April 24, 2010

యమకూపం (అను వేశ్యావాటిక) పరిచయం..!(yama the pit)ఈ మధ్య ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కధ పుస్తకం మీద ఆంధ్ర జ్యోతిలో రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ.హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో చదివాను.ఆ నేపధ్యంలో ఈ "యమకూపం" నవల గురించి రాయాలనిపించింది.


వ్యభిచారంలో దిగిన స్త్రీలంతా దాన్ని వృత్తిగానే భావించినా అది గత్యంతరం లేని పరిస్థితుల్లోనో, లేక హైటెక్ వ్యభిచారమైతే పని చేయడానికి ఒళ్ళు వంగకో, విలాసాలకోసమో చేస్తారు తప్పించి ఎవరూ సంతోషంతోనో "ప్రేమ పూర్వకంగానో" చేయరు!సరే, ఇక్కడ ఆ విషయాన్ని చర్చించడానిక్కాదు ఇది మొదలెట్టింది.


ఒక వేశ్యావాటికలోని జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు వర్ణించే రష్యన్ నవల "యమకూపం" గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాద్దామని!

రష్యాలో జట్కా బండ్లవాళ్ళు, ఇతర దిగువ తరగతి జనం విచ్చలవిడిగా సంచరించే ఒక ప్రదేశం పేరు "యామ్ స్కాయా స్లోబోడా". దీన్ని క్లుప్తంగా "యామా" అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉన్న ఒక వేశ్యా వాటిక గురించి రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన మహత్తర నవల "yama the pit! దీన్ని తెలుగులోకి 110% సరిపోయేలా "యమ కూపం" పేరు పెట్టి అనువదించిన వారు శ్రీ రెంటాల గోపాల కృష్ణ గారు. వీరి  అనువాదాలు నాకు చాలా చాలా ఇష్టం.

ఈ నవల మొదటిసారి 1904లో వెలువడినపుడు రష్యాలో పెద్ద సంక్షోభం బయలుదేరింది.జార్ ప్రభుత్వం భయంతో వణికి చచ్చి,కుప్రిన్ మీద, అతని రచనల మీదా విరుచుకుపడింది.కుప్రిన్ ఈ రచన ద్వారా యువకుల మనసులో విషం గుమ్మరిస్తున్నాడని  నిప్పులు కురిపిస్తూ,ప్రచురణాలయం మీద కూడా దాడులు చేసి ప్రతులను తగలబెట్టించింది. అవును, నిజం నిప్పులాంటిది కదూ మరి, మొహం పగలగొట్టినట్లు చూపిస్తే ఎదుర్కోవడం కష్టమే!స్త్రీ జాతి నైతికంగా పతనమైతే జాతి యావత్తూ ఎంత ఘోర విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో ఇందులో కుప్రిన్ చూపిస్తాడు.వ్యభిచారం ఎంత నీచమైనదో, దానివల్ల ఎంత తీవ్ర సమస్యలు తలెత్తుతాయో,జీవితాలు ఎలా సర్వ నాశనమవుతాయో కుప్రిన్ అద్భుతంగా చిత్రీకరించాడు.
రష్యన్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. దీన్నొక బూతు పుస్తకంగా అభివర్ణించింది.

కానీ ఈ నవల అప్పటికే ప్రజల చేతుల్లో పడింది.అక్కడినుంచి దేశ దేశాంతరాలకూ వ్యాప్తి  చెందింది. ప్రపంచం నలుమూలల నుంచీ అనేకమంది పండిత పామరుల ప్రశంసలూ,విమర్శలు పొందింది. స్వయంగా అనేకమంది వేశ్యలు తమ దుర్భర జీవితాల్లోని విషాదాన్ని గుర్తించినందుకు పదే పదే కృతజ్ఞతలు తెల్పుతూ కుప్రిన్ కు ఉత్తరాలు రాశారు.1929 నాటికి ఈ నవల 20 ఇతర భాషల్లోకి అనువదితమై 30 లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి కూడా!

