September 23, 2011

రామలింగ రాజు అంతరంగం... కవిత్వంగా!



విజయానికి చుట్టాలెక్కువే గానీ అపజయానికి మాత్రం పాపం బంధు గణమే ఉండదుట! రామలింగ రాజు గారు ఎప్పటిలాగానే "రాజు గోరు"లా ఉండి ఉంటే ఈ సాదా సీదా పుస్తకానికి ఎంత హడావుడి జరిగి ఉండేదో?

ఆకాశమంత పందిరి,భూదేవంత అరుగు వేసి రతన్ టాటా లాంటి తెలుగేతరుడిని పిల్చి, హంగామా చేసి ఆవిష్కరించే వాళ్ళేమో! ఏ తొమ్మిదో టీవీనో దాన్ని 45 నిమిషాల ప్రోగ్రాములో ఊదరగొట్టేసేది.ఇంగ్లీషు,తెలుగు దినపత్రికలు కూడా ఈ పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తూ "గొప్ప" రివ్యూలు రాసేసి రాజుగార్ని సంతోష పెట్టేవాళ్ళు.

కానీ ఇవేమీ జరగలేదు, నెమ్మదిగా ఈ పుస్తకం ఎలాంటి హడావుడీ లేకుండా మార్కెట్లోకొచ్చింది. సత్యం రామలింగ రాజు తీరిక వేళల్లోనో,మనసులో ఆలోచనలు రేగిన వేళలోనో ఎప్పటికప్పుడు రాండమ్ గా రాసుకున్న కవితల్ని ఆయన భార్య నందిని పుస్తకంగా తెచ్చారు. ఇందులో ఏ కవితలు ఎప్పుడు రాసుకున్నారో వివరం లేదు. అందువల్ల ఈ కవితల్లో ఏవైనా ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ముందుగానే సూచించాయా అనే కుతూహలంతో చదవడం సహజమే కానీ గట్టిగా ఒక నిర్థారణకు వెంఠనే రావడం కష్టం!

మనసులో కవిత్వ భావనలుండి, భాష కూడా ఎంతో కొంత ఉంటే కవిత్వం కాస్త నాలాంటి కవితా సువాసనలు అర్థం కాని వాళ్ళక్కూడా అర్థమయ్యేలా బయటికి వస్తుందనుకుంటా!

రామలింగ రాజు గారికి భాష అంతగా సహకరించకపోవడంతో కవితా భావనలు అంత refined గా కాక raw గా కనిపిస్తాయి. అయితే ఆయన స్వతహాగా కవి కాదని అందరికీ తెలుసు కనుక ఆ భావాలు raw గా ఉండటమే బాగుంది. వాటిని refined గా తీర్చి దిద్దాలని ప్రయత్నించి ఉంటే ఆ ప్రయత్నం తేటతెల్లంగా కనపడిపోయేది!

కొన్ని కవితలు మరీ సాదా సీదాగా ఉండి, మరీ ఎప్పుడో ఎనభైల్లో సామాజిక స్పృహ పేరుతోనో,జీవితాన్ని నిర్వచించే అత్యుత్సాహంతో ఔత్సాహిక కవి కుమారులు రాసిన కవితలు గుర్తొచ్చేలా ఉన్నాయి.

టికెట్ లేని ప్రయాణీకుడు_____కవితలో జీవితం రైలు ప్రయాణంలా ఎంత రద్దీగా ఉంటుందో చెప్తూ

"ఏ క్షణాన్నైనా టికెట్ కలెక్టర్ రావొచ్చును,
ఆ వచ్చేదే నీ ఆఖరి స్టేషన్ కావొచ్చును"
అంటాడు రాజు! ఈ లైన్ల వెనుక ఏముందనేది వెంటనే ఊహించాలనిపిస్తుంది. ఇలాంటివే మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి.

"ఆటలో దెబ్బలను ఎలా తట్టుకోను?
అన్యాయపు ఆటగాళ్లను ఎలా వదుల్చుకోను (ఎన్ని ఆటలు నేను ఆడను?)

