February 13, 2010

ఈ బలవంతపు పెళ్ళిళ్ళకు విలువెంత?








ప్రేమ రోడ్డెక్కి చాలా రోజులైంది. అంతకు మించి ఈ మధ్య ప్రేమ మరీ బహిరంగ కార్యకలాపమై పోయి గర్వంగా పబ్లిక్ ప్లేసుల్లో పరుగులెత్తడం మొదలెట్టి కూడా చాలా రోజులైంది.

 "ప్రేమకు పరాకాష్ట(లేదా గమ్యం) పెళ్ళి కాదు" అనే చాలా మంది అభిప్రాయం! వీరితో నేను వాదించబోవడం లేదు.




చల్లని సాయంకాలం ఏ ఇందిరా పార్కో, టాంక్ బండో,నెక్లెస్ రోడ్డో పిల్లలతో కలిసి పోయి కాసేపు మురుక్కాలవ మీదనుంచి వచ్చే మలయ మారుతం ఆస్వాదించాలనుకుంటే కుటుంబాలు చచ్చేంత భయపడే దృశ్యాలు కళ్ళబడతాయి! తల ఎటు తిప్పుదామన్నా ఛాయిస్ లేదు. దుర్గం చెరువు  వైపు పొరపాటున ఏ వీకెండో వెళితే... శివ శివా! సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లన్నీ అక్కడ కనపడతాయి.



దీనికి కారణమేమిటని ఇప్పుడు బాధపడి లాభం లేదు. గ్లోబలైజేషనూ, వివిధ సంస్కృతుల కలయికగా మారిన నగరాలు,కాల్ సెంటర్లూ(ఇవొకటి పాపాల భైరవులు పాపం),ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా చూడకుండా పిల్లలకు దండిగా డబ్బులిచ్చే తల్లి దండ్రులూ...ఒకటా రెండా.. కర్ణుడి చావుకున్నన్ని కారణాలు! మొత్తంగా కళ్ళముందే మారిపోయిన సమాజ ముఖ చిత్రం!




వాళ్లెవరో సమాజ పరిరక్షకులు ప్రేమికుల దినం రోజు జంటగా రోడ్డుమీద కనపడిన ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేసి పారేస్తామని బెదిరింపు జారీ చేశారు. బానే ఉంది ప్లాన్!



వీళ్ళమీద నాకు దురభిప్రాయం ఏమీ లేదు గానీ కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వస్తున్నాయి.



బాబూ, ...ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు...నిజమే! ఇంకా మన సంస్కృతి కాని అనేక అంశాలు, ముదనష్టపు విషయాలు అనేకం మన సంస్కృతిలో భాగమైపోయాయి. మీకు ఏ డిసెంబర్ 31 న పబ్బుల్లో అమ్మాయిలు కనపడినపుడో,ఏ ప్రేమికుల దినం రోజు రోడ్లమీద జంటలు కనపడినపుడో ఈ సంస్కృతీ పరిరక్షణ అర్జెంటుగా ఎందుకు గుర్తొస్తుంది? ఏడాదంతా మీరేం చేస్తుంటారు? మీ కార్యకలాపాలేమిటి? ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒకానొక శాఖగా ఉండటమేనా?



పిజ్జాలు,బర్గర్లు,మల్టీప్లెక్స్ లు మన దేశానికి కొట్టుకొచ్చినపుడు "ఇది మన సంస్కృతి కా"దని ఎందుకు ఉద్యమాలు చేపట్టలా మీరు?(మీలో ఎంతమంది పిజాలు , బర్గర్లు తినని వారున్నారోమరి)



"ఇదీ మన సంస్కృతి గొప్పదనం"అని యువతరానికి తెలియజెప్పే కార్యాచరణ ప్రణాళిక ఏనాడైనా చేపట్టారా మీరు?

