December 23, 2008

ఎల్లలెరుగనివారము!

చిన్నప్పుడు 80' ల్లో స్కూల్లో ఉన్నరోజుల్లో ప్రతి ఆదివారం ఉదయం 8-30 కి శ్రీ చిత్తరంజన్ గారు హైదరాబాదు రేడియో కేంద్రంలో "కలసి పాడుదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహించే వారు. కొంత మంది పాడు పిల్లలని(పాడే పిల్లలని లెండి) తీసుకుని వారికి భారతీయ భాషల్లో ఒక పాటని నేర్పించడం. ప్రతి నెలా ఒక్కో పాట! అలా ఈ కార్యక్రమం రెండు, మూడేళ్ళు కొనసాగినట్టు గుర్తు! నేను ఆరోక్లాసులోనో, ఏడో క్లాసులోనో ఉండగా ఈ పాట "ఎల్లలెరుగని వారము.." ను ప్రపంచ బాలల గీతం పేరుతో చిత్తరంజన్ గారు నేర్పించారు. మేము దాదాపు ప్రతి పాటా రేడియో ముందు కదలకుండా కూచుని, శ్రద్ధగా రాసుకుని నేర్చుకునే వాళ్ళం. ఎందుకంటే మేమూ పాడు పిల్లలమే కాబట్టి! అన్ని బహుమతులూ అమ్మాయిల హైస్కూలుకే రావాలనీ, బాయ్స్ హై స్కూలుకు ఒక్క బహుమతీ రాకుండా చేయాలనే దుగ్ధ కూడా మా ఆసక్తికి,శ్రద్ధకు కొంత వరకు కారణం!ఎంతమందికి గుర్తున్నాయో గానీ ఆ పాటల్లో కొన్నిహోంగే కామియాబ్(హింది)

మిల్కే చలో(హింది)

ఎక్ లా చలోరే(బెంగాలి)

ఆకాశ్ గంగా సూర్య చంద్ర తారా(అస్సామీ)

ఓడి విళయాడు పాపా(తమిళం)

జయ జయహే భగవతి సుర భారతి(సంస్కృతం)

జయ జన భారత్, జనమన్ అభిమత్(ఇదీ సంస్కృతమే)

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా(తెలుగు)

ఎల్లలెరుగని వారము(తెలుగు)ఇంకా కొన్ని పాటలు మెదడులో కొట్టుకుంటున్నాయి గానీ బయటకు రావట్లేదు.

వీటిలో ప్రపంచ బాలల గీతాన్ని ప్రపంచ భాషలన్నింటిలోనూ రాసి ఆయా దేశాల్లోని పిల్లలు పాడుకుంటారని చిత్తరంజన్ గారు అప్పట్లో చెప్పిన గుర్తు. ఆ పాట సాహిత్యం ఎవరి దగ్గరన్నా ఉంటే కావాలని చిత్తజల్లు అంజని గారు నా బ్లాగులో వ్యాఖ్యానిస్తూ కోరారు. ఆ పాట స్కూలు రోజుల నాటి పాత పుస్తకాల్లో ఎక్కడుందో వెతికి పట్టుకునే సరికి ఇన్నాళ్లయింది. ఆ పాట ఇది.పల్లవి: ఎల్లలెరుగని వారము కల్లలెరుగని వారము

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటే :ఎల్లలెరుగని:చరణం 1 : అన్నం పప్పు చారు కూర శాకాహారం తినువారైతే

గుడ్డు, చేప కోడి కూర మాంసాహారం తినువారైతే

తిండేదైనా తీరేదైనా, తినగోరే ఆ రుచులేవైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే

చరణం 2 :గోధుమ రంగున కొందరు పసుపు రంగు ఇంకొందరు

తెలుపు నలుపు యాపిల్ ఎరుపు ఏ రైంగైనా ముచ్చట గొలుపు

రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటేచరణం 3: ఔనందురు యెస్ అందురు కొందరు ఓకే దాదా అందురు కొందరు

సీ, దేఖో, జావ్ అంటూ కొందరు పలు విధాలుగా పలుకుచుందురు

మాటేదైనా పాటేదైనా, మాట్లాడే ఆ భాషేదైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే

ఈ పాట ఆడియో నాకు ఎక్కడా దొరకలేదు అంతర్జాలంలో! ఎవరికన్నా దొరికితే అప్ లోడ్ చేస్తే విని ఆనందిస్తాను.

