August 25, 2009

నా ఆటోగ్రాఫ్ బుక్-స్వీట్ మెమొరీస్





నిన్న ఒక పుస్తకాల కొట్లో సెలోఫెన్ టేపు కొని వందరూపాయల నోటు ఇచ్చాను. బదులుగా కొట్టబ్బాయి ఇచ్చిన చిల్లరలో ఒక యాభై రూపాయల నోటు వెనక తెల్లని భాగంలో ఇలా రాసి ఉంది




"తెలియక కలిశాము, తెలిసి విడిపోతున్నాము. మరల ఎప్పుడైనా కనపడితే మాత్రం ఎవరని మాత్రం అడగకు ప్రియతమా" పాపం ఆ నోటు అందుకున్న ప్రియుడో, ప్రియురాలో ఈ మాటకు, నోటుకు కూడా పెద్ద విలువ ఇవ్వకుండా మార్కెట్లో మార్చేసినట్లున్నారు.



ఇంటికొచ్చాక, సరదాగా నా పాత ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి చూస్తే కొంత మంది మిత్రులు రాసిన వాక్యాలు, మెసేజ్ లు భీభత్సంగా కనపడ్డాయి.



పదోక్లాసు అయ్యాక తలా ఒక కాలేజీ కి వెళ్ళిపోతాం కాబట్టి ఫేర్వెల్ పార్టీ కి వస్తూ దార్లో "స్టూడెంట్స్ ఫ్రెండ్స్"(ఇది మా వూర్లో చాలా పేరున్న పురాతన స్టేషనరీ షాపు) టోకున కొనేశాం ఆటోగ్రాఫ్ పుస్తకాలు! అప్పట్లో అమ్మాయిలు గులాబి రంగుని ఇష్టపడాలని తెలీకపోవడం వల్ల నచ్చిన డిజైన్లలో కొన్నాం! నా స్నేహితులంతా (ఆడపిల్లల స్కూలు) కవితాత్మకంగా ఉండాలని సినిమా పాటలన్నీ వెదికి కొన్ని లైన్లు బట్టీ కొట్టి వచ్చారు రాయడానికి.



ఎవరూ వేరే ఊరెళ్ళి చదివే సీన్ లేదు. ఇక విడిపోయే ఛాన్సెక్కడ? ఏదో ఒక రోడ్లో కనపడుతూనే ఉంటారుగా! అసలు సీట్లు దొరికితే అందరం ఒకే కాలేజీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నామాయె! అయినా కూడా ఎప్పటికైనా విడిపోతాం కాబట్టి, పోయాక మాకంటూ పదో తరగతి తీపి గుర్తులు ఉండాలని ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో మెసేజ్ లు రాసుకున్నాం.



అసలు ఆటోగ్రాఫ్ పుస్తకం ఏమిటో, ఎందుకో తెలీని వాళ్ళు కూడా ఉంటారని ఆ రోజే తెలిసింది. విమల అనే అమ్మాయి (ఇది భలే మొద్దు. వాళ్లకి రెండో పదో బస్సులుండేవి) తన మరో ఫ్రెండ్ పుస్తకంలో "టిట్ ఫర్ టాట్" అని రాసిచ్చింది. అవతలి పిల్ల మండిపడుతూ P.E.T రాజేశ్వరి టీచర్ గారికి ఫిర్యాదు చేసింది. ఆవిడ నిలదీస్తే విమల అమాయకంగా "అంటే ఏంటసలు! ఏదో ఎప్పుడూ వింటూ ఉంటాం కదాని రాశాను " అని చెప్పింది.

నాకో అమ్మాయి
"మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల తోట" అని రాసింది. "ఏ పాట?" అనడిగితే "నువ్వెప్పుడూ ఇంతే, నీకసలు కవితా హృదయం లేదు" అని తిట్టింది.





కొన్ని అద్భుత మెసేజ్ లు మీ కోసం..

"సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ"

"స్నేహబంధమూ ఎంత మధురమూ"

(ఇలా రాసిన వాళ్ళు పక్క వాళ్లకి ఒక్క మార్కు ఎక్కువొస్తే యూనిట్ టెస్టుల్లో కూడా రీ వాల్యుయేషన్ అడిగే రకాలు)



చాలా మంది "All that glitters is not gold" అని రాసిచ్చారు. మాథమాటిక్స్ ట్యూషన్ క్లాసులో కలిసే ఒక తెలుగు మీడియమ్ బాబు All that "glitters" అంటున్నాం కదా అప్పుడు glitters  "is"  కాకుండా glitters "are" అని ఉండాలేమోరా, నాకు డౌటుగా ఉందన్నాడు. అతడిపేరు శ్రీను!



ఇక కాలేజీలో ప్లస్ టూ అయ్యాక కొందరు వేరే వూళ్ళకి, వేరే కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సందర్భం లో కూడా ఫేర్ వెల్ రోజు ఆటోగ్రాఫ్ పుస్తకాలెక్కడ ఉన్నాయో దుమ్ము దులిపి తీసుకెళ్ళాం, వీళ్లు రాసే గోల్డెన్ వర్డ్స్ కోసం!



మా క్లాసులోని 132 మందిలో భావ కవిత్వం రాయాలనే కోరిక ఎంతమందిలో అంతర్లీనంగా పాతుకుపోయి ఉందో ఆ రోజు బయట పడింది. కొందరు లాజికల్ గా, మరికొందరు మాథమాటికల్ గా మరికొందరు మరో "కల్ " గా రాశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కూడా భీభత్స రస ప్రధానంగానే జరిగింది.(ఇప్పుడు చూస్తే అనిపిస్తోంది అలా)

పూజారి గారబ్బాయి గోపాల కృష్ణా చార్యులు ఇలా రాశాడు చాలా మందికి, నాతో సహా...



"Forget the word Gopal..!

Forget the word krishna..!

Forget the word charyulu...!

