June 17, 2009

క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!
వేసవి సెలవులు ముగుస్తుండగా మా కాలనీలో మాకు ఒక అద్భుతమైన అయిడియా వచ్చింది.

 ఇక కొద్ది రోజుల్లో పిల్లలు ఎలాగూ స్కూళ్ళకు బయల్దేరతారు "Happy days are here again"  అని పాడుకుంటూ! ఇప్పటికీ సమ్మర్ కాంపులతో బిజీగానే ఉన్నారు. కాసింత సరదాలూ, పాడూ ఏమీ లేకుండా అయిపోతున్నాయి వీళ్ళ జీవితాలు..అని కళాత్మకంగా ఒక క్విజ్ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నాం! (ఇల్లాంటి కళాత్మకాలోచనలు(సవర్ణ దీర్ఘ సంధి) నాకే వస్తాయని వేరే చెప్పాలిటండీ)!
ఈ ఆలోచన బయట పెట్టగానే పెద్దవాళ్లంతా

"మాకూ ఉండాల్సిందే క్విజ్! ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఉండేవి క్విజ్ లు! అంతకు ముందు సిద్దార్ధ బసు రోజుల్లో! మేమూ పాల్గొంటాం సీనియర్లు, జూనియర్లు,సబ్ జూనియర్లు ఇలా కేటగిరీలు ఉండాల్సిందే"  నన్నారు.
మాకూ సరదా వేసి ఒప్పేసుకున్నాం! పేపర్ సెట్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు(పిల్లలకు మినహాయింపు) క్విజ్ లో పాల్గొనే అవకాశం లేదు. పదిమంది తెలివైన మేధావులు(ఇదేదో దుష్ట సమాసంలాగా ఉంది) కూచుని ప్రశ్నలు తయారు చేశాం. ఒక్కొక్కళ్ళూ సిద్ధార్థ బసు, అనితా బసుల్లాగా ఫీలవుతూ జాగ్రత్తగా ప్రశ్నావళి తీర్చి దిద్దాము!ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉండగా క్విజ్ టైమూ, ఇండియా క్విజ్ కార్యక్రమాలు దూరదర్శన్లో వచ్చేవి చూడండి. సిద్దార్థ బసు నేతృత్వంలో! రాత్రి తొమ్మిదయ్యేసరికి హైదరాబాదు దూరదర్శన్ కార్యక్రమాలకు అసలు సేల్సు ఉండేవా బుధవారం రోజు?(బుధవారమేనా ఇంతకీ) అయినా మనవాళ్ళు ఎనిమిదిన్నరకే "Over to Delhi" అనే పాత బోర్డు పెట్టేసి చాపలు చుట్టి దుకాణం సర్దేసేవాళ్ళుగా? పిల్లలూ, పెద్దలూ అందరూ క్విజ్ టైమ్ కోసమే వేయికళ్ళతో ఎదురు చూస్తుండేవాళ్ళు. సిద్దార్థ బసు, పక్కనే చక్కని చిరునవ్వుతో ,మార్కులు వేస్తూ అనితా బసు..! ఒక్కోసారి సిద్ధార్ధ బసు స్థానంలో ఇంగ్లీషు వార్తలు చదివే భాస్కర్ భట్టాచార్జి క్విజ్ మాస్టర్ గా వచ్చేవాడు. ఆయన కర్లింగ్ హెయిర్ భలే ఉండేది.పిల్లలు సరైన సమాధానం చెప్పగానే భాస్కర్ చాలా స్టైలుగా "కొఱ్ఱెక్ట్"అనేవాడు గుర్తుందా?, "కరెక్ట్"అనడానికి! నాకైతే ఏ క్విజ్ ప్రోగ్రాం చూసినా క్విజ్ మాస్టర్ భాస్కర్ భట్టాచార్జి అంత సొగసుగా "కరెక్ట్"అనేవాళ్ళు ఆ తర్వాత ఇంతవరకూ కనపళ్ళా!ఆ క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలు ఎక్కడినుంచి వచ్చేవాళ్ళో కానీ మెరికల్లాగా ఎంతటి ప్రశ్నలకూ ఇట్టే జవాబులు చెప్పేవాళ్ళు కాదూ! (అప్పుడూ సరిగ్గా ఇదే అనుకునేవాళ్లం)క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నల్ని జాగ్రత్తగా  నోట్ చేసి పెట్టుకోవడం, మర్నాడు కలిసిన స్నేహితులతో కలిసి వాటి జవాబులు అందరూ ఒకటే రాశారా లేదా అని సరి చూసుకోడం, ఒక ఫైలు తయారు చేయడం ఇదో పెద్ద అసైన్మంట్! మా వూర్లో అందరూ చదువు,కళల పట్ల బోలెడంత ప్రేమ, ఆదరణ కలవారవటం చేత వివిధ క్లబ్బులు, కళా సాంస్కృతిక సంఘాల వాళ్ళు ఎప్పుడూ వ్యాసరచన,వక్తృత్వం,క్విజ్ పోటీలు పెట్టి యధాశక్తి మాకు బహుమతులిచ్చేస్తూ ఉండేవాళ్ళు.

