June 5, 2009

అలీస్క!ఎక్కడైనా కనపడిందా మీకు?


స్కూలు తెరిచే రోజులు దగ్గర పడ్డాయి కదాని నిన్న సంకీర్తన పుస్తకాల షెల్ఫ్ సర్దుతోంటే పైనుంచి జారి పడిందొక పసుపు పచ్చ అట్ట పుస్తకం! తిప్పి చూసి ఎంత ఆనందాశ్చర్యాల్లో మునిగానంటే ఆ పుస్తకం ఎవరికో ఇచ్చి మర్చిపోయాననో, ఎక్కడో పోగొట్టుకున్నాననో అనుకుంటున్నా ఇన్ని రోజులనుంచీ! మాస్కో "రాదుగ ప్రచురణాలయం" వాళ్ళు 1987 లో ప్రచురించిన "అలీస్క"!

ఈ "రాదుగ" వాళ్ళ పిల్లల పుస్తకాలంటే చాలా ఇష్టం నాకు! వాటిల్లో రష్యన్ నుంచి "ఆర్వియార్" అనువదించినవే  ఎక్కువనుకుంటాను. ముఖ్యంగా ఈ పుస్తకాల్లో కథల సంగతి అలా ఉంచి ..వాటిలో బొమ్మలు....మంచుతో నిండిన మాస్కో వీధులూ,వాళ్ళ ఫర్ కోట్లూ,ఆకులు రాల్చే చెట్లూ, ఎర్రటి యాపిల్స్ తో నిండిన తోటలూ, వెడల్పాటి కిటికీలు, ఫైర్ ప్లేసులూ,పెద్ద పెద్ద టీ పాట్ లూ ఇవన్నీ భలే ఉంటాయి. ఒక్కసారిగా పుస్తకంలోంచి వెళ్ళి రష్యాలో వాలిపోవాలనిపించేంతగా! రాదుగ వాళ్ళు వేసిన అనేక పుస్తకాలు ఇప్పటికీ భద్రంగా అన్నయ్య దగ్గర ఉంటాయి.  అక్కడికి వెళ్ళినపుడు చిన్నపిల్లలమైపోయి చదువుకోవాల్సిందే గానీ తెచ్చుకుని, మరీ తరచుగా పిల్లకాయలమైపోవడం కుదరదు... వాడు ఇవ్వడు!

"అలీస్క" ఒక  గుంటనక్క పిల్ల కథ! పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం గురించి ఆర్మీలో పని చేసే ఒక నర్సు ద్రూనినా ఆలిస్ తన స్వీయానుభవాలతో రాసిన చిన్న పుస్తకం ఇది.

అసలు మొదటిసారి నేను చలం "బుజ్జిగాడు" చదివినపుడు ఒక పక్షితో ఇంత అనుబంధం ఎలా పెంచుకున్నారా అని చాలా ఆశ్చర్యపోయాను. దానితో మాట్లాడ్డం, దాని మనసులో భావాలను చదవడం,దాన్ని ఇంట్లో ఒక మనిషిలా చూడ్డం, దాని గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం, కంప్లయింట్స్ చేసుకోవడం చాలా తమాషాగా అనిపించింది.

సరే, అలీస్క విషయానికొస్తే...

ద్రునినా అనే ఒక నర్సు తన పదహారేళ్ల కూతురు అల్యోనాతో కలిసి పెంపుడు జంతువులమ్మే సంత లాంటి ప్రదేశానికి వెళ్తుంది, ఒక కుక్కను తెచ్చుకుందామనే ఉద్దేశంతో! అక్కడ వాళ్ళకు ఒక మూలగా నాగరిక ప్రపంచాన్ని చూసి భయంతో వణుకుతూ కూచున్న ఒక గుంటనక్క పిల్ల కనపడుతుంది. ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకురారు. అల్యోనా ఒక అల్సేషియన్ కుక్కతో పాటు దాని కూడా ఇంటికి తీసుకెళదామని గొడవ చేయడంతో ద్రూనినా ఆ నక్క పిల్లను కొంటుంది.దానికి అక్కడే "అలీస్క" అని పేరు పెట్టేస్తారు .

