September 21, 2009

అలగకపోతే చూడాలి !

చీటికీ, మాటికీ అలిగి కూచునే వాళ్లని చూస్తే ఇదివరలో భలే కోపం వచ్చేది. ఇప్పుడు అలవాటైపోయింది....కోపం రావడం! మా అమ్మాయి నేను కొంచెం కంఠం గట్టిగా చేద్దామని అనుకుంటూ ఉండగానే "నువ్వు నన్ను తిట్టావు"అని మొహం అటు తిప్పేసుకుని కూచుంటుంది, స్కూలు బస్ రెణ్ణిమిషాల్లో వస్తుందనగా!
బీపీ పెరుగుతుందా పెరగదా?

పైగా  "నీతూ వాళ్ళమ్మ .నీతూని ఏమీ అనదట  ." అని ఇంకొకరిని తోడు తెచ్చుకుంటుంది. పాపం ఆ  నీతూ వాళ్ళమ్మకు ఇహ ఆ ఓపిక కూడా లేదన్నమాట.




అసలు ఎవరైనా "అలక" ఎందుకు పూనుతారో, దీనెకేదైనా సైంటిఫిక్ కారణాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని కోరిక నాకు! పైగా అలిగినపుడు ఆ కోపం "తిండి" మీద ఎందుకు చూపిస్తారా అని ఇంకో ఆశ్చర్యం!(చిన్నప్పుడు నేనూ అంతే లెండి)



మా ఇంట్లో ఎప్పుడూ ఎక్స్ కర్షన్ కి పంపించే వాళ్ళు కాదు.  అన్ లెస్..ఇటీజ్ కొండవీడు లేక అమరావతి!  ఇవి రెండూ దగ్గర కాబట్టి, సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాం కాబట్టి! (ఇది తల్చుకుంటే కడుపు రగిలిపోతుంది నాకు. స్నేహితులందరితో కలిసి ఎక్స్ కర్షన్ కి వెళ్ళని జన్మా ఒక జన్మేనా అసలు?)  ఒకసారి మా స్కూలు వాళ్ళు శ్రీశైలం టూర్ కి ప్లాన్ చేశారు. మామూలే! మా ఇంట్లో వద్దనేశారు.

"ఏమిటి మతిపోయిందా? శ్రీశైలమే? అంతా కొండ, అడవి,నీళ్ళూనూ! (ఇవి లేని చోటికి ఎవరైనా ఎందుకెళ్ళాలో మరి) మనమందరం కలిసి వెళ్దాం లే" అనేశారు.(ఇంట్లో వాళ్ళతోనా? ఛీ)

ఆ రోజంతా అలిగి కూచునున్నాను, అన్నం తినకుండా!ఇలాంటి సందర్భాల్లో అమ్మ మా తిక్క భలే కుదురుస్తుంది. శరన్నవరాత్రులు కావడంతొ అమ్మవారికి చేసే నైవేద్యం కాక, దానితో పాటు ఆవడలు చేసింది అసందర్భంగా! సందర్భం చూసుకోకుండా అలిగినందుకు చింతిస్తూ..భోజనాల టైముకు మామూలుగా ఉండే ప్రయత్నం చేశాను,  అమ్మ గమనించకుండా కాజువల్ గా ఉండేలా జాగ్రత్త పడుతూ!!

కానీ ఆవిడ పది నిమిషాలకోసారి 'అమ్మలేమో అలిగి కూచుందాయె, ఇవాళల్లా తిండి తినదు,!ఎంత మొండితనమో"అని ఎవరో ఒకరితో అంటూనే ఉంది.



"అలగడం నీ హక్కు! నీ హక్కుని పరిరక్షించడం మా బాధ్యత" అన్నట్లు ప్రవర్తించేది అమ్మ. అసలు బతిమాలేది కాదు.అంత స్ట్రిక్టు!

 అసలావిడది స్టీవెన్ సీగల్  స్టైలు! ఏం జరిగిందో తెలిసే సరికి చెంప ఛెళ్ళుమనడం జరిగిపోయేది.(ఇదెప్పుడూ అన్నయ్యకే)


 అమ్మాయిలెప్పుడూ నాన్న కూతుళ్ళు కాబట్టి నానగారు మాత్రం "అదెందుకు అలిగిందీ"అని అలక తీర్చే ప్రయత్నాలు మొదలెట్టేవారు. ఈ  డిస్కౌంట్లు అబ్బాయిలకుండవు.  అన్నయ్య కి కోపం వచ్చిందంటే చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు. ఒకసారి వాడు రాత్రియినా ఇల్లు చేరకపోయేసరికి నాకు అందమైన కలలొచ్చాయి కూడా!



