September 3, 2011

"టామ్ సాయర్ ప్రపంచ యాత్ర"నండూరి రామ మోహన రావు గారు నరావతారం, విశ్వ దర్శనం ల రచయిత గాకంటే నా మటుకు నాకు మార్క్ ట్వైన్ ని మా ఇంట్లోకి తెచ్చిన మనిషిగానే నాకు గుర్తుంటారు.(ఈ పుస్తకం ముందు మాటలో ఆయన కూడా ఇదే మాట చెప్పారనుకోండి) విశ్వ దర్శనం, నరావతారం,విశ్వరూపం ఇలాంటివి మా అన్నయ్య చదువుతుంటే నేను మాత్రం హకల్ బెరీ ఫిన్,టామ్ సాయర్, విచిత్ర వ్యక్తి, వగైరాలు లు చదివి అవన్నీ ఊహించుకుంటూ సంబరపడేదాన్ని! మార్క్ ట్వైన్ వాళ్ళ వూళ్ళో (నేను విదేశాలు ఏలుతున్నపుడు), ఆయన పుస్తకాల కలెక్షన్ అంతా కొని చదివినా నాకెందుకో నండూరి వారి అనువాదాలే బాగున్నాయనిపించింది. బాల్యంలో మొదటి సారి చదివిన అనుభూతి కావొచ్చు. ఈ మాట నేనెక్కడో అంటే పండితులెవరో "నీ మొహంలే ఊరుకుందూ! ఒరిజినల్లో లేని అందం వెధవది అనువాదంలో ఉంటుందంటే నేనొప్పుకోను"అని నా ఫీలింగ్ కి వారి అనుమతి లేదని తేల్చారు.:-)

స్కూలు రోజుల్లో నరావతారం నా హాట్ ఫేవరిట్ గా ఉండేది. అది రాసినాయన్ని కలుసుకోవాలని ఉండేది కానీ కలుసుకుని ఏం మాట్లాడాలో తెలీదు కాబట్టి ఆ ఆలోచన అప్పట్లో ముందుకు సాగలేదు.విశ్వదర్శనం కూడా ఎంతో నచ్చిన పుస్తకం. అంతటి గొప్ప రచయితను,పాత్రికేయుడిని ఒక్కసారైనా కలుస్కోలేకపోయాననే చింత ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుందిక! అందుకే ఎప్పుడు అనుకున్న పనులను అప్పుడు చేసేయాల్సిందే! తర్వాత తీరిగ్గా విచారించి లాభంలేదు.

అయన పాత్రికేయ జీవిత విశేషాలు ఇవాళో రేపో ఎవరో ఒకరు రాస్తారు. అవేమీ లేకుండా ఆయనంటే ఉన్న ఇష్టాన్ని,గౌరవాన్ని ఈ చిన్న పుస్తక పరిచయం ద్వారా వెల్లడించుకుందామని!


సరే,కథలోకొద్దాం!నండూరి గారి అనువదించిన పుస్తకాల్లో చాలా కాలం ఏ పబ్లిషర్ చేతికీ దొరక్కండా ఉండిపోయిన ఒక గొప్ఫ పుస్తకం ఆ మధ్య హాసం బుక్స్ ఎంబీయెస్ ప్రసాద్ గారికి దొరికింది. అదే "టామ్ సాయర్ ప్రపంచ యాత్ర" ! Tom sawyer abroad అనే ట్వైన్ నవలకి ఇది తెలుగు రూపం!1955లో ఇది ఆంధ్ర పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిందట. ఆనాటి కటింగ్స్ ఒకచోట దొరికాయని ప్రసాద్ గారు నండూరి గారికి చెప్పగానే ఆయన "వృద్ధాప్యం వల్ల ఎగిరి గంతు వెయ్యలేకపోయానుగానీ మానసికంగా అంతపనీ చేశాను"అని ముందుమాటలో చెప్పారు.