 ఇంటికొచ్చాక ఇక కష్టాలు మొదలవుతాయి. అది అడవి జంతువు కావడంతో వీళ్ళనెవ్వరినీ "యాక్సెప్ట్" చెయ్యదు. దానిష్టం వచ్చినట్లు అది ఉంటానంటుంది, తింటానంటుంది.అర్థ రాత్రి (నక్క కదా మరి) నానా అల్లరీ చేసి ఆడుకుంటానంటుంది.బాత్ రూములో పెట్టి తలుపేస్తే అక్కడి సకల వస్తువులూ కింద పడేసి సర్వనాశనం చేస్తుంది.అల్సేషియన్ కుక్క "వినీ" తో శతృత్వం ఒకటీ! అలీస్క ఆ ఇంట్లో ద్రునినా ని మాత్రమే విపరీతంగా ప్రేమిస్తుంది. మిగతా వారిని దగ్గరకు కూడా రానివ్వదు.


ఇంటిల్లిపాదీ దానికి తిండిపెట్టడం, స్నానం చేయించడం,జ్వరం వస్తే దానికి తెలీకుండా దానికి మందులివ్వడం,అది పాడు చేసిన వస్తువుల్ని విసుక్కోకుండా సర్దుకోడం ఇవన్నీ ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తారు.

ఇక ఇరుగుపొరుగులు వీళ్ళను వింతగా చూడ్డం మొదలుపెడతారు.అడవి జంతువుని, అందునా నక్కను పెంచుతున్నందుకు. అదీగాక దాని ఘాటైన "జూ" వాసన ఇంట్లో అందరికీ పట్టుకుని,  బయటికెళ్ళినా వీళ్ళకు ఒక వింత "గుర్తింపు"తెచ్చిపెడుతుంది. భారతీయ  మిత్రులెవరో బహుమతిగా ఇచ్చిన అగరొత్తుల్ని ఇంట్లో వెలిగించి కొంత తెరిపిన పడతారు. వాటికి ద్రునినా భర్త "యాంటీ ఫాక్సిన్" (నక్క వాసనకు విరుగుడు) అని పేరుపెడతాడు కూడా!ఇరుగుపొరుగులు అలీస్క గురించి పూర్తినిరసన వ్యక్తం చెయ్యకముందే,  అదృష్టవశాత్తూ, వసంత కాలం రావడంతో పల్లెటూళ్ళో ఇల్లు తీసుకుని కొన్నాళ్ళు గడపడానికి ద్రునినా కుటుంబం వెళుతుంది.

అక్కడ అలీస్క కు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. పెద్ద ఇల్లు, చుట్టూ చెట్లూ ఇలాంటి వాతావరణంలో అదీ వినీ స్నేహితులైపోతాయి.అక్కడికి వచ్చే ప్రతి చిన్న జంతువుతోనూ అలీస్క స్నేహం చేయాలనే ప్రయత్నిస్తుంది.  ద్రునినా తో షికార్లు చేస్తుంది. హాయిగా గడిపేస్తుంది.

ఇంతలో, ద్రునినా కుటుంబం పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది.ఇంతకుముందు జరిగిన అనుభవాల దృష్ట్యా అలీస్కను తీసికెళ్ళే విషయమై  ఆలోచనలో పడుతుంది ద్రునినా! చివరికి ఆ ఇల్లుగల ముసలావిడ పాషా మామ్మ సంరక్షణలో అలీస్కను వదిలి  ప్రయాణమవుతారు.బోలెడు జాగ్రత్తలు చెపుతారు కూడా! 

మూడువారాల తర్వాత తిరిగి వచ్చి చూస్తే అలీస్క ఉండే చిన్న గది ఖాళీ!

