మా ఇంటి గణపతి___పూజకు ముందు!
హమ్మయ్య! అయిపోయింది పండగ! జరిపేసుకున్నాం! పత్రీ,పువ్వులూ,వినాయకుడి బొమ్మా,మావిడాకులూ,అన్నీ కొని పండగ చేశాం! మళ్ళీ వచ్చే ఏడాదే ఇహ!
ఎప్పుడూ లేనిది మొదటి సారి మా ఇంట్లో మట్టి వినాయకుడిని కాక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడిని పెట్టాము పూజలో! ఏం చెయ్యమంటారు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు "మట్టి వినాయకుడినే పూజిద్దాం , పూజించాల్సిందే..పూజించకపోయారో...."అని రక రకాల FM రేడియోల వాళ్ళూ, తొమ్మిదో టీవీ వాళ్ళూ, వీళ్ళంతా వారం నుంచీ ఊదరగొట్టేస్తుండటంతో, పోయినేడాది వరకూ దీనంగా మొహం పెట్టుకుని ఒక మూల ఉండే మట్టి విగ్రహాలు ఈ ఏడాది బోల్డంత గర్వం వచ్చేసి ఠీవీగా ముందు వరసలో నిలబడ్డాయి. కానీ కదిలిస్తే మాత్రం షాక్ కొట్టే ధరలు!
ప్రజల పల్స్,బలహీనతలు ఈ అమ్మేవాళ్ళు భలే పట్టుకుంటారు! మట్టి విగ్రహాలనే పూజించాలని అందరం కట్ట కట్టుకుని నిర్ణయించుకునే సరికి జానెడు బొమ్మ నూటయాభై రూపాయలూ,బెత్తెడు బొమ్మ వంద రూపాయలూ!అచ్చంగా మట్టి విగ్రహాలే! రూపాయి కూడా డిస్కౌంట్ లేదు!జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ వంటి చోట్ల ఇంకో యాభై కలుపుకోండి! అందుకే కోపమొచ్చి (ఎవరి మీదో నాకూ తెలీదు) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ కొనేశాను !
ప్లాస్టిక్ కవర్లు తీసేశారమ్మా అంటూ , జూట్ తో చేసిన పల్చటి కవర్లు ప్రతి చోటా అయిదేసి రూపాయలకు అమ్మడం మొదలైంది. ఆర్గానిక్ కూరలు మంచివి అనగానే వాళ్ళెవరో సూపర్ మార్కెట్ వాళ్ళు కిలో వంకాయలు అరవై రూపాయలకు అమ్ముతారు. అలోవెరా జూస్ మంచిదని మంతెన గారు చెప్తే ఇంకెవరో అలోవెరా జుస్ చిన్న డబ్బా అయిదొందలంటాడు.
పత్రి కూడా అంతే!అందులో ఒక్కటీ వ్రతకల్పం పుస్తకంలో చెప్పిన రకం లేదు. పార్కుల్లోవో ఎక్కడివో మరి అన్నీ క్రోటన్ మొక్కల ఆకులే! మచ్చలవీ, చారలవీ, గీతలవీను!వంద రూపాయలకు నాలుగు రకాలు కలిపి ఒక టేకు ఆకులో చుట్టి (పాపం, ప్లాస్టిక్ నిషేధం కదా మరి) పెట్టి ఇవ్వడం! ఒక్క తామర పువ్వు నలభై రూపాయలు! "అమ్మో" అని తెల్లబోతే.."ఇవాళొక్కరోజే కదమ్మా" అనడం!
