అని. పరిమళం గారికి మీరిచ్చిన సమాధానం లో అమ్మాయిల క్యారెక్టర్ గురించిన చర్చ ఎందుకండీ? ఇక్కడ మనం అతను చేసిన యాసిడ్ దాడి గురించే చెప్పుకుంటున్నాం గాని అతని క్యారెక్టర్ కాదుగ. ఇద్దరూ మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో మనకనవసరం. చట్టరిత్యా ఏది నేరమో అంతవరకే ఆలోచించాలి. అందుకే అత్యాచారాల కేసుల్లో సుప్రీం కోర్టు కొన్ని సంచలన తీర్పులు చెప్పింది. అప్పటివరకు ఆమోదం గా ఉండి ఒక్క నిమిషం ముందైన విముఖత చూపితే దాన్ని రేప్ గానే పరిగణించాలి అని. మీరు చెప్పే క్యారక్టెర్లు నాకూ అస్సలు నచ్చరు. ఐతే అది తప్పో/ఒప్పో వాళ్ళు నిర్ణయించుకోవాలి గాని మనం చెప్పలేం అనిపిస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు కాబట్టి.

Solarflare said...

సుజాతగారు, చాలా బాగా వ్రాసారు. మీరు చెప్పింది చాలా సబబు. ప్రజలు అన్నారట వీళ్ళు చేసారట! మరి ఈ ప్రజలడినట్ట్లు మిగిలిన పనులేవి ఎందుకు చెయ్యలేదో!

మీరు చెప్పిన్నట్ట్లు ఎవరి జాగ్రత్తలో వారుండాలి.శిక్ష పడాల్సింది నిందితుడికి కాదు నేరస్థుడికి. నిందితుడిని నేరస్థుడని నిర్ధారించడానికి మీడియాకి, Policeకి హక్కు లేదు.

ఈ పని పోలిసులు కాక ఆ పిల్లల బంధువులో లేక ఇంకెవరో చేసినా సమర్ధించేవాడినేమో - కాని ఈ పని పోలీసులు చేయడం హర్షనీయం కాదు -- ఎందుకో నిన్న (శుక్రవారం) రాత్రి వార్తలు చూసిన తర్వాత - అజయ్ దెవగణ్ సినిమా గంగాజల్ గుర్తుకువచ్చింది - ఇప్పుడు ఈ వార్త.

Saraswathi Kumar said...

ఈ విషయంలో మరో కోణాన్ని కూడా మనం కొట్టివేయలేము. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.అసలే రోజాలాంటి ప్రతిపక్ష నాయకులు ఈ ప్రభుత్వంలో మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని పదే పదే వాదిస్తున్నారు. ఆయేషా హత్యకేసులో ఇప్పటికే ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. తెలుగుదేశం పార్టీ తన సభలలో కూడా ఆయేషా తల్లి చేత ఉపన్యాసాలిప్పించి రాజకీయ లభ్ది పొందాలని ప్రయత్నిస్తున్నది. ఈ ఎన్నికల సమయంలో అనవసరంగా ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరకడమెందుకని భావించిన ప్రభుత్వ పెద్దలు పోలీసులకో ఫోన్ కాల్ చేసి మహిళలకు ఈ విధంగా 'న్యాయం' చేసి ఉంటారు. ఏమో! ఆలోచిస్తుంటే ఇది పోలీసులకు పుట్టిన బుద్ధిలా అనిపించడం లేదు.

సుజాత వేల్పూరి said...

సత్య గారు
అమ్మాయిల కారెక్టర్ల గురించి చులకన చేసి మాట్లాడ్డం నా ఉద్దేశం కాదని గ్రహించండి. నేనూ స్త్రీనే! నాకూ ఒక కూతురుంది. కేవలం నాకూ కూతురుందనే జాగ్రత్తతో నేను అమ్మాయిల గురించి ఇలా మాట్లాడ్డం లేదు. నలుగురు కొడుకులున్నా ఇలాగే చెప్పి ఉండేదాన్ని!వేధింపుల విషయంలో అమ్మాయిలు "కొంచెం ఎక్కువ జాగ్రత్తగా " ఉండాలి అని చెప్తున్నాను. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది సత్యం!