But don't forget Gopala krishna charylu"

అది చూసి అందరూ "ఓర్ని, గోపీ భలే రాశాడే"అని ఆశ్చర్యం పడ్డారు. ఈ గోపి ఇప్పుడు టెక్సాస్ లో ఉన్నాడు. ఆ మధ్య మెయిల్లో "నా ఆటోగ్రాఫ్ పుస్తకం దొరికింది గోపీ" అని తను రాసింది చెప్తే ఎంత సిగ్గుపడిపోయాడో తర్వాతి మెయిల్లో!  "అబ్బా, నీకిదేం పాడు బుద్ధి? ఎప్పటెప్పటివో అన్నీ దాస్తావు" అని సరదాగా చిరాకు పడ్డాడు.



నాతో ప్రతి సబ్జెక్టులోనూ స్కూలు రోజులనుంచీ పోటీ పడుతుండే శ్రీధర్  "నువ్వు ప్రతి పరీక్షలోనూ తప్పాలి" అని రాసి, "ప్రతిపరీక్షలోనూ నాకంటే ఒక్క మార్కు నీకు తక్కువ రావాలి" అని నేను రాసేలా చేశాడు.
శ్రీధర్ ఇప్పుడు ఢిల్లీలో Ministrey of external affaris లో ఉన్నాడు. 




ఎవరితోనూ మాట్లాడకుండా పుస్తకాల్లో తల దూర్చి అంతర్ముఖుడిగా ఉండే చంద్ర శేఖర్ అనే అబ్బాయి ఒక్కొక్కరికీ రాసిన వాక్యాలు చూస్తే కళ్ళు తిరిగాయి మాకు.



నా పుస్తకంలో ఇలా రాశాడు.

"పరిచయం అనే మొక్కకు స్నేహం అనే నీరు పోస్తే


మమతలనే రెమ్మలతో పెరిగి


అనురాగమనే పుష్పం పూసి, ప్రేమ అనే ఫలాన్నిస్తుంది"



మరొక అమ్మాయికో, అబ్బాయికో గుర్తు లేదు గానీ

"మనం ప్రేమించిన వారు దొరికితే అనురాగం వెల్లివిరుస్తుంది


మనల్ని  ప్రేమించే వారు దొరికితే మమకారం మొగ్గలేస్తుంది


నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ప్రేమించిన వారు ఒకరే అయి


నీ జీవితం నందనవనం కావాలని..."



ఇలాగే అందరి పుస్తకాల్లోనూ కవిత్వాన్ని ఇష్టం వచ్చినట్లు కుమ్మరించి పారేశాడు. ఎలాగో మేం తేరుకుని "అదిరిందయ్యా చంద్రం,, ఇంత కవివా నువ్వు? ఇవన్నీ ఎప్పుడు రాశావు?"అనడిగాం!

దానికి చంద్రం "ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర" ఒక ఫైలు తీసి  "ఇందులోవే.." అని చూపించాడు.



దాంట్లో పత్రికల్లో వచ్చే భావకవితల పేపర్ కటింగ్స్ రెండు మూడు కట్టలున్నాయి. వాళ్ల అన్నయ్య రాసినవి కూడా అందులో ఉన్నాయిట. ఆ ఫైలు వాళ్ల అన్నయ్యదే!

చంద్ర శేఖర్ ఇప్పుడు గుంటూర్లోనో, ఒంగోలు లోనో కామర్స్ లెక్చరర్!



మరికొంతమంది రాసిన ఆణిముత్యాలు చూడండి..

"love is like a flower, but friendship is like a sheltering tree"



వివేకానందుడి "Arise, awake, and stop not till the goal is reached" అనే వాక్యాన్ని కనీసం పది మంది రాశారు తమ స్వంత కవితా స్ఫూర్తి మీద నమ్మకం లేక!



రాజ శేఖర్  అనే కుర్రాడు

W                      words

A                       Action

T       your         Thinking

C                      Character

H                       Heart



అని రాశాడు ఎక్కడనుంచి పట్టి తెచ్చాడో గానీ!

మరొక హాస్య ప్రేమికుడు...

"Observe -Four

choose -Three

Love  -Two

marry - One,,"  అని అబ్బాయిలకూ, అదే వూపులో అమ్మాయిలకూ రాసి చీవాట్లు తిన్నాడు!



"Life is not a bed of roses"  అని ఒకరూ,


"To gain something, you have to lose something"  అని ఒకరూ,



"ఓర్పు కన్నా సముద్రం చాలా చిన్నది"అని ఒకరూ



"If you turn your face towards sun, you can't see your shadow" అని మరొకరూ,



ఇలా ఏదో ఒక సందేశం ఇవ్వకపోతే లాభం లేదన్నట్లు చాలా చాలా రాశారు.

తిరుమల గుప్తా అనే షరాబు గారబ్బాయి వెరైటీగా

"ఎందుకొచ్చిన చదువులు? అందరూ తలా ఒక బిజెనెస్ చేసి బాగా డబ్బు సంపాదించండోయ్" అని రాశాడు.(ఇతడు ఇంటర్లో ఉండగానే షేర్లలో డబ్బు పెట్టి లాభాలు గడిస్తుండే వాడు) అప్పట్లో అది మాకు హృదయం లేని బండగాడిద రాతలా అనిపించినా ఇప్పుడు చూస్తే

"తిరుమల బాగానే చెప్పాడు" అనిపిస్తుంది. తిరుమల ఇప్పుడు మా వూర్లోనే బంగారు నగల షాపు పెట్టి మూడు బిల్డింగులు కట్టాడు. షాపుకు వెళ్తే, స్నేహితులన్న చిన్నపాటి కన్ సర్న్ కూడా లేకుండా  కమ్మగా కబుర్లు చెపుతూనే  మాక్కూడా 16% వేస్టేజ్ వేసుకుంటాడు. టూ ప్రాక్టికల్!