ఒకసారి పది టీముల్తో హోరాహోరీ తలపడి చివరికి మిగిలిన రెండు టీముల్లో ఒకటి మా స్కూలు! ఒక్క ప్రశ్నా అవతలి టీముకు పోకుండా జాగ్రత్తగా జవాబులు చెప్పి ఇక్కడ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి రెండు టీములూ! మరి కాసేపట్లో బహుమతి ప్రదానం కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా వచ్చి ఉన్నారు. విజయాన్ని నిర్ణయించే చివరి రౌండ్ ప్రశ్న ఆయన్నే అడగమంటే ఆయన చాలా స్పాంటేనియస్ గా అవతలి టీము వైపు చూస్తూ
"నలుగురు పద్మశ్రీలు ఉన్న తెలుగు సినిమా పేరు చెప్పండి"అనేసి కూచున్నారు.
వాళ్ళు ఇటువంటి ప్రశ్న ఎదురు చూడకపోవడంతో పద్మశ్రీ అవార్డులు  ఎవరెవరికి వచ్చాయో లెక్కెట్టే లోపు మాకు టైము కలిసి వచ్చింది. వాళ్ళు చెప్పలేకపోయే సరికి నేను, చిత్ర, రాజకుమారి కూడబలుక్కుని "మాయా బజార్"అని చెప్పేశాం!
(నిజానికి మాకూ కంగారు వేసింది కానీ అంతమంది హేమా హేమీలు ఉన్న సినిమాలో నలుగురు పద్మశ్రీలు ఉండకపోతారా అని చీకట్లో బాణం వేశామంతే! ).


ఆయన చల్లగా "తప్పు" అన్నారు.
 
"తెనాలి రామకృష్ణ రైటాన్సరు! రామారావు, నాగేశ్వర్రావు,భానుమతి, నాగయ్య..నలుగురు పద్మశ్రీలు"అని జవాబు కూడా చెప్పారు.మళ్ళీ "టై" అని నీరసం వచ్చింది.

కానీ మాకు వెంటనే ఒక గొప్ప లాజిక్కు దొరికి "మేం ఒప్పుకోం! మీరు నలుగురు పద్మశ్రీలు "ఉన్న" తెలుగు సినిమా అన్నారు కానీ "నటించిన"అన్లేదు.అందుకని మేము రామారావు, నాగేశ్వర్రావు, రేలంగి,ఘంటసాల"అని లెక్కేశాం! ఘంటసాల సినిమాలో నటించకపోతేనేం, ఉన్నారా లేదా"అని వాదించాం ఉత్సాహంగా!

