March 10, 2011

అన్నం మానేయడం ఎలా?





టైటిల్ చూసి అన్నం మానేయడానికి అరవై సులభ చిట్కాలు చెప్తానని అనుకున్నారో ఏమో...అదేం కాదు!


"అన్నంమానేయడం ఎలా? అసలెలా సాధ్యం? ఎలా? ఎలా?" అని విస్తుపోతున్నానన్నమాట

మొన్న ఒకాదివారం ఉదయం పదకొండు గంటల వేళ

ఆవ కలిపిన పనసపొట్టు కూర(వంటలు రాసే  బ్లాగర్లకు  మంచి  అవిడియా) లో, అప్పుడే వేయించిన మినపవడియాలు కలిపి, గోంగూర పచ్చడిలో ఇంగువ పోపు పెట్టి,వేడి వేడి పాఠోళీ బౌల్ లోకి తీసి, వంకాయ పచ్చి పులుసు(పులుసు పచ్చడి)లో కొత్తిమీద కత్తిరించి వేస్తుండగా "హా....పనస పొట్టు..పనస పొట్టు..." అంటూ కేకలు వినపడి వంటింట్లోంచి తొంగి చూశాను. మురళి!

కుంకుమ పువ్వు రేకలతో లేత  బంగారు రంగులో అలరారుతున్న చక్రపొంగలిలో బాదం పప్పు చీలికలు సర్దుతూ "రారా! మొన్న మంగళవారమేగా వచ్చావు?మళ్ళీ అప్పుడే వచ్చావేం?" అన్నాను.

"ఏంట్రా?ఈ మధ్య కనపడ్డమే మానేశావు? నల్లపూసైపోయావు"వంటి ప్రశ్నలకు వాడసలు అవకాశమే ఇవ్వడు.
"అత్తా, అబ్బ, ప్రతి వీకెండూ ఇంత భారీ మెనూ ఉంటుందా ఇక్కడ?" అన్నాడు పాఠోళీ స్పూన్ తో తీసుకుని తినేస్తూ!

"అంత లేదురోయ్, ప్రతి వీకెండూ మీ అత్త వంటే చెయ్యదు, ఏదో ఇవాళ నా పుట్టినరోజని...." అన్నాడు వాళ్ళ మామయ్య. ఇలాంటి అలవోక అబద్ధాలు తన దగ్గర చాలా ఉంటాయి. మురళి   నా మేనల్లుడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ మధ్యే కండలు పెంచాలని, బొజ్జ తగ్గించాలని జిమ్ములో చేరాడు.

"ఏంటి? ఇప్పుడు ఇవన్నీ తింటారా మీరూ"అన్నాడు వాడు చూపులు కల్సిన శుభవేళ సినిమాలో బ్రహ్మానందాన్ని గుర్తుకు తెస్తూ!

"మరి?నీకు వడ్డించి, నువ్వు తృప్తిగా తింటుంటే కన్నీళ్ళు తుడుచుకుంటామనుకున్నావా ?"

"ఇవన్నీ మీకు అరగవు. నేను రొట్టెలు తింటుంటే మీరు ఇన్ని రకాలు వేసుకుని భోజనం చేస్తే అది మీకు విషంగా మారి...."అని శపించబోయాడు.

 "నీక్కూడా కొద్దిగా వేస్తాంలేరా! ఇంతకీ  నీ జిమ్ము ఎంత వరకూ వచ్చింది?" అడిగాను.

మురళి నీరసంగా నా వైపు ఒకకాగితం విసిరేశాడు. "ఇదిగో, నా డైట్ ఛార్టు, చూడు" అని!

1. పొద్దున్నే ఒక కప్పు గ్రీన్ టీ,నానపెట్టిన బాదంపప్పులు 4

2. గంటన్నర సేపు రకరకాల వర్కవుట్లు

3. పోస్ట్ వర్కవుట్ కి రెండు ఎగ్ వైట్స్, తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ విత్ డబుల్ టోండ్ మిల్క్,

4. మధ్యాహ్నం లంచ్ కి రెండు రోటీలు,కూరగాయల సలాడ్,కప్పు మొలకలు

5. రాత్రికి డిన్నర్ రెండు రోటీలు,గ్లాసు వెన్న లేని మజ్జిగ,నాలుగు కీరా ముక్కలు!

"ఇదేంట్రా, మరి అన్నమెప్పుడు తింటావు?"అన్నాను తెల్లబోయి.

"అన్నమా? నా మెనూలో అసలు అన్నమే లేదు. అన్నం తినొద్దన్నారు"

వాళ్ళ మామయ్య కాస్త జాలిపడి "పోనీ వాడికి రెండు పుల్కాలు  చేసెయ్యి, లంచ్ చేసి వెళ్తాడు."అన్నారు.


వాడు వంటింట్లోకి తొంగి చూసి "ఇవాళొద్దు మామయ్యా, అన్నమే తినేస్తా! పనసపొట్టు కూర వదిలే ప్రసక్తే లేదు.రేపటినుంచీ తింటాలే పుల్కాలు "అన్నాడు. వాడు రోజూ ఇదే డైలాగు కాస్త అటూ ఇటూగా చెప్పేసి అన్నమే తినేస్తున్నాడని నాకు తెలుసు.