ఇంటికొచ్చాక మా ఇంటి తోటలో వెదికితే మారేడు,నేరేడు,మరువం,మాచీ పత్రం లతో సహా అన్ని రకాల పత్రీ ఇక్కడే దొరికింది! :-)) (మారేడు చెట్టు మా ఇంట్లో ఉందని ఇప్పుడే చూశా అసలు)
అసలు పండగలన్నీ ముఖ్యంగా సిటీల్లో ఎవరో వెనకనుంచి తోసినట్టు, లేదా అర్జెంట్ టెలిగ్రామేదో వచ్చినట్టు ఆదరా బాదరా శాస్త్రార్థం జరుపుకోడం అలవాటైపోయింది. నాలుగైదు రకాల వంటలతో ఆలస్యంగా భోజనాలు చేసి సాయంత్రం వేళ సెలవు రోజు తాలూకు విశ్రాంతిని హాయిగా ఆఘ్రాణిస్తూ గడపటం మర్చిపోయాం! "ఉన్నది ముగ్గురమేగా, ఏం తింటాం లెద్దూ" అని ఏవో రెండు రకాలతో కానిచ్చేయడం,వందలూ వేలూ పెట్టి మావిడాకులూ అవీ తెచ్చి కాసేపు ఆర్భాటం చెయ్యడం! సాయంత్రానికి తిరిగి చూస్తే దండగ ఖర్చూ, నిరుత్సాహం, రేపటి ఆఫీసూ, ఇస్త్రీ చేయాల్సిన యూనిఫాములూ...!
"ఇవాళ పండగ" అని ఉత్సాహంతో నిద్ర లేవడానికి బదులు "అమ్మో, ఇవాళ పండగ కదూ" అని గాభరాతో లేవడం!
ఆఖరి పోరాటం నవల్లో ప్రవల్లికతో విహారి ఒక సందర్భంలో "మీకేమండీ, సి బి ఐ ఆఫీసరు" అంటే ఆవిడంటుంది_____ "ఏమి సి బి ఐ లెండి! చూసేవాళ్ళకే ఈ గొప్ప! నాకైతే ఏదో ఒక మారుమూల పల్లెటూర్లో నాలుగు మేకలూ కోళ్ళూ పెంచుకుంటూ ప్రశాంతంగా బతికేయాలని ఉంది"
ఈ సిటీ హడావుడిలో, సంస్కృతి పేరు చెప్పుకుంటూ చప్పటి పండగల్ని నిస్సారంగా జరుపుకుంటున్నపుడు నేనూ ఇదే అనుకుంటాను. హాయిగా ఏ దోసకాయల పల్లో,రావిపాడో,దాచేపల్లో,ఉప్పులోరో,ఆకివీడో పోయి ప్రశాంతంగా పత్రి అంతా కొనకుండా చుట్టు పక్కల కోసుకొచ్చి పండగ మజా పిల్లలతో కల్సి ఆస్వాదించాలని! ఎప్పటికి కుదుర్తుందో!
38 comments:
అబ్బే సుజాత గారూ మీదసలు పేటేనా అంట?? ఏంచక్కా పొలాల్లో కాస్త బంకమట్టి తెచ్చి చేసుకొంటే పోయేది కదా... ఓ సారి ఊరికెళ్ళొచ్చినట్టుకూడా వుండేది.
"మీరు...మీరు...మీరు ప్లాస్టిక్ వినాయకుడిని కొన్నారా, అన్యాయం " అంటూ మొదలెట్టాలి అనుకున్నా, టపా చదూతున్నప్పుడు. కానీ మీ హైదరాబాదు కష్టాలు విన్నాక, మనసు భారమైపోయి ఆగిపోతున్నా. :)
నాకు అస్సలు నచ్చని మరో విషయం ఏంటంటే, వినాయకుని పందిర్లలో పాడు డిస్కో పాటలు వినిపించడం. నేను ఈ సారి బెంగళూరులో ఉన్నాను కనుక, ఎక్కువ గోల లేదు. పిచ్చి పాటలు అసలే లేవు. కొంచంలో కొంచం పర్లేదు.
మీరనట్టు, పండుగలు కాస్తైనా ప్రశాంతతను ఇస్తే బాగుండు. పండగంటే బోలెడు పిండి వంటలు, ఆలశ్యపు భోజనం, కంటి నిండా నిద్ర, ఖంగారు లేని సాయంకాలాలు..కబుర్లు.
https://plus.google.com/109575964496491176009/posts/G4czSMqNsDZ భక్తీ లేదూ, పాడూ లేదూ. వ్యక్తిగత గొప్పల ప్రదర్శనే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ జన్మకిక ఇంతే సుజాతగారూ
//"ఇవాళ పండగ" అని ఉత్సాహంతో నిద్ర లేవడానికి బదులు "అమ్మో, ఇవాళ పండగ కదూ" అని గాభరాతో లేవడం!//
పచ్చినిజం!
