టాంక్ బండ్ మీది వైతాళికుల విగ్రహాల ఫొటోలు....మొత్తం ......ఇవిగో!  

Posted by సుజాత in


టాంక్ బండ్ మీది తెలుగు వెలుగుల విగ్రహాల్లో ఎవరెవరివి ఉన్నాయో చాలామందికి స్పష్టతలేదు. మీడియాకీ, రచయితలకూ కూడా సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు.  అవి కూలి ధ్వంసమయ్యే వరకూ సమాచారం సరిగా లభ్యం కాకపోవడం విచారకరం!

అక్కడ ఉన్న 33 విగ్రహాల ఫొటోలూ, ఆయా వైతాళికుల గొప్పతనాన్ని వివరిస్తూ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు కవితాత్మకంగా రాసిన వ్యాఖ్యానాలూ నేను సేకరించాను.

అవి ఇక్కడ నా బ్లాగులో ఉంచుతున్నాను. ఇష్టమైన వారు ఈ చిత్రాలను భద్రపరచుకోవచ్చును.

వీటిలో మొదటి పదిహేడు ఫొటోలూ ధ్వంసమైపోయిన విగ్రహాల తాలూకువి! తర్వాతవి పదిలంగా ఉన్న విగ్రహాలవి!

ట్యాంక్ బండ్ మీద  ‘తెలుగు వెలుగుల మూర్తుల నిక్షిప్త కళా ప్రాంగణం’ సమర్పణ ఫలకంపై ఇలా ఉంది:

వందనం 
తెలుగు హృదయంగమ శుభాభినందనం


ఇది జాతి చైతన్యస్ఫూర్తికి కళాప్రాంగణం పట్టిన నీరాజనం
తెలుగుజాతి బహుముఖ వికాసానికి దివిటీలెత్తిన మహనీయుల సంస్మరణం 

 .                                                                     అన్నమాచార్య
                                                    ఆంధ్ర భాషా పదకవితా పితామహుడు
                                                        శ్రీ వేంకటేశ్వర సంకీర్తన ప్రవణుడు 
                                                                                                                        
ఆర్థర్ కాటన్ 
         
  గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు
నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు   


 బళ్లారి రాఘవ
ఆంధ్ర నాటక రంగ ప్రభాకరుడు
సముదాత్త నటనా ప్రదీపకుడు       


బ్రహ్మనాయుడు
పలనాటి సీమ పండించుకున్న ధర్మవేది
చాపకూటితో సమతను నేర్పిన సౌమ్యవాది

 సీఆర్ రెడ్డి
ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు
విద్యా పరిపాలనా రంగాలలో అనవద్యుడు

 గురజాడ అప్పారావు
ఆధునికాంధ్ర కవితా వైతాళికుడు
సువిశాల మానవతావాద ప్రతిపాదకుడు

జాషువా
నవయుగ కవి చక్రవర్తి
దళిత వర్గ జ్వలన్మూర్తి

కందుకూరి వీరేశలింగం
సంఘ సంస్కరణ రణ పండితుడు
బహుముఖ సాహితీ ప్రక్రియా మండితుడు

క్షేత్రయ్య
మువ్వగోపాల పద మోహనగాయకుడు
మధుర భక్తి భావ రాగ రంజకుడు

ముట్నూరి కృష్టారావు
సంపాదకీయ రచనా ప్రబోధ శీలి
ఆంధ్ర సముజ్జీవన చైతన్య శాలి

.నన్నయభట్టు
ప్రథమాంధ్ర మహా కావ్య నిర్మాణ చణుడు
వాగనుశాసన సార్థక బిరుద విభూషణుడు

 రఘుపతి వెంకటరత్నం నాయుడు
తెలుగు సీమలో బ్రహ్మసమాజ కులపతి
బ్రహ్మర్షి బిరుద సార్థక విద్యాపతి

. సిద్ధేంద్ర యోగి
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు
తెలుగు నాట్యజగతికి ఆరాధ్యుడు

