December 22, 2011

కొత్త పుస్తకం పచ్చి వాసన ....!





ఎంత బావుందో! ఎటు చూసినా ఊరిస్తూ కొత్త పుస్తకాలు! మనం చదివినవీ, చదవనివీ, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నవీ, ఒకసారి పోగొట్టుకుని మళ్ళీ కొనాలని చూస్తున్నవీ,సరి కొత్త కలెక్షన్లూ, చడీ చప్పుడూ కాకుండా మార్కెట్లోకి సింగారించుకుని వచ్చేసినవీ, యదార్థ గాథల ఆధారంగా రూపొందిన కల్పితాలూ, ఒకటా రెండా...బోల్డన్ని!

నాల్రోజుల క్రితం నేనూ కాసిన్ని పుస్తకాలు కొందామని బుక్ ఫేర్ కి వెళ్ళాను. స్టాళ్ళూ సందర్శకులతో కళ కళ్లాడి పోతున్నాయి. చూడటమే కాక, చాలా మంది బోల్డన్ని పుస్తకాలు కొని పట్టుకెళుతుండటం సంతోషించదగ్గ విషయం!

అన్ని స్టాళ్ళూ తిరిగి చూస్తూ, పుస్తకాల గురించి, రచయితల గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ మంచి స్నేహితులతో కలిసి పుస్తకాలు కొనుక్కోడం చాలా బాగుంటుంది.

కొన్ని పుస్తకాలు కొన్నాక, నవోదయా స్టాల్ కెళ్తే నేను వేరే స్టాల్స్ లో కొన్ని తెలుగు పుస్తకాలు కొనేశానని తెల్సుకుని నన్ను బాగా చీవాట్లేశారు. "మన స్టాలు ఇక్కడుందని తెలీదా మీకు?" అని నిలదీశారు. నిజంగా నవోదయ "మన"దే అనిపిస్తుంది నాకు! షాపు కెళ్ళినా సరే, మన అభిరుచి ప్రకారం "ఇది కొత్తగా వచ్చింది చూశారా?" "ఇది తీసుకున్నట్టు లేదే మీరు?" "పోయిన సారి వచ్చినపుడు ఇది చూడలేదనుకుంటాను" అని చక్కగా సజెస్ట్ చేసి మరీ మంచి పుస్తకాలు చూపిస్తారు. కొనిపిస్తారు కూడా!


సరే, "అలా తిట్టకండి సార్" అని ప్రాధేయపడి వాళ్ళ దగ్గర కూడా పుస్తకాలు కొన్నాను. పిల్లలతో షాపింగ్ కి వెళ్ళ కూడదని మా అమ్మాయి మరో సారి రుజువు చేసింది. దానికిష్టమైన పుస్తకాలన్నీ సెలెక్ట్ చేసేసుకుని "డబ్బులు అమ్మ ఇస్తుంది" అని ముందుకెళ్ళిపోయింది. ఒక scholastic స్టాల్లోనే, 30 పేజీలదొకటీ, యాభై పేజీల దొకటీ, వంద పేజీల దొకటీ...ఈ మూడు పుస్తకాలకీ కలిపి పదమూడు వందలు...అదొక కడుపు మండించే సన్నివేశం! వదిలేయండి!


సందట్లో సడేమియా లాగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే స్టాళ్ళు కూడా పుస్తకాల స్టాళ్ళ మధ్య కనపడి ఆశ్చర్యం కల్గించాయి. ఇంకా ఆశ్చర్యం..ఆ స్టాళ్ళ వద్ద కూడా బోల్డు మంది జనం గుమికూడి ఉండటం!

ప్రజాశక్తి,విశాలాంధ్ర,నవోదయ,కొత్తపల్లి.ఎమెస్కో.. ఇవే కాకుండా ఇంకా పబ్లిషర్లూ, స్టాళ్ల పేర్లూ చూసుకోకుండా కాళ్ళు నొప్పేట్టేదాక తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను.