//ఈ సిటీ హడావుడిలో, సంస్కృతి పేరు చెప్పుకుంటూ చప్పటి పండగల్ని నిస్సారంగా జరుపుకుంటున్నపుడు నేనూ ఇదే అనుకుంటాను. హాయిగా ఏ దోసకాయల పల్లో, రావిపాడో, దాచేపల్లో, ఉప్పులోరో, ఆకివీడో పోయి ప్రశాంతంగా పత్రి అంతా కొనకుండా చుట్టు పక్కల కోసుకొచ్చి పండగ మజా పిల్లలతో కల్సి ఆస్వాదించాలని! ఎప్పటికి కుదుర్తుందో!//
నిజంచెప్పండి, మనలో ఎంతమంది అలా చెయ్యగలరు?
ఇలానే బజార్లో రేట్లు చూసి మొన్న శ్రావణ శుక్రవారానికి "పండగ పేరు చెప్పి..." అని నేను రాసాను కదా...లక్కీగా మాకు అచ్చులోంచి తీసే మట్టి వినాయకుడు ముఫ్ఫై రూపాయిలకు దొరికాడు..:)
మీరన్నది నిజమేనండీ హాయిగా పల్లెటూరుకి కాకపోయినా ఏ రాజమండ్రినో కాకినాడో అయినా వెళ్ళి ఉండగలిగితే బావుంటుంది అనుకుంటూ ఉంటాను..
మట్టి విగ్రహాలతో కాలుష్యం ఉండదని తెలిసినా విరిగిపోతాయని చెప్పి కొనరు. దేవుని పేరుతో కాలుష్యం చేసేది భక్తి కోసమా?
నేను పండుగలు జరుపుకున్నంతవరకు ఉదయాన్నే లేచి ఏడు లేదా ఎనిమిది గంటలకల్లా పూజా కార్యక్రమం ముగించేవాళ్ళం. ఈ సారి అనుకోకుండా హైదరాబాదులో ఉన్నా కూడా ఎక్కడ చూసినా పదిన్నర , పదకొండు గంటల వరకు కూడా వీధిలో సందు గొందుకోక విగ్రహం పెట్టిన , ఒక్క దాన్ని కూడా ఓపెన్ చేయలేదు. ఇది పట్నం సంస్కృతో ఏమో నాకు తెలియదు కాని, తప్పనిసరిగా మన దౌర్బాగ్యమండి. పైగా సాయంత్రం పుట చేస్తారుట పూజలు. విగ్రహాలు పెట్టడం వెర్రి లాగ ఉంది ఇక్కడ .
ఆకివీడు వెళ్ళినా దోసకాయపల్లి వెళ్ళినా అక్కడ కూడా అంతా వ్యాపారమే. కొంటే కొనండి లేకపోతే పొండి అంటున్నారు. ధరల్లో పెద్ద తేడా కనిపించటం లేదు.
మీరన్నట్టు పండగల్లో సరదా పోయింది. చాలా చోట్ల ఆర్భాటం, షో పెరిగిపోయింది.
భాస్కర్ రామిరెడ్డి గారూ, బంక మట్టి దొరికితే చాలా? బొమ్మ చేయడం చాతగావాలిగా? ఈ సారి ఒక గణేశుడి అచ్చు తయారు చేయించి మట్టి బొమ్మ అచ్చులు వేయించి నేనే పంచుదామనుకుంటున్నా వచ్చే ఏడాది!
అబ్బ, మానసా, అవును, ఆ పాటలు వినడం ఒక పెద్ద పనిష్మెంట్! అంతకంటే పెద్ద పనిష్మెంట్...సినిమా ట్యూన్లతో కూర్చిన భక్తి గీతాలు వినడం!
"అమ్మో, ఈ రోజు పండగ" అని హడావిడిగా నిద్ర లేవడం, మనం పెద్దాళ్ళమయిపోయామనడానికి చిహ్నం కదా! ఈ బాధలేం లేని బాల్యం దాటేసి చాలా దూరం వచ్చేసాం. మా నాన్నగారు చెప్తున్నారు. "తెల్లారగానే బంకమట్టి వినాయకుడిని కొని తెమ్మని రూపాయిచ్చి నిన్నూ తమ్ముడిని పంపించేవాణ్ణి గుర్తుందా? అదే వినాయకుడిని వంద రూపాయలకి కొన్నాను. అదీ పండగ స్పెషల్" అని. భలే బాధనిపించింది. ఖర్చు గురించి కాదు. జీతాలు పెరగని రేటులో దోపిడీ జరిగిపోతూంటే బాధ. ఏ పల్లెటూరో పారిపోదామని రోజుకోసారైనా అనిపిస్తున్నా, అలాంటి చోటికి వెళ్ళాలంటే మనకి బాధ్యతలు తిరి, అవసరాలకి సరిపడా సొమ్ము సమకూరాలి. అప్పటిదాకా ఈ చక్రంలో తిరగక తప్పదేమో!