రోజూ ఒకపూటయినా అన్నం తినకుండా జనాలు ఎలా బతికేస్తారో నాకు అర్థం కాని విషయం! (ఇప్పుడు సాయంత్రాలు మా ఇంట్లో పుల్కాలే  అనుకోండి)నా చిన్నప్పుడు గోధుమ రొట్టెలంటే అమ్మ శనివారం రాత్రో,ఆదివారం ఉదయమో చేసే టిఫినే! బంగాళాదుంప కూరతో!అది మెయిన్ కోర్సు ఎప్పుడూ కాదు. దానికెప్పుడూ చిరుతిండి స్థానమే తప్ప, భోజనం స్థాయి లేదసలు!

చెప్తే నవ్వుతారేమో,పెళ్ళయ్యేదాకా నాకు  జనాలు చాలామంది మెయిన్ కోర్స్ గా రొట్టెలు తింటారని తెలీదు. ఈ లోగా తను నాకు ఉత్తర భారతదేశమంతా చూపిద్దామని పది రోజుల ట్రిప్ ప్లాన్ చేశాడు. అంత వరకూ నాకు రెండు పూట్లా పప్పు, కూర, పచ్చడి ,చారు వగైరాలతో సుష్టుగా తినడం తప్ప థాలీలు,రోటీలు తెలీవు.మూడు రోజులయ్యేసరికి ఎక్కడా నాకు కావలసిన అన్నం దొరక్క పిచ్చెక్కి,ఏడుపొచ్చి,ఆ బాధనంతా మొహమాటపడి బయటికి చెప్పకుండా దాచడంతో అది పెద్ద పెట్టున జ్వరంగా పరిణమించింది. నిద్రలో "అన్నం ......పప్పు " అని కలవరింతలు! 

చివరికి ఒక హిల్ స్టేషన్ లో వాళ్ల ఆఫీసు గెస్ట్ హౌస్ లో వంటవాళ్లకి పరిస్థితి వివరించి చెప్పి తనే దగ్గరుండి పొడి పొడిగా దక్షిణ భారత స్టైల్లో అన్నం,పాలకూరపప్పు చేయించాడు. అది తిన్నాక గానీ నా జ్వరం తగ్గుముఖం పట్టలేదు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మంచి సోనా మసూరి బియ్యం ఉన్నాయో లేవో వెదుక్కుంటాను. గుర్గావ్ లో ఉన్నపుడు అక్కడి ఆంధ్రా స్టోర్స్ నిరంజన్ కిలోకి 26 రూపాయలు వేసుకుంటున్నాడని తిట్టుకుంటూనే(అప్పట్లో ఇక్కడ కిలో పన్నెండు రూపాయలే)తెమ్మని చెప్పేదాన్ని!

ఉద్యోగ రీత్యా దేశంలోని అన్ని నగరాల్లోనూ స్థిరపడ్డ నార్తిండియన్స్ వాళ్ల మెయిన్ కోర్స్ ని విజయవంతంగా సిటీ ప్రజల మెయిన్ కోర్స్ గా దాదాపుగా మార్చేశారని నా ఫిర్యాదు . ఏ రెస్టారెంట్ కైనా వెళ్లండి...."తందూరీ రోటి, బటర్ రోటీ, నాన్,రుమాలీ రోటీ,కుల్చా,కడాయి పనీర్,పనీర్ బటర్ మసాలా,పనీర్ దో ప్యాజా,దాల్ మఖనీ...."ఇవే వంటకాలు!సౌత్ ఇండియన్ థాలీలో సౌత్ ఇండియా ఎంతవరకూ ఉంటుందో మీకు బాగా తెలుసు!

అన్నం,పప్పు,పచ్చడి,పులుసు అంటూ తెలుగు భోజనం వడ్డించే రెస్టారెంట్లు నగరాల్లో అరుదుగా కనపడతాయి.బెంగుళూరులో కాస్త నయం! నాగార్జున,నందిని వంటి రెస్టారెంట్లు ఉన్నాయి.

అన్నం తింటే కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగి డయాబెటిస్ వస్తుందట....! మా పక్కింటి యూపీ అమ్మాయి... చెప్తుంది వారానికి సరిపడా పది కిలోల బంగాళాదుంపలు తీసుకుంటూ!

కడుపారా తిని,ఒళ్ళొంచి శారీరక శ్రమ చేసేవాళ్లు అన్నం తినడానికి ఇంత భయపడక్కర్లేదని నా అభిప్రాయం!

తినండి,పని చేయండి!ఇదే నా ఫిలాసఫీ!

ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు పాటించినా,అన్నం విషయానికొచ్చేసరికి మాత్రం నేను కాంప్రమైజ్ కాను. ఒక్క పూటయినా ఇష్టప్రకారం పచ్చళ్ళూ పప్పూ వగైరాలతో తెలుగింటి భోజనం చేయాల్సిందే!

సెలవుల్లో ఒక వారం రోజులపాటు ఎక్కడికైనా వెళ్ళి , తిరిగి ఇంటికొచ్చిన రోజు బయటి తిండి తిని వారం పాటు పిచ్చెక్కి ఉంటుందా....అందుకే హాయిగా రైస్ కుక్కర్ మాత్రమే పెడతాను. హాయిగా ఆవకాయ,మాగాయ,పండుమిరపకాయ పచ్చడి,ఉసిరావకాయ,గోంగూరపచ్చడి వగైరాలతో హాయిగా తినేసి సాయంత్రం దాకా  విశ్రాంతి తీసుకుంటే ప్రపంచం ఎంతో అందంగా కనపడి ఊర్నుంచి వచ్చామని తెల్సీ రాని పనిమనిషిని,మంచినీళ్ళ డబ్బా తీసుకురాని బిస్లరీ వాడిని,హోటల్ రూములో సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయిన మొగుడు గారిని   కూడా క్షమించబుద్ధేస్తుంది.  