 భారతీయ సంస్కృతి లో శీలానికెంత (శీలమంటే సత్ప్రవర్తన అని అర్థం చేసుకోండి దయచేసి) ప్రాముఖ్యం ఉందో కాలేజీల్లోనూ,యువత ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ చాటే కార్యక్రమం ఏదైనా ఇంతవరకూ అమలు చేశారా?ఇకముందు చేసే ప్లాను ఏదైనా ఉందా?



"సంస్కృతి"ని ఏమని నిర్వచిస్తారు మీరు?

"మీది టైమ్ పాస్  వ్యవహారమైతే నాలుగ్గోడలమధ్యా ఉంచుకోండి.వీధినపడొద్దు"అని ఏ జంటకైనా చెప్పి చూశారా మీరు?



గాలితో పాటు కొట్టుకుపోయే ఎంగిలాకుల్లా తయారైన కొద్ది శాతం యువతని,వెర్రి తలలు వేస్తున్న వారి అశ్లీల సంస్కృతిని కళ్ళారా చూస్తూ ఏడాదంతా కూచుని ఫిబ్రవరి 13 రాత్రి హఠాత్తుగా నిద్ర లేచి జూలు విదిలిస్తారన్నమాట!



మీ వాదన ఒప్పుకుంటాను!

ప్రేమ అన్న పదానికి తలవంపులు తెచ్చేలా చాలామంది ప్రవర్తిస్తున్నారు.
 ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావడంలా?
 వాళ్ళ ప్రేమలో సీరియస్ నెస్ లేదనీ, అది టైమ్ పాస్ వ్యవహారమనీ తెలీడంలేదా?
ప్రేమ మీద గౌరవం లేనివాళ్ళు మీరు చేసే బలవంతపు పెళ్ళిని గౌరవిస్తారా?

 మీరటు పోగానే ఆ పెళ్ళినీ విదిలించి అవతల పారేస్తారు తప్ప పాతకాలపు తెలుగు సినిమా హీరో హీరోయిన్లలా సూత్రాలు కళ్లకద్దుకుని పారా,తట్టా నెత్తినపెట్టుకుని పొలం పని చేసుకుంటూ పాట పాడుకోరు.

అంటే  , ప్రేమికులకు బుద్ధి చెప్పి సంస్కృతిని రక్షించబోయి చివరికి మీరు చేసే నిర్వాకం ఏమిటంటే భారతీయ వివాహ వ్యవస్థకు అవమానం తెచ్చి పెట్టడం. !

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందంటే ఇదేనేమో!



ఇంకో మాట!



పేమంటే ఒకరి సాహచర్యాన్ని, సాన్నిహిత్యాన్ని మరొకరు కోరుకోవడం! ఈ సాన్నిహిత్యం జీవితాంతం కావాలని కోరుకునే సీరియస్ ప్రేమికులు కూడా ఉంటారు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుని టెన్షన్ లేకుండా జీవించాలనుకునే వారుంటారు. వారి ఉదాత్త ప్రేమను గుర్తించరా? వారిక్కూడా మీకిష్టమైనపుడే  పెళ్ళా? అందర్నీ ఒకే గాటన కట్టి పోలోమని పెళ్ళి పెద్దలుగా అవతారమెత్తితే సరిపోయిందా?



అసలు ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్ళి చేసుకుని తీరాలా అని ప్రశ్నించింది ఒక మీడియా ఛానెల్ ఇవాళ పొద్దున!



ఈ బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల మీకొరిగేదేమిటి? రోడ్లమీద జనానికి వినోదం,యువతీ యువకులు భయభ్రాంతులు కావడం తప్ప? ప్రేమించుకున్నవాళ్ళు ఒకరోజు కలుసుకుని బహుమతులిచ్చుకుంటే నష్టమేమిటి?



కాబట్టి, మీకు డబ్బులెక్కువుంటే కనీసపు పెళ్ళి ఖర్చు పెట్టుకోలేని పేదవారెవరైనా ఉంటే వారికి పెళ్ళి చేయించి నాలుగు అక్షింతలు వేయండి!