ఇక్కడ గచ్చిబౌలి లో అయితే ఏకంగా సాయంత్రం అయిదింటికి సుప్రభాతం పెట్టి పూజ మొదలెట్టారు
ఇదెక్కడి సంప్రదాయమో నాకు తెలీదు.
అలానే వినాయకుడికి శ్రీ కృష్ణ అష్టోత్తరం.
ఇంకా నేను మండపం వరకూ వెళ్లి చూడలేదు.
ఈ సంవత్సరం ఇంట్లో అశుభం జరగటం వల్ల పండుగ చేస్కోలేదు కానీ, మా చుట్టుపక్కల అన్ని రకాల చెట్లు ఉంటాయి, పత్రీ అంతా సమకూరుతుంది. బంక మట్టి కూడా దొరుకుతుంది. అచ్చు లేకుండానే మా తమ్ముడు చేత్తో బాగానే తీర్సిదిద్దుతాడు వినాయకుడిని.
అన్నట్టు ఇదంతా హైదరాబాదు లోనే. కేశవగిరి వద్ద.
భాస్కర్ గారూ, అలా చెయ్యాలని ఉంటుంది కానీ చేసే అవకాశం లేదుగా! సిటీలో ఉన్నన్ని రోజులూ అలా ఊహించుకుంటూ గడపటమే!
తృష్ణ,
నిజమే, మరీ పల్లెటూరు కాకపోయినా ఒక మోస్తరు టౌన్ అయినా పోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి ఈ సిటీ ఒత్తిడి భరించలేక!
ప్రవీణ్, వ్యక్తి గత గొప్పలేమో గానీ శబ్ద కాలుష్యం మాత్రం సూపర్ గా ఉంటుంది, పిచ్చి ఎక్కేలా!
మురళీ, ఏమో ఈ సిటీ లో ఉన్నన్నాళ్ళూ అంతే అనుకోవాలా? మరీ జన్మంతా అంటే కష్టమేమో!
రాజేష్ గారూ, నేనూ హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో ఇక్కడ ప్రతి విషయానికీ ఇలాగే ఆశ్చర్యపోయే దాన్ని! తర్వాత అలవాటైపోయింది.
బులుసుగారూ, నిజమా! రేట్ల సంగతి కాకపోయినా వాతావాణంలో అయినా తేడా ఉండదంటారా? అదీ నా ఆశ! పండగల్లో సరదా పోయిన మాట నిజమండీ!
కొత్తావకాయ గారూ,
జీతాలు పెరగని రేటులో దోపిడీ జరిగిపోతూంటే బాధ. ఏ పల్లెటూరో పారిపోదామని రోజుకోసారైనా అనిపిస్తున్నా, అలాంటి చోటికి వెళ్ళాలంటే మనకి బాధ్యతలు తిరి, అవసరాలకి సరిపడా సొమ్ము సమకూరాలి. అప్పటిదాకా ఈ చక్రంలో తిరగక తప్పదేమో!
_______అది నిజమే అయినా ఆ సరికి మనలోని సరదా అంతా మిగిలి ఉంటుందా? కీళ్ళ నొప్పులూ, కాళ్ళ వాపులూ వచ్చి ఒక మూల పడి ఉంటామేమో ఖర్మ!
కానీ ఏం చేస్తాం? తప్పదు, కానిద్దాం ఇలాగే!
హ హ సుజాత గారు ఒక విషయం, మీకు సిటి లో కనీసం డబ్బులు ఇస్తే దొరకుతున్నాయి , చాల ఊర్లలో డబ్బులు ఇస్తామన్నా దొరికే పరిస్తితులు లేవు :)))
సుజాత గారూ, మా కాలనీలో ధరలు చాలా నయం అన్నమాట..