వాడు అలా అలిగి వెళ్ళిపోయి ఏ వంతెన కిందో డబ్బు , రత్నాలు పంచుకుంటున్న దొంగల ముఠాలో చేరి పెద్ద "డాన్"  అయిపోతాడు. ఈ లోపు నేనొక అందమైన పోలీసాఫీసరుని (ఎస్పీకి తక్కువ రాంక్ కాకుండా చూసి)పెళ్ళాడేస్తాను. ఒకరోజు నేను నాగదేవత గుడికి వెళ్ళి పాము తో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా అన్నయ్య నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత రోజు వచ్చే రాఖీ  నాడు మా ఇంటికి ఒక బస్తాడు రత్నాలతో వస్తాడు.

అదే టైములో ఎస్పీ గారు....! ("ఈ సినిమామీరు చూశారు " కదూ  )

ఇంత సస్పెన్స్ లో ఉండగా అమ్మ లేపేసింది. లేచి చూస్తే... మడతమంచం మీద ఉన్న ముసుగు వీరుడు అన్నయ్యే అని తెల్సి నిరాశపడ్డాను. ఆ తర్వాత వాడు అలకలు మానలేదు కానీ నా కల మాత్రం నిజం చేయలేదు.



మా అమ్మాయి ఏ యే మాటలకు అలుగుతుందో చూడండి!

"ఏమిటి, ఇంకా ఆ రెండిడ్లీ తినడం అవలేదా?"(రెండు ఇడ్లీ ఇచ్చి అప్పుడే ఇలా అడిగేస్తారా ఎవరైనా?)

"నీ క్లాసులో అనన్య భలే ముద్దుగా ఉంటుంది" (అంటే నేను ఉండననేగా?)


"హాండ్ రైటింగ్ ఇలా ఉందేమిటి?"(మొన్నేగా నా హాండ్ రైటింగ్ బావుందని మెచ్చుకున్నావూ?అప్పుడే ఇలాగంటావా?")



"త్వరగా నడువ్, బస్సొచ్చేస్తుంది"(అంటే నేను లేట్ మాస్టర్ అనేగా నీ భావం?")


"డ్రస్ ఎందుకు అంతలా మాసిపోయింది?"(అంటే? నాకు నీట్ నెస్ తెలీదనేగా?)

"ఈ ఫ్రాక్ వద్దు, ఆ జీన్సు వేసుకో" (అంటే నేను ఫ్రాక్ లో సిండరెల్లా లాగా ఉండననేగా?")


ఈ మధ్య కౌన్సిలింగ్ లు ఎక్కువై  అలకలు తగ్గించింది కానీ,  లేకపోతే రెండు సార్లు పిలిచినా నేను పలక్కపోతే అలిగేస్తుంది.


భయపెట్టి అలకలు మానిపిద్దామంటే కుదరదు. దెయ్యాలు, బూచాళ్ళు ఉండరని నేనే చెప్పాను. ఇక దేనికి భయపడుతుందీ? టీచర్లని చూపించి భయపెట్టడం నాకిష్టం లేదు.

 తొమ్మిదో టీవీ లో క్రైం వాచ్ యాంకరంటే కూడా భయపడని పిల్లని ఏం చూపించి భయపెట్టాలో మరి!


ఇవాళ పొద్దున్నే అలిగి కూచుంది, ఎందుకంటే...Monday అంటే మంగళవారం కానందుకు! మంగళవారం దసరా సెలవులకు అమ్మమ్మ దగ్గరికి వెళ్తోంది మరి!

33 comments:

గీతాచార్య said...

మళ్ళి అల్లరా? ఇంతకీ అల్లరి చేసేది మీరా మీ అమ్మాయా? ;-)

(ఒక విషయమైతే ఇప్పుడర్థమయింది).

"అలగడం నీ హక్కు! నీ హక్కుని పరిరక్షించడం మా బాధ్యత"అన్నట్లు ప్రవర్తించేది అమ్మ."

LOL. నిజమే కదా. పర్యావరణా పరి రక్షకులేనా ఏమిటి ఉండేది? అలక పరి రక్షకులుండవద్దూ! అయినా అల్లరి, అలకా, ఆ అలకని నలుగురూ గుర్తించేలా చేయటం ఓ కళ. (మీకు అర్థం కావాలంటే ఆర్టూ...) ఆ ఆర్టూ! మాకు తెల్డేటీ, ఓపాలి సూపిస్తే... అంటే It's all is over for me.

