October 11, 2010
పాతికేళ్ళ క్రితమే తెలుగులో రోబో నవల !
మొత్తానికి ఈ వీకెండ్ రోబో చూసేశాం! సెకండాఫ్ బోరు కొట్టింది. ఏదో కార్టూను సినిమా చూస్తున్నట్లుంది.సంకీర్తన మాత్రం బాగా ఎంజాయ్ చేసి తన ఫాన్స్ లిస్టులోరజనీ కాంత్ ని చేర్చింది (ఫేవరిట్లకీ ఫాన్స్ కీ ఇంకా తేడా తెలీదు. అందుకే రజనీ నా ఫేవరిట్ అనడం తెలీక రజనీ నా ఫాన్ అంటుంది). ఈ సినిమా చూస్తుంటే నా మెదడు లోని జ్ఞాపకాల పొరల తెరలు అలా అలా పుస్తకం పేజీల్లా టప టప మని తెరుచుకుంటూ వేగంగా వెనక్కి ప్రయాణిస్తూ వెళ్లి వెళ్ళి ఒక చోట చటుక్కున ఆగిపోయాయి.
అవును, 1984లో! అప్పుడు నేను స్కూల్లో నాలుగో అయిదో శ్రద్ధగా చదువుతూ ఇంట్లో అంతకంటే శ్రద్ధగా నవలలు చదువుతుండేదాన్ని! ఆ రోజుల్లోనే ఆంధ్ర జ్యోతి వారపత్రికలో శ్రీ మైనంపాటి భాస్కర్ గారు "బుద్ధి జీవి" అనే సీరియల్ రాశారు, ఒక రోబో ప్రధానాంశంగా! సైన్స్ నేపథ్యంతో సూపర్ హిట్ అయిన నవల అది. నచ్చిన సీరియల్స్ ని పుస్తకాలు గా బైండ్లు చేయించే అలవాటు ఉన్న మా ఇంట్లో ఆ నవల ఆ తర్వాత చాలా రోజులు ఉంది. ఇప్పుడు రచయిత వద్ద తప్ప ఎక్కడా లేదు.
పుస్తకం మీకెలాగూ దొరకదు కాబట్టి కథంతా ఇక్కడ చదవాల్సిందే! గత్యంతరం లేదు మరి!:-))
కథా కాలం 2050 ప్రాంతం!
సంజీవ్ అనే సైంటిస్ట్ ని ఆయన తయారు చేసిన నరహరి అనే రోబో హత్య చేసి పారి పోయిందని మీడియాలో బ్రేకింగ్ న్యూసు వస్తుంది. ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేసే విషక్రిమిని తయారు చేస్తున్న జెనెటిక్ ఇంజనీర్ శోధన కూతురు అపురూప ఆ వార్తలు చూస్తూ "అమ్మో, అది ఎక్కడికి వెళ్ళుంటుంది" అని ఆశ్చర్యపోతుండగా సంజీవ్ గారి కొడుకు అజిత్ పోలీసులతో సహా వాళ్ళింటికే వచ్చి
"ఆ రోబో మీ అమ్మ ని కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానించాం. అందుకే వచ్చాం" అని అపురూపతో చెప్పి లాబ్ లోకి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ శోధన అపహరణకు గురైన ఆనవాళ్ళు కనిపిస్తాయి.
టీవీల్లో ప్రకటనలు..ఆ తప్పించుకు పోయిన రోబోట్ కి తనలాంటి వాటినే అసంఖ్యాక రోబోలను తయారు చేసి వినాశనానికి ఊపయోగించగల శక్తి కూడా ఉంది కాబట్టి వెంటనే దాని ఆచూకీ తెల్సిన వారు తెలియజేయాలని!