ఇదే యాసిడ్ దాడి ఒక పురుషుడి మీద మరో కారణం చేత జరిగిందనుకోండి, ఇంత హడావుడి జరిగేదా? అతడి జీవితం కొన్నాళ్లయిన తర్వాత యధావిధిగా ఏదో ఒక రకంగా గాడిలో పడుతుంది. కూటికి గతిలేని వాళ్ళెవరైనా పిల్లనిస్తారు. ఆమె అతడికి సర్వ విధాలా అండగా ఉంటుంది.

మరి స్వప్నిక జీవితం? పోయిన రూపం తిరిగి రాదు,(ఎంత గొప్ప ప్లాస్టిక్ సర్జరీ జరిగినా), కంటి చూపు రాదు. అంతర్గతంగా ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి కాబట్టి ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతూ ఉండొచ్చు! సడన్ గా పోయిన కంటి చూపు వల్ల ఆత్మ స్థైర్యం ఎంత దెబ్బ తింటుంది? దాని వల్ల చదువు కొనసాగే పరిస్తితులు అంతంత మాత్రం! పెళ్ళి సంగతి చెప్పలేం!
(పెళ్ళి ముఖ్యమా అంటే....ముఖ్యమే)ఒక్కతే కూతురు. జీవితాంతం ఒకరి సపోర్ట్ తో బతకవలసిన పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయికి ఉంది. తల్లి దండ్రులు పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు?

అందువల్ల స్నేహాలు చేసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డాను. మూల కారణాల్లో ఇటువంటి అజ్ఞానపు, అమాయకపు స్నేహాలు కూడా నిస్సందేహంగా ఒకటి. ఇటువంటి స్నేహాల్లో మజా తప్ప తప్పు లేదని, పెళ్ళయ్యే లోపు అన్ని రకాలుగానూ ఎంజయ్ చెయ్యాలని బోధిస్తూ తీసే పసి వయసు ప్రేమ సినిమాలు...మొదలైనవి మూల కారణాలకు గల మూల కారణాలు.

అబ్బాయిలనుంచి, అమ్మాయిలను ప్రత్యేకంగా నిలబెట్టేది అణకువ, మోడెస్టీ మాత్రమే! అణకువ అంటే కొంగు కప్పుకుని తిరగడం,తలొంచుకుని కాలేజీకి వెళ్ళి రావడం, అనవసరంగా సిగ్గులొలకపోయడం కాదు. విజ్ఞత. లౌక్యం! ఇవి లేనిది ఎంత చదువుకున్నా, ఎంత సంపాదిస్తున్నా,ఏమీ లాభం లేదు.

సినిమాలు చూసో, పుస్తకాలు ,ఇజాల ప్రభావానికి లోనయ్యో "ఆ పందులు బురదలో ఎంత ఆనదిస్తున్నాయో చూడండి. అందులో దిగి ఎంజాయ్ చేసే హక్కు మాకు లేదా" అనే తీరులో సమానత్వపు సిద్ధాంతాలు ప్రతిపాదించే ఆడపిల్లలతో నేను వాదించను. కానీ ఒక సలహా మాత్రం ఇస్తాను.

"సరే, వెళ్ళి దిగండి! కానీ దిగే ముందు ఆ బురద కడుక్కుంటే పోయేదా, లేక మీ ఊపిరి తీసే ఊబి అందులో దాగుందా అనే విషయం ఆలోచించి, తెలుసుకుని దిగండి" అని!(పురుషులందర్నీ ఒకే గాటన కట్టేయాలని నా ఉద్దేశం కాదని గ్రహించగలరు)

సుజాత వేల్పూరి said...