అమ్మో రెండు ఇడ్లీలిచ్చి తినమంటమే? ఐబాబోయ్! ఇంకేమన్నా ఉందా? చైల్డు లేబరాక్టు తెలీదా మీకు? (Just kidding).

Gave me a hearty laugh. ThankQ

$h@nK@R ! said...

ఒకసారి వాడు రాత్రియినా ఇల్లు చేరకపోయేసరికి నాకు అందమైన కలలొచ్చాయి కూడా!హి హి హి..:)
నేను భలే అలిగేవాన్ని, ఒక సారి స్కూల్ లొ పి.టి సార్ భయంతొ నాన్నని ష్యూస్ కొనిపించమని అడిగాను, వచ్చే నెల వరకు ఆగురా... కొంతాను అని చెప్పినా. రోజంతా అలిగి ఒలిగి సాయంత్రానికల్లా ష్యూస్ కొనిపించేలా చేసాను..

sunita said...

హహహ!!
సందర్భం చూసుకోకుండా అలిగినందుకు చింతిస్తూ..భోజనాల టైముకు మామూలుగా ఉండే ప్రయత్నం చేశాను, అమ్మ గమనించకుండా!

కానీ ఆవిడ పది నిమిషాలకోసారి 'అమ్మలేమో అలిగి కూచుందాయె, ఇవాళల్లా తిండి తినదు,!ఎంత మొండితనమో"అని ఎవరో ఒకరితో అంటూనే ఉంది.

***మా అమ్మ కూడా Ditto!!.


>>>ఏ వంతెన కిందో డబ్బు , రత్నాలు పంచుకుంటున్న దొంగల ముఠాలో చేరి పెద్ద "డాన్" అయిపోతాడు. ఈ లోపు నేనొక అందమైన పోలీసాఫీసరుని (ఎస్పీకి తక్కువ రాంక్ కాకుండా చూసి)పెళ్ళాడేస్తాను. ఒకరోజు నేను నాగదేవత గుడికి వెళ్ళి పాము తో మాట్లాడుతుండగా అన్నయ్య నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత రోజు వచ్చే రాఖీ రోజు మా ఇంటికి ఒక బస్తాడు రత్నాలతో వస్తాడు.

అదే టైములో ఎస్పీ గారు....! >>>

ఈ కల మాత్రం సూపర్!!

గీతాచార్య said...

మీ కలని మాంఛి సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారు. అసలే అది ఎనభైల్లో కథనుకుంటాను. అమితాబులాటి కథ.

తొందరగా "అదే టైములో ఎస్పీ గారు....!" ఆఁ ఏమైందో చెప్పండి ప్లీజ్. ఇక్కడ టెన్షన్ టెన్షన్ :-D

శేఖర్ పెద్దగోపు said...

ఆహా...సుజాత గారూ! కలలు కనటం మీ దగ్గరనుండే నేర్చుకోవాలాండీ....మీ అన్నయ్య ఇంటికి రాకపోతే ఒక ఈస్ట్మన్ కలర్ సినిమాని కలలా కనేస్తారా?..భలే నవ్వించారండీ...:)

>>>శ్రీశైలమే? అంతా కొండ, అడవి,నీళ్ళూనూ! (ఇవి లేని చోటికి ఎవరైనా ఎందుకెళ్ళాలో మరి)...
:))

మీ పాప కొంచెం పెద్దాయ్యాక 'నాగార్జునా సాగర్' ట్రిప్ అందనుకోండీ...మీ డైలాగ్స్ కూడా ఇలానే ఉంటాయి అని నా ఫీలింగ్..ఆ మాటకొస్తే ఇంచుమించు పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రులు రియాక్షన్ అలానే ఉంటుందేమో!!

>>>ఇవాళ పొద్దున్నే అలిగి కూచుంది, ఎందుకంటే...Monday అంటే మంగళవారం కానందుకు!...

నాకైతే మండే అలగాలని ఉంటుంది...మండే అంటే ఫ్రైడే కానందుకు..పాపం ఆ మాత్రం దానికే మీరు మీ పాప అలకని కంప్లెయింట్ చేస్తే ఎలాగండీ?