 శ్రీకృష్ణ దేవరాయలు
సాహితీ సమరాంగణ చక్రవర్తి
కర్ణాటకాంధ్ర సమన్వయ నిత్య విస్ఫూర్తి

శ్రీశ్రీ
అభ్యుదయ కవితా యుగ ప్రయోక్త
సమసమాజ సంస్థాపన ప్రవక్త

 త్రిపురనేని రామస్వామి చౌదరి
అపార హేతువాద కృపాణ ధరుడు
వినూతన సాహితీసృష్టి కరుడు

ఎఱ్ఱాప్రగడ
అశేష ఆగమ శాస్త్ర్ర తత్వ నిపుణుడు
ఆంధ్ర మహాభారత పూరణ దక్షుడు
అల్లూరి సీతారామరాజు
మన్యసీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు
తెల్లదొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు

మహబూబ్ అలీఖాన్
ఆసఫ్ జాహీ వంశ పాలకుడు
ఆర్త జన నిత్య పోషకుడు

మొల్ల
కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణి
రామాయణ కావ్య రచనా రసధుని

మఖ్దూమ్ మొహియుద్ధీన్
ఆధునిక ఉర్దూ మహాకవి
అభ్యుదయ భావ సముజ్వల రవి

పింగళి వెంకయ్య
త్రివర్ణ పతాక రూపకర్త
జాతీయ స్వాతంత్ర్య సమరవేత్త

పోతన
ఆంధ్ర మహాభాగవత భవ్య ఫలప్రదాత
మందార మకరంద మాధురీ సముపేత శబ్ద విధాత

 పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
ఆగామి కాలజ్ఞాన కర్త
పురోగామి సమాజ సంస్కర్త

 రామదాసు
భద్రాచల రామన్నకు గుడికట్టిన గోపన్న
రామదాసై తెలుగు హృదికెక్కిన భక్తులమిన్న 

 రుద్రమదేవి
కాకతీయ మహా సామ్రాజ్య భార ధారణి
శాత్రవ భయంకర నిత్య  రుద్రరూపిణి 

 శాలివాహనుడు
ప్రథమాంధ్ర మహా పాలకుడు
నవీన శక సృష్టి కారకుడు

 సర్వేపల్లి రాధాకృష్ణన్
మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి
వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి

సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత
అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత

 తానీషా
గోలకొండనేలిన కుతుబ్ షాహీ పాదుషా
రామదాసు భక్తికి చలించిన మనీష

 తిక్కన సోమయాజి
ఉభయ కావ్య ప్రౌఢ శిల్ప పారగుడు
తెలుగు నుడికి పట్టం కట్టిన ధీ విలసితుడు

త్యాగయ్య
అగ్రేసర దాక్షిణాత్య వాగ్గేయ కారుడు
అక్షర నాదోపాసనైక జీవనుడు

 వేమన
ఆటవెలదిని ఈటెగా విసిరిన దిట్ట
ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట

టపా కి సహకరించిన మిత్రులు వేణు, సుధలకు ధన్యవాదాలు !


మీరైతే ఏం చేస్తారు?  

Posted by సుజాత in


మధ్యాహ్నం  మా పిన్ని కొడుకు బొకారో నుంచి ఫోన్ చేశాడు. పిచ్చాపాటీ కబుర్లయ్యాక టాపిక్ సెలవులవైపు మళ్ళింది. "వెళ్తున్నారా మన వూరికి" అన్నాడు వాడు. "అక్కడ రోజంతా కరెంట్ ఉండదురా, అంత ఎండలు కూడా ఇప్పుడు భరించలేం కదా" అన్నాను."మన చిన్నప్పుడు ఇలా అనుకునే వాళ్ళం కాదు కదే! సెలవుల కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళం?" అన్నాడు వాడు గత స్మృతుల్లోకి జారుతూ! నేనూ యధాశక్తి సహకరించి అవి నెమరేసుకున్నాను.