"నిజమే కదా" అన్నట్లు చూశారు నిర్వాహకులు ప్రైజు మాకే ఇచ్చేయలనే ఉత్సాహంతో! ప్రొఫెసర్ గారు మా లాజిక్ మెచ్చుకుని (మనసులో మాత్రం "వీళ్ళ మొహాలు ఈడ్చా! నా కొశ్చెన్ కే ఎదురా?" అనుకుంటూ)బహుమతి మాకు ప్రకటించారు. అలాంటి క్విజ్ లు ఎన్నో, లెక్కేలేదు. మా స్కూలు హెచ్చెమ్ రూములో మేం సంపాదించిన షీల్డులు లెక్కెట్టాలంటే ఒక పూట పడుతుంది.మా కాలనీ క్విజ్ లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మరీ పేదగా అంటే పూర్ గా ఉందని చెప్పక తప్పదు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలంటే

 "జపాన్ దేశం కరెన్సీ ఏది"

"ఈ రోజున డాలర్ కెన్ని రూకలు?గుప్పెడేనా?"
"
NDTV profit ఛానెల్లో పొద్దున్న ఎనిమిదింటికి వచ్చే అనలిస్ట్ ఎవరు?"


అని అడుగుతామేమో అనుకుని బాగా ప్రిపేర్ అయి వచ్చారు. కానీ పేపర్ సెట్టర్ ఎవరు మరి?అందుకే

"మీ దగ్గర్లోని పోస్టాఫీసు ఎక్కడుంది?"

"వోటర్ ఐడీ కార్డులకు ఎక్కడ అప్లయి చేయాలి"

"కరెంట్ బిల్లు కరెంటాఫీసులో కట్టాలా? ఈ-సేవా లోనా"

"సమీపంలో ఈసేవా కేంద్రం ఎక్కడుంది?"

"ఇక్కడినుంచి సికిందరాబాదు వెళ్ళు సిటీబస్ నంబర్ ఎంత"

"దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రి చిరునామా చెప్పుము"

"మోర్ సూపర్ మార్కెట్లో సోనా మసూరి రైస్ కిలో ఎంతకు దొరుకును?"

"మాదాపూర్ ఆంధ్రా బాంక్ శాఖ కొండాపూర్ లో ఎందుకుందో తెలుసా?(నల్లకుంట పోలీస్ స్టేషన్ అడిక్ మెట్ లో ఉన్నట్లు)


"రోజుకు టాంకర్ రు. 400 చొప్పున నెలకు 78 టాంకర్లు నీళ్ళు తెప్పిస్తే ఒక్కో ఫ్లాట్ కి ఎంత బిల్లు పడుతుంది?"

"మొబైల్ ఫోన్ చూడకుండా, మీరు గుర్తుంచుకున్న ఒక అయిదు ఫోన్ నంబర్లు చెప్పండి"

వంటి ఎదురు చూడని ప్రశ్నలకు   జవాబులు చెప్పలేక,  కనిష్టమార్కులు తెచ్చుకుని  దారుణంగా ఫెయిలై పూడ్చారు.


 ప్రేక్షకుల్లోని వాచ్ మన్ లు మాత్రం ఈ ప్రశ్నలకు కు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా జవాబులు చెప్పేసి ప్రోత్సాహక బహుమతులు గెల్చుకుని ఇకపై తమను కూడా టీముల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రెండో మాట లేకుండా వాళ్ల డిమాండ్ ని అంగీకరించేశాం!ఇకనుంచి వీలున్నపుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలని అనుకుంటూ ఆ సరదా నుంచి తేరుకోకముందే కొంపలు మునిగినట్లు మొన్న సోమవారం నుంచీ స్కూళ్ళు మొదలు! వీపున బస్తాలతో హమాలీల్లాగా పిల్లలు తయారు!

33 comments:

జీడిపప్పు said...

భలే ఉంది మీ కాలనీ "క్విజాయణం". బ్లాగులోకంలో కూడా సరదా క్విజ్ నిర్వహించండి :)

కత్తి మహేష్ కుమార్ said...