పెడదారి పట్టిన పిల్లలకు నచ్చజెప్పే పద్ధతి, బుద్ధి చెప్పే పద్ధతి ఇది కాదు! కురుపు లేస్తే దానికి మూలకారణం ఎక్కడుందో వెదికి యాంటీ బయాటిక్ వాడాలి కానీ,కురుపు బారినపడ్డవారిని వేపమండలు తీసుకుని బాదడం కాదు మీరు చేయాల్సిన పని.(చిత్రంగా...యాంటీ బయాటిక్ విదేశీ, వేపమండలు స్వదేశీ...)



పౌరోహిత్యం మీరు చేయాల్సిన పని కాదు కానీ బుద్ధిగా మీ పన్లు మీరు చూసుకోండి!



హాపీ వాలంటైన్స్ డే ప్రేమికులూ!

29 comments:

శేఖర్ పెద్దగోపు said...

బాగా అడిగారు/చెప్పారు...నిజంగా వీళ్ళకు అర్జంటుగా సంస్కృతి పరిరక్షించాలన్న ఆలోచన రాత్రికి రాత్రి వచ్చేస్తుంది...ఇదంతా వాళ్ళ ఉనికిని జనాలకు తెలియజేయడంలో ఒక భాగంలా అనిపిస్తుంది గానీ వాళ్ళు ఏదో పీకే టైపు కాదని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

Ravi said...

కరెక్ట్ గా చెప్పారు సుజాత గారూ, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం సరైనదేమోగానీ, మార్గం మాత్రం సరైంది కాదని నా అభిప్రాయం.

సుజాత వేల్పూరి said...

Sekhar, and Ravi,
you both got my point!

Thank you!

వేణు said...

దురభిప్రాయమేదీ లేదంటూనే ‘సంస్కృతీ పరిరక్షకుల’ను భలే కడిగి పారేశారే!

> ప్రేమికులకు బుద్ధి చెప్పి సంస్కృతిని రక్షించబోయి చివరికి మీరు చేసే నిర్వాకం ఏమిటంటే భారతీయ వివాహ వ్యవస్థకు అవమానం తెచ్చి పెట్టడం!

... సూటిగానే కాదు- ఘాటుగా, ఆలోచనాత్మకంగా ఉంది మీ టపా.

వాళ్ళకు ప్రేమంటే విలువ లేదు; వీళ్ళకు పెళ్ళి మీద గౌరవం లేదు!

Anonymous said...

వాళ్ళ సంగతేమో గానీ, మీరు మాత్రం వాళ్ళకి అక్షింతలు బాగానే వేశారు ! పాపం!

వేణూశ్రీకాంత్ said...

బాగా రాశారు. నిజమే వారి ఉనికిని చాటిచెప్పుకోడానికి ప్రయత్నిస్తూ సంస్కృతిని కించపరుస్తున్నారే కానీ వీళ్ళు ఉద్దరిస్తుందేమీ లేదు.

Unknown said...

మరి వారి భార్య , వీరి ఆవిడా కాసేపు అన్ని మరచి పోయి
మనసు విప్పుకుని మాట్లాడుకుందామని ఏ పార్క్ కో వస్తే
వాళ్ళిద్దరి కి కూడా మళ్లి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ వాళ్ళు పాపం ఏం కాను?

Malakpet Rowdy said...

బలవంతపు పెళ్ళిళ్ళకు విరుగుడు నా బ్లాగులో ఒక మహా పండితుడి కధలో దొరుకుతుంది. చూడండి :)) ( మీరు చూసేశారని నాకు తెలుసు - ఇది మిగతావారి కోసం)

జయ said...