ఇందులో ప్రధానంగా నడిచే కథేమీ ఉండదు. యామా లో ఉండే మూడు ప్రధాన వేశ్యా కేంద్రాల్లో మధ్య రకం దాన్ని ఎన్నుకుని అక్కడి స్త్రీల దుర్భర జీవితాన్నీ, వాళ్ళు నిత్యం పడే హింసల్నీ,ఆ జీవితం తాలూకు విషాదాన్ని ప్రపంచ పాఠకులకు అందించే ఉద్దేశంతో కుప్రిన్ ఈ అంశాన్ని ఎన్నుకున్నాడు.
"అన్నా మార్కోవ్ నా" నడుపుతోన్న ఈ వేశ్యా వాటికలో ఉండే వేశ్యలు ల్యూబా,జెన్నీ,పాషా,టమారా,జోయా,న్యూరా, చిన్న మంకా, పెద్ద మంకా,నైనా, ఫెక్లూహ్షా వీళ్ళంతా అనేక దుర్భర పరిస్థితుల్లో గత్యంతరం లేక అక్కడికి చేరి గడుపుతున్నవారే!పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచి తయారవడం.. వారికోసం వచ్చే మనుషుల్ని తృప్తి పరచి పంపడం..ఇదే వారి పని!

వారి నిత్య జీవితం! వీరిలో కొందర్ని తల్లిదండ్రులే దరిద్రాన్ని తట్టుకోలేక అమ్మేశారు.మరికొందరు ఎవరూ లేని అనాధలై సమాజంలో రక్షణ లేక ఇక్కడికొచ్చి చిక్కినవారు.

ప్రతి ఒక్కరి వెనుకా ఒక విషాద గాధ! వీరిలో ఒకమ్మాయి కి ఒక ప్రేమికుడు ఉంటాడు.ఇద్దరూ అనేకకారణాల వల్ల పెళ్ళి చేసుకోలేకపోతారు. ఆమె ఇక్కడ చేరుతుంది..కేవలం పొట్టపోసుకోడానికి!

ఆ ప్రేమికుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడూ వచ్చి ఈమెను చూసి కాసేపు దుఃఖ పడి వెళ్ళిపోతాడు.ఒకసారి ఒక విద్యార్థుల గుంపు సరదాగా ఈ వేశ్యావాటికకు వస్తారు. వారిలో లిఖోనిన్ అనే కుర్రాడు అ వేశ్యా జీవితాలు చూసి చలించిపోతాడు.  ఈ సందర్భంగా అతడు అక్కడ ఉన్న ఒక జర్నలిస్టు తో  జరిపే సంభాషణ ఈ నవలకు ప్రాణం వంటిది. ప్లాటోనోవ్ అనే ఆ జర్నలిస్టు వేశ్యల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, వారి ప్రమేయం లేకుండానే అవి ఎలా కొద్ది కొద్దిగా నాశనమై పోతాయో, చివరికి శక్తి ఉడిగిపోయాక వారి జీవితాలు ఎంత విషాద కరంగా వీధుల పాలై ముగుస్తాయో కళ్ళు చెమర్చేలా వివరిస్తాడు."వీరి జీవితంలోని భయంకరమైన నగ్న సత్యం ఇక్కడికి నన్ను ఆకర్షించింది.సత్యాన్ని దాచే ముసుగు లేదిక్కడ!అబద్ధం, ఆడంబరం, మోసం, డంబాచారం వీటికి ఇక్కడ తావు లేదు.వీరి బతుకుల్లో భ్రాంతి,పటాటోపం లేవు."నేనొక పడుపు కత్తెను.అందరికీ ఉపయోగకరమైన పాత్రను.నగరంలోని భోగాసక్తిని తీర్చడానికి దాచిపెట్టబడిన వస్తువును. రండి, సంతృప్తిగా తిరిగివెళ్లండి.కానీ ఇందుకు బదులుగా మీరు నాకివ్వవలసినవేవో తెలుసా! డబ్బు, జబ్బు, అవమానం, హింస"అంటుంది ప్రతి వేశ్య! ..