చివరి పరీక్ష ముగుస్తూనే అర్జెంటుగా ఎవరో టెలిగ్రామ్ ఇచ్చినట్లు అందుబాటులో ఉన్న చెత్త సినిమా అయినా సరే చూసేసేవాళ్ళం! మర్నాటి నుంచీ ఏదో పెద్ద ఖాళీగా ఉన్నట్లు పోజులు! కానీ కొద్దిగా కూడా తీరిక దొరికేది కాదు. ఊళ్ళో ఉన్న చుట్టాల పిల్లలూ,కజిన్లూ,విజయవాడ నుంచి మావయ్య కొడుకూ కూతురూ వచ్చేసేవాళ్ళు.

అందరం కల్సి ఎంత హడావుడి, ఓపెన్ గా చెప్పాలంటే భీభత్సం సృష్టించే వాళ్ళమో ! రోజంతా బాదం చెట్టు (ఇప్పుడు లేదు) కింద మడత మంచాలు, నవారు మంచాలు వేసి సీతారాములు(చీట్లు వేసి ఆడే ఆట! స్కోరు గుర్తుందా, రాముడికి వెయ్యి,సీతకి సున్నా! రాముడు సీతను కనుక్కుంటేనే వెయ్యి...)వగైరాలు ఆడేవాళ్ళం.

ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అమ్మ పిలిచినపుడు వెళ్ళి తినడం, మళ్ళీ ఆటల్లో పడటం. సాయంత్రాలు బావి దగ్గర మగపిల్లలంతా వరసబెట్టి స్నానాలు చేయడం,(బట్టలు ఉతకలేక సీతారావమ్మ చచ్చిపోయేదనుకోండి...)  ఆడపిల్లలకు అమ్మ,అత్తయ్య(మా పక్కిల్లే) కూచోబెట్టి జడలు వేయడం....ఇల్లంతా  ఏదో పెద్ద తిరణాల్లా ఉండేది. 

ఎన్ని కిరాణా సరుకులు, చిరుతిళ్ళు  తెచ్చినా ఇట్టే అయిపోయేవి. ఆటల్లో పడి తెలీకుండానే రాక్షసుల్లా తినేవాళ్ళమనుకుంటా! అమ్మ ఎంతెంత వంటలు చేసేదో పాపం..విశ్రాంతే ఉండేది కాదు! అప్పుడు తెలీలేదు అమ్మను పట్టించుకోవాలని!

ఎండగా ఉన్నా, బాదం చెట్టు కింద నుంచి కదిలేవాళ్ళం కాదు.రస్నా కలుపుకుని తాగడాలు,అమ్మ ఆవకాయ కలిపిన రోజు ఆవకాయ కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ముద్దలు పెడితే (ఇది దాదాపు అందరికీ అనుభవమే) ఎగబడి తినడాలు ఇలా గడిచిపోయేవి.

వీళ్ళల్లో ఇంజనీరింగ్ ఫైనలియర్,డిగ్రీ ఫైనలియర్ చదివే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కజిన్లందరితో కల్సి సెలవులు మా ఇంట్లో గడపడం ఒక మజా అన్నమాట. పేకాట,వగైరా ఆటల్లోకి పిల్లలమైన మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయాల్లో మేము దాడి,పరమపద సోపాన పటం వంటివి ఆడాల్సివచ్చేది.

వెన్నెల రాత్రులు మరీ అందంగా ఉండేవి. వెన్నెలా నీడా ఆటలాడటం, వెన్నెల్లో పెద్ద పువ్వులాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడలో మంచం వేసుకుని వెన్నెల్ని పరిశీలించడం, జామచెట్టెక్కి దూకడాలు,గేటెక్కి అక్కడ అల్లుకున్న సన్నజాజి పందిరి మీద మొగ్గలు కోయడం,దానితో పాటే ఎర్రచీమల చేత కుట్టించుకోడం అన్నీ బాగుండేవి.

రాత్రుళ్ళు ఆరుబయటే నిద్రలు కాబట్టి అమ్మ ఎర్రని కూజాలో నీళ్ళు నింపి పెట్టేది.(దాన్ని కమండలం అనాలిట) సింహం మూతి ఉండేది దానికి. దాహమైనా కాకపోయినా అందులో నీళ్ళు వంచుకుని  తాగడం ఒక ఫాసినేషన్!

