మధ్యాహ్నం మా పిన్ని కొడుకు బొకారో నుంచి ఫోన్ చేశాడు. పిచ్చాపాటీ కబుర్లయ్యాక టాపిక్ సెలవులవైపు మళ్ళింది. "వెళ్తున్నారా మన వూరికి" అన్నాడు వాడు. "అక్కడ రోజంతా కరెంట్ ఉండదురా, అంత ఎండలు కూడా ఇప్పుడు భరించలేం కదా" అన్నాను."మన చిన్నప్పుడు ఇలా అనుకునే వాళ్ళం కాదు కదే! సెలవుల కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళం?" అన్నాడు వాడు గత స్మృతుల్లోకి జారుతూ! నేనూ యధాశక్తి సహకరించి అవి నెమరేసుకున్నాను.
చివరి పరీక్ష ముగుస్తూనే అర్జెంటుగా ఎవరో టెలిగ్రామ్ ఇచ్చినట్లు అందుబాటులో ఉన్న చెత్త సినిమా అయినా సరే చూసేసేవాళ్ళం! మర్నాటి నుంచీ ఏదో పెద్ద ఖాళీగా ఉన్నట్లు పోజులు! కానీ కొద్దిగా కూడా తీరిక దొరికేది కాదు. ఊళ్ళో ఉన్న చుట్టాల పిల్లలూ,కజిన్లూ,విజయవాడ నుంచి మావయ్య కొడుకూ కూతురూ వచ్చేసేవాళ్ళు.
అందరం కల్సి ఎంత హడావుడి, ఓపెన్ గా చెప్పాలంటే భీభత్సం సృష్టించే వాళ్ళమో ! రోజంతా బాదం చెట్టు (ఇప్పుడు లేదు) కింద మడత మంచాలు, నవారు మంచాలు వేసి సీతారాములు(చీట్లు వేసి ఆడే ఆట! స్కోరు గుర్తుందా, రాముడికి వెయ్యి,సీతకి సున్నా! రాముడు సీతను కనుక్కుంటేనే వెయ్యి...)వగైరాలు ఆడేవాళ్ళం.
ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అమ్మ పిలిచినపుడు వెళ్ళి తినడం, మళ్ళీ ఆటల్లో పడటం. సాయంత్రాలు బావి దగ్గర మగపిల్లలంతా వరసబెట్టి స్నానాలు చేయడం,(బట్టలు ఉతకలేక సీతారావమ్మ చచ్చిపోయేదనుకోండి...) ఆడపిల్లలకు అమ్మ,అత్తయ్య(మా పక్కిల్లే) కూచోబెట్టి జడలు వేయడం....ఇల్లంతా ఏదో పెద్ద తిరణాల్లా ఉండేది.
ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అమ్మ పిలిచినపుడు వెళ్ళి తినడం, మళ్ళీ ఆటల్లో పడటం. సాయంత్రాలు బావి దగ్గర మగపిల్లలంతా వరసబెట్టి స్నానాలు చేయడం,(బట్టలు ఉతకలేక సీతారావమ్మ చచ్చిపోయేదనుకోండి...) ఆడపిల్లలకు అమ్మ,అత్తయ్య(మా పక్కిల్లే) కూచోబెట్టి జడలు వేయడం....ఇల్లంతా ఏదో పెద్ద తిరణాల్లా ఉండేది.
ఎన్ని కిరాణా సరుకులు, చిరుతిళ్ళు తెచ్చినా ఇట్టే అయిపోయేవి. ఆటల్లో పడి తెలీకుండానే రాక్షసుల్లా తినేవాళ్ళమనుకుంటా! అమ్మ ఎంతెంత వంటలు చేసేదో పాపం..విశ్రాంతే ఉండేది కాదు! అప్పుడు తెలీలేదు అమ్మను పట్టించుకోవాలని!
ఎండగా ఉన్నా, బాదం చెట్టు కింద నుంచి కదిలేవాళ్ళం కాదు.రస్నా కలుపుకుని తాగడాలు,అమ్మ ఆవకాయ కలిపిన రోజు ఆవకాయ కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ముద్దలు పెడితే (ఇది దాదాపు అందరికీ అనుభవమే) ఎగబడి తినడాలు ఇలా గడిచిపోయేవి.
వీళ్ళల్లో ఇంజనీరింగ్ ఫైనలియర్,డిగ్రీ ఫైనలియర్ చదివే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కజిన్లందరితో కల్సి సెలవులు మా ఇంట్లో గడపడం ఒక మజా అన్నమాట. పేకాట,వగైరా ఆటల్లోకి పిల్లలమైన మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయాల్లో మేము దాడి,పరమపద సోపాన పటం వంటివి ఆడాల్సివచ్చేది.
వెన్నెల రాత్రులు మరీ అందంగా ఉండేవి. వెన్నెలా నీడా ఆటలాడటం, వెన్నెల్లో పెద్ద పువ్వులాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడలో మంచం వేసుకుని వెన్నెల్ని పరిశీలించడం, జామచెట్టెక్కి దూకడాలు,గేటెక్కి అక్కడ అల్లుకున్న సన్నజాజి పందిరి మీద మొగ్గలు కోయడం,దానితో పాటే ఎర్రచీమల చేత కుట్టించుకోడం అన్నీ బాగుండేవి.
రాత్రుళ్ళు ఆరుబయటే నిద్రలు కాబట్టి అమ్మ ఎర్రని కూజాలో నీళ్ళు నింపి పెట్టేది.(దాన్ని కమండలం అనాలిట) సింహం మూతి ఉండేది దానికి. దాహమైనా కాకపోయినా అందులో నీళ్ళు వంచుకుని తాగడం ఒక ఫాసినేషన్!
