January 20, 2009

ఎవరికి తెలియని కథలివిలే!

ఆ మధ్య శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు రచన మాస పత్రికలో "సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్" అని ఒక కథ రాశారు. ఆ మాటకు "ఎమర్జెన్సీ ఎగ్జిట్" అని అసలర్థం! కానీ కథా పరంగా మాత్రం అమెరికాలో మన వాళ్ళు చీటికీ మాటికీ చేసుకునే సత్యనారాయణ వ్రతం అని అర్థం! అక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లలు ఇండియా సంబంధాలు ఒప్పుకోకపోవడం, పిల్లలకు మంచి యూనివర్సిటీల్లో సీట్లు రాకపోవడం వంటి సంకటాల్లోంచి బయట పడటానికి(బాహర్ జానేకేలియే) ఈ వ్రతం మొదలెడతారంటూ సరదాగా సాగుతుంది.




నిజానికి ఇలా సత్యనారాయణ వ్రతం తరచూ చేసుకునే సంప్రదాయం/అవసరం/అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. నా చిన్నప్పుడు మేము, మా అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, మామయ్యలు అంతా కట్ట గట్టుకుని ఒకే వూళ్ళో ఉండటం వల్ల పెళ్ళి రోజనో, పుట్టిన రోజనో మరోటనో నెలకు రెండు వ్రతాలు గ్యారంటీగా జరిగేవి మా కుటుంబంలో! ఏ ఇంట్లో వ్రతం జరిగినా అంతా కట్టుగట్టుకుని హాజరు! బోలెడంత మంది కజిన్లు!మా ఇంట్లో వ్రతానికి మా నాన్నారు సాంబమూర్తి గారనే పురోహితుడిని పిల్చేవారు. ఆయన వృద్ధుడు. కొడుకులు సరిగా చూసేవారు కాదు. ఆయనకు కొంచెం జరుగుబాటు ఉంటుందని నాన్న ఆయన్ను పిల్చేవారు. పాండిత్యం ఉన్నా,వృద్ధాప్యం వల్ల మాట సరిగా వచ్చేది కాదు. కోపంలో మాత్రం దూర్వాసుడే!



మేము ఆరేడు తరగతుల్లో ఉన్నపుడు మా అక్కలు, కజిన్లు కాలేజీని ఉద్ధరిస్తూండేవాళ్ళు. సాంబమూర్తి గారు వ్రత కథలు చెపుతున్నపుడు వీళ్ళంతా గుడగుడ లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండే వాళ్ళు.

ఆయన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ "అబ్బబ్బ, కాసేపు గమ్మున కూచోండమ్మా(మీ నోళ్ళు పడా)" అనేవాడు సౌమ్యంగానే,బ్రాకెట్లోని మాటను "కుంజరః "టైపులో పలుకుతూ!
వీళ్ళు సంతాప సభకు వచ్చినట్టు రెండు నిమిషాలు మౌనం పాటించి, మళ్ళీ నెమ్మదిగా కబుర్లలోకి దిగేవాళ్ళు. కథలయ్యేదాక కదలడానికి వీల్లేదు మరి.


మా ఇంట్లో వాళ్ళకు ఇంకో ప్రత్యేక సౌకర్యం ఉంది. మా ఇంటికి దగ్గర్లో శ్రీ రమా మేదినీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆ గుళ్ళో ప్రతి వారం పూజారి చక్రవర్తి సామూహిక వ్రతం జరిపించేవాడు. జరిపిస్తే నీకేం అని మీరనడానికి లేదు.గుడికి ధర్మకర్త వెంకటేశ్వర్లు గారు కొన్న నాలుగు మైకుల్నీ మా కాలనీ వైపు పెట్టి కథలన్నీ వినిపించేవాడు.ప్రతి వారమూ కథా శ్రవణమే! ఇహ కార్తీక మాసం, ధనుర్మాసం వస్తే చెప్పక్కర్లేదు. రోజూనూ! ఒక్కోసారి విరక్తి కలిగేది.



మేం అమెరికాలో ఉన్నపుడు ఇహ చెప్పేదేముంది,చిట్టెన్ రాజు గారు చెప్పినట్టే జరిగింది. నెలకు రెండు సార్లన్నా వ్రతం తప్పనిసరి గుడిలో! అన్ని భాషలవాళ్ళు ఉంటారు కాబట్టి, వారిలో కొంత మంది తమ అమెరికన్ స్నేహితుల్ని కూడా తీసుకొస్తారు కాబట్టి పూజారి గారు అందరి సౌకర్యార్థం ఆంగ్లంలో పూజ జరిపించే విధానం భలే వినోదభరితం!



"put flowers"

"take water into the hand"

"sprinkle chandan"

"put dakshina in the pan leaf"

"Do aatma pradakshina" అంటూ సాగేది పూజ! కథలన్నీ ఆంగ్లం లోనే!



మేమున్న వూర్లో తెలుగువారందరికీ ఒక పెద్ద ఉండేవాడు. ఆయన చాలా కలుపుగోలుగా, అందర్నీ కలుపుకోని ముందుకుపోవాలనుకునే తత్వం గల మనిషి. ఈయనకు ఒక అలవాటుండేది.