ప్లాటోనోవ్ మాటలు విన్న లిఖోనిన్ ఇంకా ఆలోచిస్తూ ఇలా అడుగుతాడు "అసలు ఈ వృత్తి ఎందుకొచ్చింది? దీనికి అంతు ఉందా?ఇది తరతరాల నుంచి వస్తోన్న సత్యమా? మానవులు అంతమైనపుడే ఇదీ నశిస్తుందా?"

దానికి ప్లాటోనొవ్  "ఇది ఎప్పుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరు.కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందమైన కలలు కంటున్నారు(ఇక్కడ అతని మాటల్లో వ్యంగ్యం గమనించాలి)!వారి కలలు నిజమైనపుడే ఇది అంతమవుతుందేమో! ఈ ప్రపంచం ఏ ఒక్కరిది మాత్రమే కాక అందరూ సమాన హక్కుతో అనుభవించినపుడు కూడా ఇది అంతం కావొచ్చు!ప్రేమ అనేది అందరికీ కోరినంతగా దొరికినపుడు,లేక మానవుడు యోగియై, మహర్షియై, దిగంబరుడై పాప రహితుడై పవిత్రుడైనపుడు ఇది నశిస్తుంది"అని నిర్వేదంగా చెప్తాడు.లిఖోనిన్ చలించి పోయి అక్కడ ఉన్న ఒక వేశ్యను విముక్తురాలిని చేసి గౌరవనీయమైన జీవితాన్నివ్వాలనుకుంటాడు. వెంట తీసుకెళతాడు కూడా !.కానీ మిత్రుల నుంచి, ఇరుగుపొరుగువారి నుంచి ఎదురయ్యే అవహేళనను భరించడం కష్టంగా తోస్తుంది.చివరికామెను వదిలించుకోవాలనే ప్రయత్నంలో అబద్ధమని తెలిసినా తన మిత్రుడికీ, ల్యూబాకు సంబంధం అంటగట్టి ఆమెను వీధిలోకి గెంటేస్తాడు.

ఆదర్శం పటాటోపం ఇదీ!

ల్యూబా అనేక రకాలుగా గౌరవంగా బతికేందుకు ప్రయత్నించి వీలుపడక తిరిగి వేశ్యావాటికకే వచ్చి అన్నా కాళ్ళమీద పడుతుంది.ఎంత హీనమో చూడండి!


ఇలా ప్రతి ఒక్క జీవితమూ మురుక్కాలువ లాగే ఉంటుందిక్కడ! ఏ ఒక్కరి జీవితంలోనూ సంతోషం, నవ్వు, ప్రశాంతత అనే మాటే ఉండదు.జెన్నీకి ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధి పట్టుకుంటుంది.ఆమె మగాళ్లమీద కసితో తన వ్యాధిని దాచి ఎంతోమందికి సంక్రమింపజేస్తుంది. ఒకరోజు పరీక్షల కోసం డాక్టర్ వస్తున్నాడని తెల్సి బయటపడటం ఇష్టంలేక ఉరేసుకుంటుంది.

22 ఏళ్ల జెన్నీ! కాస్తో కూస్తో చదువుకున్న జెన్నీ చరిత్ర అలా ముగుస్తుంది.

వృత్తిలో మానియాక్ లా ప్రవర్తించే పాషాకు పిచ్చెక్కడంతో ఆమెను జైల్లో పడేస్తారు.టమారా ఎవరినో మోసం చేయబోయి జైలుపాలవుతుంది. అక్కడ అందరి జీవితాలూ ఇలాగే ముగుస్తాయి.సోల్జర్ల గొడవల్లో చిక్కి  వేశ్యావాటికలు వీధుల్లో పడి వేశ్యలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా అయి మురికి చావుల పాలవుతారు.

చివరికి కొన్నాళ్ళకు యామా అనే పేరు కూడా లేకుండా పోతుంది.


ఈ నవల్లో వేశ్యా గృహాల్లో ఉన్న పరిస్థితుల్ని వాతావరణాన్ని కుప్రిన్ ఎలా వర్ణిస్తాడంటే ఒక్కోచోట వాంతొచ్చినంత పనవుతుంది.పగలంతా మర్యాదస్తుల  మల్లే మసిలే కొందరు చీకటిపడగానే యామా వైపు పరుగులు తీయడాన్ని కుప్రిన్ గేలి చేస్తాడు.