నిజమే...మన జెనరల్ నాలెడ్జ్ అమెరికా గురించి తెలుసుకుంటుంది గానీ రోడ్డుచివరి కిరాణాషాపు పేరు గుర్తుంచుకోమనదు. విధివైపరీత్యం మరి.

harephala said...

మీ బ్లాగ్గు చాలా ఆసక్తికరంగా ఉంది.మా అబ్బాయి ధర్మమా అని నాకు కూడా క్విజ్ అంటే చాలా ఇష్టం. తను, తన పార్ట్నరూ ( మాస్టర్ మైండ్ ఇండియా విన్నర్ ) ఈ ఏడు, బ్రాండ్ ఈక్విటీ ప్రాంతీయ రౌండ్ లో రన్నర్స్ గా వచ్చారు.మా అబ్బాయి, క్రిందటేడాది టాటా క్రుసిబుల్ లో కూడా రన్నర్ అప్.పూణే లో జరిగే ప్రతీ క్విజ్ లోనూ మొదటి మూడు స్థానాల్లోనూ వస్తూంటాడు. తను ఈ మధ్యన ఈ.ఎస్.పి.ఎన్ వాళ్ళకి , సాయంత్రం 7.00 గంటలకు ప్రసారమయ్యే " స్టంప్డ్" కి ప్రశ్నలన్నీ ,తనే తయారుచేశాడు. నేను కూడా వాళ్ళు వెళ్ళే క్విజ్ లకి వెళ్ళి, అప్పుడప్పుడు " ఆడియెన్స్ ప్రైజు" లు సంపాదిస్తూంటాను !!

మేధ said...

భలే, భలే.. మేమూ చిన్నప్పుడూ ఇలాంటివి చేసేవాళ్ళం..

టి. శ్రీవల్లీ రాధిక said...

నవరసాలతోనూ నిండి, చివరికొచ్చేసరికి జీవితం పట్ల ఒక ఆలోచననీ, ఉద్వేగాన్నీ కలిగించే మంచి కథ స్థాయిలో వుందండీ ఈ టపా.

చిన్ని said...

సరదాగా బాగుందండి .

వేణు said...

‘మాయాబజార్’ లాజిక్ ఐడియా వచ్చినందుకే బహుమతి మీకు ఇచ్చేయవచ్చు. పాపం ... ప్రొఫెసర్ గారు క్విజ్ మాస్టర్ గా తన ప్రత్యేక హక్కును వినియోగించుని, ‘కీ’లో ఉన్నదే ఫైనల్ , ఎలాంటి వాద వివాదాలకూ అవకాశం లేదు’ అని పట్టుపట్టివుంటే ఎలా ఉండేదో...

పెద్దవాళ్ళకు సిద్ధం చేసిన ప్రశ్నలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ‘తెలివైన’ మేధావులని రుజువయ్యేలా !

‘ వీపున బస్తాలతో హమాలీల్లాగా పిల్లలు తయారు!’...మీ కాలనీ పేరెంట్స్ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరా..?

neelaanchala said...

మాయా బజార్ ఎపిసోడ్ చాలా బాగుందండీ! నిజంగా భలే లాజిక్ పట్టేశారు సుమా! సిద్ధార్థ బసు రోజులన్నీ కళ్ళముందుంచేశారు. సూపర్.

kiran kumar said...

సుజాత గారూ
ఇవాళ ఆఫీసులో కూచుని వరసపెట్టి మీ పోస్టులన్నీ చదివేశాను. హాయిగా సరదాగా ఎటువంటి తలనొప్పులూ, భారమైన వాదనలూ, అహంకారాలూ,మర్మాలూ,ఎవరినో సంస్కరించే ధోరణీ లేకుండా ప్లెయిన్ గా ఉన్నాయి. మీ బ్లాగ్ నాకు చాలా నచ్చింది.

ఇప్పటి పోస్టు కూడా చాలా బాగుంది.మీ కాలనీలో మీరు చెప్పిందే వేదంలా ఉందే!పేపర్ అలా సెట్ చేసి అందర్నీ రగ్బీ ఆడారుగా పాపం! ఎంతమంది తిట్టుకున్నారో మిమ్మల్ని?