మా పక్కనే ఉన్న స్కూలులో మట్టి వినాయకుడ్ని ఫ్రీగా ఇచ్చారు..సైజు కూడా బాగానే ఉంది. ఈ సారి చాలా స్కూల్సులో మట్టి వినాయకుడిని ఉచితంగా ఇచ్చారు. మా కాలనీలో అయితే ఐదారు స్కూల్సులో ఇచ్చారు.
ఇక పత్రి కూడా కాలనీలో చెట్లనుండే. ఒక్క పూలు, తమలపాకులు, అరటి పిలకలు కొన్నా. అరటి పిలకలు మొదటిసారి పెట్టటం..ఏంటొ రోడ్ల మీద చూసి కొనబుద్దేసింది. రెండు--25 రూపాయలు, తమలపాకులు 10-5 రూపాయలు (మా ఊర్లో అయితే ఫ్రీగా కావల్సినన్ని), కలువ పూలు 4-10 రూపాయలు ..ఇవే ఎక్కువ అనుకున్నా నేను. మీ రేట్లు చూసాకా కాస్త మనస్సు కుదుట పడింది.
అన్నట్టు హిమాయత్ నగర్ లోని ఎమరాల్డు స్వీటు షాపు వాళ్లు మట్టి వినాయకుడిని చాలా తక్కువ రేటుకే ఇస్తారు. KPHB లో కూడా ఉంది వాళ్ళ షాపు.
మనం ఇక్కడ ఉండి ఊర్ల గురించి గొప్పగా ఊహించేసుకుంటాం కాని అక్కడ కూడా ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమేనండి. ఇక్కడకన్నా ఎక్కువే బాదుతున్నారు అక్కడ! పొద్దున్నే లేచి పత్రికి వెళ్ళటం..బంక మట్టితో బొమ్మ చేసుకోవటం అన్నీ పోయాయి. ఆ జ్ఞాపకాలని మనం నెమరు వేసుకోవటమే.
>>>>>
ప్రవీణ్, వ్యక్తి గత గొప్పలేమో గానీ శబ్ద కాలుష్యం మాత్రం సూపర్ గా ఉంటుంది, పిచ్చి ఎక్కేలా!
>>>>>
మా ఇల్లు ఉన్న వీధిలో శబ్ద కాలుష్యం లేదు కానీ నా ఆఫీస్ ఉన్న వీధిలో శబ్ద కాలుష్యం ఉంది. మా ఇల్లు ఉన్నది నివాస ప్రాంతంలో, ఆఫీస్ ఉన్నది వాణిజ్య ప్రాంతంలో. వాణిజ్య ప్రాంతంలోనైతే వచ్చి పోయే వాళ్ళే ఎక్కువ కానీ అడిగేవాళ్ళు తక్కువ.
>> మా ఇంటి తోటలో వెదికితే మారేడు,నేరేడు,మరువం,మాచీ పత్రం లతో సహా అన్ని రకాల పత్రీ ఇక్కడే దొరికింది!>>
పర్యావరణ ట్రెండు వల్ల లాభం (పెరటి తోట పూజకు పనికొస్తుందని) మీకే అనుభవమైంది కదా?
మాలాంటి నాస్తికులకైతే ఇలాంటి తిప్పలేమీ ఉండవు మరి :)
వేణూ, పర్యావరణం సంగతి అలా ఉంచండి! చాలామంది నాస్తికులకు మాత్రం "మేము నాస్తికులం" అని పదే పదే చెప్పుకోనిదే ఆ విషయం గుర్తుండదని భయమో ఏమో, మాటి మాటికీ వల్లె వేస్తుంటారు. మీరూ ఆ కోవలోకే చేరారా ఏంటి?
/పదే పదే చెప్పుకోనిదే ఆ విషయం గుర్తుండదని భయమో ఏమో../
హా హా హా నిజమే! అలా వున్న ఒక్కగానొక్క ప్రత్యేకత పదే పదే చెప్పుకోకుంటే దేవుడొచ్చి పట్టేసుకుంటాడనే అనుమానం కూడా అయ్యుండొచ్చు. :)
ఈ 'చెప్పుకునే నాస్థికుల' నుంచి పర్యావణానికేమో గాని సమాజానికి మాత్రం చీడ పట్టినట్టే! :))
సుజాతా!
