ఉజ్జోగాలు,బాంక్ అకౌంట్లు,డబ్బులు,క్రెడిట్ కార్డులు, స్కూలు అడ్మిషన్లు,వీటన్నింటి మధ్యా ఇరుక్కుపోయిన జీవితాల్లో అపుడప్పుడు కాసేపు మనిషిలా మానవీయ కోణంలో.... కరువవుతున్న మమతల గురించో,చేరువవుతోన్న ప్రపంచీకరణ గురించో,బంధుత్వాలు, వాటి బాధల గురించో మొత్తం మీద సాటి మనిషి గురించి స్వేచ్ఛగా ఆలోచిస్తూ గమ్యం సినిమాలో గాలి శీనులా కాసేపు బతికేస్తే....? మనసు తేలికవదూ?
రోజులో కనీసం ఒక్కసారైనా సమాజపు అడ్డుగోడలు దాటి మనిషిగా ఆలోచిస్తున్నామా మనం? అసలు అంత సమయం ఉందా మనకి? ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? ఎక్కడికి చేరతాం?
మనిషిగా ఆలోచిస్తూ మజాగా బతికే క్షణాల గురించి జాజి మల్లి బ్లాగర్ మల్లీశ్వరి గారు విడుదల చేసిందే ఈ "జాజిమల్లి" బ్లాగ్ కథలు! ఇవన్నీ జాజి మల్లి బ్లాగులో వచ్చినవే!
నిజాయితీగా చెప్తున్నా___________వీటిలో సగం నేను చదవనే లేదు బ్లాగ్ లో!:-))
పుస్తకం చేతికొచ్చాక చదవడమే!
మీలో చాలామంది చదివే ఉండొచ్చు వీటన్నింటినీ! ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే అంశాలెన్నో ఈ కథల్లో కనిపించి కదిలించి కలవర పెడతాయి.
జాబిలి లోని చల్లదనం, జిలేబీలోని తీయదనమూ కల్సి అవతరించిన పాతూరింట్లో నాల్గో ఆడపిల్ల..... ప్రేమతో, రాసేటపుడు పెదవుల మీదకు తోసుకొస్తున్న చిరునవ్వు సాక్షిగా తవ్వి తీసిన జ్ఞాపకాల నిధి ఈ కథా సమాహారం!
తీయని బాల్యస్మృతుల్ని పంచుతూనే చివర్లో సడన్ గా ఇచ్చే కొసమెరుపు ముగింపు ప్రతి కథలోనూ గుండె ఝల్లుమనిపిస్తుంది. ఒక్క క్షణం మూగబోయేలా చేసి, కఠొర వాస్తవాన్ని కళ్ళ ముందు నిల్పిపరుచుకున్న చిరునవ్వుని పక్కకు జరిపి నిట్టూర్పుకు దారినిస్తుంది.
నలుగురు ఆడపిల్లలున్న ఇంట్లో పుట్టిన ఆఖరమ్మాయిగా ఎన్నో జ్ఞాపకాలను మల్లి కలబోసుకుంటారు. అప్పటి జీవితాన్ని, అనేక కోణాల్లో విశ్లేషిస్తూ ఇప్పటి రోజులతో బేరీజు వేసి మనతో అవుననిపిస్తారు. అలాంటిదే ఈ "మా ఇంట్లో వాడుక పాలు పోసేది చంద్రబాబు నాయుడు" కథ ! మల్లి తన బాల్యం లోని అందమైన ఉదయంతో ఈ కథను ప్రారంభించి చివరికి నివ్వెరబోయేలా ముగిస్తారు.
మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు ఎందుకు లేస్తాయో అంటూ ఇందులో కొన్ని కథలు ప్రస్తావిస్తాయి.
అవి లేకుంటే ఎంత బాగుండు?
ఒక చిన్న స్నేహ స్పర్శ, ఒక చిన్న చిరునవ్వు, ఒక ప్రేమ పూర్వక పలకరింపు, ఇవన్నీ కోల్పోయి, లోపించి మనం రాను రాను మర మనుషుల్లా తయారైపోతున్నామని కొన్ని కథలు సున్నితంగా వాత పెడుతూ చెప్పేస్తాయి.