ఇంటర్లో అనుకుంటా, సుభాష్ అనే అబ్బాయి కి ఈ పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే...మొత్తం తిరగేసి..



"My sincere advice ..., please do not keep this book with you"  అని రాసిచ్చాడు.



టీచర్లు,లెక్చరర్లు రాసేవాటికి పెద్ద ప్రాధాన్యం లేదు. ఎంచేతంటే వాళ్ళెప్పుడూ "wish you all the best" అనో,

"wish you success in your life" అనో రాస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చదివేలా ఉండవు. కవి, రచయిత నాగభైరవ కోటేశ్వర రావు గారు మాత్రం (సందర్భం గుర్తు లేదు ఎప్పుడో),

"దీపం నీ ధ్యేయం" అని రాసి అర్థం కాకుండా సంతకం పెట్టారు.



డిగ్రీలోకొచ్చాక, ఇక వీటిమీద ఆసక్తి పోయింది. ఆ మధ్య Planet M లోనో , లాండ్ మార్క్ లోనో ఎస్సెమ్మెస్ ల  పుస్తకం చూశాను. అలాగే ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో రాయడానిక్కూడా అప్పట్లో ఏవైనా పుస్తకాలుండి ఉంటే నా ఈ తీపి జ్ఞాపకాల పుస్తకంలో ఇంకొంచెం బెటర్ మెసేజ్ లు ఉండేవేమో గానీ అవి వీటంత మధురంగా ఉండేవి కాదేమో!























"

52 comments:

ప్రభాకర్ said...

మీ ఆటోగ్రాఫ్ మెమోరీస్ నిజంగా స్వీటే.. ధన్య వాదములు

బృహఃస్పతి said...

<<< "తెలియక కలిశాము, తెలిసి విడిపోతున్నాము. మరల ఎప్పుడైనా కనపడితే మాత్రం ఎవరని మాత్రం అడగకు ప్రియతమా" పాపం ఆ నోటు అందుకున్న ప్రియుడో, ప్రియురాలో ఈ మాటకు, నోటుకు కూడా పెద్ద విలువ ఇవ్వకుండా మార్కెట్లో మార్చేసినట్లున్నారు.

ఈ మాట ప్రేమికులకు ఉద్దేశించినది కాదేమో...! ఆ నోటు తో అంటున్న సంభాషణ అయ్యుంటుంది. మీరు తప్పులో కాలేసి వారిని నిందించేస్తున్నారు :)

Kathi Mahesh Kumar said...

బాగుంది.బాగుంది.
నాదగ్గరా పాత ఆటోగ్రాఫులు ఉన్నట్టున్నాయే!

GIREESH K. said...

నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో ఓ మిత్రుడు రాసిన ఆణిముత్యం:
"I have a Golden Ship..
I have a Silver Ship...
But the most valuable one is
Friendship"...

లక్ష్మి said...

:)నిజమే భలే నవ్వొస్తాయి అప్పటి మెసేజ్ లు చూస్తే. మాది క్రైస్తవ మిషనరీ స్కూల్ కావటంతో (ఇంటర్ కూడా అలాంటిదే) సగం పేజీల నిండా ప్రభువు నిన్ను సదా కాపాడుగాక అని రాసి ఉంటుంది, మిగతా సగం మే గాడ్ బ్లెస్ యూ అని ఉంటుంది. బాగున్నాయి మీ స్వీట్ మెమొరీస్

మేధ said...

>>ఇలా ఏదో ఒక సందేశం ఇవ్వకపోతే లాభం లేదన్నట్లు చాలా చాలా రాశారు
:))

రవి said...

Select four
Set three
Love two
marry one

- ఈ ముక్క నాకూ ఎవరో రాశారు. బాగున్నయ్ మీ మెమోరీస్.

సుజాత వేల్పూరి said...

బృహస్పతి గారూ, మీరన్న మాట పట్టించుకోదగ్గదిగానే కనపడుతుందండోయ్! నోటుతో కూడా ఆ మాటనే ఛాన్స్ ఉంది!:-)!

Anonymous said...

అవును, ఆ పాత పుస్తకంలో కొన్ని వందల జ్ఞాపకాలు దాగుంటాయి. నిజమే! నాకో ఫ్రెండ్ "life is a race! Run with a smile on your face" అని రాశాడు.

మరో ఫ్రెండ్ నా మిత్రుడికి " your wife can be a knife to cut your life..be careful" అని సందర్భం లేకుండా రాశాడు.

భలే నవ్వొస్తుంది అవన్నీ తల్చుకుంటే!

శేఖర్ పెద్దగోపు said...

భలే..భలే..మంచి మెమొరీస్..
మా దుంపల బడిలో ఒకడు ఇంగిలీసులో రాసేద్దం అని గొప్పలకు పోయి పదో తరగతిలో ఏమి రాసాడో చెప్పనా..
Untouchability is a crime అని రాసాడు. అది మా ఇంగిలీసు టెక్స్ట్ బుక్ వెనక్కి ఉండేది. మక్కీ కి మక్కీ దించేశాడు. వాడినే పిలిచి మాకేమీ తెలియనట్టు ఏంటిరా దీని అర్ధం అని అడిగితే "నువ్వు నాతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి" అని చెప్పాడు.

నాగప్రసాద్ said...

హ హ హ బాగున్నాయి మీ ఆటోగ్రాఫ్ స్వీటు మెమోరీలు.

నాకు ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం, ఇవ్వడం పెద్దగా ఇష్టముండదు కాని, B.Tech లో మాత్రం ఫ్రెండ్స్ కోసం కొన్ని రాయవలసి వచ్చింది.

అటువంటి సమయంలో ఒక ఇద్దరు అమ్మాయిలు వెరైటీగా ఉంటుందని ఆటోగ్రాఫ్ బుక్కులకు బదులు మంచి నోటుబుక్కులు కొని వాటిలో ఆటోగ్రాఫ్ రాయమని అందరికీ ఇచ్చారు.