దానితో అజిత్, అపురూప శోధనను, నరహరిని వెదకడానికి రెక్కలున్న ఫ్లయింగ్ కారులో బయలుదేరతారు. దార్లో వాళ్ళకు ఫ్లయింగ్ సాసర్ కనిపిస్తుంది. దాని వెంటబడి పట్టుకునే ప్రయత్నంలో దారి తప్పి మెకానికా దేశం సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మనుషులంతా ఒకే రకంగా ఉంటారు.పేర్లకు బదులు నంబర్లుంటాయి. ఒకటో నంబర్ వాడు మిగతా వాళ్ళందరినీ క్లోనింగ్ ద్వారా వృద్ధి చేసి వాళ్ళకు సొంత ఆలోచనలేవీ లేకుండా చూస్తూ తన బానిసలుగా వాడుకుంటూ ఉంటాడు. అక్కడ వీళ్ళు చావు తప్పి ఎలాగో తప్పించుకుని పారిపోతారు.
ఇలా మరొక రెండు దేశాలు తప్పించుకుని వెళుతుండగా ఒక చోట,.... తప్పించుకు పారిపోయిన నరహరి వికృతాకారంతో ఎదురవుతుంది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా అది తప్పించుకుని కొండల్లోకి పారిపోతుంది. ఆ కొండ ఎక్కి ఇద్దరూ అటు దిగే సరికి వాళ్ళు ఎన్నడూ చూడని, ఊహించని దృశ్యం ఎదురవుతుంది. కొండల మధ్యలో నాగరికత వాసనలు అంటని ఒక బుల్లి అచ్చ తెలుగు పల్లెటూరు. వీళ్ళిద్దరినీ అంతా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
అక్కడ అందరికీ తల్లో నాలుకలా మెసలుతూ నరహరి! నరహరిని చంపబోతుండగా అందరూ అడ్డం పడి అజిత్ ని చీవాట్లు పెడతారు.
అప్పుడు నరహరి చెప్తాడు .."నేను మనిషినే! రోబో ని కాదు" అని!
ఒకసారి సైన్సు కాంఫరెన్స్ జరుగుతున్న హోటల్లో దానికి హాజరైన ఆరుగురు సైంటిస్టులు హోటల్ యజమాని మోహన్ కి స్నేహితులవుతారు. వాళ్ళు ఇద్దరు ప్లాస్టిక్ సర్జెన్లూ,ఒక హార్ట్ స్పెషలిస్టూ,ఒక జనరల్ ఫిజిషియనూ,ఒక రాబొటిక్స్ స్పెషలిస్టూ! ఆ రోజు రాత్రి హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మోహన్ ఎంతో శ్రమించి ఆ ఆరుగుర్నీ కాపాడి తను మరణిస్తాడు. అంత చక్కని ఆతిథ్యం ఇచ్చిన మోహన్ చావడాన్ని ఆ ఆరుగురూ జీర్ణించుకోలేక, అతడు బ్రెయిన్ డెడ్ కాలేదని నిశ్చయించి వెంటనే ఆర్టిఫిషియల్ గుండెతో పని మొదలు పెడతారు. ఎవరెవరివో అవయవాలు అమర్చి,ఫైబర్ గ్లాస్ చుట్టూ, దెబ్బ తిన్న మెడుల్లా ఆబ్లాంగేటా స్థానే ఒక చిన్న మైక్రో కంప్యూటరూ..ఇలా తిరిగి మోహన్ బతుకుతాడు.
"నా కాళ్ళు నబూకా అనే నీగ్రోవి! నా గుండె రజియా అనే స్త్రీది. నా చేతులు హారిసన్ అనే వ్యక్తివి. నా శరీరంలోని కొన్ని గ్రంథులు రింకూ అనే చింపాంజీవి.ఈ నలుగురి పేర్లలోని మొదటక్షరాలు కలిపి నాకు "నరహరి" అని నామకరణం చేశారు డాక్టర్ సంజీవ్" అని చెప్తాడు నరహరి. ఇలా ఘోరంగా మారిపోయిన నరహరిని తమ కుటుంబ సభ్యుడి గా అంగీకరించక అతడి భార్యా బిడ్డలు వెళ్ళగొడతారు. ఎక్కడా దిక్కులేక వికారమైన స్వరూపంతో బతకలేక ఆ మారు మూల ఊరికి వచ్చి వాళ్ళలో ఒకడిగా పని చేసుకుంటూ బతుకుతున్నాడు నరహరి. అతడు మనిషని తెలిసిన అపురూప "మరి సంజీవ్ తయారు చేసిన మరమనిషి మీరేనని, ఆయన్ని చంపి మీరు పారిపోయారనీ గగ్గోలుగా ఉంది"అని చెప్తుంది. అసలు సంజీవ్ మరణించిన సంగతే తెలీదు నరహరికి.