>>>తొమ్మిదో టీవీ లో క్రైం వాచ్ యాంకరంటే కూడా భయపడని పిల్లని ఏం చూపించి భయపెట్టాలో మరి!
:))

అడ్డ గాడిద (The Ass) said...

తొమ్మిదో టీవీ లో క్రైం వాచ్ యాంకరంటే కూడా భయపడని పిల్లని ఏం చూపించి భయపెట్టాలో మరి!
aithe chala good gal annamata. meru mare ila complaint cheyyatam eme baledandi. ;-)
"ఇవాళ పొద్దున్నే అలిగి కూచుంది, ఎందుకంటే...Monday అంటే మంగళవారం కానందుకు! "
memu kuda alage aluguthamu monday ante sunday kananduku.

మా ఊరు said...

బయటకి వెలుతు బై చెప్పలేదని అలిగే మా 26 years ఫ్రెండ్స్ ని చూస్తే మీ కూతురు అలగడం తప్పేమీ కాదని అనిపిస్తుంది .
కాని అలగడం కూడా ఒక కల.65వది అనుకుంట

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
ఇందులో సస్పెన్స్ కి తావు లేదు. ఎస్పీ గారూ, డానూ కలుసుకున్నారో లేదో తెలీకుండానే మెలకువ వచ్చేసిందిగా మరి!

శేఖర్ గారు,
మా నాగార్జున సాగర్ దాకా ఎందుకండీ, కూత వేటు దూరంలొ ఉన్న శిల్పారామం వెళ్తానన్నా ఇదే డైలాగు నాది!

నేస్తం said...

మీ అమ్మాయి శ్రీశైలం టూర్కి వెళతా అని కాస్త పెద్దయ్యాక అనాలి .. మీ అమ్మగారికంటే రెండు ఎక్కువ డయిలాగ్ లే చెప్తారు మీరు ..పందెం :)
నాకైతే మరీ అన్యాయమండీ బాబు మా అమ్మావాళ్ళు ఎలా భయపెట్టారో ,ఏం మంత్రం వేసారో గాని నా విషయం లో .. అలిగినా వాళ్ళకు తెలియకుండా అలిగేదాన్ని ...కాని మా అక్కావాళ్ళు బాగానే అలిగి సాదించుకునేవాళ్ళు.. పైగా వాళ్ళు సీరియస్సు గా అలుగుతుంటే ఎందుకులే అక్కా పాపం నాన్నకు అన్ని డబ్బులు లేవేమో అని వాళ్ళను వెనక్కులాగి తిట్ట్లు తినేదాన్ని..కాని పెళ్ళి అయ్యాక మాత్రం అలక విషయం లో పి హెచ్ డి చేసా అనుకోండి అది వేరే విషయం :)

కొత్త పాళీ said...

:)
geethacharya's comment is fine too.

వేణూశ్రీకాంత్ said...

:-) కల సూపరు.

Anonymous said...

అంత అమాయకమైన చక్కటి పిల్ల మీద ఇన్ని చాడీలు చెబుతారా? ఉండండి మీ ఇంటికొచ్చి మరీ చెబుతాను ‘ఇదిగోనే అమ్ములూ మీ అమ్మ నిర్వాకం ఇదీ’ అని. మావాడు కూడా అలుగుతాడు, వాడికి కావాల్సినప్పుడల్లా స్పైడర్ మేనో రేంజర్సో టెలికాస్ట్ అవట్లేదని. వాటికో టైమూ అవీ ఉంటాయి నాయినా అంటే వినడు. అదెలా తీర్చాలో తెలీక నెత్తికొట్టుకుంటుంటాను. అలిగినప్పుడు మరీ ముద్దొస్తారు కదండీ పిల్లలు!.

సుజాత వేల్పూరి said...

అరుణా,
అదేనండీ సమస్య! అలిగినప్పుడు ఒక పక్క ముద్దొస్తుంటారు, మరో పక్క ఒళ్ళు మండిపోతుంటుంది. రెంటి మధ్యా మనం!

మధ్యలో ఈ రేంజర్సూ, బెన్ టెన్ లూ ....ప్రాణాలు తీయడానికి! అవి తెచ్చిపెట్టే కష్టాల మీదొక టపా రాయొచ్చు!

Surabhi said...

