September 23, 2011

రామలింగ రాజు అంతరంగం... కవిత్వంగా!



విజయానికి చుట్టాలెక్కువే గానీ అపజయానికి మాత్రం పాపం బంధు గణమే ఉండదుట! రామలింగ రాజు గారు ఎప్పటిలాగానే "రాజు గోరు"లా ఉండి ఉంటే ఈ సాదా సీదా పుస్తకానికి ఎంత హడావుడి జరిగి ఉండేదో?

ఆకాశమంత పందిరి,భూదేవంత అరుగు వేసి రతన్ టాటా లాంటి తెలుగేతరుడిని పిల్చి, హంగామా చేసి ఆవిష్కరించే వాళ్ళేమో! ఏ తొమ్మిదో టీవీనో దాన్ని 45 నిమిషాల ప్రోగ్రాములో ఊదరగొట్టేసేది.ఇంగ్లీషు,తెలుగు దినపత్రికలు కూడా ఈ పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తూ "గొప్ప" రివ్యూలు రాసేసి రాజుగార్ని సంతోష పెట్టేవాళ్ళు.

కానీ ఇవేమీ జరగలేదు, నెమ్మదిగా ఈ పుస్తకం ఎలాంటి హడావుడీ లేకుండా మార్కెట్లోకొచ్చింది. సత్యం రామలింగ రాజు తీరిక వేళల్లోనో,మనసులో ఆలోచనలు రేగిన వేళలోనో ఎప్పటికప్పుడు రాండమ్ గా రాసుకున్న కవితల్ని ఆయన భార్య నందిని పుస్తకంగా తెచ్చారు. ఇందులో ఏ కవితలు ఎప్పుడు రాసుకున్నారో వివరం లేదు. అందువల్ల ఈ కవితల్లో ఏవైనా ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ముందుగానే సూచించాయా అనే కుతూహలంతో చదవడం సహజమే కానీ గట్టిగా ఒక నిర్థారణకు వెంఠనే రావడం కష్టం!

మనసులో కవిత్వ భావనలుండి, భాష కూడా ఎంతో కొంత ఉంటే కవిత్వం కాస్త నాలాంటి కవితా సువాసనలు అర్థం కాని వాళ్ళక్కూడా అర్థమయ్యేలా బయటికి వస్తుందనుకుంటా!

రామలింగ రాజు గారికి భాష అంతగా సహకరించకపోవడంతో కవితా భావనలు అంత refined గా కాక raw గా కనిపిస్తాయి. అయితే ఆయన స్వతహాగా కవి కాదని అందరికీ తెలుసు కనుక ఆ భావాలు raw గా ఉండటమే బాగుంది. వాటిని refined గా తీర్చి దిద్దాలని ప్రయత్నించి ఉంటే ఆ ప్రయత్నం తేటతెల్లంగా కనపడిపోయేది!

కొన్ని కవితలు మరీ సాదా సీదాగా ఉండి, మరీ ఎప్పుడో ఎనభైల్లో సామాజిక స్పృహ పేరుతోనో,జీవితాన్ని నిర్వచించే అత్యుత్సాహంతో ఔత్సాహిక కవి కుమారులు రాసిన కవితలు గుర్తొచ్చేలా ఉన్నాయి.

టికెట్ లేని ప్రయాణీకుడు_____కవితలో జీవితం రైలు ప్రయాణంలా ఎంత రద్దీగా ఉంటుందో చెప్తూ

"ఏ క్షణాన్నైనా టికెట్ కలెక్టర్ రావొచ్చును,
ఆ వచ్చేదే నీ ఆఖరి స్టేషన్ కావొచ్చును"
అంటాడు రాజు! ఈ లైన్ల వెనుక ఏముందనేది వెంటనే ఊహించాలనిపిస్తుంది. ఇలాంటివే మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి.