నా వ్యాఖ్య చివరున్న స్మైలీ ని మీరు గమనించాలి! సరేనా?
Snkr గారూ,
సందర్భశుద్ధి లేకుండా పదేపదే నాస్తికుణ్ణనో, ఆస్తికుణ్ణనో, మరొకణ్ణనో చెప్పుకోవటం ఎవరికైనా అంత బాగుండదు. అయితే సమాజానికి చీడ పట్టించేంత ‘ప్రగతి’ని ఏ టైపు నాస్తికులైనా సాధించలేదులెండి! :)
(వాక్యం చివర నేనూ స్మైలీలు పెట్టేశా... మీలాగే!)
నా వ్యాఖ్య చివరున్న స్మైలీ ని మీరు గమనించాలి! సరేనా? ____________సరేనండీ! అలాగేనండీ! :-)) (ఈ మధ్య ప్రతి వ్యాఖ్యకీ స్మైలీలు అనివార్యమైపోయాయి ప్చ్)
కానీ మీరు పొరపడ్డారు సుమండీ! సమాజానికి చీడ పట్టించే నాస్తికులు (కేవలం నాస్తిక భావనల వల్ల కాదు, వాళ్ల మొండి వైఖరి,వింత వాదనలతో)చాలామందే ఉన్నారండీ! మీకు ఉదాహరణలు చూపిస్తాలెండి!
Snkr, కొంతమంది నాస్తికుల వైఖరి ఎలా ఉంటుందంటే "ఏంటి, దేవుడు లేడని నేను చెప్తున్నాగా? చాలదా? ఆ దేవుడొచ్చి చెప్తే గానీ నమ్మవా ఏంటి?" అనే టైపు! వేణు గారు "ఆ టైపు" నాస్తికులు కారు లెండి! ఆయన నాస్తికత్వం తన వరకే! ప్రచారానికి కాదు!
/అయితే సమాజానికి చీడ పట్టించేంత ‘ప్రగతి’ని ఏ టైపు నాస్తికులైనా సాధించలేదులెండి!:)/
నిజమే! సందర్భశుద్ధిలేకుండా చెప్పుకోవడం ... మాంసం తింటున్నామని బొమికలు మెడలో వేసుకుని తిరుగాల్సిన అవసరం లేదని వీళ్ళెప్పుడు గుర్తిస్తారో, అంతవరకు నాస్థికత్వానికి ఓ హుందా/మర్యాద/గౌరవము దక్కదు అనుకుంటా. చివర స్మైలీ వుద్దేశ్యం 'నేను పోట్లాటకు సీరియస్‌గా వాదిస్తున్నానని కాదు' అని చెప్పడానికే.
మా చీకోలంలో నాఇంట్లో శబ్దకాలుష్యం తక్కువ, భావకాలుష్యం ఎక్కువ అని స్టేట్మెంట్లు చూసినప్పుడు స్మైలీలు ఎందుకొస్తాయి చెప్పండి? yawaaans...(((( వస్తాయి.
ఆ 'టైపు' ప్రగాఢ నమ్మకాల నాస్థికులంటే నాకో 'విధమైన' అభిమానం, ఏమీటో చెప్పలేను, చెడుగుడు ఆడాలనిపిస్తుంది, ఎందుకో. :))
-------
మట్టి వినాయకుడు దొరకలేదని మీరు రావణునిలా ఆత్మలింగాన్ని సాధిస్తానన్నట్టు, ఆత్మ గణేష్ను సాధిస్తాననుకోలేదు .... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పని 'అయ్యింది' అనిపించారు, కార్య సాధకులంటే అలా వుండాలి! అంతే! :P"
మా చీకోలంలో నాఇంట్లో శబ్దకాలుష్యం తక్కువ, భావకాలుష్యం ఎక్కువ అని స్టేట్మెంట్లు చూసినప్పుడు స్మైలీలు ఎందుకొస్తాయి చెప్పండి?___________హమ్మ, పాయింటుకొచ్చారు. నాకూ ఆ కామెంట్ అర్థం కాలా! స్మైలీ పెడదామంటే మనసొప్పుకోలా!