ఒకసారి ఈ వృత్తి లోకి అతి నీచ కారణాల వల్లో, గతిలోకో ప్రవేశించిన వారు ఇక మామూలు జీవితంలొకి రావడానికి ఇష్టపడరనే సత్యం ఈ నవల్లో కనపడుతుంది. మామూలు మనుషుల్లో కలవడానికి వీరు చిన్నతనం ఫీలవుతారు.

వీరి జీవితం నిండా పేదరికం, నిరాదరణ,ప్రేమ రాహిత్యం,తాగుడు, తిట్లు, కొట్లాటలు, రోగాలు,హింస, చివరికి వృద్ధాప్యంలో దిక్కులేని చావులు!

ఇంత హృదయ విదారకమైన నవల ఇంతకు ముందు చదవలేదు.గౌరవనీయంగా పని చేసుకుని బతకగలిగే అవకాశం ఏ మాత్రమున్నా స్త్రీలు ఇటువంటి వృత్తిలోకి రావడానికి ఇష్టపడరని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ గోతి లోకి దిగుతారనీ రచయిత ఇందులోని పాత్రల ద్వారా చూపిస్తాడు.


ఇది అందరూ ఎరిగిన సత్యమే! ఎందరు ఆత్మ కథలు రాసినా ఇదొక వృత్తనీ, వారికి హక్కులుండాలనీ వాదించినా, "మాకు కావలసింది మీ, జాలి దయ కాదు, మమ్మల్ని అర్థం చేసుకోండి"అని డిమాండ్ చేసినా వీరి జీవితాల గురించి తెల్సిన తర్వాత వారికి దొరికేవి అవే..జాలి, దయ!


ఈ మధ్య స్వాతి వార పత్రికలో వంశీ దిగువ గోదావరి కథల శీర్షిక కింద "వాసంతి"అనే నటి గురించి రాస్తూ వాసంతి జీవితాన్ని పరిశీలిస్తుంటే "యామా ది పిట్" నవల గుర్తొచ్చిందని రాశాడు.

ఇతర భాషా నవలలు పాఠకులకు సరైన రీతిలో చేరాలంటే అనువాదం అద్భుతంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ నవల అటువంటి అద్భుత అనువాదంతోనే తెలుగులోకి వచ్చింది. స్వర్గీయ రెంటాల గోపాల కృష్ణగారు అనేక ఉద్వేగ భరిత సన్నివేశాల్ని, వేశ్యల మనసులోని దుఃఖాన్ని సైతం ఎంతో చక్కగా(ఇంతకంటే ఇక్కడ ఏం మాటవాడాలో తెలీడంలేదు) అనువదించారు. రోగాల పాలై ఆత్మహత్యకు సిద్ధమైన జెన్నీ అంతరంగాన్నీ,ల్యూబా అమాయకత్వాన్ని, పోలీసుల దుర్మార్గాన్నీ, యజమానుల దయా రాహిత్యాన్నీ..ఇలా చదువుతున్నంత సేపూ యామా కళ్ళ ముందే కనపడేంత ప్రతిభావంతమైన అనువాదం.


ఈ నవల తెలుగు అనువాదం మూడో ముద్రణ 1979లో ఆదర్శ గ్రంథ  మండలి విజయవాడ వారు వేసిన కాపీ నా వద్ద ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు.

ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉంటే మాత్రం తప్పక చదవండి!

30 comments:

neelaanchala said...

చాలా రోజులైంది మీ బ్లాగ్ చూసి! అద్భుతమైన పరిచయం! ఈ నవల ఎక్కడా దొరికే పరిస్థితి లేకపోతే ఎలా? కనీసం ప్రభుత్వ లైబ్రరీల్లోనైనా దొరుకుతుందని ఆశించవచ్చా! అర్జెంట్ గా దొరికితే బాగుండనిపిస్తోంది.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాగా రాశారు.నవలని ఇప్పటికిప్పుడు చదవాలనిపించేలా.ప్రయత్నిస్తాను ఎక్కడైనా దొరుకుతుందేమో.

sujatha said...