"ఆటలో దెబ్బలను ఎలా తట్టుకోను?
అన్యాయపు ఆటగాళ్లను ఎలా వదుల్చుకోను (ఎన్ని ఆటలు నేను ఆడను?)

నిజం రూపాన్ని కొద్ది కొద్దిగా చెక్కాలి
నిర్థారించిన నిజాలు చిరకాలం నిలవాలి(సాక్ష్యాలే)

"వంచనలన్నీ మించిన వచన
నాకు నువ్వే చేసుకునే మహా వంచన
ఆత్మవంచన

ఇలాంటి కొన్ని లైన్లు ఆయన జీవితానికి అద్దంపడతాయేమో అన్నట్లు అక్కడా తోస్తాయి. (అయినా కాకపోయినా)

ఇందాక చెప్పినట్టు భాష మీద పట్టు లేకపోయినా కొన్ని భావాలు బాగున్నాయి,చాలా కామన్ గా అందరిలో మెదిలే ఆలోచన్లే అవి! అలాగే ఒక కవితా వస్తువంటూ ఎంచుకోకుండా, అప్పుడప్పుడూ మదిలో అప్పటికప్పుడు తోచిన ఆలోచన్లను రాసి పెట్టుకున్నారంతే! కొన్ని కవితలు ఎందుకు రాశారో నాకర్థం కాలేదు.

"ఓ కోడి పుంజా!"
"అలవాట్లు"
"అభాగిని" _____ఇలాంటివి!

దాదాపుగా ప్రతి కవితా రేడియో కవితల్లాగా మొదటి పాదం మళ్ళీ మళ్ళీ మధ్యలో రిపీట్ అవడం ఎందుకో అంతుపట్టలేదు నాకు!

ఇవన్నీ రాయడానికి ఆయన కు సమయం దొరకడమే గొప్ప విషయం!
మొన్నొకాయన నిర్వచించారు "అడ్డంగా రాసే పేరా గ్రాఫు ని నిలువుగా రాస్తే అదే కవిత్వం అవుతుంద"ట!

ఆ కోవ కవిత్వం ఈ మధ్య ఎక్కడ చూసినా గుర్రపుడెక్కలా విస్తరించి చుట్టేస్తోంది. పువ్వులూ,పిట్టలూ,ప్రేమా,మనసూ,జీవితం,నువ్వూ నేనూ,అంతరంగం,వెన్నెలా,వర్షమూ _______ఇవే వస్తువులు తిరగా మరగా వేసి అవే కవితలు!

వాటితో పోల్చుకుని చూస్తే రాజు కవితలు చాలా ఉత్తమస్థాయిలోనే ఉన్నాయి.

విశ్వం,సృష్టి,వైజ్ఞానిక ప్రగతి,సమాజ వైఖరిమీద నమ్మకమూ,విస్మయమూ,మనుషుల పట్ల సుహృద్భావం,ఇవన్నీ ఈ కవితల్లో చోటు చేసుకున్నాయి!

రామ్ గోపాల్ వర్మ "నా ఇష్టం" పుస్తకానికి ప్రచురణ సంస్థ ఎంత హడావుడి చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.

రాజు గారు కుప్ప కూలకుండా ఉండుంటే ఈ ఏడాది పుస్తకాల సంతలో కూడా ప్రత్యేకంగా ఒక స్టాలు పెట్టి మరీ అమ్మేవాళ్ళే ఈ పుస్తకాన్ని!

కవర్ పేజీ మీద రాజుగారే! ఎందుకో మనసు చివుక్కుమంది ఆ కవర్ పేజీ చూస్తే! రాజు మీద నాకున్న అభిమానమే తప్ప మరో దీనికి కారణమేదీ కనపడలేదు. (కారణం లేని హీరో వర్షిప్ అని విమర్శకులెవరన్నా వచ్చేస్తారేమో... రాకండి! నా అభిమానం నా ఇష్టం!)

ఎమెస్కో వాళ్ళు వేసిన ఈ పుస్తకం వెల 90 రూపాయలు!