అసలే పెద్దగా ఇష్టంలేని పని, వాళ్ళు పెద్ద పెద్ద నోటుబుక్కులు ఇచ్చేటప్పటికి ఆగలేకపోయా. మినిమం ఐదారు పేజీలన్నా నింపాలని నిర్ణయించుకున్నా.

కాసేపాలోచించి, అందరూ ఇంగ్లీష్‌లో రాస్తున్నారు, వెరైటీగా ఉంటుందని తెలుగులో రాయడం మొదలెట్టాను. కాని ఐదారు పేజీలు రాయడమంటే కొంచెం కష్టమేనని, మా ఫ్రెండ్స్‌‍ను కూడా ఐదారుమందిని పిలిచి అందరికీ తోచింది చెప్పమన్నాను.

వాళ్ళు చెప్పినవి, నాకు తోచినవి కలిపి ఇలా రాశాను.


నామధేయం: శ్రీశ్రీశ్రీ మహారాజశ్రీ నాగప్రసాద్ గారు.
వేడిగీత: ౯౮౮౪౭౬౮౭౮౭
జన్మదినం: పంచమి గురువారం దక్షిణాయన పుణ్యకాలం బ్లా బ్లా బ్లా.
జన్మనక్షత్రం:
తీగల-వేగు: xxxxx అట్ జీవేగు.కామ్.

ఇష్టమైన వంటకాలు: పాముల పాయసం, వానపాముల నూడుల్స్, చలిచీమల చకోడీలు, కప్పల కజ్జికాయలు, కందిరీగల(భేల్‌)పూరి, బ్లా బ్లా బ్లా...(మిగతావి ఇంకా భయంకరంగా ఉన్నాయి).

బలాలు: ఇన్విజిలేటర్లకు తెలియకుండా కాపీ కొట్టడం, అంగ బలం, గజబలం, బ్లా బ్లా బ్లా.....

బలహీనతలు: రామ్‌గోపాల్‌వర్మ, తేజ సినిమాలు కూడా మొదటిరోజు, మొదటి ఆట చూడాలన్నంత సినిమా పిచ్చి, పేకాట పిచ్చి, (ఇంకా చాలా పిచ్చిలు ఉన్నాయి.).

ఇంకా చాలా చాలా దారుణంగా రాశాను. వాళ్ళ గురించి కూడా కూసింత ఏకిపారేశాను.

పాపం అవన్నీ చదివి, వాళ్ళు బాగా ఫీలయ్యారని, అలాగే వాళ్ళ స్వీట్ మొమోరీస్‌లోంచి ఆ పేజీలన్నీ చించేశారని చివరికి గూఢచారుల ద్వారా సమాచారం అందింది. :) :).

మురళి said...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. ప్చ్.. మేం ఇవన్నీ మిస్సయిపోయాం..
@శేఖర్ పెద్దగోపు: మీ ఫ్రెండ్ నిజ్జంగా గ్రేట్...

Unknown said...

>>>"తెలియక కలిశాము, తెలిసి విడిపోతున్నాము. మరల ఎప్పుడైనా కనపడితే మాత్రం ఎవరని మాత్రం అడగకు ప్రియతమా" పాపం ఆ నోటు అందుకున్న ప్రియుడో, ప్రియురాలో ఈ మాటకు, నోటుకు కూడా పెద్ద విలువ ఇవ్వకుండా మార్కెట్లో మార్చేసినట్లున్నారు.<<<

"Serendipity" అనే సినిమా గుర్తొచ్చింది. అందులో హీరో ఫోన్ నెంబర్ ఒక నోటుపై రాస్తే హిరోయిన్ తన వివరాలు ఒక పుస్తకంలో వ్రాస్తుంది. ఆ రెండిటినీ వుద్దేశ్యపూర్వకంగానే పోగొట్టుకోని మళ్ళీ వాటి ఆధారంగా కలవాలని ఇద్దరూ ప్రయత్నిస్తారు.

మీ టపా బాగుంది. చాలా పాత స్మృతులను రేపింది.

సిరిసిరిమువ్వ said...

మరో మంచి జ్ఞాపకాల టపా. మేము పి.జి.లో కూడా వ్రాసుకున్నాం. వాటిని నేను అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉంటాను. అవన్నీ ఇప్పుడు చూసుకుంటుంటే మంచి సరదాగా ఉంటుంది.
@బృహస్పతి గారూ, బాగుంది మీ వాదన.
@నాగప్రసాద్ గారూ, :))). మీరు కూడా పాలతాలికలని పాముల పాయసం అంటారా? మా పిల్లలు కూడా అలానే అంటారు!

సుభద్ర said...

అబ్బొ బ్రహ్మమా౦డ౦ బాగు౦ది మీ పొస్ట్. మీ గుప్తగారు పేరు కు తగ్గట్టు రాసారు.
అనుకు౦టా౦ కాని ఇ౦టర్లో కుడా పసితన౦ పోదు ఎదో కాలేజి అని పెద్ద అయ్యమనుకునే
చిన్నతన౦ కదా!

సుజాత వేల్పూరి said...

శేఖర్ పెద్ద గోపు గారు,
మీ ఫ్రెండ్ మా విమల కు తగ్గ జోడీయే సుమా!

చదువరి said...

భలే బావుంది టపా. ఇది చదివినవాళ్ళంతా గుండ్రాలు చుట్టేసుకుంటూ వెనక్కెళ్ళిపోతారు.

శేఖర్ పెద్దగోపు గారూ, మీ స్నేహితుడికి సాటి రాగల వాళ్ళు అతి కొద్దిమంది ఉంటారు. టచ్‌లో ఉండమని ఎంత హృద్యంగా ఎంత మర్యాదగా చెప్పాడు!!! :)

టపా కారణంగా ఎన్నో మంచి మంచి ఆటోగ్రాఫులు తెలుస్తున్నాయి. సుజాతగారూ నెనరులు. శేఖర్ గారూ మరీ మరీ నెనరులు.