బేగం ఎంత సొగసు కత్తె
నేను కొల్లగొట్టిన హృదయాలు
రిక్షా రంగదాసు-చాకలి దాలమ్మ
చిటికీసర చెట్టుకు కాసిన తియ్య మావిడి పండు __ఈ కథలు అవే చెప్తాయి!
దాదపు ప్రతి కథా మన హృదయంలోకి తొంగి చూసుకుని ఒక్కొసారి భుజం తట్టుకునేలా,... మరో సారి వీపు చరుచుకునేలా చేస్తుంది. మరి కొన్ని కథలు పుస్తకాన్ని పక్కకు పెట్టి హాయిగా కుర్చీలో వెనక్కు వాలి బాల్యపు రోజుల్లోకి ప్రయాణించడానికి బండిని సిద్ధం చేస్తాయి.
మనిషిని కావిలించుకునే ఉత్తరం(దీన్ని నేను అప్పట్లో బజ్ లో కూడా షేర్ చేసుకున్నాను)
నాన్న చేతి కొత్తావకాయ ముద్ద
ఎన్ టీ ఆర్ కొడుకు పుణ్యమా అని
పొలం అమ్ముకోడమంటే
ప్రైవేట్ స్పేస్,
అక్కా చెల్లెళ్ళ ఆస్తిపంపకాలు
పారిపోయిన తొలి యవ్వనం..
ఇవన్నీ అలా బండెక్కించేవే!
ఒక అందమైన కుటుంబాన్ని ఆవిష్కరిస్తూనే, మల్లి తనకెదురైన స్త్రీల జీవితాలని అన్నికోణాలనుంచీ విశ్లేషిస్తారు.
"ఇపుడు స్త్రీలు సాల్మన్ చేపలు కారు"
"మా అమ్మ అనూరాధ ఎప్పుడైందంటే"
"అమ్మ నేర్పిన ఆర్థిక సూత్రం.." ఇంకా మరి కొన్ని!
ఈ పుస్తకానికి కె.శ్రీనివాస్ గారు రాసిన ముందు మాట ఎంతో అద్భుతంగా అమరిపోయింది కానీ, పాఠకులకు నా సలహా...పుస్తకమంతా పూర్తయ్యాక ఆ ముందు మాట చదివితే కథల తాలూకు ఎస్సెన్స్ అప్పటికీ మనసంతా ఆవరించి ఉండటం వల్ల మరింతగా దాన్ని ఆస్వాదించగలం!
నిజానికి ప్రతి మనిషీ, బాల్యాన్ని రికార్డు చేసుకుంటూ ఉండాల్సిందే! బాల్యపు జ్ఞాపకాలు పూర్తిగా మాసిపోకముందే, వాటిని చేతనైనట్టు చిత్రించుకుని ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్తరువుల్ని అప్పుడప్పుడూ తీసి చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కొన్నాళ్ళకి ఏమీ మిగలవు.
చక్కని బ్లాగ్ పోస్టులు రాశామని అనుకున్న వారికి జాజిమల్లి గారి ప్రయత్నం అనుసరణీయం కావాలి!
ఇది టైమ్ పాస్ కి చదివే పుస్తకం మాత్రం కాదు! చదవడం పూర్తయ్యాక..ఒక వెచ్చని అనుభూతిని మనసు నిండా నింపి, ఒక చల్లని వణుకుని వెన్నులో పాకించి, ఒక భయాన్నీ, ఆలోచన్నీ,కన్ సర్న్ నీ రేకెత్తించేది టైమ్ పాస్ పుస్తకం ఎలా అవుతుంది?
చక్కని డిజైన్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకాన్ని వేసింది perspectives వాళ్ళు!
వెల 80 రూపాయలు!
19 comments:
మీరు భలే మనిషండీ...ఏ కొత్త పుస్తకం వచ్చినా ఠక్కున కొనేసి చదివేస్తారు....మిమ్మల్ని చూస్తె ఒక్కోసారి కుళ్ళుగాను, ఒక్కోసారి గర్వంగానూ ఉంటుంది. :)
జాజిమల్లి బ్లాగుకి నేను పెద్ద పంఖాని...ఆవిడ బ్లాగు పుస్తక రూపంలో రాబోతోందని తెలిసి గొప్ప ఆనందించాను...ఇక కొని చదవాలి. చాలా పోస్టులు ఆవిడ బ్లాగులోనే చదివాను. ప్రతీ పోస్ట్ పూర్తయ్యేసరికి మనసు తడి అయిపోతుంది..అదే ఆవిడ ప్రత్యేకత!