ప్రద్దానికీ "మన" "మన" అని తగిలిస్తుండేవాడు. "మన సంసారాలు, మన పిల్లలు, మన దాంపత్యాలు" అంటు అవి అక్కడ అందరికీ ఉమ్మడిగా ఉన్నట్టు మాట్లాడుతుండేవాడు.

కూతురితో నడిచొస్తున్న ఒకావిడతో "ఏమిటీ మన పాపే? ఎంత ఎదిగిపోయిందీ?" అని హాశ్చర్యం పడ్డాడొకసారి. ఆవిడ మనసులో మండిపడుతూ పైకి సౌమ్యంగానే "మన పాప కాదండీ, మా పాప! మీ పాప అదిగో స్నేహితులతో ఉంది" అని చూపించి వెళ్ళిపోయింది. ఆ తెలుగు పెద్దాయన కలుపుగోలుతనం మా అందరికీ చచ్చే చావుగా ఉండేది.



సరే, ఆయన "మన పిల్లలకు భక్తి అంటే ఏమిటో తెలియాలి" అని ఒక పని చేశాడు. సత్యనారాయణ స్వామి వ్రత కథలను చీల్చి చెండాడి, ఘోరంగా ఎడిట్ చేసి పారేసి ఒక్కో కథా అరఠావు లో వచ్చేలా కుదించి ఒక్కో కథా ఒక్కో పిల్ల /పిల్లాడి చేత చదివించేవాడు. ఆ కాపీలు మాకు కూడా ఇచ్చి ఫాలో అవమనే వాడు. ఈ ఫొటోలో చూడండి, అందరూ ఎలా అనుసరిస్తున్నామో కథలను! కొన్నాళ్ళకు పిల్లల్లో భక్తి నశించి గుడికి రావడం మానేశారు.




ఒకసారి ఒక తెలుగు స్నేహితుల కుటుంబం గుడిలో వ్రతం చేసుకుంటూ కథలు తెలుగులో చెప్పాలని పూజారి గార్ని కోరారు. ఆయన బ్రతుకు జీవుడా అని వెంటనే ఒప్పుకున్నారు.

నా పక్కన కూచున్న రాజు, అతడి భార్య రమ ఏదో విషయం మీద వాదించుకోడం మొదలెట్టారు గుసగుసల్తోనే! ఇంట్లో అత్తగారొక్కరే ఉన్నారట, వెళ్ళిపోదామని రమ, వద్దని రాజూ!
 చివరికి సహజంగానే రమ మాట నెగ్గి వెళ్దామని లేస్తుండగానే పూజారి గారు ఇలా చెప్పారు ...

."ఆ విధంగా కళావతి పూజ మధ్యలో లేచి వెళ్ళిపోవడం వల్ల, ఆమె భర్త తాలూకూ ఓడలన్నీ నీటిలో మునిగిపోయి, అతడు కూడా నీటిలో..మునిగి మర....."

ఇద్దరూ అదిరిపడి వెర్రిగా చూసుకుని చతికిల బడ్డారు.


నవ్వాపుకోవడం కష్టమనిపిస్తోంది నాకు.

చివరి కథ జరుగుతోండగా ఇంట్లోంచి అత్తగారి ఫోను."అమ్మాయ్, ఎవరో వచ్చారే, తలుపు తియ్యనా వద్దా" అని!

"ప్రసాదం తర్వాత తీసుకుందాం లే, పదండి వెళ్దాం"అని రమ లేచింది.

ఇంతలో పూజారి గొంతు వినపడింది.

"ఆ విధంగా ఆ రాజు గారూ, ఆ గొల్లవాడి నుంచి స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళేసరికి స్వామి వారి ఆగ్రహం వల్ల అతడి నూర్గురు కొడుకులు విగతజీవులైరి. అతడి సంపదలన్నీ నశించి..."


"సంపదలన్నీ నశించి..."రమ గొణుక్కుని "అమ్మో ' అని 'అల్మైరా తాళాలెక్కడ పెట్టారూ" అంది.

"కాఫీ టేబుల్ మీదా" అన్నాడు రాజు ఇంకెక్కడ పెడతానూ అన్నట్టు.

"మీకసలు బుద్ధుందా" అంది రమ పదునుగా.

"అదుంటే పెళ్ళెందుకు చేసుకుంటాను" అన్నాడు రాజు అవమాన పడి.

"అయినా అక్కడ మనకేం ఓడలు లేవులే మునగడానికి" అన్నాడు వెటకారంగా.

"హబ్బో, తమరు ఓడలు కూడా సంపాదిస్తారా? ఉన్నవి నాలుగూ ఊడితే చాల్దూ" అంది రమ కోపంగా. ఈ లోపున కథ అయిపోయి పూజ ముగిసింది.ప్రసాద వితరణ కూడా జరిగింది.

ఇలాంటివాళ్ళు పక్కన చేరితే ఒక్క కథ కూడా వినలేం! అందుకే నేను మాత్రం కథలు విన్నా వినకపోయినా చివర్లో

"మంత్ర హీనం, క్రియా హీనం, భక్తిహీనం...."ఇది మాత్రం మనస్ఫూర్తిగా చదువుకుంటాను.