చలం రచనలు ఆకట్టుకునే అందమైన డిజైన్లో కనపడి ఊరించేయడంతో నా దగ్గర అన్నీ ఉన్నా, కథలన్నీ ఒకచోట పడి ఉంటాయి లెద్దూ అని సర్ది చెప్పుకుని మళ్ళీ కొనేశాను కథా సంకలనాలు!ఏడుతరాలు నా దగ్గరున్న దాన్ని ఎవరో పుణ్యాత్ములు పట్టుకెళ్ళి చివరి పేజీలు చింపేసి ఇచ్చారు. అలా చివరి పేజీలు లేని దాన్నే మరొకరికి ఇచ్చా చదవమని! ఎలాగైనా కొత్తది ఉండటం అవసరమని అది తీసుకున్నాను!

చలం కొత్త కలెక్షన్లో కథా సంకలనాలు,
బీనా దేవి సమగ్ర రచనలు,
వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టి మనిషి" (ఇది నా దగ్గరుంది ఎవరికో ఇచ్చాను)
పిలకా గణపతి శాస్త్రి గారి ప్రాచీన గాథా లహరి,(ఈ సారి ఇది నా ఫేవరిట్ పుస్తకమై కూచుంది)
చెళ్ళ పిళ్ళవెంకట శాస్త్రి గారి "కథలూ గాధలూ"

అంటరాని వసంతం,
కాశీభట్ల వేణు గోపాల్ పుస్తకాలు,
రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం "కళ్ళు తెరిచిన సీత"
మరి కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు....కొన్నా!



కొమ్మూరి వేణు గోపాల రావు గారి పుస్తకాలు మళ్ళీ వేశారంటే ఆయన రాసిన "ఈ దేశంలో ఒక భాగమిది" పుస్తకం కోసం వెదికాను ఆత్రంగా( పోయిన సారీ ఇలాగే వెదికా దీని కోసం)! పోయిన సారి లాగే అది నాకు దొరకలేదు. ఆయన పుస్తకాలన్నింటిలోనూ అదే నాకు నచ్చుతుంది బాగా!

వనవాసి కొత్త కాపీ (నా దగ్గరుంది ఎప్పుడో యాభైల్లో వేసింది. పట్టుకుంటే పొడి ఐపోతోంది)తీసుకున్నా !

ప్రదర్శన అయిపోయే లోపు మరి కొన్ని పుస్తకాలు కొనాలి.

పుస్తకాలు చదివే వాళ్లనీ, కొనే వాళ్ళనీ ఒక చోట చేర్చి, తమ పఠనానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునేలా చేయడంలో ఆన్ లైన్ తెలుగు ప్రపంచం, ముఖ్యంగా తెలుగు బ్లాగులు చాలా ఉపయోగపడ్డాయనడంలో నాకెలాంటి సందేహమూ లేదు.

నీ దగ్గర ఈ పుస్తకముందా?... ఈ పుస్తకం మీకు దొరికిందా? అంటూ పలకరించుకుంటూ, దూరాన ఉన్న స్నేహితులకు పుస్తకాలు కొని పంపడం వరకూ చేరింది ఇది. (దూరాన ఉన్న స్నేహితుల కోసం నేనూ కొన్నాను పుస్తకాలు! నాతో పాటే మరి కొందరు బ్లాగ్ మిత్రులు కూడా విదేశాల్లోని మిత్రుల కోసం పుస్తకాలు కొన్నారు)

కాబట్టి, తెలుగు బ్లాగులున్నంత వరకూ, పుస్తక పఠనానికి, పఠనానుభవాల పంపకాలకు మాత్రం లోటు జరగదు.

45 comments:

Manasa Chamarthi said...

భలే భలే ! బోలెడు పుస్తకాలు....కొంచం కుళ్ళుగా ఉంది నిజం చెప్పాలంటే!
ఆఖరు వాక్యాలు సత్యం..సత్యం..సత్యం!
నాకు పుస్తకాలు ఇచ్చిన వాళ్ళందరికీ జిందాబాద్ కొడుతూ..:) (మీక్కూడా..శరత్పూర్ణిమ ఇచ్చినందుకు..అది చదివేశాను, మీకు చెప్పడమే ఆలస్యం అనుకుంటుంటే, ఈ టపా కనపడింది. అందుకే ఇక్కడ థాంక్స్ చెప్పేస్తున్నాను. :-) )

రవి said...