నిజం రూపాన్ని కొద్ది కొద్దిగా చెక్కాలి
నిర్థారించిన నిజాలు చిరకాలం నిలవాలి(సాక్ష్యాలే)

"వంచనలన్నీ మించిన వచన
నాకు నువ్వే చేసుకునే మహా వంచన
ఆత్మవంచన

ఇలాంటి కొన్ని లైన్లు ఆయన జీవితానికి అద్దంపడతాయేమో అన్నట్లు అక్కడా తోస్తాయి. (అయినా కాకపోయినా)

ఇందాక చెప్పినట్టు భాష మీద పట్టు లేకపోయినా కొన్ని భావాలు బాగున్నాయి,చాలా కామన్ గా అందరిలో మెదిలే ఆలోచన్లే అవి! అలాగే ఒక కవితా వస్తువంటూ ఎంచుకోకుండా, అప్పుడప్పుడూ మదిలో అప్పటికప్పుడు తోచిన ఆలోచన్లను రాసి పెట్టుకున్నారంతే! కొన్ని కవితలు ఎందుకు రాశారో నాకర్థం కాలేదు.

"ఓ కోడి పుంజా!"
"అలవాట్లు"
"అభాగిని" _____ఇలాంటివి!

దాదాపుగా ప్రతి కవితా రేడియో కవితల్లాగా మొదటి పాదం మళ్ళీ మళ్ళీ మధ్యలో రిపీట్ అవడం ఎందుకో అంతుపట్టలేదు నాకు!

ఇవన్నీ రాయడానికి ఆయన కు సమయం దొరకడమే గొప్ప విషయం!
మొన్నొకాయన నిర్వచించారు "అడ్డంగా రాసే పేరా గ్రాఫు ని నిలువుగా రాస్తే అదే కవిత్వం అవుతుంద"ట!

ఆ కోవ కవిత్వం ఈ మధ్య ఎక్కడ చూసినా గుర్రపుడెక్కలా విస్తరించి చుట్టేస్తోంది. పువ్వులూ,పిట్టలూ,ప్రేమా,మనసూ,జీవితం,నువ్వూ నేనూ,అంతరంగం,వెన్నెలా,వర్షమూ _______ఇవే వస్తువులు తిరగా మరగా వేసి అవే కవితలు!

వాటితో పోల్చుకుని చూస్తే రాజు కవితలు చాలా ఉత్తమస్థాయిలోనే ఉన్నాయి.

విశ్వం,సృష్టి,వైజ్ఞానిక ప్రగతి,సమాజ వైఖరిమీద నమ్మకమూ,విస్మయమూ,మనుషుల పట్ల సుహృద్భావం,ఇవన్నీ ఈ కవితల్లో చోటు చేసుకున్నాయి!

రామ్ గోపాల్ వర్మ "నా ఇష్టం" పుస్తకానికి ప్రచురణ సంస్థ ఎంత హడావుడి చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.

రాజు గారు కుప్ప కూలకుండా ఉండుంటే ఈ ఏడాది పుస్తకాల సంతలో కూడా ప్రత్యేకంగా ఒక స్టాలు పెట్టి మరీ అమ్మేవాళ్ళే ఈ పుస్తకాన్ని!

కవర్ పేజీ మీద రాజుగారే! ఎందుకో మనసు చివుక్కుమంది ఆ కవర్ పేజీ చూస్తే! రాజు మీద నాకున్న అభిమానమే తప్ప మరో దీనికి కారణమేదీ కనపడలేదు. (కారణం లేని హీరో వర్షిప్ అని విమర్శకులెవరన్నా వచ్చేస్తారేమో... రాకండి! నా అభిమానం నా ఇష్టం!)

ఎమెస్కో వాళ్ళు వేసిన ఈ పుస్తకం వెల 90 రూపాయలు!