22 comments:

kumar said...

"ఓడి విళయాడు పాపా" గుర్తుంది నాకు బాగా..
నేను పాడు పిల్లాణ్ణి కాదు కాబట్టి, ఛీ పాడు పాటలు అనుకుంటూ, మాకున్న ఒకే ఒక్క వినోద, విద్యా సాధనం అయిన టివి సైజు రేడియో కున్న నాబ్ ని తిప్పి స్టేషన్ మార్చేవాణ్ణి.

అయినా మీకివేం పాడు బుద్దులండి బాబూ!! అప్పటి పాటలు రాసుకోవడమే ఓ వింత అంటే, అవ్వింకా దాచుకున్నారా? నా చెక్ బుక్కులే నాకు దొరకవు అవసరమొచ్చినప్పుడు!! మీరు మామూలు వ్యక్తులు కాదు సుమీ.

నేస్తం said...

నేను చిన్నపుడు రేడియో ముందు కుర్చుని ఓడి విళయాడు పాపా చాలా ఆసక్తిగా వినేదాన్ని.. ఇంకా హొంగే కామియాబ్,మిల్కే చలో కూడా :) మంచి పాటను మళ్ళీ గుర్తు చేసారు ధన్యవాదాలు సుజాత గారు

లలిత said...

టి.వి. వచ్చి రేడియొ పోయే డాం ...డాం..డాం
ఎందుకండీ పాత జ్ఞాపకాలను తవ్వుతారు
ఇప్పుడు నాకూ ఒక పాట గుర్తొచ్చింది ఇక నన్నాపకండి
మిలే సుర్ మేరా తుమ్హారా...... తో సుర్ బనే హమారా........

సుజాత said...

లలిత గారు,
మిలే సుర్ మేరా పాట ఇప్పటికీ దూరదర్శన్ లో వేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. ఆ పాటలో కమల్ హాసన్ ఎంత బాగుంటాడో కదా!

Sky said...

చాలాకాలం తర్వాత చిన్నప్పటి ఆ పాత పాటల్ని గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదములు. చిన్నప్పుడు రాసుకున్న ఆ పాటల్ని ఇంకా దాచుకున్న మీ అభిరుచి అభినందనీయం. లలిత గారు అన్నట్టు 'మిలే సుర్ మేరా తుమ్హారా' గుర్తుకు వచ్చింది. వెంటనే Youtube లో వెతికితే దొరికింది. అవును, కమల్ హాసన్ (నాలాగా) ఎంతో అందంగా వున్నాడు.

నా మిత్రుడి దగ్గర కొన్ని పాత రేడియో రికార్డ్స్ వుండాలి, ఒక సారి కనుక్కుని వుంటే తప్పకుండా upload చేస్తా.

సతీష్ యనమండ్ర

ఉమాశంకర్ said...

మీరు చెప్పిన కొన్ని పాటలు గుర్తున్నాయ్ గానీ ఎందుకో నా జ్ఞాపకాల వరసలో ఇవి కిందకి నెట్టబడి ఉన్నాయ్. :) బహుశా నాకు పాడే అలవాటు లేదు, అందువల్లనేమో..

"కలసి పాడుదాం .... తెలుగు పాట " అనే ట్యూను లీలగా గుర్తొస్తోంది అది ఈ ప్రొగ్రాముదో ఇంక వేరే దేనిదో తెలీదు..

ఇక పోతే "మిలే సుర్ మేరా తుమ్హారా..." ఒక ఆణిముత్యం.మొన్నీ మధ్యనే దాని ఇరవయ్యో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారని చదివాను. ఆ పాట టీవీ లో వస్తుంటే తింటున్న అన్నం వదిలేసి అన్నం చేత్తొనే టీవీ ఉన్న మధ్యగది లోకి పరిగెత్తుకువెళ్ళి చూసిన రోజులు ఇంకా గుర్తు.

నిషిగంధ said...