ఈ కార్తీక మాసం నుంచి సంక్రాంతి వెళ్ళేలోపుగా ఎన్ని వ్రతాలకెళ్ళానో! లెక్కేలేదు. విదేశాలనుంచి బ్రేక్ తీసుకుని వచ్చిన మా వారి అన్నగారింట్లో వారం క్రితం!

రెండు రోజుల క్రితం మా కిందింటి రెడ్డిగారి భార్య వచ్చి "మా ఇంట్లో సత్ నారాణ్ కత ఉంది రమ్మం"ది.


 ఇవాళ పొద్దునే మా పక్కింట్లో ఉండే బిదిషా దాస్ అనే బెంగాలీ అమ్మాయి వచ్చి "సత్యనారాయణ పూజ చేస్తున్నాం. భోజన్ కూడా ఏర్పాటు చేసాం ,తప్పక రావాలని హిందీలో పిల్చింది. కథలు బెంగాలీలో చెప్తారా అన్నాను భయంగా! అలా అయితే రాను అందామనుకుని.

"ఏమో, మా అమ్మనడగాలి" తెలుగు హీరోయిన్లా అనేసి వెళ్ళిపోయింది బిదిష!


"హమ్మయ్య,ఇవాళ వంటింటికి విడాకులు" అనేసుకుని శ్రీఖండ్, రస్ మలాయ్ వంటి బెంగాలీ రుచులు ఊహిస్తూ ఒంటిగంటి వరకూ గడిపి వాళ్లింటికి వెళ్లాను.

తీరా చూస్తే అక్కడ భోజనం ఏర్పాట్లు ఏమీ లేవు గానీ భజన మాత్రం జోరుగా సాగుతోంది.

భోజన్=భజన్! అదీ సంగతి. బెంగాలీ "ఓ" మహాత్మ్యం!

నీరసంగా ఇంటికొచ్చి నా టిఫిన్ల లిస్టులో చివ్వర్లో ఉండే "ఉప్మా" చేస్తూ, అదయ్యే లోపున ఈ టపా రాద్దామని ........!

హెచ్చరిక..ఛ..గమనిక(నీరసంలో మాటలు కూడా సరిగా రావడం లేదు) ఈ టపా శ్రీ సత్య నారాయణ స్వామిని గానీ, వారి భక్తుల్ని గానీ కించపరుచుటకు రాసింది కాదు.

49 comments:

శ్రీనివాస్ పప్పు said...

రెండు రోజుల క్రితం మా కిందింటి రెడ్డిగారి భార్య వచ్చి "మా ఇంట్లో సత్ నారాణ్ కత ఉంది రమ్మం"ది.
కేక...

చైసా said...

ఆంగ్లంలో పూజ బాగుంది.
రాజు,రమ దంపతులు ..హ.హా :)

రస్ మలాయ్ తినాలనుకున్నారా ...అయ్యొ ...చివరికి ఉప్మాతో సరిపెట్టుకున్నారా :(

టిఫన్లలో నాకు నచ్చని టిఫన్ ఉప్మా ఉప్మా ఉప్మా ...

మధురవాణి said...

సుజాత గారూ,
మీ టపా బాగుంది. అసలు కథల కంటే.. మీరు చెప్పిన పై కథలే మహా సరదాగా ఉన్నాయి :)))

"ఎవరికీ తెలియని కథలివిలే" అనే టైటిలు చూసి మొన్న అరుణ గారు రాసిన కథ టైటిలు పెట్టారేమిటబ్బా..?? అనుకుంటూ వచ్చాను. మీకు తెలుసో లేదో గానీ..అరుణ గారు ఈ కథ రాస్తే.. మళ్ళీ రవి గారి బ్లాగులో కూడా ఏదో వ్యాఖ్యల గురించి చర్చ జరిగింది. మీరు గానీ.. మళ్ళీ ఈ కథ గురించే ఏమైనా రాసారా ఏమిటీ..?? అనుకున్నాను.
మొత్తానికి వ్రతాల కథలతో కూడా నవ్వించవచ్చని నిరూపించారు :))

పిచ్చోడు said...

హాహ్హాహ్హా..... సుజాత గారూ, ఊహించుకొంటుంటే నవ్వాగడం లేదండీ బాబూ.... ఇది ఎప్పటికి ఆగుతుందో ఏంటో....

శ్రీనివాస్ పప్పు said...

సుజాత గారు..అసలు విషయం.
కొన్నేళ్ళ క్రితం కలకత్తా వెళ్ళినప్పుడు బస్ గురించి ఎదురుచూస్తూ నా పక్కనే ఉన్న ఒక బెంగాలీని అడిగా ఈ లైనుగా ఉన్న బస్సుల్లో ఏ బస్సు టోలీగంజ్ వెళుతుందని,అతను ఆ "ఫాస్ట్" బస్ వెళుతుందంటూ వేలేట్టి చూపిస్తూ చెప్పాడు,సరే నేను పరిగెత్తి పరిగెత్తి ఆ స్పీడ్ గా వెళుతున్న బస్సెక్కి కండక్టర్ ని టోలీగంజ్ కి టిక్కట్టడిగితే వాడు నన్ను జూలో జంతువుని చూసినట్టు చూసి ఈమాత్రానికి పరిగెత్తుకుని ఎక్కడమెందుకు అక్కడ ముందునే ఆగిఉన్న బస్సెక్కచ్చు కదా అని బెంగాలీలో తిట్టి దింపేసాడు.అప్పుడర్ధమయ్యింది వాడన్నది "ఫాస్ట్ బస్" కాదు "ఫస్ట్ బస్"అని...