18 comments:

Sujata M said...

అవునండీ. రాజు గారి ఈ పుస్తకం... ఆయన జీవితం లో వివిధ దశలలో రాసుకున్నవిట. పుస్తకావిష్కరణ, వ్యూహాత్మక ప్రచారం, లాంటి హంగామాలేవీ లేకపోయినా ఈ పుస్తకం నిశ్శబ్దంగా చాలా కాపీలే అమ్ముడుపోతోందని విన్నాను. మీలాంటి మంచి వాళ్ళు ఈ పుస్తకం కబురు విస్తరింపజేస్తూ వుంటే (ప్రయత్నమూ, ఉద్దేశ్యమూ మంచిదయినపుడు దానికి విశ్వం కుట్ర ఎంతో కొంత సాయం అందిస్తుంది) it helps.

Secondly, పుస్తకం అమ్ముడు పోవడం లేదా పేరు ప్రఖ్యాతులు గడించడం.. ఈ పుస్తకం ఎజెండాలో లేకపోవడం ఒక (పాఠకులకి) కలిసొచ్చే విషయం.

Manasa Chamarthi said...

నాకూ చదవాలనుంది ఈ పుస్తకం. గెలుపు గురించి చదవడం బాగుంటుంది, గెలిచిన వాళ్ళ గురించి తెలుసుకోవడమూ బానే ఉంటుంది.
కానీ, విజయాన్ని వశం చేసేసుకున్న మనిషి, చెప్పలేనంత లోతుల్లోకి, బయటకు చెప్పుకోలేని కారణాలతో పడిపోతే, ఆ మనిషి అంతరంగమేమిటో అర్థం చేసుకోవాలనుంటుంది. అంత కన్నా జీవితాలకి పెద్ద పాఠాలేం ఉంటాయి ?
ఇది కవిత్వం కాబట్టి మొత్తం అలా ఉండకపోవచ్చు. మీరనట్టు ఎప్పుడు రాసారో వివరాలు ఇస్తే ఇంకా బాగుండేదేమో. మీరు చాలా మంచి పుస్తకాలను పరిచియం చేస్తారు. ఇంకా సరీగ్గా చెప్పాలంటే - ప్రత్యేకమైనవి!

Praveen Mandangi said...

నాకు ఆ రాజు మీద ఎలాంటి అభిమానమూ లేదు. లేని ఆదాయాన్ని ఉన్నట్టు చూపించి కాంట్రాక్ట్‌లు సంపాదించాడు. జీవితంలో పైకి రావడానికి అడ్డ దార్లు తొక్కేవాళ్ళ మీద అభిమానం ఎందుకు? బైర్రాజు ఫౌండేషన్ పెట్టి సమాజ సేవ చేసి ఉండొచ్చు కానీ సమాజ సేవకి ఖర్చు పెట్టిన దాని కంటే దోచుకున్నదే ఎక్కువ కదా. ఇంతకీ తాను కాంట్రాక్ట్‌లు సంపాదించడానికి ఏ విధంగా అడ్డ దార్లు తొక్కిందీ వైగైరా విషయాలు తన జీవిత చరిత్రలో వ్రాసాడా? ఒకవేళ ఈ పుస్తకం వైజాగ్‌లో గానీ శ్రీకాకుళంలో గానీ దొరికితే చూస్తాను.

Indian Minerva said...

వైరాగ్యాన్ని బాగానే పలికించినట్లున్నారే కవితల్లో. :) తత్వం వంటబట్టడం అంటే ఇదే కాబోలు. (నేను అభిమానిని కాదులెండి).

"పువ్వులూ,పిట్టలూ,ప్రేమా,మనసూ.."

ఇవిలేకుండా కవిత్వం రాయడం కుదరదుగాక కుదరదు. అంతే.

MURALI said...

రాజుగారు జీవిత చరిత్ర రాసుంటే ఈపాటికి సంచలనం అయ్యేదేమొ.