మరి సంజీవి ని ఎవరు చంపారు? తన తల్లి శోధన ఏమైంది? ఆమె సృష్టించిన విషక్రిమి ఎక్కడుంది? అపురూపకన్నీ ప్రశ్నలే! నరహరిని అక్కడే వదిలి తిరిగి బయలు దేరతారు.
ఈ కొద్ది రోజుల సాహచర్యంలో అజిత్ అపురూపల మధ్య ప్రేమ భావం అంకురిస్తుంది. నిజానికి అపురూపకి ప్రేమ, పెళ్ళి... ఇవంటే ఏమిటో తెలీదు. ఆమె తల్లి శోధన కూడా ఒక స్పెర్మ్ బాంక్, ఒక టెస్ట్ ట్యూబ్, ఒక ఇంకుబేటర్--ఈ మూడిటి సాయంతోనే అపురూపను తన కూతురిగా సృష్టించుకుంది తప్ప పెళ్ళి చేసుకుని కనలేదు. ఇప్పుడీ కొత్త భావం ఆమెకు ఎంతో తీయగా అనిపిస్తుంది.
దార్లో అజిత్ టైమ్ మెషీన్ ఎక్కితే ఎలా ఉంటుందో అపురూపకు ఒక సిములేషన్ మెషీన్ ద్వారా చూపిస్తాడు. కొన్ని శతాబ్దాల తరవాత మనిషి ఒక మాంసం ముద్దలా తయారైపోతాడు అంటూ ఆ దృశ్యాన్ని చూపిస్తాడు. కాసేపట్లో అలాంటి మాసం ముద్ద లాంటి జీవి ఒకటి ఫ్లయింగ్ సాసర్లో వచ్చి నిజంగానే వాళ్ల ఎదురుగా నిల్చుంటుంది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకోగలిగే ఆ గ్రహాంతర వాసి స్నేహ సందేశాన్ని మోసుకొస్తుంది!
"మీ భూమి కంటే కోట్ల సంవత్సారల ముందే మా గ్రహం పుట్టింది. సైన్సులో విపరీతమైన అభివృద్ధిని సాధించాం! రోబొట్స్,సాటిలైట్స్,జెనెటిక్ ఇంజనీరింగ్, అణుశక్తి ఇలా ఒకటేమిటి అన్నింటినీ వినాశనానికే వాడాం! చివరికి ఇలా రూపం లేని జీవులుగా మిగిలాం! భూమి ని నాశనం చేసే విషక్రిమి ఏదో తయారవుతోందని అంతా భయపడుతున్నారు. అసలు మనిషి కంటే విషక్రిమి ఎవరు? మనిషి కంటే మారణాయుధం ఎవరు? ఇంత స్వార్థం ఎవరికుంది?సైన్సు మనిషికి మంచి చెయ్యాలే కానీ ముంచెయ్య కూడదు"
ఇలా చెప్పి ఆ బుద్ధి జీవి "అన్నట్లు అజిత్, ఆ విషక్రిమి ని ఎక్కడ దాచావు? బయటికి తీయ్, చూస్తాను" అని అడుగటంతో అజిత్ నిశ్చేష్టుడైపోతాడు.
ఇక చేసే ది లేక తన ముంజేతిని ఒక స్క్రూ లా తిప్పి ఊడదీసి, మణికట్టు లోపల దాచిన చిన్న కాప్స్యూలు తీసి ఇస్తాడు.
అవును, అజిత్, మనిషి కాదు! సంజీవ్ తయారు చేసిన రోబో అజితే!
మనిషిలా కనపడేదీ, మానవ స్వభావాన్నీ, భావోద్వేగాల్నీ అనుభవించగలిగే ఒక రోబోట్ అజిత్! ఇంతలో ఆ కాప్యూలును మింగేస్తుంది ఆ బుద్ధి జీవి. "మరేం పర్లేదు ,ఇలాంటి వాటిని హరాయించుకునే దశలో ఉన్నాం మేము" అంటుంది.