నెలన్నర ఇలాగే గడిచేది. వచ్చే క్లాసు పుస్తకాలు కొనడాలు,యూనిఫారాలు కుట్టించుకోడాలు ఇవన్నీ జూన్ 13 తర్వాతే! వీళ్ళలో మగపిల్లలు ఎంత అల్లరి చేసేవాళ్ళంటే వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎంతగానో ఎదురు చూసి చూసి, వాళ్ళు వచ్చిన మర్నాడే "వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతార్రా బాబూ"అనిపించేంత ఘోరమైన అల్లరి.
సెలవులు ముగిశాక వీడుకోలు చాలా ఉద్వేగ భరితంగా ఉండేది. ఏడుపులు....దిగుళ్ళు, నాన్నగారి తిట్లు...అదో పెద్ద గోల!
* * * *
ఇదంతా చెప్పుకుని నేనూ మా అన్నయ్యా ఫోన్లోనే బెంగ పడ్డాం!"ఆ రోజులు భలే ఉండేవిరా! ఇప్పుడు చూడు...పిల్లలకు సెలవులిచ్చినా లాభం లేదు.ఏదో ఒక యాక్టివిటీ,సమ్మర్ కాంపులు,లేదా మరోటి! ఏప్రిల్‌లోనే కొత్త పుస్తకాలూ,యూనిఫారాలు, ఎంత బర్డెనో వీళ్ళకి. వచ్చే అకడమిక్ ఇయర్ కి ఇప్పటినుంచే తయారు కావడం! ఏవేవో కోచింగులు!ట్యూషన్లు! ప్రతొక్కరూ పండితుడో, పండితురాలో కావాలని అందరికీ ఆశే" అని నేనూ.....
"ఏమి కోచింగులో ఏమో! అమ్మమ్మ ఇంటికో బామ్మ ఇంటికో వెళ్ళి సిటీలకు దూరంగా కొన్నాళ్ళు గడిపే చాన్సే లేదు వీళ్ళకి. రిటైర్ కాగానే బామ్మలూ,తాతయ్యలూ కూడా ఇక్కడికే వస్తున్నారుగా! పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపాలంటే భయమాయె! ఎవరేం చేస్తారో తెలీదు. ఎంత సేపూ కంప్యూటర్ గేములో, లేక టీవీ చూడ్డమో....పిల్లలు సహజత్వానికి కొద్ది కొద్దిగా దూరమైపోతున్నారని బెంగగా ఉంది నాకు.."అని వాడూ ఒకరి బాధ ఒకరు చెప్పుకున్నాం!
ఏదో సీడీ కావాలని మా ఇంటికి వచ్చిన మా బంధువులమ్మాయి మైథిలి (ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తూంది) ఇదంతా వింటూ కూచుంది.
నేను ఫోన్ పెట్టేసి ఇంకా ఆపాత మధురిమల్లోంచి తేరుకోకముందే గొంతు సవరిచుకుని ఇలా అంది.....(ఇంకో మాటలో నాకు క్లాసు తీసుకున్దన్నమాట)
"నాకు తెలీకడుగుతానూ, మీరంతా(తల్లిదండ్రులు) ఈకాలం పిల్లలమీద ఎందుకింత జాలిపడుతుంటారు? మాకేం తక్కువైందని? హాయిగా చదువుకుంటున్నాం,ఇష్టమైన పనులు చేయడానికి డబ్బు మీరు ఎంతోకొంత ఖర్చు పెడుతున్నారు! మీరు తొటల్లో,దొడ్లలో ఆడుకుంటే మేము పార్కుల్లో,ప్లే గ్రౌండ్స్ లో ఆడుకుంటున్నాం! మీరు పదిమంది ఉంటే మేము ఇద్దరమో ముగ్గురమో ఉంటాం!అయితే ఏంటి?
ఏదైనా సరే నేర్చుకోడానికి మాకు ఉన్నన్ని అవకాశాలు మీకున్నాయా? కంప్యూటర్ అనేది మీ చిన్నప్పుడే ఉంటే మీరు ఇంకా ఎన్నో నేర్చుకునేవాళ్ళు కాదూ? అన్నింటిలోనూ ముందుండాలనీ,ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకునే పిల్లలకు మీ మాటలు ఎంత నిరాశ కల్గిస్తాయో తెలుసా?
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికో,బామ్మ ఇంటికో వెళ్ళి నెలల తరబడి వాళ్ళను పట్టుకు వేలాడితేనే సెలవులు ఎంజాయ్ చేసినట్లా? అసలు మాకున్నన్ని అవకాశాలు మీకు లేవని బెంగ పడరే?
మా బాల్యాలు కూడా మీ బాల్యం లాగే గడవాలని మీరు కోరుకోవడం ఏమిటి?మా అమ్మ కూడా ఇంతే!ఎప్పుడూ మాకేదో అన్యాయం జరిగిపోయినట్టు "వీళ్ళకసలు జీవితమే తెలీట్లేదు" అని ఓ..బాధపడుతూ ఉంటుంది.
మీ జీవితాలని మీరు ఎంజాయ్ చేసినట్లే మా జీవితాలు మేమూ ఎంజాయ్ చేస్తున్నాం! మా యాక్టివిటీలు,ఫ్రెండ్స్,కంప్యూటర్ గేములు, సిటీ లైఫ్ అన్నీ బాగానే ఉన్నాయి మాకు.
మీకూ మాకూ ఉన్న ఇంటర్ జనరేషన్ గాప్ ని మీరు ఎందుకు అర్థం చేసుకోరు?"మీలాగే"మేమూ ఉండాలని "మీలాగే" మేమూ బతకాలని ఎందుకు కోరుకుంటారు?