ఇలాంటి అద్భుతమైన, అలభ్య మైన పుస్తకం గురించి రాస్తే ఎలాగండీ? ఇలా చేస్తే నా ఒసురు..సారీ ఉసురు మీకు తగులుతుంది తప్పక! I hate you! Bye forever

మార్తాండ సూర్య సేన వర్మ said...

కాసేపట్లో కలకత్తా లో వేశ్యా వాటిక దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా ఒక కామెంట్ రావాలే ఇంకా రాలేదేంటబ్బా

Kalpana Rentala said...

సుజాత,
నాకు,మీకూ, ఇంకా చాలా చాలా మందికి నచ్చిన పుస్తకం ఇది. మా నాన్నా గారి అనువాదం మీకు నచ్చటం సంతోషం గా అనిపించింది. యమకూపం అనేకానేక ముద్రణలు జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా కాపీలు మిగలవు..
ఆల్రెడీ ఇద్దరో ముగ్గురో ఆ పుస్తకం వేస్తామని అడుగుతున్నారు కానీ మేమే సొంతంగా ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాము. . మీ దగ్గరున్న కాపీ అవసరమైతే తీసుకొని మళ్ళీ మీకు వెనక్కు జాగ్రత్త గా అందించేస్తాము. ఏమంటారు?
మీ పుస్తక పరిచయం బావుంది.
ధన్యవాదాలు
కల్పనారెంటాల

Kalpana Rentala said...

సుజాత,
నాకు,మీకూ, ఇంకా చాలా చాలా మందికి నచ్చిన పుస్తకం ఇది. మా నాన్నా గారి అనువాదం మీకు నచ్చటం సంతోషం గా అనిపించింది. యమకూపం అనేకానేక ముద్రణలు జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా కాపీలు మిగలవు..
ఆల్రెడీ ఇద్దరో ముగ్గురో ఆ పుస్తకం వేస్తామని అడుగుతున్నారు కానీ మేమే సొంతంగా ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాము. . మీ దగ్గరున్న కాపీ అవసరమైతే తీసుకొని మళ్ళీ మీకు వెనక్కు జాగ్రత్త గా అందించేస్తాము. ఏమంటారు?
మీ పుస్తక పరిచయం బావుంది.
ధన్యవాదాలు
కల్పనారెంటాల

సుజాత said...

ఇంగ్లీషు సుజాత గారూ,
మీ కామెంట్లో చివరి భాగం ఎక్కడో చదివినట్లుగా ఉంది నాకు!;-)

మార్తాండ సూర్య సేన వర్మ గారూ,
నేనూ ఎదురు చూస్తున్నాను!:-))

కల్పనా,
అవునండీ, గోపాల కృష్ణ గారి అనువాదం వల్లనే ఈ నవల ఇంత ఆదరాభిమానాలు పొందిందని అనిపిస్తుంది నాకు.మీ నాన్నగారు బాలజ్యోతి లో రాసిన "బొమ్మలు చెప్పిన కథలు" నాకు అప్పట్లో భలే ప్రాణంగా ఉండేవి.

మీరే వేస్తే తప్పక పుస్తకం ఇస్తాను...కనీసం ఫొటోస్టాట్ తీయించి అయినా సరే! ఎందుకంటే నా పోస్టు చూసాక ఇప్పటికే నాకు రెండు ఫోన్లు వచ్చాయి ఈ పుస్తకం కావాలని.

థాంక్యూ!

Anwar said...

నీలాంచల గారికి మీరు వుండేది హైద్రాబాద్లొ గనక అయితే బాగ్ లింగంపల్లి లొ మేడ మీద వొ లైబ్రరి లొ వుండేది (ఇదంతా 15 సంవత్సరాల క్రితం సంగతి , దేవుదు చల్లగా చూస్తే అది ఇంక వుండి వుండవచ్చు) ప్రధానంగా కనబడే రాక్ ల వంక కాక చిట్టచివరి రాక్ ల వెనుక గుట్టల కింద ఈ క్లాసిక్ ని దీనితొ పాటే వర్షపు నీటి రంగులొకి మారిపొయిన కొన్ని మహాద్భుత పుస్తకాలు చదివే అవకాశం దొరికింది. ఇక్కడ వొక సారి ప్రయత్నించండి .

krishna said...