"పారిపోయింది జిత్తులమారి నక్క! అబ్బ, ఎంత యాతన పడ్డారు  దానితో? అదేమిటీ ఏడుస్తున్నారూ పీడా విరగడైందని సంతోషించక" ఈ ధోరణిలో పాషా మాటలు!

ద్రునినా నిర్ఘాంత పడి, బాధపడి,దుఃఖ పడి, ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాతి వసంత కాలంలో మళ్ళీ పల్లెటూరికి వెళ్ళినపుడు అలీస్క తిరిగి వస్తుందేమో అని ఆశతో చూస్తారు గానీ అలీస్క ఇంకెప్పటికీ తిరిగి రాదు.    

పుస్తకం పూర్తయ్యాక అలీస్క ఎక్కడికిపోయిందా అని చాలా సేపు ఆలోచించబుద్ధేస్తుంది.

ద్రునినా ఆ గుంటనక్క పిల్ల మీద ఎంత ప్రేమ పెంచుకుందో వర్ణించే వాక్యాలు పుస్తకం నిండా  ఎక్కడబడితే అక్కడ కనపడతాయి.

తన కూతురు అల్యోనా ని అలీస్క దగ్గరికి కూడా  రానివ్వకపోవడం చూసి "ఏమో, అల్యోనా వల్ల దానికేమి కష్టం కలిగిందో!అది పచ్చికబయళ్ళలో తిరుగుతున్నపుడు "ఇలాగే ఉండే ఏ పిల్ల అయినా దానిపట్ల కౄరంగా ప్రవర్తించిందేమో"అనుకుంటుంది.

రోగులకు సేవ చేసి అలసి సొలసి ఇల్లు చేరినపుడు, అడుగుల చప్పుడు వినడంతోనే


ఎగిరి తన వొళ్ళోకి దూకి ప్రేమతో చికాకుపెట్టినపుడు ఆమెలో సంతోషం ఉరకలు వేస్తుంది.

గర్వం, స్వాతిశయం, తన మీద తనకు అదుపు, స్వతంత్ర భావన ..ఇవన్నీ అలీస్కలో ద్రునినాకు కనపడతాయి. 

అలీస్క కనపడకుండా పోయాక,ఒక తెల్లవారుజామున మంచులో  కనపడిన నక్క అడుగుజాడలు చూసి అలీస్క అడుగులేమో  అనుకోడానికి కూడా ఆమె మనసు ఒప్పుకోదు.

 "అది వేరే జంతువే అయి ఉండాలి.అంతే కావాలి. అంతులేని వొంటరితనంతో చుట్టుపక్కలనే తచ్చాడుతూ ఉండే జంతువుని గురించి ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది. నాకు తప్ప ఎవళ్ళకీ అక్కర్లేని జంతువు. నేను స్నేహం చేసుకోవడం వల్ల,నా బాధ్యత కిందికి వచ్చి,నేను  కాపాడలేకపోయిన జంతువు ఒంటరిగా ఉండిపోయిందనే ఊహే భయంకరంగా ఉంటుంది.అలీస్క..ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు. ఎక్కడికి పోయిందో తెలీదు.మార్చి నెలలో ఆ మంచులో పడిన అడుగు జాడలెవరివో నాకెప్పటికీ తెలీదు" అని తనను తాను నమ్మించుకోడానికి ప్రయత్నిస్తుంది. 

ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుందనుకుంటాను ఇప్పటికీ!

41 comments:

కత్తి మహేష్ కుమార్ said...

విశాలాంధ్రలో ఇప్పటికీ దొరకడం మాత్రం డౌటే! మీ పరిచయం చాలా బాగుంది. ఇలా దొరకని పుస్తకాల గురించి చెప్పి ఊరించేసి పాపం మూటగట్టుకుంటున్నారని మనవి.

ఉష said...