నేనూ ఇప్పటికి రెండు రౌండ్లేశాను.

నా లిస్టు ఇది.

వనవాసి
మృత్యులోకం, అగ్నిజ్వాల - దాసరి సుబ్రహ్మణ్యం
మహాభాగవతం - తితిదే వారి సెట్టు
కొత్తపల్లి వారి స్టాల్లో నాన్న (ఒక నాన్న కూతురికి రాసిన ఉత్తరాలు, పాప దానికి గీసిన బొమ్మలతో)
టింగురుబిళ్ళ,
ఆంధ్రవ్యక్తివివేకం (సంస్కృత గోలలెండి)
సర్వదర్శన సంగ్రహం,
పిల్లల బొమ్మల శ్రీనివాస కల్యాణం, భద్రాచల చరిత్ర,
వావిళ్ళ వారి పుస్తకాలు (ఈ మద్య అన్నీ తిరిగి ముద్రిస్తున్నారు) కొన్ని (పురాణ కథలు, ఋతుసంహారం, దక్కను కథలు వగైరా)
జిడ్డు కృష్ణమూర్తి పిల్లలతో జరిపిన ముచ్చట్లతో కూడిన డీవీడీ, మరో రెండు పుస్తకాలు,
వగైరా...

ఇంకా కొనకుండా మిగిలినవి
కథలు, గాథలూ, కథాసరిత్సాగరం, సంస్కృతంలో నిరుక్తం, నాట్యశాస్త్రం నాలుగు సంపుటాలు.

రంగనాయకమ్మ గారి తులసిదళం నవల విమర్శ ఎక్కడా దొరకలేదు. అది చదవాలని ఉంది. ఆమె ముఖాముఖి ఒక పుస్తకంగా వచ్చింది కానీ మార్క్సిజం పాలు ఎక్కువగా ఉంది. అంచేత కొనలేదు.

Praveen Mandangi said...

మంచి సాహిత్యం దొరికితే ఆంధ్ర ప్రదేశ్‌లోనే దొరుకుతుంది. భుబనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా పుస్తకాల షాపులు ఉన్నాయి. కానీ ఆ షాపుల్లో మార్క్సిస్ట్ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం చాలా తక్కువగా దొరుకుతుంది. హిట్లర్ వ్రాసిన మీన్ కాంఫ్, అయన్ రాండ్ వ్రాసిన అట్లాస్ ష్రగ్డ్ మాత్రం కుప్పలుతెప్పలుగా దొరుకుతాయి. కానీ లియో టాల్స్టాయ్ వ్రాసిన యుద్ధం-శాంతి నవలకి ఒక్క కాపీ కూడా దొరకదు. నా స్నేహితురాలు మీన్ కాంఫ్ పుస్తకంలోని వంద పేజిలు చదివింది. విరక్తి కలిగి నిద్రపోయింది. విశాలాంధ్రలో మంచి తెలుగు అనువాదాలు దొరుకుతాయి. అయితే విశాలాంధ్ర బ్రాంచ్ శ్రీకాకుళంలో ఎలాగూ ఉంది కాబట్టి బుక్ ఎక్సిబిషన్‌కి వెళ్ళాలనిపించలేదు.

SHANKAR.S said...

ఇంతకీ "బీనాదేవి సమగ్ర రచనలు"లో తప్పుల శాతం ఏ మేరకు ఉందో మీరు చెప్పనేలేదు. వేణు గారూ ఓ సారి ఇటు రండి చెప్తాను :)))))

SHANKAR.S said...

"మంచి సాహిత్యం దొరికితే ఆంధ్ర ప్రదేశ్‌లోనే దొరుకుతుంది. "
మరి ఆ ముక్క తెలిసీ భుబనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఎందుకు వెతికావు ప్రవీణూ. ఎంచక్కా ఇక్కడే కొనుక్కోవచ్చుగా

Praveen Mandangi said...

