రమణ లేని బాపు !
అవును, ఇక బాపు .......రమణ లేని బాపు!
పొద్దున్నే ఐదుంపావుకి చల్లని వేళ....పాటలు వింటూ వాకింగ్ కెళ్తుంటే అరిపిరాల గారి నుంచి వచ్చిన మెసేజ్ నిజంగా ఒక్క క్షణం అర్థం కాలేదు. "mullapudi venkata ramana no more" అని కనపడుతోంది ఫోన్లో! అర్థమైన మరుక్షణం మనసులోకొచ్చిన ఆలోచన
"మరి బాపు...? బాపుకెలా ఇప్పుడు? బాపు... బాపు"
ఎంతమంది అదృష్టవంతులుంటారిలా? బాపులా?.....రమణలా......!
సృష్టిలో తీయనిది స్నేహమే నని (ఆ మాటంటే వాళ్ళొప్పుకోరు.."తీయనిది ఎందుకైందీ? మేం తీసేశాం" అంటారు) నిరూపించిన సజీవ సాక్ష్యాలు వాళ్ళు!
చిన్న నాటి స్నేహాన్ని ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా నిలుపుకునేవారుంటారేమో!
కాని ఒకటే మాటగా, ఒకటే జీవితంగా, ఒకటే ఆలోచనగా ఒకే చోట ఒకే వూర్లో కుటుంబాలతో సహా కల్సిపోయి విడదీయలేని జంటగా బ్రతికిన అరుదైన మనుషులు వాళ్ళు.
బుడుగు, రాధ, గోపాలం,బామ్మ, పంచవటి కాలనీ,.........మధ్య తరగతి సౌందర్యాన్ని తన కళ్ళతో.... బాపు కుంచెతో ఆవిష్కరించిన వాడు, ఏడుపదులు దాటిన వయసులో హైస్కూలు కుర్రాడిలా కోతికొమ్మచ్చి ఆడుతున్నవాడు,ఎంత ఎదిగినా మధ్యతరగతిలో ఒదిగిన వాడు....
ఒక్కోసారి కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి. జీవితకాలం లేటైపోతుంటాయి. ఈ మధ్య శంకర్ గారి బ్లాగులో చదివినపుడు "అవును, ఇప్పటికే ఆలస్యం చేశా! ఈ సారి చెన్నై వెళ్ళినపుడు వీళ్ళిద్దరినీ చూడాలి" అనుకున్నాను!
చాలా చాలా ఆలస్యమైపోయింది. ఇక కలవాలని లేదు. రమణ లేని బాపునీ, బాపు లేని రమణ నీ ఊహించుకోలేం కదా!
మనం సరే, బాపు?
ఏదో ఆలోచన బుర్రలో మెరిసిన క్షణాన "అది కాదు రమణా." అంటూ పక్కకి చూస్తారేమో!
రమణ గారి ఫోన్ కి రింగ్ చేసి "అరె....ఇక రమణ లేడుగా"అని ఉస్సురని కూలబడతారేమో!
అయ్యో, బాపు గారూ , ఎలా? ఎలా? ఎలా మీ బాధను పంచుకోవడం?
వాళ్ళిద్దరినీ , ఒకే చోట వాళ్ళిద్దరినీ చూసినపుడు నాకు ఈపాట.గుర్తొస్తూ ఉండేది
రమణ ఇక లేరు
బాపు మనసుకు శాంతి లభించు గాక !
12 comments:
ఇప్పుడే చూశా..
అయ్యో నేను ఈ సరి ఇండియా కెళ్తే కలవడం కుదురుతుందేమో అనుకున్నా.. ఈ లోపు. ఇలా.
మీరన్నట్టు బాపు గారిని తలుచుకుంటే బాధేస్తోంది.
ఆయన ముక్కోతి కొమ్మచ్చి చదువుదామని అనుకుంటూ ఉన్నా ఇంకా.
రమణగారికి శ్రద్ధాంజలి.
మీరు చెప్పినది అక్షరాలా నిజం. రమణ గారు లేని బాపూ ని ఊహించుకోవడం అంటే...
ఈ మధ్యే బ్లాగుల్లో వారిని కలిసి అవ్చ్చిన వారి అనుభవాలు చూసి ఓహూ వీళ్ళు ఇంత ఆప్యాయంగా మాట్లాడతారా..నేనూ కలవాలి అనుకున్నా చెన్నై వెళ్ళి.
రమణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం కంటే బాపూ మనసుకు శాంతి కలగాలని కోరుకోవడం నిజంగా....నిజంగా సముచితం!
అయ్యో ! మొన్న చందూర్ గారు.. ఈ రోజు వీరు !
రెండు ఒకట్లు (మాలతీ చందూర్, బాపూ రమణ) ఒంటరి అయిపోవడం బాధాకరం.
జాతస్యహి ధృవో మృత్యుః....
ముళ్ళపూడి రమణగారికి శ్రద్ధాంజలి
సుజాత గారూ, నిజమే సుమా!
ఎవరో అన్నారట "బాపు రమణ అనేది అందమైన ద్వంద్వసమాసం" అని.
మహానుభావులు.ప్రత్యక్షంగా హరిసేవకోసం తరలివెళ్లారు.
తెలుగువాడికి అప్పు తీసుకోవడం, అప్పు ఎగ్గొట్టడం కూడా నేర్పినవాడు, తాను మాత్రం ఇలా ఋణం తీర్చేసుకున్నాడేంటో!
హ్మ్! ఏమని స్పందించాలో కూడా తెలియని సందర్భం. మీతో పాటు గా బాపు గారి మనసుకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను !
రమణ గారు లేరని తెలియగానే సహజం గానే బాపూ గారి ఒంటరితనమే చాలా బాధించింది...బాపూ గారి మనసుకు శాంతి, ధైర్యం చేకూరాలని ఆశిద్దాం
Post a Comment