నెలన్నర ఇలాగే గడిచేది. వచ్చే క్లాసు పుస్తకాలు కొనడాలు,యూనిఫారాలు కుట్టించుకోడాలు ఇవన్నీ జూన్ 13 తర్వాతే! వీళ్ళలో మగపిల్లలు ఎంత అల్లరి చేసేవాళ్ళంటే వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎంతగానో ఎదురు  చూసి చూసి, వాళ్ళు వచ్చిన మర్నాడే "వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతార్రా బాబూ"అనిపించేంత ఘోరమైన అల్లరి.

సెలవులు ముగిశాక వీడుకోలు చాలా ఉద్వేగ భరితంగా ఉండేది. ఏడుపులు....దిగుళ్ళు, నాన్నగారి తిట్లు...అదో పెద్ద గోల!

*                     *                               *                            *

ఇదంతా చెప్పుకుని నేనూ మా అన్నయ్యా ఫోన్లోనే బెంగ పడ్డాం!"ఆ రోజులు భలే ఉండేవిరా! ఇప్పుడు చూడు...పిల్లలకు సెలవులిచ్చినా లాభం లేదు.ఏదో ఒక యాక్టివిటీ,సమ్మర్ కాంపులు,లేదా మరోటి! ఏప్రిల్లోనే కొత్త పుస్తకాలూ,యూనిఫారాలు, ఎంత బర్డెనో వీళ్ళకి. వచ్చే అకడమిక్ ఇయర్ కి ఇప్పటినుంచే తయారు కావడం! ఏవేవో కోచింగులు!ట్యూషన్లు! ప్రతొక్కరూ పండితుడో, పండితురాలో కావాలని అందరికీ ఆశే" అని నేనూ.....

"ఏమి కోచింగులో ఏమో! అమ్మమ్మ ఇంటికో బామ్మ ఇంటికో వెళ్ళి సిటీలకు దూరంగా కొన్నాళ్ళు గడిపే చాన్సే లేదు వీళ్ళకి. రిటైర్ కాగానే బామ్మలూ,తాతయ్యలూ కూడా ఇక్కడికే వస్తున్నారుగా! పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపాలంటే భయమాయె! ఎవరేం చేస్తారో తెలీదు. ఎంత సేపూ కంప్యూటర్ గేములో, లేక టీవీ చూడ్డమో....పిల్లలు సహజత్వానికి కొద్ది కొద్దిగా దూరమైపోతున్నారని బెంగగా ఉంది నాకు.."అని వాడూ ఒకరి బాధ ఒకరు చెప్పుకున్నాం!

 ఏదో సీడీ కావాలని మా ఇంటికి వచ్చిన మా బంధువులమ్మాయి మైథిలి (ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తూంది) ఇదంతా వింటూ కూచుంది.

నేను ఫోన్ పెట్టేసి ఇంకా ఆపాత మధురిమల్లోంచి తేరుకోకముందే గొంతు సవరిచుకుని ఇలా అంది.....(ఇంకో మాటలో నాకు క్లాసు తీసుకున్దన్నమాట)


"నాకు తెలీకడుగుతానూ, మీరంతా(తల్లిదండ్రులు) ఈకాలం పిల్లలమీద ఎందుకింత జాలిపడుతుంటారు? మాకేం తక్కువైందని? హాయిగా చదువుకుంటున్నాం,ఇష్టమైన పనులు చేయడానికి డబ్బు మీరు ఎంతోకొంత ఖర్చు పెడుతున్నారు! మీరు తొటల్లో,దొడ్లలో ఆడుకుంటే మేము పార్కుల్లో,ప్లే గ్రౌండ్స్ లో ఆడుకుంటున్నాం! మీరు పదిమంది ఉంటే మేము ఇద్దరమో ముగ్గురమో ఉంటాం!అయితే ఏంటి?