కామేశ్వర రావు గారు,
మూల కారణాలు వెదికే క్రమంలోనే అమ్మాయిల పాత్రని ప్రశ్నించడం జరిగింది. ప్రత్యేకించి స్వప్నికను నేను వెలెత్తి చూపడం లేదు. ఉదాహరణగా పేపర్లో వచ్చిన వార్తను ఉటంకించాను. మీరు ఆలోచించి చెప్పండి, అమ్మాయిల ప్రవర్తనలో,దృక్పథంలో విపరీతమైన మార్పు వచ్చిందా లేదా? సమాజం మారింది మారింది అనుకోడమే కానీ బేసిక్ విషయాల్లో సమాజం ఎప్పట్లాగానే ఉంది. ఈ విషయాన్ని వాస్తవ దృష్టితో పరిశీలించమనే నేననేది. పురుషులతో సమానంగా చదువుకున్నామనో, సంపాదిస్తున్నామనో,వెర్రి ధోరణులకు హారతి పడితే..ఫలితాలు దారుణంగా ఉంటాయి. ఒక సారి పైన సత్య గారికి ఇచ్చిన సమాధానం కూడా చదవగలరు.

జీవిత ఖైదు కంటే చావు పెద్ద శిక్ష కాదని నేననుకుంటాను. నా అన్న వాళ్ళు లేక, కదిలే స్వేచ్ఛ లేక,మనో వికాసం లేక, కుటుంబం లేక...జీవిత పర్యంతం "ఇంతకంటే చావు నయం" అనుకోవలసి రావడం చావు కంటే గొప్ప శిక్షే!

పరోక్ష నేరస్థుల్లో సినిమాలు, మీడియాల్లో వచ్చే నేర చరిత్రల వాస్తవ చిత్రణ కూడా ఉన్నాయి. ఇవాళ ప్రతి వార్తా ఛానెలూ నేర వార్తల్ని కల్పిత పాత్రలతో ఎలా చంపారు, ఉరి ఎలా వేశారు, విషం ఎందులో కలిపి తాగిస్తే త్వరగా చస్తారు, చంపి ఆధారాలు లేకుండా చేయడం ఎలా అన్న వివరాలతో సహా చిత్రించి చూపుతున్నారు. ఇది ఎంతవరకూ అవసరమో నాకర్థం కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేకపొతే అదేదో నేరమో, వెనకబడ్డ తనమో అన్నట్టు కార్యక్రమాలు రూపొందించే రేడియోలు, టీవీ కార్యక్రమాలు కూడా వీళ్లలో భాగమే!

సుజాత వేల్పూరి said...

రెడ్డి గారు,
చట్టాలు చేయలేని పని పోలీసులు చేసారు...వాళ్ళేదో వీరత్వం వెలగబెట్టారని ఎవరూ అనుకోవడం లేదు. వాళ్ళ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే క్రమంలో చంపేసి చేతులు దులుపుకున్నారు. ఇది వాళ్ల విజయం కాదు. జనం చేతిలో నుండి రాళ్ళు పడకుండా ఈ పని చేసి ఇవాళ పూల బొకేలందుకుంటున్నారు.

ఇక్కడ నేరము-శిక్ష మాత్రమే చర్చ కాదు. ఇలాంటి సంఘటనలు జరగడానికి మూల కారణాలు కూడా వెదకడం! మన తప్పుల్ని మనం ప్రశ్నించుకోవడం కూడా! అందుకే అమ్మాయిల పాత్ర ని విశ్లేషించడం!అది బుద్ధి హీనత అని మీరు భావిస్తే నాకభ్యంతరం లేదు.

Bolloju Baba said...

తాలసు గారు :-)
సుజాత గారు
i am split into pieces among all these comments madam.

వికటకవి said...

ఆ ఫాస్టెస్ట్ ట్రాక్ కోర్ట్ రావటానికి మరో జీవితకాలం స్లోయెస్ట్ ట్రాకులో పనులు జరుగుతాయి. ఓ నెలరోజుల్లో ఇలాంటి పన్లకి శిక్షపడితే నాకిబ్బందేమీ లేదు. కానీ, ఆశావాదానికీ ఓ హద్దుండాలిగా.

satya said...