సుజాత గారు!మీ పుస్తక పరిచయం బాగుంది.ఇంత మంచి పుస్తకాల గురించి మీకు ఎలా తెలుస్తుందండి?రచయత గారి పేరు ప్రఖ్యాతుల వలన?లేక ఆ పుస్తక ప్రాచుర్యం వలనా?నాకు మంచి పుస్తకాలు చదవాలని కోరిక.కాని ప్రముఖ(ఖుల) పుస్తకాలు తెలియవు.కొన్ని మంచి పుస్తకాలు ప్రారంభం లో బాగోక వదిలివేసే వాడిని,తరువాత ఎప్పుడో తిరిగి చదివి ఎంత మంచి పుస్తకం మిస్సయ్యెవాడిని అని నాలుక కరుచుకుంటాను.నా స్నేహితులలో బంధు వర్గాలలో చదివే అలవాటు వున్నవారు తక్కువ.ఏమన్నా వేదికలు వుంటే చెప్పగలరా?మీ బ్లాగు ఒక్కటె నాకు తెలుసు మంచి పుస్తకాల పరిచయ వేదిక గా!
పిల్లకాకి ఉరఫ్ కృష్ణ.

అబ్రకదబ్ర said...

మీకు పుస్తకాలు చదవటం తప్ప వేరే పనేం ఉండదా? ఇన్నిన్ని పుస్తకాలెలా చదువుతారు?

bphanibabu said...

The English version is available at

http://www.online-literature.com/kuprin/yama-(the-pit)/40/

అప్నా @ అలలప్రపంచం said...

ఊ ఊ తొండి తొండి
ఇలా అన్నీ గుర్తు పెట్టేసుకుంటే ఎలా చెప్పండి


bye forever

సృజన said...

మీ పుస్తక పరిచయం బాగుంది సుజాతగారు!

nomi said...

we are unable to see your post on AATA JUNIORS.

సుజాత said...

@nomi,
I did not publish it, as I felt its "incomplete"! Let the decicion come form HRC, then I will complete it and publish it.

సుజాత said...

కృష్ణ గారూ,
కనపడిన ప్రతి పుస్తకమూ చదువుతూ పోవడం వల్ల కొన్ని మంచి పుస్తకాలు పరిచయమయ్యాయి. ముఖ్యంగా పాత పుస్తకాలు ఎక్కడ కనపడినా విడవకుండా చదవాలండీ!నా బ్లాగు లో వీలైనంత వరకూ మంచి పుస్తకాలను పరిచయం చేయాలనే నా కోరిక. థాంక్యూ! పుస్తకం.నెట్ కూడా చూడండి.

అబ్రకదబ్ర,
మీకు పుస్తకాలు చదవటం తప్ప వేరే పనేం ఉండదా?...చాలా పన్లుంటాయి.నిజం చెప్పాలంటే చాలా చాలా బిజీగా ఉంటాను. అయినా ఏ పనైనా సరే చేస్తూ పుస్తకాలు చదువుతాను. అందుకే ఎక్కువ పుస్తకాలే చదవగలుగుతాను.

ఫణిగాబు గారూ,
ఇంగ్లీష్ వెర్షన్ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

వేణుగారూ,
గోపాల కృష్ణ గారు జీవించి ఉన్న రోజుల్లో విజయవాడలొ మీరు ఉండి కూడా కలుసుకోకపోవడం ఏమీ బాగా లేదు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Srujana,
థాంక్యూ,

Ruth said...