మీ మాటలు వింటుంటే గొప్ప గందరగోళంలో పడిపోతున్నాం మేము! మేము బతికేది సరైన పద్ధతి కాదా?అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునేలా చేస్తున్నాయి మీ మాటలు.మేము సుబ్బరంగా ఉన్నాం! జీవితాల్ని కోల్పోడం లేదు.
ఎప్పుడూ "ఆ రోజులు" అంటూ పాతకాలంలోకి వెళ్ళిపోతూ.. మమ్మల్నీ అటు లాక్కుపోయే ప్రయత్నం చేయకండి. మేము రాము...." అంది
అంటే ఇదంతా ఆ పిల్ల ఇలాంటి తెలుగులో చెప్పలేదు. చదివే వాళ్ళకు అనుకూలంగా ఉండాలని నేనే అనువదించాను.
ఆ అమ్మాయితో నేను త్వరలో మాట్లాడతాను, పరీక్షలయ్యాక! దాని మాటలు నన్ను ఆలోచనలో పడేశాయన్నది ఒప్పుకుంటున్నాను!(అంటే నన్ను మార్చేసాయని కాదు)
మైథిలి మాటలని మీరైతే ఎలా అర్థం చేసుకుంటారు?ఏమని జవాబిస్తారు? తెలుసుకోవాలని ఉంది.
రాసేముందు ..ఒక్కసారి మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఎలా గడిచాయో గుర్తు చేసుకుని రాయండి.
26 comments:
Hi Sujathagaru,
I agree with Mithili, they have their way of enjoying life.Like we enjoyed sitharamulu acchandakayalu, thokkudubilla ....., they enjoy their Galli cricket videogames and computers...
Madhavi
మీరన్నట్లు వేసవి సెలవులను మనం కొద్ది తేడాలతో అలానే ఎంజాయ్ చేశాం. ఆ రోజుల్లో అది మనకు గొప్ప. ఇప్పటి జెనరేషన్ కి అదంతా ఓ సోది . వాళ్ళ ప్రయారిటీస్ వేరు. వాళ్ళ ఇంటరెస్ట్ లు వేరు. కంప్యుటర్లూ, చాటింగ్ లూ , ఫ్రెండ్స్ ఫేస్బుక్, ఆర్కుట్ ప్రస్తుతం ఎక్కువగా వాళ్ళ లైఫ్ ఇదే. మనమే మారి వాటి వైపు పోతున్నమేమో
మీరన్నట్లు వేసవి సెలవులను మనం కొద్ది తేడాలతో అలానే ఎంజాయ్ చేశాం. ఆ రోజుల్లో అది మనకు గొప్ప. ఇప్పటి జెనరేషన్ కి అదంతా ఓ సోది . వాళ్ళ ప్రయారిటీస్ వేరు. వాళ్ళ ఇంటరెస్ట్ లు వేరు. కంప్యుటర్లూ, చాటింగ్ లూ , ఫ్రెండ్స్ ఫేస్బుక్, ఆర్కుట్ ప్రస్తుతం ఎక్కువగా వాళ్ళ లైఫ్ ఇదే. మనమే మారి వాటి వైపు పోతున్నమేమో
అమ్మాయి చెప్పినది నిజమేననిపిస్తోందండీ నాకైతే...
మా అమ్మా, నాన్నా వాళ్ళ చిన్నప్పటి ఆటల గురించి కధలు కధలు గా చెప్తూనే వుండేవారు...ఇప్పటికీ చెప్తున్నారు...ఇంకొన్నాళ్ళలో నేనూ నా కూతురికి చెప్తాను default గా.ఈ మధ్య నా చిన్నప్పుడూ అని చెప్తుంటే మా పిన్ని నవ్వు...అప్పుడే నీ generation వాళ్ళు మా చిన్నప్పటి గాధలు మొదలెట్టేసారా తల్లీ అని
ఎవరి బాల్యం వాళ్ళకి మధుర స్మృతే...కానీ ఆ బాల్యం లో వుండగా ఆ విషయం ఎవ్వరికీ అర్ధం కాదనుకుంటా...అప్పట్లో మరి మేమంతా ఛీ ప్రపంచం లో అన్ని కష్టాలూ చిన్న పిల్లలకే అని తెగ feel ఐపోయేవాళ్ళం.
మీ మైథిలి చాలా practical గా అలోచించింది...మన బాల్యం లా వాళ్ళ బాల్యం వుండాలనుకోవటం కూడా మన కలల్ని వాళ్ళ నెత్తిన రుద్దటం లాంటిదే అవుతుందేమో అనిపిస్తోంది అలోచిస్తుంటే...చాలా సున్నితమైన అంశం, అలోచన రేకెత్తించే టపా...మీ సైలి లో చక్కగా రాసారు
ఆహా.. సూపర్ టాపిక్..మా చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయి .. ఈతలు, క్రికెట్, కబడ్డీ, బావుల వెంట తిరుగుడు, ఇంక పచ్చీస్, ఓణ గుంటలు,.. ఇలాంటివి ఆడేవాళ్ళం.. సాయంత్రం అయ్యిందంటే మా పక్క ఇళ్ళ వాళ్ళు అందరు ఒక దగ్గర చేరి ముచ్చట్లు మొదలు పెట్టేవాళ్ళు.. మా ఆటలు, వాళ్ళ ముచ్చట్లు, మద్యలో చిన్న చిన్న టిఫిన్లు.. ఆదివారం దూరదర్శన్ సినిమా కి పది ఇరవై మంది కలిసి చూడటం.. ఆహా.. పట్నం పల్లెకి పొతే సూపర్ ఉంటది...