చిన్నపుడు పుస్తకాలు చదివిన, ముఖ్యంగా హైదరాబాదు, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో నివసించిన అనుభవం [నేను ముందంటే నేను ముందని వాదులాడుకుని చదవటం] గుర్తుకి తెచ్చారు. నేను కూడా మా యువ, స్నేహ ల పుస్తకాలు వాళ్ళతో చదివించుకునో, వీలుని బట్టి చదవటమో చేస్తుంటాను. మొన్ననే రాబిన్ పిట్ట కథ చదివాం. జంతువులతో, పక్షులతో, మొక్కలతో సంభాషించే వ్యక్తి సమూహంలో నేనూ ఒకరిని. అది universal love లో భాగం.

గీతాచార్య said...

తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకో మాకూ తెలియదు కనుక మాళ్ళా తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే ఎటూ రెండు సార్లు ఖండించాం కనుక మూడో సారీ ఖండిస్తున్నాం. ఇలా ఖచ్చితంగా దొరకని పుస్తకాల గురించి చెప్పి మమ్మల్ని ఊరిస్తున్నందుకు.

ఆర్వియార్ గారు ఎక్కడ ఉన్నారో మీకేమైనా తెలుసా?
ఆయన రాసిన బోల్డు పిల్లల పుస్తకాలు నాకు ఇష్టం. అవి ఏమన్నా దొరుకుతాయేమో అని ఆలోచిస్తున్నాను.

నొప్పిడాక్టరు, బుల్లి మట్టి ఇల్లు, ఉక్రేనియన్ జానపద గాథలు ఎట్సెత్రాదులు... లిస్టు అనంతం. మూడో పుస్తకమే ఎవరోపట్టుకెళ్ళిపోయారు. అదో విషాద గాథ.

హరే కృష్ణ . said...

గీత చార్య గారి అభిప్రాయమే ఫిక్స్ చేసుకోండి

నేస్తం said...

భలే పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర :)

netizen said...

మంచి పుస్తకం వారు కొన్ని రష్యన్ పుస్తకాలు పిల్లలవి మళ్ళీ ప్రచురిస్తున్నట్టున్నారు. వారిని అడిగితే వివరాలు తెలియవచ్చు!

నిషిగంధ said...

భలే అరుదైన పుస్తకాలను పరిచయం చేస్తున్నారుగా!! నాకెందుకో మీ పరిచయం చదివాక ఈ పుస్తకం దొరకదనే బాధేమీ కలగడంలేదు! పాత్రల పరిచయం, వాటి భావసంఘర్షణలు అచ్చు మనం చదివితే ఎలా అనిపిస్తుందో అలానే రాశారు :-)

neelaanchala said...

ఇలాంటి పుస్తకాలు ఎక్కడ సంపాదిస్తారు మీరు? ఎలా ఎన్నుకుంటారు? పైగా వాటిని దాచి ఉంచడం ఒకటి!ఇప్పుడెలా? పుస్తకం దొరక్కపోతే?

బొల్లోజు బాబా said...

i read this book.

i could recollect it now only after reading your article. otherwise no chance to do so forever.

thank you

అబ్రకదబ్ర said...

అసందర్భ వ్యాఖ్య (మీకు, గీతాచార్యకీ): మీ 'పేట్రియాట్స్' బ్లాగులో రెండో టపాయే రాల్లేదు?

సుజాత said...

అబ్రకదబ్ర,
గీతాచార్య రాస్తారని నేను చూస్తున్నా! తను బిజీ అనుకుంటా. అతి త్వరలో విడుదల కొత్త పోస్టు! నేనైనా రాసేస్తాను.

గీతాచార్య said...

@అబ్రకదబ్ర,

Due to severe NET problems, I am unable to write the post I oughtta write in our 'పేట్’రియాటిక్ బ్లాగ్.

మీరలా పదుగురిలో అడిగి నా మానమునకు మచ్చ తెత్తురే?

అసలే ఛాలెంజ్ ఎదురవుతే ఎంతకన్నా తెగించటం మా పేటోళ్ళ లక్షణం. కల్నల్ గారి బ్లాగులా మేమూ టపాలు పరుగులెత్తించాల్సి వస్తుంది జాగ్రత్త. :-D (lOlunnara) (I have essential matter which will easily give a hundred posts. గొప్ప కోసం కాదు. నిజంగానే తీరిక సమయంలో సంపాదించాను).