"మాదాపూర్ ఆంధ్రాబాంక్ శాఖ కొండాపూర్ లో ఎందుకుంది?"(నల్లకుంట పోలీస్ స్టేషన్ అడిక్ మెట్ లో ఉన్నట్లు) పొట్ట చెక్కలు!

చైతన్య.ఎస్ said...

మీ ప్రశ్నలు సూపర్ :)

హరే కృష్ణ . said...

సుజాత గారు
చాలా బావుంది..పద్మ శ్రీ ఎపిసోడ్ హైలైట్

bonagiri said...

మరి కొన్ని సంగతులు.

సిధ్ధార్థ బసుని కౌన్ బనేగా కరోడ్ పతిలో మళ్ళీ చూసాం.

భాస్కర భట్టాచార్జి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తల్లో విన్నాను.

డెరెక్ ఒ బ్రయన్ తృణాముల్ కాంగ్రెస్ తరపున ఈ సారి ఎన్నికలలో ఎం. పి. గా గెలిచారు.

మురళి said...

మీరు చాలా విషయాలు చెప్పారు కానీ నేను 'అనితా బసు' దగ్గర ఆగిపోయాను.. చిరు నవ్వుల రేణుకా సహానీ కూడా గుర్తొచ్చేసింది..ప్చ్.. గడిచిపోయిన వసంతం... మీ టపా గురించి కూడా కొంచం చెబుతాను..మీ ప్రశ్నలకి జవాబులు మీ బ్లాగులో దొరకొచ్చన్న విషయం మీ కాలనీ వాళ్లకి తెలియదనుకుంటానండి.. అవునూ..పేపర్ సెట్టర్లూ డౌన్ డౌన్ అని ఎవరూ అల్లరి చెయ్యలేదా అండి?

సుజాత said...

bonagiri గారు!
అయ్యో, భాస్కర్ భట్టాచార్జి ఆత్మహత్య చేసుకున్నాడా? నేను చదవనే లేదు. విషాదకరమైన వార్త చెప్పారండీ!

ఉష said...

మా నాన్న గారు దిగ్విజయంగా మా ఇంట్లో సాగించిన కార్యక్రమం ఇది. వినోదమూ ఆయనకే ఎక్కువ పాళ్ళలో దొరికేది. ఇప్పుడూ కొనసాగుతుమంది మా ఇంట్లో. కాకపోతే ఇప్పుడు క్విజ్ మాస్టరిణి/మాస్టార్ నా సంతానం. ఆ తరంలోను, ఈ తరంలోనూ అత్తెసరు మార్కుల ఘనత నాదే, మనకు జెనరల్ నాలెడ్జీ తక్కువని వారి అపోహ. బాగుంది టపా. ;)

ప్రియ said...

మీదెంత కలాహృదయం? అంటే మీరు మడిసన్నమాట!

ఎప్పుడండీ ఆ క్విజ్జులు వచ్చింది? ఇక్కడ మా కాలేజిలో అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.

ఇన్ని అడిగారు కదా... (క్విజ్జు మాస్టరమ్మ కదా) మీకో ప్రశ్న!

Quiz అనే మాట origin గురింది రెండు మార్కులకి చెప్పుడు

Dhanaraj Manmadha said...

"తెలివైన మేధావులు"

హిహి. అంటే మీ అపార్టుమెంట్లలో రిపోర్టర్లున్నారా?

BVJ said...

ప్రియగారు, ఈ మాత్రానికి నా శ్రీమతి దాకా ఎందుకండీ, నేను చాలు; (by the way, i too was equally bad in quiz, during the school days). రెండు మార్కుల ప్రశ్నకి పది మార్కుల జవాబు (copy చేసి మరీ) ఇచ్చాను చూడండి.