Anil Dasari said...

మీరు తరచూ రాయాలి.

సత్యనారాయణ వ్రతం అంటే నాకు తెగ చిరాకు. మేము చెయ్యం (అప్పుడెప్పుడో చెప్పినట్లు, 'నేనాస్తికుడిని') కానీ ఎవరు పిలిచినా వెళతాము. అదేంటో- 'నాకు పూజ చెయ్యకపోతే, నువ్వెంత మంచోడివైనా నాశనమైపోతావురేయ్' అని దేవుడు బెదిరిస్తున్నట్లనిపిస్తుంది ఆ కధ వింటుంటే. పైగా వ్రతం చేసేవాళ్లు, చూట్టానికొచ్చిన మిగతా నాలాంటి వాళ్లు అందరూ కూడా ఇదెప్పుడైపోతుందో అన్నట్లు గడియారాలు (అనగా, సెల్ ఫోన్లు) చూసుకుంటూ .. అంతా మొక్కుబడి తంతే.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
నిజానికి ఈ బెదిరింపు సంగతే నాకూ మొదటినుంచీ అర్థం కాదు. ఎక్కువశాతం వ్రతాలు మొహమాటం లేకుండా చెప్పాలంటే మొక్కుబడి తంతే! చేశామంటే చేశాం! అంతే!కథలు వినే వారిలో వ్రతం చేసే వారు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు.

విరజాజి said...

సుజాతగారూ...

అబ్బ ! చంపేసారండీ... నాంపల్లి ఎగ్జిబిషను గ్రౌండ్స్ లో ప్రతీ సాయంకాలమూ (ఇప్పటికీ) సత్యనారాయణ కధ క్యాసెట్టు వేస్తాడు. మా ఖర్మ కాలి (అపచారం, అపచారం అని లెంపలేసుకుంటూ) ఒకసారి మా ఎం.బి.ఏ పరీక్షలు ఎగ్జిబిషను గ్రౌండ్స్ లో ఉన్న వనితా కాలేజీ సెంటరులో మధ్యాహ్నం 2 నుంచీ 5 వరకూ జనవరిలో రాసాము. 3 నుంచీ మైకు. హడావుడిలో అసలు సమాధానం మానేసి, సత్ నారాయన్ కత రాసేసేవాళ్ళం. చెవులు మూసుకుంటే కూడా వినబడేంత సౌండు. పోనీ వినకుండా ఊరుకుందామంటే, పరీక్షల్లో ఫెయిలు అయిపోతామేమో అని అదో భయం. పోయిన సంవత్సరం కూడా రష్ తక్కువగా ఉంటుందని సాయంకాలం 4 గంటలకు వెళ్ళి, బుధ్ధిగా కధ విన్నానండీ !

మొత్తానికి శ్రీ సత్యనారాయణ స్వామికీ జై!

నిషిగంధ said...

టైటిల్ భలే ఉంది :-)
నేను కూడా ఇంకేదో చెప్తారని వస్తే వ్రత కధలు కనిపించాయి.. ఏ విషయాన్నైనా చాలా ఆసక్తికరంగా చెప్తారు మీరు :-)
రమ-రాజు కధ ఇంకా బావుంది.. అయినా చక్కగా అత్త గారిని వ్రతానికి తీసుకురాకుండా ఇంట్లో ఎందుకు వదిలేసి వచ్చారో!?

ఏదో చిన్న చిన్న పూజలు తప్ప వ్రతాలకి నేను చాలా దూరం.. ముఖ్యమైన సందర్భాలలో తప్ప వాటి జోలికి వెళ్ళను.. మొదలైన 5నిమిషాల నించే ఎప్పుడైపోతుందా అని చూశే వాళ్ళలో నేనూ ఉన్నాను!

సిరిసిరిమువ్వ said...

బాగున్నాయి మీ కథలు.

భోజన్=భజన్!:) మొత్తానికి కడుపు మాడ్చుకున్నారన్నమాట! పోనీలేండి ఉపవాస పుణ్యం దక్కిందిగా!

నేను కూడా టపా టైటిలు చూసి ఆరుణ గారి కథ గురించేమో అనుకున్నా!

ఉమాశంకర్ said...

సాంబమూర్తి గారి గురించి చదువుతుంటే నా చిన్నప్పటి సంగతొకటి గుర్తుకొచ్చింది..
నాకు పదేళ్ళుంటాయేమో, ఎవరిదో గృహప్రవేశ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే వెళ్ళాం. నా వయసువారందరితో మాదొక గేంగ్ తయారయింది. ఎంతసేపటికీ భోజనాలకి పిలుపురాక పోవటంతో మాకందరికీ తిక్క తిక్క గాఉంది. నాకేమో అప్పటికే కళ్ళ ముందు లడ్డు కనబడుతోంది. ( అప్పట్లో లడ్డు లేని భోజనం భోజనమే కాదు, స్వీటంటే లడ్డే. లడ్డు కాక వేరే సవాలక్ష స్వీట్లున్నాయని నాకు తరువాత ఎప్పుడో తెలిసింది).