చదువరి said...

ఇంకో సంగతి.. ఊకదంపుడు గారు చూసి తీరాల్సిన వ్యాఖ్య, శేఖర్ పెద్దగోపు గారిది.

రాధిక said...

మా స్కూలు గోడల మీద చాలా సూక్తులు వుండేవి.పదోతరగతి ఆటోగ్రాఫు బుక్కులూఅ అవే ఎక్కించేసాం అందరమూ.
దేశం నీకేమి చేసిందని కాకుండా దేశానికి నువ్వేమి చేసావని ప్రశ్నించుకో
ఓర్పు చేదుగా వుంటుంది-ఫలితం మధురం గా వుంటుంది
ఒక్క సిరా చుక్క - లక్ష మెదళ్ళకు కదలిక.....ఇలా అన్నమాట
కాలేజికొచ్చేసరికి అప్పుడప్పుడే ఇంగిపీసు వంటబట్టి బండ బూతులు రాసుకున్నాం.
డిగ్రీ లో నీ పెళ్ళి శుభలేఖ నాకు వస్తే నీకు స్నేహం విలువ తెలుసని అర్ధం ...ఇలాంటివన్నీ రాసారు. డిగ్రీలో అందరికీ నేను రాసింది ఒకటే
అప్పుడప్పుడు ఎలా వున్నావంటూ
ఒక్క పలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదవులపై నవ్వులు పూస్తే చాలు
చాలు....ఈ నేస్తానికిది చాలు.
ప్రతీసారి నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళకి నేను ఆటోగ్రాఫు ఇవ్వలేదు,వాళ్ళ నుండి తీసుకోలేదు.ఇప్పటికీ వాళ్ళతో టచ్ లో వున్నా.
అమ్మో ఎంత పెద్ద కామెంటేసానో.థాంక్స్ సుజాత గారూ కందిరీగల తుట్టని కదిలించారు.

Rajendra Devarapalli said...

హేమిటీ ???!!!
ఠెంధ్గ్లాస్,వింటర్మీడియట్ లో ఆ టో గ్రాఫులను ఇంకాదాచుకున్నారా? మొదటి పీజీ అయ్యాక ఎవడో ఒకడు గొణిగాడు ఆటోగ్రాఫులంటూ,రెండో పీజీకొచ్చేసరికి అలాంటివి ఒకటున్నట్టు కూడా మేమందరం మర్చిపోయాం లెండి.టపాతో పాటు కామెంట్లు కూడా బాగున్నాయి.
నలభయల్లోకి వస్తుంటే ఇలాంటి నోస్టాల్జియాలు ఎక్కువవతాయని ఆ మధ్య ఎక్కడో చదివా :)

వేణు said...

టైటిల్ ఎంత ‘క్యాచీ’గా ఉందో... మీరు టపా రాసిన తీరు కూడా సరదా సరదాగా... బావుంది.

> విమల అనే అమ్మాయి (ఇది భలే మొద్దు. వాళ్లకి రెండో పదో బస్సులుండేవి)

> ఇలా రాసిన వాళ్ళు పక్క వాళ్లకి ఒక్క మార్కు ఎక్కువొస్తే యూనిట్ టెస్టుల్లో కూడా రీ వాల్యుయేషన్ అడిగే రకాలు
> కొందరు లాజికల్ గా, మరికొందరు మాథమాటికల్ గా మరికొందరు మరో "కల్ " గా రాశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కూడా భీభత్స రస ప్రధానంగానే జరిగింది.

టపా ముగింపు చాలా టచింగ్ గా అనిపించింది. అభినందనలు!

వేణూశ్రీకాంత్ said...

టపా చాలా బాగుంది. బోల్డు ఙ్ఞాపకాలను కదిలించింది.
మీ విమల గారు, శేఖర్ గారి untouchable friend ఇద్దరూ సూపరు.

Anil Dasari said...

నాకాటోగ్రాఫులు తీసుకున్న, మరియు ఇచ్చిన అనుభవాల్లేవు. వాటి మీద ఇంట్రస్టుండేది కాది. అప్పట్లో మన్ది అదో తరహా లోకం లెండి. మీ, మరియు ఇతర వ్యాఖ్యాతల జ్ఞాపకాలు మాత్రం భలే ఉన్నాయి.

ఈ టపా చదివాక తెల్సిందేమంటే - మీ తిరుమల గుప్తాకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదని :-)

Srinivas said...

అమాయకత్వం వర్థిల్లుగాక!

చంద్ర మోహన్ said...

బాగున్నాయి మీ స్వీట్ మెమొరీస్! కొట్లో యాదృచ్ఛికంగా దొరికిన ఓ నోటు మీకు మీ ఆటోగ్రాఫ్ బుక్ చూడాలన్న కోరికను కలిగించడం, చిన్నప్పటి మీ పుస్తకం మీ జ్ఞాపకాలంత తాజాగా తలచుకొన్న తక్షణం మీకు కనిపించడం, గ్రేట్! మీరు స్నేహానికి ఎంత విలువనిస్తారో ఈ మీ టపా చదివితే తెలిసిపోతుంది.

$h@nK@R ! said...

బాగున్నాయండి మీ మెమోరీస్...

మా ఊరు said...

బావుంది మీ టపా.మా ఫ్రెండ్ ఒకతను ప్రతి చిన్న విషయానికి ఎదిచేవాడు .వాడికి ఒక అమ్మాయి "నవ్వే ఆడదాన్ని ఏడిచే మగాన్ని నమ్మద్దు అని రాసింది.అది చూసి మల్లి వాడు ఏడుపు క్ర్రూ

Unknown said...

భీభత్సం...