గత ఏడాది నేను పుస్తక ప్రదర్శనకి వచ్చినా పుస్తకాలు ఏమీ కొనలేదు. లినక్స్ ప్రవీణ్ (ఇంకో ప్రవీణ్) లేనప్పుడు స్టాల్‌లో కూర్చుని కంప్యూటర్‌లో తెలుగు ఎలా టైప్ చెయ్యాలో చెప్పడం మాత్రం చేశాను. నేను మార్క్సిస్ట్ & స్త్రీవాద పుస్తకాలు మాత్రమే చదువుతుంటాను. కొణతం దిలీప్ వీక్షణం స్టాల్‌లో అవి ఉన్నా ఎలాగూ వైజాగ్, శ్రీకాకుళంలలో దొరికే పుస్తకాలే కదా అని వీక్షణం స్టాల్‌లో కొనలేదు. ఈ ఏడాది మాత్రం పుస్తక ప్రదర్శనకి రాలేదు. స్టాల్ నిర్వాహణకి NEFTలో విరాళం పంపాను, అంతే. వచ్చే ఏడాది టైమ్ దొరికితే వస్తాను. బుక్ ఎక్సిబిషన్ గ్రౌండ్‌కి దగ్గరలోనే నెక్లేస్ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ట్రైన్‌లో వచ్చేవాళ్ళకి అది అనుకూలమైన స్థలమే.

ఆ.సౌమ్య said...

అబ్బ ...మీ ఆనందం చూస్తుంటే నాకూ ఆనందంగా ఉందీ అదే సమయంలో అయ్యో నేనక్కడ లేనే అని బాధగానూ ఉంది.

టి. శ్రీవల్లీ రాధిక said...

మొత్తానికి పుస్తకప్రదర్శన మీ చేత ఓ టపా వ్రాయించింది. సంతోషం. ఎందుకు ఈ మధ్య ఎక్కువగా వ్రాయడం లేదు మీరు!

SHANKAR.S said...

"పిల్లలతో షాపింగ్ కి వెళ్ళ కూడదని మా అమ్మాయి మరో సారి రుజువు చేసింది. దానికిష్టమైన పుస్తకాలన్నీ సెలెక్ట్ చేసేసుకుని "డబ్బులు అమ్మ ఇస్తుంది" అని ముందుకెళ్ళిపోయింది. ఒక scholastic స్టాల్లోనే, 30 పేజీలదొకటీ, యాభై పేజీల దొకటీ, వంద పేజీల దొకటీ...ఈ మూడు పుస్తకాలకీ కలిపి పదమూడు వందలు...అదొక కడుపు మండించే సన్నివేశం! "

అందుకు బదులుగా ఈ-తెలుగు స్టాల్ దగ్గర పాంప్లేట్లు ఎవరు పంచారో కూడా చెప్పండి మరి.

Anonymous said...

' దూరాన ఉన్న ' అంటే విదేశాల్లో ఉన్నవారేనా సుజాతగారు. లేక ,మాలాటి నూతిలో కప్పలు కూడానా ! అహ ఒకమాట సభాముఖంగా అనుకుంటే , నేనూ బెకబెక..బెకబెకా ( అదేనండీ మాతా పుస్తకం దేహీ అని కప్పలభాషలో అడిగా )

సుజాత వేల్పూరి said...

మానసా, థాంక్యూ! ఇలాంటపుడే మనమంతా ఒక చోట చేరి, కబుర్లాడుకుంటూ, చర్చించుకుంటూ కొనాలోయ్ పుస్తకాలు!

చలం భగవద్గీత చూసి నువ్వే గుర్తొచ్చావు. మానస అయితే దీని గురించి ఎలా రాస్తుందా అని ఊహించడానికి కాసేపు ట్రై చేశాను!