38 comments:

లత said...

నిజం సుజాతగారూ అన్నం తినడంలో ఉన్న హాయి ఎందులోనూ ఉండదు
అందుకే రాత్రిపూట చపాతీ అంటే ఎలా స్కిప్ చెయ్యలా అని చూస్తుంటాను నేను (మరీ కావాలంటే మా వారికి చేసిపెడతాను కానీ)

యశోదకృష్ణ said...

nenu chinnappudu banglore vedithe ide paristhithi. vaadedo adukkunevadiki pettinattu chinna kappu rice. naakemo edupu. ippatiki annam thintene thrupthi. aa annanni kuda spoon tho kaakunda chettho thinthe maree thrupthi. spoon tho thine vallani chusthe jaali.mee post bagundi.

Unknown said...

సుజాత గారు మీరు రాసింది అక్షర సత్యం .మనమంతా అన్నగత ప్రానుళం.
కాని రాబోయే ఆరోగ్య ముప్పులను తప్పించు కోవడానికి మా యింట్లో కూడా రాత్రుళ్ళు రొట్టెలు
లేదా గోధుమ అన్నం .మీ పోస్ట్ చదువుతునప్పుడే మా మదర్ ఫోన్ చేస్తే జిహ్వ చాపల్యం చంపుకోలేకా
శని వారం వచ్చి మాఘాయి, ఆవకాయ , కందిపొడి (మా యింట్లో అవి నిషిద్దం లెండి ) పట్టుకుపోతానని ,
సిద్దం గా పెట్టమని చెప్పా. పాటోలి ,వంకాయ పచ్చిపులుసు మిను మీ యింట్లో ఉందటే ఈ సారి ట్రాఫ్ఫిక్
ని చేదించుకుని మరీ అంత దూరం మీ యింటికి భోజనానికి రావలిసిందే .

Anonymous said...

అబ్బ, పనసపొట్టు కూర పేరు చెప్పి ఊరించేశారుగా!

అన్నం తినకుండా ఉండటం కష్టమేనండీ! ఎంత ఆరోగ్యకరమైనా రొట్టెలు రొట్టెలే, అన్నం అన్నమే! చద్దన్నంలో ఆవకాయ వేసుకుని హాయిగా తినే వేసవి ఉదయాలు ఎంత బాగుంటాయి?

అన్నం, ముద్దపప్పు పక్కన కొత్తావకాయ ఉంటే ఇక స్వర్గాలెందుకూ? ఏడవనా?

సుజాత వేల్పూరి said...

రవి గారూ,

పాఠోళీ, వంకాయ పచ్చి పులుసు గోదావరి వంటలు కదా! పెళ్ళయ్యాక నేర్చుకున్నాను. నాకూ ఫేవరిట్ ఐటెంసే ! ఈ సారి చేసేటపుడు ముందు రోజు చెప్తాను. తప్పక వచ్చి భోంచేసి వెళ్ళండి!

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు పెట్టిన ఫోటో లో కళ్ళు చించుకొని మరీ చూసా. ఆవపెట్టిన పనస కూర, వంకాయ పులుసు పచ్చడి, చక్రపొంగలి కనిపించలేదు.
ఫోటో తీయడానికి ముందే తినేశారా. లేక కొత్త రకం గా చేశారా.
ఈ మాటు పనస కాయ కూర, చక్రపొంగలి చేస్తే నాకు తెలియ చేయ ప్రార్ధన. ఒక రోజు ముందు వచ్చి కూర్చుంటా.
ఆరోగ్య రీత్యా మనకి ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అయినా నేను కాదనను ఇలాంటివి దొరికితే. ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతా నన్నమాట.

సుజాత వేల్పూరి said...

సుబ్రహ్మణ్యం గారూ, క్షమించాలి, ఆ ఫొటో నా సొంతం కాదు.గూగుల్లోంచి పీకి పెట్టాను. ఈ సారి పనసపొట్టు కూర చేసినపుడు తప్పక ఫొటో పెట్టడమే కాదు, మిమ్మల్ని తప్పక భోజనానికి కూడా పిలుస్తాను.పనస పొట్టు రైతు బజారు కెళ్ళి దగ్గరుండి మరీ కొట్టించి తీసుకొస్తాను. వేసవి లో తప్ప దొరకదు కదా మరి!

చక్రపొంగలి లో ఎంత నెయ్యి పడితే అంత రుచి అన్న మా అమ్మ మాట తు.చ తప్పకుండా పాటిస్తూ చేస్తాను నేను. కొద్దిగా కూడా కాంప్రమైజ్ కాను. సుబ్బరంగా లాగించి రెండు మైళ్ళు ఎక్కువ నడిచి, ఆ ఎగస్ట్రా కాలరీలు వదిలించుకుంటా

ఆ.సౌమ్య said...

నా 'మనసులో మాట' అలా ఎలా చెప్పేసారండీ! ఈ పోస్ట్ చూస్తే నేను రాసినట్టుగా ఉంది...సేం పించ్..ఇవే అభిప్రాయాలు....ఒక్క పిసరు కూడా తేడాలేదు. శనివారం రాత్రి టిఫిన్ కి తప్ప రొట్టెలు (అదీ ఎప్పుడైనా) తింటారని నాకు అస్సలు తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకి రెండు పూటలు అవే...ఏడుపొచ్చేస్తున్నాది నాకు.