వేణు said...

రాంగోపాల్ వర్మ రాసిన ‘నా ఇష్టం’ పుస్తకం విడుదలైనపుడు ఎమెస్కో వాళ్ళు ఎంత హడావుడి చేశారో! అదే సంస్థ రామలింగరాజు రాసిన ఈ పుస్తకాన్ని ప్రచురించటం విశేషం. ఆయన స్థితి తలకిందులవకపోయివుంటే నిజంగా మీరన్నట్టే వైభవంగా ఆవిష్కరణ జరిపివుండేవారు.

కవులు సాధారణంగా ‘కప్పిచెప్పే’ లోతైన భావనలు దీనిలో ఉండే అవకాశం లేదు కాబట్టి, ఈ కవితలను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చనుకుంటాను!:)

Raj said...

రాజు గారి గురించి ఎవరు ఎన్ని చెప్పినా.. ఆయన చేసిన మంచి ముందు అవన్ని దిగదుడుపే.... అయినా పోయి పోయి ఎవరు చెడు చేయ్యలనుకోరు కదా.. కొన్ని సార్లు అలా అయిపోతూ ఉంటుంది అంతే...


ఈ పుస్తకం గురించి నేను వినలేదు.. నాకు కవితా జ్ఞానం లేదు గానీ రాజు గారి లాంటి పెద్దలు వ్రాసిన ఇలాంటి పుస్తకాలు తప్పకుండా చదవాల్సిన జాబితాలో ఉండల్సినవే...

GKK said...

సుజాత గారు!’. రామలింగరాజు జీవితం చూస్తే ’నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చర్యం తో వీరు! నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే” అన్న పదాలు గుర్తుకొస్తాయి. ఆయన ఒక ప్రపంచస్థాయి సంస్థను సృష్టించి ఎంతోమందికి ఉపాధి కల్పించాడు అన్నది నిండునిజం.

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్ శర్మ, కామెంట్ రాసేముందు పోస్టు చదివితే బాగుంటుందేమోఅ అలోచించండి! ఇది ఆయన జీవిత చరిత్ర అని నేనెక్కడైనా రాశానా? టైటిల్లోనే అది కవిత్వమని చెప్పాను. పోస్టులో పూర్తి వివరణ ఇచ్చాను, కోట్ చేసి మరీ! అది జీవిత చరిత్ర అని నిర్థారణకు ఎలా వచ్చేశారు మరి? అంటే చదవలేదన్నమాట!


రాజు మీద నా అభిమానానికి నా కారణాలు నాకుంటాయి. అభిమానం లేకపోవడానికి మీ కారణాలు మీకుంటాయి.

ఇది ఒక పుస్తక పరిచయం! పుస్తకం గురించి రాయండి. పుస్తకం గురించి మాత్రమే!

karthik said...

>>కామెంట్ రాసేముందు పోస్టు చదివితే బాగుంటుందేమోఅ అలోచించండి!
అది నిన్న రాత్రి రాసుకున్న కామెంట్ ;) అప్పటికి మీరింకా పోస్టే రాయలేదు.. డ్రా తీసినప్పుడు మీ బ్లాగు పేరొచ్చింది అందు వల్ల ఇక్కడ పేస్ట్ చేశాడు.. విధి బలియమైనది..

Praveen Mandangi said...

కవితలంటే శివసాగర్‌లాగ తన జీవితం గురించి వ్రాసుకున్న కవితలనుకున్నాను.

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్ గారూ, అందుకే టపా మొత్తం చదివితే విషయం ఏమిటో తెలుస్తుంది. అవి రాండమ్ ఆలోచనలకు ఇచ్చిన కవితా రూపాలు! ఆయన జీవిత సారం కాదు.

buddhamurali said...