సరే ఇక తిట్టుకుంటూ వరండా లో కూర్చున్నాము. మధ్యగదిలో వ్రతం జరుగుతోంది. వ్రతం చేయిస్తున్నాయనకొక అలవాటుంది. అదేమిటంటే ప్రతి వాక్యానికీ వెనక "వాడైనాడట" అనే తోక తగిలించటం. "అనుగ్రహించిన వాడైనాడట, చెప్పిన వాడైనాడట" అలా ... ఇంకేముంది మా కోతులకొక ఆయుధం దొరికింది. ఆయన కధలో వాక్యం చివరికి రావటం, మేము "డట" అంటూ తాళం వేయటం. పాపం ఆయన ఒక పావుగంట ఓపిక పట్టి, ఇక వీలు గాక, తాండ్రపాపారాయుడులో కృష్ణం రాజు లాగా మమ్మల్ని చూడటం మొదలెట్టారు కిటికీ లోంచి.చివరికి ఆయన కోపాన్నంతా దిగమింగుకొని వీలైనంత సౌమ్యంగా "ఆ వరండా లోని పిల్లల్ని కాస్త నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి" అని హుకుం జారీ చెయ్యటం, పెద్దలు మమ్మల్ని తిట్టడం, మేము "హు" అనుకొని రెండిళ్ళవతల ఖాళీస్థలం లో ఉన్న గాడిపొయ్యి దగ్గరకి పరిగెత్తటం.. భోజనాలకింకెంత టైముందో చూద్దాం అంటూ..

........................ said...

bagundi ......

ఉమాశంకర్ said...

ఇంకో విషయం మర్చేపోయాను....నా పెళ్ళి సందర్భంగా వ్రతం చేయించినప్పుడు, వ్రతం చేయించడానికి ఒక కుర్ర పూజారి వచ్చాడు, ఆయనకున్న సెన్సాఫ్ హ్యూమర్ నేనింకెవరిలో చూడలేదు..

ఆయన వ్రతానికి ముందే నన్నూ నా శ్రీమతినీ బెదిరించేసాడు.. కధ జాగ్రత్త గా వినండీ, చివర్లో "క్విజ్" (ఆయన ఈ పదాన్నేవాడాడు) ఉంటుంది అని. అప్పటికే పెళ్ళి, రిసెప్షన్ అంటూ మూడు రోజులుగా నిద్రలేక తూగుతున్న మా బుర్రలకి షార్ట్ సర్క్యూట్ అయినట్టయింది ఆ కధంతా గుర్తు పెట్టుకొని ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేసరికి.. నేను పాసయ్యను గానీ , నా శ్రీమతి దారుణంగా ఫెయిలయ్యింది..

సుజాత వేల్పూరి said...

ఉమా శంకర్ గారు.
"లడ్డు గాక సవాలక్ష స్వీట్లున్నాయని తర్వాతెప్పుడో తెలిసింది నాకు"..ఇలాంటి సంగతుల్నే pleasures of ignorance" అంటారేమో అనిపిస్తుంది. భలే ఉంది.

నిషి,
మీతో పాటే నేనూనూ!ఎపుడైపోతుందా బయట పడదామని..మా ఇంట్లో అయినా సరే! మా గృహప్రవేశం అప్పుడైతే రాత్రి 12-50 కి ముహూర్తం తర్వాత, తతంగం అంతా అయి వ్రతం తెల్లారుజామున నాల్గింటికి చేయించారు. నేనైతే literal గా నిద్రపోయాను. హారతి ఇమ్మంటే పురోహితుడికి ఇచ్చినట్టున్నాను..."అమ్మలికి బాగా నిద్ర వస్తోందర్రా" అని ఎవరో అన్న డైలాగు మాత్రం ఎక్కడినుంచో వినపడింది. అంతే!

Kathi Mahesh Kumar said...

హాయిగా నవ్వుకున్నాను. ధన్యవాదాలు. అభినందనలు.

ఏకాంతపు దిలీప్ said...

కథలో కథలు... అవును మీరు చాలా ఆసక్తికరంగా చెప్తారు... ఒక పది సార్లు 32 బయటపెట్టుంటాను.. :-)

ఈ వ్యాఖ్యల్లో ఇంకొన్ని కథలు. మంచి టపాలు అంటే ఇలానే ఉంటాయి..

.... చందు...... said...

బాగా రాసారండి. నిజంగానే ఈ వ్రతాలు, గంటలు గంటలు సాగే పూజలు మొదట కొంచెంసేపు వినడం,తరువాత ఎప్పుడు అవుతుందా అని చూడడం.

Unknown said...