సోన మసూరి డిల్లీలో 26 రూపాయిలు...ఏరోజుల్లోనండీ? ఇప్పుడు మేము 40 ఇచ్చి కొనుక్కుంటున్నం. తప్పదు వేరే దారి లేదు....అన్నం తినకపోతే నోరు నోరే కాదు.

ఒక నార్త్ ఇండియన్ ఒకసారి నాకు గ్రాఫ్ వేసి చూపించాడు అన్నానికి, గోధుమకి తేడా అరగడంలో, శక్తినివ్వడంలో...నాకు ఒళ్ళుమండిపోయి ఆ కాగితం వాడి ముందే చింపిపారేసాను.

ఏ టూరు వెళ్ళొచ్చిన తరువాతైనా హాయిగా ఇంత కందిగుండో, ఆవకాయో, గోంగూరపచ్చడో కలుపుకు తిని తరువాత పెరుగేసుకుని తింటే వచ్చే సుఖం లేదు. నేను మొదటిసారి టూర్ వెళ్ళినప్పుడు అన్నం తినక నాలుక చచ్చుబడిపోయింది. ఇంటికొచ్చి అమ్మ చేత బంగాళదుంపల వేపుడు, చుక్కకూర పప్పు, కొబ్బరి పచ్చడి చేయించుకుని నోరారా తిన్నను. అప్పటికిగానీ మనిషిని కాలేకపోయాను. ఆరోజు నాకిప్పటికీ గుర్తే

ఏమిటో ఇలా రాస్తే నేను మీ పోస్ట్ కంటే పెద్ద కామెంటు పెడతా కాబోలు...అచ్చంగా అవే ఆలోచనలు..మళ్ళీ రిపీట్ చెయ్యడం ఎందుకులెండి..ఆపేస్తా ఇక్కడితో. :)

సుజాత వేల్పూరి said...

సౌమ్యా,
మేమే ఇక్కడ నలభై ఇచ్చి కొంటుంటే మీకు ఇంకా నలభై రూపాయల్లో సోనా మసూరి దొరుకుతుందంటే చవకే! ఎక్కడ ? సదరన్ స్టోర్స్ లోనేనా?

నేను గుర్గావ్ లో కాపురానికి వెళ్ళి ఏపీ ఎక్స్ ప్రెస్ దిగగానే మా వారు నాతో మాట్లాడిన మొదటి మాటలు ..."ముందు నాకో ఒట్టెయ్యి, ఏడాది వరకూ రోటీలు, పనీర్ వండనని ఒట్టెయ్యి! ఇంతకీ ఆవకాయ తెచ్చావా? పిచ్చెక్కుతోంది ఇక్కడ" ఇవీ నాతో మాట్లాడిన మొదటి మాటలు!


జాడీ ఆవకాయ నెల్రోజుల్లో అవగొట్టాం..(తెలుగు ఫ్రెండ్స్ కి పందారం కూడా చేశామనుకో)

ఫ్రాఫులదేముందిలే, మనమూ వేస్తాం, దంపుడు బియ్యం తింటే ఎంత ఫైబర్ వస్తుందో చూపిస్తూ!

ఆ.సౌమ్య said...

పాఠోలీ, వంకాయా పులుసు పచ్చడి గోదావరి వంటలా....వా ఆ వా అన్యాయం...మేము మాఇంట్లో వారనికొకసారైనా చేసుకుంటూ ఉంటాం. రెండూ నాకు చాలా ఇష్టం. మేము ఉత్తరకోస్తావాళ్ళం.

ఆ.సౌమ్య said...

మేమూ అంతే మా అమ్మ ఓ పది రకాల పచ్చళ్ళు, ఆవకాయలు పెట్టి ఇస్తే వాటితోనే కాలక్షేపం చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక అదృష్టం...మన కూరగాయలు అరటిపువ్వు అంటే దవ్వ, పనసపొట్టు, పెద్ద వంకాయలు లాంటివన్నీ చక్కగా దొరుకుతున్నాయి. ఒక్క ఆకుకూరలే దొరకడం లేదు..బచ్చలికుర, తోటకూర, చుక్కకూర మొహం చూసి ఎన్నాళ్లయిదో :(...పాలకూరతో మొహం మొత్తేస్తున్నాది.

GKK said...

సగటు తెలుగు మనిషి ’మనసులో మాట’ చాలా చక్కగా చెప్పారు సుజాతగారు. అన్నం,పప్పు, చారు, కూర, పచ్చడి , చివర్లో పెరుగన్నం లేకుండా భోజనం చేసిన తృప్తే ఉండదు. హోటళ్ళలో చేసే రోటీ,మటర్, పనీర్ ఇలాంటివి తినటం ఒక శిక్షలాగా అనిపిస్తుంది.

కృష్ణప్రియ said...

సుజాత గారూ,

:)) బహుచక్కటి మాట చెప్పారు. ఇది మీ మనసులోని మాటే కాదు... నా డైరీ లో ఉండాల్సిన మాట కూడా..!!

నేనూ నూటికి నూరు పాళ్ళూ అంతే.. ఒక పూట ఎలాగైనా వేడి అన్నం, పప్పూ, పులుసు కూర, రోటి పచ్చడీ,.. తినటం..నేనైతే మానలేదు. చూద్దాం.

."ముందు నాకో ఒట్టెయ్యి, ఏడాది వరకూ రోటీలు, పనీర్ వండనని ఒట్టెయ్యి! ఇంతకీ ఆవకాయ తెచ్చావా? పిచ్చెక్కుతోంది ఇక్కడ" ఇవీ నాతో మాట్లాడిన మొదటి మాటలు! --- ఇది మాత్రం సూపర్..