పెళ్ళిచేసుకోలేని నిజమైన పేద ప్రేమికులు ఈ రోజు పార్క్ కెళ్ళి కూచుంటే సరి. కనీసం అటువంటి వాళ్ళ పెళ్ళి చేసి కొంచెం పుణ్యమైనా దక్కించుకుంటారు. ఎప్పుడూ ఆలోచించే ఈ విషయాన్ని ఇవాళ మీ బ్లాగ్ లో చూసేసరికి చాలా తృప్తిగా అనిపించింది. బాగా వివరించారు.

సుజాత వేల్పూరి said...

జయగారూ,
మంచి ఆలోచనేనండోయ్! :-))

Goutham Navayan said...

ఈ బలవంతపు పెళ్లిళ్లకు విలువెంత ?
మన బలవంతపు "సమైక్యతకు" ఉన్నంత !
.... అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందంటే ఇదేనేమో! అవును మన రాష్ట్రం వివిషయం లో అదే జరిగింది. ...!!
... ఈ బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల మీకొరిగేదేమిటి? "పెళ్ళిళ్ళ వల్ల" అన్న పదాలు తీసేసి "సమైక్యత వల్ల" అన్న పదాలు పెడితే సరిపోతుంది!!!
ఊరికే సరదాగా.
మీ ఆర్టికిల్ ఆలోచింప జేసేలా వుంది.
పై విధంగా కూడా.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ప్రేమకీ, పెళ్ళికీ, వావివరసలకీ దేనికీ విలువలేని దిక్కుమాలినకాలంలో జీవిస్తూ ప్రశ్నలు వేసుకుంటే మాత్రం ప్రయోజనమేముంది ?

శ్రీనివాస్ said...

మా ఊర్లో కూడా శ్రీరాం సేన గూండాలు పానకం తాగి వచ్చి నాకు తాళిబొట్టు కట్టారు . వారు వెళ్ళగానే తాళి తెంపి షాపు తీశాను. ఎక్కడో హైదరాబాద్ కి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హేతువాదులకు తాళి అవసరం లేదు

నాగప్రసాద్ said...

సంస్కృతీ పరిరక్షకులను కించ పర్చే విధంగా రాసిన సుజాత గారూ, డౌన్ డౌన్.. :)))).

ఇక్కడ ప్రేమలకు, ప్రేమ వివాహాలకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు. ఆమాటకొస్తే, ప్రేమికుల గురువు అంటే మా గురువు శ్రీకృష్ణ పరమాత్ముల వారు చేసుకున్నవన్నీ లవ్ మ్యారేజీలే. :)). ఒకటికాదు, రెండుకాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, ఏడు కాదు, ఎనిమిది లవ్ మ్యారేజీలు చేసుకున్నారు. పాపం తల్లికి తెలిపేంత సమయం కూడా లేదు ఆయనకు. అంత హడావిడిగా చేసుకున్నారు అన్ని పెళ్ళిళ్ళని. పాపం యశోదమ్మ తన పెళ్ళిళ్ళు ఒక్కటి కూడా చూడలేదని, కలియుగంలో తన తల్లి కోసం మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఈసారి లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడాయన. :))).

ఇప్పుడు చెప్పండి. మేము చేస్తున్నది తప్పా? మన సంస్కృతిని ఫాలో అయిపోండ్రా, సంవత్సరానికి ఒక్కటేం ఖర్మ "తొమ్మిది ప్రేమికుల రోజులు" జరుపుకోవచ్చు అని చెబుతున్నాం. అయినా సరే, ఎవడో విదేశీ గొట్టం గాడు, వాడు ఏం పీకాడో ఎవ్వడికీ సరిగ్గా తెలీదు, ఈ మధ్యనే తెలిసింది ఆ వాలెంటైన్ డే కూడా, ఆ వాలెంటైన్ అనేటోడు సచ్చిన రోజంట. ఎవడో సచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలంట. థూ!... దానికితోడు మీడియా హడావిడి ఒకటి.