"ఇదే యాసిడ్ దాడి ఒక పురుషుడి మీద మరో కారణం చేత జరిగిందనుకోండి, ఇంత హడావుడి జరిగేదా? అతడి జీవితం కొన్నాళ్లయిన తర్వాత యధావిధిగా ఏదో ఒక రకంగా గాడిలో పడుతుంది. కూటికి గతిలేని వాళ్ళెవరైనా పిల్లనిస్తారు. ఆమె అతడికి సర్వ విధాలా అండగా ఉంటుంది."

ఏ కాలం అండీ ఇదీ!!??

btw.. మోడెస్టీ అంటే విజ్ఞత. లౌక్యం!, మీరు సరైన పదాలు ఎంచుకోలేదనుకుంట.. ఈ రెండు అందరికీ ఉండాల్సినవి. అబ్బాయిలకి తక్కువ ఉన్నా పర్లేదు, అమ్మాయిలకి మాత్రం ఖచ్చితంగా కావాలి అనేవి కావివి.

ఇంక ఇదంతా సినిమాలు, టీవీ ప్రసారాల వల్ల అనేదానిని నేను అంగీకరించను. 10 ఏళ్ళ పసిపిల్లలు చేస్తే టీవీ వల్ల, సినిమా ప్రభావం అనుకోవచ్చు కాని ఎవరికి వారు సొంతగా ఆలోచించే వయసు వచ్చిన తర్వాత కూడా మానవత్వం లేకుండా చేసే పనులకి ఏవో కారణాలు వెదకటం ఆత్మవంచనే. అన్నట్లు నేను fake encounter కూడా అస్సలు సమర్ధించట్లేదు. నాగ మురళి గారి బ్లాగు లో నా వ్యాఖ్య చూస్తే మీకే అర్ధం అవుతుంది.

సుజాత వేల్పూరి said...

సత్య గారు,
ఇది 2008 డిసెంబరే, కాదనడం లేదు, కానీ ఏకాలానికైనా వర్తించే పరిస్తితులను వాస్తవ దృష్టితో చూడాలని అంటున్నాను! అందువల్లనే ఇటువంటి శారీక దాడులు జరిగినపుడు పురుషుడికీ, స్రీకీ సంభవించే పరిణామాల మధ్య తేడాని గుర్తించడానికే ఆ ఉదాహరణలు వాడాను.

మోడెస్టీకి నేను అనువాదం ఇవ్వలేదు. విజ్ఞత(సరైన నిర్ణయాలు తీసుకోగలిగే ఆలోచన), లౌక్యం(తెలివిగా సమయానుకూలంగా ప్రవర్తించే శక్తి) ఉండాలని అంటున్నాను. ఇవి అందరికీ ఉండాల్సినవే!దేశంలోనూ, విదేశాల్లో కూడా ఎడా పెడా వేధింపులకు అమ్మాయిలు గురవుతున్న నేపథ్యంలో వాటిని ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వాళ్లకే ఉందని అంటున్నాను. అవి లేని వారితో స్నేహాలు చెసేటపుడు మరీ జాగ్రత్తగా ఉండాలంటున్నాను. (బహుశా అణకువను నేను సరిగా అనువదించలేదేమో)!

ఇక ప్రసార మాధ్యమాల ప్రభావం! శక్తి మాన్ టీవి సీరియల్ చూసి డాబా ఎక్కి దూకిన పిల్లాడి అది మీద వెంటనే పని చేసింది. ఇలాంటి ప్రభావాలు కలిగించే సినిమాలు, ఇతరత్రా వాటి ప్రభావం స్లో పాయిజన్ లాంటిది. ఇదివరలో నేనూ సినిమాల ప్రభావం మనుషుల మీద ఉండదనే భావించాను. కానీ అది తప్పు అభిప్రాయం అని ఈ మధ్యనే తెలుస్తోంది. యువత మీద తప్పకుండా నీడలు పడతాయి.