చదువుతూనే ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళిపోయా.
ఐనాపురం కళ్ళల్లో కదిలింది, మనసులో మెదిలింది.
పెరట్లో కూర్చుని తరవానీ లో ఆవకాయ తినడం,
వీధి అరుగుల మీద నలుగు స్తంబాలాట ఆడడం,
పొలాలకి (నక్కతిప్ప, పల్లె పాలం) వెళ్ళడం, బంగినపల్లీ మావిడి పళ్ళు చెట్లెక్కి కొయ్యడం, వీధి లో వెళ్ళే ప్రతీ బండిని ఆపి, కొని తినడం, హౌసీ ఆడడం....... ఇదో పెద్ద టపా అయిపోతుంది.
బాల్యాన్ని నెమరు వేసుకునే లోపు ఈ ట్విస్ట్ ఏంటి ?
నేనూ ఇప్పటి పిల్లల గురించి జాలిపడే లోపు జాలి పడాలో పడకూడ దో అనుమానం వచ్చేడట్టు చేసారు .
నేను ఎప్పుడూ ఆలోచించని కొత్త కోణం లో చూసింది అనిపించింది ఆ అమ్మాయి . ఆమె చెప్పినది కొంత వరకూ కరెక్టే కదా అనిపించింది.
కానీ చదువుల వత్తిడి మాత్రం ఇలా ఉండేది కాదు అప్పట్లో. అంత మాత్రం బాగా చదవుకోలేదా నేర్చుకోలేదా అప్పుడు.
కుదిరితే ఒక టపా వేస్తా .. కాసుకోండి :D
వాసు
సుజాత గారూ,
ఆలోచన రేకెత్తించే పోస్ట్ రాసారు అభినందనలు....
బాల్యాన్ని తడుముకుని మనసుని రీఛార్జి చేసుకోవడం వేరు...పిల్లలకి క్లాసు తియ్యడం వేరు....
గతకాలం మేలు వచ్చుకాలం కంటెన్...'అని కవులు చెప్పిన స్వభావం వ్యక్తులలో ఉండడం సహజం....అయితే మీ పాప చెప్పిన మాటలని మనం ఎలా అర్ధం చేసుకుంటాం....'మా చిన్నపుడైతేనా!!' అని మనం చెప్పినవల్లా ఇప్పటి తరానికి ఎలా ఉపయోగ పడవో....మీ పాప చెప్పినవన్నీ కూడా మనిషి ఎదగడానికి సంపూర్ణంగా ఉపయోగ పడేవి కాదు....
అలాగని మన అనుభవాల నుంచి పిల్లలు ఏమీ నేర్చుకోలేక పొతే...ఇంత కాలం మనం చేసింది జీవం లేని ప్రయాణమే అవుతుంది...అలాగే కొత్తని స్వీకరించడానికి మనం సిద్ధంగా లేకపోయినా జీవించడానికి మనం సిద్ధపడనట్లే అవుతుంది....
మీ పోస్ట్ చదివాక మీ పాపకి నా మాటగా రెండు విషయాలు కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి...
25 ,30 ఏళ్ల కిందట వరకూ మనుషులు సమూహంలో ఎక్కువ సమయం గడిపేవారు...అందులోంచి కష్టాలూ,సుఖాలూ కలిసి పంచుకునేవారు...ఇపుడు మనుషులు వంటరిగా ( ఎక్కువ సమయం ) గడపాల్సి వస్తోంది....మీరన్నారు కదా సాహిత్యంలో వర్గీకరణలు అని ఇదీ అంతే...వ్యక్తులు ఒక్కొక్కరూ ఒక్కో వర్గీకరణకి గురి అవుతున్న సందర్భం ఇది..
అప్పటి జీవితంలో మానవీయ స్పర్శ ఉండేది .ఇప్పటి జీవితంలో యాంత్రిక స్పర్శ ఉంటోంది...ఏది హాయిని ఇస్తుందో...పిల్లలకి మనం చెప్పాలి....
అప్పటి జీవితంలో వ్యాపారం ఒక భాగం...ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో జీవిస్తున్నాం మనం...జీవితానికీ వ్యాపారానికి తేడాని పిల్లలకి చెప్పాలి.
పాత కొత్తలతో సంబంధం లేకుండా సార్వకాలిక విలువలు కొన్ని ఉంటాయి...అవి ఇప్పటి జీవితంలో లేనట్లుగా మనకి అన్పిస్తే వెతుక్కోడానికి వెనక్కి ప్రయాణం కట్టడం అనివార్యమూ,అత్యవసరమూ కూడా...
అయితే ఆ ప్రయాణం వెనకే ఉండిపోడానికి కాదన్న ఎరుక మనకి ఉంటే చాలు...
(అమ్మయ్యో...సుజాత గారూ..బ్లాగ్ ప్రపంచంలోకి వచ్చాక ఇంత పెద్ద కామెంట్ రాసే సాహసం ఎపుడూ చేయలేదు..తప్పంతా మీ పోస్ట్ దే)
"చివరి పరీక్ష ముగుస్తూనే అర్జెంటుగా ఎవరో టెలిగ్రామ్ ఇచ్చినట్లు అందుబాటులో ఉన్న చెత్త సినిమా అయినా సరే చూసేసేవాళ్ళం!"
" పేకాట,వగైరా ఆటల్లోకి పిల్లలమైన మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయాల్లో మేము దాడి,పరమపద సోపాన పటం వంటివి ఆడాల్సివచ్చేది." (నిజమే ఇది పే..ద్ద రాచ్చచుల కుట్ర. నేనూ ఏకీభవిస్తున్నాను)
వా :(..... ఇంటికెళ్ళి పోతా :(......