ఈ పుస్తకాన్ని నేను హైద్రాబాదు పుస్తకాల సంతలో 2006 లో కొన్నాను. ఆ రోజు ఇంటికొచ్చేసరికి 11 అయింది. కానీ ఎదురుగా నండూరి గారి పుస్తకం ఊరిస్తుంటే ఎలా? అందుకే అప్పుడే కూచుని మొత్తం ఒంటిగంటకల్లా పూర్తి చేసి హాయిగా నిద్రపోయాను!

నానా సాహసాలూ చేసి,గుహలో దొంగలు దాచిన డబ్బంతా బాంకులో వేసుకుని నిస్సారంగా జీవితం గడుపుతున్న టామ్ సాయర్ కి ఎటువంటి అడ్వంచరూ లేని పాడు జీవితం మరింత బోరు కొట్టేస్తూ చప్పగా తోస్తూ ఉంటుంది. ఏదో ఒక సాహసం చేస్తే కానీ బతికేలా లేమని ఒకటి ప్లాన్ చేసి హక్ ఫిన్ కి చెప్తాడు.

దాని పేరు "క్రూసేడ్"! క్రూసేడంటే హక్ కి తెలీలా!

"ఏంటీ, క్రూసేడంటే తెలీదా?నిజమేనా వేళాకోళాలాడుతున్నావా హక్ ఫిన్?"

"నిజంగానే నాకు తెలీదు. అదేంటో తెలీకుండానే ఇన్నాళ్ళూ బతికాను.నా ఆరోగ్యం ఏమీ చెడిపోలేదు.పై పెచ్చు దిమ్మ చెక్కలాగా కూడా ఉన్నాను"ఇదీ హక్ వరస!

ఇది ఇలా కాసేపు సాగదీశాక నీగ్రో బానిస జిమ్, హక్ క్రూసేడ్ కి ఒప్పుకోకపోవడంతో ఇంకేదైనా ఆలోచించాలనుకుంటారు.

ఇంతలో ఆ వూరికి వేడి ఆవిరితో తయారు చేసిన బెలూన్ తో ఒక మతి లేని ప్రొఫెసర్ వస్తాడు.దాన్ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.వాళ్ళతో పాటే హక్,టామ్,జిమ్ కూడా వెళ్లారు. వీళ్ళు ముగ్గురూ ఆ బెలూన్ లోపలికి వెళ్ళి అదెలా పని చేస్తోందో పరిశీలిస్తుండగా అక్కడి జనం ప్రొఫెసర్ వాలకాన్ని గేలి చేస్తుండటంతో మన ప్రొఫెసర్ ఆ బెలూన్ని అకస్మాత్తుగా ఆకాశంలోకి తీసుకుపోతాడు కోపంతో!

ఇంకేముంది వీళ్ళు ముగ్గురూ, ప్రొఫెసరూ,బెలూన్లో!

ఆ ప్రొఫెసర్ కి చచ్చే కోపం! వీళ్ళని తన్ని తగలేసినంత పని చేస్తాడు. ఇంతలో తుఫాను. వాన,గాలి! ఆ గాలివానలో చీకట్లో ప్రొఫెసర్ వీళ్ళని తోయబోయి తనే తాగిన మైకంలో కిందకు దూకేస్తాడు. ఇహ అక్కడినుంచీ దాన్ని నడిపే బాధ్యత వీళ్ల ముగ్గురిమీదా పడుతుంది. టామ్ తెలివైన వాడు కాబట్టి అక్షాంశాలూ రేఖాంశాలూ చక్కగా అర్థం చేసుకుని వాటిప్రకారం,టైమ్ జోన్లూ వగైరాలు కూడా లెక్క గట్టి బాగానే నడిపిస్తాడు విమానాన్ని.....అదే బెలూన్ని!