September 3, 2011

"టామ్ సాయర్ ప్రపంచ యాత్ర"







నండూరి రామ మోహన రావు గారు నరావతారం, విశ్వ దర్శనం ల రచయిత గాకంటే నా మటుకు నాకు మార్క్ ట్వైన్ ని మా ఇంట్లోకి తెచ్చిన మనిషిగానే నాకు గుర్తుంటారు.(ఈ పుస్తకం ముందు మాటలో ఆయన కూడా ఇదే మాట చెప్పారనుకోండి) విశ్వ దర్శనం, నరావతారం,విశ్వరూపం ఇలాంటివి మా అన్నయ్య చదువుతుంటే నేను మాత్రం హకల్ బెరీ ఫిన్,టామ్ సాయర్, విచిత్ర వ్యక్తి, వగైరాలు లు చదివి అవన్నీ ఊహించుకుంటూ సంబరపడేదాన్ని! మార్క్ ట్వైన్ వాళ్ళ వూళ్ళో (నేను విదేశాలు ఏలుతున్నపుడు), ఆయన పుస్తకాల కలెక్షన్ అంతా కొని చదివినా నాకెందుకో నండూరి వారి అనువాదాలే బాగున్నాయనిపించింది. బాల్యంలో మొదటి సారి చదివిన అనుభూతి కావొచ్చు. ఈ మాట నేనెక్కడో అంటే పండితులెవరో "నీ మొహంలే ఊరుకుందూ! ఒరిజినల్లో లేని అందం వెధవది అనువాదంలో ఉంటుందంటే నేనొప్పుకోను"అని నా ఫీలింగ్ కి వారి అనుమతి లేదని తేల్చారు.:-)

స్కూలు రోజుల్లో నరావతారం నా హాట్ ఫేవరిట్ గా ఉండేది. అది రాసినాయన్ని కలుసుకోవాలని ఉండేది కానీ కలుసుకుని ఏం మాట్లాడాలో తెలీదు కాబట్టి ఆ ఆలోచన అప్పట్లో ముందుకు సాగలేదు.విశ్వదర్శనం కూడా ఎంతో నచ్చిన పుస్తకం. అంతటి గొప్ప రచయితను,పాత్రికేయుడిని ఒక్కసారైనా కలుస్కోలేకపోయాననే చింత ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుందిక! అందుకే ఎప్పుడు అనుకున్న పనులను అప్పుడు చేసేయాల్సిందే! తర్వాత తీరిగ్గా విచారించి లాభంలేదు.

అయన పాత్రికేయ జీవిత విశేషాలు ఇవాళో రేపో ఎవరో ఒకరు రాస్తారు. అవేమీ లేకుండా ఆయనంటే ఉన్న ఇష్టాన్ని,గౌరవాన్ని ఈ చిన్న పుస్తక పరిచయం ద్వారా వెల్లడించుకుందామని!


సరే,కథలోకొద్దాం!



నండూరి గారి అనువదించిన పుస్తకాల్లో చాలా కాలం ఏ పబ్లిషర్ చేతికీ దొరక్కండా ఉండిపోయిన ఒక గొప్ఫ పుస్తకం ఆ మధ్య హాసం బుక్స్ ఎంబీయెస్ ప్రసాద్ గారికి దొరికింది. అదే "టామ్ సాయర్ ప్రపంచ యాత్ర" ! Tom sawyer abroad అనే ట్వైన్ నవలకి ఇది తెలుగు రూపం!1955లో ఇది ఆంధ్ర పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిందట. ఆనాటి కటింగ్స్ ఒకచోట దొరికాయని ప్రసాద్ గారు నండూరి గారికి చెప్పగానే ఆయన "వృద్ధాప్యం వల్ల ఎగిరి గంతు వెయ్యలేకపోయానుగానీ మానసికంగా అంతపనీ చేశాను"అని ముందుమాటలో చెప్పారు.