రాద్దామండీ. మీరిలా రెచ్చగొడితే టిచరమ్మ గారు నన్ను నెట్టులోంచే కొట్టీయగలరు. :-D

వేణు said...

రాదుగ ప్రచురణాలయం పుస్తకాలు చాలా చదివాను కానీ ఈ అలీస్క మాత్రం ‘తప్పిపోయింది’. మీ టపా చూశాక దాన్ని ఎలాగైనా సంపాదించి చదవాలనిపిస్తోంది. అంత బాగా పరిచయం చేశారు.

చివర్లో ద్రునినా మనోభావాలకు అద్దం పట్టే ఈ వాక్యాలు ఎంత ఆర్ద్రంగా ఉన్నాయో..

' అలీస్క..ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు. ఎక్కడికి పోయిందో తెలీదు.మార్చి నెలలో ఆ మంచులో పడిన అడుగు జాడలెవరివో నాకెప్పటికీ తెలీదు"

రష్యన్ అనువాద పుస్తకాల్లో కుప్రిన్ ‘యమకూపం’ (యామా ద పిట్) అద్భుతమైన నవల. అలాగే తుర్గేనివ్ ‘తండ్రులూ కొడుకులూ’ కూడా.

వేణూ శ్రీకాంత్ said...

అలీస్క కధ బాగుంది సుజాత గారు. పెట్ లవ్ పై నేను మొన్నీమధ్య ఓ సినిమా చూసాను. పేరు గుర్తు లేదు కానీ అందులో కూడా కుక్క అసహనం తో చేసే నానా రభస తో ఆ కుటుంబం మొదట బాధలు పడినా మెల్లగా వాళ్ళు దాని పై పెంచుకునే ప్రేమనీ, కొత్తగా పెళ్ళైన జంట కెరీర్ మరియూ కుటుంబ భాధ్యతల మధ్య సంఘర్షణ తో కలిపి చిత్రీకరించాడు.

భావన said...

మంచి పుస్తక పరిచయం. చిన్నప్పుడు నా స్నేహితురాలి ఇంట్లో చదివి నప్పుడు ఇలాంటి పుస్తకాలు తెగ............... హాశ్చర్య పోయేదాన్ని... అలా వాళ్ళందరు రొట్టెలు తింటు టీ తాగుతు ఎలా వుంటారు అన్నం తినకుండా అని. అప్పట్లో ఆ పుస్తకాల అట్టలు, ఫొటో లు కూడా ఎంతో బాగుండేయి కదు... ఏమిటో వెళ్ళటమే కుదరని దేశపు సాహిత్యం చదవి అక్కడి కాలమాన పరిస్తితులు తెలుసుకునే వాళ్ళము కదా...

S said...

ఏమండోయ్!
పుస్తకం.నెట్ కి రాయొచ్చు కదండీ! :(

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

These russian books are my favorites. I spent my childhood reading these books. Very good books and very good pictures also.
I could remember some names like "Dr Petro", magic story with russian wodden worker.

సుజాత said...

మహేష్ కుమార్,
పుస్తకాల సంగతేమో గానీ పాపం మాత్రం బాగానే మూట గట్టేస్తున్నానన్నమాట. సరే, కావాలంటే తీసుకుని చదవండి.కొంచెమైనా పరిహారం జరుగుతుందేమో!

గీతాచార్య,మీక్కూడా పై సమాధానమే వర్తిస్తుంది.

హరేకృష్ణ గారు,:-)

నేస్తం..మరేనండి..:-)

నెటిజెన్,
థాంక్యూ!

నిషిగంధ,
ధన్యవాదాలు!