ఒకరాత్రి ముగ్గురూ పడి మొద్దుల్లా నిద్రపోయాక తెల్లారి చూస్తే లండన్ బదులుగా ఆఫ్రికా____ అదీ సహారా ఎడారి చేరుకుంటారు. అది సహారా అని తెలీక బెలూన్ దింపుతారు. ఎండమావులు కనపడితే నీళ్ళనుకుని పరిగెడతారు. నీళ్ళు నిజంగానే కనపడితే ఎండమావి అనుకుని వదిలేయబోతారు. ఇసుక తుఫానులో చిక్కుకుని చచ్చిపోయిన ఒక బృందాన్ని చూసి జడుసుకుంటారు గానీ వాళ్ళ దగ్గర దొరికిన బంగారు పెట్టె మాత్రం తీసుకుంటారు. ఇంతలో ఎవరో పరిగెత్తుకు వస్తుంటే______- కంపెనీ దొరికిందని ఎదురు పరిగెత్తి దగ్గరయ్యాక చూస్తే_________ఆ పరుగెత్తుకొచ్చింది సింహాలు!

ఇంకేముంది..మళ్ళీ వెనక్కి!

ఎదురుగా వస్తోంది సింహమని తెల్సి కాళ్ళు కదలమని మొరాయిస్తాయి, కానీ పరిగెత్తక తప్పదు. ఎలాగో ఉత్కంఠ మధ్య ఎలాగో బెలూన్లోకి చేరతారు మళ్ళీ! అసలు వీళ్ళు ఈ ఎడారిలో చేసే గోల అంతా ఇంతా కాదు! అక్కడి ఇసుక అంతా బుల్లి బుల్లి సీసాల్లో పాక్ చేసి సీసాకింత చొప్పున అని అమ్మితే అమెరికాలో ఎంత డబ్బొస్తుందో అంచనా వేస్తారు.(ఈ క్రేజీ అయిడియాలన్నీ టామ్‌వేనని వేరే చెప్పాలా?) ఇసుక తుఫాను వచ్చి బెలూన్ని ముంచెత్తుతుంది.

ఎలాగో అక్కడినుంచి బయలు దేరి కొంత దూరం ప్రయణించాక స్ఫింక్స్ విగ్రహాన్ని చూసి దెయ్యమో రాక్షసో అనుకుని జడుసుకుంటారు. అది విగ్రహమేనని తెలుసుకుని స్థిమిత పడి పిరమిడ్స్ చూడ్డానికి వెళ్తారు.ఇంతలో ఒక గొప్ప ప్రమాదం వచ్చిపడుతుంది.

ఏమీ లేదు, టామ్‌దగ్గరున్న పొగాకు పైపు విరిగిపోతుంది. జిమ్‌నీ,హక్ నీ వెళ్ళి అమెరికాలో సెంట్ పీటర్స్ బర్గ్ లోని తమ వంటింట్లో గట్టుమీద ఉన్న మరో పైపు తెమ్మని ఆజ్ఞాపిస్తాడు టామ్!

పైగా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా దారి కనుక్కోడం ఎలాగో కూడా చెప్తాడు. ఇక్కడి నుంచీ అరపేజీలో కథ ముగుస్తుంది. కానీ అది చాలా సహజంగా అనిపిస్తుంది కూడా!

జిమ్,హక్ ఇద్దరూ వెళ్ళి ఆ పైపు తీసుకుంటుండగా పోలీ పెద్దమ్మ చూసి (అప్పుడేం జరిగి ఉంటుందో ఆవిడ గురించి తెల్సిన వాళ్ళకు చెప్పక్కర్లేదుగా !) టామ్ గాడు ఎక్కడున్నా సరే,జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రమ్మని చెప్పి వీళ్ళిద్దరినీ గెంటేస్తుంది. ఈ బెలూనూ,పైలట్ పనీ వీటన్నిటికీ ఆవిడ పూచిక పుల్ల కూడా విలువ ఇవ్వదు. అసలు పట్టించుకోదు.

ఇంకేముంది?మర్నాడూ జిమ్,హక్ విమానంలో తిరిగి రాగానే చేసేది లేక టామ్ వాళ్ళతో కల్సి తిరుగు ముఖం పట్టడంతో కథ కంచికి!