 ఏదైనా సరే నేర్చుకోడానికి మాకు ఉన్నన్ని అవకాశాలు మీకున్నాయా? కంప్యూటర్ అనేది మీ చిన్నప్పుడే ఉంటే మీరు ఇంకా ఎన్నో నేర్చుకునేవాళ్ళు కాదూ? అన్నింటిలోనూ ముందుండాలనీ,ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకునే పిల్లలకు మీ మాటలు ఎంత నిరాశ కల్గిస్తాయో తెలుసా?

సెలవుల్లో అమ్మమ్మ ఇంటికో,బామ్మ ఇంటికో వెళ్ళి నెలల తరబడి వాళ్ళను పట్టుకు వేలాడితేనే సెలవులు ఎంజాయ్ చేసినట్లా? అసలు మాకున్నన్ని అవకాశాలు మీకు లేవని బెంగ పడరే?


మా బాల్యాలు కూడా మీ బాల్యం లాగే గడవాలని మీరు కోరుకోవడం ఏమిటి?మా అమ్మ కూడా ఇంతే!ఎప్పుడూ మాకేదో అన్యాయం జరిగిపోయినట్టు "వీళ్ళకసలు జీవితమే తెలీట్లేదు" అని ఓ..బాధపడుతూ ఉంటుంది.


 మీ జీవితాలని మీరు ఎంజాయ్  చేసినట్లే మా జీవితాలు మేమూ ఎంజాయ్ చేస్తున్నాం! మా యాక్టివిటీలు,ఫ్రెండ్స్,కంప్యూటర్ గేములు, సిటీ లైఫ్ అన్నీ బాగానే ఉన్నాయి మాకు. 


మీకూ మాకూ ఉన్న ఇంటర్ జనరేషన్ గాప్ ని మీరు ఎందుకు అర్థం చేసుకోరు?"మీలాగే"మేమూ ఉండాలని "మీలాగే" మేమూ బతకాలని ఎందుకు కోరుకుంటారు?

మీ మాటలు వింటుంటే గొప్ప గందరగోళంలో పడిపోతున్నాం మేము! మేము బతికేది సరైన పద్ధతి కాదా?అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునేలా చేస్తున్నాయి మీ మాటలు.మేము సుబ్బరంగా ఉన్నాం! జీవితాల్ని కోల్పోడం లేదు. 


ఎప్పుడూ "ఆ రోజులు" అంటూ పాతకాలంలోకి వెళ్ళిపోతూ.. మమ్మల్నీ అటు లాక్కుపోయే ప్రయత్నం చేయకండి. మేము రాము...." అంది

అంటే ఇదంతా ఆ పిల్ల ఇలాంటి తెలుగులో చెప్పలేదు.  చదివే వాళ్ళకు అనుకూలంగా ఉండాలని నేనే అనువదించాను.

ఆ అమ్మాయితో నేను త్వరలో మాట్లాడతాను, పరీక్షలయ్యాక! దాని మాటలు నన్ను ఆలోచనలో పడేశాయన్నది ఒప్పుకుంటున్నాను!(అంటే నన్ను మార్చేసాయని కాదు)

మైథిలి మాటలని మీరైతే ఎలా అర్థం చేసుకుంటారు?ఏమని జవాబిస్తారు? తెలుసుకోవాలని ఉంది.

రాసేముందు ..ఒక్కసారి మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఎలా గడిచాయో గుర్తు చేసుకుని రాయండి.

అన్నం మానేయడం ఎలా?  

Posted by సుజాత in





టైటిల్ చూసి అన్నం మానేయడానికి అరవై సులభ చిట్కాలు చెప్తానని అనుకున్నారో ఏమో...అదేం కాదు!


"అన్నంమానేయడం ఎలా? అసలెలా సాధ్యం? ఎలా? ఎలా?" అని విస్తుపోతున్నానన్నమాట

మొన్న ఒకాదివారం ఉదయం పదకొండు గంటల వేళ

ఆవ కలిపిన పనసపొట్టు కూర(వంటలు రాసే  బ్లాగర్లకు  మంచి  అవిడియా) లో, అప్పుడే వేయించిన మినపవడియాలు కలిపి, గోంగూర పచ్చడిలో ఇంగువ పోపు పెట్టి,వేడి వేడి పాఠోళీ బౌల్ లోకి తీసి, వంకాయ పచ్చి పులుసు(పులుసు పచ్చడి)లో కొత్తిమీద కత్తిరించి వేస్తుండగా "హా....పనస పొట్టు..పనస పొట్టు..." అంటూ కేకలు వినపడి వంటింట్లోంచి తొంగి చూశాను. మురళి!