అలాగే..

ప్రపంచం ఎంతో అందంగా కనపడి ఊర్నుంచి వచ్చామని తెల్సీ రాని పనిమనిషిని,మంచినీళ్ళ డబ్బా తీసుకురాని బిస్లరీ వాడిని,హోటల్ రూములో సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయిన మొగుడు గారిని కూడా క్షమించబుద్ధేస్తుంది. --- దీన్ని ఏదీ బీట్ చేయలేదు..

సుజాత వేల్పూరి said...

రవి గారూ, మీకు నేను జవాబుగా రాసిన కామెంట్ అగ్రిగేటర్ లోంచి బ్లాగు ఓపెన్ చేసి చూస్తే సగమే కనిపిస్తోంది, తప్పుగా అనుకోకండి మరి! డైరెక్ట్ గా బ్లాగుకెళ్ళి చూస్తే ఓకే

అరుణ పప్పు said...

సుజాతగారు,
ఈ సారి ఇవన్నీ వొండినప్పుడు నన్ను పిలుస్తారుగా, అల పిలుస్తానని ఒట్టేయ్యండి ఇప్పుడే... ప్లీజ్జ్, ప్లీజ్జ్..
ఇది అడుగుతున్నట్టు కాకుండా, అడుక్కున్తున్నట్టు అనిపిస్తోందా...? నా తప్పు కాదు, భాష తప్పు...

జాన్‌హైడ్ కనుమూరి said...

ఆరోగ్య కారణాల వల్ల నిషేదాగ్ఞలతో రోజులు వెళ్ళదీస్తున్న నా జివ్వకు కొత్త దురద కలిగించారు మీపోస్టుతో

హరేఫల said...

ఈసారి భాగ్యనగరం వస్తే, మీ ఇంట్లో ఒకరోజు 'వారం' చెప్పుకుంటాను! టపాలో వ్రాసినవన్నీ చేసిపెట్టాలి. రాజమండ్రీ లో ఉన్నంతకాలం, వారంలో రెండు మూడు రోజులు మా ఇంటావిడ పనసపొట్టు ఆవ పెట్టి కూరా, ఇంకోరోజు కందా బచ్చలి కూరతో షడ్రసోపేతంగా పెట్టేది. ఇక్కడ బచ్చలికూర అప్పుడప్పుడే దొరుకుతుంది. పనస పొట్టు అనేదే ఉంటుందని తెలియదు ఇక్కడ వాళ్ళకి.

మధురవాణి said...

అబ్బా సుజాత గారూ.. నేనింకా అన్నం మానేసి బతగ్గలగడానికి ఏమైనా చిట్టి చిట్కాలు చెప్పారేమో అనుకుని మహా ఆవేశంగా పరుగు తీస్తూ వచ్చా! ఒకవేళ మీరు చెప్పినా నాకసలు అవి పాటించేంత సీన్ లేదనుకోండి.. అది వేరే విషయం! :D
ఇహ అన్నం విషయానికొస్తే.. జై అన్నం పార్టీ!.. జై జై అన్నం పార్టీ! నేనూ అచ్చం మీ లాగానే! పొద్దున్నుంచీ రాత్రి దాకా ఏదోకటి తింటూ ఉన్నా సరే.. అన్నం తినకపోతే.. ప్చ్.. ఏంటో ఇవ్వాళంతా అన్నం తినలేదు అనిపిస్తుంది నాకు.. ;) ఇక్కడ అన్నీ షాపుల్లో బియ్యం దొరకలేదు కొన్నాళ్ళు.. ఛీ ఛీ ఇదీ ఒక ఊరేనా! బియ్యం దొరకని ఊరు, అన్నం అక్కర్లేని మనుషులు కూడా మనుషులేనా.. అని మా చెడ్డ ఆవేశం వచ్చేసింది నాకప్పుడు. :D

సుజాత వేల్పూరి said...

అరుణా,

వేసేశా ఒట్టు!గమ్మున వచ్చేయండి, వండేస్కుందాం!

ఫణిబాబు గారూ, "వారం చెప్పుకోడం" కాదు! ఒక వారం ఉంటానంటే బొబ్బట్లూ,వంకాయ కారం పెట్టి కూరా,మజ్జిగ పులుసూ,పొట్లకాయ పెరుగు పచ్చడీ, ఉల్లిపాయల పులుసూ...అన్నీ చేసి పెట్టేస్తాను

పరిమళం said...

ఏమైనా టిప్స్ చెప్తారేమోనని ఆత్రంగా తొంగిచూశా :(
డైటింగ్ చేద్దామని రెండురోజులు పుల్కా తింటే నాలుగు రోజులు మళ్ళీ అన్నమే తినేస్తుంటా :)

వేణూశ్రీకాంత్ said...

అబ్బా ఎన్నాళ్ళకి సుజాత గారు.. ఏంటో మీ బ్లాగ్ లో ఇలా ఓ సరదా అయిన పోస్ట్ చూసి చాన్నాళ్ళైనట్లుగా అనిపించింది. పోస్ట్ సరదాగా బాగుంది :-) అన్నం మానేయడం ఎలా అనే విషయమై నో కామెంట్స్ :P

ఆ.సౌమ్య said...

నిజం, వేణు శ్రీకాంత్ చెప్పినట్టు ఈ సరదా పోస్ట్ చూసాక నాకు కొత్త ఉత్సాహం వచ్చింది ఇవాళ.

maa godavari said...