నీలాంచల,
ఏదో అలా పోగేస్తూ పోతే ఇలా ఇన్నాళ్లకు నాలుగు పుస్తకాలు చేరాయి. పుస్తకం దొరక్కపోతేనా? ఎలా ఏముంది? హైదరాబాదులో ఉంటే మా ఇంటికొచ్చేయడమే!

బాబా గారు
థాంక్యూ!

సుజాత said...

వేణుగారు,
రాదుగ వాళ్ల పుస్తకాలు మీరు చదివారంటే సంతోషంగా ఉంది! మీరు చెప్పిన పుస్తకాలు మీ వద్ద వుంటే అవి ఇలా ఇచ్చి, అలీస్కను అందుకోండి మరి!

వేణూశ్రీ,
ధన్యవాదాలు! ఇంతకీ ఏంటా సినిమా? పేరు గుర్తుందా?

భావన,
కరక్ట్ గా చెప్పారు! ఆ బొమ్మలు చూస్తుంటేనే మనమూ కాసేపు అక్కడ విహరించి వస్తాం కదూ! మంచు కురుస్తున్నపుడు తలుపులు బిగించుకుని వేడిగా సూపు తాగడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉండేది. నిజానికి అప్పుడు సూపు అంటే ఏమిటో కూడా తెలీదు.

Sowmya,
పుస్తకం కి రాయాలంటే మంచి పుస్తకం దొరకాలి కదండీ మరి! మీరు అడిగాక కూడా వెనకడుగు వేస్తే బాగోదు. ప్రయత్నిస్తాను.థాంక్యూ!

మిరియాల,
Dr.petro కూడా ఉండాలి నా దగ్గర! థాంక్యూ!

సుజాత said...

ఉష గారు,
మొక్కలతో,జంతువులతో సంభాషించేవారిలో నన్ను కూడా కలుపుకోండిమరి! ప్రేమను పంచడం మాత్రమే తెలిసిన వాటితో మన భావాలను పంచుకోవడం చాలా హాయి అయిన అనుభూతిని ఇస్తుంది. అలాగే పిల్లల పుస్తకాలు చదివి అప్పుడప్పుడూ పిల్లలమై పోవడం కూడా నాకెంతో ఇష్టం! చిన్నప్పుడు అందులో మనం గ్రహించలేని విషయాలెన్నో ఇప్పుడు గ్రహించగలుగుతాం అనిపిస్తుంది. మన పిల్లలూ అంతేనేమో అనిపిస్తుందొక్కోసారి!

కథాసాగర్ said...

ఈ పుస్తకం విశాలాంద్ర లో దొరకదు.. తప్పకుండా రష్యా వారి ప్రగతి ప్రచురణాలయం కు రాయవలసేందే..

Sujata said...

Wonderful.

గీతాచార్య said...

గీతాచార్య,మీక్కూడా పై సమాధానమే వర్తిస్తుంది.
*** *** ***

LOLunnara

Srujana Ramanujan said...

The Russian child literature was very good, and RVR's translation catches the imagination of the readers. The pictures were unbeatable. They were the best to capture imagination.

Have u got Seryozha?

Malakpet Rowdy said...

కధ మొత్తం మీరే రాసెయ్యచ్చుగా? మాకు దొరకని పుస్తకం కొనుక్కునే బాధ తప్పుతుంది - A ncie one though

ప్రియ said...

I have Aliska. Whoever wnat it can come London and pick it from me for an hour to read :-D

సుజాత said...

కథా సాగర్,
నిజమేనండి, ఇక్కడ దొరక్కపోవచ్చునేమో!

సృజనా,
మీరు చెప్పింది అక్షరాలా నిజం! చదువుతుంటేనే ఆ వాతావరణం ఊహించుకునేట్లు ఉంటుంది అనువాదం.

మలక్ పేట్ రౌడీ,
అంత పనీ చేశానుగా! దాదాపు కథంతా చెప్పేశాను.

సుజాత said...

