January 11, 2010

నాకు నచ్చిన ఒక కథ "ఇరుకు"




మంచి కథ ఎలా వుండాలి? అంటే ఏం చెప్తాం? నాకైతే ఒక కథ చదివామూ అంటే అది ఎప్పటికైనా సరే బుర్రలో అలా గుర్తుండిపోవాలి, కనీసం అస్పష్టంగా అయినా సరే! ఆ కథ లాంటి పరిస్థితి ఎక్కడైనా తారసపడితే వెంటనే ఆ కథ గుర్తు రావాలి. అందులో సందేశం ఉండక్కర్లేదు, గొప్ప పదజాలమో భావజాలమో ఇజమో పాడో ఏమీ ఉండక్కర్లేదు. విమర్శకుల విమర్శలో ప్రశంసలో పొందక్కర్లేదు. జీవితంలోని ఒక పార్శ్వాన్ని స్పృశించగలిగితే చాలు అనిపిస్తుంది. దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటాను ఆంధ్ర ప్రభ వారపత్రికలో రచయిత శ్రీ సలీం రాసిన కథ "ఇరుకు" చదివాను.ఎందుకో అందులోని కథాంశం అలా గుర్తుండిపోయింది. ఈ కథలోని పాత్రల్లో ఒకరిలా తప్పక నేనూ ప్రవర్తిస్తానేమో అనిపించింది. అలా ప్రవర్తించకపోతే ఒక ముసుగులో ఉన్నట్లే అనిపించింది.



కల్పన గారి బ్లాగు. లో ప్రస్తావన వచ్చాక ఈ కథను సంపాదించగలిగాను. ఆ పైన రచయిత సలీం గారితో ఫోన్లో మాట్లాడి కథను బ్లాగులో పెట్టడానికి అనుమతి సంపాదించాను.


ఈ కథ తెలుగు విశ్వవిద్యాలయం వారి వార్షిక కథా సంకలనంలో కూడా చోటు చేసుకుంది. తర్వాత నిశ్శబ్ద సంగీతం అనే సలీం గారి కథా సంకలనంలో వచ్చింది.

కథ చదవండి.ఎలా వుందో అభిప్రాయం తెల్పండి.సలీం కూడా తెలుసుకుంటారు.








  



  చదివారా? నిజానిక్కడ ఇరుకు లిఫ్ట్ లో ఉన్నది కాదు. మనుషుల మనసుల్లో ఉన్నదే! అందుకే ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటారు, ఒక గంట సేపట్లో ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకుంటారు,రేపు ఒకరి మొహం ఒకరు చూసుకోవాలన్న మొహమాటం కూడా లేకుండా తీవ్రంగా ప్రవర్తిస్తారు. మనుగడ కోసం పోరాడినంత హంగామా
చేస్తారు.




నిజానికి మనుషుల్లో ఉండే సహజ ప్రవృత్తిని ఇంత చక్కగా ఆవిష్కరించే ఇలాంటి కథ చదివి చాలా రోజులైంది. ఎంత సేపూ బోధించి, బాధించే కథలే! మనసులో ఉండే వికారాలను దాస్తూ,పాజిటివ్ కోణాలతో వేసే ముసుగుల్తో అలంకరించే కథలే అన్నీ!



అందుకే మనిషి ప్రవృత్తిని ఆవిష్కరించిన ఈ కథ నాకు బాగా నచ్చింది.

22 comments:

Anonymous said...

మంచి కథ ఎక్కడున్నా ఎక్కడ చదివినా ఇలా పంచుకోవడం వల్ల అందరికీ తెలుస్తాయి. మరుగున పడిన ఆణిముత్యాలను ఇలా వెలికి తీయడం మంచి విషయం!

కథ చాలా బాగుంది. పదునైన సంభాషణలు, వ్యంగ్యం అద్భుతంగా ఉన్నాయి.

"తాహతు తెలిసి మాట్లాడు" అంటే "ఇప్పుడు అందరి తాహతూ ఒకటే! మూసుకుపోయిన లిఫ్ట్ లో బందీలం" అని చెప్పడం చక్కని రిటార్ట్.

కథలో చివరి పేరా కూడా చాలా చక్కని కంక్లూజన్!

తృష్ణ said...

బావుందండీ కధ. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను...! అనుమతి తీసుకుని అందరి కోసం కధను ప్రచురించినందుకు థాంక్స్ అండీ.

Ruth said...