మీ బంధువులమ్మాయి కోణం లో తను చెప్పింది కరెక్ట్ గా ఉన్నా. కొన్నేళ్ళు పోయాక తను కూడా వాళ్ళ పిల్లలతో "మా చిన్నప్పుడు శలవుల్లో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో తెలుసా?" అని ఖచ్చితంగా అంటుంది.
ఎవరి బాల్యం వాళ్లకి అపురూపం మరి.
సుజాత గారు,
మీ ఇద్దరూ "correct". ఆ విధమయిన సంభాషఱ కుటుంబాల లొ ఆలొచన ను పెంచుతుంధి. మా కు, ఇక్కద CA,USA లొ పిల్లలు ఆడుకొవడానికి చెట్లు, బొల్దు ఖాళీ స్థలం , చాలా మంది పిల్లలు ఉన్నారు.
మీ "Cities" కన్నా చాలా నయం. :)
మంచి టపా సుజాతగారు. మల్లి గారి వ్యాఖ్య చాలా బాగుంది. Tv ,computer,cell పిల్లలు విపరీతంగా అతుక్కుపోతున్నారు. ఎక్కడ ఆపాలో వాళ్ళకి తెలియదు. చెప్పినా వినరు.
ఏదన్నా తినను అంటే "ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి" అని మా అమ్మ సామెత చెప్పేది. అలాగ ఆ అమ్మాయి చెప్పింది ఈతరంవాళ్ల దృష్టిలో కరక్టే కానీ "ఆ" రోజుల్లోకి వెళ్తే కదా " ఆ " ఆనందం, వాటి ప్రత్యేకత అర్ధమయ్యేది. (సామెత ఏప్ట్ గా ఉంటుందని వాడాను. ఆ అమ్మాయిని ఎద్దు అనాలని కాదు. క్షమించగలరు.)
మా ఇంట్లో అందరం కలివటం తక్కువ కానీ పెద్దమ్మావాళ్ళ ఊరు భీమవరం, పిన్నీ వాళ్ల నర్సాపురాల్లో కలిసేవాళ్ళం ఎక్కువగా. మావయ్యావాళ్ళిల్లు ఊళ్ళో ఉంటే అక్కడా, వైజాగ్‌లోని ఆఖరి మావయ్య ఇంట్లో...ఒకోసారి ఒకో చోటా కలిసేవాళ్ళం.
ఎవరొస్తారా ఈ శెలవుల్లో అని ఎదురుచూడటం,ఇల్లంతా పరుగులు...అరుపులు కేకలు, దెబ్బలాటలు, పేచీలు, దొంగా-పోలీస్ ఆటలు, గవ్వలాటలు, తొక్కుడుబిళ్ళ, గచ్చకాయలాటలు, పేకాటలు, వీధిలోని పాపిడీ బండివాడి కోసం ఎదురు చూడటం, అందరం కలిసి కూరలు తరుగుతూ, బీచ్‌లో గవ్వలు ఏరుకుంటూ, బట్టలన్నీ ఇసుక చేసేస్కుంటూ, దొడ్లో పూలన్నీ మాలలు కట్టించుకుంటూ(అప్పటికి మాల కట్టుకోవటం రాదు మరి)...ఈ చోట్లన్నింటికీ వెళ్ళటానికి అమ్మని కాకాపట్టి నాన్న పర్మిషన్ అడిగించటం...మధురమైన స్మృతులు...ఇప్పటి పిల్లలు ఎంత ఎంజాయ్ చేసినా మనం అనుభవించిన ఆనందం ముందు అవన్నీ బలాదూర్ అని నొక్కి వక్కాణిస్తున్నాను....:)
"ఆవకాయ కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ముద్దలు పెడితే (ఇది దాదాపు అందరికీ అనుభవమే) ఎగబడి తినడాలు.."
డిటో..
అదేమిటో పరీక్షలవ్వగానే సినిమా చూడాలని రూల్ ఉన్నట్లూండేది. చూడకపోతే భూకంపమే ఇంట్లో...:)
సుజాత గారూ, నన్ను తిట్టనంటే ఒక ప్రశ్న అడుగుతానండీ. రాముడు-సీత చీట్ల ఆట నేను మఱిచిపోయాను. కొంచెం ఎలా ఆడుతారో ఏమిటో వివరాలు చెప్పి గుర్తుచేయరూ? ఇప్పుడు నాకు గవ్వలతో వైకుంఠపాళీ ఎలా ఆడాలో... అదొక్కటే గుర్తుంది. :(
మన జీవనవిధానం రోజురోజుకూ మారుతోంది. మారనని మడికట్టుకుని కూర్చుంటే ఈ సమాజంలో మనని ఒక మూలకు నెట్టేసేంత వేగంగా మారుతోంది. ఈ మార్పు మంచికో చెడుకో అన్న ఆలోచనలు ప్రక్కన పెడితే, మనం మహానుభావులమో మార్గదర్శకులమో కాకపోవటం వలన, మనకు మారక తప్పని పరిస్థితి నెలకొని ఉంది.
ఏ తరమైనా సరే, వారు పుట్టే సమయానికి వారి తల్లిదండ్రులు ఏమేం చేస్తున్నారో ఎలా బ్రతుకుతున్నారో... సరీగ్గా అక్కడే వారు ప్రారంభమయ్యేది. క్రొత్తతరంవారు అలాంటి జీవితాలకే అలవాటుపడతారు. వారు పెరిగే పరిసరాలలోనే ఆహ్లాదాన్ని వెతుక్కుంటారు.