LOL @ 'పాడు పిల్లలు'

సుజాతా, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారండీ!! నాకు ఆ తమిళ్ & బెంగాలీ పాటలు అస్సలు గుర్తులేవు :( నా ఫేవరెట్ మాత్రం 'హమ్ హోంగే కామియాబ్' :-)
మీరిలా కాలచక్రాన్ని రివైండ్ చేస్తే అక్కడనించి రావడానికి మనస్సొప్పుకోవట్లేదు :(

Sreenivas Paruchuri said...

నాకు హైదరాబాదు స్టేషన్ వారి ప్రోగ్రాములతో ఏ మాత్రం పరిచయం లేదు. నేను ఇండియా వదిలేంతవరకు విన్నదంతా విజయవాడ (ఒక మూడేళ్ళు మద్రాసు) కేంద్రమే. కానీ "మిల్కే చలో, ఎక్ లా చలొరే (ఎప్పుడు కలిసినా రజనీకాంతరావుగారు చాలా బాగా పాడి వినిపిస్తారు,ఇప్పటికీ...), పిల్లలారా పాపల్లారా" పాటలు మాత్రం బానే తెలుసు. చివరి రెండూ రేడియోనుండి రికార్డు కూడా చేసుకున్నాను అప్పట్లో. ఎప్పటికైనా ఆ రేడియో టేపులన్నింటినీ డిజిటైజ్ చేయగలిగితే వినిపిస్తాను.

రేడియోలో పాటొస్తుంటే హడావిడిగా దాన్ని రాసుకోవడం, చరణాలు/పదాలు మిస్ అయితే మరల ఆ పాట ప్రసారమయ్యేవరకు యెదురు చూడటం, ఆ తరువాత పాటలు రాసుకున్న (చిత్తు) కాగితాల్ని జాగ్రత్తగా ఒక పొత్తిలాగా కుట్టుకోవడం ... ఈ జn్నాపకాలు 1985-90 వరకు ముఖ్యంగా రేడియోనే విన్నవాళ్ళకి వుంటాయనుకుంటాను. నేను డిగ్రీ అవ్వగానే 1989 లో ఇండియా వదిలేశాను. అందువల్ల ఇప్పటి రేడియోశ్రోతల సంగతి తెలియదు.

-- శ్రీనివాస్

సుజాత said...

శ్రీనివాస్ గారు,
మేమైతే విజయవాడ ప్రోగ్రాములు వినడం గొప్పలాగా, హైదరాబాదు ప్రోగ్రాములు వినడం తక్కువగా భావించే వాళ్లం! హైద్రాబాదు ప్రసారాలు కూడా క్లారిటీ లేకుండా ఉండేవి అప్పట్లో! ఆదివారం చిన్నక్క కబుర్లు,చిత్తరంజన్ గారి ప్రోగ్రాము,మరియు తురగా జానకీ రాణి గారితో బాల వినోదం మాత్రం తప్పనిసరి.

పాట లైవ్ లో వస్తున్నపుడు త్వర త్వరగా రాసుకోవడం, కొన్ని అక్షరాలు ఆ తర్వాత మనకే అర్థం కాకపోవడం, మళ్ళీ ఆ పాట కోసం ఎదురు చూడ్డం ఇవన్నీ భలే అనుభవాలు!

ఇక ఇప్పటి FM గోల వినకపొతే ఎంతో ఆరోగ్యం!

విజయవాడ రేడియో స్టేషన్ కార్యక్రమాలతో నా అనుబంధం గురించి ఒక టపా రాయాలి నేను!

సుజాత said...

కుమార్ గారు,
ఆ సైజు రేడియో మా ఇంట్లో కూడా ఉండేది. మా తాతగారి ఆస్థి! అది గుర్ మని శబ్దం తప్ప ఇంకేమీ ప్రసారం చేసేది కాదు గానీ దాన్ని ముట్టుకుంటే మా తాతగారు మాత్రం గుర్రు మంటూ దెబ్బలాడేవారు.
నాకు పాతెప్పుడూ వింతేనండీ, అందుకే ఆపాత పుస్తకాలు అలా దాచాను!

నేస్తం,
ధన్యవాదాలండి!

సతీష్ గారు అయితే మీ ఫొటో చూసి నిజా నిజాలు తేల్చాల్సిందే మేం! త్వరగా చూపించండి.