అందుకే, ఆరోజు జంటగా కనిపిస్తే పెళ్ళి చేస్తామని భయపెడుతున్నాం. కనీసం అలా అయినా ఆ ఒక్క రోజు దూరంగా ఉంటారని. అంతేకానీ, ఇక్కడ ఏ ఒక్కరి స్వేచ్ఛను హరించే ఉద్దేశ్యం ఎవ్వరికీ లేదు. మిగతా రోజుల్లో పట్టించుకోకపోవడానికి కారణం అదే.

మీకోవిషయం తెలుసో లేదో, ఆరోజు భజరంగ్‌దళ్, VHP చేస్తున్న పనికి తల్లిదండ్రుల నుండి చక్కటి మద్ధతు లభిస్తున్నది. వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో.

జైహింద్.

(స్వగతం: కొంపదీసి నేనేమీ కెలకలేదు కదా :)) )

Vasu said...

"దుర్గం చెరువు వైపు పొరపాటున ఏ వీకెండో వెళితే... శివ శివా! సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లన్నీ అక్కడ కనపడతాయి. "

అసలే హైదరాబాద్ లో పార్కులు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఉన్న నాలుగూ కూడా వీటితో నిండిపోతే ఇక ఎక్కడికి వెళ్ళేది జనాలు? . ఇది కాక పార్క్ కి వెళ్తే (ఎవరయినా సరే) ఈ టైపు వాళ్ళే అని అనుకునే స్థితి కి పెరిగిపోతోంది ఈ చండాలం.

సుజాత వేల్పూరి said...

నాగప్రసాద్,

ఓ, అలా చెప్పరేం మరీ! "వాలెంటైన్స్ డే" అనే పేరుతో ప్రేమికుల రోజుని జరుపుకోకూడదు..అంతేగా వీళ్ల అభ్యంతరం? నేనింకా పైన టపాలో చెప్పినట్లుగా విచ్చలవిడిగా ప్రేమలు, తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్న అశీల సంస్కృతి పట్ల వీళ్లకేమైనా పట్టింపు ఉందేమో, వాళ్ళ ఆవేశం దానిగురించేమో అనుకున్నా! ఎందుకంటే వాలెంటైన్స్ డే రోజు ఈ హడావుడికి పాల్పడే కార్యకర్తలంతా మీడియా ఛానెళ్ళ కెమెరాల్లో మొహం పెట్టి "ఇది మన సంస్కృతి కాదు కాదు" అని గట్టిగా అరవడం చూశాను! అందువల్ల మన సంస్కృతిని గౌరవించే ప్రోగ్రామ్ ఏదైనా ఉందనుకుంటున్నా ఇన్నాళ్ళూ! ఆ ఒక్క పదం మీద వ్యతిరేకత తప్ప అశ్లీల సంస్కృతులూ, వీధిన పడ్డ ప్రేమికుల మీద వీళ్ళకెలాంటి అభ్యంతరం లేదన్నమాటే!

ఇక వీళ్ళతో వాదనలేముంటాయి. సంస్కృతీ పరిరక్షకులని ఇచ్చిన పేరుని వెనక్కి తీసుకుంటున్నా!

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్,
మీరిక శ్రీకాకుళం వైపు తొంగి చూస్తే నా మీదొట్టు! కొన్నాళ్ళై మీరు కూడా అలాగే తయారైపోతారేమో అని భయమేసేంతగా అనుకర్తిస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని! మీరు రాశారో, ఆయనే రాశాడో తెలుస్కోవడం కష్టంగా ఉంది.

శ్రీనివాస్ said...

ఇక శ్రీకాకుళం వైపు తొంగి చూడనని ఈ టపా సాక్షిగా ఒట్టేస్తున్నా

Kathi Mahesh Kumar said...