ఈ పుస్తకాన్ని నేను హైద్రాబాదు పుస్తకాల సంతలో 2006 లో కొన్నాను. ఆ రోజు ఇంటికొచ్చేసరికి 11 అయింది. కానీ ఎదురుగా నండూరి గారి పుస్తకం ఊరిస్తుంటే ఎలా? అందుకే అప్పుడే కూచుని మొత్తం ఒంటిగంటకల్లా పూర్తి చేసి హాయిగా నిద్రపోయాను!

నానా సాహసాలూ చేసి,గుహలో దొంగలు దాచిన డబ్బంతా బాంకులో వేసుకుని నిస్సారంగా జీవితం గడుపుతున్న టామ్ సాయర్ కి ఎటువంటి అడ్వంచరూ లేని పాడు జీవితం మరింత బోరు కొట్టేస్తూ చప్పగా తోస్తూ ఉంటుంది. ఏదో ఒక సాహసం చేస్తే కానీ బతికేలా లేమని ఒకటి ప్లాన్ చేసి హక్ ఫిన్ కి చెప్తాడు.

దాని పేరు "క్రూసేడ్"! క్రూసేడంటే హక్ కి తెలీలా!

"ఏంటీ, క్రూసేడంటే తెలీదా?నిజమేనా వేళాకోళాలాడుతున్నావా హక్ ఫిన్?"

"నిజంగానే నాకు తెలీదు. అదేంటో తెలీకుండానే ఇన్నాళ్ళూ బతికాను.నా ఆరోగ్యం ఏమీ చెడిపోలేదు.పై పెచ్చు దిమ్మ చెక్కలాగా కూడా ఉన్నాను"ఇదీ హక్ వరస!

ఇది ఇలా కాసేపు సాగదీశాక నీగ్రో బానిస జిమ్, హక్ క్రూసేడ్ కి ఒప్పుకోకపోవడంతో ఇంకేదైనా ఆలోచించాలనుకుంటారు.

ఇంతలో ఆ వూరికి వేడి ఆవిరితో తయారు చేసిన బెలూన్ తో ఒక మతి లేని ప్రొఫెసర్ వస్తాడు.దాన్ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.వాళ్ళతో పాటే హక్,టామ్,జిమ్ కూడా వెళ్లారు. వీళ్ళు ముగ్గురూ ఆ బెలూన్ లోపలికి వెళ్ళి అదెలా పని చేస్తోందో పరిశీలిస్తుండగా అక్కడి జనం ప్రొఫెసర్ వాలకాన్ని గేలి చేస్తుండటంతో మన ప్రొఫెసర్ ఆ బెలూన్ని అకస్మాత్తుగా ఆకాశంలోకి తీసుకుపోతాడు కోపంతో!

ఇంకేముంది వీళ్ళు ముగ్గురూ, ప్రొఫెసరూ,బెలూన్లో!

ఆ ప్రొఫెసర్ కి చచ్చే కోపం! వీళ్ళని తన్ని తగలేసినంత పని చేస్తాడు. ఇంతలో తుఫాను. వాన,గాలి! ఆ గాలివానలో చీకట్లో ప్రొఫెసర్ వీళ్ళని తోయబోయి తనే తాగిన మైకంలో కిందకు దూకేస్తాడు. ఇహ అక్కడినుంచీ దాన్ని నడిపే బాధ్యత వీళ్ల ముగ్గురిమీదా పడుతుంది. టామ్ తెలివైన వాడు కాబట్టి అక్షాంశాలూ రేఖాంశాలూ చక్కగా అర్థం చేసుకుని వాటిప్రకారం,టైమ్ జోన్లూ వగైరాలు కూడా లెక్క గట్టి బాగానే నడిపిస్తాడు విమానాన్ని.....అదే బెలూన్ని!