రవి గారూ, చాలానే కొన్నారూ! కొత్తపల్లి స్టాల్లో నేను మరి కొన్ని పుస్తకాలు కొనాలండీ!అలాగే కథా సరిత్సాగరం కూడా మర్చిపోయాను./

తులసి దళం కాదు గంజాయి దమ్ము విశాలాంధ్ర వాళ్ల స్టాల్లో చూడండి. లేదంటే నేనిస్తా చదవండి!

ప్రవీణ్, మీ స్నేహితురాలు మీన్ కాంఫ్ అనువాదం చదివిందా పాపం? అనువాదాలు ఆసక్తి కరంగా లేకపోతే నేనూ మీ స్నేహితురాల్లాగే పక్కన పడేసి నిద్ర పోతాను.అందుకే నేను అనువాదకుల గురించి చూసి అప్పుడు కొంటాను. సహవాసి గారి అనువాదం అయితే ఎంత చెత్త పుస్తకమైనా సరే కొంటాను. ఎలాంటి పుస్తకమైనా సరే అద్భుతంగా తెలుగులో అందించగలరు ఆయన.

సుజాత వేల్పూరి said...

శంకర్ జీ,
బీనా దేవి గారి పుస్తకం ఇంకా ముట్టుకోలేదు. నవోదయా వాళ్ళు అచ్చు తప్పులేమీ లేవనే చెప్పి ఇచ్చారు మరి! ఉన్నాయనుకోండి, వేణు కి చెప్పేద్దాం సవరించిన కాపీ పట్టుకు రండి పొమ్మని! అచ్చు తప్పుల గురించి ఆయనేగా చెప్పింది మాట్లాడకుండా పుస్తకాలు కొనుక్కుంటున్న మనకి?

ప్రవీణ్,
మీరు లేని లోటు ఈ తెలుగు స్టాల్లో తెలుస్తోంది. వచ్చే ఏడాది తప్పక రండి

సుజాత వేల్పూరి said...

సౌమ్యా, నువ్వుంటే మనిద్దరం తిరుగుతూ.. మాట్లాడుకుంటూ తిరుగుతూ బోల్డు పుస్తకాలు కొనే వాళ్ళం తెల్సా?

సుజాత వేల్పూరి said...

లలిత గారూ,
మీరు బావిలో కప్ప కాదండీ, గోదావరిలో ఆల్చిప్ప! (అందులో ముత్యం ఉంటుందని గ్రహించాలి)
మీకు తెలీని పుస్తకాలా? పోనీ ఏవైనా కావాలంటే చెప్దురూ, కొని పంపేస్తాను. మిత్రులకు పుస్తకాలు పంపి, అవి అందుకున్నపుడు వారి మొహాల్లో సంతోషాన్ని ఊహించుకోడం నాకు చాలా ఇష్టం!

మధురవాణి said...

బాగున్నాయి మీ పుస్తకాల కబుర్లు.. :)
ప్చ్.. నేనెప్పుడూ బుక్ ఎక్జిబిషన్ కే వెళ్ళలేదు తెల్సా.. :( అసలు నేను ఇప్పటిదాకా ఒకే ఒకసారి విశాలాంధ్ర వారి షాప్ కి వెళ్లాను. అంతే! అప్పుడే ఒక పది పుస్తకాల పైన కొనుక్కొచ్చుకున్నాననుకోండి.. ప్చ్.. నేనూ అక్కడుంటే ఎంత బాగుండేది.. ఎంచక్కా మీ వెంట వచ్చి ఏమేం పుస్తకాలు బాగుంటాయో అడిగి మరీ కొనుక్కునేదాన్ని కదా! :(

Praveen Mandangi said...