అన్నింటికీ మించి,పిల్లలు తగిన స్నేహితులను ఎంచుకోలేకపోవడానికి కూడా కొంతవరకూ పెంపకం కారణమని అనిపిస్తోంది. ఒక్కరిద్దరు పిల్లలున్న ప్రతి కుటుంబంలోనూ తల్లి దండ్రుల గైడెన్స్ ఇటువంటి విషయంలో అవసరం. అదీ తమ అభిప్రాయాలను వారి మీద రుద్దే పద్ధతిలో కాక, వాటిని పిల్లలు అలవర్చుకునే రీతిలో పిల్లలమీద వారి ప్రభావం ఉండాలి.

btw, నాగమురళి గారి బ్లాగులో మీ కామెంట్ పొద్దునే చూసాను.

krishna rao jallipalli said...

కామేశ్వర రావు గారూ 'ఇలాటి ఎంకౌంటర్లని సమర్థిస్తే ఇక పోలీసులకి అడ్డూ అదుపూ ఏముంటుంది అన్న ప్రశ్నకి. ఇప్పుడు మహా ఉండి ఏడిస్తే కదా!'

sujata gaaroo ..పోలీసులు నిస్సిగ్గుగా చెప్తున్న మాటలు నమ్మడం లేదూ? ..శ్రీనివాస్ గాడి మాటలని నమ్మినప్పుడు లేని సిగ్గు పోలిసు వారు మాటలని నమ్మినప్పుడు ఎందుకుండాలి??

గత సంవత్సరం యాసిడ్ కేసు లో ముద్దాయి lecturer దామోదరం గాడిని కూడా ఎసేయ్యాలి.

Sravya V said...

@Sujatha gaaru I just read your reply to my comment in another blog. I am sorry if I used some hard words to express my view.

I am 100 % agree with the comment of Kameswara Rao gaaru.

Unknown said...

@పరిమల గారు:
మీతో పూర్తిగా ఎకీభవిస్తున్నను.
కాని ఇక్కడ జరిగింది మాత్రం పోలిసులు చెసిన తప్పు కప్పి పుచ్చుకునెందుకు ఎంకౌంటర్ చెయ్యల్సివచ్చింది అది తప్పొ వప్పొ చెప్పలేను కాని వాల్ల ముగ్గురిలొ ఏ ఒక్కరైన నిర్ధొషి ఐతే పరిస్తితి ఊహించండి.

మధురవాణి said...

సుజాత గారూ..
మీరు రాసిన పోస్ట్, దానికి అందరూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు, మళ్ళీ మీ సమాధానాలు అన్నీ చూసాను. నేను కూడా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
యాసిడ్ పోసిన వాణ్ని చంపి పారెయ్యాలి, బాగా అయ్యింది అని అందరూ అనుకుంటున్నారు గానీ.. యాసిడ్ పోసిన వాడు, పాపం ఆ అమ్మాయిలు, పోలీసులు, మనం అందరం కూడా మనుషులమేననీ, ఒక సమాజంలో బ్రతుకుతున్నామని.. అందరూ మర్చిపోతున్నారు. వాళ్ళు యాసిడ్ పోసినదానికీ, విచారణ లేకుండా వెంటనే కాల్చేసిన పోలీసుల పనికీ పెద్ద తేడా ఏమీ లేదని నాకనిపిస్తున్నది.

తప్పు అనేది ఎవరు చేసినా మనం న్యాయంగా మాట్లాడాలి. అమ్మాయి, అబ్బాయి అనే discrimination లేకుండా.. ఎవరు ఏమీ చేసినా..మీరన్నట్లు, moral values విలువ రోజు రోజుకీ పడిపోతుందన్నది వాస్తవం. అమ్మాయిలకైనా, అబ్బాయిలకినా, వ్యక్తిత్వం ముఖ్యమే కదా.. మనం స్నేహం చేసినా ఏమీ చేసినా.. మంచి చెడులు చూసుకుని, అదే సమయంలో.. మన జాగ్రత్త గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా.. ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఈ అమ్మాయిలు మాములుగా అయిపోలేరు కదా పాపం.. వాళ్ళని జీవితాంతం జైల్లో ఉంచే శిక్షలు వేసి ఉండాల్సింది. చట్టం విధుల గురించి మాట్లాడే పోలీసులు ఇంతకుముందు కేసుల్లో ఏమీ చేయలేకపోయారెందుకని..??
ఒక మనిషి చంపెయ్యాలి అని కోరుకోవడం కూడా పైశాచికత్వమే కదా.. అందరూ అలా అయిపోతే.. మనం ఎటు వెళ్తాం చివరికి?
బాధ, ఆవేశం అందరికీ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్ని చూస్తున్నందుకు.. కానీ.. మృగాల్లగా ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవడం పరిష్కారం కాదని నా అభిప్రాయం.