అలగడం అంటే మా 17 నెలల చిన్న వాన్ని చూసి తీరాలి. వాడి అలకకు ఇంట్లొ ఒక spot కుడా వుంది నేను కోంచం గట్టీగా అఛ్ఛీ ( వాడి పేరు Harshil) అంటె చాలు ఒక్క సారి రెండు చేతులు ఒక విసురు విసిరి పరిగెట్టుకొని వెల్లి గోడకు మొకం పెట్టి దొంగ చూపులు చూస్తూ వుంటాడు వాల్ల నాన్నా వేళ్లిన కాని ఒరకంట నా కొసం చూస్తూ వుంటాడు. ఈప్పుడైతె చాలా ముద్దుగా వుంది కాని రేపు పెద్దాయక ఎంత సాదిస్తాడొ అని భయం వేస్తూ వుంటుంది

Ramani Rao said...

హ..హ..హ సుజాతగారు! వాళ్ళు అలగడం కన్నా , అలిగారని తెలిసినతరువాత వాళ్ళ నాన్న హంగామ చూడాలి, ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే కదా. అదేదో అసలు పిల్లలంటే మనకి పడనట్లు.. ప్రేమలు దోమలు వాళ్ళకే తెలిసినట్లు..." అమ్మో! అమ్మ గయ్యాళమ్మా" అని వాళ్ళని బుజ్జగించడం చూస్తుంటే మండుకొస్తుంది నాకయితే. మా ఇంట్లో ఇదంతా ఒక పెద్ద ప్రహసనమే, గోటితో పోయేదానిని పెద్ద గొడ్డలితో నరుక్కోడమే మా పాప అలక తీర్చడమంటే.

BTW మీ కల.. సుపరో సుపర్.

రాధిక said...

అదేంటో పక్కోళ్ళ పిల్లలు అలిగితే బాగుంటుంది కానీ మన పిల్లలు అలిగితే కాదు :) తరువాతెప్పుడన్నా గుర్తొస్తే నవ్వొస్తుంది కానీ ఆనిమిషం లో వాళ్ళవేషాలు చూస్తే భలే చిరాకొస్తుంది.అప్పుడప్పుడూ ముద్దొస్తుందిలెండి :)

సుజాత వేల్పూరి said...

రమణి,

"అదేదో అసలు పిల్లలంటే మనకి పడనట్లు.. ప్రేమలు దోమలు వాళ్ళకే తెలిసినట్లు..." ఇదిగో, ఇక్కడే నాకూ మండిపోతుంది!మా యువరాణి అలిగిందంటే వాళ్ళిద్దరూ ఒక జట్టు, నేనొక జట్టు! నేను అడ్వాంటేజ్ తీసుకుని, "నాతో మాట్లాడకండి, నేను చదువుకోవాలి"అని మంచిపుస్తకమేదైనా తీసుకుని కూచుంటాను!

సుజాత వేల్పూరి said...

Ram,
Thank you!,

$h@nK@R,
సునీత,
అ.గా,
కొత్తపాళీ,
వేణూశ్రీకాంత్,

ధన్యవాదాలు!

నేస్తం,
మీ అలకలు చూశాకే పాప అలక గురించి రాద్దామనిపించింది! ఇంకా కొత్త అనుకుంటా, అందుకే పీ హెచ్ డీ చేసేశారు! నిజంగానే అలిగి సాధించుకోవడం ఒక కళే!

సురభి,
నెలల పిల్లలు కూడా అలుగుతారని తెలిసి ఆశ్చర్యంగా ఉందండీ!నవ్వొస్తోంది కూడా మీ బాబుని తల్చుకుంటే!

రాధిక,
మరే, బాగా చెప్పారు.

Vinay Chakravarthi.Gogineni said...

nice one............

మురళి said...

"ఈ డిస్కౌంట్లు అబ్బాయిలకుండవు"
అక్షర సత్యం.. చిన్నప్పుడు ఒక పూట అలగాలని డిసైడై ఆ విషయం ప్రకటించగానే, "వాడికి రెండు రోజులు అన్నం పెట్టకు" అని అమ్మకి నాన్న ఆర్డర్.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం అలుగుతాం చెప్పండి..పళ్ళు నూరుకోడం తప్ప.. మీ కల బాగుందండి.. సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళనుకుంటా :-)

వేణు said...

భలే రాశారు 'అలక' పోస్టు!

> ఒకరోజు నేను నాగదేవత గుడికి వెళ్ళి పాము తో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా అన్నయ్య నన్ను గుర్తుపట్టి ...

> ... అంటే నేను ఫ్రాక్ లో సిండరెల్లా లాగా ఉండననేగా?


అలగటానికి కారణాలుండాలా ఏమిటి? అలగాలనిపిస్తే చాలదూ!