సుజాత గారు లేట్ గా చూడడం తో లేటెస్ట్ గా స్పందించ వలసి వస్తోంది.''మన పిల్లల'' ఫోటో లో పిల్లల కంటే పెద్దలే ఎక్కువగా వున్నారు గమనించ గలరు.ఇంక ఎప్పుడు మేము సత్ నారాయణ్ వ్రతం చేసినా నా కొచ్చే ధర్మ సందేహం ఆ కధ లో వైశ్య దంపతులు ఏం కధ చెప్పుకుని వుంటారా?అని ఎందుకంటె అయిదు అద్యాయాలలో మూడు అద్యయాలు వాళ్ళ కధే.పోనీ గొల్ల పిల్లలు రాజు కధ అనుకుందమంటే మరి గొల్లపిల్లలు ఏమి కధ చెప్పుకుని వుంటారు?ఈ ప్రశ్నకు బడులీది?ఈ సత్యనారాయణ వ్రతానికి మొదలేది?

teresa said...

:)

Siri said...

సుజాత గారు, బాగా రాసారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే వ్రతం ఎందుకోసం చేస్తాం అని. పైగా కథల్లో వినకపొతే ఎదో అవుతుంది,ప్రసాదం తీసుకోకపోతే ఇంకేదో అవుతుంది అని భయపెట్టడం.అసలు సత్యనారాయణ వ్రతంలో కథలు చెప్పే ఆచారం ఎప్పుడు ఎలా మొదలైందో?

సుజాత వేల్పూరి said...

స్నేహ గారు, మీరు మీ టపాలో రాసిన పాయింటే కొంచెం ఇన్ డైరెక్ట్ గా చెప్పాను. "భయం కలిగించి భక్తిని పెంచడం"...! లేదా "నువ్వు నాకు ఇదిస్తే నేను నీకు ఈ మొక్కు తీరుస్తా" అని బేరమాడ్డం! మనం పిల్లలకు నేర్పేది రెండే పద్ధతులు!

సుజాత వేల్పూరి said...

రవి గారు,
నేను చెప్పిందీ అదేగా! పిల్లలు చదువుతూ ఉంటే వారిని ప్రోత్సహిస్తూ పెద్దలు కథను అనుసరించాలని తెలుగుపెద్ద గారి ఆదేశం!

వైశ్య దంపతులేమి కథ చెప్పుకున్నారో మీ పురోహితుడిని అడగండి, "ఏమో మరి నేనూ ఆలోచించలేదు, మొదటినుంచీ ఇలాగే చెప్పడం అలవాటయింది" అంటాడేమో!

ప్రపుల్ల చంద్ర said...

నవ్వలేక చచ్చాను....
రమ-రాజు ల కథ మాత్రం కేక... !!

నేస్తం said...

ఎవరో అన్నట్లు అది కధ కాదు నవల అని :) పెళ్ళి అయ్యాకా తనతో కూర్చుని కద వింటుంటే నిద్రే నిద్ర..పడుకుంటే అత్తింటివారెమనుకుంటారో అని ఒక భయం ..మిగిలిన వారు అటు ఇటు బాగానే తిరిగేవారు.. మేము కదలడానికి లేదు మెదలడానికీ లేదు ...కాని ఈ పూజ చేసుకున్నపుడల్ల ఆ సంవత్సరం ఏదో ఒకటి కొనేవాళ్ళం మా ఇంట్లో :)

కొత్త పాళీ said...

హ హ హ.
@అబ్రకదబ్ర .. ఈమాటలో ఈకథ చదవండి!

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు, శీర్షిక చూసి సీరియస్సేమో అని అనుకుంటూ మొదలు పెట్టానండి, బాగా నవ్వించారు.

నిజమే నాకు కూడా మొదటి సారి ఈ కధ లు విన్నపుడు ఈ బ్లాక్‌మెయిలింగ్ ఏమిటీ అనిపించింది. కామెంట్ల లో ఉన్న పిట్టకధలు కూడా బాగున్నాయ్.

Anonymous said...

టపా చాలా బాగుంది.
హాయిగా నవ్వుకున్నాను.

Anonymous said...

సుజాత గారూ అదరగొట్టరండీ
మా ఇళ్ళల్లో పెళ్ళయ్యాకా మూడు రోజులతరవాత తెల్లవారుఝమునే కొత్తదంపతులతో ఈ వ్రతం చెయిస్తారు .మరీ చాదస్తం కల పంతుళ్ళయితే గంటలతరబడి సాగదీస్తూనే వుంటారు .మూడురాత్రులనించీ నిద్ర వుండదేమో వ్రతం పీటలమీద కూర్చొని కొత్తదంపతులు పడే అవస్త చూస్తే నాకు తేగ జాలేస్తుంది ఒక్కసారి ఫ్లేష్బేక్ కూడా గుర్తొస్తుంది . అయినా ఈ వ్రతకధ చాలా సిల్లీగా వుంటుంది .ములిగిపోవడాలు, తేలిపోవడాలు, చనిపోయినవారు బ్రతికిరావడం (మన డైలీ సీరియల్స్కి ఇదే ప్రేరణ అని నా అనుమనం ) అన్ని వ్రతకధలు అంతే భక్తుల్ల్ని బ్లేక్మైల్ చేస్తూ సాగుతాయి . నచ్చినా నచ్చకపోయినా సంప్రదాయం కాబట్టి అనుసరించక తప్పటంలేదు

Anonymous said...