ఈ కోతిమూకల కుప్పిగంతులు మీడియా అటెన్షన్తో కొంత ప్రచారం కల్పించుకోవడానికితప్ప మరొకటి కాదు. ప్రేమికులరోజు ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అయితే వీళ్ళది రాజకీయ గిమ్మిక్ అంతే!

ప్రేమికుల రోజులూ, న్యూయియర్లూ సంస్కృతికి విరుద్ధం అని మాట్లాడేవాళ్ళకు మన all assimilative సంస్కృతి గురించి ఏమాత్రంఅవగాహన లేదు అనేది మాత్రం ఖరాఖండిగా చెప్పొచ్చు.

Sandeep P said...

"కర్ణుడి మరణానికి ఉన్నన్ని కారణాలు ఉన్నాయి", "మురుగుకాలవ మీదుగా మలయమారుతం" - చక్కటి ఉపమానాలు!

krishna said...

మురుక్కాలవ మీదనుంచి వచ్చే మలయ మారుతం ఆస్వాదించాలనుకుంటే :-)
హహహ్హ!!! బాగుందండీ! కానీ మనం ఎప్పుడు వ్యక్తి స్వాతంత్రం ని గౌరవించడం నేర్చుకుంటామో? ఈ విషయం లోనె కాదు in general gaa చెబుతున్నా.

krishna said...

"మురుక్కాలవ మీదనుంచి వచ్చే మలయ మారుతం ఆస్వాదించాలనుకుంటే ......"
హహహ్హ!!! బాగుందండీ! కానీ మనం ఎప్పుడు వ్యక్తి స్వాతంత్రం ని గౌరవించడం నేర్చుకుంటామో? ఈ విషయం లోనె కాదు in general gaa చెబుతున్నా.

తెలుగు వెబ్ మీడియా said...

వాలెంటిన్స్ డే గురించి కెక్యూబ్ వర్మ గారి అభిప్రాయాలు కూడా చదవండి http://blogzine.sahityaavalokanam.gen.in/2010/02/blog-post_1838.html He is not against love but he don't believe in valentines day.

trk said...

"వేప మండలకు బదులుగా యాంటీ బయాటిక్ " అనే సలహా బావుంది.
కానీ...ఆ 'యాంటీ బయాటిక్' ఏవిటో కాస్త వివరిస్తే ఇంకా బావుండేది.

ఏది బాలేదో మాత్రమే కాకుండా, ఎలాగైతే ఇంకా బావుండేదో చెప్తే అది సద్విమర్శ అవుతుంది.

రఘు

సుజాత వేల్పూరి said...

"ఇదీ మన సంస్కృతి గొప్పదనం"అని యువతరానికి తెలియజెప్పే కార్యాచరణ ప్రణాళిక ఏనాడైనా చేపట్టారా మీరు?

భారతీయ సంస్కృతి లో శీలానికెంత (శీలమంటే సత్ప్రవర్తన అని అర్థం చేసుకోండి దయచేసి) ప్రాముఖ్యం ఉందో కాలేజీల్లోనూ,యువత ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ చాటే కార్యక్రమం ఏదైనా ఇంతవరకూ అమలు చేశారా?ఇకముందు చేసే ప్లాను ఏదైనా ఉందా?...

రఘు గారూ,
టపాలో పై భాగం చదివారా? సంస్కృతీ పరిరక్షకుల్ని అడిగిన ప్రశ్నల్లోనే వాడవలసిన యాంటీ బయాటిక్ ఏమిటో ఉందిగా? అలాగైతే బావుంటుందని నా ఉద్దేశం కాబట్టే ఆ ప్రశ్నలు అడిగాను.

trk said...

సుజాత గారూ,

" 'ఇదీ మన సంస్కృతి గొప్పదనం' అని యువతరానికి తెలియజెప్పే కార్యాచరణ ప్రణాళిక ఏనాడైనా చేపట్టారా మీరు?