కుంకుమ పువ్వు రేకలతో లేత  బంగారు రంగులో అలరారుతున్న చక్రపొంగలిలో బాదం పప్పు చీలికలు సర్దుతూ "రారా! మొన్న మంగళవారమేగా వచ్చావు?మళ్ళీ అప్పుడే వచ్చావేం?" అన్నాను.

"ఏంట్రా?ఈ మధ్య కనపడ్డమే మానేశావు? నల్లపూసైపోయావు"వంటి ప్రశ్నలకు వాడసలు అవకాశమే ఇవ్వడు.
"అత్తా, అబ్బ, ప్రతి వీకెండూ ఇంత భారీ మెనూ ఉంటుందా ఇక్కడ?" అన్నాడు పాఠోళీ స్పూన్ తో తీసుకుని తినేస్తూ!

"అంత లేదురోయ్, ప్రతి వీకెండూ మీ అత్త వంటే చెయ్యదు, ఏదో ఇవాళ నా పుట్టినరోజని...." అన్నాడు వాళ్ళ మామయ్య. ఇలాంటి అలవోక అబద్ధాలు తన దగ్గర చాలా ఉంటాయి. మురళి   నా మేనల్లుడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ మధ్యే కండలు పెంచాలని, బొజ్జ తగ్గించాలని జిమ్ములో చేరాడు.

"ఏంటి? ఇప్పుడు ఇవన్నీ తింటారా మీరూ"అన్నాడు వాడు చూపులు కల్సిన శుభవేళ సినిమాలో బ్రహ్మానందాన్ని గుర్తుకు తెస్తూ!

"మరి?నీకు వడ్డించి, నువ్వు తృప్తిగా తింటుంటే కన్నీళ్ళు తుడుచుకుంటామనుకున్నావా ?"

"ఇవన్నీ మీకు అరగవు. నేను రొట్టెలు తింటుంటే మీరు ఇన్ని రకాలు వేసుకుని భోజనం చేస్తే అది మీకు విషంగా మారి...."అని శపించబోయాడు.

 "నీక్కూడా కొద్దిగా వేస్తాంలేరా! ఇంతకీ  నీ జిమ్ము ఎంత వరకూ వచ్చింది?" అడిగాను.

మురళి నీరసంగా నా వైపు ఒకకాగితం విసిరేశాడు. "ఇదిగో, నా డైట్ ఛార్టు, చూడు" అని!

1. పొద్దున్నే ఒక కప్పు గ్రీన్ టీ,నానపెట్టిన బాదంపప్పులు 4

2. గంటన్నర సేపు రకరకాల వర్కవుట్లు

3. పోస్ట్ వర్కవుట్ కి రెండు ఎగ్ వైట్స్, తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ విత్ డబుల్ టోండ్ మిల్క్,

4. మధ్యాహ్నం లంచ్ కి రెండు రోటీలు,కూరగాయల సలాడ్,కప్పు మొలకలు

5. రాత్రికి డిన్నర్ రెండు రోటీలు,గ్లాసు వెన్న లేని మజ్జిగ,నాలుగు కీరా ముక్కలు!

"ఇదేంట్రా, మరి అన్నమెప్పుడు తింటావు?"అన్నాను తెల్లబోయి.

"అన్నమా? నా మెనూలో అసలు అన్నమే లేదు. అన్నం తినొద్దన్నారు"

వాళ్ళ మామయ్య కాస్త జాలిపడి "పోనీ వాడికి రెండు పుల్కాలు  చేసెయ్యి, లంచ్ చేసి వెళ్తాడు."అన్నారు.