ప్రియ,
ఇది కొంచెం ఖరీదైన వ్యవహారంలా లేదూ? ఇంతా చేసి లండన్ వస్తే గంట సేపా ఇచ్చేది మీరు? ఈ లెక్క ప్రకారం పుస్తకం చదవాలనుకునే వాళ్లంతా మా ఇంటికే వస్తారు మరి!

Dhanaraj Manmadha said...

’అలీస్క’ టైటిల్ చూసి ఏదన్నా అమ్మాయి కథేమో అనుకున్నాను. నక్క చెల్లనుకోలేదు. :-D

చదవాలనిపించేలా రాశారు.

Nobody said...

Regardless of their political and cultural views, the Russian child literature is of top class, like ur post.

The readers of this post will long for reading the book.

Nobody read that book. But again wants to read it.

సుజాత said...

ధనరాజ్ మన్మధ,
:-)! నిరాశ పడ్డారనుకుంటా!

nobody

thaaks! By the way, are you in the Q too to read the book?

ప్రియ said...

లేకపోతే రెండు గంటలు. ఎంత పెద్ద పుస్తకమని?

ఐనా, రాజీవ్ ఫ్లైటుశ్రీ పథకం కింద ఉచిత ఫ్లైటు టిక్కెట్లు పెట్టించండి. అప్పుడు ఈజీ.

ఒక్కసారి "నక్క చెల్లి" ఫాన్స్ చేతులెత్తండి!

Nobody said...

Nobody has that book, but in Russian

Dhanaraj Manmadha said...

>>>ధనరాజ్ మన్మధ,
:-)! నిరాశ పడ్డారనుకుంటా!

కాదామరి? అసలే రష్యా అమ్మాయిలు చాలా బాగుంటారు. :-D

Seriously, I heard about that book once.

@Srujana Ramanujan,

Seryozha??? Is it the Panova book పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు?

అరుణాంక్ said...

పరిచయం చాలా బాగుంది.
chldern loves pet animals as good as their parents.Childern are like gods.

satyamevajayate said...

రాదుగా పబ్లికేషన్స్ లో నే అనుకుంటాను " బొమ్మల కధలు"అని కేవలం బొమ్మలలో కథలు..పుస్తకం వెడల్పుగా చిన్నపిల్లలకి ఆసక్తి కలిగించేట్లు ..నేను అరడజను కాపిలుకొని పుట్టినరోజు న బహుకరిస్తుండే వాడిని ..మాపిల్లలకి అన్నం పెడుతూ చెప్పిన కథలేచేప్తూ..పెంచి పెద్దవాళ్ళని చేసాము.వాళ్ళకి ఇప్పుడు బోలెడంత పుస్తకాల పిచ్చి ..రష్యన్ పుస్తకాల రోజులే వేరు ..తిరిగిరాని సోవియట్ యునియన్ ...వాటి ఖరీదు నేటి పల్లి ,బఠాని, టి కప్పు ఖరీదు .

సుజాత said...

@satyamevajayate,
రాదుగ ప్రచురణాలయం పుస్తకాలు పిల్లలను ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. నా చిన్నప్పటినుంచీ అవే మా ఇంట్లో! పుస్తకాల విలువ తెలుసుకునే సమయానికి అవి కాస్తా పరహస్తగతమయిపోయాయి.వెడల్పుగా, అష్పష్టమైన ఆయిల్ పెయింటింగ్ బొమ్మలతో(ఈ పోస్టులో అలీస్క బొమ్మలు పెట్టింది అందుకే నేను)రష్యా ప్రజల్ని, జీవితాలను ఊహించుకుంటూ, వినాలనిపించేత బావుంటాయి. మీలాగే తల్లి దండ్రులుంటే పిల్లలకు పుస్తకాలంటే పిచ్చి ఉండదా మరి! మా అమ్మ కూడా ఇలాగే పెంచింది మమ్మల్ని,చదివిన ప్రతి పుస్తకం మాతో పంచుకుంటూ!

Ruth said...