అపురూప కు మతి పోతుంది.
ఆ తర్వాత అపురూపకు స్పృహ వచ్చాక .......
"సంజీవ్ గారి కొడుకు ఆధ్యాత్మికత లో పడి ఎటో వెళ్ళిపోతే అతడి లాగే కనపడేలా నన్ను తయారు చేసి అతడి పేరే నాకు పెట్టారు సంజీవ్. లోకానికంతటికీ నేనే అతడి కొడుకుగా తెల్సు. కానీ దురదృష్ట వశాత్తూ ఆయన కంటే నా మేథస్సు ఎక్కువని రెండు మూడు సందర్భాల్లో రుజువైంది. ఒక మేజర్ సమస్యను ఆయన సాల్వ్ చేయలేక సతమవుతుంటే నేను నేను పరిష్కరించాను. అది ఆయన అహాన్ని దెబ్బ తీసింది.
నన్ను నాశనం చేయాలని సంకల్పించారు. అంతకు ముందే ఈ విషక్రిమి తయారీలో మీ అమ్మగారున్నారని సంజీవ్ నాతో చెప్పడం వల్ల ఆ విషక్రిమిని ఎలాగైనా నాశనం చేయాలని నేననుకుని మీ అమ్మను కిడ్నాప్ చేశాను. విషక్రిమిని నా స్వాధీనం చేసుకున్నాను! ఈ లోపు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నారు" అని చెప్తాడు అజిత్!
తమ కళ్యాణమెలాగూ సాధ్యం కాదని తెలుసుకున్న ఆ మనిషీ, మెషినూ కలిసి చేతులు కలిపి సైన్సును మానవ కళ్యాణానికే తప్ప వినాశనానికి ఉపయోగించరాదనే సందేశాన్ని ప్రచారం చేసేందుకు బయలు దేరతారు.
ఈ నవలకు ఆంధ్రజ్యోతి నిర్వహించిన సైన్స్ ఫిక్షన్ నవలలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇందులోని చాలా విషయాలు ఇప్పుడు ఒక మౌస్ క్లిక్ దూరంలోనే దొరకొచ్చు కానీ 1984లో ఇంత చక్కని నవల రాయడం ఎంత గొప్ప విషయమో అనిపిస్తుంది. రోబో సినిమాలోని సందేశమే ఇక్కడానూ! సైన్సును పెడదోవలు పట్టించి వినాశనానికి ఉపయోగించొద్దని!
భవిష్యత్తులో ఈ విశ్వం ఎలా ఉండబోయేదీ రచయిత ఊహించిన తీరు అద్భుతంగా తోస్తుంది. అడుగడుగునా కనపడే ఫ్లయింగ్ ఆబ్జెక్టులూ, అజిత్ తో పాటే తిరుగుతుండే కేటూ (k2) అనే బుల్లి రొబొట్, అకస్మాత్తుగా కొండల మధ్య పల్లెటూరూ, నవలంతా చాలా ఆహ్లాదంగా నడుస్తుంది. సీరియల్ కావడంతో వారం వారం పత్రిక కోసం ఎదురు చేసేలా ఉండేది.
ఇంగ్లీషులో ఇలాంటి సైన్స్ ఫిక్షన్స్, అందునా రోబొట్ కథాంశంగా ఎన్నో నవలలు వచ్చి ఉండొచ్చు, కానీ అంతకు ముందు గానీ ఆ తర్వాత కానీ ఈ అంశంతో కథ వచ్చినట్లు నాకైతే తెలీదు మరి! అచ్చు మనిషిలాగే ఉండే రోబోట్, మనిషి లాగే ఆలోచించగలిగే రోబోట్ ఈ నవల్లో ప్రత్యేకం! ఇన్నేళ్ళ తర్వాత రోబో సినిమాలోనూ అదే ప్రత్యేకం!
నవసాహితి పబ్లిషర్స్ వేసిన ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు! దొరికితే మాత్రం తప్పక చదవండి.