హ్మ్మ్... బాగుంది కథ, ఇంతకు ముందెప్పుడో చదివాననుకుంటా. ఇదే కథో, లేక ఇలాంటిదేనో!

Kalpana Rentala said...

మంచి మాట చెప్పారు సుజాత. మనుష్యుల్లోని రకరకాల ప్రవృత్తులని చూపిస్తాయి కథలు. అయితే కొన్ని మనసు కి బాగా పట్టుకుంటాయి. కొన్ని అలా చూసి వదిలేస్తుంటాం. నేను కూడా సలీం ఇంకో కథ గురించి నా బ్లాగ్ లో రాశాను. వీలైతే చదవండి.

ASHOK said...

nice

వేణు said...

ఈ ‘ఇరుకు’ కథ నాక్కూడా బాగా నచ్చింది. కథ చకచకా సహజమైన సంభాషణలతో చక్కగా సాగింది.
అయితే చివర్లో మురళీ కృష్ణ శివరాంతో అన్నమాటలు లేకపోయినా... ఈ కథ బాగానే ఉండేది. వాచ్యంగా అలా
చెప్పటంలో కథ అందం కాస్త తగ్గినట్టనిపించింది. అయినప్పటికీ ఇది మంచి కథే!

దీన్ని అంతర్జాలంలో అందరికీ అందుబాటులోకి తేవటం మంచి విషయం. అలాగే ఈ కథ గురించి మీ అభిప్రాయాలు కూడా విలువైనవిగా ఉన్నాయి!

Ravi said...

నాకూ నచ్చింది కథ. ఇక అంతర్లీనంగా ఈ కథలో నాకు గోచరించిన సత్యం ఏంటంటే ముందుగా వ్యక్తుల్లో మార్పు వస్తేగానీ సమాజంలో మార్పు రాదు అని.

$h@nK@R ! said...

చక్కటి కథను పరిచయం చేసారు.... మనిషి ప్రవృత్తిని కళ్ళకు అద్దినట్లుగా చెప్పారు.. సలీం గారికి, మీకు నా అభినందనలు.

kanthisena said...

పేజర్ల రాజ్యం నడుస్తున్న కాలం నాటి కథను మళ్లీ గుర్తుకు చేసారు. పాఠకులకు బోధించని కథల్లో సాఫీగా నడిచిపోయిన కథ ఇది. కానీ వేణుగారన్నట్లు ముగింపు మాత్రం బోధతోనే ముగిసింది.

"ముందుగా వ్యక్తుల్లో మార్పు వస్తేగానీ సమాజంలో మార్పు రాదు అని" రవిచంద్ర గారి మాట. మళ్లీ ఇది మనలను భావజాలం వైపుకే తీసుకుపోతుంది. కథలో సిద్ధాంతం, బోధన కనపడకపోయినప్పటికీ ప్రతి కథ, రచనలో అంతర్లీనంగా ఏదో ఒక భావజాలం కనబడుతూనే ఉంటుంది. సాంప్రదాయమో, మితవాదమో, మతవాదమో, ఛాందసవాదమో, అభ్యుదయవాదమో, విప్లవవాదమో, ఉదారవాదమో, తటస్థవాదమో ఏదో ఒక భావజాలం కనిపించని కథ, రచన ప్రపంచంలో ఉండదనుకుంటున్నాను. నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే మానవ సంబంధాల్లో ఇరుకుతనం పోవాలని కోరుకోవడం ప్రజాస్వామిక విలువ. ప్రజాస్వామ్యం కూడా భావజాలమే.. సలీం గారు దీన్ని కథలో చెప్పకనే చెప్పారు. తనకూ, మంచికథను పరిచయం చేసిన మీకూ అభినందనలు

చైతన్య said...

సూపర్ గా ఉందండి కథ... నాకైతే భలే నచ్చేసింది... చాలా బాగా చెప్పారు రచయిత.
కొంత హాస్యం ఉన్నా... అంతకు మించి వ్యంగ్యం కూడా ఉంది.

నిషిగంధ said...

నిన్న మీ బ్లాగ్ లో చూసినప్పటి నించీ ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా చదువుదామా అనిపించింది.. ఇప్పటికి కుదిరింది :-)
పేజీలకి పేజీలు ఆర్గ్యుమెంట్స్, పేరాలకి పేరాలు సండేశాలతో నిండి ఉండే కధల కంటే ఇలా సూటిగా ఉన్న కధలే నాకు బాగా నచ్చుతాయి.. వేణూ గారన్నట్లు చివర్లో ఆ సంభాషణ లేకపోయినా కధకి వచ్చిన లోపమేమీలేదు.. శ్రమ తీసుకుని రచయిత అనుమతి తీసుకుని మరీ స్కాన్ చేసి మాతో పంచుకున్నందుకు బోల్డన్ని ధన్యవాదాలు :-)

వేణూశ్రీకాంత్ said...