సుజాత గారు, చాలా మంచి పరిచయం రాసారు. కుప్రిన్ రాసిన "రాళ్ళ వంకీ" నా దగ్గర ఉంది.ఇందులో కథలన్నీ ఆణిముత్యాలే! అతని కథావస్తువులన్నీ, తను నిజంగా చూసి అనుభవించినవే, అందుకే అవి అంత జీవంతో తొణికిసలాడుతూ ఉంటాయి. ఈ పుస్తకం చదవాలని ఉంది కాని దొరకాలి కదా!
@ ఇంగ్లీష్ లింక్ ఇచ్చిన వారు, అవునండీ చాలా రష్యన్ పుస్తకాలు, కాపీరైట్స్ ఐపోయినవి అనుకుంటా, నెట్లో ఇంగ్లీష్ లో దొరుకుతాయి కాని, ఒకసారి తెలుగులో చదివాక (అనువాదపు గొప్పతనం వల్ల) ఇంగ్లీష్లో చదవాలని అనిపించదు, ప్చ్!
ఏదేమైనా, రష్యన్ కవులు పుస్తకాలు రాసి ఎంత సాహిత్య సేవ చేసారో, వాటిని అద్భుతమైన తెలుగులో మనకు అందించి అనువాదకులు అంత సేవా చేసారంటె అతిశయోక్తి కాదేమో. నా దగ్గర ఉన్న రష్యన్-తెలుగు పుస్తకాలన్నింటినీ నేను మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాను. ఇంతకూ ఇంత విలువైన పుస్తకాలు నేను వాటి విలువ అంతగా తెలీని రోజుల్లో (అంటె స్కూల్ రోజుల్లో) కొనుక్కున్నదెందుకో తెలుసా? అప్పట్లో, అవే నా బడ్జెట్లో వచ్చేవి మరి :) !!!

గీతాచార్య said...

Gr8 post this is... ఎక్కడ దొరుకుతుంది?

Raj said...

how about scanning the book and providing us a link???? :)

nAA daGGara Scanner undhi...
pustakam naaKu kUda istaara???

గీతాచార్య said...

Unfortunately I read the english version right after commenting here after some hard research. And then I wrote about it in Buzz...

Yama - The Pit.

Hmm, ఆ నరకాన్ని సాగదియ్యలేక రెండొందలపేజీల పుస్తకాన్నీ, (ఈటెక్స్ట్) ఆరు గంటల్లో చదివేశాను. దేవుడా! పగవాడికి కూడా ఆ బాధ వద్దు. అందులోని కష్టాలు. బాబోయ్. చదివినంత సేపూ, ప్రొట్రాక్టర్ని ఆవకాయలో ముంచి వళ్ళంతా ్పొడిచినట్టనిపించింది

యాతన పడైనా సరే చదవాల్సిన పుస్తకం. Written brutally, brilliantly, and in a gruesome manner.

పుస్తక పరిచయం ఇక్కడ...

http://manishi-manasulomaata.blogspot.com/2010/04/yama-pit.html

ఆంగ్ల పుస్తకం. డౌన్లోడ్ B&G లో పెట్టాను. తెలుగు దొరకటం లేదు

మనసులో మాట: యమకూపం (అను వేశ్యావాటిక) పరిచయం..!(yama the pit)

సుజాత said...

@Ruth,
మీరు చాలా అదృష్టవంతులు!ఆ నాటి రష్యన్ నవలలు బడ్జెట్ పరంగా ఎంతో చవక. ఇప్పుడు డబ్బుండి కొందామన్నా, అవి దొరకవు. మీరు చక్కగా కొనేసుకున్నారు.

రాళ్లవంకీ నా వద్దా ఉంది.యమకూపం మీరు చదవాలనుకుంటే నేను ఇస్తాను(మీరు హైద్రాబాదులో ఉంటే)

@Raj..,
మీక్కూడా ఇస్తాను మీరు హైద్రాబాదులో ఉంటే!మంచి పుస్తకాలు నలుగురితో పంచుకోవడం నాకెంతో ఇష్టమైన పని!

గీతాచార్య,
ఇక మీకు తెలుగు వెర్షన్ అక్కర్లేదనుకుంటాను. కావాలంటే కూడా ఓకే!

venkat said...

ఉక్రేయిన్ జానపద గాథలు అని ఒక పేద్ద పుస్తకం చిన్నప్పుడు చదివాను మా స్కూల్ లైబ్రరి లో, ఈ పుస్తకం బయట ఎక్కడైనా దొరుకుతుందా?

Sujatha gaaru seems u got huge collection can u help me??