కెవ్వు.... ఈ పోస్ట్ నేను లేటుగా చూశాను. సుజాత గారూ కొన్నాళ్ళు పోతే పత్రి కొనడానికి కూడా లోన్ తీసుకోవలసి వచ్చేట్టు ఉంది. ఇంకా ట్రెండ్ ముదిరితే ఏ రిలయన్స్ వాడో గణేష్ పూజ స్పెషల్ ప్యాక్స్ అని మాల్స్ లో మొదలు పెట్టినా పెట్టేస్తాడు. సంక్రాంతి పండగ గొబ్బెమ్మల బ్రాండెడ్ ఆవుపేడ ప్యాకేట్లని ఒక్క సారి ఊహించుకోండి. :))
@ తృష్ణ గారు
" ఏ రాజమండ్రినో కాకినాడో అయినా వెళ్ళి ఉండగలిగితే బావుంటుంది"
ఈ ఒక్క మాట చాలండీ నాకు పండగ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. :)))
అయినా రాజమండ్రి, కాకినాడలలో కూడా రేట్లు అంత తక్కువేమీ లేవండీ. కాకపోతే ఇంకా పండగ వాతావరణం పూర్తిగా పోలేదంతే.
శంకర్ గారూ, :-))
నాకూ రేట్ల గురించి కాదు బాధ, ఆ పండగ వాతావరణం పోయిందనే!
మీరు చెప్పింది త్వరలోనే నిజమయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి పాకేజ్,వినాయక చవితి పాకేజ్! ఆవుపేడ దొరికే ఛాన్సులు మనకు తక్కువ కాబట్టి,ఆవుపేడ పాకేజ్ నాకు ఓకే!:-))
రహమాన్,అదృష్టం కొద్దీ అన్ని రకాల చెట్లూ ఉన్న చోటే ఉన్నా నేను, సిటీ మధ్యలో ఉన్నా కూడా! బంకమట్టి దొరికినా బొమ్మ తీర్చేంత కళ లేదు మనకి! హదీ సంగతి!
శ్రావ్య , నిజమా:-))మీ వూర్లోనా, లేక కొంప దీసి ఇక్కడేనా?
వరూధిని గారూ,
మీ కాలనీలో ఒక మంచి ఇల్లు చూడండి! వచ్చేస్తాం!మాకు మరీ అన్యాయంగా ఉన్నాయండీ రేట్లు!
ఊళ్ళలో రేట్లెక్కువ ఉన్నా ఇంత హడావుడి, ఆర్భాటం ఉండవు కదండీ! ఆ ప్రశాంత వాతావరణపు పండగ కోసమే నా బాధ
సుజాత గారు, మీకు నిజాలు జోకులలాగే కనిపిస్తాయి. బ్రాహ్మణులు ఉండే వీధిలో వినాయక మంటపం పెట్టినవాళ్ళు భక్తి పాటలే వేస్తారు. బ్రాహ్మణులకి ఆచారాలు తెలుసు కాబట్టి ఒకవేళ వాళ్ళ వీధిలో వినాయక మంటపంలో మసాలా సినిమా పాటలు వేస్తే 'అపచారం, అపచారం' అనుకుంటారు. మా వీధిలో జరిగినది అదే. నిత్యం వంద మంది వచ్చిపోయే వాణిజ్య ప్రాంతంలో వినాయక మంటపంలో ఎలాంటి పాటలు వేస్తారో ఊహించండి.
ప్రవీణ్,ఇక్కడ శబ్ద కాలుష్యమే ముఖ్యం గానీ ఎలాంటి పాటలు వేస్తారనేది కాదు.చెవులు చిల్లులుపడే సౌండ్ తో ఏ పాటలు వేస్తే ఏమి? అయినా వినాయక మండపాల్లో ఎక్కడ చూసినా భక్తి పాటలే వేస్తారు......కానీ సినిమా ట్యూన్లతో! ఇందులో బ్రాహ్మల వీధీ మరోటీ అనే తేడా లేదు
నేను ఉండేది బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే వీధిలోనే. ఇక్కడ బ్రాహ్మణుల ఇంటి పేర్లు, శాఖల పేర్లు నాకు బాగా పరిచయమే. అంత టచ్ ఏర్పడింది మా వీధిలోని బ్రాహ్మణులతో. నా షాప్ దగ్గరలో పెట్టిన వినాయక మంటపంలో వేసినవి పక్కా కమర్షియల్ సినిమా పాటలే. లేని భక్తి ఉందని చెప్పుకుని చందాలు వసూలు చెయ్యడం, అదీ దారిన అడ్డగించి బైక్‌లు, సైకిళ్ళని ఆపి. ఇదొక భక్తా? చివరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ & రసాయన రంగుల విగ్రహాలని నదిలో వేసి నీళ్ళని కలుషితం చేస్తారు. కాలుష్యం తప్ప ఏదీ రాని దానికి నవరాత్రోత్సవాలు అవసరమా?