వాడు వంటింట్లోకి తొంగి చూసి "ఇవాళొద్దు మామయ్యా, అన్నమే తినేస్తా! పనసపొట్టు కూర వదిలే ప్రసక్తే లేదు.రేపటినుంచీ తింటాలే పుల్కాలు "అన్నాడు. వాడు రోజూ ఇదే డైలాగు కాస్త అటూ ఇటూగా చెప్పేసి అన్నమే తినేస్తున్నాడని నాకు తెలుసు.

రోజూ ఒకపూటయినా అన్నం తినకుండా జనాలు ఎలా బతికేస్తారో నాకు అర్థం కాని విషయం! (ఇప్పుడు సాయంత్రాలు మా ఇంట్లో పుల్కాలే  అనుకోండి)నా చిన్నప్పుడు గోధుమ రొట్టెలంటే అమ్మ శనివారం రాత్రో,ఆదివారం ఉదయమో చేసే టిఫినే! బంగాళాదుంప కూరతో!అది మెయిన్ కోర్సు ఎప్పుడూ కాదు. దానికెప్పుడూ చిరుతిండి స్థానమే తప్ప, భోజనం స్థాయి లేదసలు!

చెప్తే నవ్వుతారేమో,పెళ్ళయ్యేదాకా నాకు  జనాలు చాలామంది మెయిన్ కోర్స్ గా రొట్టెలు తింటారని తెలీదు. ఈ లోగా తను నాకు ఉత్తర భారతదేశమంతా చూపిద్దామని పది రోజుల ట్రిప్ ప్లాన్ చేశాడు. అంత వరకూ నాకు రెండు పూట్లా పప్పు, కూర, పచ్చడి ,చారు వగైరాలతో సుష్టుగా తినడం తప్ప థాలీలు,రోటీలు తెలీవు.మూడు రోజులయ్యేసరికి ఎక్కడా నాకు కావలసిన అన్నం దొరక్క పిచ్చెక్కి,ఏడుపొచ్చి,ఆ బాధనంతా మొహమాటపడి బయటికి చెప్పకుండా దాచడంతో అది పెద్ద పెట్టున జ్వరంగా పరిణమించింది. నిద్రలో "అన్నం ......పప్పు " అని కలవరింతలు! 

చివరికి ఒక హిల్ స్టేషన్ లో వాళ్ల ఆఫీసు గెస్ట్ హౌస్ లో వంటవాళ్లకి పరిస్థితి వివరించి చెప్పి తనే దగ్గరుండి పొడి పొడిగా దక్షిణ భారత స్టైల్లో అన్నం,పాలకూరపప్పు చేయించాడు. అది తిన్నాక గానీ నా జ్వరం తగ్గుముఖం పట్టలేదు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మంచి సోనా మసూరి బియ్యం ఉన్నాయో లేవో వెదుక్కుంటాను. గుర్గావ్ లో ఉన్నపుడు అక్కడి ఆంధ్రా స్టోర్స్ నిరంజన్ కిలోకి 26 రూపాయలు వేసుకుంటున్నాడని తిట్టుకుంటూనే(అప్పట్లో ఇక్కడ కిలో పన్నెండు రూపాయలే)తెమ్మని చెప్పేదాన్ని!

ఉద్యోగ రీత్యా దేశంలోని అన్ని నగరాల్లోనూ స్థిరపడ్డ నార్తిండియన్స్ వాళ్ల మెయిన్ కోర్స్ ని విజయవంతంగా సిటీ ప్రజల మెయిన్ కోర్స్ గా దాదాపుగా మార్చేశారని నా ఫిర్యాదు . ఏ రెస్టారెంట్ కైనా వెళ్లండి...."తందూరీ రోటి, బటర్ రోటీ, నాన్,రుమాలీ రోటీ,కుల్చా,కడాయి పనీర్,పనీర్ బటర్ మసాలా,పనీర్ దో ప్యాజా,దాల్ మఖనీ...."ఇవే వంటకాలు!సౌత్ ఇండియన్ థాలీలో సౌత్ ఇండియా ఎంతవరకూ ఉంటుందో మీకు బాగా తెలుసు!