ఈ వ్రతం మాటెలావున్న అన్నవరం లో చేసే సత్యన్నరాయణ స్వామివారి ప్రసాదం అంటే మటుకు పిల్లలకి నాకు చాలా ఇస్టం .అన్నవరం మాకు దగ్గరేకదా అటుకేసి ఎవరు వెళ్ళినా ఓ 20 పేకెట్లు ప్రసాదం తెప్పించేస్తాం . సుబ్రంగా లాగించేస్తాం .పేకెట్టు 5 రూపాయెలే

GIREESH K. said...

హాయిగా, చాలా సరదాగా ఉంది టపా...అభినందనలు!

సుజాత వేల్పూరి said...

పప్పు శ్రీనివాస్ గారు, మధురవాణి గారు, పిచ్చోడు గారు(పేరు మార్చుకోండి సార్) సౌజన్య కుమార్ గారు, మహేష్ గారు...
టపా నచ్చినందుకు ధన్యవాదాలు!


*******************

విరజాజి గారు,
మీరూ వ్రత కథా బాధితులే అన్నమాట. బహుశా చిన్నప్పటినుంచీ "కథ వినకపొతే దేవుడు శిక్షిస్తాడు" అనే మైండ్ సెట్ ముద్రించుకుపోవడం వల్ల ఇలా అనిపిస్తుందేమో! బాగుంది మీ పరీక్షల ప్రహసనం!

*******************

దిలీప్ గారు, చందు గారు,తెరెసా గారు
ధన్యవాదాలు!

సుజాత వేల్పూరి said...

వరూధిని గారు,
నేను ఉపవాసాలు నా కోసం చేస్తాను గానీ దేవుడిని మెప్పించేందుకు చెయ్యను. మనం కడుపు మాడ్చుకుంటే సంతోషించేంత కౄరుడని అనుకోను దేవుడు! పైగా రస్మలాయ్ తింటూ ఉన్నాగా ఊహాలోకంలో? ఇంకెక్కడి ఉపవాసం?

సుజాత వేల్పూరి said...

ప్రఫుల్ల చంద్ర,
వేణూ శ్రీకాంత్, everythingisprecious గార్లు
ధన్యవాదాలు.

గిరీష్ గారు
చాలా రోజులకు కనిపించారు. థాంక్స్!

సుజాత వేల్పూరి said...

లలిత గారు,"మూడు రాత్రుల నుంచీ నిద్ర ఉండదేమో..." అమ్మో!
వ్రతకథల పరమార్థం మరింత మంది చేత వ్రతం చేయించడమే కాబట్టి, భయపెట్టేలా ఉంటాయనుకుంటా! ప్రసాదం సంగతి కొస్తే నాకూ ఇష్టమే..ఎంచక్కా మైసూర్ పాక్ లా ఉంటుంది కదా!

సుజాత వేల్పూరి said...

నేస్తం గారు, బాగా చెప్పారు.
పూజ తర్వాత ఐదు కథలూ అయ్యేదాకా కదలకుండా కూచోవాలంటే కష్టమే! పెళ్ళప్పుడు మరీ..!

దైవానిక said...

చాలా బాగుంది ఈ కథ. నవ్వి నవ్వి ఇప్పుడే కాస్త తేరుకుని ఈ కమెంటు వ్రాస్తున్నా!!

krishna rao jallipalli said...

టపా అదిరింది.. అంటే అర్థం... బ్లాగు కున్న ప్రదాన లక్షణం చదివించే గుణం అదీ చివరి దాకా పూర్తీ వ్యాఖ్యలతో సహా చదివించ గలగాలి. అప్పుడే అ టపా ద్యేయం నేరవేరున్తున్నట్టు lekka. ఖచ్చితంగా మీ టపా విషయాలో ఇదే జరిగింది. టపా అంటే ఇలానే ఉండాలన్నట్లుగా. అభినందనలు. ఇక వ్రతం సంగతి... పురోహితులు చెప్పే అధ్యాయాలలో.. వారు వ్రతం చేసుకొన్నారు అలా జరిగింది.. వీరు ఇలా చేసుకున్నారు ఇలా జరిగినది ని చెపుతుంటారు . ఇంతకీ అసలు వ్రత కార్యక్రమమేమిటో నాకింతవరకు అర్థం కాలేదు. ఎక్కువ సందర్భాలలో వ్రతం చాలా లేటుగా పూర్తి అవుతుంది. పూర్తి అయ్యేదాకా ఫుడ్ ఉండదు. కొంచం ఇబ్బందే. అప్పటకి పంతులు గారికి ఎన్నిసార్లు కన్ను కొట్టినా ఉపయోగం ఉండదు. తన దోవ తనే. ఎంతకీ తెమల్చరు. తప్పదుకదా మరి. మగవారు ఏదో కాలక్షేపం చేయవచ్చు... టీలు, సిగిరెట్లు తాగుతూ... ఆడవారికి, పీటల పైన కూర్చున్న వారికి ఇబ్బందే. intervel ఉండదు కదా.
ఇలాగే సరదా సరదా టపాలు రాస్తుండండి. next time.. సత్ సాబాబా వ్రత్ గురించో, కార్తిక్ మాస్ వ్రత్ గురించో రాయండి.