సుజాత గారు ఈ బుక్ నేను చూడలేదు కానీ .. రామలింగ రాజు సత్యం రామ లింగ రాజుగా ప్రఖ్యాతి చెందక ముందు కవితలు రాసే వారు . హైదరాబాద్ నుంచే మయూరి అని ఒక వారపత్రిక వచ్చేది ( దాదాపు 1980 ప్రాంతం లో ) ఆ వార పత్రికలో రాజువి చాలా కవితలు వచ్చాయి . సత్యం రామ లింగ రాజుగా మారిన తరువాత ఆయన కవితలు ఎక్కడా కనిపించలేదు. బహుశా ఈ కవితలు 1980 ప్రాంతంలో రాసినవే కావచ్చు.

Praveen Mandangi said...

కఠినంగా మాట్లాడుతున్నాననుకోవద్దు. మా తమ్ముడు అన్న మాటలు గుర్తొస్తున్నాయి "డబ్బులు అతని వ్యక్తిగత విషయం కావచ్చు కానీ అతను చేసిన తెలివితక్కువ పనులకి ఆ కంపెనీలో పని చేసినవాళ్ళ ఉద్యోగాలు పోతాయి. దాన్ని అతని వ్యక్తిగత విషయం అనుకోలేము" అని. కొందరు రామలింగ రాజు పై సానుభూతి చూపిస్తోంటే నాకు అదోలా అనిపించింది అందుకే.

Sujata M said...

పర్వాలేదండీ.. శర్మ గారి ఆనెస్టీ బావుంది. చదవకుండా (గబ గబా చదివి) రాయడం వల్ల అలా రాసేసారు.

btw రాజు గారి కధ లో - 'నేను ఇలా చేసాను ..' అని ప్రకటించడానికి ఆయనకెంత గుండె ధైర్యం కావాల్సొచ్చిందో - తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత సంఘర్షణ కి లోనయినా సరే ఆఖరికి 'మంచి' వైపే మెగ్గు చూపారు.

A Homemaker's Utopia said...

సుజాత గారు,

నమస్తే....మా బాబు ( నాలుగేళ్ళు ) కి చదవడం అలవాటు చెయ్యాలంటే ముందుగా నేను ఆ అలవాటు చేసుకోవాలని, చాలా కాలం క్రితం మర్చిపోయిన పుస్తకాలని ఇప్పుడిప్పుడే చదువుతున్నాను...తెలుగులో మీ బ్లాగ్ చాలా చాలా బాగుందండీ...మీ పోస్టులు కొన్ని చదివాక నేను ఈరోజు తెలుగు లో టైపు చెయ్యడం నేర్చుకుని మరీ మీకు మెసేజ్ చేస్తున్నాను...ఇంకా మరిన్ని మంచి మంచి పుస్తకాలని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తూ...నాగిని

lone wolf said...

రామలింగరాజు గారికి లౌక్యం తెలియదు. ఆయన నమ్మిన వారు, ఆయన సహాయం తీసుకున్నవారు ఆయనను దోషిగా నిలబెట్టారు. ఆయన చేసింది తప్పో ఒప్పో కాలం నిర్ణయిస్తుంది.ఒకటి మాత్రం నిజం భారత సాప్టవేర్ రంగం ఇవ్వాళ ప్రపంచ గగన వీధుల్లో రెపరెపలాడటానికి ఆయన చేసిన కృషి చేసిన మరవ లేనిది.

lone wolf said...

రామలింగరాజు గారికి లౌక్యం తెలియదు. ఆయన నమ్మిన వారు, ఆయన సహాయం తీసుకున్నవారు ఆయనను దోషిగా నిలబెట్టారు. ఆయన చేసింది తప్పో ఒప్పో కాలం నిర్ణయిస్తుంది.ఒకటి మాత్రం నిజం భారత సాప్టవేర్ రంగం ఇవ్వాళ ప్రపంచ గగన వీధుల్లో రెపరెపలాడటానికి ఆయన చేసిన కృషి చేసిన మరవ లేనిది.

Post a Comment