హిట్లర్ మీన్ కాంఫ్ వ్రాసింది జెర్మన్ భాషలో. స్వప్న ఆ పుస్తకాన్ని చదివింది ఇంగ్లిష్ భాషలో. భుబనేశ్వర్‌లో నేను చూసినవి ఒడియా అనువాదాలు. ఆర్.ఎస్.ఎస్. నాయకుడు గురు గోల్వాల్కర్‌కి హిట్లర్ గురువు. అందుకే ఆర్.ఎస్.ఎస్. ప్రభావం ఎక్కువగా ఉన్న భుబనేశ్వర్‌లో మీన్ కాంఫ్ సేల్స్ ఎక్కువ. నాకేమీ హిట్లర్ మీద అభిమానం లేదు కానీ ఓ సారి వైజాగ్‌లో హిట్లర్ & నాజీ లీడర్స్ అనే పుస్తకం కొనాలనుకున్నాను. కానీ అప్పట్లో ATM కార్డులు లేవు కదా. సమయానికి క్యాష్ కూడా లేకపోవడం వల్ల కొనలేదు. మీన్ కాంఫ్ శ్రీకాకుళంలో కూడా దొరుకుతుంది. దాని కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

నాది కూడా ఒక బెక బెక బెకా బె kaaaaaaa.

Praveen Mandangi said...

పుస్తక ప్రదర్శనలో మీన్ కాంఫ్ దొరికితే కొని చదవండి. "German Nazism was thoroughly inspired by British Imperialism" అని నా నల్లజాతి కమ్యూనిస్ట్ స్నేహితుడు చెపితే మీన్ కాంఫ్‌లో హిట్లర్ ఏమి వ్రాసాడో చదవాలనిపించింది. అది చదివితే రెండో ప్రపంచ యుద్ధానికి మూల కారణాలు తెలుస్తాయి.

సుజాత వేల్పూరి said...

బులుసు గారూ, మీ లిస్టు ఏమిటో చెప్పేయండి మరి ;-))

Praveen Mandangi said...

ఇది మీన్ కాంఫ్ ఇంగ్లిష్ వర్సన్: http://stalin-mao.net.in/mein-kampf-adolf-hitler-pdf-download

వేణు said...

మీ ‘బుక్ ఎగ్జిబిషన్ కబుర్లు’ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈసారి అంతర్జాతీయంగా పేరుపొందిన పుస్తకాలు తెలుగు అనువాదాలుగా పెద్ద సంఖ్యలో కనపడ్డాయి. మీరన్నట్టు బ్లాగులుండబట్టే ఇంత వివరంగా పుస్తకాల గురించి తలపోసుకోవటం, పంచుకోవటం సాధ్యమవుతోంది.

@ SANKAR.S: ఫోన్లో కాకుండా ప్రత్యక్షంగా మిమ్మల్ని కలుసుకోవటం ఈ ఎగ్జిబిషన్ వల్లే జరిగింది. బీనాదేవి సాహిత్యంలో అచ్చుతప్పుల సంగతంటారా? సవరించివుంటే మంచిదే...!

@ రవి: దాసరి సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు తీసుకున్నందుకు అభినందనలండీ. అయితే వాటిపేర్లను రాయటంలో మీరు కాస్త తడబడ్డారు. మృత్యులోకం, అగ్నిజ్వాల - కాదు. మృత్యులోయ, అగ్నిమాల! :)

Anonymous said...

సుజాత గారి టపా చూస్తే నాకూ వేడి పుడుతోంది. తాడేపల్లిగూడాన ఉన్నవాణ్ణి హైదరాబాద్ రాలేనుగానీ విజయవాడ వెళ్లితీరతాను.
గోదారొడ్డు వారూ, కృష్ణాతీరాల్లో ఉన్న బ్లాగ్మిత్రులెవరైనా జనవరి రెండు నుంచి విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనకి వస్తున్నారా? వస్తే ఏ రోజు రాబోతున్నారు ఓ మాటనేసుకుంటే హైదరాబాదు వాళ్లలాగే కలవచ్చు. ఏమంటారు బులుసు గారూ.

sarma said...

పుస్తకం చూద్దామంటే కనపడని మాకు ఇన్నిటిని పరిచయం చెసినందుకు ధన్యవాదాలు. మా పల్లెల బతుకింతే.నిరాశకాదు. జీవిత సత్యం.

సుజాత వేల్పూరి said...

రాధిక గారూ, ఆఫీసు పనుల్లో కాస్త బిజీగా ఉండి బ్లాగులు చదవడమూ, రాయడమూ కూడా తగ్గిపోయిందండీ!