అన్నంలో ఆవకాయ,గోంగూర అదీ చద్దన్నంలో కలుపుకుని తింటే అబ్బో!!!!అదో వైభోగం.
నూకలన్నంలో కొబ్బరికలిపి వండి మా అమ్మ ఆవకాయ ముక్క పెట్టేది.ఆహా ఏమి రుచి.
అది సరే. అన్నం దారి అన్నానిదే.కాదనే దమ్ము ఎవరికుంటుంది. అదీ తెలుగోడిగా పుట్టినోడికి.
కానీ... రొట్టంటే మీరంతా చపాతీలంటరేంటీ?పుల్కాలంటారేంటీ???
జొన్న రొట్టెలు,సజ్జ రొట్టెలు.ఎంత బావుంటాయో తెలుసా?
జొన్న రొట్టె నాటు కోడి పులుసు,
లేదా కర్నూలు వాళ్ళు చేసే పచ్చిమిరపకాయ పప్పు,లేదా పోలూరు వంకాయ కూర ఎపుడైనా తిన్నారార్ ఎవరైనా?
కొర్ర అన్నం చేపల పులుసు
రాగి దోశలు,అవిశె గింజల పొడి,
సజ్జ దోశలు కుసుమల పొడి గొప్ప కాంబినేషన్.
నవధాన్యల రొట్టె పుదీనా పచ్చడి,
అన్నీ అద్భుతంగా ఉంటాయ్.
అన్నమో రామచంద్రా అని మాత్రమే అనకుండా అన్నీ లాగించే అలవాటు చేసుకోవలసిందిగా ఇందు మూలంగా అన్న ప్రాణులకు విన్నవించుకొవడమైనదహో!!!!!!!!!!

Gopal said...

మాకు ఇక్కడ (వారణాశిలో) బియ్యం బాగానే దొరుకుతాయే. క్రిందటి సారి నేను 22 రూ. చేసి తీసుకున్నాను.
ఇక్కడ (వారణాశిలో) పనసకాయ చక్కగా తొక్కుతీసి, చక్రాలు చక్రాలుగా చేసి అమ్ముతారు. ఇంటికి తెచ్చుకుని కొట్టుకోవడమే (ఇంట్లో కత్తి ఉంది లెండి) లేకపోతే మిక్సీ. నార్తు వాళ్ళు పనసకాయఅంటే చెవి కోసుకుంటారు. మనలా పొట్టుకూర వండుకోరు కానీ మసాళా పెట్టి కూర వండుతారు. మాయింట్లో అయితే ఉల్లిఖారం పెట్టి కూడా వండుకుంటాము!! పనసకాయి, మామిడికాయి తో ఊరగాయి పెట్టుకుంటారండోయ్.

మా పాత క్వార్టర్లో పే...ద్ద పనస చెట్టుండేది. సోలసైజు కాయ దగ్గరనుండీ వండడం మొదలు పెట్టేసే వాళ్ళం. పైగా ఊరందరికీ దానాలు కూడా (కాయలకు కాయలు). మాప్రక్కింట్లో నార్తిండియన్ మిశ్రా లవుతే మా అమ్మాయి పెళ్ళి అవుతుంది. పనసకాయలు కావాలని చెప్పేవారు. సరే కోసుకోమంటే మేమంతా పడుకున్నాక చెట్టునుండి చుప్ చాప్ గా సగం కాయలు దింపేసేవారు. మాకు కాయలు ఉండేవి కాదు పక్కింట్లో రోజూ పనసకాయ కూరే!

KumarN said...

చాలా బావొచ్చింది పోస్టు:-)

sphurita mylavarapu said...

అన్యాయం. అన్నం మానెయ్యటానికి ట్రిక్కులేమో అనుకునే చదవటం మొదలెట్టాను. పైగా అన్నం మానెయ్యటానికి ట్రిక్కులు చెప్తూ ఈ photo పెట్టారేంటి అని నవ్వుకున్నాను కూడా...

పెళ్ళైన కొత్తలో మా వారి అరోగ్య సూత్రాల్తో రెండుపూటలా రొట్టెలు, అన్నం only weekends. అన్నం తినటం కోసం ఎంతలా ఎదురు చూసెదాన్నో. పైగా ఆ రొట్టెలు, కూరా వొండే సమయం లో అన్నం, కూరా, పప్పు, పచ్చడీ ఇన్ని చేసెయ్యొచ్చు.

ఇప్పటికీ ఆయన అలానే continue అవుతున్నారు..నేను మాత్రం పొద్దున్న పూట హాయిగా అన్నం తినేస్తున్నా...లేకపోతే మరీ జీవితం లో ఏదో miss అయిపోయిన feeling వచ్చేసి depression లోకి వెళిపోతానేమో అని భయం వేసింది

కొత్త పాళీ said...

అన్నం మానెయ్యడం చాలా వీజీ.
నేను చాలా సార్లు మానేశా! :P

Sharada said...

నా మనసుకి ఎంతో నచ్చే టాపిక్ ఎత్తుకున్నారండీ!
మేమూ వారమంతా ఏ గడ్డీ (రొట్టెలు,ఇడ్లీలు, ఉప్మా!) తిన్నా శని ఆది వారాలు మాత్రం ఇహ మళ్ళీ అన్నం మొహం చూస్తామో లేదో అన్నట్టు అన్నమే తింటాం.
మా పిల్లలైతే వాళ్ళు తినే పిట్ట తిండికి బోలెడు పురమాయింపులు! శనివారం - తోటకూర పప్పూ, గోంగూర పచ్చడి, ఒక వేపుడు కూరా, మరిచిపోకుండా మిరపకాయలు!), ఆదివారం (తమిళ వంట)- సాంబారూ, రసమూ, ఒక ముద్ద కూర ! ఈ మెనుల్లో ఏ మాత్రం తేడాలొచ్చినా మా పన్నెండేళ్ళ చిన్నదాని సణుగుడు భరించలేం! మా పిల్లలిద్దరూ పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా పెరుగన్నమో, చారన్నమో వుంటే బాగుండనే రకాలు! వాళ్ళ గోంగూర fixation భరించలేక మేం పెరట్లో గోంగూర మడి వేసాం.