మార్క్ ట్వైన్ హాస్యం ఎంత పదునుగా సునిశితంగా ఉంటుందో తెల్సిందే! దాన్ని అలాగే తెలుగులోకి యథాతథంగా దించి,హాయైన నవ్వుని పాఠకుల మొహాల మీదకు తెప్పించడం చేయి తిరిగిన అనువాదకులకు కూడా కత్తి మీద సామే!

జిమ్ "టామ్ గారూ, హక్ గారూ"అంటూ అమాయకంగా వేసుకునే మొండివాదనలను ఒరిజినల్ లో చదివి ఎంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటామో తెలుగు అనువాదంలో కూడా అంతే అలరిస్తాయి. ఒకటీ అంటూ చెప్పలేం! అవి ఇలా చెప్పడం కాదు,చదివి ఆ హాస్యాన్ని అనుభవిస్తే గానీ అందులోని ఆనందం అర్థం కాదు!

రామ మోహన్ రావు గారు Call Of the Wild అనే నవలను కూడా తెలుగులోని అనువదించారని చదివాను గానీ అది ఎక్కడా లభ్యం కావడం లేదు.

హాసం ప్రచురణలు వేసిన ఈ అపురూపమైన పుస్తకం వెల కేవలం......కేవలం ముప్ఫై ఐదు రూపాయలు! నేనూ మా పాపా కల్సి ఈ పుస్తకం చదువుకోవడాన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తాం!

తప్పక చదవండి!

15 comments:

Kalpana Rentala said...

సుజాత,

అవును. నండూరి చేసిన ఈ అనువాదాల గురించి తప్పని సరిగా మాట్లాడుకోవాలి.టామ్ సాయర్ ( నండూరి ) తో నా అనుభవాలు కూడా దాదాపు మీలాంటివే. దురదృష్టమేమిటంటే ABN లో నండూరి మరణ వార్త గురించి చెపుతూ " టాం పాయర్" అని చెప్పారు. ఈనాడు లో నండూరి మరణ వార్త చదవండి. కనీసం వీటి గురించి ప్రస్తావన కూడా లేదు. తెలుగు మీడియా ' నానాటికీ తీసికట్టు..." తరహా లో తయారవుతోందనతానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. నేను కూడా నండూరి గురించి రాయాలి. కానీ ఇలా ఒకొక్క తరం ప్రముఖుల గురించి శ్రద్ధాంజలి ఘటిస్తూ రాయటం మనసు కి కష్టం గా ఉంది.
ఇక ఒరిజీనల్స్, అనువాదాల విషయం లో అన్నీ విషయాల్లో కాకపోయినా టాం సాయర్, హాకిల్ బెర్రీ ఫిన్ లాంటి విషయాల్లో మాత్రం మీ మాటే నాది కూడా. అది అనుసృజన ల గొప్పతనం.

Sujata said...

సుజాత గారూ : మిణ్ణల్లులు అంటే ఏమిటి ? :D

సుజాత said...

కల్పన గారూ, ఈ నిరంతర వార్తా ఛానెళ్ళ న్యూస్ రీడర్ల గురించి నేనసలు మాట్లాడలేనండీ! కోపంతో మాట పెగల్దు! తెలుగులోకి అనువదించి ఇచ్చిన వార్తను కూడా తప్పుగా చదువుతున్నారంటే వాళ్ళకు వార్త తాలూకు సారాంశం మీద ఏమీ అవగాహన లేదనే కదా! నిజానికి టామ్ పాయర్ అని పొరపాటున అచ్చు తప్పుతో వార్త వాళ్ల దగ్గరికి వచ్చినా "అయ్యో, ఇది టామ్ సాయర్ కదా"అని సరి చేసి చదవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉండాలా వద్దా? అంటే ఈ వార్త చదివిన వాళ్ళకి టామ్ సాయర్ ఎవరో కూడా తెలీదన్నమాట!.

నండూరి ఎవరైతే ఎవరికేమిటి? ఆయన మరణ వార్తకు కమర్షియల్ వాల్యూ ఉందా లేదా అన్నదే ప్రధానం! నిజానికి ఆయన గురించి పెద్ద పెద్ద వ్యాసాలేమైనా ఇవాళ్టి పేపర్లో (బహుశా రేపేమైనా వస్తాయేమో చూద్దాం) ఉంటాయని ఆశగా చూశాను! కేవలం సమాచారం ఇచ్చి ఊరుకున్నారన్నమాట!