కథ చాలా బాగుందండీ. కానీ మనసుల్లోని ఇరుకును ఇలా నిలబెట్టి తాట తీసి చూపించేస్తే భరించడం కాస్త కష్టమే.

భావన said...

నాకు చాలా కోపం వచ్చేస్తోంది మీ మీద కాసేపు బ్లాగ్ ల లేక పోవటం పాపం ఇన్నిన్ని రాసేస్తే ఎలా.. నేను ఖండిస్తున్నా... :-(

చాలా బాగుంది సుజాత కధ. ఇంతకు ముందు ఎక్కడో చదివేను, నిజమే ఇరుకు మనసులలోనే ఇంత పెద్ద అమెరికా లో (చాలా రాష్ట్రాలు ఖాళి కూడా) కూడా ఇరుకే మరి. :-)

కొత్త పాళీ said...

కథ చాలా తెలివిగా రాశారు రచయిత, సందేహం లేదు. కానీ ఇదే మనుషుల నిజస్వరూపం అన్నట్టుగా చివర్లో శివరాం మురళీకృష్ణల మధ్య సంభాషణలో చెప్పిన కన్‌క్లూజన్ నేనొప్పుకోను. ఆ చిత్రణ సహజంగా ఉన్నదన్న మీ తీర్మానాన్నీ ఒప్పుకోను. ఒక లిఫ్టులో ఇరుక్కుపోవడం కన్నా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోడం .. ఒక్కోసారి తమ గురించి కూడా పట్టించుకోకుండా సాయపడ్డం .. జరుగుతోంది. అంచేత ఇరుకు అనేది మనిషి సహజగుణమేమీ కాదు. ఈ కథలో చిత్రించినది సగటు మనిషిలో ఉండే ఎన్నో కోణాల్లో ఒక కోణం. అంతే.

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారు,
భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నపుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం...కాదన్ను! నాకేమనిపిస్తుందంటే ఇలా సహాయం చేయడం, తమ గురించి కూడా పట్టించుకోకుండా అవతలి వారి పట్ల కన్ సర్న్ చూపించడం...ఇవన్నీ మాత్రమే మనిషిలోని(అదీ కొంతమంది లోని) ఒక కోణం మాత్రమే అని! ఇదివరలో ఏమో కానీ ఇప్పుడు ఈ సహాయాలు,కన్సర్న్ లూ ఇవన్నీ అరుదనే అంటాను! ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎవరన్నా డబ్బో నగలో మర్చిపోతే అది అతడు పోలీసులకో యజమానికో అప్పగిస్తే అది వార్త అవుతుంది. ఈ లిఫ్ట్ లాంటి సంఘటనలు నిత్యం అనేకం! సిటీ బస్సులో సీటు కోసం ఎంతెంత స్వార్థాలు (పది నిమిషాల్లో దిగే స్టాప్ కి కూడా) మీరూ చూసే ఉండాలి.అవన్నీ సహజం కాబట్టి అవి వార్తలు కావు. అందుకే "ఇరుకు" స్వభావమే నాకు అత్యంత సహజంగా కనపడింది. మీరు చెప్పిన స్వభావాలు "అబ్బురంగా "కనపడ్డాయి, వాటిని నేను చూసినపుడు.



మెజారిటీ మనుషుల్లో కనపడేది ఈ ఇరుకు స్వభావమే! ఈ స్వభావానికి అనేక కారణాలుండొచ్చు...! ఆ ఇది ఒక మనిషినో, మనిషి స్వభావాన్నో జడ్జ్ చేయడం కానీ తీర్మానించడం కానీ కాదు. ఎంతోమంది ని నిత్యం పరిశీలించాకే ఇటువంటి కథలూ, కానీ వాటి మీద "అవున్నిజమే" అన్ని అబిప్రాయాలు కానీ వస్తాయనుకుంటాను!

Anonymous said...