హెల్లొ సుజత గారు, నేను కొత్తగా వచ్చాను తెలుగు బ్లాగ్లోకానికి. మీ కామెంట్స్ చాలా చోట్ల చూసాను కాని మీకు కామెంట్ చేసె అవకాసం ఇప్పుడే వచ్చింది. హ్మ్మ్మ్... ఆలీస్క !!! ఎంత అద్భుతమైన బూక్ కద ! నేను చిన్నప్పుడు చదివాను చదివిన తరువాత మీలాగే ఆ నక్క ఏక్కడికి పోఇందొ ఏమైందొ అని తెగ ఆలొచించెదాన్ని. కాని ఆ పుస్తకం నా దగ్గర లేదు. స్కూల్ లైబ్రరి లో చదివానేమో. కాని, మిగతా పుస్తకాలు నా దగ్గర ఉన్నై... నొప్పి డాక్టరు,బుల్లి మట్టి ఇళ్ళు, ఇంకా అలాంటివి. అవి నా నిధి లా చూసుకుంటూ ఉంటాను. ఒక పుస్తకం "నాన్నారి చిన్నతనం" మాత్రం ఒక ఫ్రెండు కి ఇస్తె, మల్లి తిరిగి ఇవ్వలేదు. వాడిని తిట్టుకున్నట్టు ప్రపంచం లో ఏవ్వరినీ తిట్టుకుని ఉండను. తను ఆ పుస్తకం పొఇందని చెప్పినా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నేనె వెతికాను కని దొరకలేదు.
మీ టపా చూడ్టం చాలా సంతొషం గా ఉంది.

Anil Reddy said...

Good news to "Aaliska" book fans:

Manchi Pusthakam is reprinting this book again..

Book is coming soon ...get ready.
రాదుగా పుస్తకాల అభిమానులకు శుభ వార్త!
"MANCHI PUSTHAKAM" reprinted RADHUGA PRACHURANALAYAM children books:
some of the titles:
1.Bulli matti illu
2.Ukranian janapada gadhalu(devided into 4 books set)
3.Gunde kagada(maxim gorky)
4.Nakka-kundelu
5.Leo tolstoy balala kathalu..and many more...

They areconducting a stall in HYDERABAD BOOK EXHIBITION-2012 which start from DEC 14th at naclace road, Hyderabad.

Dont miss this golden opputunity:
Another interesting news is: they are printing 3000 copies of each book...:) good news...
IF YOU WANT TO PURCHASE THE BOOKS, PLEASE CONTACT BELOW ADDRESS:
MANCHI PUSTHAKAM,
12-13-439,
STREET NO:1,
TARNAKA, SECBAD-500017
PHONE: 9490746614,
www.manchipustakam.in
info@manchipustakam.in

www.manchipustakam.in
ph: 9490746614

sarath said...

రాదుగా ప్రచురణాలయం పేరుతో వెతుకుతూ ఉంటే మీ బ్లాగుకి వచ్చాను. అప్పటి పుస్తకాలు చదువుతూ పెరిగినవాళ్ళంటే నాకు వల్లమాలిన అభిమానం. అప్పట్లోపరిచయం లేని సోవీయట్ భూమి ఎమ్త దగ్గరగా అనిపించేదో ఇప్పుడు ఆ కథలు చదువుతూ ఎదిగిన తరంతో మాట్లాడుతున్నా అల్లనే అనిపిస్తుంది. మీ నుంచి ఇలాంటి టపాలు మరిన్ని ఆశిస్తున్నాను.

Anil Reddy said...

I have a good news for all RUSSIAN CHILDREN BOOKS FANS:

Manchipusthakam reprinted RADUGA vari "ALEESKA"
[Abridged version]; price:45/-

Grab the golden book..
IF YOU WANT TO PURCHASE THE BOOKS, PLEASE CONTACT

BELOW ADDRESS:
MANCHI PUSTHAKAM,
12-13-439,
STREET NO:1,
TARNAKA, SECBAD-500017
PHONE: 9490746614,
www.manchipustakam.in
info@manchipustakam.in

Post a Comment