నేటి తరానికి కొంచెం ముందుతరంలోనైనా సరే, నగరాలలో పుట్టిపెరిగినవారి బాల్యాలు నేటితరం పట్టణాలలో పుట్టి పెరుగుతున్నవారి బాల్యాలతో పోలిస్తే పెద్ద తేడాగా ఉండవు. పట్టణాలు పల్లెటూళ్లు కూడా నగరాలలా మారుతున్నాయి కనుక. ఈ నాగరీకరణగుఱించి కాక వేఱే దేనిగుఱించి ఆలోచించినా మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కానీ పైన చెప్పుకున్నట్టు ఈ ప్రవాహంలోకి నెట్టబడుతున్నాం, మనను మనమే నెట్టుకుంటున్నాం, కొట్టుకుపోతున్నాం.
నేటి తరం వారికి ఆహ్లాదకరమైన వాతావరణం తెలియదు అని అనుకునే ముందు, అసలు మనమైనా ఈమధ్యకాలంలో మనకు తెలిసిన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంతకాలమైనా గడిపామా అని చూచుకోవాలండీ. మనకి నేడు ఆ ప్రశాంతత లభిస్తే, పిల్లకాయలకు కూడా అది చూపించచ్చు. మనకే లభించనప్పుడు పిల్లకాయలతో అప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేది అని చెప్పటం తప్పితే ఏమీ చేయలేము. :(
ఉదాహరణకు, మా చిన్నప్పుడు మా ఇంటి చుట్టుప్రక్కల బోలెడన్ని తోడలు ఉండేవి. ఆడుకోవటానికి కావలసినంత ఖాళీ ప్రదేశం. దగ్గఱలోనే పంటకాలవ. హాయిగా ఎగురుతూ తుళ్లుతూ ఆడుకునేవాళ్లం. ఇప్పుడు అవన్నీ ఇళ్లుగా మారిపోయాయి. మా యింటికి వెళితే అసలు ఆ చుట్టుప్రక్కల పిల్లలే కనబడడం లేదు! ప్చ్! :(
Hi,
Mithili is right. The point here is it is not about the ways of enjoying or having a good time..... it is more about how people sometimes make children feel like they are lacking/missing something and hence are having a less wholesome life.
Elders need to realize that this might unnecessarily make children feel guilty or feel less privileged.
Mythili is right.Our generation likes to live in our way than our parents way.My parents used to like playing games outside but we like to play games on computer online and games on PS3's...
టపా చదివి స్పందించిన మిత్రులందరికీ బోలెడు ధన్యవాదాలు!
వీరిలో మల్లి, శంకర్,తృష్ణ,వేణు,వాసు,రాఘవల అభిప్రాయాలు నా అభిప్రాయానికి దగ్గరగా ఉన్నాయి.
అంటే మిగతా వారితో విభేదిస్తున్నానని కాదు.
ఇంటర్ జనరేషన్ గాప్ ని నేను నోరు మూసుకుని అంగీకరిస్తాను. ఇప్పటి పిల్లలకు ఉన్న అవకాశాలు మనకు అప్పట్లో లేకపోవడాన్నీ ఒప్పుకుంటాను. అంతమాత్రం చేత ఇప్పటి పిల్లలు బాల్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని అంగీకరించలేను. నీళ్లు, మట్టి,చెట్లు,.....వీటన్నింటితో సంబంధం లేని... అసలు ప్రకృతితో మమేకం కాని బాల్యం ఒక బాల్యమా? అప్పుడైనా ఇప్పుడైనా?
పుట్టిన రెండేళ్ళకే ప్లే స్కూలు తో మొదలయ్యే విద్యాభ్యాసం నాకు చాలా బాధ కల్గించే విషయం! "అక్కడంతా బొమ్మలేగా ఉండేది? ఆడుకోడమేగా" అంటారేమో, అమ్మ ఒడిలో చీకూ చింతా లేకుండా ఆడుకోవలసిన వయసులో తోటి పిల్లలతో కల్సి రంగులు, ఆకారాలు గుర్తిస్తూ టేబుల్ మానర్స్ నేర్చుకుంటూ గడిపే పిల్లలంటే జాలి, దుఃఖం ! కానీ అనేకమంది పిల్లలకు ఇది ఇవాళ అనివార్యం!
పిల్లలు టీనేజ్ లో కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచ్బనల్లో సంచలనాత్మక మార్పు వస్తుంది. అంతకు ముందు నించే వారి ప్రపంచంలో కొంత సహజత్వం ఉండేట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే నిశ్చయంగా! తాము ఎలా పెరిగామో, తమ బాల్యాలెలా గడిచాయో , అందులోని మాధుర్యమేమిటో పిల్లలకు తెలియజెప్పడమే కాక ప్రాక్టికల్ గా అనుభవంలోకి కనీసం అప్పుడప్పుడు తీసుకురావలసిన అవసరం ఉందని నేను నమ్ముతాను. రాఘవ చెప్పినట్టు ఈ నాగరిక జీవన ప్రవాహంలోకి మనం నెట్టబడుతున్నాం! ఆ ప్రవాహంలో ప్రయాణిస్తూనే అప్పుడప్పుడు చేతికందిన అవకాశం ఆసరాతో ఒడ్డుకొచ్చి ప్రశాంతంగా పారే జీవిత నదీ నదాల్ని కూడా గమనించే అవకాశాల్ని పిల్లలకు ఇవ్వాలి.