39 comments:
ఈ కథ Mary Shelley's Frankenstein ని పోలి ఉంది. దానికీ రోబోకూ పెద్ద పోలికలు కనిపించడం లేదు ఎక్కడో కొన్ని ఎలిమెంట్స్ లో తప్ప :)
రోబో స్టోరీకన్నా ఇదే బావుంది :)
మహేష్ కుమార్ గారూ,
నేను బ్లాక్ అండ్ వైట్ ఫ్రాంకెయిన్ స్టెయిన్ సినిమాలన్నీ చూశాను. కొత్తగా వచ్చిన వెర్షన్ చూడలేదు. నరహరి పాత్ర రూపంలో ఫ్రాంకెయిన్ స్టెయిన్ పాత్రను పోలి ఉండటం కొంతవరకూ కరెక్టే!కథాంశంలో పోలికలేవీ లేవు .
ఈ నవల్లో కూడా ఒక చోట "ఫ్రాంకెన్ స్టెయిన్ మాన్ స్టర్ లాంటిది రాబోతుందా" అని అపురూప భయపడినట్లుకూడా రాశారు రచయిత. శీర్షికను బట్టి రోబో కథకీ ఈ నవలకు పోలికలున్నాయని అన్నట్లు గా మీకు తోచినట్లుంది! రోబో నవల అంటే "రోబో సబ్జెక్టు తో నవల " అనీ చెప్పాలనుకున్నా :-))
ఇదే కథని సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఎప్పుడూ కథలు లేవని ఏడ్చే మన దర్శకులు, హీరోలు. ఇటువంటివి ప్రయత్నిస్తే ఎంత బాగుంటుందో!
రోబో కన్నా ఇదే బాగుంది.
1984 లోనే ఇలాంటి కథ రాసారాంటే నిజంగా ఆ రచయిత గొప్పవాడే!
1994 లో ఒక ఫ్రాంకెన్ స్టైన్ సినిమా వచ్చింది. నాకు బాగానచ్చిన సినిమా ఇది. ఇందురో రాబర్ట్ డినిరో మాన్స్టర్ గా చేశాడు.
http://www.imdb.com/title/tt0109836/
33years bk a movie called'THE DEMON SEED'came on robo theme sir...
మీకు ఎంత బాగా గుర్తు ఉందండీ కథ అంతా! పెద్ద నవలని, బుల్లి కథగా చేసి మొత్తం అర్థమయ్యేలా భలే చెప్పారే! ఏమైనా పుస్తక పరిచయాలు మాత్రం మీ దగ్గరే నేర్చుకోవాలి, భలే వీజీగా రాసేస్తారు అన్నీ.
ఈ బుద్ధి జీవి పేరు విన్నాను, కానీ చదవలేదులెండి. 1984 అంటే...నాకు రాయడం, చదవడం రాదులెండి అప్పటికి. రొబోకి దీనికి కాన్సెప్టులో పోలికలున్నాయి, కానీ ఈ కథ బావుంది. సవ్వడి చెప్పినట్టు సినిమాగా తియ్యొచ్చు చక్కగా.
ఇదే సినిమాగా తీస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది .బహుశా శంకర్ కొంతే కాపీ కొట్టి ఉంటాడా ?
nenu ee noval ni Teluguone.com lo chadivanu, 2 yrs back! good one!
చాలా ఆసక్తి కరంగా ఉంది కథ! నిజానికి ఈ కథలో అయితే ఎక్కువ విజువల్ ఎఫెక్టులు చూపించడానికి అవకాశం కూడా ఉంది. మంచి సందేశమూ ఉంది! ఇలాంటి కథలు మనవాళ్లకెలా కనిపించవు? కాకపోతే హీరోయిన్ కి పెద్దగా ఎక్స్ పోజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు!
సౌమ్య గారన్నట్లు ఎప్పు..డో చదివిన కథలు మీరు ఇలా ఎలా గుర్తు పెట్టుకుంటారు? ఈ కథ నేను చదవలేదు కానీ ఒక రాబొట్ తన లాంటి అనేక అసంఖ్యాక రాబొట్లను తయారు చేసి వినాశనానికి వినియోగించాలని చూడ్డం అనేది రెండు చోట్లా (నవల్లోనూ, రోబో సినిమాలోనూ) సింక్ కావడం బావుందనిపించింది. మీరు పరిచయం రాశాక చివర్లో సస్పెన్స్ లో పెడితే తప్ప ఇంక మళ్ళీ పుస్తకం చదవక్కర్లేదు లెండి. అంత చక్కగా పిల్లలకు చందమామ కథ చెప్పినట్లు చెప్తారు.
superb...