పాఠోళీ సరే కానీ, ఈ వంకాయ పులుసు-పచ్చడి ఏమిటండీ?

శారద

సుజాత వేల్పూరి said...

లతగారూ,ఇక్కడ కూడా సేమ్ ! అన్నం తినకుండా ఉండే ప్రసక్తే లేదు. ప్రళయం వచ్చినా సరే!

గీత యశశ్వి గారు,

అవును స్పూన్ తో తింటే అన్నం తిన్నట్లే ఉండదు.హోటల్లో ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది. బెంగుళూరులో తెలుగు భోజనం వడ్డించే రెస్టారెంట్స్ లో మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డిస్తారండీ ఇప్పుడు.

నీలాంచల,
మీరూ పనసపొట్టు కూరా ప్రియులేనా అయితే! సరిపోయింది.

సుజాత వేల్పూరి said...

తెలుగు అభిమాని గారూ, నాకూ అంతే అనిపిస్తుంది. ఆ రోటీలు, మసాలా కూరలు ఇవన్నీ తినడం శిక్ష పడ్డట్టే భావిస్తా నేను కూడా

కృష్ణ ప్రియ గారూ, అయితే మీరూ మా పార్టియే! అవును అలాగే ఉండాలి. ఉన్న నాలుగు రోజులూ కడుపునిండా ఇష్టమైన అన్నం కూరలు పచ్చళ్ళు ఊరగాయాలూ తినకుండా ఎల్లా చెప్పండి? ఒకపూట ఎలాగూ త్యాగం చేస్తున్నాంగా?

జాన్ గారూ, సారీ అండీ! అనారోగ్యాలు వచ్చే పడే లోపు ఏదో ఇలా కానిచ్చేద్దామని ప్రయత్నం! అప్పుడెలాగూ నోరు కట్టుకోక తప్పదు గదా!

సుజాత వేల్పూరి said...

మధుర,పరిమళం గారు,

సలహాలు అనుకుని వస్తారనే డిస్ క్లైమర్ మొదట్లోనే పెట్టాను. :-))

మధుర, అన్నం తినని మనుషులుంటారా అని నాక్కుడా బలే ఆషర్యంగా ఉండేది! పరిమళం గారు, మనమూ అంతే ఇక్కడ! నాల్రోజులు రోటీలు తినే సరికి పిచ్చెక్కి ఐదో రోజు కంచం నిండా అన్నం వడ్డించుకుని, దాన్ని తనివి తీరా చూసుకుని మరీ .......అదీ సంగతి!

వేణూశ్రీకాంత్, థాంక్యూ! మీరు చెప్పాక నాక్కూడా అలాగే అనిపించింది. సరదా పోస్టులు రాసి చాలా రోజులైంది. తీరిక లేకపోవడం ఒక కారణం. థాంక్యూ!

సౌమ్య, ఈ ఉత్సాహం మూడ్ లో నీ హిందీ పాండిత్యం టపా టైపులో ఒక మాంఛి పోస్టు రాసెయ్యరాదూ?

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారూ, మీ కామెంట్ భలే ఉంది. నాకు తెలీని బోల్డు వంటలను చెప్తూ! కుసుమల పొడి,పచ్చి మిరపకాయ పప్పు,రాగిదోశలు,అవిశగింజలపొడి ఇవన్నీ కొత్తే నాకు. రొట్టెలంటే ఈ సిటీ జీవితంలో ఈ డైటింగ్ జీవితంలో పుల్కాలే! జొన్న రొట్టెలు చేద్దామని చాలా సార్లు ప్రయత్నించి అవి కాస్తా పెనానికి అతుక్కుపోయి ఘోర వైఫల్యం చెందాక విరమించాను. ఏది పడితే అది తిన్నా సరే, ఒక పూట మాత్రం అన్నం ఉండాల్సిందే! అదీ మా తీర్మానం!

సుజాత వేల్పూరి said...

వేణుగోపాల్ గారూ, బాగుంది మీ పనస ప్రహసనం! ఢిల్లీలో సరోజినీ దేవి మార్కెట్ కూడా పనస ముక్కలు అమ్ముతారుఇ. అవి తెచ్చి మిక్సీలో వేసి పొట్టు చేసేవాళ్ళం మేము! పనస కాయ ఉల్లికారం, ఊరగాయ నాకు కొత్త విషయాలు!

"సోలసైజు" కాయ అనగానే అలా పొడుగ్గా కళ్ళముందు కనపడిందనుకోండి మీ చెట్టు పనసకాయ!మొత్తానికి కాయలన్నీ పక్కింట్లో అప్పజెప్పారన్నమాట.

స్ఫురిత గారూ,

మీరూ ట్రిక్క్లు చెప్తాననే అనుకుని వచ్చారా అయితే? :-))
మరే, నేనూ ఇలాగే కొన్నాళ్ళు రెండు పూటలా రొట్టెలు ప్రయత్నించి విఫలమైపోయాను. పైగా మీరన్నట్లు రొట్టెలు చేసే టైములో బోల్డన్ని వంటలు చేయొచ్చు!