మాలతి said...

ఏమో బాబూ, నాకు అలగడం అంటే అసలు తెలీదు :p

Bolloju Baba said...

చాలా బాగుంది.

సుభద్ర said...

నేను తినేసి అలిగేదాన్ని.లేదా మా తతమ్మ దగ్గర మ౦చి తాయిలాలు ఉన్నప్పుడు దైర్య౦గా అలిగేదాన్ని...
మీ కల బాగు బాగు బహూ బాగు హహ హ్హి హా హ్హి ...రాయ౦డీ మీ లాగే మీ పాప చేసే అల్లరి.

మరువం ఉష said...

గట్టిగా నవ్వను, ఎవరికీ చెప్పనంటేనే... నేనిప్పటికీ మా పిల్లల మీద కూడా అలిగేస్తాను. :) బ్రతిమాలించుకుంటాను. దాని కోపం నాగు పాము బుస, తాటాకు మంట ఇలా మా నానమ్మ అలగటంలో నాకున్న ప్రత్యేకతలు సాటిచెప్పటంతో తొండ ముదిరి వూసరవెల్లి మాదిరి ఇలాగైపోయాను. ఇంకా వాళ్ళేమి అలుగుతారు, నా చుట్టూ బిక్కమొహంవేసుకు తిరగటం తప్పా?

kiranmayi said...

అలక పోస్ట్ అదిరింది. అలకలంటే అమ్మాయిల తరవాతే ఎవరైనా. స్కూల్ నించి రాగానే ఒక్క అలుగు అలిగామంటే మరి నాన్న సాయంత్రం ఇంటికొచ్చి తీర్చాల్సిందే. అమ్మాయిలా, మజాకా?

సుజాత వేల్పూరి said...

@వినయ్ చక్రవర్తి,థాంక్యూ,

@ మురళీ,
అన్నం మీద అలిగే ఛాన్స్ కూడా లేదన్నమాట.పాపం కదూ!
సినిమాలు తక్కువే కానీ ఈ మాత్రం సింటిమెంట్ సీన్ ఊహించుకోడానికి అన్నా చెల్లెలు సెంటిమెంట్ సినిమా ఒక్కటి చూస్తే చాలదేంటండి?

@వేణూ,
సరిగ్గా చెప్పారు. అలగడానికి కారణాలక్కర్లేదు.అలిగే మూడ్ ఉంటే చాలు!

@ మాలతి గారూ,
నిజమే?:-))

బాబా గారు,
ధన్యవాదాలు!

ఉషగారు,
ఇదన్యాయం కదూ! పాపం పిల్లలు!

కిరణ్మయి గారు,

థాంక్యూ!

అడ్డ గాడిద (The Ass) said...

chinna pillani bhayapettaalanukotam nenu khandisthunnanu. tv9 gadiki kuda bhayapadani vallunnarante anandame mari. kani ultimate bhayam okatundi telusa? siva rama raju lo hari krishna dhinnaku dhinnaku thaa dance pata. adokka sari chose ju ntr ki dadupudu jwaram vachi chikkipoyatta. ;-D

ikkadevaranna alfred hichcock sinimala gurinchi mare ekkuvaga chepthunte naa cell lo unna aa video chupedatha. athma rakshana kosam dachukunna.

సుజాత వేల్పూరి said...

అ.గా గారు,
అబ్బ, చల్లని వేళ అలాంటి దృశ్యాలా గుర్తు చేస్తారు?
అన్నట్టు ఇప్పుడు గుర్తొస్తోంది, ఆ సినిమా టీవీలో చూసిన రాత్రే నాకూ జ్వరం వచ్చింది.బహుశా దడుపు జ్వరమే అయ్యుండాలి!

గీతాచార్య said...

అడ్డ గాడిద (The Ass) గారు,

LOL. Too innovative.

నీటి బొట్టు said...

అప్పుడప్పుడు చిన్నారుల అలక కూడా ముద్దొస్తూనే వుంటుంది.

Dhanaraj Manmadha said...

TA garu,

Wah wah

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది భలే రాశారు ..మీ పొస్ట్ లు అన్నీ చూస్తుంటే ఈ అలుక అని కనపడగానే చూసేశా .... ఈ అలగటం లో నాకు చాలా అనుభవం ఉంది ...నేను రాసిన చివరి పొస్ట్ కూడా అలగటం మీదే ! కుదిరితే నా బ్లాగ్ కి ఒక లుక్ వెయ్యండి....

Post a Comment