ఇంతకీ మీరేమి కొన్నారు?వెళ్ళారా బుక్ ఫేర్ కి?

Praveen Mandangi said...

పక్కింటబ్బాయ్, తాడేపల్లిగూడెంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి నెక్లేస్ రోడ్ స్టేషన్ కాడ చైన్ లాగు, సరిపోతుంది.

A Homemaker's Utopia said...

సుజాత గారు,
ఈ బ్లాగ్ల వలన మంచి telugu పుస్తకాల గురించి తెలుస్తోందండీ....మేము ఈ మధ్యనే Coimbatore నుంచి చెన్నై transfer అయి వచ్చాము...చెన్నై లో 35 వ బుక్ ఫెయిర్ జనవరి 5 నుంచీ 17 వరకు జరుగుతుందట....అందులో విశాలాంధ్ర వారి స్టాల్ ఉంటుందని విన్నాను....మంచి తెలుగు పుస్తకాలు దొరుకుతాయేమో అని ఒక ఆశ..

రవి said...

వేణు గారు, సవరణకు కృతజ్ఞతలు.:)

మృత్యులోకం చదవడం ముగించాను. జానపదలోకం అనే పల్లకీలో ఊరేగి వచ్చిన అద్భుతమైన అనుభవం!

"ఇట్లు నాన్న" - ఈ పుస్తకం గురించి మరో మారు ఇక్కడ చెప్పాలనే ఆత్రుత అణుచుకోలేకుండా ఉన్నాను. ఇది ఒక నాన్న రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఆరేళ్ళ కొడుకుకు వ్రాసిన పోస్టు కార్డుల సంకలనం. సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం మరెక్కడన్నా జరిగిందో లేదో తెలీదు.అద్భుతం అనను కానీ, అందమైన ప్రయత్నం.

రవి said...

సారీ, ఇందాక మళ్ళీ పొఱబాటు చేశాను. మృత్యులోయ అని ఉండాలి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

పక్కింటి అబ్బాయి గారూ నేను వస్తాను విజయవాడ పుస్తక ప్రదర్శనకు మీరు మళ్ళీ ఇల్లు మారకపోతే.

థాంక్యూ సుజాత గారూ.

Ravi said...

sujatha garu,

new students book center ani okati vundedi...vijayawada lo..Navodaya pakkana..vaalla daggara kooda manchi books vundevi..

chaalaa baagundi madam..mee article..

సుజాత వేల్పూరి said...

మధూ, నిజం! మనలాగా పుస్తకాలంటే పడి చచ్చేవాళ్లంతా ఒక చోట కలిసి మాట్లాడుకుంటూ పుస్తకాలు కొనుక్కోడం చాలా బాగుంటుంది కదూ! నువ్వుంటే కూడా మనకసలు ఒక రోజంతా చాలేది కాదేమో!

ప్రవీణ్ శర్మ, మైన్ కాంఫ్ చదివాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా గానీ చదవలేనేమో అని భయం కూడా! మీరు చెప్పారుగా, తెచ్చుకుంటాలెండి!

సుజాత వేల్పూరి said...

వేణుగారూ, థాంక్స్! బ్లాగర్స్ అంతా కలిసి తెలుగు సాహిత్య వ్యాప్తికి దోహదం చేస్తున్నారనేసుకుందామా?

అంతర్జాతీయ సాహిత్యానికి అనువాదాలు ఇంకా పెద్ద ఎత్తున రావలసి ఉందండి!

సుజాత వేల్పూరి said...

బులుసు గారూ:-)
మీరు వచ్చి ఉంటే మరింత బాగుండేదండీ! మీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ తిరిగి పుస్తకాలు కొనుక్కుంటే ఎంత బాగుంటుంది!

సుజాత వేల్పూరి said...

శంకర్ జీ,
సంకీర్తన ఈ తెలుగు స్టాల్లో కరపత్రాలు పంచితే నా పదమూడొందలూ వెనక్కి వస్తాయా? మూడు బుల్లి పుస్తకాలు=1300 ! ఏమైనా బాగుందా ఈ ఈక్వేషను?