ఇప్పుడు తిరిగి చూసుకుంటే భలే కితకితలు ఆటోగ్రాఫ్ పుస్తకాలన్నీ. కొన్ని హింట్లు మాత్రం నాకు తర్వాతే అర్థమయ్యాయి :-)

భాస్కర రామిరెడ్డి said...

సుజాత గారూ, మా ఆటోగ్రాఫ్ ల కోసమని పేజీ చివర ఖాళీ స్థలాన్ని బాగానే వదిలారు. అందరు రాసినవి చెప్పారు కానీ మీరు ఏమని రాసారో చెప్పలేదే :)? మేమైతే ఇంగ్లీష్ లో వ్రాయాలని జనవరికి వచ్చే గ్రీటింగ్ కార్డ్స్ భద్రంగా దాచుకొని కాపీ కొట్టే వాళ్ళం.పదిలో కాదులెండి..ఇంటర్మీడియెట్ లో , మీరన్నట్టు పదోతరగతికి ఆటోగ్రాఫ్ అంటే తెలియని బ్యాచ్ లో మొదటి వరుస మాదే. డిగ్రీలో ఆటోగ్రాఫ్లు లేవు కానీ పైనల్ యియర్ ఎక్జామ్స్ అయి హాష్టల్ ఖాళీ చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా ఒక్కొక్కరం ఒక్కో బకెట్ నింపేసి వుంటాము.అదృష్ట వశాత్తు ఇప్పటికీ అందరము మైల్స్ లో అప్పుడప్పుడు పలుకరించుకుంటాటాము.
ఉప్పొంగే వయసులో చిలిపి చేష్టలను గుర్తు చేసింది మీ టపా.. అంటే ఇప్పుడు పొంగదా అని కాదు, అప్పుడు పొంగి వొలికి పోవడమే తప్ప తిరిగి శాంతించడం తెలియని రోజులు.
బాగుంది.

Unknown said...

meeru mammalni iravai aidellu venakki teesuku vellaaru. eppudoo edo subject meeda edannaa raayaali anukuntoo untaaanu kaani, ilaa naakoo telusunna subject meeda chadivinappudu are idi naaku tattane ledu kadaa anipisthoo untundi.
thanks.
sare ee sandarbhamlo naaku maa 10th class lo maa science teacher raasinadi, tharvaatha nenu chaalaamandiki raasindi oka maata raasthunnaaru
"Autographs are photographs of memories, Whenever you want to recall and remember" baagundi kadaa.
thankyou once again
--AKKARA

సుజాత వేల్పూరి said...

అయితే దాదాపు ప్రతి ఆటోగ్రాఫు బుక్కూ కామెడీయేనన్నమాట. నవ్వలేక చస్తున్నా!
రాధిక గారూ,
మీ వాళ్ళ మెసేజ్ లు బావున్నాయి భలే!
ముఖ్యంగా పెళ్ళి శుభలేఖ మెసేజ్!
మీరు మాత్రం అప్పుడే ఇంత అంతందంగా రాశారన్నమాట, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు! గ్రేట్!

ప్రవీణ్ గార్లపాటి,
మీకర్థమైన హింట్లేంటో చెప్పకుండా సస్పెన్స్ లో పెడితే ఎలాగండీ?

భాస్కర్ రామి రెడ్డి గారు,
జనవరి గ్రీటింగ్స్ దాచిపెట్టి రాసుకోవడం మంచి అయిడియానే! ఇది తెలిస్తే నా బుక్ లో ఇంకా బోల్డు మెసేజ్ లు ఉండేవి!

"అంటే ఇప్పుడు పొంగదా అని కాదు, అప్పుడు పొంగి వొలికి పోవడమే తప్ప తిరిగి శాంతించడం తెలియని రోజులు. " ఎంత బాగా చెప్పారో!

Mauli said...

egjaatleee nenu kooda bruhaspathi garu lane anukunnanu andi ...naku nenu rasina oka silly auto graph gurthu vastondI



diploma chadiveppudu oka close friend pedda book with many questions ichindi rayamani ...antha ok kani 'define love' ane prasna daggara aagalsi vachindi ...burra entha gokkunna answer raledu ....ekkado chadivinatlu undi ani thega thinki ...aaa bulb veligindi ...'Love is universal' ani rasesaaa....nizaniki peddaga meening telidu ...love ante inko definition kooda teliyalaaa...


inka tarvatha konnallaki ardham ayyi abba naadi broad mind anna mata ani pulakinchi poya....inkonnallaki ...idedo patha chintha kaya pachadila rasanenti ani naa meeda nake jaali vesindi koodaaa.....

రమణ said...

చాలా బాగుంది టపా.
పదోతరగతిలోనే అంత కవి హృదయులు ఉన్నారన్నమాట !
మేము పది చదివేటప్పుడు అసలు ఇలాంటి ఆటోగ్రాఫ్ బుక్ గురించే తెలియదు.
డిప్లొమా లో అందరూ ఆటోగ్రాఫ్స్ నేను కూడా రాయించుకున్నాను.
అవి చదువుతుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది. మా వాళ్ళకి నేను వ్రాసినవి చూసినా విపరీతంగా నవ్వు వస్తుంది. ఏమి రాయాలో తెలియనపుడు ముందు వాళ్ళు ఏమి రాశారో చూడటం, అది కాపీ కొట్టటం. :).

బాగా గుర్తు చేశారు. ధన్యవాదాలు.

sunita said...

హ!హ!హ! బాగుంది టపా!మీరు కోటు చేసినవాటిల్లో కొన్ని మా ఆటో గ్రాఫ్ పుస్తకాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఈ అమాయకత్వం ఇంటరుతోనే ఆపేశాము. ఆ తరువాత ఓ పదేళ్ళకి చూసి నవ్వుకుని చింపేసాను ఇంటి నిండా చెత్త పేరుకుని పోతుందని.ఒక్క మా తెలుగు మాడం మాత్రం 70 మందిలో నాకోక్కదానికే "శుభం భూయాత్" అని వ్రాసింది. మిగిలిన జోకులు మూడు వంతులు నా వైపు కూడా సేము టు సేము.