రిక్షా రంగదాసు-చాకలి దాలమ్మ, పారిపోయిన తొలి యవ్వనం..భలే ఉంటాయి అన్నీ. వాళ్ళ నాన్నగారి ముచ్చట్లు, సరదా తగవులు, అభిప్రాయ భేదాలు....అన్నిట్లోనూ ఒక మానవీయ కోణం ఉంటుంది.
మీరు రాసిన విధానం చాలా బావుంది...ఆవిడ రచనల్లోని ఆత్మని స్పృశించినట్టుంది.
సుజాత గారు.. మల్లీశ్వరి గారి బ్లాగ్లో ఈ కథలు అన్నీ చదివాను. చదివిన ప్రతి సారి ఏదో ఒక క్రొత్త ఆలోచన రేకెత్తించే విధం,ఆ శైలి..ఎంతో..బాగుంటాయి. మీరు చెపుతుంటే.. మరీ చదవాలనిపిస్తుంది. ..అలాగే మీకొక మాట చెప్పాను. గుడిలో పులిహోర ..రెసిపీ.. బాగా ఆలస్యం చేసాను.అనారోగ్యం వల్ల. త్వరలో చేసి చూపించి వ్రాస్తాను.
తప్పకుండా చదువుతాను!
ఈ బ్లాగు పేరే తెలీదు నాకు! అంటే అసలు బ్లాగులు చదవడం లేదని అర్థమన్నమాట. మీ సమీక్ష చదువుతుంటేనే పుస్తకం మీద, రచయిత్రి మీద గొప్ప గౌరవం కలుగుతోంది. తప్పక చదవాలి.
నాకు ఇష్టమయిన అతికొన్ని బ్లాగుల్లో జాజిమల్లి ఒకటి. దాదాపు అన్ని పోస్టులూ చదివాను. చాలా అందంగా పరిచయం చేసారు సుజాతా. తన పోస్టుల గురించి మీరు చెప్పిన ప్రతీ వాక్యం నిజం, నాకు అది అనుభవం కూడా చదివినప్పుడల్లా.
nice introduction of the book. How come you didn't provide the blog URL/link ?
@ Sravi, ఈ సమీక్ష ఎక్కువగా బ్లాగర్లే చదువుతారనీ, వాళ్ళకు జాజిమల్లి గారి బ్లాగు తెలుసు కదానీ లింకు ఇవ్వలేదు! ప్చ్, కాదులెండి, కవర్ చేయలని ప్రయత్నించాను కానీ...కుదర్లేదు. పోస్టు రాసేప్పుడు నాకు తట్టలేదు, బ్లాగ్ లింక్ ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు అప్డేట్ చేశాను.
కానీ ఇప్పుడు ఆ బ్లాగులో ఈ కథలు లేవు. తీసేశారు.మిగతా పోస్టులు చదవొచ్చు.
సౌమ్య, అవును!
ఈ బ్లాగ్ పోస్టులు చదివేటపుడే ఇవి స్కెచ్ ల లాగా భలే ఉన్నాయనిపించింది. పుస్తకంగా వేయడం గొప్ప అయిడియా!
వనజగారూ, అవును! ఒక్క కథ కూడా మనల్ని ఆలోచించకుండా వదిలిపెట్టదు.
మీ రెసిపీ కోసం చూశాను నిజంగానే! కానీ...పర్లేదు. ఆరోగ్యం బాగయ్యాకే రాయండి. ఎదురు చూస్తాను.
రసజ్ఞ గారు,
చదివి, మీకేమనిపించిందో రాయాలి. మీ బ్లాగులో పోస్టు గా రాస్తే మరీ బాగుంటుంది.
వేణు గారూ,
సెలవు చీటీ చదివి తేలు కుట్టిన దొంగలా ఫీలయ్యాను నేను. అర్జెంటు గా భుజాలు తడిమేసుకున్న వారు చాలా మంది ఉంటారేమో కదా ఆ కథ చదివి!