Reference: www.dictionary.com

Word History: The origins of the word quiz are as difficult to pin down as the answers to some quizzes. We can say that its first recorded sense has to do with people, not tests. The term, first recorded in 1782, meant "an odd or eccentric person." From the noun in this sense came a verb meaning "to make sport or fun of" and "to regard mockingly." In English dialects and probably in American English the verb quiz acquired senses relating to interrogation and questioning. This presumably occurred because quiz was associated with question, inquisitive, or perhaps the English dialect verb quiset, "to question" (probably itself short for obsolete inquisite, "to investigate"). From this new area of meaning came the noun and verb senses all too familiar to students. The second recorded instance of the noun sense occurs in the writings of no less an educator than William James, who in a December 26, 1867, letter proffers the hope that "perhaps giving 'quizzes' in anatomy and physiology . . . may help along."

గీతాచార్య said...

బాగుంది మీ క్విజ్జు కథ. నాకూ బోల్డంత చరిత్ర. కామెంటు కష్టమే. ఒక టపా రాసేయాల్సిందే.

@Dhana,

సుజాత గారు ఎక్స్-జర్నో. మనకీ ఇదే డౌటు. మేధవులంటే రిపోర్టర్లేనా అని.

వేణూ శ్రీకాంత్ said...

జనరల్ నాలెడ్జి లో క్విజ్ అని చెప్పి అలాంటి ఊహించని ప్రశ్నలు అడిగితే ఎలా అండీ :-) బాగుంది మొత్తానికి.. మాయాబజార్ ఎపిసోడ్ కూల్...

భావన said...

సుజాత గారు క్విజ్ అదరగొట్టేసేరు కదా... ఎంతైనా మాయా బజార్ లాజిక్ మరి...
"మా వూర్లో అందరూ చదువు,కళల పట్ల బోలెడంత ప్రేమ, ఆదరణ కలవారవటం చేత " ఏమిటీ నరసరావు పేట లోనే... ;-)

సుజాత said...

జీడిపప్పు గారు,
మహేష్,
మేథ,
నీలాంచల, :))

ఫణిగారు,
మీ అబ్బాయిగారి గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంది. అలాగే మీ ఇంటరెస్ట్ గురించి కూడా. Really great!


రాధిక గారు,
చిన్ని గారు,
చైతన్య.ఎస్
హరేకృష్ణ గారు

థాంక్యూలు!


కిరణ్ కుమార్ గారు
బ్లాగు నచ్చినందుకు థాంక్స్! బరువైన విషయాలు రాయడానికి నా నాలెజ్ సరిపోదండి! అంత ఆసక్తి కూడా లేదు. అందుకే ఏదో సరదాగా!ఎవరినో సంస్కరించే తలనొప్పులు మనకెందుకు చెప్పండి?మనల్ని మనం సంస్కరించుకోగలిగితే అదే పదివేలు!

సుజాత said...

మురళీ,
చిరునవ్వుల రేణుకా సహానీ వెనకాలే సిద్ధార్ధ్ కక్ కూడా గుర్తు రాలేదా మరి! సురభి తాలూకూ సిగ్నేచర్ ట్యూనూ....గడిచిపోయిన వసంతాలే ఇవన్నీ!

వేణుగారూ,
మీ లాగా అయిడియాలు ఇచ్చేవాళ్లెవరూ ప్రొఫెసర్ గారికి అందుబాట్లో లేకపోవడం మా అదృష్టం మరి!

మీ కాలనీ పేరెంట్స్ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరా..? అయ్యో, ఎందుకు చెయ్యలేమండీ, స్కూలు బస్ వరకూ పుస్తకాలు మేమే తీసుకెళతాం! అంటే బస్సు మా గేటు ముందే ఆగుతుందనుకోండి. ఇంతకు మించి మీరు మాత్రం పుస్తకాల బరువుల సంగతి లో ఏం చెయ్యగలరో చెప్పండి?