You are right, I read it when I was in school, I recently read it again. It does have some similarities to some of Asimov's works, but it still stands out as an original. You can read the book online at teluguone's grandhalayam. You need to register in the site (its free). http://teluguone.com/grandalayam/katalunavals/novels/bhuddijeevi/b1.htm
సుజాతగారు మీలో కూడా వొక రోబో వున్నాడు
ఐదో క్లాసు లోనే నవలలు చదవడం వొక ఎత్తైతే
ఇన్నేళ్ళ తర్వాత కూడా వొకసారి కళ్ళముందు
నవల పేరు కనబడితే కాంటంట్ మొత్తం గుర్తుకు రావడం
ఎందుకైనా మంచిది మీ వార్నీ మీ మీద వొక కన్నేసి ఉంచమని చెప్పాలి
మీ బుర్ర కి రాత్రి పూట చార్జింగ్ ఏమన్నా పెట్టుకున్టున్నరేమో పాటలు వింటున్న నెపం తో?
సుజాత గారూ...
మీరు చెప్పిన నవల లింక్ ఇదిగోండి.
http://teluguone.com/grandalayam/katalunavals/novels/bhuddijeevi/b1.htm
హమ్మయ్య మొత్తానికి ఇన్నాళ్ళకి మీరు పరిచయం చేసిన ఒక పుస్తకం నేను ముందే చదివాను :-) కానీ అదీ పుస్తక రూపంలో కాదు లెండి చాలా ఏళ్ళక్రితం తెలుగువన్ లోనే. నాకు చాలా నచ్చిన నవల ఇది. ఈ నవల చాలా అసక్తికరంగా సాగుతూ ఆసాంతం ఒకేసారి చదివిస్తుంది ఆసక్తికరమైన మలుపులు, చిత్రమైన విషయాలు విస్మయ పరుస్తాయి. ఆసక్తికలవారు ఈ క్రింది లింక్ లో చదవవచ్చు. http://teluguone.com/grandalayam/katalunavals/novels/bhuddijeevi/b1.htm
తెలుగువన్ వారు రచయితలనుండి లైసెన్స్ తీసుకుని ఈ బుక్స్ గా మార్చారని విన్నాను అందుకే లింక్ ఇచ్చే ధైర్యం చేస్తున్నాను. ఈ సెక్షన్ చదవాలంటే ముందుగా ఈ వెబ్ సైట్ లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
good
బాస్, సురేష్, శ్రీకాంత్
లింక్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు, ఇప్పుడు నవల చదవడమే మన తక్షణ కర్తవ్యం :)
పుస్తకాన్ని పరిచయం చేస్తూ, "ఇది అలభ్యం", అనేయ్యడం ఏం బాలేదు. :)
ఈ నవల నేనూ తెలుగువన్ లోనే చదివానండీ! నా మనసుకు చాలా హత్తుకు పోయిన నవలల్లో ఇదీ ఒకటి. మైనంపాటి భాస్కర్ గారు వైవిధ్య భరితమైన నవలలు చాలా రాశారు. మరీ మూస పాత్రలతో కాకుండా ముందు ముందు ఏమౌతుందో అనే ఉత్కంఠ మనకు కలిగే విధం గా ఉంటాయి - ఆయన రచనలు.
ఈ నవలని చదివిన వాళ్ళందరికీ....!
హమ్మ, చదివేశారన్నమాట! మీ పని ఇలా కాదు, ఈ సారి మీరెవ్వరూ చదవని, చదవబోని నవల ఒకదాన్ని పరిచయం చేయబోతున్నా! :-))
astrojoyd గారు, రోబో థీమేనా, లేక బుద్ధిజీవికి దగ్గరగా ఉండే థీమా మీరు చెప్పిన నవల? సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు!