అన్నం,పప్పు,పచ్చడి,పులుసు అంటూ తెలుగు భోజనం వడ్డించే రెస్టారెంట్లు నగరాల్లో అరుదుగా కనపడతాయి.బెంగుళూరులో కాస్త నయం! నాగార్జున,నందిని వంటి రెస్టారెంట్లు ఉన్నాయి.

అన్నం తింటే కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగి డయాబెటిస్ వస్తుందట....! మా పక్కింటి యూపీ అమ్మాయి... చెప్తుంది వారానికి సరిపడా పది కిలోల బంగాళాదుంపలు తీసుకుంటూ!

కడుపారా తిని,ఒళ్ళొంచి శారీరక శ్రమ చేసేవాళ్లు అన్నం తినడానికి ఇంత భయపడక్కర్లేదని నా అభిప్రాయం!

తినండి,పని చేయండి!ఇదే నా ఫిలాసఫీ!

ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు పాటించినా,అన్నం విషయానికొచ్చేసరికి మాత్రం నేను కాంప్రమైజ్ కాను. ఒక్క పూటయినా ఇష్టప్రకారం పచ్చళ్ళూ పప్పూ వగైరాలతో తెలుగింటి భోజనం చేయాల్సిందే!

సెలవుల్లో ఒక వారం రోజులపాటు ఎక్కడికైనా వెళ్ళి , తిరిగి ఇంటికొచ్చిన రోజు బయటి తిండి తిని వారం పాటు పిచ్చెక్కి ఉంటుందా....అందుకే హాయిగా రైస్ కుక్కర్ మాత్రమే పెడతాను. హాయిగా ఆవకాయ,మాగాయ,పండుమిరపకాయ పచ్చడి,ఉసిరావకాయ,గోంగూరపచ్చడి వగైరాలతో హాయిగా తినేసి సాయంత్రం దాకా  విశ్రాంతి తీసుకుంటే ప్రపంచం ఎంతో అందంగా కనపడి ఊర్నుంచి వచ్చామని తెల్సీ రాని పనిమనిషిని,మంచినీళ్ళ డబ్బా తీసుకురాని బిస్లరీ వాడిని,హోటల్ రూములో సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయిన మొగుడు గారిని   కూడా క్షమించబుద్ధేస్తుంది.  

ముళ్ళపూడి మనసు పూల కన్నా మెత్తన  

Posted by సుజాత in


ఒక రచయిత, లేదా కవి మనకు ఇష్టుడైనపుడు, ఆయన రాతలు మనకి ఎంతగానో నచ్చినపుడు వారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలనే కుతూహలం కల్గుతుంది సహజంగానే! శ్రీ శ్రీ కవిత్వం చదివిన మత్తులో అనంతం చదివాక సగం మత్తు దిగిపోయింది. సరోజా శ్రీ శ్రీ రాసిన "సంసారంలో శ్రీ శ్రీ" చదివాక ఎటూ కాని అయోమయంలో పడ్డా!

బాపూ రమణలిద్దరూ భేషజాల్లేని అసలు సిసలు తెలుగు వాళ్ళుగా, తెలుగు నుడికారానికి , తెలుగు తనానికి కేరాఫ్ అడ్రసులుగా అంగీకరిస్తాం అందరమూనూ! కోతి కొమ్మచ్చి చదివాక రమణ వ్యక్తిత్వం, ఆత్మాభిమానం మరింత స్పష్టంగా తెలుస్తాయి. అయితే వారి వదాన్యత, వినయం వంటి విషయాలను వారు చెప్పుకోరు కాబట్టి ఇంకెవరైనా చెప్తే తెలుసుకుని సంతోషిస్తాం! అలాంటిదే ఈ సందర్భం!

రమణ గారి వెన్నలాంటి మనసుని ఆవిష్కరించే ఒక సన్నివేశాన్ని ఢిల్లీలో తెలుగు ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు సాక్షిలో రాసి అందించారు. ఇది చదివాక రమణగారికి మనసులోనే నమస్కరించకుండా ఉండలేకపోయాను. కష్టంలో చేయి అందించే వారికెప్పుడూ నేను శిరసు వంచి నమస్కరిస్తాను. చదవండి మీరు కూడా!