నీలాంచల,
నిజమే! మీరసలు నా బ్లాగుల్లో ఎక్కడా కనిపించలేదు. అసలే తక్కువగా కనిపిస్తారనుకోండి.:-))
పద్మ గారూ,
అదే నా ఫీలింగ్ కూడా! ఇందులో దాదాపుగా ప్రతి పోస్టూ మన కు అనుభవమే! ఆ క్షణంలో ఆలోచించి వదిలేస్తాం. కానీ మల్లి తను ఎప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ..మరో సారి మనల్ని కూడా ఆ వైపు లాక్కెళ్ళడం ఎంత బాగుందో కదా! నాకైతే చాలా హాయిగా అనిపించింది ఈ పుస్తకం చదివితే! గొప్ప రిలీఫ్ వచ్చింది.
sujatha garu,
jajimalli blog gurinchi first vinadam mee nunche..
mee appreciation win ayyaarante..definte gaa..baaga vundi vundaali..
em chestaam..mem kooda koni chaduvuthaam..
mee post ni nammi kontaa..
next..nacchinaa..nacchaka poyinaa..ikkade review pedathaam..
mimmalni first blame cheyyaaligaa..
BTW ..happy pongal madam..meeku ..mee family ki ..mee blog readers ki
ఈ బ్లాగు పోస్టులు ఇప్పుడు మీకు ఆ బ్లాగులో దొరకవు. పుస్తకం కొనాల్సిందే! కొని, చదివాక, నన్ను బ్లేమ్ చేసే అవకాశం లేదని మీరే గ్రహిస్తారు. ఈ పుస్తకం మీకు నచ్చి తీరుతుంది చూడండి!
నాకు మంచి పుస్తకాలే నచ్చుతాయని నా విశ్వాసం! ఆ లెక్కన ఈ పుస్తకం మీకు కూడా నచ్చాలి మరి!
నచ్చక పోయినా పర్లేదు. నాకు నచ్చినవి అందరికీ నచ్చాలని లేదు కదా! చదివాక తప్పక ఇక్కడ మీ అభిప్రాయం రాయండి
Happy Sankranti to you too!
హ్మ్..నేను కూడా చదవాలి.. :)
Nice.
wow !!! thank you so much for replying !! I added this book to the books list that i have to buy next time when i visit :-)
btw sujata garu, i get to know of lot of other blogs from your blog only :-)
సుజాతగారూ,
కథలో కవిత్వమో రాసి ఒకసారి ప్రచురణ లోకి వెళ్ళాక ఇక అది మనది కాదు అని నేనూ నమ్ముతాను.దాని నుంచి వచ్చే ప్రశంసలనో విమర్శలనో ఆబ్జెక్టివ్ గా చూడడం రచయితలకి ఉండాల్సిన మంచి గుణమనీ నమ్ముతాను.అయినా నిసర్గమైన సాహిత్యాభిమానం వున్న వ్యక్తుల నుంచి వచ్చిన ప్రశంసలు మనసుని లేగదూడలా గంతులేయించక మానవు. మల్లి పూయించిన జాజులు చదివాక నాకట్లా అన్పించింది.అట్లా అనిపించేలా చేసిన తప్పు మీ సమీక్షదే తప్ప నాది కాదు.
ధన్యవాదాలు.
మల్లీశ్వరి.
శంకర్ గారూ, మిమ్మల్ని నా బ్లాగులో చూసి చాలా రోజులైంది. తప్పక చదవండి. మార్కెట్లో ఇప్పుడు లభ్యం!
థాంక్యూ!
కొత్తపాళీ గారూ,
థాంక్యూ!
మల్లీశ్వరి గారూ :-)))
మల్లెల గుబాళింపు ఎల్లప్పుడూ కొత్తగా పరిమిలిస్తుంది.అది మా జాజిమల్లిగారి కథలలోని ప్రత్యేకత...పుస్తకం ఉందగా మేడం గారు ఇచ్చింది..పీజీ మొదట్లోనే చదివేశాం అన్నమాట...😁😂🤣
Post a Comment