ఉమా శంకర్ గారు,
కలసి పాడుదాం తెలుగు పాట సినిమా పాట. బలిపీఠం లోది! ఇక అన్నం తినే చేత్తోనే అలా పరిగెత్తి మిలే సుర్ మేరా పాట చూసిన జ్ఞాపకాలు మీకూ ఉన్నాయన్నమాట.

నిషిగంధ,
ఇంకా చాలా పాటలు మర్చిపోయాను. ఒక ఒరిస్సా పాట కూడా ఉండాలి.
పిల్లల్లారా పాపల్లారా పాటలో రిథం అసలు వినపడదు. చాలా లైట్ గా ఉంటుంది..వింతగా, కొత్తగా వినేవాళ్లం అప్పట్లో

చంద్ర మోహన్ said...

మంచి స్మృతుల్ని గుర్తుకు తెచ్చారు. "బాలవినోదం విందాము, బాలల్లారా రారండీ" అనే పాట ఇప్పుడుకూడా చెవిలో మారుమోగుతున్నట్లే ఉంది.

ఏ కేంద్రీయ విద్యాలయం వారి స్టూడెంట్ డైరీలోనైనా మీరు చెప్పిన పాటలన్నీ దాదాపుగా దొరుకుతాయి. సాధారణంగా ఒక్కో భారతీయ భాషలో ఒక్కో పాట వారి డైరీల్లో ఉంటుంది. మా అబ్బాయికి ఐదారు భాషల పాటలు ఇప్పటికే నేర్పారు (తెలుగు పాట ఇంకా రాలేదు!). "ఓడి విళయాడు పాపా" పాట, భారతియార్ వ్రాసింది, ప్రతి తమిళ విద్యార్థీ తప్పకుండా నేర్చుకొనే పాట.

రవిగారు said...

అమ్మో సుజాత గారు ఆనాటి జ్ఞాపకాల తుట్టని కదిపారు. మేము ఆ పాటల్ని నేర్చుకుని బాలానందం లో తురగ జానకి రాణి గారి మెప్పును కూడా పొంది , AIR తరపున శ్రీశైలం వెళ్ళాం బాలానందం కార్యక్రమలో భాగంగా''.అదిగది గో అదిగో ,అది గది గో అది గో , ఆ పయనీ , ఆ పయినీ అగుపించునది దేవళం అదియే మన యాత్ర స్తలం ''అంటు పాడు కుంటూ పోయే వాళ్ళము.ప్రతి ఆదివారం ఏదో పాటో. నాటికో కనీసం ఒక ఉత్తరమో చదవకుండా రేడియో స్టేషన్ వదిలింది లేదు.అప్పట్లో మా గ్యాంగ్ బాలానందం లో చాల ఫేమస్.''పిల్లలారా , పాపల్లారా రేపటి భారత పావురుల్లర'' పెద్దలకే దారిని చూపే పిల్లలారా అంటు ఇంకో పాట కూడా వుండేది.ఏంటో మీ టపా తో ఎక్కడి కో తీసుకెళ్ళి పోయారు.. అప్పట్లో tomsoyer అంటూ బాలానందం లో ధారావాహిక కూడా వచ్చేది . తురగ జానకి రాణి గార్ని ఈ సందర్భంగా గుర్తు చేసినందుకు ధన్య వాదాలు.

స్నేహ said...

చాలా ఙాపకాలు రేపారు. మా బాబు కి ఇవన్ని నేర్పాలి. వాడికి ప్రస్తుతానికి హం హొంగే కామియాబ్ మాత్రం వచ్చు. నేను పాడుకుంటుంటే విని నేర్చుకున్నాడు.
snehamolakatalla.wordpress.com

సుజాత said...

రవి గారు,
మీరు బాలానందంలో సభ్యులైనందుకు అభినందనలు, మేము అందులో లేనందుకు కుళ్ళు! శ్రీశైలం పాట నాకు గుర్తుంది, మీరు తప్ప రాశారు. మీకు గుర్తు లేదన్నమాట. తురగా జానకీ రాణి గారికి ఉత్తరం రాస్తానుండండి! ఆ పాట

అల్లదిగో శ్రీశైలం
అదియేగా శ్రీశైలం,
మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేగా శ్రీశైలం...ఇదీ! మరో పాట కూడా ఉండేది...
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రివి నీ పిల్లల మేమెల్లా అని ! చాలా భావస్ఫోరకంగా ఉండేది కదా!