ఒకరాత్రి ముగ్గురూ పడి మొద్దుల్లా నిద్రపోయాక తెల్లారి చూస్తే లండన్ బదులుగా ఆఫ్రికా____ అదీ సహారా ఎడారి చేరుకుంటారు. అది సహారా అని తెలీక బెలూన్ దింపుతారు. ఎండమావులు కనపడితే నీళ్ళనుకుని పరిగెడతారు. నీళ్ళు నిజంగానే కనపడితే ఎండమావి అనుకుని వదిలేయబోతారు. ఇసుక తుఫానులో చిక్కుకుని చచ్చిపోయిన ఒక బృందాన్ని చూసి జడుసుకుంటారు గానీ వాళ్ళ దగ్గర దొరికిన బంగారు పెట్టె మాత్రం తీసుకుంటారు. ఇంతలో ఎవరో పరిగెత్తుకు వస్తుంటే______- కంపెనీ దొరికిందని ఎదురు పరిగెత్తి దగ్గరయ్యాక చూస్తే_________ఆ పరుగెత్తుకొచ్చింది సింహాలు!

ఇంకేముంది..మళ్ళీ వెనక్కి!

ఎదురుగా వస్తోంది సింహమని తెల్సి కాళ్ళు కదలమని మొరాయిస్తాయి, కానీ పరిగెత్తక తప్పదు. ఎలాగో ఉత్కంఠ మధ్య ఎలాగో బెలూన్లోకి చేరతారు మళ్ళీ! అసలు వీళ్ళు ఈ ఎడారిలో చేసే గోల అంతా ఇంతా కాదు! అక్కడి ఇసుక అంతా బుల్లి బుల్లి సీసాల్లో పాక్ చేసి సీసాకింత చొప్పున అని అమ్మితే అమెరికాలో ఎంత డబ్బొస్తుందో అంచనా వేస్తారు.(ఈ క్రేజీ అయిడియాలన్నీ టామ్‌వేనని వేరే చెప్పాలా?) ఇసుక తుఫాను వచ్చి బెలూన్ని ముంచెత్తుతుంది.

ఎలాగో అక్కడినుంచి బయలు దేరి కొంత దూరం ప్రయణించాక స్ఫింక్స్ విగ్రహాన్ని చూసి దెయ్యమో రాక్షసో అనుకుని జడుసుకుంటారు. అది విగ్రహమేనని తెలుసుకుని స్థిమిత పడి పిరమిడ్స్ చూడ్డానికి వెళ్తారు.ఇంతలో ఒక గొప్ప ప్రమాదం వచ్చిపడుతుంది.

ఏమీ లేదు, టామ్‌దగ్గరున్న పొగాకు పైపు విరిగిపోతుంది. జిమ్‌నీ,హక్ నీ వెళ్ళి అమెరికాలో సెంట్ పీటర్స్ బర్గ్ లోని తమ వంటింట్లో గట్టుమీద ఉన్న మరో పైపు తెమ్మని ఆజ్ఞాపిస్తాడు టామ్!

పైగా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా దారి కనుక్కోడం ఎలాగో కూడా చెప్తాడు. ఇక్కడి నుంచీ అరపేజీలో కథ ముగుస్తుంది. కానీ అది చాలా సహజంగా అనిపిస్తుంది కూడా!

జిమ్,హక్ ఇద్దరూ వెళ్ళి ఆ పైపు తీసుకుంటుండగా పోలీ పెద్దమ్మ చూసి (అప్పుడేం జరిగి ఉంటుందో ఆవిడ గురించి తెల్సిన వాళ్ళకు చెప్పక్కర్లేదుగా !) టామ్ గాడు ఎక్కడున్నా సరే,జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రమ్మని చెప్పి వీళ్ళిద్దరినీ గెంటేస్తుంది. ఈ బెలూనూ,పైలట్ పనీ వీటన్నిటికీ ఆవిడ పూచిక పుల్ల కూడా విలువ ఇవ్వదు. అసలు పట్టించుకోదు.

ఇంకేముంది?మర్నాడూ జిమ్,హక్ విమానంలో తిరిగి రాగానే చేసేది లేక టామ్ వాళ్ళతో కల్సి తిరుగు ముఖం పట్టడంతో కథ కంచికి!