చదువు గురించి, మార్కుల గురించి గంటలు గంటలు మాట్లాడే తల్లిదండ్రులు.. సమాజంలో వ్యక్తుల్తో ఎలా మెలగాలి, స్నేహం, ప్రేమ, మానవ సంబంధాలు, పెళ్లి.. తదితర విషయాల గురించి విశాల దృక్పథం తో మాట్లాడుతున్నారా? ఎప్పటికీ మాట్లాడరు.. అన్నీ విషయాల్లోనూ పిల్లల్ని educate చేయాల్సిన భాద్యత తల్లిదండ్రులకి మాత్రం లేదంటారా?

వైష్ణవి హరివల్లభ said...

చాలా బాగా రాశారు మీరు సుజాతగారూ. జనానికి మనం మనుషులమే అనీ, ఇందులో ఇన్వాల్వ్ అయింది మనుషులమే అనీ మీరన్నా గుర్తు పెట్టుకున్నారు. ఒక బ్లాగ్ లో పెట్టిన టపా చూసి ఇవాళ షాక్ తిన్నాను. మీది చదివింతర్వాత ఫర్లేదు ఇలా కూడా ఆలోచిస్తున్నారులే అని కొంచం కోలుకున్నాను. రెంటినీ మనం ఖండించాల్సిందే. అందులో రెండో దాన్ని కొంచం గట్టిగ.

గీతాచార్య గారి టపా చూశారా? దాన్లో ఘట్టి వాతలే పెట్టారు. (You oughtta do it స్వప్నికా!)

ప్రియ said...

Good post. Nothing more to say. I like the way you expressed your views. I fully agree with you.

Londonlonoo daanimeede charcha.

లక్ష్మి said...

Sujatagaru, Good post with clarity of expression. There are many angles to this problem and you have considered most of them. Good one

రమణ / Ramana said...

సుజాత గారూ,
మీ రాతలు నాకిష్టం, కానీ ఈ టపా సహించలేదండి. కొంతమంది మనుషులు ఒక పెద్ద వరదలో చిక్కుకున్నరనుకోండి, నీటిలో కొట్టుకుపోకుండా వుండడానికి ఒకరు పెద్ద మేడ ఎక్కితే, ఆ వీలులేని అజ్ఞానులు ఆవదం మొక్కని పట్టుకుని అదే భద్రతనిస్తుందని నిలబడి కొట్టుకుపోతే మన తప్పుపట్టాల్సింది, ఎవర్ని?వరదన, వరదగురించి ముందు సరైన హెచ్చరికలు చేయని వాతావరణ శాస్ర్తజ్ఞులన, వరద ముందు మనుషుల్ని రిహాబిలిట్ చేయని నాయకత్వన్నా? ఈ అమ్మాయి అబ్బాయి యిద్దరూ బాధితులే. ఎవరి బలహీనతలూ అజ్ఞనాలు వాళ్ళకి వుండచ్చు. పరిష్కారం, నివారణ మాత్రం వాళ్ళ చేతుల్లో లేవు.
- రమణ

ప్రతాప్ said...

Interesting..

తప్పెవరిదో కూడా నేను చర్చించను..
జీవితఖైదు వేస్తే ఇటువంటివి మళ్లీ పునరావృతం కావా అని కూడా చర్చించను.
ఎన్కౌంటర్ చేసిపారేస్తే ఇంకెవరూ మరలా ఇలాంటివి చెయ్యరా అని కూడా చర్చించను.
సినిమాలే వీటన్నింటికీ కారణం అని కూడా చర్చించను.
ఇటువంటి సమాజంలో ఉన్నందుకు వీటన్నింటిని భరించాలి అని అనుకొనేంతగా మనం అలవాటు పడిపోతున్నాం అని మాత్రమే చెప్పగలను.
మన జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని మాత్రమే చెప్పగలను.