అందులో ఒక చరణం ...

మతమన్నది నా మనసుకు మత్తు అయితే
మతమన్నది నా కంటికి మసకైతే
మతం వద్దు గితం వద్దు మారణ హోమం వద్దు...అని వస్తుంది.

నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందనిపించింది ఈ మధ్య నాకు.

లాభం లేదు గానీ మీరొక టపా రాసేయాలి అర్జెంట్ గా బాలవినోదం మీద..కంగారు మావయ్య గురించి, వెంగళప్ప గురించి..మర్చిపోకండి.

డా.ఇస్మాయిల్ said...

ఉదయాన్నే వేడి వేడి దోసెలు తింటూ కడప స్టేషను నుంచీ వచ్చే చిత్రలహరి? సినిమా పాటలు, అడ్వటైజుమెంట్లు గుర్తు చేసారు. ఎన్నాళ్లయ్యిందో విని:-(

"మతమన్నది నా మనసుకు మత్తు అయితే
మతమన్నది నా కంటికి మసకైతే
మతం వద్దు గితం వద్దు మారణ హోమం వద్దు..."
దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసారనుకొంటా ఈ పాటని. చిన్నప్పుడు నా స్కూలు ఉపన్యాసాల్లో విరివిగా వాడేవాణ్ణి. ఇప్పుడు మన తెలుగు బ్లాగ్లోకంలో వాడాలి:-)బాగున్నాయి మీ రేడియో కబుర్లు.

Sreenivas Paruchuri said...

"అదిగదిగో అదిగో" పాట మొన్నే ఏవో టేపులు సర్దుతూ మళ్ళీ విన్నాను. "నారాయణ నారాయణ అల్లా అల్లా" అనేది దేవులపల్లి రచనే. పాలగుమ్మి సంగీతం. ఇప్పటికీ తేలిగ్గా దొరుకుతున్న, మళ్ళీ మళ్ళీ రికార్డు అవుతున్న పాట. కాకుంటే అందరూ చెప్పినట్లు బాలల కార్యక్రమంలో విన్న/పాడిన జn్నాపకాలు వేరు :-). టాం సాయర్ నేను 1970ల మధ్యల్లోనో, చివరల్లోనో విజయవాడ కేంద్రంలో విన్నాను.

హైదరాబాదు రేడియోలో ప్రసారితమయిన పిల్లల కార్యక్రమాల్లో బాలానందం సంఘం వారి influence ఎక్కువని విన్నాను. ఒక గ్రూపే ప్రతివారం రికార్డింగుకి వెళ్ళడమన్నది. విజయవాడలో ప్రతివారం పాల్గొనే పిల్లలు మారేవారు. బళ్ళో టీచర్లకి ఓపిక, ఆసక్తుంటే స్టేషన్ కి ముందుగా రాసి ఒక గుంపుని పట్టుకుపోయేవారు. లేకుంటే ఆ టౌన్లో వాళ్ళ చప్పుడే యెక్కువగా వుండేది.

ఆ మధ్య బాలానందం ఉత్సవాలు (రేడియో అన్నయ్య శతజయంతి సందర్భంగా) జరిగినప్పుడు నా దగ్గరున్న పాత గ్రామఫోను రికార్డులపై వచ్చిన పాటలు బయటకు లాగడం జరిగింది (బుజిబుజిరేకుల, పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే, నాగార్జున కొండ, రేడియో అక్కయ్య చెపిన్న రెండు కథలు ...). అదే సందర్భంలో వచ్చిన పుస్తకాలు (బాల సంచికలు నాలుగు ఒక సెట్ గా, మరో 2 పుస్తకాలు), టేపులు/సి.డి, చదువుతూ/వింటూంటే ప్రస్ఫుటంగా కనిపించే Gandhiyan, Nehruvian భావజాలం, వాడిన భాష చాలా ఆలోచనల్ని రేపాయి. మధ్యతరగతి భావాల్ని ప్రచారం చేయడంలో ఒక రకంగా భావకవిత్వం 1930లు,40ల్లో చేసిన పనిని రేడియో పిల్లల కార్యక్రమాలు తరవాత కొనసాగించాయని నేననుకుంటున్నాను.