మార్క్ ట్వైన్ హాస్యం ఎంత పదునుగా సునిశితంగా ఉంటుందో తెల్సిందే! దాన్ని అలాగే తెలుగులోకి యథాతథంగా దించి,హాయైన నవ్వుని పాఠకుల మొహాల మీదకు తెప్పించడం చేయి తిరిగిన అనువాదకులకు కూడా కత్తి మీద సామే!

జిమ్ "టామ్ గారూ, హక్ గారూ"అంటూ అమాయకంగా వేసుకునే మొండివాదనలను ఒరిజినల్ లో చదివి ఎంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటామో తెలుగు అనువాదంలో కూడా అంతే అలరిస్తాయి. ఒకటీ అంటూ చెప్పలేం! అవి ఇలా చెప్పడం కాదు,చదివి ఆ హాస్యాన్ని అనుభవిస్తే గానీ అందులోని ఆనందం అర్థం కాదు!

రామ మోహన్ రావు గారు Call Of the Wild అనే నవలను కూడా తెలుగులోని అనువదించారని చదివాను గానీ అది ఎక్కడా లభ్యం కావడం లేదు.

హాసం ప్రచురణలు వేసిన ఈ అపురూపమైన పుస్తకం వెల కేవలం......కేవలం ముప్ఫై ఐదు రూపాయలు! నేనూ మా పాపా కల్సి ఈ పుస్తకం చదువుకోవడాన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తాం!

తప్పక చదవండి!

September 2, 2011

పండగ దండగలు !

మా ఇంటి గణపతి___పూజకు ముందు!

హమ్మయ్య! అయిపోయింది పండగ! జరిపేసుకున్నాం! పత్రీ,పువ్వులూ,వినాయకుడి బొమ్మా,మావిడాకులూ,అన్నీ కొని పండగ చేశాం! మళ్ళీ వచ్చే ఏడాదే ఇహ!

ఎప్పుడూ లేనిది మొదటి సారి మా ఇంట్లో మట్టి వినాయకుడిని కాక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడిని పెట్టాము పూజలో! ఏం చెయ్యమంటారు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు "మట్టి వినాయకుడినే పూజిద్దాం , పూజించాల్సిందే..పూజించకపోయారో...."అని రక రకాల FM రేడియోల వాళ్ళూ, తొమ్మిదో టీవీ వాళ్ళూ, వీళ్ళంతా వారం నుంచీ ఊదరగొట్టేస్తుండటంతో, పోయినేడాది వరకూ దీనంగా మొహం పెట్టుకుని ఒక మూల ఉండే మట్టి విగ్రహాలు ఈ ఏడాది బోల్డంత గర్వం వచ్చేసి ఠీవీగా ముందు వరసలో నిలబడ్డాయి. కానీ కదిలిస్తే మాత్రం షాక్ కొట్టే ధరలు!

ప్రజల పల్స్,బలహీనతలు ఈ అమ్మేవాళ్ళు భలే పట్టుకుంటారు! మట్టి విగ్రహాలనే పూజించాలని అందరం కట్ట కట్టుకుని నిర్ణయించుకునే సరికి జానెడు బొమ్మ నూటయాభై రూపాయలూ,బెత్తెడు బొమ్మ వంద రూపాయలూ!అచ్చంగా మట్టి విగ్రహాలే! రూపాయి కూడా డిస్కౌంట్ లేదు!జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ వంటి చోట్ల ఇంకో యాభై కలుపుకోండి! అందుకే కోపమొచ్చి (ఎవరి మీదో నాకూ తెలీదు) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ కొనేశాను !


ప్లాస్టిక్ కవర్లు తీసేశారమ్మా అంటూ , జూట్ తో చేసిన పల్చటి కవర్లు ప్రతి చోటా అయిదేసి రూపాయలకు అమ్మడం మొదలైంది. ఆర్గానిక్ కూరలు మంచివి అనగానే వాళ్ళెవరో సూపర్ మార్కెట్ వాళ్ళు కిలో వంకాయలు అరవై రూపాయలకు అమ్ముతారు. అలోవెరా జూస్ మంచిదని మంతెన గారు చెప్తే ఇంకెవరో అలోవెరా జుస్ చిన్న డబ్బా అయిదొందలంటాడు.