Padmarpita said...

ఆచరించాల వద్దా అని ఆలోచిస్తూ హాయిగా నవ్వుకున్నాను మీరు వ్రాసింది చదివి.Nice...

సుజాత వేల్పూరి said...

కృష్ణా రావు గారు,
టపా కంటే మీ వ్యాఖ్య చాలా హాస్యభరితంగా ఉంది.

cbrao said...

దేవుడా లేక బ్లాక్ మైలరా అనిపిస్తుంది ఆ కథలు వింటుంటే.

Bhãskar Rãmarãju said...

సుజాత గారు:
మీ గమనిక నాకు బాగా నచ్చింది. మీరన్నది నిజమే. ఇక్కడకొచ్చాక, ఇదేంటో పౌర్ణమి రోజున సత్తెన్నారాయణ వ్రతం. మనం ఏకాదశి రోజున చేస్కుంటాం కదా? అదీనూ, చేయించే పూజారులు కొందరు తమిళురు, ఒక్కోసారి కన్నడిగులూనూ.
@అబ్రకదబ్ర:
>>అదేంటో- 'నాకు పూజ చెయ్యకపోతే, నువ్వెంత మంచోడివైనా నాశనమైపోతావురేయ్' అని దేవుడు బెదిరిస్తున్నట్లనిపిస్తుంది ఆ కధ వింటుంటే.
సత్తెన్నారాయణ వ్రతం - బెదిరింపు ఏంమ్లేదు బ్రదరూ. పలాని పని అయితే వ్రతం చేస్కుంటాం అనుకుని, చెయ్యకపోతేనే బెదిరింపు.

Disp Name said...

చాలా బాగుందండి మీ ఈ టపా.
సుమధుర సురుచిత హాస్యం మనస్సుకి ఆహ్లాదం వెరసి మీ బ్లాగు సుమనోహరం

జిలెబి
http://www.varudhini.tk

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు,
అవును, మన వైపు ఏకాదశి రోజే! పౌర్ణమి రోజు కూడా కొంత మంది సాయంత్రం వేళ చేసుకోవడం చూశాను.లోకో భిన్న సంప్రదాయః అనుకోవలసి వచ్చింది.

Raj said...

మీ టపా చాలా బాగుంది. ముఖ్యంగా రాజు, రమ దంపతుల ఉదంతం నచ్చింది.
ఇక్కడ కొత్తగా పరిచయమైన వారిలో "మన" వీరుడున్నాడండోయ్. ఈయన కూడా ప్రతిదానికి మన తగిలిస్తాడు. మన భార్య, మన పిల్లలు, మన ఉద్యోగం అంటూ. ఈ బాధ పడలేక ఆయనకు చెప్పలేక చస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

రావు గారు, జిలేబీ గారు(మీ పేరు చాలా స్వీట్ గా ఉందండి),రాజ్ గారు,
థాంక్స్

రాధిక said...

ఎలా మిస్ అయ్యానబ్బా?కేక పెట్టించేసారండి..మావారు అమిత భక్తి తో పూజ చేసేస్తారు.నేనేమో ఓరి దేవుడా ఎప్పుడవుతుంది అంటూ చేస్తాను.నన్నయితే పూజారి గారు తిట్టారు కూడా.అమ్మ వాళ్ళతో వున్నప్పుడు ప్రతీ ఏడూ అన్నవరం లో చేసుకునేవాళ్ళం అమ్మ వాళ్ళ వెనకాల కుర్చుని.ఇవి కాక గృహప్రవేశాలకి,పెళ్ళిళ్ళకి అబ్బో....రాజూ,రమ గార్లు సూపరు :)

Srini said...

సుజాత గారు, ఈ మధ్య కాలంలో ఇంతగా ఏ టపా చూసి నవ్వుకోలేదు. శతకోటి ధన్యవాదాలు. టపా ఎంత బాగుందో, వ్యాఖ్యలు కూడా అంతగా బాగున్నాయి.

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్ చింతకింది గారూ,

ధన్యవాదాలండీ!

Ramana Murthy Venkata said...

సుజాత గార్కి వందనాలు , అలమలలు !

మొత్తానికి ' కశ్యప్ ' గారి పోస్ట్ ద్వారా ఈ టపా దొరికింది. టపా అప్పటి దైనా ఈ కార్తీక మాసానికి అతికినట్టు సరిపోయే కథ ( యే కార్తీక మాసానికైనా )!అవునుకదూ..అనుకుంటూనే మనకుమనం అన్వయించుకుంటూ ,కడుపారా నవ్వుకునేలా వుంది. బహిరంగముగా మనసులోని నస ను బయటపెట్టలేని వారికి ఈ టపా పేద్ద పండుగే ! నా కనిపించేదేమిటంటే ....' అందరూ కలవాలంటే అలాంటి భయపెట్టే నియమాలుంటేనే విధిగా కలుస్తారనే సదుద్దేశంతో అలా పెట్టారేమో ..మన పెద్దవాళ్ళు ' అని ! ఇప్పుడు చూడండి .... ఆ భయాలు పోయాయి.....కలవడమే గగనమవుతోంది మనుషులకు ! హు...ప్చ్ !

Post a Comment