చిన్న ఊరితో ఉపయోగం ఏమిటంటే, ఏ చెట్టు ఎక్కడ ఉందో చాలా మందికి తెలుస్తుంది.. ఓపిక ఉంటే వెళ్లి పత్రి కోసుకొని రావచ్చు. ఈ పత్రి లో పరమార్ధం అదే అనుకుంటాను. పూజ పేరుతో నలుగురూ కలిసి నాలుగు తోటల్లో కాసిన్ని కబుర్లు చెప్పుకుంటూ కొన్ని ఆకులు కోసుకొని వచ్చి గణపతి మీద వేసి నమస్కారం పెట్టుకోవడం!. మేము చిన్నప్పుడు మొగల్తూరు లో ఉన్నప్పుడు పత్రి కోసి తెచ్చుకొని పూజ చేసేవాళ్ళం. మధ్యాహ్నం ఏడు ఇళ్ళలో వినాయకుడిని చూడాలి అని నియమం ఒకటి ఉంది కదా.. చక్కగా అందరి ఇళ్ళకీ తిరిగి, దండాలు పెట్టుకొని వాళ్ళు పెట్టిన ఉండ్రాళ్ళు తింటే.. అదీ పండుగ.
sujatha garu
maname nayam saampradayamto kudina samskrutini, maaripotunna sampradayanni, maaraboye aacharalni annitini chustunnam
ippativallu maarina samskrutine chustunnaru
సుజత గారు
(నవ్వుతూ)
వినాయకుడు భూమి (మట్టి) అంతా తిరిగి రమ్మని పందెం పెడితే షివపర్వతుల చుట్టే తిరిగినాడట
మీరుకూడా మట్టి విగ్రహాల కోసం అంతా తిరక్కుండా పక్కషాపులొ దొరికే ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలనే వాదిచూడండి.
సుజత గారు
(just fun )
ద్వాపర యుగంలో ప్రత్యక్షంగాను, త్రేతా యుగంలో రాతివిగ్రహాల్లొ, కలియుగం మొదతిపాదంలో మట్టి విగ్రహాల్లొ, రెండవపాదంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల్లొ, ముడోపాదంలో లేసెర్ బీంలొ ...................................................
మన పండగలు అప్పుడప్పుడు అడవి లో తిరగమని ఈ రకంగా చెప్తాయి అలేగే ఒక రోజు ముందు మన నివాసనికి దగ్గరలో ఉన్న (20 కి.మీ దూరం అయినా సరే) పల్లెకి వెల్లి అడవిలో ఆకులు, మామిడాకులువగైరాలు తెచ్చుకోవలి ఈ రకంగానైనా మనకు కొంత ప్రకృతి విద్య అలవర్తుంది,మామిడి చెట్టైతే స్తలం ఉంటే పెంచ వచ్చు.ఇక మీ పోస్ట్ లొ మంతెన గారి పై రాసిన లైన్ మాత్రం నిజమండీ ,ఆయన చెప్పటం డబ్బున్నొళ్ళు,రోగాలు ఉండి ఎగబడి కొనటం పేదోడి వస్తులులన్నీ ధరలు పెరగడం సర్వ సాఢారణం అయింది తన ప్రకృతి వైధ్యం పేరిట పళ్ళీ లు,శనగలు దంపుడు బియ్యం, డొడ్డూ రవ్వ, పూట్టు ఉన్న గోదుమ పిండి,ఇలా చాల వస్తువుల ధరలు పెరిగాయి.
బావుందండీ..నిజంగా నగరాల్లో పండగరోజుకి,మామూలు రోజుకి పెద్ద తేడా కనపడదు. మీరు చెప్పినట్టు అమ్మో!! ఈరోజు పండగా!! అని అనుకోవాల్సి వస్తోందీ.
Post a Comment