హక్ ఫిన్ నవలను నేను టామ్ సాయర్ నవల కంటే కూడా ఎంజాయ్ చేశాను. వాడలా రికామీగా నదిలో పడవ మీద పడుకుని ప్రయాణిస్తూ,ఇష్టం వచ్చినట్టు చేపలు పట్టుకుంటూ...జిమ్ తో కలిసి చేసే సాహసాలు భలే నచ్చాయి నాకు. హక్ లాగా ఇష్టం వచ్చినట్టు బతకాలి అనిపించేది.

సుజాత గారూ, మిణ్ణల్లి అంటే గాలిలో ఎగిరే దీపపు పురుగుల్లాంటివని నా అనుకోలు!(assumption)! మిణుగురు పురుగులు మాత్రం కావని అనుకుంటున్నా! ఈ పదం చిన్నప్పుడెప్పుడో విన్న గుర్తుంది కానీ ఆ తర్వాత ఎవరూ వాడకపోవడంతో అవేమిటో గుర్తు లేకుండా పోయింది :-)

వేణు said...

నండూరి రామమోహనరావు గారి రచనల్లో విశ్వదర్శనం చదివి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆయనది చాలా చక్కని శైలి. అనువాద నవలల విషయానికొస్తే యాంత్రిక అనువాదంలా కాకుండా సమ్మోహనంగా రాయగలగటం నండూరి ముద్ర!

‘టామ్ సాయర్ ప్రపంచయాత్ర’ గురించి దశాబ్దాల క్రితమే తెలుసుకానీ దాన్ని చదవటం ఇంతవరకూ కుదరనేలేదు. అంటే అంత శ్రద్ధ పెట్టలేదు నేను. ఈ పుస్తకం గురించి మీరు రాసిన పరిచయం బాగుంది. ఇప్పుడు తప్పకుండా చదువుతాను!

Rao S Lakkaraju said...

నండూరి వారి రాజూ పేదా, టామ్ సాయర్, హాకిల్ బెర్రీ ఫిన్ ఆంద్ర పత్రికలో ప్రతీ వారం వస్తున్నప్పుడు, పత్రిక కోసం ఎదురు చూసే వాళ్ళం. వీలయితే మెయిల్ ట్రైన్ దగ్గరకి వెళ్లి తెచ్చుకుని చదివే వాళ్ళం. వాటిని నాలాంటివారికి పరిచయం చేసిన సృష్టికర్త ఇక లేరంటే బాధగాఉంది.ఆయన భార్య పిల్లలు త్వరలో ఈ విషాదం నుండి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.

siri said...

“What really knocks me out is a book that, when you’re all done reading it, you wish the author that wrote it was a terrific friend of yours and you could call him up on the phone whenever you felt like it. That doesn’t happen much, though.”
— J.D. Salinger (The Catcher in the Rye)

Sujata, meeru pustakam.net lo aayana gurinchi sreelata kamaraju rasina article chadavandi, somethings about him thru a grand-daugther's point.. I don't think nobody is going to put anymore articles abt him, if u want to know more about him please do contact me thru the email I will be happy to tell u anything abt him(as much as i know).Sreedevi Gudipati.

Kalpana Rentala said...

ఒక్క ఆంధ్రజ్యోతి తప్ప మిగతా పేపర్లు మొక్కుబడిగా వార్తా రాసి వూరుకున్నాయి. ఎడిట్ పేజీ లో నండూరి మీద మంచి వ్యాసాలు పేపర్ లో వుంటాయేమోనని మేము కూడా పొద్దుటే అన్నీ పేపర్ లు తిరగేసి నిరాశ తో వూరుకున్నాము. ఇదిగో మనలాగా ఎవరో ఒకరం బ్లాగ్ ల్లో రాసుకోవటం తప్ప పత్రికలవారికి ఇలాంటివి మీరన్నట్లు అవసరం లేదనుకుంటాను.:-((

వేణు said...