సౌమ్య,
నిజంగానే నాకు చిన్నప్పుడు చదివిన కథలు కొన్ని అలా గుర్తుండిపోయాయి. అది పుస్తకాల గొప్ప దనమే! ఈ మధ్య చదివిన కొన్ని పుస్తకాలు కుంచెం కూడా గుర్తు లేనివి ఉన్నాయి మరి!
jaggampet గారు, పాపం, శంకర్ కి ఈ కథ తెలిసి ఉండదు లెండి! :-)
సవ్వడి, తిరు, కిరణ కుమార్, నీలాంచల, నాగార్జున,అజయ్, బాస్, శివప్రసాద్ గార్లు, థాంక్యూలు!
రావి సురేష్ గారూ, ఇది తెలుగు వన్ లో ఉందని నేను గమనించలేదు. రిజిస్ట్రేషన్లూ వగైరా లేని తొలి రోజుల్లో ఆ సైట్లో నేనూ చాలా నవలలుచదివాను . లింక్ ఇచ్చినందుకు థాంక్యూ!
రవి గారూ, ఏమో మీరన్న తర్వాత నాక్కూడా డౌటొస్తోంది. ఎందుకైనా మంచిది ఓ సారి మోచెయ్యి వద్ద విరిచి చూసుకుందామనుకున్నాను లోపల వైర్లేమైనా ఉన్నాయేమో తెలుసుకుందామని! వైర్లు లేకపొగా ఫట్ మని చెయ్యి విరిగి ఊరుకుంటుందేమో అని భయమేసి ఆగిపోయాను
నవల సంక్షిప్త కథని భలే చెప్పారే!
>>ఈ సారి మీరెవ్వరూ చదవని, చదవబోని నవల ఒకదాన్ని పరిచయం చేయబోతున్నా! :-))<<
’చదవని’ వరకూ ఓకే కానీ ’చదవబోని’ ఏమిటబ్బా లేదంటే అది ’చదవలేని’ నా :-) ఐనా ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముందండీ ఇదివరకే అలాంటివి పరిచయం చేశారు కదా :)
వేణూ శ్రీ,
చదవబోని...అంటే ఆ నవల మీకెవ్వరికీ దొరికే అవకాశం లేదని! :-))
పదిహేనేళ్ళు శ్రమిస్తే ఈ మధ్యనే దొరికింది..విజయవాడ కాలవొడ్డున! అక్కడికి కూడా అయిదోసారి వెళ్ళినపుడు దొరికింది. పబ్లిషర్స్ దగ్గర కూడా ఒక్క కాపీయే ఉంది, ఇవ్వడం కుదరదన్నారు మరి!
విజయవాదలో దొరికిందంటున్నారు, కొంపదీసి అది నేను చెప్పిన పుస్తకం కాదుగదా. ఒకవేళ అదే అయితే, నాకు క్రెడిట్స్ ఇవ్వకపోతే మీ బ్లాగులో ధర్నా చేస్తా, ముందే చెప్తున్నా ఆ.
భలేవారే మీ దగ్గరుంటే మాదగ్గరున్నట్లు కాదేంటి :) కానీ మీ ఓపికకి అభిరుచికి నమస్సులండీ. సరే అంతగా వెతికారంటే ఎంత మంచి పుస్తకమో మరి, పరిచయం కోసం ఎదురు చూస్తుంటాను.
సుజాత గారూ, రోబో కథ శంకర్ సొంతమే నని ఎలా చెప్పగలం? భాస్కర్ గారి నవల కథ ని కాపీ కొట్టి తీయలేదని చెప్పలేం కదా! ఈ నవల నేను చదివాను. రోబో కథకీ, ఈ నవలకూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఇంతగా ఇడెంటికల్ థాట్స్ రావడం అసహజంగా తోస్తోంది.
సౌమ్యా
నువ్వు చెప్పిన పుస్తకం కాదు. మరోటి. అది చాలా శ్రద్ధగా రాయాలి. టైము చాలడం లేదు. తీరిక చిక్కాక రాస్తాను.