స్వేచ్చ said...

ఎక్కడో చదివాను ఒక argument కి త్రీ సైడ్స్ వుంటాయని...యువర్ సైడ్,మై సైడ్ అండ్ కరెక్ట్ సైడ్...
సుజాత గారు కరెక్ట్ సైడ్ ని డిస్కస్ చేసారు సంతోషం...

సుజాత వేల్పూరి said...

రమణ గారు,

మీరు నా టపాలను చదువుతున్నందుకు ధన్యవాదాలండి!

ఇక్కడ మీరు సరైన దానితో సమస్యను పోల్చలేదనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యం లో మన ప్రమేయం ఉండదు. ఇక్కడ జరిగిన దానిలో ఇద్దరి ప్రమేయం (ఎవరి ప్రమేయం ఎంత అనేది నేను చెప్పలేను) ఉంటుందని నేను చెప్పదల్చుకున్నాను. "ఎవరి బలహీనతనలు వాళ్ళకుండచ్చు"....బలహీనతలున్నాయి అని ఒప్పుకున్నపుడు పర్యవసనాలను ఆహ్వానించడం తప్ప చేసేదేం లేదు. ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది.నేను ఇక్కడ నిందితుల్ని సమర్థించి అమ్మాయిలను తిట్టడం లేదు. వాస్తవ దృష్టి..వాస్తవ దృష్టి...వాస్తవ దృష్టి..ఇదొక్కటే నేను మొత్తుకునేది. పరిష్కారాలు వాళ్ళ చేతిలో లేవనుకున్నపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఇదే ది బెస్ట్ పరిష్కారం.

ప్రతాప్ గారు,
రాను రాను ఇలా అన్నింటికీ అలవాటు పడి పోవడం తప్ప ఇంకేమీ చేయలేం అనిపిస్తోంది.

Bhaskar said...

Sujatha garu..I liked your post and replies to comments.

Samanyudu said...

సుజాత గారు, మీ వ్యాసం చాలా బాగుందండి. మీరు చెప్పినదానిని ఖండించడమో, సమర్ధ్హించడమో నా వుద్దేశ్యం కాదు కాని, I have two points here:

- ఈ మొత్తం చర్యలో మీరు చెప్పినట్లు అమ్మాయిల భాధ్యత కూడా వుంది అనేది నిర్వివాదంశం. I also think that there is a third person(s) who has equal responsibility for such brutal acts to happen and that is / they are 'The Parents'. రవితేజ 'నేనింతే' మూవీ లొ (మొన్న Thursday release అయ్యిన రొజే చూసేశాను :-) ) ఒక dialogue వుంది; 'For any relationship to exist, there need 3
- రెండో point ఎమిటంటే, our penal code is sooooo old and it takes it's own time to 'legally' punish such dangerous elements in the society. ఫ్రస్తుత పరిస్థితుల్లో 'ఆటవిక న్యాయమే' correct ఏమో!!!

సుజాత వేల్పూరి said...

సామాన్యుడు గారు,
ఆ డైలాగ్ "for any relationship to exist, there need 3, love, money and time.."నాక్కూడా నచ్చింది. జీర్ణించుకోవడం కష్టమైనా పచ్చి నిజం!

అమ్మాయిల బాధ్యత కూడా ఉన్నదనే విషయాని అంగీకరించడానికి పెద్దలు అంగీకరించడం లేదు. ఆలా చేస్తే వారికి స్త్రీ ద్వేషులుగా ముద్ర పడుతుందన్న సంకోచం కావొచ్చు!సంఘటన జరిగిన రోజు మీడియా ఛానెళ్ళలో స్త్రీ వాదులు కూడా ఆ పాయింటే ఎత్తడానికి ఇష్టపడకపోగా సమస్త పురుష జాతినీ ఉరి తీయాలన్నంత ఆవేశాన్ని వెళ్లగక్కడం చూసి ఆశ్చర్యమేసి ఈ టపా అప్పుడే వెంటనే రాశాను. మరి కాసేపు టీవీ చూస్తే వారితో నేనూ ఏకీభవిస్తానేమో అని భయం వేసింది.