భారతీయ సంస్కృతి లో శీలానికెంత ప్రాముఖ్యం ఉందో కాలేజీల్లోనూ,యువత ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ చాటే కార్యక్రమం ఏదైనా ఇంతవరకూ అమలు చేశారా?ఇకముందు చేసే ప్లాను ఏదైనా ఉందా?..."

అంటూ ... సలహాల్ని కూడా ప్రశ్నా రూపంలో ఎవరినో విమర్శిస్తున్నామే గాని ఆ పని మనమే ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించు కొని ఆ దిశలో కొన్ని అడుగులు వేస్తే బావుంటుందేమో.

ఏ మంచి ఉద్దేశ్యంతో ఓ పని చేస్తున్నా...చేసే పనిలో తప్పు వెదికి ఉద్దేశ్యపు స్పూర్తినే దెబ్బతీసే విమర్షలు చాలా మంది చేయగలరు. ఎందుకంటే, ఏ మంచి పనైనా ద్రుక్కోణం మార్చి, చెడ్డపనిగానో లేక పిచ్చి పని గానో చూపించడం సాధ్యమే.

ఉద్దెశ్యం బావున్నా, చేసే పనిలో లోపాలున్నాయని ఓ రాయి వేసే బదులు ఏ పనైతే బావుంటుంది అని భావిస్తున్నామో అందులో మనమూ నిర్మాణాత్మకంగా ఓ చేయి వేస్తే ఇంకా బావుంటుందేమో.

- రఘు

సుజాత వేల్పూరి said...

రఘు గారూ,
నాకు చేతనైనంతలో సమాజ సేవలో, ఆరోగ్యకర సంస్కృతిని పరిరక్షించడంలో నా వంతు కృషి నేనెపుడూ చేస్తూనే ఉంటాను. దానికి ప్రచారం అవసరం లేదని నా అభిప్రాయం.
(కాకపోతే "సంస్కృతి" ముసుగులో మనసులో ఒకటి పెట్టుకుని పైకి "అందరికీ ఆమోదయోగ్యమైన" కబుర్లు చెప్పడం నా వల్ల కాని పని!) ఎందుకంటే నాది వ్యక్తిగత స్థాయి కాబట్టి!

కానీ వీళ్ళు? సంస్కృతి పరిరక్షణను తమ భుజ స్కంధాల మీదికి ఎత్తుకున్నట్టు నటిస్తూ అందుకు సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇది వ్యక్తి గతం కాదు. ఎప్పుడైతే అది సంఘం పరిధిలోకి వచ్చిందో అప్పుడు దాని కార్యకలాపాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది.

నిర్మాణాత్మకమైన పనుల్లో చేయూతనందించడానికి ఎప్పుడూ నేను సిద్ధమే కానీ ఏడాదికోసారి నిద్ర లేచే ఇటువంటి సంస్థలకు కాదు.

కౌటిల్య said...

సుజాత గారూ,
సతీష్ గారు చెప్పినట్టు,మన గుంటూరు విరుపు,ఘాటు బాగా తగిలించారు....బాగున్నయ్ రెండు వర్గాలవారికీ మీరు తగిలించిన చెణుకులు...

Nrahamthulla said...

పిల్లలు,గృహహింస వద్దనుకునే మహిళలు, అవివాహితలుగా ఉండాలనుకునే స్త్రీలు రానురాను పెరుగుతున్నారు.మహిళాబిల్లు పాసై స్త్రీలు పురోగతి సాధించేకొద్దీ మహిళల్లో బ్రహ్మచారిణులు ఇంకా పెరగొచ్చు.పురుషునిలాగానే స్త్రీ కూడా ఒంటరిగా బ్రహ్మచారిణిగా ఈ సమాజంలో మనమధ్యే ఉండకూడదనే చట్టాలు ఏమీలేవు.పెళ్ళికిముందే శృంగారం,సహజీవనం నేరం కానప్పుడు స్త్రీ ఒంటరిగా బ్రతకాలనుకోవటం నేరమా?

Post a Comment