ఉష,
మీ ఇంట్లో ఇంకా కొనసాగుతున్నాయన్నమాట క్విజ్ లు!
మనకు జెనరల్ నాలెడ్జీ తక్కువని వారి అపోహ అమ్మ్య్య, అపోహేగా!

ప్రియ,
మరే, కాస్తన్నా కలాపోసన లేందే బ్లాగుల్లోకెందుకొస్తాం చెప్పండి? అన్నట్లు మీ ప్రశ్నకు కింద, మా ఇంట్లోంచే జవాబు వచ్చింది చూడండి.

ధనరాజ్,
రిపోర్టర్లు కాదు, అసలు సిసలు హౌస్ వైఫులు కొందరున్నారు. వాళ్లకంటే మేథావులెవరు చెప్మా?

గీతాచార్య,
డౌటు ఇప్పుడు క్లియరేనా? లేక స్ప్రైట్ తాగాల్సిందేనా?

సుజాత said...

భావనగారూ,
నా మనోభావాలు తీవ్రాతి తీవ్రంగా ఘాయపడ్డాయి! లాభం లేదు, నా మరో బ్లాగు చూడాల్సిందే మీరు. అప్పుడు కానీ నరసరావు పేటంటే ఏమిటో తెలీదు మీకు.వేణూ శ్రీకాంత్,
థాంక్యూ! మీ స్కూల్లో ఎప్పుడూ క్విజ్ లు జరగలేదా? ఏ స్కూలు ఇంతకీ?నవోదయ నగర్లో అని చెప్పినట్లు గుర్తు.మాయాబజార్ ఎపిసోడ్ గుర్తొస్తే అంత లాజిక్కు అప్పుడెలా తట్టిందా అని ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ!

ప్రియ said...

@BVJ గారు,

అంటే క్విజ్జుల్లో స్లిప్పులందించుకోవచ్చన్నమాట. :-D

Raj said...

చాల బావుంది ఈ టపా :)

nelabaludu said...

సుజాత గారు..
వరైటీ గా ఉందండి మీ క్విజ్జు..! కాసేపు వినోదాన్ని పంచారు.. :)

Malakpet Rowdy said...

Cool stuff!

mohanrazz said...

బాగుంది మీ క్విజ్ ...అయినా గూగుల్ లో కూడా దొరకని ప్రశ్నలడిగితే ఎలాగండీ వాళ్ళని పాపం..(:-

సుజాత said...

@Raj,
nelabaludu,
malakper rowdy,
mohanrazz.

thanks guys!

శేఖర్ పెద్దగోపు said...

మంచి టపా అందించారు. ఈ మధ్య కాలంలో అసలు కూడలి ఓపెన్ చేసి టపాలు చదవబుద్దే కావటం లేదు. ఇప్పుడు మీ టపా చదివిన తర్వాత తలకు నవరత్న ఆయిల్ పెట్టుకున్నంత హాయిగా ఉంది.

Sirichandana said...

good concept...chala bagundhi mee creativity..tv vallu choostey ee concept copy kottestaru emo...(already undha? naku teliyadu)

hrudaya said...

చాలా బాగుంది... ఆ రోజులను మళ్లీ జ్ఞప్తికి తెచ్చారు...సిద్దార్థ బసు గారి లా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకునే వాళ్ళం...ఇక మీ క్విజ్ గురించి చెప్పాలంటే...ప్రపంచం దగ్గరయి పోయింది కాని..మన చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం మనకు చాలా దూరమయి పోయిందనే విషయాన్ని చక్క గా అవగాహన కలిగించారు....పక్కింటి లో ఉన్న వారి పేర్లు చెప్పండి అంటే కూడా ఎంత మంది చెబుతారో కదా....
భాస్కర్ భట్టాచార్జీ గారి గురించి తెలిసి మాత్రం చాలా బాధేసింది...ఆయన లాగ యెంత మంది ఈ అనాగరిక ప్రపంచాన్ని భరించ లేక ఆత్మహత్యా గ్రహం ప్రకటిస్తున్నారో కదా..!

Post a Comment