సుజాత వేల్పూరి said...

ఈ టపా ఇంతమంది జ్ఞాపకాలను తట్టి లేపుతుందని నిజంగా అనుకోలేదు.

ప్రభాకర్,
మహేష్,
మేథ,
రవి,
నీలాంచల,
మురళీ,
సిరిసిరి మువ్వ
చదువరి,
వేణు,
వేణూ శ్రీకాంత్,
శ్రీనివాస్,
$h@nK@R గార్లు,

మీ అందరికీ ధన్యవాదాలు!

సుజాత వేల్పూరి said...

గిరీష్,
బావుంది మీ పుస్తకంలో కొటేషన్ కూడా! ఏ ఫ్రెండో విదేశాలకు పోతూ అడిగితే బానే ఉంది రాయడానికి.రాసి పెట్టుకుంటున్నా!

లక్ష్మి,
మీ మెసేజ్ లు కూడా నవ్వు తెప్పించాయి. ఒక దానికొకటి అనువాదాలన్నమాట.మిషన్ స్కూళ్ళ ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుందో ఇదొక్కటీ చదివితే చాలు, తెలుస్తుది.

నాగప్రసాద్,
మిమ్మల్ని ఆటో గ్రాఫ్ అడగాలంటే వొణుకొచ్చేలా రాశారండీ!పాపం ఆడపిల్లలేదో వెరైటీ కోసం నోటు పుస్తకాలు ఇస్తే మీరు వాళ్ళకి మరీ వెరైటీ రుచి చూపించారన్నమాట.

అల్లా రాస్తే చింపక ఉంచుకుంటారా మరి! అందునా ఆడపిల్లలు!

మావూరు,
చాలా నవ్వొచ్చింది మీ ఫ్రెండ్ కొ దొరికిన మెసేజ్ చూసి. థాంక్యూ!

అపర్ణ,
మీరు రాసిన మెసేజ్ బావుంది. నిజం కూడా! మరి నిన్న ఆ పాత పుస్తకం చూస్తుంటే నాకు వాళ్ళంతా కళ్ళ ముందు నిలిచినట్లయింది!
ఎవరన్నా రాసిన టపాలు చూసినపుడు నాక్కూడా "అరె, ఇది నేను రాస్తే బావుండేది" అనిపించిన సందర్భాలు కోకొల్లలు. బాగా చెప్పారు.

మౌళి,
బాగా రాశారు. మరి ప్రేమను నిర్వచిచడం ఎంత కష్టమో కదా! అయినా పర్లేదు, మీ నిర్వచనం ఎప్పటికీ పనికొస్తుంది లెండి!

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,

నిజమే! తిరుమల కి ఇప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు.అయినా ట్రేడింగ్ బాగానే చేస్తాడు.

రాజేంద్ర కుమార్ గారు,
నాకు ఈ నోస్టాల్జియాలు ఎప్పుడైతే పై చదువులు వెలగబెట్టడానికి హైదరాబాదు వచ్చానో ( మా వూరుని మిస్సయిపోతూ) అప్పటినుంచే పట్టుకున్నాయి. నలభైల్లోకి రావడానికి ఇంకా ఆరేడేళ్ళ టైముంది. అప్పుడు ఇంకా ఎక్కువవుతాయేమో చూడాలి!

సుభద్ర,
థాంక్యూ! ఇంటరే కాదండీ, డిగ్రీ కూడా పసితనమే ఇప్పుడు తల్చుకుంటే!కానీ ఇంటర్లోనే ఏదో పెద్దయిపోయామనే ఫీలింగ్!


వెంకట రమణ గారు,
కాపీ కొట్టినా కొట్టకపోయినా ముందు వాళ్లకంటే బెటర్ మెసేజ్ రాయాలన్న కోరికతో నేను కూడా ముందు వాళ్ళేమి రాశానో తప్పకుండా చూసే దాన్ని!:-)

సునీత,
అవునండీ, ఇప్పుడు తల్చుకుంటే, వాటిని చూస్తుంటే, ఆగకుండా నవ్వొస్తోంది!మేమూ ఇంటర్లోనే ఆపేశాం! డిగ్రీలో సిగ్గుపడ్డాం రాసుకోడానికి!

Dhanaraj Manmadha said...

"నలభైల్లోకి రావడానికి ఇంకా ఆరేడేళ్ళ టైముంది. అప్పుడు ఇంకా ఎక్కువవుతాయేమో చూడాలి!"

Guess how many years will roll down take to finish those six/seven years? ;-) Hehehe

సుజాత వేల్పూరి said...

Dhana,

I don't know about "other women" but I take only those ఆరేడేళ్ళు to finish those six/seven years! :-))

Bolloju Baba said...

చాలా బాగుంది. మీ జ్ఞాపకాల పూలవాన.
కామెంట్లు కూడా.

నేను ఇంటర్ చదివేపుడు, డిగ్రీ కాలేజీలో పార్ట్టైమ్ లెక్చరర్ గా చేస్తున్న శిఖామణి గారు వ్రాసిన వాఖ్య ఇది.

జీవితం కరిగిపోయే మంచు
ఉన్నదాంట్లో నలుగురికీ పంచు.

ఇది తప్ప ఆటోగ్రాఫులలోని విషయాలు మరేమీ గుర్తులేవు. ఆ బుక్కులూ లేవిపుడు.

బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి said...

బాబా గారూ,
ధ్న్యవాదాలు! అద్భుతంగా రాశారు శిఖామణి గారు. నిజానికి నేను ఎప్పుడూ పాటించాలనుకునేది, కనీసం అప్పుడయినా ప్రయత్నించేదీ ఇదే!

గీతాచార్య said...