Ruth said...

చాలా థాంక్స్ సుజాత గారు, నేను ఉండేది మీకు దగ్గరలోనే అనుకుంటున్నాను (మీరు గచ్చిబౌలి ఏరియాలో ఉంటారేమో కదా? నేను ఉండేది లింగంపల్లి). మిమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను.
@ వెంకట్ గారు, మీరు చెప్పేది యెర్ర అట్ట ఉన్న పెద్ద పుస్తకమేనా? ఐతే అది నాదగ్గర ఉందోచ్ !

గీతాచార్య said...

రూత్ గారూ, అమ్దులో రైతు కొడుకు ఇవాన్ కథ ఉందా?

సుజాత said...

వెంకట్ గారు,
ఉక్రెయిన్ జానపద గాథల పుస్తకం ఇప్పుడు మార్కెట్లో దొరకడం లేదు. విశాలాంధ్ర అన్ని బ్రాంచ్ లూ వెదికాను. మిత్రులెవరిదగ్గరన్నా ఉందేమో తెలీదు.

రూత్, తప్పకుండా మీకు పుస్తకం ఇస్తాను.
రాజ్ గారూ, మీ మెయిలైడీ జాగ్రత్త చేశాను. పుస్తకం ఫొటోస్టాట్ కాపీలు రాగానే మీకు తెలియజేస్తాను.

s.Aditya said...

ఎప్పుడో కాలేజీలో చేరిన కొత్తలో సుందరయ్య భవన్లో దొరికిన పుస్తకం.. అప్పటికే కొన్ని రష్యన్ అనువాదాలు చదివి వుండటం వల్ల, మార్కిజం వల్ల చదివిన పుస్తకం. చాలా మంచి పుస్తకం, అప్పటికి ఈ బ్లాగులు అవీ లేవు. చాలా రోజులు తర్వాత మళ్లీ, ఈ రచన గురించి చదివాను. కుప్రిన్ రాసిన ఈ నవలలో, ట్రేప్పెల్స్ లోని కష్టాలతో పాటు, మనిషి జీవితాన్ని, ఆలోచనల్ని చక్కగా చెప్పాడు. జెన్నీ చనిపోయేముందు తను నమ్మకం ఉంచిన ఒకేఒక్క పురుషుడైన ప్రొఫెసర్ దగ్గరకు వచ్చినపుడు అతను చెప్పే మాటల్లో, రచయిత మేధాశక్తి తెలుస్తుంది, మనిషి అలోచల్ని ఎంతల గమనించాడో అనిపిస్తుంది.

ఇంక ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. రెంటాల గోపాలకృష్ణ గారి అనువాదం ఈ పుస్తకానికి మూలాధారం, కుప్రిన్ అభిప్రాయాలన్నీ అచ్చుగుద్దినట్లు రచన చేసారు. రెంటాల వారి రచనలతో పాటు, మీరు పుస్తక ప్రియులు కనుక "తెన్నేటి సూరి" గారి రచనలు కూడా చాలా బావుంటాయ్. మీకు కుదిరితే తప్పక చదవండి. ఇంకా ఇలాంటి మంచి పుస్తకాలను మరిన్ని పరిచయం చేస్తారని ఆశిస్తూ..

guru said...

where the book "yama the pit" is available. please give the adress or any contact number

Chowdary said...

ఈ పుస్తకం మొదటి సారి చూసినప్పుడు, లోపలి అట్టలో యమకూపం (యామా ద పిట్ కు తెలుగు అనువాదం) అని చదివినప్పుడు ఆ పేరు పెట్టినందుకే థ్రిల్లయిపోయా.
-- జంపాల చౌదరి

vishalandhra said...

ee pusthakam gurunchi vivarana chadhika aa puthakam chadavali anipisthudi, meera aa bhagyam kaliginchali

Anil Reddy said...

Kuprin "Yamakupam" [Anuvadam: Rentala Goprala krishna]is reprinted recently. Price:200/- and is avilable in NAVODAYA BOOK HOUSE, Kachiguda, Hyderabad. If u want to buy the book, please contact: 9247471361

Post a Comment