వార్తాపత్రికలవారికీ, న్యూస్ ఛానళ్ళవారికీ సాహితీరంగంలోని వారెవరి గురించీ ఏమీ పట్టరు. ‘టాం పాయర్’ అని చదివే జర్నలిస్టులకు రామమోహనరావు గారి ఘనత ఎలా తెలుస్తుందీ? ఆయనేమైనా రాజకీయ నాయకుడా? కనీసం వాణిజ్య ప్రముఖుడో సినీ స్టారో కూడా కాదాయె. ఇంకెందుకూ మరి పట్టించుకోవటం!

కొత్తావకాయ said...

అనువాదం అంటే మక్కి కి మక్కి కాకుండా, అందమైన అనుసృజన చెయ్యవచ్చని నిరూపించిన పుస్తకం "టాం సాయర్ ప్రపంచయాత్ర". "మహానుభావులకు కాస్త ఎక్కువ ఆయుష్షు పొయ్యకూడదూ పైవాడు!" అనిపిస్తూ ఉంటుంది. మార్క్ ట్వైన్ కంటే నండూరి వారే నచ్చాదు నాక్కూడా, ఈ ఒక్క పుస్తకం విషయంలో మాత్రం.

sridhar said...

http://sethgodin.typepad.com/seths_blog/2011/09/back-to-the-wrong-school.html?utm_source=feedburner&utm_medium=feed&utm_campaign=Feed%3A+typepad%2Fsethsmainblog+%28Seth%27s+Blog%29

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

ఇదివరకు చదివే అవకాశం రాలేదు. మీ టపా చదివాక చదవాలనే ఆసక్తి కలుగుతుంది. నా కొనుగోలు జాబితాలో రాసుకున్నాను. ఈ సారి ఆంధ్రా వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను. ధన్యవాదములు :)

Sujata said...

సుజాత గారు

పెద్ద పొరపాటు జరిగింది. నేను చేసిన వ్యాఖ్యని ఇప్పుడే చూసాను. పేస్ట్ చెయ్యడం లో పొరపాటు. నాకు నండూరి రాం మోహన్ రావు గారంటే చాలా గౌరవం. మొట్ట మొదట - రాజు పేద చదివాక, (కనీసం ఒక 100 సార్లు చదివి వుంటాను) మిగిల్న అనువాదాల్నీ, ఒరిజినల్ రచనల్నీ అడిగి కొనుక్కుని చదివాను. నా మొదటి వ్యాఖ్య పోస్ట్ చెయ్యడం లో పొరపాటు జరిగింది. I am very very sorry.

Ravi said...

sujata garu,

meeru state govt lo..telugu bhasha sangham lo edannaa..key post lo vunnaara..just asking out of curiosity

సుజాత said...

రవి గారు, అలాంటిదేమీ లేదు.

Thutaram Krishna said...

నేను 8 తరగతి చదివేరోజుల్లో టామ్ సాయర్ మాకు నాన్ డిటైల్డుగా ఉండేది.ఆవేసవి సెలవల్లో మాఊరి గ్రంధాలయంలో పుస్తకాలు వెతుకుతుండాగా హకల్బెరీఫిన్ గ్రంధం కనిపించింది.గ్రంధం అని ఎందుకంటున్నానంటె అది దాదాపు 400 పేజీల బౌండు పుస్తకం.చదవటానికి రెండురోజులు పట్టింది.తరువాత 10 సంవత్సరాలకి ఒక పుస్తకాల షాపులో హకల్ బెరీఫిన్ కేవలం గుప్పెడు పేజీలతో కనపడింది.పుస్తకం సైజు గురించి అడిగితే షాపు అతను ఇప్పుడు అంత పెద్ద పుస్తకాలు ఎవ్వరూ చదవటం లేదు అని చెప్పాడు.మళ్ళీ అదే సైజు పుస్తకం చదవాలని కోరికగా ఉంది

Post a Comment