మొన్నీ మధ్య ఏదో బ్లాగులోనే అనుకుంటాను చదివాను.."మనుషుల్లోని కుళ్ళు, కుతంత్రాలను, సంకుచిత స్వభావాన్ని యధా తథంగా చిత్రీకరిస్తే భరించడం కష్టం" అని! ఎందుకంటే మనలో కుడా దాగి ఉన్న ఆ స్వభావాలు ఉలిక్కిపడేలా చేస్తాయి. (అలా ఉలిక్కి పడి తరచి చూసుకోవాలనే రచయిత లక్ష్యం అసలు)అందుకే "పాజిటివ్" వైపే చూడాలి, రాయాలి చదవాలి అనే వాదనలు!

చుట్టూ ఉన్న కుళ్ళుని చూపిస్తే చూడలేక దాక్కుని, మంచిని చూడాలనే పరదాల్లో బతుకుతున్నాం మనం!

రైలు ప్రమాదాల వంటి సంఘటనల్లో ఒకరి కొకరు సహాయం చేసుకోవడమేమో కానీ శవాలమీద నగలు సైతం వొలుచుకున్న వారున్నారని ఎన్నో సార్లు చదివాం!

అయినా ఒక మనిషిగా వాటిని అంగీకరించాలంటే భయం! దీన్ని అర్థం చేసుకోవచ్చు! మనుషులంతా మంచిగా ఉంటే బాగుండు అనే చిన్న స్వార్థం!

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

కొత్త పాళీ said...

నిన్నటి కామెంటు కొంచెం చిరాకుతో పెట్టాను. కథ చదివేసినాక చిరాకు మిగిలిందన్న మాట నిజం. నేనే ఆ ఇరుక్కుపోయిన లిఫ్టులోనించి బయటికొచ్చిన భావన :)
అంటే, ఆ మేరకు రచయిత సక్సెస్ఫుల్ అయినట్లే. అందుకనే అన్నాను రచయిత తెలివిగా రాశారని.
కొద్దిగా స్థిమితంగా ఆలోచించిన మీదట, ఇదికూడా మనుషుల్లో ఒక కోణం, కాబట్టి పర్లేదు అనిపించింది. నాకు వాస్తవికత అంటే చాలా ఇష్టమూ గౌరవమూ. కళలో వాస్తవైక దృక్పథం ఉన్నప్పుడు రొమాంటిసైజేషనుకి అవకాశం ఉండదు. దేన్నీ మసి బూసి మారేడు కాయజేసే అవకాశం ఉండదు. ఉన్న కుళ్ళేదో స్పష్టంగానే కనిపిస్తుంది. ఐతే నాకు ఈ కథ ఇంకా సలుపుతున్న గొడవేంటీ అంటే .. ఆ చివర్లో వచ్చే కంక్లూజన్. మనుషుల్లో ఇది కూడా ఉంది అని చెప్పే బదులు, మనుషుల్లో ఇదే ఉంది అన్నట్టు చూపడం. అంతే కాక, ఇరుకు స్థలంలో కాదు, మనసుల్లో ఉంది అనడం. తలా ఒక కార్లో ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళకి బస్సు సీట్ల మీద రుమాళ్ళేసి ఎవరిది ఫస్టు అని కొట్టుకోవాల్సిన ఖర్మమేమి? ఎవరింటో వారికి పంపులున్న వారికి నీళ్ళ లారీ దగ్గర బిందెల లైన్లో నించుని కొట్లాడవలసిన ఖర్మమేమి? అందుకని అవి కూడా ఇక్కడ సరైన పోలికలు కావు. రచయిత ఈ సంఘటన స్థలాన్ని చాలా తెలివిగా ఎంచుకున్నారు. రకరకాల స్థాయిల మనుషులు, రకరకాల చికాకులున్న వాళ్ళు, రకరకాల భయాలూ కోపాలూ కోరికలూ ఉన్న వాళ్ళు ..
నీలాంచలగారూ ప్రతీ రచనా అంతా పాజిటివ్ గానే ఉండాలని అనడం లేదండీ. ఈ రచన చిరాకుని మిగిల్చింది. ఆ చిరాకుకి మూలం ఏంటా అని ఆలోచిస్తున్నా.

శ్రీ said...

కథ బాగుందండీ

Anil Dasari said...

:-)

Vasu said...

హమ్మయ్యా!! చదివేసాను. వారం నించీ చదువడం మొదలెట్టడం ఏదోక కారణం తో ఆగిపోవడం. ఈ రోజు ముగించాను. బావుంది కథ.

మధురవాణి said...

సుజాత గారూ,
ఒక మంచి కథని చదివే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

Post a Comment