ప్రాణాలు తీయడం అనేది ఆటవికమే! కానీ ఇలాంటి తీవ్రమైన నేరాలు జరిగినపుడు " వాడి ప్రాణం ఏ విధంగా గొప్పది. వాడిని చంపితే ఏం" అనేంత ఆవేశం కలగడం సహజం! కానీ ఇలా జనం అంతా గమనిస్తున్నా, బూటకపు కథ చెప్పి చంపడం అనేది ఆటవికం కన్నా కౄరమైనది.

Vinay Chakravarthi.Gogineni said...

baagundi....but meeru ekkado oka comment chesaaru....magavadimeeda acid padite ataniki marriage avutundi..but ladies ki kadu ala..meeru tried to show gap between them...but..chala mandi andam ga leni..shot vunna ladies ki pellillu kakaunda vundata ledu kada...........first meeru ada maga ani chudatam maneyandi....ee madhya ladies emantunnaru ante we can do anything like gents antunnaru..ante vallu gents ni enduku potee daruga satruvuga chustunnaro artham kavtam ledu...ikkada oka manishiki jarigindi ani chudadandi..adi maga ana aada ani kadu........


ee encounter samardhinchevallaku.......ela samardhistunnamu kaabatte....kramakramam ga.......society ee stage lo vundi....
just manam pillaliki koral values nerpalandi............

nenu asalu case veddam anukunnanu policela meeda but....naku procedure teleedu......2 days tinaledandi..chuttuvunnavallu manavatvam marichi ela encounter support chestunnaru enta ani......

సుజాత వేల్పూరి said...

గోగినేని వినయ్ చక్రవర్తి గారు,
స్త్రీ పురుష తేడాలు నేను చూపడం లేదండీ! అవి మొదటినుంచీ ఉన్నాయి. నేనూ అరే ఒక మనిషికి ఇలా జరిగిందే అని బాధ పడుతుండగా అదే సమయంలో కొంతమంది అతివాద స్త్రీ వాదులు లేదా అతి స్త్రీవాదులు ఒక మీడియా ఛానెల్లో "మగాళ్ళంతా ఇంతే కాబట్టి ఒక్కొక్కడినీ పట్టి చంపేయాలి" అని మాట్లాడ్డం విడ్డూరమనిపించి ఈ పోస్ట్ రాశాను.

మీలాగే నేనూ బాధ పడ్డానండీ! ఒక పక్క స్వప్నిక గురించి, మరో పక్క ఎన్ కౌంటర్ చేయబడ్డ యువకుల గురించి...అందరి గురించీ బాధ పడ్డాను. మనలో మనకు తెలీకుండానే ఇంత ప్రతీకార వాంఛ,నేర ప్రవృత్తి దాగి ఉందన్నమాట అనిపించింది జనం స్పందన చూసి.

కమల్ said...

ఇక్కడ మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలన్ని ఒకే అనుకుందాము. కాని ఆ ఎన్ కౌంటర్ జరిగాక కూడ..మల్లి అలాంటి దాడులు ఆగలేదే..?? ఎన్ కౌంటర్ తర్వత ఇంకా ఉదృతంగా ఓ పది దాక జరిగాయి ఇప్పటి వరకు ఆడ పిల్ల మీద దౌర్జన్యాలు, గొంతు కోయడాలు..! మరి ఎన్ కౌంటర్లు పలితమిచ్చాయా..? ఎందుకు అలాంటివి ఎన్ కౌంటర్ తర్వాత కూడ జరుగుతున్నాయో ఒక్క సారి మిమ్మల్ని మీరు ఆత్మ పరశీలన చేసుకోండి..! అప్పుడన్న మీకు సమాధానాలు దొరుకుతాయో లేక ఎంకౌంటర్ మంచిదే అని ఇంకా సమర్థికుంటూరో..?...! కమల్.

Post a Comment