తృష్ణ గొప్ప పాయింట్ చెప్పారు. "ఆ రోజుల్లోకి వెళ్తే కదా వాటి ఆనందం, ప్రత్యేకత అనుభవమయ్యేది?" అని! కదా మరి! అందుకే, ఆ రోజుల్లోకి పిల్లలని అప్పుడప్పుడూ తీసుకెళ్ళాలి."కల్సి జీవించడం, పంచుకోడం" లోని ఆనందాల్ని పిల్లలకు అనుభవంలోకి తేవాలి. cont........
అంటే మిగతా వారితో విభేదిస్తున్నానని కాదు.
మల్లి గారు విలువైన విషయాలను ప్రస్తావించారు. మన అనుభవాల నుంచి పిల్లలు ఏమీ నేర్చుకోలేకపోతే ఇంతకాలం మనం చేసింది జీవం లేని ప్రయాణమే! జీవితంలో మానవీయ స్పర్శ అన్నది ఉండాలని అది లేని నాడు జీవితం రంగు రుచి వాసన లేని వస్తువుగానే మిగులుతుందనీ పిల్లలకు చెప్పాలి. చూపించాలి.అనుభవం లోకి తేవాలి. ఎంత తీరిక లేని జీవితాలైనా సరే, ఎన్ని కమిట్ మెంట్లు ఉన్నా సరే, పిల్లల వికాసం కంటే ఎక్కువ కాదు.
ఇంకోటి...ఈ తరం పిల్లలు మైథిలి అభిప్రాయాన్ని చూస్తే తాము జీవిస్తున్న జీవితం మాత్రమే సత్యమని నమ్ముతారు సహజంగానే. అది మాత్రమే జీవితం కాదనీ beyond that... ఇంకా అనేక జీవితాలు ఉన్నాయనీ పిల్లలకెలా తెలుస్తుంది? పల్లెల్లో, టౌన్లలో ఎంత నాగరికత ప్రవేశించినా ఇంకా పిల్లలు బాల్య జీవితాన్ని, సెలవుల్ని సహజంగానే అనుభవిస్తున్నారని వీళ్ళకు తెలిసేదెలా? పొలాలనేవి ఉంటాయని చదూకోడమే తప్ప ఏ పంట ఎలా ఉంటుందో చూశారా ఈ పిల్లలెవరైనా? ఎవరో చెప్పారు...గోధుమలెక్కడ ఎక్కువగా పండును?" అనే ప్రశ్నకు మూడో క్లాసు పిల్లాడు "పండటం" అనే మాటకు అర్థం ఎలాగూ కాక "గోధుమలు "MORE" లో దొరుకును" అ అని రాశాట్ట. ఇది కేవలం జోకే కావొచ్చు! కానీ వాస్తవం ఇంతకంటే భిన్నంగా ఉంటుందని నేను అనుకోడం లేదు.
ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నీ హోల్ సేల్ గా అనుభవంలోకి తెచ్చుకోడానికి అప్పట్లో వేసవి సెలవులు అవకాశం ఇచ్చేసేవి. పిల్లలంతా ఒక చోట కలుసుకోడం, పంచుకోడం,తన్నుకోడం,ఆడుకోడం, అపార్థాలు, గంటకల్లా వాటిని మర్చిపోయి కల్సిపోడం....ఇవన్నీ! ఇదొక గొప్ప హాలిడే పాకేజి!
ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్న ఈ రోజుల్లో ఇలాంటి అనుభవాలు పిల్లలకు ఇంట్లో ఎలాగూ కలగవు. ప్రతి ఇంట్లోనూ పిల్లలని సెలవుల్లో సమ్మర్ కాంప్ లకు తోలే సంప్రదాయం వచ్చాక మరీనూ! సెలవుల్లో కూడా వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ....గడిపేయడం ఎంతటి విషాదమో నా వరకూ!
నా వరకూ నేనూ ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని అప్పుడప్పుడూ రిపేర్ చేస్తుంటాను. దసరా సెలవుల్లో మా అమ్మాయిని అటేపూ ఇటేపూ రెండు వూళ్లకీ తీస్కెళ్తాను. మేమిద్దరం చుదువుకున్న స్కూళ్లు, కాలేజీలు, ఆడుకున్న తోటలు, పిల్లలు (వాళ్ళిప్పుడు అమ్మలూ నాన్నలూ అయిపోయుంటారు గా..)కాలవలూ అన్నీ చూపిస్తాను. పొలాలకు తీస్కెళ్తాను. అక్కడ ఉండే పిల్లలతో మట్టిలో నీళ్ళలో, చెట్లమీద ఆడుకోమని వదిలేస్తాను. (స్కిన్ రాష్ లూ అవీ వస్తాయని నేనసలు జడిసిపోను)!
ఇక్కడ సిటీలో తనకిష్టమైనవన్నీ నేర్చుకుంటోంది. కుంగ్ ఫూ, స్కేటింగ్, సంగీతం...వగైరాలు! (ఇందులో బలవంతాలేమీ లేవు) ! పల్లెలు, పట్నాలు తెలీకుండా, జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించి సౌకర్యాలతోనో, విలాసాలతోనో జస్ట్ "బతికేయడం" కాదనీ కాస్తో కూస్తో "జీవించడం " కూడా తెలిసుండాలనీ నా ఫిలాసఫీ!