మరీ దూరం పోతున్నట్లున్నాను. ఇంతటితో ఆపేస్తాను. Nostalgia కి "విశ్లేషణకి" పొగడదు కదా! :-).

-- శ్రీనివాస్

విరజాజి said...

ఙ్ఞాపకాల తుట్టెను కదిలించేసారండీ.... అప్పట్లో ఆదివారం మధ్యాహ్నం మా పని బాలానందం కార్యక్రమాలు వినడం, తరువాత గంట సేపు ఒక నాటకం వచ్చేది అది వినేవాళ్ళం. మీరు చెప్పిన అన్ని పాటలూ నేను కూడా విన్నవే... మరో పాట కూడా చిత్తరంజన్ గారు నేర్పింది నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. "తబ్బిబ్బయింది నా మనసు , తళుక్కుమన్నది నీ సొగసు, మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్ | మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్" . అప్పటి రేడియో కార్యక్రమాలకీ ఇప్పటి Fం ప్రోగ్రాములకీ పోలికా....!! ఆదివారం నాడు ఉదయం "హాస్యవల్లరి" అని కామెడీ నాటికలు కూడా వచ్చేవి. ఇప్పటి వెకిలి హాస్యం కాదు... ఎంతో సున్నితమైన, సునిశితమైన హాస్యం ! వివిధభారతి లో రాత్రుళ్ళు వచ్చే హిందీ పటలన్నీ కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. "ఆ హాయి ఈనాడు లేదేల నేస్తం.... ఆ రోజులు తిరిగి మరల రావు !" అని పాడుకోవాలనిపిస్తుంది ఇప్పుడు.

ఉమాశంకర్ said...

నేను స్వతహాగా వేరేవారి బ్లాగులో నేను ఇదేవిషయం మీద రాసాను చదవండహో అని చెప్పుకోవడం ఎందుకో ఇష్టముండదు. సుజాత గారి బ్లాగు కాబట్టి ఏమీ అనుకోరనే నమ్మకంతో .....

నేను రేడియో పాటలమీద కాకున్నా నారేడియో అనుభవాల గురించి రాసుకున్న టపా http://umasankarrao.blogspot.com/2008/09/blog-post_16.html. మీకు వీలయితే చదవండి.

సుజాత గారూ,

మీకు అభ్యతరం అనిపిస్తే ఈ కమెంటు ని అప్రూవ్ చేయకండి.... :)

సుజాత said...

ఉమాశంకర్ గారు, ఇందులో అభ్యంతరపెట్టాల్సిందేముంది చెప్పండి! మంచి టపాలు మిస్ అయి ఉంటే మేమూ చదువుతామంతే!

Sreenivas Paruchuri said...

విరజాజి-గారు, మబ్బులొచ్చినాయ్ పాట ఇక్కడ వినవచ్చు: http://www.freewebs.com/rburra/Mabbulochinai.mp3

-- శ్రీనివాస్

వేణూ శ్రీకాంత్ said...

భలే గుర్తు చేసారండీ అప్పటి పాటలన్నీ, నేను పాడు పిల్లాడ్ని :-) కాదు కాబట్టి ఇంతగా రాసుకుని విన్న గుర్తు లేదు కాని కొన్ని పాటలు (ఓడి విళయాడు, హోంగే కామ్‍యాబ్, పిల్లల్లారా) ఇంకా అలా మనసులో గుర్తుండిపోయాయ్. అన్నట్లు పాడు పిల్లలు భలే :-)

Heart Strings said...

SUJATHA GAARU MEE BLOG CHADUVUTHUNTE NAA AANANDAANIKI AVADHULU LEVU, NENU ELLALERUGANI VAARAMU PAATA EKKADAINA DORUKUTHUNDEMONANI VETHIKE PRYATHNAM LO MEE BLOG KANUGONNANU, NENOO CHINNAPPUDU CHITTARANJAN GAARI PAATALU RAASUKONI NERCHUKUNEDAANNI(NENOO PAADU PILLANE... CHI PAADE PILLANE), AA PATALA LIST LO INKO PAATA "HIND DESH KE NIVASI" , KAANEE A PUSTHAKAM EKKADA POYINDO ASALU DORAKATLEDU, NAA AJAAGRATTA MEEDA NAAKE ENTHA KOPAM GA UNDO....

Post a Comment