పత్రి కూడా అంతే!అందులో ఒక్కటీ వ్రతకల్పం పుస్తకంలో చెప్పిన రకం లేదు. పార్కుల్లోవో ఎక్కడివో మరి అన్నీ క్రోటన్ మొక్కల ఆకులే! మచ్చలవీ, చారలవీ, గీతలవీను!వంద రూపాయలకు నాలుగు రకాలు కలిపి ఒక టేకు ఆకులో చుట్టి (పాపం, ప్లాస్టిక్ నిషేధం కదా మరి) పెట్టి ఇవ్వడం! ఒక్క తామర పువ్వు నలభై రూపాయలు! "అమ్మో" అని తెల్లబోతే.."ఇవాళొక్కరోజే కదమ్మా" అనడం!

ఇంటికొచ్చాక మా ఇంటి తోటలో వెదికితే మారేడు,నేరేడు,మరువం,మాచీ పత్రం లతో సహా అన్ని రకాల పత్రీ ఇక్కడే దొరికింది! :-)) (మారేడు చెట్టు మా ఇంట్లో ఉందని ఇప్పుడే చూశా అసలు)

అసలు పండగలన్నీ ముఖ్యంగా సిటీల్లో ఎవరో వెనకనుంచి తోసినట్టు, లేదా అర్జెంట్ టెలిగ్రామేదో వచ్చినట్టు ఆదరా బాదరా శాస్త్రార్థం జరుపుకోడం అలవాటైపోయింది. నాలుగైదు రకాల వంటలతో ఆలస్యంగా భోజనాలు చేసి సాయంత్రం వేళ సెలవు రోజు తాలూకు విశ్రాంతిని హాయిగా ఆఘ్రాణిస్తూ గడపటం మర్చిపోయాం! "ఉన్నది ముగ్గురమేగా, ఏం తింటాం లెద్దూ" అని ఏవో రెండు రకాలతో కానిచ్చేయడం,వందలూ వేలూ పెట్టి మావిడాకులూ అవీ తెచ్చి కాసేపు ఆర్భాటం చెయ్యడం! సాయంత్రానికి తిరిగి చూస్తే దండగ ఖర్చూ, నిరుత్సాహం, రేపటి ఆఫీసూ, ఇస్త్రీ చేయాల్సిన యూనిఫాములూ...!

"ఇవాళ పండగ" అని ఉత్సాహంతో నిద్ర లేవడానికి బదులు "అమ్మో, ఇవాళ పండగ కదూ" అని గాభరాతో లేవడం!

ఆఖరి పోరాటం నవల్లో ప్రవల్లికతో విహారి ఒక సందర్భంలో "మీకేమండీ, సి బి ఐ ఆఫీసరు" అంటే ఆవిడంటుంది_____ "ఏమి సి బి ఐ లెండి! చూసేవాళ్ళకే ఈ గొప్ప! నాకైతే ఏదో ఒక మారుమూల పల్లెటూర్లో నాలుగు మేకలూ కోళ్ళూ పెంచుకుంటూ ప్రశాంతంగా బతికేయాలని ఉంది"

ఈ సిటీ హడావుడిలో, సంస్కృతి పేరు చెప్పుకుంటూ చప్పటి పండగల్ని నిస్సారంగా జరుపుకుంటున్నపుడు నేనూ ఇదే అనుకుంటాను. హాయిగా ఏ దోసకాయల పల్లో,రావిపాడో,దాచేపల్లో,ఉప్పులోరో,ఆకివీడో పోయి ప్రశాంతంగా పత్రి అంతా కొనకుండా చుట్టు పక్కల కోసుకొచ్చి పండగ మజా పిల్లలతో కల్సి ఆస్వాదించాలని! ఎప్పటికి కుదుర్తుందో!