ఇలా నోస్టల్జియాల్లో కూరుకుని పోవటం నాకంత అలవాటు లేదు. అందుకే నేనీ పదిహేను నెలల బ్లాగింగులో అలాంటి టపాలు ఎక్కువ రాయలేదు.

ఎవరిని కలిసినా ఆ కలిసిన క్షణాలనే ఙ్ఞాపకంగా ఉంచుకుంటాను కానీ, వాళ్ళిచ్చే ఆటోగ్రాఫులు కాదు. ఎందుకంటే ఒకసారి పరిచయమయ్యాక ఆ పరిచయాన్ని ఏరూపంలోనైనా కొనసాగించటం నాకలవాటు.

చిన్నప్పుడు కన్నా పీజీలో కొంత మంది అడిగితే ఇచ్చాను. వాళ్ళకి వ్రాసేది ఆయా సందర్భాలని బట్టీ, వాళ్ళ మనస్తత్వాలని బట్టీ వ్రాయటమే. ఎక్కువగా వ్రాసిన మాట...

THE CODE OF COMPETENCE IS THE ONLY SYSTEM OF MORALITY THAT'S ON A GOLD STANDARD.

ఇది చూశక నాకు పెట్టిన పేరు The Beast. ;-)

భావన said...

బాగుంది సుజాత గారు మీ స్వీట్ ఆటోగ్రాఫ్ మెమొరీస్. నా ఫ్రెండ్ ఒకతను అందరు పెళ్ళి అయ్యాక హనీమూన్ కు బెంగుళూర్ వెళతారు అంటె మధ్య లో "కు" తీసేసి బెంగుళూర్ దగ్గర హనీమూన్ అనే వూరు వుందనుకున్నాడంట. లాస్ట్ ఇయర్ లో ఇండస్ట్రియల్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు అడిగేడట ఫ్రెండ్స్ ను హనీమూన్ ఎక్కడ రా అని.. :-) ;-)
ఇంక అలాంటి బాచ్ నుంచి వచ్చి మేము ఇంగ్లీష్ లో ఎలా రాసి వుంటామో మీ వూహ కే వదిలేస్తున్నా,

Nobody said...

మీ ఆటోగ్రాఫ్ కథలు, గాధలూ చానా బాగున్నై. నాకూ ఇలాంటి ఙ్ఞాపకాలున్నాయ్ మరి కాకపోతే రాయాలంటే కుదరటం లేదు.

You wrote in a manner that nobody can escape the nostalgia created by u. మీ ఊరి బ్లాగులో కూడా ఈసారి టపా ఙ్ఞాపకాల తేనేతుట్టెని కదిపింది.

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
హమ్మ, హమ్మ! అయితే మీ fountain head నవల చివరి పేజీకి విలువ లేనట్టేనా? కుట్ర, మోసం,దగా!

సుజాత వేల్పూరి said...

భావన గారు,
అలాంటి అజ్ఞానాలు ఇదిగో ఇప్పుడు తల్చుకుని నవ్వుకోడానికి చాలా బావుంటాయి. మరీ బాచ్ అంతా అలాగే ఉంటుందా ఏమిటండీ, మీరు మరీనూ? మీరు తెలుగులో కవితాత్మకంగా ఒక్క వాక్యం రాస్తే చాలదా?

Nobody,
Thanks very much for your kind comment.

గీతాచార్య said...

మీరీ మాట అంటారని తెలిసే నేను చివరి పేజీలో కాక మొదటి పేజీలో తీసుకున్నాను. ;-)

శ్రీ said...

బాగున్నాయండీ. నా జ్ఞాపకాల తుట్టెని కదిపారు!

Anonymous said...

సుజాత గారూ మీకిది న్యాయమా. ! ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు లేదూ..లేదూ...లేదు. అది నా కాలేజ్ జీవితంలో చివరిరోజు. క్లాస్స్ లో అంతా తలో 50 రూపాయలూ వేసుకొని పార్టి చేసుకున్నాం. ఓ కూల్డ్రింక్ , స్వీటు మిక్చరూ......పోనూ మిగతా డబ్బుతో సినిమా టిక్కెట్లు తీసుకొని క్లాసు మొత్తం పొలోమంటూ సినిమాకెళ్ళిపోయాం.( నాగార్జున సినిమా) ఇంటర్వెల్ లో ఒక్కో సమోసా తిన్నాం. సినిమా బాగా ఎంజోయ్ చేసి బస్తాండుకొచ్చి చూస్తే నా పర్సు లేదు. అందులోనే నా బస్ పాస్, ఆటొగ్రాఫ్ బుక్క్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఎడ్రస్స్లు అన్నీ పోయాయి. ( అప్పట్లో ఇంట్లో ఫోన్లు వ్న్నవాళ్ళు చాలా తక్కువ.) తర్వాత చాలారోజులు బాధపడి ఆనక బాధపడ్డం మర్చిపోయాను. సుజాత గారూ ఇప్పుడు నన్ను గిల్లి ఏడిపించారు.....వా.....వా...వా.

gabhasthi said...

చాలా బాగున్నాయి మీ sweet memories. మా పాత జ్ఞాపకాలన్నితినీ మెల్కొల్పాయి
నాకు తెల్సి ఒకల్లుMEI KHILADI TU ANADI అని రాసి అమ్మయిలను అదరగొత్తాదు.నెను కూదSPEED THRILLS BUT KILLS అని వ్రసి కొంచం గాలి తీసెసామనుకొంది.anyhow teenage is amazing,exciting!!!
from bhaskaraa.

ప్రణీత స్వాతి said...

మీ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ బాగున్నాయండి.

Nagesh said...

Hi Every one,

Aa nati gnapakalu naa kalla mundu kanabadutunnav. Nenu kuda Autograph pustakanni okasari tesi chusanu.

Maa friend Phone number field lo "This number is currently out of service " ani rasadu.

Thanks,
Nagesh

Post a Comment