సుజాత వేల్పూరి said...

Ravi garu,
thanks for the info

Sravya V said...

హ హ సంకీర్తన ! Bravo my dear sweet heart !సంకీర్తన ఇంకా బాగా నీకు నచ్చినవన్నీ ఇలాగే కోనేసుకో అస్సలు వెనకాడకు :)

సుజాత గారు చిన్నప్పుడు నేను మీ సంకీర్తన బడే కాకపొతే నేను మాత్రం మా తాత ఇస్తారు డబ్బు అని చెప్పేదాన్ని !

Vasu said...

"కాబట్టి, తెలుగు బ్లాగులున్నంత వరకూ, పుస్తక పఠనానికి, పఠనానుభవాల పంపకాలకు మాత్రం లోటు జరగదు."

ఇది వినడానికి చాలా హాయిగా ఉంది.

నేను బుక్ ఫెయిర్ అనగానే తెప్పించు కుండమని ఊగా కానీ నా దగ్గర తెప్పించుకుని చదవనివే చాలా ఉన్నాయి. అవి అయ్యేవరకు కొత్తవి కొనకూడదని నిశ్చయించుకున్నా.

Praveen Mandangi said...

మార్క్సిస్ట్‌నైన నేనే anticommunist inclinations గల మీన్ కాంఫ్ చదవడానికి భయపడలేదు. Winston Churchill was more virulent anticommunist than Hitler. హిట్లర్ ఆత్మకథ చదవడానికే భయపడితే విన్స్టన్ చర్చిల్ చరిత్ర చదవడానికి ఎంత భయం ఉండాలి?

mahima said...

మంచి పుస్తకాలు ని పరిచయం చేస్తున్నందుకు చాలా థాంక్స్. నాకు ఇన్ని రోజులు నవలలు అంటే యండమూరి, యద్దనపూడి వే తెలుసు. కానీ వాళ్ళ నవలలు అన్నీచదివేసాను, మొన్న ఇండియా నుండి వచ్చేప్పుడు ఏమి నవలలు కొనాలో తెలియక మేర్లపాక వి కొన్నాను. అప్పటికి నాకు ఈ తెలుగు బ్లాగ్స్ ఏమి తెలియదు, ఇప్పుడు ఇండియా వెళితే ఏమి కొనుక్కోవాలో ఒక ఐడియా వచ్చింది మీ బ్లాగ్, ఇంకొందరి బ్లాగ్స్ చదివిన తరువాత. రంగనాయకమ్మ గారో నవలలు ఎక్కడ దొరుకుతాయి?

smilye said...

hi,ipude me blog chusannu bagundi.nenu kuda books baga chaduvuthanu enthala ante edina manchi pusthakalu chudagane chala istamina food chusthe ela thinalanipisthundo ala chala maja vasthundi.nanu nenu thelusukovadaniki naku books chala help chesaye.5mins time vunna books chaduthu vuntanu.thank u

smilye said...

chalam books chaduthunnanu ee madya premchand gari sevasadanam chadivanu entha bagundo chepalenu.

తెలుగు వెబ్ మీడియా said...

చలం గారి రచనలలో చదివినవాటిని నిజంగా ఆచరిస్తేనే గొప్ప స్మైలీ గారు. చదివితే సరిపోదు. ఆచరించండి.

smilye said...

ramayana vishavruksham book konnanu ramgopalvarma na istam book lo vachina refarence tho thesukunnanu danini start cheyali.meremina aa book gurinchi me openion cheppagalara?

smilye said...

annattu monna books exibition ki two times vellanu thesuku vellina money saripoka manchipusthakam ane stall lo thelisina uncle vunte 1500 appuchesi konnanu.avi ivvadaniki velinapudu malli konnanu motthaniki oka 4000 ki books konnanu inthena anipinchindi.

vayuputhra said...

meerandharoo superandi.......boledu books chadivesthunnaaru....naa kemo dhorakatledu.....please...naaku konni e-books pamparaa .....please

Post a Comment