కొత్తపాళీ,

అయితే మీరు శ్రీ శ్రీ పార్టీ అన్నమాట !

శారదగారూ,

అబ్బ, అయితే మీ పిల్లలు ఇన్నాళ్ళ్ బట్టీ అక్కడ ఉంటున్నా తెలుగు భోజన ప్రియులే అన్నమాట!పైగా బ్రేక్ ఫాస్టు కి కూడా పెరుగన్నమా? చాలా బాగుంది వినడానికి! ఇంట్లో గోంగూర మడి పెంచారంటే మీరు వీరాంధ్రులే!

పెద్ద వంకాయ(తెల్లవైతే స్రేష్టమంటారు) కాల్చి తొక్క తీసి అందులో ,చింతపండు పులుసు వేయించిన ఉల్లిపాయలు కలిపి పోపు పెట్టి చేస్తారండీ ఈ పులుసు పచ్చడి. పాఠోళీ కి కాంబినేషన్ మా ఇంట్లో!

Sujata M said...

నాకీ మధ్య ఒక ధర్మ సూక్ష్మం తెలిసింది. అన్నాన్ని నేను మా ఇంట్లో ఎంజాయ్ చేసినంత గా (Parent's House) ఇక్కడ (Uma's House) ఎంజాయ్ చెయ్యలేకపోతున్నా ! ఇక్కడ ఏమో - ఒక్కోసారి జీవం లేని పదార్ధాన్ని తింటున్నట్టు అనిపిస్తూంది. :D Culture Shock ! huh.. :(

BTW - Ignorance కొద్దీ అడుగుతున్నా What is పాఠోళీ ?

తృష్ణ said...

@sujata: ఇది చూడండీ...
http://ruchithetemptation.blogspot.com/2010/09/blog-post.html

ఇంకా మా ఇంట్లో గోరుచిక్కుడుకాయల కూరలో కూడా శనగపిండి వేసి పాఠోళీ చేస్తారండి.

@సుజాత: బావుదండీ టపా సరదాగా.

సరళ said...

అబ్బ ఇన్ని రొజులు నేను ఇవన్నీ ఎలా మిస్ అయ్యాను..? ఎదో ఫ్లూక్ గా ఈ బ్లాగ్ లొ కొచ్చి పడ్డాను అంతే ఇంత వరకు సిస్టం ఆఫ్ చెయ్యకుండా అన్ని ఒక్కరొజే చదివెయ్యాలనే ఆరాటం....

అన్నం అంటే గుర్తొచ్చిందండోయ్ మీతో ఒక విషయం చెప్పాలి ..అందుకే ఇక్కడ ఆగాను..
నేను అమెరిక వచ్చి రెండేళ్ళవుతోంది , కొత్తల్లో నన్ను ఒకావిడ (ఆంధ్ర లొ పుట్టి పాతికేళ్ళు అన్నమె తిని పెరిగి వచ్చినావిడ) ఎమడిగిందో తెలుసా? (నా లంచ్ బాక్స్ చూసి ?) " ఓహ్ మీరింకా అన్నమే తింటున్నారా?' అని. అసలే కొత్త ఎమి చెప్పాలో తెలియక నవ్వి వురుకున్నాను ,ఇప్పటికీ ఆ ప్రశ్నకి సమధానం నాకు తెలియదు.. ఏవరికైన సమాధానం తెలిస్తే చెప్పండి.

వీలైతె ఈ ఆర్టికల్ ఆమెతొ చదివించాలని కోరిక..

సుజాత గారు చాలా రోజుల తరువాత కొత్తగా పెట్టిన ఆవకాయ తో సారీ మీ మాగాయ తొ అన్నం తిన్నంత త్రుప్తిగా వుందండి.

అవునూ అన్నం తినకుండ ఎలా ఉండగలం ? ఏ తిండి ఎంత తిన్న కొంచెమన్న అన్నం తినక పోతె పస్తున్న ఫీలింగె సుమా నాకు.
నా పతిదేవుడు పుత్రికా రత్నమైతే (వాళ్ళకి బైట తిండి మహా ఇష్టంలే..) బైట తిండానికి పొయెప్పుడల్లా నా మీద జోకులు 'కొంచెం పెరుగన్నము మమిడికాయ పచ్చడి తెచ్చుకోరాదు నువ్వాకలికి తట్టుకోలెవు అనీ

ఇదే మొదటిసారి నేను పబ్లిక్గ రాయడం.. తప్పులున్న బోర్ కొట్టించిన క్షమించండెం..

సరళ said...

నా పేరు రాయడం మర్చి పోయానండోయ్ ... సరళ

సుజాత వేల్పూరి said...

సరళ గారూ, మీకు నా బ్లాగు నచ్చినందుకు థాంక్యూలు!

అవును, ఏం తిన్నా ఎన్న్ని తినా రోజులో ఒక్కసారైనా అన్నం తినకపోతే పస్తున్న ఫీలింగే వస్తుంది. వారాల తరబడి వెకేషన్లో గడిపినప్పుడు నాకు అంతా శూన్యంగా కనిపిస్తుందొక్కోసారి! రొట్టెలూ పనీర్ లూ మంచూరియాలు తినీ తినీ! ఈ సారి ఒక బుల్లి రైస్ కుక్కరు, కాస్త ఆవకాయో గోంగూరో సీసాలో పడేసి పట్టుకెళ్ళాలని డిసైడ్ చేశాను.

Post a Comment