...దాని గురించి నువ్వే రాయరాదూ, నేనొచ్చి కామెంట్ రాస్తా!:-))
అనిల్ గారు, మీకు జవాబివ్వడం మర్చిపోయాను. పైన కొంతమంది రాసిన సంగతి చూసే ఉంటారు. ఈ నవల తెలుగు వన్ లోregistered పాఠకులకు అందుబాటులో ఉందట, వీలైతే చదివెయ్యండి మరి!
@ కొత్తపాళీ,
మీ వ్యాఖ్య చూశాక, మరింత సంగ్రహంగా రాస్తే బావుండేదనిపిస్తోంది
కిరణ్ ప్రియ గారూ,
చంపారు పొండి! మీరన్నాక, నాక్కూడా మరిన్ని పోలికలు కనిపిస్తున్నాయి. :-))
విరజాజి గారూ,
అవును, భాస్కర్ గారి నవలలు నాక్కూడా ఇష్టం! ఆయన రాసిన వెన్నెల మెట్లు అనే నవలను అరుణ కిరణం సినిమాగా కూడా తీశారు. సినిమా కంటే నవల చాలా బావుంటుంది . చదివారా మీరు?
ముందుగా ఒక మంచి తెలుగు నవలను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. తెలుగులో sci-fi నవలలు చాలా అరుదు. అందునా 1984 లో ఇలాంటి నవల వ్రాయడం గొప్ప సాహసమే.
ఐతే ఈ నవల రోబో సినిమాకు ప్రేరణ అన్న ఊహ (కామెంట్లలో చూశాను) నిరాధారం. రోబోల గురించి ఏమేం కథలు ఊహించవచ్చో దాదాపు అన్నీ అసిమోవ్ ఊహించేశాడు. రోబోల గురించి అసిమోవ్ వ్రాయనివేవీ లేవు. నిజానికి మైనంపాటి భాస్కర్ గారు అసిమోవ్ కథలనుండి స్ఫూర్తి పొందివుండే అవకాశం ఉంది. భాస్కర్ గారి నవల "మారణ హోమం" అన్నది నా దగ్గర ఉంది. అది ఒక ప్రముఖ ఆంగ్ల నవల ఆధారంగా వ్రాసింది.
>> "రోబో కథ శంకర్ సొంతమే నని ఎలా చెప్పగలం? భాస్కర్ గారి నవల కథ ని కాపీ కొట్టి తీయలేదని చెప్పలేం కదా! ఈ నవల నేను చదివాను. రోబో కథకీ, ఈ నవలకూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఇంతగా ఇడెంటికల్ థాట్స్ రావడం అసహజంగా తోస్తోంది"
భాస్కర్, శంకర్ ఇద్దరూ ఒకే చోటినుండి స్ఫూర్తి పొంది ఉండొచ్చు కదా.
సుజాతగారు, ఎప్పుడొ చదివిన నవలని మీరు గుర్తుచేసుకొని ఇక్కడ పోస్టినందుకు చాలా థ్యాంక్స్. సాదారణంగా సైన్స్‌ఫిక్షన్, రోబోలాంటి సాంకేతిక సంబందించిన కథలు గాని..నవలలకు ప్రసిద్దిగాంచిన రచయత ఎన్.ఆర్.నంది గారు. మైనంపాటి గారు కొన్ని మాత్రమే రాసారు ఈ సైన్స్ ఫిక్షన్స్లలో అనుకుంటా..?? మరొక మనవి..ఎన్.ఆర్.నందిగారు రాసిన ఒకప్పటి సైన్స్‌ఫిక్షన్ నవల " సిగ్గు..సిగ్గు " మీకు గుర్తు ఉంటే పరిచయం చేయగలరు, ఆ నవల బయట ఎక్కడా దొరకట్లేదు.
అలాగే బాస్ గారికి, రావి సురేష్ గారికి,వేణు శ్రీకాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్..మీరిచ్చిన లింక్స్‌తో నేనా నవలని పి.డి.ఎఫ్ గా మార్చుకొని నా ఈ-లైబ్రరరీలో దాచుకోగలిగాను.
Hats off to u.
bhale bavundi navala and meeru cheppina paddhati kooda.
నాకు I, Robot సినిమా కథ చదివినట్లు అనిపించింది.
Post a Comment