లేకపోతే గమ్యం సినిమాలో శర్వానంద్ కి లాగా ఏ గాలి శీనో వచ్చి చెప్తే తప్ప ఈ పిల్లలకు జీవితాలంటే ఏమిటో తెల్సే అవకాశం లేదు
కొంచెం చెప్పడం కష్టమే.. మా పిల్లలు ఉమ్మడి కుటుంబంలో సంతోషం తో పాటు ఇక్కడ కొచ్చాక వాళ్ళకి వాళ్ళు టయింపాస్ చేసుకోవలసి రావడం కూడా చూసారు.ఐదేళ్ళ క్రింద ఇంటిదగ్గర ఆడిన ఆటలు అవీ మరీ మరీ గుర్తు తెచ్చుకుని మిస్ అవుతారు. యీ కొద్ది కాలం లో మా ఇంట్లో పుట్టిన చిన్ని పొన్ని పాపలు కూడా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారుట! .ఒక్క నాలుగైదు యేళ్ళలో ఇంతా మార్పా అని నేను ప్రతి సారీ ఆశ్చర్య పోతుంటా!!
లేట్ గా కామెంట్ రాస్తున్నాను..
సుజాత గారూ, మీలాంటి బాల్యమే మాదీనీ.. మా పిల్లలకి దాదాపు అలాంటి బాల్యాన్ని సాధ్యమైనంత వరకూ ఇవ్వటానికి ప్రయత్నం నేనైతే చేస్తున్నాను...
25 వ తారీఖు న ఆఖరి పరీక్ష అవుతూనే.. హాల్లో సినిమా, ఆ రాత్రే హైదరాబాద్ లో అమ్మమ్మగారింటికి ప్రయాణం.. ఊరగాయలు పెట్టటం, స్వీట్లూ అవీ ఇళ్ళల్లో చేయటం, హైదరాబాద్ లో కజిన్స్ పిల్లల తో.. రాత్రిళ్ళు కథలూ, డాబా మీద పడకా.. రోజంతా నానా రకాల బోర్డ్ గేమ్స్.. లైబ్రరీ పుస్తకాలూ మాత్రం ఇచ్చి..
లాప్ టాప్, వీడియో గేమ్స్.. పిజ్జాలూ, లాంటివి దగ్గరికి రానీయకుండా.. ఒక 15 రోజులు కనీసం గడిపేలా ఏర్పాటు చేసుకుంటున్నాను..
ఇంకో సగం సెలవలు మామూలే..
ఇక మా అమ్మ తన బాల్యం గురించి చెప్తే.. ఈర్ష్య పడేదాన్ని చిన్నప్పుడు.. ఇప్పటికీ అంతే.. అలాగే మా తాతగారు తన చిన్నప్పటి విషయాలూ, నోర్లు తెరుచుకుని వినేవాళ్ళం.. ఇవన్నీ నేను చూడకపోయినా.. కొద్ది మోతాదు లో రుచి అయితే చూసినందుకు సంతృప్తి పడతాను.. అదే విధం గా నాకు తెలిసిన పాస్ట్ చెప్తాను పిల్లలకి..
తర్వాత వాళ్లు అది వాళ్ల పిల్లలకి చెప్తారా లేదా అన్నది వాళ్ల ఇష్టం :)
కోయి లౌటాదొ మెరే బీతే హుఎదిన్
బీతే హుఎదిన్ వో మెరే ప్యారే పల్చిన్
జరుగుతోందన్నమాట ఇక్కడ .. హూమ్ .. గుర్తొస్తున్నాయ్.. చెరువులో పడి బురదనీళ్ళలో ఈతకొట్టడాలు, అందులో ఫిట్స్ వచ్చి మునిగిపోయిన నా బాలయ మిత్రుడు, వాడితో పాటు ఎక్కిన గుట్టలు, కొండలు, చింతచెట్టెక్కి పైన పసరికపాము చూసి పట్టుజారి చీరుకుపోయిన వేళ్ళు, కాళ్ళు. వినాయక చవితికి పత్రి తేవాలని వెళ్ళి పేరు పేరునా చెట్లను, మొక్కలను వెతికే తిరగడాలు, సినిమా టెంటులో గేట్‌కీపర్‌ను ఏమార్చి దొంగగా వెళ్ళి చూసిన సినిమాలు, పొలమారిన మొదటి దొంగ సిగరెట్టు/బీడి, మొదటిసారి సిగ్గుపడుతూ, ఆసక్తితో కొన్న రేజర్ సెట్... ఇలాంటి స్వీట్ నధింగ్స్ ఎన్నో, ఏ బాల్యం అయినా మిగిల్చేది మధురస్మృతులే, కొందరు నిర్భాగ్యులది తప్ప.
i completely agree with mythili... prathi okkaru vallaki nachinnatlu gadapalanukuntaru....present generation pillalu kuda alane chesthunnaru.. just give them freedom to express their interests with you.. and encourage "their" interests ...
:) :) :)
హెల్లొ సుజాతగారు...
మీరు చెప్పిన దానిలో ఒక వైపు కరెక్ట్ ఉన్నట్లే.. ఆ అమ్మాయి మైధిలి చెప్పిన దానిలో కూడ ఒక వైపు కరెక్ట్....అప్పుడు అందరితొ కలిసి వున్నారు కాబట్టి ప్రొబ్లెంస్ సాల్వ్ చేసుకుందాం సర్దుకుందాం....జీవితం అంటే కష్టాలకన్నా ప్రాణానికి విలువ ఇవ్వడం అని ఎవరు చెప్పకున్నా అలాంటి మనస్తత్వం వచ్ఛేది....
ఇప్ఫుడు వీళ్ళు నేర్చుకుంటున్నారు చాలా ఫెసిలిటీస్ ఉన్నయి ఐనా బ్రతుకు మీద భయం....లైఫ్ బోర్ అనే మాట తరచుగా వినిపిస్తుంది...మరి తప్పు ఎక్కడొ ఉన్నట్లె కదా..
Excellent Narration sujatha garu...
Take a bow.
Post a Comment